ఎం.వి.ఆర్ శాస్త్రి గారు ఆంధ్ర భూమి ఆదివారం అనుబంధం లో సీరియల్ గా ప్రచురిస్తున్న ఆంధ్రుల కథ యదాతథం గా..
ఆశాభంగం నెంబర్ వన్ ......(June 6th, 2010)
అంత మార్పుకు కారణం మాంటేగూ మాట!
బ్రిటిష్ విదేశాంగ శాఖలో ఇండియా మంత్రి అరుూ్యకాగానే 1917 ఆగస్టు 20న కామన్స్ సభలో ఆయన కీలకమైన ఒక విధాన ప్రకటన చేశాడు. ఏమనంటే-
‘‘పరిపాలనకు సంబంధించిన అన్ని విభాగాల్లో భారతీయులకు ఇంకా ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి; ఇండియాలో ప్రజలకు బాధ్యత వహించే ప్రభుత్వం క్రమంగా ఏర్పడేందుకు అనువుగా స్వయంపాలిత వ్యవస్థలను బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగంగా క్రమప్రకారం నెలకొల్పాలి- అని ప్రభుత్వం నిశ్చయించింది. ఈ దిశగా సాధ్యమైనంత త్వరలో విస్తృత చర్యలు తీసుకుంటాము. ఈ చర్యలు ఎలా ఉండాలి అన్నది నిర్ణయించేముందు దీనికి సంబంధించిన అందరి అభిప్రాయాలూ తెలుసుకుంటాము. ఈ పనిమీదే నేను ఇండియా వెళ్లి వైస్రాయితో మాట్లాడి, స్థానిక ప్రభుత్వాల అభిప్రాయం సేకరించి, ప్రజలకు ప్రాతినిధ్యం వహించే సంస్థలనూ, ఇతరులనూ కూడా కలుస్తాను.’’
విన్నవారు ఔనా, నిజమేనా అని బోలెడు ఆశ్చర్యపడ్డారు. అప్పటికి నూటయాభై ఏళ్లుగా ఇండియాను తన కబంధ హస్తాల్లో ఇరికించుకుని, ఎడాపెడా దోపిడీ చేస్తూ, ప్రజలగోడును ఏమాత్రం పట్టించుకోకుండా, ఉక్కుపాదాలతో అణచిపెట్టిన తెల్లదొరతనం హఠాత్తుగా ప్రజల పట్ల బాధ్యత గురించి, స్వయంపాలిత వ్యవస్థల అవసరం గురించి మాట్లాడటం విడ్డూరమే. ఇండియా మంత్రి అంతటివాడే ఈ దేశానికి వచ్చి ప్రజాప్రాతినిధ్య సంస్థలను కలుస్తాననడం అబ్బురమే. కాని ఈ ఆకస్మిక ఔదార్య ప్రకటనకూ కారణం ఉంది. ఒకటి కాదు రెండు.
మొదటిది తెల్లవారి అవసరం. ఆ సమయాన మొదటి ప్రపంచ యుద్ధం ప్రచండంగా సాగుతున్నది. ఇంగ్లండు అందులో పీకలదాకా ఇరుక్కుని ఉంది. యుద్ధావసరాలకు మంది, మార్బలం, డబ్బు, ఇతర హంగులు ఎన్నో కావాలి. వాటిలో ముప్పాతిక, మువీసం బ్రిటిషు సామ్రాజ్యానికి ఆధారభూతమైన విశాల భారతదేశంనుంచే అందాలి. ప్రజల ఐచ్ఛిక సహకారం, ప్రజల్లో పలుకుబడిగలిగిన వ్యక్తుల, సంస్థల సహాయం ఉంటేగానీ కష్టాలు గట్టెక్కే ఆశలేదు. అక్కడికీ పాపం మోహన్‌దాస్ కరంచంద్ గాంధీగారు దక్షిణాఫ్రికానుంచి తిరిగివచ్చీ రావడమే బ్రిటిషువారి పనుపున రంగంలోకి దిగి, కొత్త పటాలాలను సమీకరించి, ఊళ్లు తిరిగి యుద్ధ నిధిని సేకరించి, జనానికి నచ్చచెప్పి చాలా కష్టమే పడుతున్నాడు. కాని ఆయన దేశానికి కొత్త. ఇంకా ఆయన కీర్తి దశదిశలా వ్యాపించలేదు. ఏదో తనకు బాగా పరిచయం ఉన్న ప్రాంతాల్లోనే ఆయన తంటాలు పడుతూ ఉడతాభక్తిగా సామ్రాజ్యానికి సేవచేస్తున్నాడు. కాని అది చాలదు. యావద్భారత ప్రజలనూ ఉత్సాహపరచి, తెల్లదొరతనానికి బాసటగా నిలిచేట్టు చేస్తేగానీ అవసరాలు తీరేట్టులేదు.
అయితే జనాన్ని మచ్చికచేసుకోవటమూ తేలిక కాదు. 1857 విప్లవాన్ని తెల్లవాళ్లు పరమకిరాతకంగా అణచివేసిన తీరును సామాన్య జనం ఇంకా మరచిపోలేదు. పర్యవసానాలకు వెరచి సర్కారీ జులుంకు విధిలేక తలవంచినా తమను అంతటి చిత్తక్షోభకు గురిచేసిన విదేశీ రాకాసులమీద ప్రజల క్రోధం నివురుగప్పిన నిప్పులా మండుతూనే ఉంది. అదే సమయంలో అనీబిసెంట్, లోకమాన్య తిలక్‌లు కాంగ్రెసుకు సమాంతరంగా హోంరూలు లీగ్‌లను స్థాపించి పరిపాలనలో ప్రజల భాగస్వామ్యంకోసం పెద్ద ఉద్యమమే నడుపుతున్నారు. ఆంధ్ర ప్రాంతం సహా దేశమంతటా విస్తృతంగా పర్యటించి, హోంరూల్ కార్యకర్తలను సమీకరించి, ముఖ్యంగా బీసెంటమ్మ సాగించిన కాఠ్యకలాపాల ప్రభావం జాతిజనుల మీద బాగా పడింది. ఈ స్థితిలో ఇచ్చకాలు పలికితే పొంగిపోవటానికి జనం సిద్ధంగాలేరు. అధికారాన్ని వికేంద్రీకరిస్తామని? పాలనా వ్యవస్థ ప్రజలకు జవాబుదారీగా ఉండేట్టు చేస్తామని నిర్దిష్టమైన ఆశ చూపిస్తే గానీ భారతీయులు ఆంగ్ల సామ్రాజ్యం కొమ్ముకాసేట్టు లేరు. ఇదిగో- ఈ సంగతి గ్రహించే సీమ సర్కారు అకస్మాత్తుగా వైఖరి మార్చుకుని బాధ్యతాయుత పాలన, ప్రజాభిప్రాయ సేకరణ అంటూ కొత్త బాణీ ఎత్తుకుంది.
బ్రిటిషు పాలకుల అవసరాలు, అగత్యాలు ఏమైతేనేమి? వారికి ముద్దొచ్చినప్పుడే చంకనెక్కాలి. కాగల కార్యాలు ఈ అదనులోనే సాధించుకోవాలి అనుకున్నారు మనవాళ్లు. మీదుమిక్కిలి ఆంధ్ర నేతలకైతే మాంటేగు ప్రకటన వీనుల విందు చేసింది. స్వయంపాలిత వ్యవస్థలు, ప్రజలకు జవాబుదారీ పరిపాలనలు అని మంత్రిగారు మాట్లాడాడు కనుక... మద్రాసు ప్రెసిడెన్సీనుంచి తెలుగు మాట్లాడే జిల్లాలను వేరుచేసి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుచేయాలని ఇప్పుడు డిమాండు చేస్తే ఆంగ్ల ప్రభువులు తప్పక తీరుస్తారన్న నమ్మకం అందరికీ కలిగింది. ప్రత్యేకంగా ఆంధ్రా గురించి మాంటేగు ఏమీ అనకపోయినా, ఆయన ప్రకటన కచ్చితంగా మనకు మేలుచేసేదేనని, అంతా కలిసి గట్టిగా ప్రయత్నం చేస్తే ఈ దెబ్బతో ఆంధ్ర రాష్ట్రం వచ్చేసినట్టేనని అందరికీ ఆశ కలిగింది.
By the close of 1917 almost all Andhra leaders had expressed themselves in favour of a separate province. Those who had been hesitant came openly now in its support because of the change in the political atmosphere with the announcement of the Secretary of State. They felt that the time had come for them to unite and strive for an Andhra Province... This was the first time since the inception of AMS when all prominent Andhra leaders came together and with one voice, pleaded for the formation of a separate province.
[The Emergence of Andhra Pradesh, K.V.Narayana Rao, P.59, 62]
(1917 సంవత్సరం చివరికల్లా ఆంథ్ర నాయకులు దాదాపుగా అందరూ ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలురయ్యారు. అప్పటిదాకా సందేహించినవారు కూడా విదేశాంగ మంత్రి ప్రకటనతో మారిన రాజకీయ వాతావరణంలో బాహాటంగా ముందుకొచ్చారు. అందరూ కలిసి ఆంధ్ర రాష్ట్రంకోసం పాటుపడాల్సిన సమయం వచ్చిందని వారు భావించారు. ఆంధ్ర మహాసభ స్థాపించాక ప్రముఖ ఆంధ్ర నాయకులందరూ కలిసి ప్రత్యేక రాష్ట్రాన్ని ఒక్క గొంతుతో కోరడం ఇదే మొదలు.)
దేశంలో రాజకీయ సంస్కరణలు ఆసన్నమైన తరుణంలో భాష ప్రాతిపదికన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కోరుతూ ఇండియాకు వచ్చినప్పుడు మాంటేగు మంత్రిగారిని కలిసి విజ్ఞప్తిచెయ్యాలని పెద్దలంతా అనుకున్నారు.
దీని నిమిత్తం 1917 అక్టోబరులో ఆంధ్ర మహాసభ ప్రత్యేక సమావేశాన్ని బెజవాడలో పెట్టారు. 1200 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఇంతకుముందు సభల్లోవలె ఈసారి గొడవ ఏదీ జరగలేదు. ఆంధ్ర రాష్ట్ర తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. సాధ్యమైనంత త్వరగా ఆంధ్ర రాష్ట్రాన్ని మంజూరు చేయవలసిందని భారత సర్కారునూ, బ్రిటిష్ విదేశాంగ మంత్రినీ మహాసభ ప్రార్థించింది. దీనికోసం ఒక ప్రతినిధి వర్గాన్ని ఏర్పాటుచేయాలన్న న్యాపతి సుబ్బారావు ప్రతిపాదనను కూడా సభ ఆమోదించింది. ప్రతినిధి వర్గమూ ఏర్పడింది. ఎడ్విన్ మాంటేగు ఇండియాకు వచ్చి వైస్రాయ్ చెమ్స్‌ఫర్డ్‌తో కలిసి వివిధ ప్రజాసంస్థల సూచనలు, విన్నపాలు వినడానికి దేశమంతా తిరుగుతూ మద్రాసులో మకాంచేసిన సందర్భంలో ఇంటర్వ్యూకోసం అర్జీనీ పెట్టింది.
ఏం లాభం? మద్రాసు ప్రభుత్వం సదరు అర్జీని అడ్డంగా కొట్టిపడేసింది. యూరోపియన్, యూరేసియన్ సమాజాలవారికీ, మద్రాసు పి.సి.సి.కీ, మద్రాసు మహాజనసభ వారికీ, క్రిస్టియన్లకూ, ముస్లిం ఉలేమాలకూ తక్కుంగలవారందరికీ, ధారాళంగా ఇంటర్వ్యూలు అనుగ్రహించింది. ఆంధ్ర మహాసభ, హోంరూలు లీగ్ వంటి అతి ముఖ్యసంస్థలకు మాత్రం మొండిచెయ్యి చూపింది. అయినా ఆంధ్ర నేతలు పట్టువదలలేదు. కలిసే అవకాశం తమకూ ఇప్పించాలంటూ మద్రాసు ప్రభుత్వానికీ, నేరుగా మాంటేగుకూ టెలిగ్రాంల మీద టెలిగ్రాంలు ఇచ్చారు. ఒత్తిడి ఫలించి సర్కారు దారికొచ్చింది. బహుశా మాంటేగు చొరవ తీసుకుని చెప్పడంవల్లే కావచ్చు ఆంధ్ర మహాసభ వారికి 1917 డిసెంబర్ 20న ఇంటర్వ్యూ అనుగ్రహించింది. ఆ ప్రకారమే 26గురు సభ్యుల ఆంధ్ర డెలిగేషను న్యాపతి సుబ్బారావు నాయకత్వంలో మాంటేగు దొరవారి దర్శనం చేసుకుని న్యాయం అర్థించింది. కొండ వెంకటప్పయ్య, పట్ట్భా సీతారామయ్య, బి.ఎన్.శర్మ, కాశీనాథుని నాగేశ్వరరావు, గాడిచర్ల హరి సర్వోత్తమరావు, నెమలి పట్ట్భా రామారావు, కె.ఆర్.వి.కృష్ణారావు, సి.వి.ఎస్.నరసింహరాజు లాంటి హేమాహేమీలు అన్ని జిల్లాలకు, అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తూ అందులో పాలుపంచుకున్నారు. భాషాప్రాతిపదికన రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరించి, మద్రాసు ప్రెసిడెన్సీలోని తెలుగు జిల్లాలను ప్రత్యేక రాష్ట్రం చేయాలనీ సర్కారువారిని అభ్యర్థించారు.
అంతవరకూ బాగానే ఉంది. వినతిపత్రం ఇచ్చాక అందులో పేర్కొన్న తమ వాదం సబబనీ, బహుళ సంఖ్యాకులు దాన్ని ఆమోదిస్తున్నారనీ సర్కారువారికి నమ్మకం కలిగేందుకు గట్టి ప్రయత్నం కూడా జరగాలి కదా? అందుకే మాంటేగును కలిసిన ఏడు వారాలకే మన బయ్యారపు నరసింహేశ్వరశర్మగారు ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిలులో ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. సాక్షాత్తూ వైస్రాయి లార్డ్ చెమ్స్‌ఫర్డే అధ్యక్ష స్థానంలో ఉన్నాడు. విదేశాంగ మంత్రి మాంటేగు విజిటర్స్ గ్యాలరీలో ఉండి సభావ్యవహారాలను గమనిస్తున్నాడు. అప్పటికే ఆంధ్రుల ప్రత్యేక రాష్ట్రం వాదన సమంజసమని పలు రాష్ట్రాల ప్రముఖులు అంగీకరించారు. ఆంధ్ర రాష్ట్రం కోరుతూ తీర్మానం వస్తే అనుకూలంగా ఓటువేయడానికి పలువురు శాసనసభ్యులు సిద్ధంగా ఉన్నారు. అందరూ ఆసక్తితో చూస్తుండగా బి.ఎన్.శర్మగారు అనధికారిక తీర్మానం ప్రవేశపెట్టారు.
ఏమని? తక్షణం ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుచేయాలనా? కాదు. అసలు ఆయన తీర్మానంలో ఆంధ్ర రాష్ట్రం ఊసేలేదు. ఉన్నదంతా భాష ప్రాతిపదికన రాష్ట్రాలను పునర్వర్గీకరించాలన్న ఘోషే. ఒక భాష మాట్లాడేవాళ్లు అత్యధిక సంఖ్యలో ఉండి, ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటే ఆ రకమైన మార్పును అనుమతించాలన్న కంఠశోషే.
శర్మగారు వీర జాతీయవాది కావచ్చు. జాతీయ దృష్టి ఆయనలో జాస్తి అరుూ ఉండవచ్చు. కాని ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో ఎలెక్టెడ్ మెంబరుగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నది ఆంధ్ర ప్రాంతానికి! అఖిల భారతానికి కాదు. పైగా ప్రథమాంధ్ర మహాసభకు ఆయనే అధ్యక్షుడు. రాష్ట్ర సాధనకోసం ఏర్పాటైన కమిటీలో ఆయనా మెంబరు. అలాంటివాడు జాతీయ స్థాయిన చట్టసభలో తీర్మానంపెట్టే అవకాశం వచ్చినప్పుడు కోరవలసింది, పట్టుబట్టవలసింది ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం గురించా? లేక- మొత్తం దేశంలో చేయదలచిన రాజ్యాంగ సంస్కరణలు ఏ ప్రాతిపదికన జరగాలన్నదానిమీదా?
మొదటినుంచీ మన నాయకులకు విశాలదృష్టి ఎక్కువవటమే మన ప్రారబ్ధం! అప్పుడున్న పరిస్థితుల్లో భాషాప్రాతిపదికన రాష్ట్రాల పునర్విభజనకు ప్రభుత్వం సిద్ధంగా లేదు కనుక, దానికోసం పట్టుబట్టాలని ఇతర రాష్ట్రాల ప్రతినిధులూ అనుకోవడంలేదు కనుక బి.ఎన్.శర్మ తీర్మానం సహజంగానే వీగిపోయింది. ఆ సందర్భాన జరిగిన చర్చలో-
Dr.Tej Bahadur Sapru said that if it was a question of only Andhra Province, he would have sympathised with the resolution... V.S.Srinivasa Sastri conceded that the Andhras had a good case but objected on the ground that Sarma was pleading for the reconstitution of the whole country... The resolution was put and negatived... probably a specific demand for an Andhra Province and a concerted effort to acquaint and convince at least the non-official members of the legislature might have met with greater sympathy.
[The Emergence of Andhra Pradesh, K.V.Narayana Rao, P.63]
(ఆంథ్ర రాష్ట్రం ప్రశ్న ఒక్కటే అయితే తాను తీర్మానాన్ని బలపరిచేవాడినని డాక్టర్ తేజ్ బహదూర్ సప్రూ అన్నాడు... ఆంధ్రుల వాదం సమంజసమని తెలిసినా, మొత్తం దేశాన్ని పునర్వ్యవస్థీకరించాలని శర్మ కోరుతున్నందువల్ల తీర్మానానికి అభ్యంతరం తెలుపుతున్నానని రైట్ ఆనరబుల్ వి.ఎస్.శ్రీనివాసశాస్ర్తీ అన్నాడు... తీర్మానం తిరస్కరించబడింది... ఆంధ్ర రాష్ట్రంకోసమే నిర్దిష్టమైన డిమాండు పెట్టి, చట్టసభలో కనీసం అనధికారిక సభ్యులనైనా కన్విన్సు చేసేందుకు గట్టి ప్రయత్నం జరిగి ఉంటే తీర్మానానికి ఇంకా ఎక్కువ మద్దతు లభించేది.)
అలా చేసి ఉంటే అనివార్యంగా తీర్మానం వీగిపోయినప్పటికీ, ఆంధ్రుల వాదంలో పస ఏమిటో జాతీయ శాసనసభా వేదిక ద్వారా లోకానికి వెల్లడయ్యేది. తేజ్ బహదూర్ సప్రూ, శ్రీనివాసశాస్ర్తీ, సర్ సురేంద్రనాథ్ బెనర్జీ వంటి దిగ్దంతుల మద్దతు చూరగొని ఉంటే విజిటర్స్ గాలరీలో కూచున్న ఎడ్విన్ మాంటేగు మనసులో ఆంధ్ర రాష్ట్రం డిమాండు సమంజసమన్న అభిప్రాయం ముద్ర పడేది. అనంతరం బ్రిటిషు ప్రభుత్వానికి రిపోర్టు ఇచ్చేటప్పుడు వెంటనే మంజూరు చెయ్యదగ్గ రాష్ట్రాల్లో ఆంధ్రనూ పేర్కొనాలని ఆయనకు బుద్ధి పుట్టేదేమో. తనకు మాలిన ధర్మానికి పోయి, అసలు రాష్ట్ర సమస్యను వదిలేసి, జాతీయ స్థాయిలో జరగాల్సిన సంస్కరణమీదే దృష్టి నిలపటంవల్ల జాతీయవాదిగా బి.ఎన్.శర్మగారి ప్రతిష్ఠ అయితే పెరిగి ఉండవచ్చు. కాని ఆంధ్రులకు, ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరిగింది. ఒక్క బి.ఎన్.శర్మ అనే ఏమిటి? ఆ కాలంలో ఆంధ్ర నాయకమ్మన్యులందరిదీ అదే వరస. ఎంతసేపూ భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు తక్షణావసరమని ఎలా నచ్చచెప్పాలనే వారి ధ్యాస.
చివరికి ఏమైంది? అంతటా తిరిగి అన్నీ విన్న మాంటేగు, చెమ్స్‌ఫర్డ్‌లు కిందా మీదా పడి భారత రాజ్యాంగ సంస్కరణలకు సంబంధించి 1918 జూలైలో వెలువరించిన ‘‘మాంట్‌ఫర్డ్’’ రిపోర్టులో ఆంధ్ర రాష్ట్రం ప్రస్తావనే లేదు. పొందికైన చిన్న రాష్ట్రాలు ఏర్పడి ప్రజల భాషలో పరిపాలన జరిగితే ప్రభుత్వం సజావుగా సాగుతుందని అంగీకరిస్తూనే ఇప్పటికిప్పుడే అటువంటి పునర్వ్యవస్థీకరణను తలకెత్తుకోవటం మంచిదికాదని రిపోర్టు పేర్కొన్నది. అయితే అటువంటి పునర్విభజన అవసరమై, అందరి ఆమోదమూ లభించే సందర్భాల్లో వెంటనే అందుకు చర్య తీసుకోవచ్చని సూచించింది. ఏమైనా ఒరిస్సా, బేరార్ ఉప రాష్ట్రాలను మాత్రం వాయిదావేయకుండా త్వరలోనే ఏర్పాటుచేయవచ్చుననీ భేషైన సిఫారసు చేసింది.
ఇది విన్న ఆంధ్రుల గుండెల్లో రాయి పడింది. ప్రత్యేక రాష్ట్రంకోసం ఒరిస్సాకంటే ఎక్కువ హడావుడి మన దగ్గరే జరిగింది. జాతీయ స్థాయి గల ప్రముఖ నాయకులు రాష్ట్రంకోసం నడుముకట్టటం, జిల్లా జిల్లాలో సభలు పెట్టటం, వేదికలపైనా పత్రికల నిండా చర్చల మీద చర్చలు చెయ్యటం, ప్రజాభిప్రాయాన్ని కూడగట్టటం వగైరాలు అన్నిట్లోనూ మనమే ఫస్టు. కాని అనుకున్నది సాధించటం దగ్గరికి వచ్చేసరికి ఒరిస్సా పాటి చెయ్యలేకపోయాం. అందివచ్చిందనుకున్న బంగరు అవకాశం అలా చేజారిపోయింది.
అది మనకు కలిగిన మొట్టమొదటి ఆశాభంగం.