అల్లా .. శ్రీరామా ..
శుభకరుడు..సురుచిరుడు..భవహరుడు..భగవంతుడెవడూ..
కళ్యాణగుణగణుడు..కరుణా ఘనాఘనుడు ఎవడూ..
అల్లా తత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడూ..
ఆనందనందనుడు..అమౄతరసచందనుడు..రామచంద్రుడు కాక ఇంకెవ్వడూ !

తాగరా శ్రీరామనామామౄతం .. ఆ నామమే దాటించు భవసాగరం !
తాగరా శ్రీరామనామామౄతం .. ఆ నామమే దాటించు భవసాగరం !!

ఏ మూర్తి మూడు మూర్తులుగ వెలసిన మూర్తి
ఏ మూర్తి ముజ్జెగంబుల మూలమౌ మూర్తి
ఏ మూర్తి శక్తి చైతన్య మూర్తీ..
ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్యస్ఫూర్తి
ఏ మూర్తి నిర్వాణ నిజధర్మ సమవర్తి
ఏ మూర్తి జగదేక చక్రవర్తీ..
ఏ మూర్తి ఘనమూర్తి
ఏ మూర్తి గుణకీర్తి
ఏ మూర్తి అడగించు జన్మజన్మల ఆర్తి
ఆ మూర్తి ఏమూర్తియును గాని రసమూర్తి
ఆ మూర్తి శ్రీరామచంద్రమూర్తీ !

తాగరా .. తాగరా శ్రీరామనామామౄతం .. ఆ నామమే దాటించు భవసాగరం !

ఏ వేల్పు ఎల్ల వేల్పులని గొల్చెడి వేల్పు
ఏ వేల్పు ఏడేడు లోకాలకే వేల్పు
ఏ వేల్పు నిట్టూర్పు ఇలని నిల్పూ..
ఏ వేల్పు నిఖిల కళ్యాణముల కలగల్పు
ఏ వేల్పు నిగమ నిగమాలన్నిటిని తెల్పు
ఏ వేల్పు నింగినేలలను కల్పూ..
ఏ వేల్పు ద్యుతిగొల్పు
ఏ వేల్పు మరుగొల్పు
ఏ వేల్పు దేమల్పు లేని గెలుపూ..
ఏ వేల్పు సీతమ్మ వలపు తలపుల నేర్పు
ఆ వేల్పు దాసాను దాసుల కైమోడ్పూ !

తాగరా .. తాగరా శ్రీరామనామామౄతం .. ఆ నామమే దాటించు భవసాగరం !