ఎం.వి.ఆర్ శాస్త్రి గారు ఆంధ్ర భూమి ఆదివారం అనుబంధం లో సీరియల్ గా ప్రచురిస్తున్న ఆంధ్రుల కథ యదాతథం గా..
శ్రీరాములును చంపిందెవరు? (March 27th, 2011)
పొట్టి శ్రీరాములును చంపిందెవరు?
శ్రీరాములు పరమపదించాడన్న దుర్వార్త విన్నవెంటనే ఆంధ్రుల మనసుల్లో రాజాజీ మీద కోపం కట్టలు తెంచుకుంది. ఆగ్రహోదగ్రులైన ఆందోళనకారులందరి నోటా ‘రాజాజీ ముర్దాబాద్’ అన్న మాట మారుమోగింది. ఆయన మొండి వైఖరివల్లే, నెహ్రూకు ఆయన ఇచ్చిన వంకర సలహాలవల్లే శ్రీరాములు ప్రాణం పోయిందన్న బాధ అందరినీ సలిపింది.
దానిమీద 1953 మార్చి 12న మద్రాసు లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో పెద్ద చర్చే జరిగింది. ముఖ్యమంత్రి రాజాజీ పెద్దమనసుతో సకాలంలో హామీఇచ్చి ఉంటే శ్రీరాములు బతికేవాడేనని దామెర్ల వెంకటరావు అనే ఎమ్మెల్సీ రాజగోపాలాచారి మొగంమీదే అన్నాడు. దానిమీద రాజాజీ తెగ గింజుకున్నాడు. ఇదిగో ఇలా:
"I do not think that I am responsible for Sri Sriramulu's death. I think there are others to whom I can point my finger, and say, they killed him... There were old colleagues, collaborators and admirers who surrounded Sriramulu. They did nothing to prevent the disaster. In fact, they tried to use it as a tool and put presure upon anyone who wanted to adopt democratic methods. In this case, I am not guilty, The Prime Minister is nor guilty either.''
[History of Andhra Movement, G.V.Subba Rao, Vol.II, P.516-517]
(శ్రీరాములు మరణానికి నేను బాథ్యుడినని నేను అనుకోను. ఇంకా ఉన్నారు. వాళ్ళే అతణ్ని చంపారని వేలెత్తి చూపగలను. పాత సహచరులు, అభిమానులు అతడితో చేతులు కలిపినవాళ్లు అతడి చుట్టూ చేరారు. ఉపద్రవాన్ని తప్పించటానికి వాళ్లు ఏమీచేయలేదు. నిజానికి వాళ్లు దాన్ని ఒక పనిముట్టుగా వాడుకుని, ప్రజాస్వామిక పద్ధతిన నడవాలనే వాళ్లమీద ఒత్తిడి తెచ్చారు.)
ఇది దుర్మార్గమైన ఆరోపణ. దీక్షాకాలంలో శ్రీరాములు చుట్టూ చేరినవారు గుర్తుతెలియని దుండగీళ్లు కాదు. బులుసు సాంబమూర్తి, ప్రకాశం వంటి పెద్దమనుషులు, డాక్టర్ నారాయణమూర్తి, డాక్టర్ కృష్ణంరాజు వంటి సీనియర్ వైద్యులు, దయచేసి దీక్ష మానమనే వాళ్లు పదే పదే శ్రీరాములుకు చెబుతూ వచ్చారు. ఉన్నన్నాళ్లూ అతడి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకొచ్చారు. అలాంటివాళ్లను పట్టుకుని ‘వాళ్లే చంపార’ని అభాండం వేయడం అన్యాయం; పచ్చి దుర్మార్గం.
అసలు ఈ విషయంలో ఇంకొకరిని వేలెత్తిచూపే హక్కు రాజాజీకి లేదు. ఎందుకంటే శ్రీరాములును రెచ్చగొట్టి ఆమరణ దీక్షకు పురికొల్పిందే ఈ మహానుభావుడు. 1953 సెప్టెంబరు 15న (అంటే దీక్షకు కూచోవటానికి సుమారు మూడునెలల ముందు) నెల్లూరునుంచి బి.లక్ష్మీనారాయణ అనే అడ్వొకేటు మిత్రుడికి శ్రీరాములు రాసిన ఉత్తరమే దానికి రుజువు.
‘‘మద్రాసు తమిళులకే చెందుతుందని ఆర్థికమంత్రి సి.సుబ్రహ్మణ్యం ఈరోజు ప్రకటించాడు. కొద్దిరోజులకింద ముఖ్యమంత్రి రాజగోపాలాచారి కూడా అదే మాట అన్నాడు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఉన్న మన మంత్రులెవరికీ వీరిని ఖండించే ధైర్యం లేకపోయింది. పండిట్ నెహ్రూ ఈ సమస్యను నిష్పాక్షికంగా చూసేట్టు చేయటానికి ఎంతటి త్యాగమైనా చేయవచ్చు... ఈ సమస్యమీద అందరి దృష్టీ పడేట్టు చేయటానికే నేను ఆమరణ నిరాహారదీక్ష చేయదలిచాను.’’
- అని శ్రీరాములే అన్నా ఆచార్లుగారు మాత్రం తనకేమీ పూచీలేదనే అంటారు. శ్రీరాములు నిరాహారదీక్ష బూటకమని, అతడి ఆరోగ్యం విషమిస్తున్నట్టు అతడిదగ్గరి వాళ్లు ఆడుతున్నది నాటకమని నెహ్రూకి తప్పుడు సమాచారం ఇచ్చింది రాజాజీ సర్కారే. ఆ సంగతి అప్పట్లో చాలా పత్రికలు రాశాయి. ఒక్కదానికీ రాజాజీ సమాధానమివ్వలేదు. శ్రీరాములును కాపాడటంకోసం త్వరగా రాష్ట్ర ప్రకటన చెయ్యాలని ఒక దశలో నెహ్రూ తొందర పడినా, వద్దని వారించి, ప్రకటనను ఆలస్యం చేయించిందీ ఆ మహానుభావుడే. శ్రీరాములు పరిస్థితి రోజులు, గంటలలోకి వచ్చిందనీ, ఏ క్షణమైనా ఏమైనా జరగొచ్చనీ తెలిసి కూడా ఆయన మరణించడానికి మూడురోజులముందే రాజాజీ మద్రాసు వదిలిపోయాడు. శ్రీరాములు దీక్షను ఆయన ఎంత తేలిగ్గా తీసుకున్నదీ దీన్నిబట్టే తెలుస్తుంది.
తన దగ్గర ఇన్ని తప్పులుంచుకుని, శ్రీరాములు చుట్టూ ఉన్న శ్రేయోభిలాషులను వేలెత్తిచూపి వాళ్లే అతడి చావుకు కారణమని రాజాజీ వాదులాడటం నిస్సందేహంగా తెంపరితనమే. కాని- అలాగని ఆ సమయాన మనవాళ్ల నిర్వాకం వంకపెట్టలేనంత దివ్యంగా ఉందని చెప్పగలమా? శ్రీరాములును రక్షించుకోవడానికి వారు చేయగలిగినంతా చేశారా?
మాటవరసకు స్వామి సీతారామ్ సంగతే చూడండి. ఆంధ్రరాష్ట్రంకోసం సత్యాగ్రహాలను మొదలుపెట్టిందే ఆయన! ఆయనను సంప్రదించే, ఆయన సలహా తీసుకునే శ్రీరాములు దీక్షకు ఉపక్రమించాడు. ‘‘మద్రాసును ఉమ్మడి రాజధానిగానో, ప్రత్యేక రాష్ట్రంగానో చేయించడానికే నేను దీక్షకు కూచున్నాను. నగరంలోని తమిళులను అందుకు ఒప్పించాలి. మీలాంటి పెద్దలు దానికి పూనుకోవాలి’’అని స్వామి సీతారామ్‌కి అతడు ఉత్తరం కూడా రాశాడు. అయినా స్వాములవారు గాని, మరెవరుగాని మద్రాసులో తమిళ ప్రముఖులకు నచ్చచెప్పే ప్రయత్నం మచ్చుకైనా చేయలేదు.
అరవలను దారికితెచ్చే మాట దేవుడెరుగు. జరుగుతున్నదేమిటో బోధపరిచి, కనీసం ఆంధ్రులను ఒక్క తాటిమీదికి తెచ్చే ప్రయత్నమైనా మన నాయకులు చేశారా? లేదు. నిజానికి వారిలో వారికే శ్రుతి కలవదు. ఎవరిగోల వారిదే తప్ప ఉమ్మడి ధ్యేయం ఎవరికీ పట్టదు. వారిమధ్య ఐక్యత తేవాలనే శ్రీరాములు నెత్తీనోరూ బాదుకున్నాడు.
‘‘నిజం చెప్పాలంటే మన నాయకులకు ఏ విషయంలోనూ ఐక్యత లేదు. మద్రాసు విషయంలో పేచీ ఉన్నప్పుడు దాని మంచిచెడ్డలను తరచి చూడకుండానే, మన అగ్రనాయకులు, మద్రాసు మీద మనం హక్కు వదులుకోవాలని చెబుతున్నారు. వారి తప్పును వారు గుర్తించేవరకూ నేను దీక్ష మానేది లేదు’’ అని డాక్టర్ రామకృష్ణరాజుతో శ్రీరాములు అన్నాడు.
అందరిమధ్యా స్థూలమైన అంగీకారం కుదిరింది కనుకే ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు ప్రకటిస్తున్నానని 1952 డిసెంబరు 19వ తేదీన పార్లమెంటులో ప్రకటన చేస్తూ నెహ్రూ చెప్పింది వట్టిమాట; పక్కా బుకాయింపు! అంగీకారం కుదరాలంటూ 9వ తేదీన అదే పార్లమెంటులో ఆయన షరాల సన్నాయి నొక్కులు నొక్కిన నాటికీ... 19న రాష్ట్రాన్ని ఇచ్చేసిన నాటికీ నడుమ పరిస్థితిలో ఏ మార్పూలేదు. తెరచాటున గాని, బాహాటంగా గాని ఆంధ్ర, తమిళ పెద్దలమధ్య ఏ స్థాయిలోనూ ఎటువంటి సమాలోచనా జరిగిందీ లేదు; ఏకాభిప్రాయం కుదిరిందీ లేదు. మద్రాసుమీద తమ హక్కును వదులుకోగలమని ఆంధ్ర నాయకులెవరూ మాట ఇచ్చిందీ లేదు. అయినా- లేని ఏకాభిప్రాయం పొసగినట్టు ఊహించేసుకుని, నెహ్ర ఆదరాబాదరా డిసెంబరు 19న ఆంధ్ర రాష్ట్రానికి పచ్చజండా ఊపాడంటే దానికి కారణం ఒకే ఒక్కటి:
ఆంధ్ర ప్రజల తీవ్రాగ్రహం! శ్రీరాములు కన్నుమూశాడని తెలియగానే ఆంధ్రదేశమంతటా అంటుకున్న జనాగ్రహజ్వాలలని చూసేసరికి సర్కారుకు కాళ్లుచేతులు చల్లబడ్డాయి. సమస్యను ఇంకేమాత్రమూ సాచివేయటానికి వీల్లేదని అర్థమవటంతో ప్రధానమంత్రి పడుతూలేస్తూ పార్లమెంటులో రాష్ట్రాన్ని ప్రకటించాడు.
అంటే- ప్రభుత్వానికి మెడలు వంచింది ప్రచండ ప్రజాభిప్రాయం! ఆ ప్రజాభిప్రాయమే కనుక అంతే ప్రచండంగా శ్రీరాములు బతికి ఉన్నప్పుడే భగ్గుమని ఉంటే నెహ్రూ ప్రభుత్వం కొన్ని రోజుల ముందే దారికి వచ్చేది. బహుశా శ్రీరాములు ప్రాణమూ నిలిచేది!
మరి- ప్రజాభిప్రాయాన్ని సమీకరించాల్సింది ఎవరు? జనానికి సంగతి సందర్భాలను విశదపరచి, జాగుచేయక సంఘటితమవాల్సిన అవసరాన్ని బోధపరచాల్సింది ఎవరు? ప్రజానాయకులే కదా? కాని- సోకాల్డ్ ఆంధ్ర నేతల్లో ఒక్కడుకూడా శ్రీరాములు దీక్ష సాగిన కాలంలో ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేసిన పాపాన పోయిన దాఖలాలు లేవు. శ్రీరాములుకు సంఘీభావంగా సభలను, హర్తాళ్లను, సత్యాగ్రహాలను జరిపించాలన్న ఆలోచనే ఎవరికీ వచ్చినట్టు లేదు. శ్రీరాములు దగ్గరికి పోయి దీక్ష మాని ప్రాణం దక్కించుకోమని చచ్చు సలహాలు ఇచ్చిన వారేగాని- ప్రభుత్వాన్ని నిగ్గదీసి, తమిళ నాయకులకు నచ్చచెప్పి, శ్రీరాములు దీక్ష విజయవంతమయ్యేందుకు గట్టి కృషిచేసినవారు ఎవరూ లేరు.
45వ రోజు దాకా పత్రికలుగాని, నాయకులు గాని, ప్రభుత్వాలు గాని శ్రీరాములు దీక్షను పట్టించుకోలేదంటేనే ఆ కాలాన ఆంధ్ర నాయకాగ్రేసరుల బాధ్యతారాహిత్యం, నిష్క్రియాపరత్వం తేటతెల్లమవుతుంది. రోజురోజుకూ అతడి సత్తువ సన్నగిల్లి చావుకు చేరువయ్యేకొద్దీ, డాక్టర్ల బులెటిన్లు వింటూ, ఎప్పుడు పోతాడా అని ఎదురుచూస్తున్నట్టు చేతులు ముడుచుకు కూచున్నారే తప్ప ఢిల్లీదాకా వినపడేట్టు, మద్రాసు దద్దరిల్లేట్టు శ్రీరాములుకు బాసటగా ప్రజాపోరాటాన్ని నడపాలన్న ఆలోచన ఆంధ్రకేసరికీ రాలేదు; విప్లవ పోరాటాల్లో కొమ్ములు తిరిగిన కామ్రేడ్లకూ రాలేదు.
శ్రీరాములు పరిస్థితి గంటలమీదికి వచ్చిందని అర్థమైనా ప్రకాశంగారు మద్రాసులోనే లేరు. దుర్వార్త తెలిశాక విజయవాడలో పర్యటన ముగించుకుని అంతిమయాత్ర మొదలయ్యాక 16వ తేదీ సాయంత్రానికి గాని ఆయన మద్రాసుకు చేరుకోలేదు.
ఇక శ్రీరాములు అవసాన కాలంలో ఊరొదిలిపోయాడని రాజగోపాలాచారిని ఆక్షేపించడమెందుకు? ఆంధ్రరాష్ట్రం విషయంలో రాజగోపాలాచారి నడవడి మనల్ని ఎంత బాధించినా... ఆయన అరవవాడు. అరవ ప్రయోజనాలనే చూసుకున్నాడు. ఆ విషయంలో ఆయన నిజాయతీని ఎవరూ శంకించలేదు. మరి ఆంధ్రులై ఉండి, ఆంధ్రుల ప్రయోజనాలను కాపాడవలసిన ఆంధ్ర మహానాయకులు ఆ బాధ్యతలో ఎంత నిజాయతీగా వ్యవహరించారు?
పోనీ.. శ్రీరాములు గోలంతా మద్రాసుకోసం! దానిమీద మనవాళ్లకు ఆసక్తి లేదు; అది మనకు దక్కుతుందన్న ఆశాలేదు; అందుకే... శ్రీరాములు డిమాండ్ల విషయంలో పట్టీపట్టనట్టు ఉన్నారు- అని చెప్పగలమా? అదీ కుదరదు. మద్రాసు గురించి శ్రీరాములుకంటే బిగ్గరగానే వారూ కబుర్లాడారు. ఉదాహరణకు ఆంధ్ర కాంగ్రెసు అధ్యక్షుడు సంజీవరెడ్డి అయితే మద్రాసు సిటీని ప్రత్యేక రాష్ట్రం చేస్తేగానీ రాయలసీమ తృప్తి చెందదని 1952 అక్టోబరులో అన్నాడు. (మద్రాసు లేని ఆంధ్రరాష్ట్రం తమకు వద్దేవద్దనీ ఆయన పంతానికి పోయాడు. కాని- మద్రాసు సహితంగా ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించడానికి పి.సి.సి. అధ్యక్షుడుగా ఆయన మాత్రం ఏమీచేయలేదు!)
అలాగే- ఆ సమయాన ఐదుగురు ఆంధ్ర మంత్రులు పాల్గొన్న ఎ.పి.సి.సి. సమావేశం మద్రాసును వేరే రాష్ట్రంచేసి, ఆంధ్ర రాష్ట్రాన్ని వెంటనే ఏర్పాటుచేయాలన్న కళావెంకటరావు తీర్మానాన్ని ఆమోదించింది. మద్రాసును కొంతకాలమైనా ఉమ్మడి రాజధానిగా ఉండనివ్వాలని ప్రకాశంగారు పార్టీషను కమిటీలోనే ఘంటాకంఠంగా చాటాడు. శ్రీరాములు దీక్షకు కూచున్న మూడువారాల తరవాత (నవంబరు 15న) ప్రకాశం, సంజీవరెడ్డి మద్రాసులో భేటీవేశారు. ఆంధ్ర, తమిళ రాజధానులు మద్రాసులో కొనసాగాలని, మద్రాసు, దాని పరిసర ప్రాంతాలను ప్రత్యేక రాష్ట్రం చేయాలని డిమాండు చేస్తూ ఉమ్మడి కార్యాచరణకు దిగాలని వారు నిశ్చయించినట్టు వార్తలొచ్చాయి. ఆ ఆలోచన కార్యరూపం దాల్చిన దాఖలాల్లేవు. ప్రకాశం అధ్యక్షతన 1952 డిసెంబర్ 7న జరిగిన అఖిలపక్ష సమావేశం మద్రాసు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రాన్ని వెంటనే ఏర్పరచాలని తీర్మానమైతే చేసి ఊరుకుంది. ఆ మరునాడే మద్రాసు మనకు వద్దువద్దంటూ కమ్యూనిస్టు కామ్రేడ్లు ఊరేగిన వైనం ఇంతకుముందే చూశాం.
ఇప్పుడు మనకొచ్చే డౌటల్లా ఒక్కటే. కనీసం వేరే రాజధానిని కట్టుకునేదాకానైనా మద్రాసును ఆంధ్ర రాజధానిగా ఉండనివ్వాలనీ, ఏ రాష్ట్రంలోనూ చేరకుండా ఆ నగరాన్ని కేంద్ర పాలిత రాష్ట్రం చేయాలనీ ఆంధ్రా నేతాశ్రీలు తీర్మానాలు, ప్రకటనలు చేస్తూ వచ్చారు కదా? మరి- మద్రాసు లేకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటుచేస్తామని నెహ్రూ అన్నప్పుడు అలా ఎలా చేస్తారంటూ మనవాళ్లు ఎదురు తిరగలేదు ఎందుకని? శ్రీరాములు ఆత్మార్పణ చేసిందే మద్రాసుకోసమైనప్పుడు మద్రాసు లేని రాష్ట్రాన్ని మన మొగాన కొట్టటం అమరజీవి త్యాగాన్ని చులకన చెయ్యడమేకదా? మరి మన నేతలు ఏమిచేశారు? తాము నిమ్మకు నీరెత్తినట్టు మిన్నకుంటే జనమే చొరవ తీసుకుని ఎక్కడికక్కడ హర్తాళ్లు, ఆందోళనలు, రైళ్ల అటకాయింపులు, కొన్నిచోట్ల విధ్వంసాలకు దిగిన తరవాతయినా ప్రజాగ్రహ తీవ్రతను గుర్తించి, ప్రజలు మెచ్చేలా ఆంధ్ర హక్కులకోసం పోరాడారు.
లేదు. పైగా ప్రజల ఆగ్రహం కూడా వారి కళ్లకు దుర్మార్గంగానే కనిపించింది. 1952 డిసెంబరు 16 సాయంత్రం మద్రాసు స్మశానంలో ‘అమరజీవి’కి అంత్యక్రియల తరవాత ఆంధ్ర నాయకులు ఒక వరండాలో చేరి సభ చేరారు. ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రార్థన గీతం పాడాక టంగుటూరి ప్రకాశంగారు ప్రసంగిస్తూ ఇలా అన్నాడు:
‘‘నిరాహారదీక్షలో నమ్మకం లేని వాళ్లలో నేనొకణ్ణి. అయితే శ్రీరాములు ఈ ఆత్మబలిదానంవల్ల నిరాహారదీక్ష యొక్క మహత్తరశక్తిని మనందరికి అర్థమయేట్టు చేశాడు... కానీ నెహ్రూ అతనికి సరైన సమాధానం ఇవ్వలేదు. అతని మరణంవల్ల కలిగిన పరిస్థితిని ఆసరాచేసుకుని కొందరు దుర్మార్గులు దౌర్జన్యాలకు ఒడికడుతున్నారు. అందుకు మనం సమ్మతించలేదు. నెహ్రూ తన మనస్సు మార్చుకునేదీ లేనిదీ కొద్దిరోజులు ఓపికపట్టి మనం వేచి చూడాలి. అతనిలో మార్పు రానట్లయితే మనమంతా తప్పక ఒక కార్యక్రమాన్ని నిర్ణయించుకుందాం. దాన్ని ప్రజలంతా అధిక సంఖ్యలో ఆమోదించగలరని విశ్వసిస్తున్నాను.’’
(అమరజీవి పొట్టి శ్రీరాములుగారి జీవిత చరిత్ర,
బాదం శ్రీరాములు, పే.219)
ఆంధ్రులంటే లెక్కలేనట్టు మొదటినుంచీ ఉదాసీనంగా ఉన్న జాతీయ నాయకత్వాన్ని చెర్నాకోలతో కొట్టి, రాష్ట్రాన్ని మంజూరుచేయించింది ప్రజల ఆగ్రహజ్వాల. దాన్ని ‘దుర్ముర్గుల దౌర్జన్యం’గా ‘ఆంధ్రకేసరి’గారు తూష్ణీకరించారు. చాలా బాగుంది. పెద్ద మనసుతో ఆయన, ఆయనబోటివారు ‘‘ఓపికపట్టి వేచి చూసినా’’ నెహ్రూలో మార్పులేదు. అప్పుడు వీరంతా ఏ కార్యక్రమాన్ని నిర్ణయించుకున్నారు? ఏమి సాధించారు? *