మొదటి భాగం
పొద్దున్నుంచీ అన్నం ఏమీ తినకపోవడం వలననూ, నాలుగ్గంటల ప్రయాణ బడలిక వలన్నూ, ముంచుకొసున్న నిద్రను, అలసటతనూ పక్కనబెట్టి..గబ గబా నాలుగు మెతుకులు తిందామని ..తినబోతుంటే....పొరవచ్చింది...గ్లాసు లోని నీళ్లను గట గటా తాగేసి..వెంటనే..మంచంపై నడుం వాల్చాను..ఎంత కాదనుకున్నా, దుఃఖం ఉబికివస్తున్నది. ఎంత పని జరిగింది..అన్నన్నా..నా పెంపకం ఇంత అజాగ్రత్తగా, అసమర్దంగా తయారయ్యిందా అని ఒకటే బాధ. అయినా, స్వేచ్ఛనివ్వటమూ, తమ తమ భావాలకు అనుగుణంగా పిల్లలను పెంచడం, వారి జీవితాలకు వారినే మార్గదర్శులుగా చేయలనుకోవడం తప్పా..నాలోని ఈ ప్రశ్నల పరంపర అలా కొనసాగుతూనే ఉంది.
సరిగ్గా 27 సంవత్సరాల క్రితం..తల్లిదండ్రులని ఎదిరించి, అందరిలాగే ఎన్నో ఆశలతో, మరెన్నో ఊసులతో మా జీవితాన్ని ప్రారంభించాము. ఎన్నో అవమానాలు, నిష్టూరాలు సర్వసాధారణం. తన గురించి చెప్పాలంటే...నాకు తెలిసిందలా..స్వేచ్ఛ, స్వేచ్ఛా, స్వేచ్ఛా..నేను దేనికీ రాజీ పడను, ఎవరి ఆనందం కొరకో నేను నా పనుల్ని, నా అభిప్రాయాల్నీ, నా పద్దతులనీ మార్చుకోనని భీష్మించుకుని కూచున్న రోజులవి..
జీవితంలో కొన్ని కొన్ని సంఘటనలు ఎందుకు జరుగుతాయో, ఎలా జరుగుతాయో చెప్పడం చాలా కష్టం, అంతే కాదు, వాటిని విశ్లేషించటం ఇంకా కష్టమైన పని. సరిగ్గా అలాంటి సంఘటనే నా జీవితంలో అప్పుడు ఎదురైంది. కనీసం ముఖమెత్తి చూడ్డానికి కూడా ఇష్టపడని నేను, మొదటి సారిగా..నా అభిప్రాయాలని నేరుగా ఒక అమ్మాయితో మాట్లాడ్డం, ఆ అమ్మాయేమో, నా కోసమే పుట్టినట్టు, నా కోసమే అప్పటివరకూ ఎదురుచూస్తున్నట్టూ, ఏదో చందమామ కథలలో చెప్పినట్టుగా, నన్నల్లుకుపోవడం...సంస్కృతీ, సంప్రదాయాల పేరు చెప్పి మా పెద్దలు మమ్మల్ని తిరస్కరించటమూ...ఆ పైన మా సాహసాలు, ఊపిరి ఉన్నన్నాళ్లూ తోడు నీడగా ఉందామని ప్రతిణలూ...అలా అలా జరిగి...చివరికీ మాకిద్దరికీ ఆమోదయోగ్యమైన, ఇష్టమైన ఉపాధ్యాయ వృత్తిలో, మాకిద్దరికీ
నచ్చిన పల్లెటూళ్లో ప్రారంభించాము.
ఇద్దరమూ ఉన్నత చదువులు చదివి ఉండటమూ, పోటీ పరిక్షలను పోటీగా ఎదుర్కోటం వలననూ, అదే ఊళ్లో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పదోన్నటి పొంది, మాకు తోచినంతలో మా ఇరువురి భావాలకనుగుణంగా సమాజ సేవ చేస్తు కాలం గడిపే వాళ్లము..ఊర్లో మాకెలంటీ ఝంజాటాలు లేకపోవటం, అందరితో కలుపుగోలుగా ఉండటం..మాకెంతో మేలు కూడా చేసింది..మా ఆ ఆనంద మధుర క్షణాలన్నీ మా ప్రయాణం లో మూడో వాడు జతయ్యినప్పటినుంచే..అంటే, వాడేదో అల్లరి చేస్తాడనో, మేమే వాడికి ఇంట్లోనూ, బళ్లోనూ గురువులం కనుక వాడి అల్లరికి హద్దు లేదనో, పండిత పుత్రః పరమ శుంఠ అనో అర్ధం కాదు.