ఎం.వి.ఆర్ శాస్త్రి గారు ఆంధ్ర భూమి ఆదివారం అనుబంధం లో సీరియల్ గా ప్రచురిస్తున్న ఆంధ్రుల కథ యదాతథం గా..
ఆంధ్ర... ఆంధ్ర... ఏ ఆంధ్ర? (May 23rd, 2010)
‘‘స్వరాజ్యము వచ్చిన పిమ్మటనైనను నైజాము రాష్టమ్రు విచ్ఛిన్నమై తెలంగాణను ఆంధ్ర జిల్లాలతో కలిపి యొక విశాలాంధ్ర రాష్టమ్రు కావలెనను భావము ఆంధ్రోద్యమములో లేదు. మదరాసు రాష్టమ్రులోని ఆంధ్ర జిల్లాలను మాత్రము విడదీసి ప్రత్యేకాంధ్ర రాష్టమ్రుగా చేయించుకొనవలెనను కృషియే ఆంధ్రోద్యమము.’’
- నా జీవిత కథ- నవ్యాంధ్రము, అయ్యదేవర కాళేశ్వరరావు, పే.243
ఆంథ్ర ప్రాంతంలో ఆంధ్రోద్యమం 1913 బాపట్ల మహాసభతో మొదలైంది. తెలంగాణలో తొమ్మిదేళ్లు ఆలస్యంగా 1922లో ఆంధ్ర మహాజన సభ ఏర్పడి ఆంధ్రోద్యమానికి నాంది పలికింది. అక్కడా ఆంధ్ర మహాసభ ఉద్యమాన్ని నడిపింది. ఇక్కడా ఆంధ్ర మహాసభే ముందుండి పోరాడింది. పేరు ఒకటే అయినా ఆ ‘సభ’, ఈ ‘సభ’ వేరువేరు. దేనిదారి దానిదే. తొలి ఆంధ్ర మహాసభలకు నైజాం ప్రాంతంనుంచి కొద్దిమంది హాజరైనా అది వ్యక్తిగత హోదాలోనే తప్ప నైజాం ప్రాంత ప్రతినిధులుగా కాదు.
నైజాం ప్రాంతాలను కూడా కలుపుకొని విశాలాంధ్ర ఏర్పడాలన్న ఆలోచన అసలే లేదని కాదు. నిజానికి గుంటూరులో ఆంధ్రోద్యమానికి మొట్టమొదట బీజావాపనం చేసిన ఉన్నవ లక్ష్మీనారాయణ, జొన్నవిత్తుల గురునాథం ప్రథమాంధ్ర మహాసభ కమిటీ పనుపున తయారుచేసిన తొట్టతొలి మాప్‌లో బ్రిటిష్ ఆంధ్ర జిల్లాలనేకాక తెలంగాణలోని తొమ్మిది జిల్లాలనూ ప్రతిపాదిత ఆంధ్ర రాష్ట్రంలో చేర్చారు. అయితే ఇది కొద్దిమంది భావుకుల సురుచిర స్వప్నంగానే చాలా ఏళ్లు మిగిలింది ఆంధ్ర, తెలంగాణల నడుమ ఐక్యకార్యాచరణకు కొన్ని దశాబ్దాల తరువాతగాని నోచుకోలేదు.
ఆంధ్ర, నైజాం ప్రాంతాల మధ్య సంబంధ బాంధవ్యాలు,. ఆత్మీయ అనుబంధాలు, పరస్పర పరిచయాలు ఆదినుంచీ అంతంత మాత్రమే. అందుకు అనేక చారిత్రక, రాజకీయ కారణాలున్నాయి. వాటి వివరాల్లోకి ఇప్పుడు పోనవసరం లేదు. ఆంధ్రోద్యమం తొలి దశలో వరసగా అనేక ఆంధ్ర మహాసభల్లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంకోసం తీర్మానించినప్పుడు అందరి మనసుల్లోనూ ప్రధానంగా ఉన్నది మద్రాస్ ప్రెసిడెన్సీలోని ఆంధ్ర జిల్లాలు మాత్రమేనన్నదే గుర్తుపెట్టుకోవలసిన పాయింటు.
నిజాం కర్కశపు ఆంక్షలు, తరతరాల ఎడబాటు, దాని పర్యవసానమైన పరాయితనం కారణంగా... నైజాంలోని తెలుగువాళ్లకు కోస్తాంధ్ర ప్రాంతంలో మొగ్గతొడిగిన ఆంధ్రోద్యమం గురించి తెలిసే అవకాశమే లేదు. కనీసం బ్రిటిషు పాలనలోని తెలుగు జిల్లాలన్నీ నిస్సంకోచంగా ఒక్కమాట మీద ఉన్నదీ లేదు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతీయులకు ఆంధ్ర రాష్ట్రంలో కలయిక విషయంలో మొదలే అనేక అనుమానాలు, అభ్యంతరాలు ఉన్నాయి. వాటిని నివృత్తిచేసి ఆంధ్ర రాష్ట్రోద్యమంలో సీమను కలుపుకొని వెళ్లటానికి చాలా సమయమే పట్టింది. సఖ్యత ఏమేరకు పొసగింది, పరస్పర విశ్వాసం ఎంతవరకు కుదిరింది, అన్నది ఆ తరవాతా సందిగ్ధంగానే మిగిలింది.
అప్పట్లో రాయలసీమను సీడెడ్ జిల్లాలనే పిలిచేవారు. 1800లో బ్రిటిషు సర్కారుకు కర్నూలు, కడప, అనంతపురం, బళ్లారి జిల్లాలను నైజాం దఖలు పరిచాడు కాబట్టి, వాటికి దత్త (సీడెడ్) మండలాలని పేరొచ్చింది. (పూర్వం ఈ ప్రాంతానికి ‘రేనాడు’, ‘మహారాజనాడు’అని కూడా పేర్లుండేవి.) కడప జిల్లాలోని కొన్ని ప్రాంతాలను, ఉత్తర ఆర్కాట్ జిల్లాలోని కొన్ని తెలుగు తాలూకాలను కలిపి 1911లో చిత్తూరు జిల్లాను ఏర్పరిచారు. విజయనగర సామ్రాజ్య కాలంలో మహావైభవాన్ని చూసిన ఈ రాయలేలిన సీమకు ‘రాయలసీమ’అని నామకరణం చేసింది- బరంపురానికి చెందిన చిలుకూరి నారాయణరావు. 1928లో నంద్యాలలో జరిగిన సీడెడ్ జిల్లాల మహాసభ ఈ పేరును ఖరారుచేసి ఇకపై ఈ ప్రాంతాన్ని రాయలసీమగా వ్యవహరించాలని నిర్ణయించింది.
ఒకే రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం కింద ఉన్నాయన్న మాటే గానీ సర్కారు ప్రాంతానికీ, సీడెడ్ జిల్లాలకూ మధ్య వైరుధ్యాలు చాలా ఉన్నాయి. రాయలనాటి వైభవం రాయలతోనే పోయి, ముస్లింల పాలనలోనూ, తరవాత తెల్లవారి పాలపడ్డాకా నానా ఇక్కట్లకు లోనై, కరువు కాటకాల పాలై సీడెడ్ ప్రాంతం అన్ని విధాల చితికింది. దుర్భర దారిద్య్రంలో మగ్గింది. అక్షరాస్యతలో, అభివృద్ధిలో సర్కారు జిల్లాలకంటే బాగా వెనకపడింది. సర్కారు ప్రాంతంకంటే ఇక్కడ ఆంధ్రేతరుల సంఖ్య హెచ్చు. అన్ని కొలువులలోనూ తమిళులదే పెత్తనం.
వీరేశలింగం వంటి సంఘ సంస్కర్తల ప్రభావాలు సర్కారు జిల్లాలను దాటి కరకు కట్టుబాట్ల ‘సీమ’కు వ్యాపించలేకపోయాయి. కొద్దిమంది భూస్వాములు, న్యాయవాదులు జాతీయ కాంగ్రెసు వార్షిక మహాసభలకు హాజరుకావడానికి మించి సీడెడ్ జిల్లాల్లో రాజకీయ కార్యకలాపాలు ఏమంత ఉండేవి కావు.
1907లో జరిగిన "Ceded Districts Young Men's Social Gathering' సీఢెడ్ జిల్లా యువజనుల సాంఘిక సమావేశమే ఈ ప్రాంతంలో సాంఘిక, రాజకీయ కదలికకు అంకురార్పణ అని చెప్పవచ్చు. అది మొదలు ఈ సమావేశాలు ప్రతి ఏటా జరిగేవి. 1913 ఏప్రిల్‌లో కర్నూలు జిల్లా మహానందిలో జరిగిన ఏడవ మహాసభకు కర్నూలు, కడప, బళ్లారి, అనంతపురం జిల్లాల నుంచి 200 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. గుత్తికి చెందిన పి.కేశవపిళ్లె దానికి అధ్యక్షుడు. మరి కొద్ది వారాల్లో బాపట్లలో ప్రథమాంధ్ర మహాసభ జరగనున్నందున మహానంది సభలో ఆంధ్రోద్యమం సహజంగానే ప్రస్తావనకు వచ్చింది. అధ్యక్షోపన్యాసంలో కేశవపిళ్లె తాను జన్మతః తమిళుడినైనా ఆంధ్రోద్యమాన్ని పూర్తిగా బలపరుస్తున్నానని, ఆంధ్ర రాష్ట్రం డిమాండు మాత్రం తనకు ఆచరణయోగ్యంగా కనపడటంలేదని అన్నాడు.
రాష్ట్ర రాజధాని అయిన మద్రాసుకు దగ్గరగా ఉన్న సీడెడ్ జిల్లాలు ఆ సౌలభ్యాన్ని వదులుకొని ఎక్కడో సర్కారు పట్టణం రాజధానిగా ఏర్పడే ఆంధ్ర రాష్ట్రంలో చేరడానికి మొదట్లో సహజంగానే ఇచ్చగించలేదు. రాజధాని దూరమవుతుందన్నది ఒకటే కాదు. విద్యావిషయకంగా, ఆర్థికంగా, సామాజికంగా సర్కారు జిల్లాలు తమకంటే ముందు ఉన్నందువల్ల ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి, అందులో తాము చేరితే సర్కారువాళ్లు తమను తొక్కేస్తారన్న భయం సీడెడ్ ప్రాంతీయులకు బాగా ఉండేది. దీనికితోడు- కొత్తగా మొదలైన ఆంధ్రోద్యమం నాయకుల్లో అత్యధికులు బ్రాహ్మణులు. విద్య, ఉద్యోగ రంగాల్లో అప్పటికే ఆ కులస్థులు చాలా ముందున్నారు. కనుక రేపు ఆంధ్ర రాష్ట్రం వచ్చినా వారే పెత్తనం చలాయంచడంవల్ల తమకు అన్యాయం జరుగుతుందన్న వెరపు కూడా సీడెడ్ జిల్లాల బ్రాహ్మణేతరుల్లో జాస్తి. వీటి తాలూకు ఛాయలు 1913లో జరిగిన బాపట్ల ప్రథమాంధ్ర మహాసభలోనే ప్రస్ఫుటమయ్యాయి. అందులో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటును కోరుతూ రామదాసు పంతులు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని గట్టిగా వ్యతిరేకించిన ముగ్గురు ప్రముఖుల్లో గుత్తి కేశవపిళ్లె ఒకరు. సీడెడ్ జిల్లాలు కలిసిరానిదే ఆంధ్ర రాష్ట్రం ఒక కొలిక్కి రాదన్న సంగతి ఇదే మహాసభలో దివాన్ బహదూర్ ముట్నూరు ఆదినారాయణయ్య చాలా ఘాటుగా నొక్కి చెప్పారు:
"I now believe that none have attended from the Ceded Districts. And how are you sure that Ganjam and Vizagapatam will join you... Will you be satisfied Gentlemen, if you find yourself rejected by Ganjam and Vizagapatam on one side and Nellore and Anantapur on the other? Your activities, your hopes, and excited imagination have to confine themselves to a portion of Godavari, Krishna and Guntur Districts...''
[History of Andhra Movement (Andhra Region), G.V.Subba Rao, Vol.I PP 375-76]
(ఈ సభకు సీడెడ్ జిల్లాల నుంచి ఎవరూ వచ్చినట్లు లేథు. గంజాం, వైజాగ్‌లు మాత్రం మీలో కలుస్తాయన్న నమ్మకం ఉందా?... ఒక చెంప గంజాం, వైజాగ్‌లు, ఇంకో వంక నెల్లూరు, అనంతపురాలు మిమ్మల్ని తిరస్కరిస్తే మీకు బాగుంటుందా? మీ కార్యకలాపాలు, మీ ఆశలు, మీ ఉద్విగ్నపు ఊహలు గోదావరి, కృష్ణా జిల్లాల ప్రాంతానికే పరిమితం కావలసి వస్తుంది.)
గట్టి ప్రతిఘటన రావటంవల్లే రాష్ట్ర తీర్మానం ఆలోచన విరమించి, రాష్ట్రం ఏర్పాటు అభిలషణీయమా కాదా అన్న దానిపై ప్రజాభిప్రాయం సేకరించటానికి బాపట్ల సభలో ఓ కమిటీని ఏర్పాటుచేసిన సంగతి ఇంతకుముందే చూశాం. ఆరు నెలల తర్వాత కార్యదర్శి కొండ వెంకటప్పయ్య, పట్ట్భా సీతారామయ్య, ముట్నూరి కృష్ణారావు, కల్లూరి సూర్యనారాయణరావులతో కూడిన కమిటీ ప్రచార నిమిత్తం రాయలసీమలో పర్యటించింది. అప్పటి ముచ్చటను వెంకటప్పయ్య మాటల్లో ఆలకించండి:
నంద్యాలలో దేశ్‌పాండ్య సుబ్బారావుగారిని కలుసుకుని ఆ యూరిలో మహాసభ సమావేశ పరిచి ఉపన్యసించిన పిమ్మట గుత్తి చేరితిమి... ఆ సాయంకాలమే మహాసభ సమావేశపరచబడెను. శ్రీ కేశవపిళ్లెగారు అధ్యక్షత వహించిరి... ఆంధ్ర రాష్ట్ర నిర్మాణావశ్యకము, దాని ప్రయోజనములను వివరించుచు మాలో ఒకరి వెనుకనొకరము ఉపన్యసించితిమి. కేశవపిళ్లెగారు నయవచనములతో మమ్ము సన్మానించుచు పల్కి, మా ఉపన్యాసములను గూర్చి ముచ్చటించిరి. రాబోవు ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించవలెనని కోరగా సంతోషముతో నంగీకరించిరి. మేము మరునాడు బయలుదేరి కడప, అనంతపురము, బళ్ళారి, హిందూపురము మొదలగు పట్టణములలో మహాసభలు గావించి ఆంధ్ర రాష్ట్ర నిర్మాణమును గూర్చి ప్రచారము చేసితిమి... కేశవపిళ్ళెగారు సానుభూతి వచనములు పలికి, రాబోవు సభకు అధ్యక్షత వహించుటకు సమ్మతించినందున రాష్ట్ర నిర్మాణ విషయమున అనుకూలురేయని యెంచి, పత్రికలకు వ్రాసితిమి. ఆయన వెంటనే తన అభిప్రాయము వ్యతిరేకముగ నున్నదని ప్రకటించిరి. ఇవి మాకు కొంత ఆశ్చర్యమును కల్పించెను.
స్వీయచరిత్ర, కొండ వెంకటప్పయ్య, పే.173-174
తమంతటివారు వెళ్లి సభలు పెట్టి, ప్రచారం చేయగానే సీడెడ్ జిల్లాల వారిలో అనుమానాలు పటాపంచలయ్యాయని- ఆయా సభల్లో కేశవపిళ్లె తమ సరసన కూచున్నాడు కనుక తథుపరి ఆంధ్రమహాసభకు అగ్రాసనాధిపత్యం తాము ఆఫర్ చెయ్యగానే ఒప్పేసుకున్నాడు కనుక పిళ్లేగారు తమ పక్షమే; ఆంధ్ర రాష్ట్రానికి ఆయనా జైకొట్టినట్టే అని ఆంధ్ర నాయకులు ఎలా అనేసుకున్నారో తెలియదు. తమ ప్రాంతానికి అతిథులుగా వచ్చిన పెద్దమనుషులతో మాట్లాడకపోయినా పిళ్లెగారు తన మనసులోని భావాలను ఏనాడూ దాచుకోలేదు. నిజానికి బాపట్ల సభనుంచి వచ్చిన కొద్దివారాలకే ‘హిందూ’ పత్రికలో పెద్ద వ్యాసం రాశాడు. ‘ఆంధ్రాలోని కొందరు ఉత్సాహవంతులు తెలుగువారికి ప్రత్యేక రాష్టమ్రంటూ వేస్తున్న కేకలను’’ విమర్శిస్తూ అందులో ఆయన ఇలా అన్నాడు:
"Well, have the Andhra Separitists taken the trouble to ascertain whether all their enthusiastic ideas would commend themselves to the Telugus in Nellore, Chittore and the four ceded Districts?... They are a less sentimental and emotional people and will calculate before courting the luxury of being tacked as the tail of the new province. Fancy, their importance being enhanced and their interests better served by their Governor and the High Court being located at the far off Rajahmundry.''
[For and against Andhra Province, PP 107-08]
(భావుంథి. కాని నెల్లూరు, చిత్తూరు, నాలుగు సీడెడ్ జిల్లాల్లోని తెలుగువాళ్లు తమ అత్యుత్సాహపు ఐడియాలన్నిటినీ సమర్థిస్తారా అన్నది తెలుసుకోవాలని ఆంధ్రా ప్రత్యేకవాదులు ప్రయత్నించారా?... వారిలాగా ఇక్కడ జనం సెంటిమెంట్లంటూ ఎమోషనల్‌గా ఇదైపోయే బాపతుకాదు. కొత్త రాష్ట్రానికి తోక అయ్యే భోగానికి అర్రులుచాచే ముందు వాళ్లు లెక్కలు వేసుకుంటారు. ఎక్కడో దూరాన రాజమండ్రిలో తమ గవర్నరు, హైకోర్టు ఉండే పక్షంలో తమ ప్రయోజనాలు నెరవేరుతాయా, తమ ప్రాముఖ్యం పెరుగుతుందా అన్నది తప్పక లోచిస్తారు.)