నిన్నూ, నీ మీదున్న ప్రేమనూ..నీ లాలిత్యాన్నీ,
నీ నవ్వునీ, నీ నడుమొంపునీ, నీ ఎద ప్రకోపాలనీ
...మర్చిపోనూ మరి?
మండుటెండలో, ఎడారిలో, ఇసుక తిన్నెల మధ్య
మనం నడుస్తున్నప్పటి అడుగుల జాడనూ
ఏ ఆచ్ఛాదనా లేని నిన్ను గట్టిగా కౌగిలించుకోడాన్నీ
నీ అధరాలతో ఆడుకుని, అవి కందిపోయేంతలా చేసినప్పటి క్షణాలనీ
పసుపు వర్ణమై మెరుస్తున్న నీ శరీరంలోని అణువణువునీ
నా సొంతం చేసుకోవాలన్న తపనలో, నిన్ను మనిషని మర్చిపోయి,
రాక్షసంగా ప్రవర్తించినప్పటి నీ కన్నీటి చుక్కలను
నీ కన్నీటితో తడిచిన నా పాదాలనూ,
కరగని నా మనసునూ, విరిగిన నీ ప్రేమనూ..
అన్నిటినీ, నన్నూ, నిన్నూ, సమస్తాన్నీ,..ఈ ప్రపంచాన్నే
మర్చిపోయాను...మర్చిపోతున్నాను..మర్చిపోదామని ప్రయత్సిస్తున్నాను
మరేం చేయను?
క్షణ క్షణం నువ్వు గుర్తొస్తుంటే,
నిలువునా నా గుండెనెవరో చీల్చివేస్తుంటే
గాలి పీల్చుకోడమూ సాధ్యం కాక
చీకట్లో, మురికిలో, మౌనంగా, ఒంటరిగా
ఇంకెంతమందినని బాధ పెట్టను?
ఇంకెంతకాలం భరించను ఈ బాధను?