ఎం.వి.ఆర్ శాస్త్రి గారు ఆంధ్ర భూమి ఆదివారం అనుబంధం లో సీరియల్ గా ప్రచురిస్తున్న ఆంధ్రుల కథ యదాతథం గా..
కొండావారి బండారం(June 24th, 2011)
భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరిగినట్టు కాంగ్రెస్
రాజకీయం కూడా తన చుట్టు తాను తిరుగుతూ అధిష్ఠానం చుట్టూ తిరుగుతుంది.
ఏ విషయంలోనైనా అధిష్ఠానం నంది అంటే నంది, పంది అంటే పంది. నాటినుంచి నేటిదాకా ఎప్పుడూ ఇదే కథ.
పరిస్థితులు చక్కబడేదాకా కనీసం ఐదేళ్లు తెలంగాణను విడిగా ఉండనివ్వడం మేలనడానికి బలమైన కారణాలను ధేబర్‌కి పంపిన రిపోర్టులో అంత బాగా పేర్కొన్న బూర్గుల మళ్లీ మూడోనాటికల్లా తన వాదనను తానే మింగేసి విశాలాంధ్రకు ఎందుకు జైకొట్టాడు?
తెలంగాణను విడిగా ఉంచటం మేలన్నది తెలంగాణ నాడిని పట్టుకోగలిగిన తెలంగాణ ప్రజానాయకుడిగా రామకృష్ణారావు మనసులోని మాట. అది వెలిబుచ్చి నెల తిరగకుండా ఆంధ్ర, తెలంగాణలను వెంటనే ఏకం చేయాలంటూ హైదరాబాద్ శాసనసభలో ఆయనే తీర్మానం ప్రతిపాదించి, విశాలాంధ్రకోసం అందరికంటే గట్టిగా వాదించింది ఢిల్లీ పెద్దల మనసు ఎరిగి! వారు ఎప్పుడు ఏది కావాలనుకుంటే దానికి తల ఊపడమే తప్ప స్వతంత్రించి తల ఎగరేస్తే తల నిలవదని తెలిసి!
తెలంగాణ రాజకీయాల్లో బూర్గుల మొదటినుంచీ మితవాది. తిరుగుబాట్లు, వీధి పోరాటాలు ఆయన పెద్దమనిషి తరహాకు సరిపడవు. స్వప్రయోజనాల దృష్టితో చూసినా ప్రత్యేక తెలంగాణవల్ల ఆయనకు ఒరిగేది లేదు. ఉమ్మడి హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయన. నిజమేకానీ అందులో ఏ ముక్కకాముక్క పక్క రాష్ట్రంలో కలిశాక మిగిలే తెలంగాణకు తాను ముఖ్యమంత్రి కాగలనన్న ఆశ బూర్గులకు ఏ కోశానా లేదు. తెలంగాణలో బలమైన రెడ్డి వర్గం అప్పటికే ఆయనపై కత్తులు నూరుతూ, వేటువేసే సమయంకోసం కాచుకుని ఉన్నది.
అలాగని తెలంగాణను తీసుకుపోయి ఆంధ్రలో కలిపినా బూర్గులకు ఒళ్లో పడేది ఏమీ ఉండదు. విశాల ఆంధ్రకు ఆయన ముఖ్యమంత్రి కావటం కలలో కూడా జరగదు. ఆ సంగతి బూర్గులకు తెలుసు. ‘బూర్గుల రామకృష్ణారావు’ గ్రంథంలో ఉమ్మెత్తల కేశవరావు ఉటంకించినట్టు.
‘‘ఒక సీనియర్ కేంద్రమంత్రి శ్రీరామకృష్ణారావును ‘మీ ప్రతిపాదనకు మూలకారణమేమి’టని సూటిగా ప్రశ్నింపగా ‘హైదరాబాదు ముక్కలై, ప్రక్క రాష్టమ్రులలో విలీనమైనపుడే అవి ఒక విశిష్టతగల భాగాలుగా వుండిపోగలవు. అపుడు నేను ముఖ్యమంత్రిగా ఉండను. నా ఈ సంతకం నా రాజకీయ మరణానికి వారంటు’ అని నిర్మొహమాటంగా నిర్లిప్తంగా జవాబు ఇచ్చిరి.’’ (పే.78)
అటైనా, ఇటైనా తనకు భవిష్యత్తు లేదనుకున్నప్పుడు పెద్దవాళ్లతో గొడవ ఎందుకు, వాళ్లు ఎటు అంటే తానూ అటే మొగ్గితే పోలేదా అని బూర్గుల భావించి ఉండవచ్చు. ఎలాగూ రాని పదవికి పందెం వేసేకన్నా కన్సొలేషన్‌గా పైవాళ్లు ఇవ్వజూపిన కేరళ గవర్నర్ గిరీని అందుకుని మర్యాదగా నిష్క్రమించడం మేలన్నది ఆయన ఆలోచన కావచ్చు.
అదీగాక- ధేబర్‌కు రాసిన లేఖలో తెలంగాణను వేరుగా ఉంచటం ఎందువల్ల సమంజసమన్న కారణాలను గట్టిగా పేర్కొన్నాడే తప్ప అలా ఉంచి తీరాలని బూర్గుల ఎక్కడా అనలేదు. ‘అంతా మీ ఇష్టం. అన్నీ ఆలోచించి మీరు ఎలా నిర్ణయించినా సరే’ అనే ఆ లేఖలో ఆయన ముక్తాయించాడు. కాబట్టి ఢిల్లీ అభీష్టం తెలిశాక ఆయనా ఆ ప్రకారమే వ్యవహరించటంలో అనౌచిత్యం పెద్దగా లేదు. పైగా... అంతకుముందు కూడా ఆయన విశాలాంధ్ర వేదికపై పాల్గొన్నవాడే కనుక కడకు విశాలాంధ్రకే ఓటు వేయటంలో నిర్ఘాంతపోవలసింది ఏమీలేదు.
మరి- ప్రత్యేక తెలంగాణకోసం దిక్కులదిరేలా హడావుడి చేసిన మహానాయకుల సంగతేమిటి? వారు గొంతు చించుకున్న తెలంగాణకు వారు ఎంత న్యాయం చేశారు?
మనం మాట్లాడుతున్న కాలాన తెలంగాణలో రెడ్ల ప్రాబల్యానికి తిరుగులేదు. ఆ రెడ్డివర్గానికి తిరుగులేని నాయకులు కె.వి.రంగారెడ్డి, ఆయన అల్లుడు మర్రి చెన్నారెడ్డి. హైదరాబాదు రాష్ట్ర కాంగ్రెసులో వీరి ప్రాబల్యం ఎంత అంటే- అవసరమైతే అధిష్ఠాన నిర్ణయానే్న సవాలుచేయగలిగేటంత! ఉదాహరణకు 1954 డిసెంబరులో జరిగిన హైదరాబాద్ పి.సి.సి. అధ్యక్ష ఎన్నికల్లో అధిష్ఠానవర్గం నిలబెట్టిన మల్లప్ప కొల్లూరును పట్టుబట్టి ఓడగొట్టి తమవాడైన జె.వి.నరసింగరావును గెలిపించుకోగలిగిన శక్తిమంతులు రంగా-చెన్నా రెడిద్వయం.
మరి అంతటి బలాఢ్యులు తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రంకోసం చేసిందేమిటి? సాధించిందేమిటి?
అదీ కె.వి.రంగారెడ్డినే అడుగుదాం:
‘‘పండిత నెహ్రూగారు నాగార్జునసాగరు శంకుస్థాపనకు హైదరాబాదు రాగా, బేగంపేట విమానాశ్రయమునుండి నగరములో వారి బసవరకూ, వారి బసనుండి నగరములో వారికెక్కడెక్కడ ఎంగేజిమెంట్సు ఉండెనో ఆ రోడ్లమీద వరుసగా, కాగితపు అట్టలు (ప్లకార్డులు), బట్టల జండాలు (బానర్లు) ‘‘ప్రత్యేక తెలంగాణ స్టేటు కావాలి’’ అని నినాదములతో బ్రహ్మాండముగా ప్రచారము చేసితిమి. విశాలాంధ్ర కోరేవారు ధైర్యము లేక జాడలేకుండ పోయిరి. నూటికి 95కంటే మించి ప్రత్యేక తెలంగాణము కోరువారు అయినారు...
‘‘అప్పుడు బొంబాయి ప్రదేశ్ కాంగ్రెసు అధ్యక్షుడుగానున్న శ్రీ యస్.కె.పాటిల్, మరియు అఖిల భారత కాంగ్రెసు ఆఫీసు కార్యదర్శిగార్లు ఇద్దరు రహస్యముగా ప్రజాభిప్రాయమును కనుగొనుటకు హైదరాబాదు వచ్చిరి. వారు రహస్యముగా తెలంగాణ జిల్లాలలో పర్యటించి... ప్రత్యేక తెలంగాణము కోరేవారే చాలా ఎక్కువగా నున్నట్లు వీరిద్దరు రిపోర్టు చేసిరి.
‘‘కొన్నాళ్ల తరువాత శ్రీ నెహ్రూ మమ్ములను ఢిల్లీకి రమ్మని ఆదేశించినట్లు ధేబర్‌గారు తెలిపిరి. నేను, శ్రీయుతులు బి.రామకృష్ణారావు, జె.వి.నరసింగరావు, డాక్టర్ చెన్నారెడ్డి ఢిల్లీ వెళ్ళితిమి... శ్రీ నెహ్రూ నన్ను తన ప్రక్కన కూర్చుండబెట్టుకుని అందరికీ అల్పాహారవిందు ఇచ్చి ‘‘రెడ్డిగారూ, తెలంగాణ సమస్య ఎంతవరకు వచ్చింది’’ అని అడిగిరి. నేను ‘నూటికి 90 మంది తెలంగాణమును ఆంధ్రకు కలిపి ఒక స్టేటుగా చేయుటకు వ్యతిరేకముగా ఉన్నారు.’’ అని చెప్పితిని. వారు ఆశ్చర్యముతో ‘‘నూటికి 90 మంది. నూటికి 90 మంది!’’ అనిరి. ‘‘నేను భయపడుతూ 90 అన్నాను. కాని నూటికి 95 మంది వ్యతిరేకముగా నున్నారు,’’ అని మరల చెప్పితిని. మళ్లీవారు ‘‘నూటికి 95 మంది, నూటికి 95 మందియా!’’ అని ఆశ్చర్యమును వెలిబుచ్చిరి.
స్వీయ చరిత్ర, కె.వి.రంగారెడ్డి, పే.144-146
నూటికి 95 మంథి ప్రజలు ప్రత్యేక తెలంగాణను కోరుతున్నారని అంత కచ్చితంగా చెప్పగలిగిన ఆ ప్రజానాయకుడు మరి ఆ ప్రజల అభిమతాన్ని మార్చటానికి ఎంత దృఢంగా నిలబడ్డాడు?
తెలంగాణ గుండె చప్పుడును వినగలిగింది, తెలంగాణ వేరుగా ఉండాలని కోరుకున్నది మామా అల్లుళ్లు ఇద్దరు మాత్రమే కాదు. ఫజలాలీ కమిషన్ సిఫారసులు వెలువడగానే తెలంగాణ అంతటా ప్రత్యేక రాష్ట్రం డిమాండు ముమ్మరమైంది. తెలంగాణలోని 10 కాంగ్రెసు కమిటీల్లో 7 తెలంగాణ రాష్ట్రం కావాలని తీర్మానించాయి. తెలంగాణలోని 105 మంది కాంగ్రెసు డెలిగేట్లలో 73 మంది, తెలంగాణ ప్రాంతానికి చెందిన 10 మంది పార్లమెంటు సభ్యులు అదే మాటమీద ఉన్నారు. తెలంగాణలో నూటికి 90 మంది ప్రజలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని శాశ్వతంగా ఆకాంక్షిస్తున్నట్టు అఖిలపక్ష తెలంగాణ మహాసభ తీర్మానించింది. ఆ సమయాన రాజమండ్రిలో జరపదలిచిన విశాలాంధ్ర మహాసభకు హైదరాబాద్ కాంగ్రెసు వాదులెవరూ హాజరుకారాదని హైదరాబాద్ పి.సి.సి. నిషేధించింది. దాంతో ఆ మహాసభనే వాయిదా వేసుకోవలసి వచ్చింది.
ఫజలాలీ నివేదిక అందాక రాష్ట్రాల పునర్విభజన సమస్యను పరిశీలించడంకోసం కాంగ్రెస్ అధ్యక్షుడు ధేబర్, ప్రధాని నెహ్రూ, హోంమంత్రి పంత్, వౌలానా ఆజాద్‌లతో 1955 నవంబరులో ఒక సబ్ కమిటీ ఏర్పాటైంది. నెహ్రూ, పాటిల్, కట్జు, లాల్‌బహదూర్‌శాస్ర్తీ వంటి అగ్ర నాయకులు 1955 డిసెంబరు, 1956 జనవరి నెలల్లో తెలంగాణలో పర్యటించారు. అప్పటిదాకా హైదరాబాద్ రాష్ట్రాన్ని విడగొట్టకూడదని వాదిస్తూ వచ్చిన నెహ్రూ కూడా ప్రజాభిప్రాయం గమనించాక ఎస్సార్సీ నివేదిక సామంజస్యాన్ని గ్రహించాడు.
అయితే- అది హైదరాబాద్ రాష్ట్రాన్ని మూడు చెక్కలుగా విడగొట్టాలన్న ఎస్సార్సీ సిఫారసు వరకే! అలా విడగొట్టాక తెలంగాణ చెక్కను మాత్రం పొరుగు ఆంధ్ర రాష్ట్రంలో వెంటనే కలపకూడదు; ఐదేళ్లపాటు విడిగా ఉండనివ్వాలి- అన్న ఎస్సార్సీ సిఫారసు రెండో భాగం మాత్రం నెహ్రూకి ఎందుకో నచ్చలేదు. విడగొట్టటమంటూ జరిగాక ఐదేళ్లు ఆగటమెందుకు, వెంటనే తెలంగాణను ఆంధ్రలో కలపటమే మేలని ఆయన భావించినట్టుంది.
దీనికి తగ్గట్టు విశాలాంధ్రకు అనుకూలంగా ఇరు ప్రాంతాల్లోనూ పెద్దఎత్తున కదలిక మొదలైంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటుచేసేటట్లయితే అందుకు నిరసనగా తమ శాసన సభ్యత్వాలకు రాజీనామా ఇచ్చి, ప్రజలముందుకు వెళ్లగలమని పీపుల్స్ డెమాక్రటిక్ ఫ్రంట్ (పి.డి.ఎఫ్.) నాయకులు బెదిరించారు. పి.డి.ఎఫ్., సి.పి.ఐ, కిసాన్ సభ నాయకులు హైదరాబాద్ ముఖ్యమంత్రిని కలిసి వెంటనే విశాలాంధ్ర ఏర్పరచాలని డిమాండు చేశారు. తెలంగాణలోని విశాలాంధ్రవాదులు 1955 నవంబర్ 3న మీర్ అహ్మద్ అలీఖాన్ అధ్యక్షతన హైదరాబాదులో సమావేశమై విశాలాంధ్ర కావాలని తీర్మానించారు. గతంలో హైదరాబాదును విడగొట్టరాదని వాదించిన వారిలో పలువురు విశాలాంధ్రను బలపరిచారు. తెలంగాణ వివిధ ప్రాంతాల్లో విశాలాంధ్ర మహాసభలు జరగసాగాయి. విశాలాంధ్ర మహాసభ, తెలంగాణ కమ్యూనిస్టు పార్టీ, ఆంధ్ర కమ్యూనిస్టు పార్టీల పనుపున ప్రతినిధి వర్గాలు ఢిల్లీకి వెళ్లి నెహ్రూకు, ఇతర కేంద్ర నాయకులకు విశాలాంధ్ర వాదాన్ని గట్టిగా వినిపించాయి.
ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ రాష్ట్ర అసెంబ్లీ ఎస్.ఆర్.సి. నివేదికపై ఆధికారిక తీర్మానాన్ని 1955 నవంబరు 25నుంచి డిసెంబరు 3వరకు చర్చించింది. సభలో స్పీకర్ కాక మొత్తం సభ్యులు 174 మందిలో 147 మంది తమ అభిప్రాయాలను తెలిపారు. వారిలో 103 మంది విశాలాంధ్రను సమర్థించారు. 29 మంది తెలంగాణకు అనుకూలత తెలిపారు. 15 మంది తటస్థంగా ఉన్నారు.
ఇక్కడో సంగతి గమనించాలి. పైన పేర్కొన్నది మరట్వాడా, కర్నాటక సభ్యులు సైతం కలిసి ఉన్న హైదరాబాద్ అసెంబ్లీలో చర్చ వివరాలను. కేవలం తెలంగాణ సభ్యులవరకే చూస్తే అసెంబ్లీలో మొత్తం సభ్యులు 85 మంది. వారిలో 59 మంది విశాలాంధ్ర వైపు మొగ్గారు. 25 మంది ప్రత్యేక తెలంగాణను బలపరిచారు. ఒకరు తటస్థంగా ఉన్నారు. అంటే హైదరాబాద్ స్టేటు మొత్తంగా చూసినా, అందులో తెలంగాణ సభ్యులవరకే లెక్కచూసినా లెజిస్లేటర్లలో అత్యధికులు విశాలాంధ్రను సమర్థించారు.
అసెంబ్లీ చర్చ సరళినిబట్టి తెలంగాణ లెజిస్లేటర్లలో నూటికి 70 మంది ప్రత్యేక రాష్ట్రం వద్దు; విశాలాంధ్రే కావాలి అని కోరుతున్నారు. కె.వి.రంగారెడ్డిగారేమో తెలంగాణ ప్రజల్లో నూటికి 95 మంది ప్రత్యేక రాష్ట్రం కోరుతున్నట్టు చెబుతున్నారు. ఆయనలాంటివారు వక్కాణిస్తున్న ప్రజాభిప్రాయానికీ, ప్రజాప్రతినిధుల అభిమతానికి విపరీత వ్యత్యాసం కనపడటంతో ఏమిచేయాలో పాలుపోక తెలంగాణ విషయం ఎటూ తేల్చకుండా అధిష్ఠానం పక్కన పెట్టింది. తెలంగాణను ఆంధ్రతో కలపడాన్ని వౌలానా అబుల్‌కలాం ఆజాద్ మొదటినుంచీ గట్టిగా వ్యతిరేకిస్తుండటంవల్ల, ఏకాభిప్రాయానికి రావటం హైకమాండుకూ కష్టమవటం కూడా ఈ సాచివేతకు కారణమై ఉండవచ్చు.
అప్పటికే ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీ తెలంగాణతో తక్షణ విలీనాన్ని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఆంధ్రలోనూ, తెలంగాణలోనూ, ఢిల్లీలోనూ విశాలాంధ్రవాదుల ముమ్మర ప్రచార ప్రభావంవల్లే కావచ్చు. మనకు తెలియని ఇతర కారణాలవల్లా కావచ్చు. నెహ్రూగారికి మనసులో విశాల ఆంధ్ర రాష్ట్రం వెంటనే ఇచ్చేయటం మేలన్న అభిప్రాయం నాటుకుంది. ఐనా- తమ రహస్య అభిప్రాయ సేకరణల్లో తెలంగాణ జనం ప్రత్యేక రాష్ట్రం వైపు మొగ్గుతున్నట్టు తేలింది కనుక ఏమిచేస్తే ఏమి తంటానోనన్న సంకోచంతో అధిష్ఠానం తుది నిర్ణయాన్ని వాయిదావేసి ఉండవచ్చు.
ఇదీ 1956 ఆరంభంలో ఉన్న స్థితి. తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం కావాలనుకుంటున్న వారందరూ గట్టిగా ఒక పట్టుపట్టి అధిష్ఠానాన్ని ఒత్తిడి పెడితే తప్ప ఫలితం దక్కదు. లక్ష్యం సాధించటానికి అటువంటి అదను మళ్లీరాదు. మరి- నాటి తెలంగాణ అగ్రనాయకుడు, నూటికి 95 మంది ప్రజలు ప్రత్యేక తెలంగాణను కోరుతున్నారని ప్రధాని నెహ్రూ మొహంమీదే చెప్పగలిగినవాడూ, కులబలం, అంగబలం, అర్థ బలం దండిగా ఉన్నవాడూ అయిన కొండావారు ఏమిచేశారు? ఎస్సార్సీ చెప్పినదాన్ని మన్నించి తెలంగాణను విడిగా ఉండనివ్వాల్సిందేనని పంతం పట్టారా? నెహ్రూను తన దారికి తెచ్చుకోవడానికి ప్రజల పక్షాన సర్వశక్తులూ ఒడ్డారా?
లేదు. తానే నెహ్రూ దారికి ఎలా వెళ్లగలనా అని బుర్రబద్దలు కొట్టుకున్నారు. ఏమిచేస్తే తెలంగాణ మడికి మడి; విశాలాంధ్ర సుఖానికి సుఖం దక్కగలదా అని తీవ్రంగా యోచించారు. ఆలోచించి చించి చివరికి కావలసిన కిటుకు కనుక్కున్నారు.
అదేమిటో వచ్చేవారం. *