ఆంధ్రుల కథ - 8

ఎం.వి.ఆర్ శాస్త్రి గారు ఆంధ్ర భూమి ఆదివారం అనుబంధం లో సీరియల్ గా ప్రచురిస్తున్న ఆంధ్రుల కథ యదాతథం గా..

మొట్టమొదటి తప్పటడుగు.... (June 13th, 2010)

ఇల్లలికే సందడిలో పడి తన పేరేమిటో మరచిపోయిందట వెనకటికో ఈగ. ఆంధ్రా నేతాశ్రీలదీ అదే వరస!
ఏ స్థాయి ఉద్యమానికి ఆ స్థాయి నాయకులు ఉంటే పనులు సవ్యంగా సాగుతాయి. రాష్ట్రాన్ని సాధించాలన్న ఉద్యమాన్ని రాష్టస్థ్రాయి పెద్దలు నడిపిస్తే వారి ధ్యాస ఎంతసేపూ ఆ రాష్ట్రంమీదే నిలుస్తుంది. వారి రాజకీయాలు, వారి కార్యకలాపాలు దాని చుట్టూనే తిరుగుతాయి. పనులూ త్వరగా తెములుతాయ. అదే నేషనల్ లెవెల్ లీడర్లకు రాష్ట్ర లేక ఉప రాష్టస్థ్రాయి ఉద్యమ బాధ్యత అప్పగిస్తే వారి ఆలోచనలు ఏ కాడికీ పై ఎత్తునే చక్కర్లు కొడుతుంటాయి. వారిని నమ్ముకున్న జనానికి నిట్టూర్పే మిగులుతుంది. ఆంధ్ర రాష్ట్రోద్యమానిదీ అదే అవస్థ.
ఆంధ్ర నాయకులు ఆషామాషీ మనుషులు కారు. మోహన్‌దాస్ గాంధీ క్లాసు పుస్తకాలు బుద్ధిగా చదువుకుంటున్న రోజుల్లోనే మనవాళ్లు రాజకీయాల్లో తిరిగారు. 1885లో భారత జాతీయ కాంగ్రెసు పుట్టిన తొలి మహాసభలో గుత్తినుంచి కేశవపిళ్లె ప్రతినిధిగా హాజరయ్యాడు. 1891నాటికే మన పనప్పాకం ఆనందాచార్యులు జాతీయ కాంగ్రెసు అధ్యక్ష పీఠాన్ని అధిష్ఠించాడు. ఆంధ్రోద్యమం కళ్లు తెరవకముందే న్యాపతి సుబ్బారావు ఆలిండియా కాంగ్రెసు ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు.
ఆరోజుల్లో మద్రాసు రాష్ట్రం మొత్తానికి ఒకే పి.సి.సి ఉండేది. విశాల ఆంధ్ర ప్రాంతమూ ఆ రాష్ట్రంలో భాగం కనుక రాష్ట్ర కాంగ్రెసు కమిటీలో తమకూ ప్రాతినిధ్యం ఉండాలని ఆంధ్రులు సహజంగానే ఆశిస్తారు. తమిళుల అనుచిత ప్రాబల్యానికి నిరసనగా ఆంధ్రోద్యమం మొదలయ్యాక ఈ రకమైన ఆలోచన ఇంకా ఎక్కువైంది. 1914లో మద్రాసులో జరిగిన అఖిల భారత కాంగ్రెసు మహాసభకు ఆంధ్ర దేశం నుంచి 256 మంది ప్రతినిధులు వెళ్లారు. అయినా కాంగ్రెసు వర్కింగు కమిటీలో గాని, ఆఫీస్ బేరర్లలో గాని ఒక్క ఆంధ్రుడికీ చోటులేకపోయింది. కనీసం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం విషయాన్ని ప్రస్తావించడానికైనా ఒప్పుకున్నారా? సభలో ఆ ఊసు ఎత్తీఎత్తగానే అరవలనుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది.
మరుసటి సంవత్సరం (1915లో) నెల్లూరులో జరిగిన మద్రాసు రాష్ట్ర కాంగ్రెసు సభలోనూ ఆంధ్ర రాష్ట్రంపై చర్చకు గుత్తిలో స్థిరపడ్డ తమిళుడు కేశవపిళ్లె, నంద్యాల వాస్తవ్యుడైన ఇంకో తమిళుడు ఏకాంబర అయ్యర్ అడ్డంపడ్డారు. ఇలాంటి అనుభవాలు ఇంకా కొన్ని అయ్యాక అరవలతో వేగలేమని, వారితో పొత్తులేకుండా ఆంధ్ర ప్రాంతానికి విడిగా ఒక ప్రత్యేక కాంగ్రెసు శాఖ కావాలని ఆంధ్రులు అడగసాగారు. ఒకటికంటే ఎక్కువ శాఖలున్న బీహారు, ఒరిస్సా రాష్ట్రాలను ఉదాహరణగా ఎత్తిచూపారు. భవిష్యత్తులో ప్రత్యేక రాష్ట్ర సాధనకు ఉపకరిస్తుందన్న ఉద్దేశంతో 1916లో ఆంధ్ర మహాసభ చతుర్థ సమావేశం కూడా ప్రత్యేక కాంగ్రెసు శాఖను కోరుతూ తీర్మానించింది. ‘్భరత రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ’ గురించి పట్ట్భా సీతారామయ్య చక్కని కరపత్రం ప్రచురించి కాంగ్రెసు వారందరికీ పంచాడు. ఆ సంవత్సరం డిసెంబరులో జరిగిన లక్నో కాంగ్రెసులో ఆంధ్రులు ఈ విషయాన్ని కదిపారు. ఆ సంగతేదో చూడమని ఎఐసిసికి కాంగ్రెసు పెద్దలు రిఫర్ చేశారు. మద్రాసు ప్రెసిడెన్సీలో తెలుగు మాట్లాడే జిల్లాలను ప్రత్యేక కాంగ్రెసు రాష్ట్రంగా పరిగణించవచ్చునని ఎఐసిసి సిఫారసు చేసింది.
దానిమీద మరుసటి ఏడు (1917) కలకత్తా కాంగ్రెసు సబ్జెక్ట్స్ కమిటీలో పెద్ద గొడవ అయింది. యథాప్రకారం తమిళులు వ్యతిరేకించారు. పట్ట్భా సీతారామయ్య ఎంత వాదించినా ప్రయోజనం లేకపోయింది. జైలునుంచి విడుదలై ఆ ఏటి కాంగ్రెసు అధ్యక్షురాలైన అనీబిసెంట్ సైతం ఆ ప్రతిపాదనను ప్రతిఘటించింది. ఆఖరికి గాంధీ మహాత్ముడు కూడా వద్దనే అన్నాడు. మాంటేగు త్వరలో దేశానికి రానున్నాడు, రాజ్యాంగ సంస్కరణలేవో జరగనున్నాయి కదా, అదేదో అయ్యాకే ఆంధ్రకు ప్రత్యేక కాంగ్రెసు సర్కిల్ విషయం ఆలోచించవచ్చులెమ్మన్నాడు ఆయన. ఆ సమయాన లోకమాన్య తిలక్ కలగజేసుకుని మాంటేగు రాకకు, ఆంధ్రా కాంగ్రెసు సర్కిలుకూ సంబంధం ఏమిటి, దానికోసం అత్యవసరమైన ఈ ఏర్పాటు ఎందుకు ఆగాలి అని నిలదీశాకగానీ గాంధీగారు సరే అనలేదు. హోరాహోరీగా వాగ్వాదాల తరవాత ఆంధ్రకు ప్రత్యేక కాంగ్రెసు శాఖ ఏర్పాటైంది.
కలకత్తానుంచి తిరిగి రాగానే బెజవాడ టౌన్‌హాలులో తెలుగు జిల్లాల ప్రతినిధులు సభ చేసి జాతీయ కాంగ్రెసు అనుమతించిన ప్రకారం గంజాం, విశాఖపట్నం, గోదావరి, కృష్ణ, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం బళ్లారి జిల్లాలకు కలిపి ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెసు కమిటీని ఏర్పాటుచేశారు. కొత్త పిసిసికి అధ్యక్షుడిగా న్యాపతి సుబ్బారావును, కార్యదర్శిగా కొండ వెంకటప్పయ్యను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. తెలుగు మాట్లాడేవారు పెద్ద సంఖ్యలో ఉన్న మద్రాసు జిల్లాను కూడా ఆంధ్ర పి.సి.సిలో కలపాలని తీర్మానం చేశారు.
అరవలు అడ్డుపడ్డా, మహాత్ముడే వద్దన్నా పట్టుబట్టి అనుకున్నది సాధించామని నాయకులు ఆనందించారు. తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టారని ప్రజలూ సంతోషించారు. మాంటేగు వరమివ్వకపోయినా, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని పొందలేకపోయినా కనీసం జాతికి ప్రాతినిధ్యం వహించే జాతీయ కాంగ్రెసు వారినుంచి ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తి పొందాముకదా అదే గొప్ప అదృష్టం అని మనవాళ్లు మురిసిపోయారు. రాష్ట్ర కాంగ్రెసు అండదండలతో, మహాత్ముడి దీవెనతో ఇక ఆంధ్రోద్యమం పంచకల్యాణి గుర్రంలా పరుగుతీయగలదని, అవసరమైతే సర్కారు మెడలువంచైనా ఆంధ్ర రాష్ట్రం అవలీలగా సాధిస్తామని ఆంధ్ర మహాజనులు ఆశపెట్టుకున్నారు.
అక్కడే మోసపోయారు. సాధించామనుకున్న విజయమే వాస్తవానికి శాపమనీ... కొండంత అండ అనుకున్నదే ఆంధ్రోద్యమానికి గుదిబండ అవుతుందనీ ఎవరూ ఊహించలేకపోయారు.
అసలు విషయం వడ్లగింజలో బియ్యపు గింజ.
కాంగ్రెసు అనేది రాజకీయ సంస్థ. పేరు భారత జాతీయ కాంగ్రెస్ అయినా, జాతీయోద్యమానికి అగ్రగామి అయినా నాయకత్వం వహించేది ఎంతటి మహాత్ములైనా, దానిది ప్రధానంగా రాజకీయ స్వభావం. దాని నాయకులు ఎంత సాత్వికులు, ఎంత అహింసామూర్తులు అయినా దేశమేలే పరాయి ప్రభుత్వానికి అది ఎప్పటికీ పక్కలో బల్లెమే. కాబట్టి దానిలో పాల్గొనేవారిని విదేశీ పాలకులు అపనమ్మకంతోనే చూస్తారు. వీలుచిక్కితే సతాయించాలనే ప్రయత్నిస్తారు. ఆ సంగతి అందరికీ తెలుసు. కాబట్టి లోలోన ఎంత సానుభూతి ఉన్నా, సర్కారువారి ఆగ్రహానికి ఎక్కడ గురికావలసి వస్తుందోనన్న భయంతో ప్రభుత్వోద్యోగులు, సామాన్య గృహస్థులు, ఇతర వర్గాలవారు చాలామంది కాంగ్రెసు కార్యకలాపాలకు దూరంగా ఉంటారు. దేశభక్తి ఉన్నప్పటికీ కాంగ్రెసు విధానాలు, పోకడలు సరిపడనివారు కూడా ఆ సంస్థ తెరువుపోరు.
మరి ఆంధ్ర మహాసభో? మొత్తం తెలుగువారి భాషను, సంస్కృతిని, సామాజిక అభ్యున్నతిని సంరక్షించటం దాని ధ్యేయం. కాబట్టి రాజకీయ విభేదాలకు అతీతంగా తెలుగు ప్రజలందరికీ అది ప్రాతినిధ్యం వహిస్తుంది. ప్రత్యేక రాష్ట్రం కావాలన్నది రాజకీయ డిమాండే. ప్రభుత్వాన్ని గట్టిగా అడిగి, అవసరమైతే ఉద్యమం నడిపి సాధించవలసినదే. అయినా ఆ డిమాండులో భారత ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేది, తన భవిష్యత్తు ఏమవుతుందా అని సర్కారును ఆందోళన కలిగించేది ఏమీలేదు. కాబట్టి సమాజంలోని అన్ని వర్గాల సామాన్యులు, కాంగ్రెసు అంటే సరిపడనివారు, రాజకీయ పోరాటాలకు ఆమడ దూరంలో ఉండేవారు కూడా ఆంధ్ర మహాసభలో నిర్భయంగా, నిస్సంకోచంగా పాలుపంచుకొనగలరు.
అంటే అర్థం- ఆంధ్ర మహాసభ, ఆంధ్ర కాంగ్రెసుల పరిధి, పని వేరువేరు అనే కదా? ఆంధ్రోద్యమానికి సంబంధించినవరకూ కాంగ్రెసు కంటే కూడా ఆంధ్ర మహాసభ విస్తృతమైన వేదిక అనే కదా? దానిలో దీనిలో నాయకత్వం వహించేవారు ఒకరే అయినా, వారికీ వీరికి కూడా ఆరాధ్యుడు ‘దేవుడిలాంటి గాంధీ’యే అయినా దేనిపని అది దేని పద్ధతిలో అది పనిచేసుకుపోవాలి కదా? కలగాపులగం చెయ్యకుండా రెంటిమధ్య విభజన రేఖను స్పష్టంగా గుర్తించి, కచ్చితంగా పాటించినప్పుడే రెండిటినుంచీ గరిష్ఠ ప్రయోజనం పొందడం ప్రజలకు వీలవుతుంది కదా?
కనీస లోకజ్ఞానం ఉన్న వారెవరైనా ఇందుకు ఔననే అంటారు. దురదృష్టవశాత్తూ మహామేధావులు, అఖండ ప్రజ్ఞాశాలురు అయిన మన మహానాయకులకు ఈ చిన్న కామన్‌సెన్స్ పాయింటే బుర్రకెక్కలేదు. దానివల్ల ఏమైంది? ఆంధ్ర కాంగ్రెసే ఏర్పడ్డాక ఆంధ్ర మహాసభతో పని ఏమిటనుకున్నారు. నామమాత్రంగా కొనసాగనిచ్చి ఏటేటా మొక్కుబడి సభలతో సరిపెట్టారు. కాంగ్రెసు రంధిలో పడి ఆంధ్ర రాష్ట్రం మాటమరిచారు. ఆంధ్రోద్యమం కొట్టు దాదాపుగా కట్టేశారు.
అది ఆంధ్ర నాయకులు వేసిన మొట్టమొదటి తప్పటడుగు. నమ్మశక్యంగా లేదా? ఇది చదవండి:
‘‘1921 సంవత్సరము నుంచి మహాత్మాగాంధీగారు కాంగ్రెస్ నాయకత్వము వహించి దేశవ్యాప్తముగా దౌర్జన్యరాహిత్య సహాయనిరాకరణోద్యమమును ప్రజ్వరిల్ల చేయగా కాంగ్రెసు సంస్థ ప్రాముఖ్యత భరత వర్షములోనేగాక ప్రపంచమునందంతటను హెచ్చినది. ఆ మహోద్యమ ప్రారంభమునుంచి ఆంధ్ర మహాసభ ఆంధ్ర గ్రంథాలయోద్యమములు ప్రాముఖ్యమును గోల్పోయినవి. ఆ పిమ్మట ఆంధ్ర రాష్ట్ర సంపాదన బాధ్యత పూర్తిగా ఆంధ్ర రాష్ట్ర కమిటీ మీదనే పడినది. ఆంధ్ర మహాసభ స్థాపకులగు దేశభక్తి కొండా వెంకటప్పయ్య పంతులుగారు కూడా కాంగ్రెసులోనే నిమగ్నులై ఆంధ్ర మహాసభను విడిచి పెట్టిరి. ఆంధ్ర మహాసభలు దాదాపుగా ఏటేట జరుగుచు ఆంధ్ర రాష్ట్ర తీర్మానములు చేయుచునే వచ్చినవి.
(నా జీవిత కథ, అయ్యదేవర కాళేశ్వరరావు పే.243)
అసహాయోద్యమములో నేను చేరిన పిదప ఆంధ్రోద్యమమును వదలవలసి వచ్చినది. ప్రభుత్వోద్యోగములను వదలవలెననియు, శాసనసభా సభ్యత్వమును మానవలెననియు తీర్మానించి, మరల ఆంధ్ర రాష్టమ్రును స్థాపింపుడని ప్రభుత్వమును కోరుట స్వవచనవ్యాఘాతమనవలసి యున్నది. నా వలెనే కొందరు మానివేసిరి. శ్రీ జోగయ్య పంతులు మొదలగువారు స్థారుూ సంఘ సభ్యులుగనే యుండి, నా బదులు మరియొకరిని కార్యదర్శిగా నేర్పరచుకుని, మొత్తముగా దాదాపు ఏటేటను మహాసభలు సమావేశపరచుచు తీర్మానములు గావించి ప్రభుత్వమునకు పంపుచునే యుండిరి.
(స్వీయచరిత్ర, కొండ వేంకటప్పయ్య పే.225)
By the end of 1918, political tension in India grew high over the Rowlatt Act and Khilafat wrong... on 13th April, 1919 there were Punjab massacres at Jallianwala Baugh and other places. Soon the path was paved for the launching of Gandhian Non-violent Non-co-operation... ... In all this political hullabaloo, the question of an Andhra Province was almost forgotten.
[History of Andhra Movement, G.V. Subba Rao, Vol-I, P.425-26]
(1918 చివరికల్లా రౌలత్ చట్టాలు, ఖిలాఫత్ సమస్యపై ఇండియాలో రాజకీయ ఉథ్రిక్తత హెచ్చింది.... 1919 గాంధేయ అహింసాత్మక సహాయకరణోద్యమానికి దారి చక్కబడింది... ఈ రాజకీయ హడావుడిలో ఆంధ్ర రాష్ట్రం సమస్య దాదాపుగా మరపున పడింది.)
1919లో హరిసర్వోత్తమరావు అధ్యక్షతన అనంతపురంలో, 1920లో రంగనాథ ముదలియార్ అగ్రసనాధిపత్యంలో మహానందిలో కాంగ్రెస్ సభలకు సైడ్‌షోలుగా ఆంధ్ర మహాసభ సమావేశాలు పేలవంగా జరిగాయి. రాష్ట్ర కాంగ్రెస్ మహాసభలతోబాటు అదే పందిట్లో పనిలోపనిగా ఆంధ్ర మహాసభ సమావేశాలూ మొక్కుబడిగా లాగించారు. మునుపటి మహాసభలతో పోల్చితే వాటిలో ప్రతినిధుల హాజరీ బాగా తగ్గింది. తీర్మానాలూ రొడ్డకొట్టుడే.
కాంగ్రెస్ వాదులు సత్యాగ్రహాలు, శాసనోల్లంఘనల్లాంటి కార్యక్రమాల్లో బిజీ అయి, జైళ్లకు వెళ్లాక 1921 నుంచీ ఆంధ్ర మహాసభ మొత్తంగా మూలపడింది. అప్పుడు పడుకున్నది 1935 దాకా నిదరోతూనే ఉంది.
ఇదీ ఆంధ్రోద్యమ తొలి దశ బాగోతం. *