నేను

నాకు నచ్చినట్టుగా, నాకిష్టమైనట్టుగా ఉండాలనుకుంటాను. ఈ ఉండాలనుకుంటున్నాను అనేది, అన్ని విషయాలల్లో, జీవితానికి కూడా అన్వయించుకోవచ్చు. నేనే కాదు, ప్రతి ఒక్కరూ, ఈ ప్రపంచంలో, ఇలాగే, నాలాగే ఉండాలనీ, ఆలోచించాలనీ, చరించాలనీ అనుకుంటాను. ఎందుకంటే, నాలాగా నేనున్నప్పుడు, నాకే బాధలు లేవు కనుక, ఎవరి లాగా వారుంటే, వారికి కూడా ఎల్లప్పుడూ హ్యాపిసే కదా అన్నది నా చిన్న బుర్రకి తట్టిన చిన్న ఉపాయం. మీరు కూడా అచ్చంగా ఇలాగే ఉండాలని నేననుకునేవాణ్ని. అంటే, నాలాగా కాదు..మీలాగా. 

అదేంటి, నేను నా లాగానే ఉన్నాను కదా, వేరే ఎవరి లాగో లేను కదా, అయినా, నేనెలా ఉన్నానో మీకెలా తెలుస్తుంది? నేను నా లాగానే ఉన్నాను అని మీరు అనవచ్చు. కాని, నిజం..మీ అంతరాత్మకి తెలుసు, నాకు తెలుసు. నాకెలా తెలుసంటే, నేను మనుషులనీ, మనసులనీ చదివేస్తాను, ఎవరికీ తెలీకుండానే, అనుమతి లేకుండానే వారి వారి హృదయాల్లో చొరబడి. 

ఈ..నాలాగా ఉండటం అంటే ఏమిటి అసలు? దీనికంత ప్రాధాన్యమెందుకు, ఏదో మన బతుకేదో మనం బతికేయక ఉన్నన్నాళ్ళూ అని కూడా ఒక ప్రశ్న ఉదయించవచ్చు. ఆ ప్రశ్న లోనే సమాధానం దొరుకుతుంది, సావధానంగా ఆలకిస్తే, తీరిగ్గా ఆలోచిస్తే. 

నేను చెప్పే ప్రతీ మాటా, ఒక లాజిక్కూ గా అనిపించవచ్చు. కానీ, నిజాలన్నీ లాజిక్కు లు గా, లాజిక్కులన్నీ నిజాలుగా చలామణి అవుతున్నాయి ఈ ప్రపంచంలో నేడు. అందుకే, నిజం నిష్టూరంగా, నిర్దయగా అనిపిస్తుంది. అనిపిస్తుంది మాత్రమే, ఆలోచిస్తే, ఏ మాత్రం కాదు.