ఎం.వి.ఆర్ శాస్త్రి గారు ఆంధ్ర భూమి ఆదివారం అనుబంధం లో సీరియల్ గా ప్రచురిస్తున్న ఆంధ్రుల కథ యదాతథం గా..
ఆంధ్రులకు అవమానం .. (June 20th, 2010)
1921 నవంబర్ 21. సాయంత్రం.
హైదరాబాదులోని వివేకవర్ధని థియేటరులో సంఘ సంస్కార సభ సీరియస్‌గా నడుస్తున్నది. నగర ప్రముఖులందరూ అక్కడే ఉన్నారు. సామాన్య జనమూ పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అటువంటి సభ హైదరాబాదులో జరగటమే విశేషం. ముఖ్యఅతిథి ధోండే కేశవకార్వే ఇంకా పెద్ద ఆకర్షణ. ఆయన జగమెరిగిన పండితుడు- గొప్ప విద్యావేత్త. ఆయన పూనాలో తన పేరిట ఏకంగా ఒక మహిళ విశ్వవిద్యాలయానే్న స్థాపించాడు.
రెండురోజుల సంఘ సంస్కార మహాసభలో తొలిదినం సమావేశాలకు కార్వే పండితుడే అధ్యక్షత వహించాడు. చాలా భాగం మరాఠీలోనూ కొంత ఇంగ్లిషులోనూ ఆయన ప్రసంగించాడు. అది సభలోని ఆంధ్రులకు నచ్చలేదు. అయినా ఎవరూ నోరు మెదపలేదు. మలిరోజు ముగింపు సభకు శ్రీమతి సరళాదేవి చౌధురాణి అధ్యక్షురాలు. అనేక తీర్మానాలు ప్రతిపాదించాక వాటిపైన ఇంగ్లీషులోనూ, మరాఠీలోనూ, ఉర్దూలోనూ ఉపన్యాసాలు జోరుగా సాగుతున్నాయి. మొత్తం నైజాం స్టేటునుంచి ప్రతినిధులు వచ్చారు. వక్తలు మరాఠీ, కన్నడ, తెలుగు భాషల్లో మాట్లాడవచ్చునని విషయ నిర్ణయ సంఘంలో ముందే నిర్ణయించారు. అంతవరకూ బాగానే ఉంది.
ఆంధ్రుల పక్షాన సభా నిర్వహణలో ప్రముఖ పాత్ర వహించిన పెద్దలు కూడా వేదిక మీద ఆశీనులయ్యారు. మాట్లాడటానికి తమ వంతుకోసం వేచి ఉన్నారు. ముందు మాడపాటి హనుమంతరావుగారిని పిలిచారు. ఆయన లేచి తెలుగులో ఉపన్యాసం మొదలెట్టగానే కలకలం లేచింది. సభికుల్లో ఎక్కువ మంది మహారాష్ట్రులున్నారు. వారిలో ఎక్కువ మంది యువకులు. వారికి భాషా దురహంకారం జాస్తి. హైదరాబాద్ జనాభాలో అత్యధికులు తెలుగువారైనా అన్ని రంగాల్లో మహారాష్ట్రులదే హవా. విద్యాసంస్థలు నడిపేదీ వారే. సభల్లో, సమావేశాల్లో, గణపతి ఉత్సవాల్లాంటి వేడుకల్లో హడావుడి అంతా వాళ్లదే.వారికి తెలుగంటే మహా చులకన. అందుకే-
‘‘మాడపాటి హనుమంతరావుగారు తెలుగులో ఉపన్యాసం ఆరంభించగానే వారు అల్లరి ఆరంభించినారు. అయినా పంతులుగారి వ్యక్తిత్వ ప్రభావంవల్ల అంత వికటంగా ప్రవర్తించలేదు. కాని అల్లంపల్లి వెంకట రామారావు (హైకోర్టు వకీలు)గారు ఒక తీర్మానముపై తెలుగులో ప్రసంగించటానికి ఉపక్రమించగానే మహారాష్ట్ర యువకులు అల్లరి ప్రారంభించినారు. ఈలలు, చప్పట్లు, చివరకు వేదికవైపు వెన్ను తిప్పి కూర్చుండుట జరిగింది. తత్ఫలితంగా వెంకట రామారావుగారు తమ ఉపన్యాసం నిలిపివేయవలసి వచ్చింది... అల్లంపల్లివారు తమ ఉపన్యాసాన్ని అర్ధాంతరంగా ఆపి నిష్క్రమించగానే వేదిక మీద కూర్చున్న మాడపాటి హనుమంతరావుగారు వేదిక నుండి క్రిందికి దిగినారు. వెంటనే మందుముల నర్సింగరావు, మందుముల రామచంద్రరావు, మిట్టా లక్ష్మీనరసయ్య, టేకుమాల రంగారావు, బూర్గుల రామకృష్ణారావు మొదలైన పెద్దలు వారిని అనుసరించినారు. సభలో పాల్గొంటున్న తెలుగు ప్రేక్షకులు కూడా పెద్దలననుసరిస్తూ సభను విడిచి తమ తీవ్రమైన అసమ్మతిని ప్రకటించినారు.
హైదరాబాదు స్వాతంత్య్రోద్యమ చరిత్ర, వెల్దుర్తి మాణిక్యరావు, పే.104-105
అలా నిరసన తెలిపి సభనుంచి నిష్క్రమించిన పెథ్దలు పదకొండు మంది వివేకవర్థనీ థియేటరు వెనకనే ఉన్న ట్రూపుబజారులో వకీలు టేకుమాల రంగారావుగారింటికి ఎకాఎకి వెళ్లారు. ఆంధ్రులు బహుళ సంఖ్యాకులుగా ఉన్న రాజధాని నగరంలో ఆంధ్ర భాషలో ఉపన్యసించటానికే వీలులేకుండా పోయి, మాట్లాడుతున్న వాడిని కేకలు వేసి కూచోపెట్టే దుస్థితి పట్టినందుకు వారు చాలా బాధపడ్డారు. విచారించి ప్రయోజనం లేదు. వెంటనే ఏదో ఒకటి గట్టిగా చెయ్యాలనుకున్నారు. తర్జనభర్జనల తరవాత ఆ రాత్రే అక్కడే ‘‘ఆంధ్ర మహాజన సంఘం’’ స్థాపించారు. తెలంగాణలో ఆంధ్రోద్యమానికి, నిజాం స్టేటులో రాజకీయోద్యమానికి అదే నాంది.
పరాయి భాషవాళ్ల చేతుల్లో తమ గడ్డమీద తమకు జరిగిన అవమానం పదేళ్ల కింద గుంటూరు న్యాయవాదులగుండెలను, మండిచినట్టే తెలంగాణ ఆంధ్ర ప్రముఖులనూ కదిలించి కార్యరంగానికి నెట్టింది. 1921లో కోస్తా ప్రాంతాన పడకేసిన ఆంధ్రోద్యమం కృత్రిమ సరిహద్దులను దాటి తెలంగాణలో అదే సంవత్సరం చరిత్రాత్మకంగా మొదలైంది.
1921 నవంబరు 12 రాత్రి 8 గంటలకు ‘‘ఆంధ్ర జన సంఘము’’ను పదకొండుమంది పెద్దలు కలిసి స్థాపించినప్పుడు నాలుగు తాత్కాలిక నియమాలు పెట్టుకున్నారు. అవేమిటంటే- పుట్టుక వల్లగాని స్థిర నివాసమువల్లగాని హైదరాబాదు స్టేటులో ఉన్న 18 ఏళ్ల పైబడిన ఆంధ్రులందరు ఈ సభలో చేరవచ్చు. (తర్వాత ఇది మారింది). సభ్యత్వ రుసుము సంవత్సరానికి కనీసం రూపాయి. తగినంతమంది సభ్యులు చేరాక అందరితో ఆలోచించి నియమావళిని రూపొందాలి.
సభ్యుల్ని చేర్చటానికి ఆట్టే కష్టపడాల్సిన పనిలేకపోయింది.
వివేకవర్ధని థియేటరులో ఆంధ్ర భాషకు జరిగిన అవమానాన్ని... దానికి బాధపడ్డవారు ఆంధ్ర జన సంఘాన్ని స్థాపించదలచిన వైనాన్ని మందుముల సోదరుల పత్రికా వ్యాసాల ద్వారా తెలుసుకోగానే చాలామంది ఆంధ్రులు తామే ముందుకొచ్చి సభ్యత్వం తీసుకున్నారు. నెల రోజుల లోపలే నూరుగురు సభ్యులయ్యారు. 1922 ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో కొండా వెంకట రంగారెడ్డి అధ్యక్షతన రెడ్డి హాస్టల్లో మూడుసార్లు అందరూ కలిసి మల్లగుల్లాలు పడ్డాక నియమావళి ఖరారైంది. కార్యనిర్వాహక వర్గమూ ఎన్నికైంది. ఆర్.రాజగోపాలరెడ్డి అధ్యక్షుడు. మాడపాటి హనుమంతరావు కార్యదర్శి. మందుముల నర్సింగరావు సహాయ కార్యదర్శి. కొండా వెంకట రంగారెడ్డి, ఆదిరాజు వీరభద్రరావు, టేకుమాల్ రంగారావు, ఇంకో ముగ్గురు కార్యవర్గ సభ్యులు.
కొత్త సంఘానికి ఖరారైన ప్రధాన నియమాలివి:
‘1. ఈ సంఘమునకు నిజాం రాష్ట్రాంధ్ర జన సంఘము’అని పేరు.
2. నిజాం రాష్టమ్రునందలి ఆంధ్రులయందు పరస్పర సహానుభూతి కలిగించి వారియభివృద్ధికై ప్రయత్నించుట ఈ సంఘముయొక్క ఉద్దేశము.
3. ఈ రాజ్యములోని ఆంధ్రుల కొరకు, సంఘములను, సంస్థలను స్థాపించుట, ఉన్నవానికి సహాయము చేయుట, ఉపన్యాస సభలను సమావేశపరచుట మున్నగు కార్యముల వలన పై ఉద్దేశము నెరవేర్చబడును.
4. ఈ రాజ్యములోని ప్రతి ఆంధ్ర వ్యక్తియు, పదునెనిమిది సంవత్సరముల కంటే మించిన వయస్సు కలిగి, చదువను, వ్రాయను నేర్చియున్నచో, ఈ సంఘమున సభాసదుడు కావచ్చును.
సర్కారు జిల్లాల్లో ‘ఆంధ్ర మహాసభ’ 1913 మొదలుకుని ఏటేటా కాంగ్రెసు పందిట్లో సైడ్‌షోగా సభ చేయటమే తప్ప తనకంటూ నియమావళిని ముందుగా రూపొందించుకోలేదు... లో... మహాసభ నాటికి గానీ దానికి నియమావళి, సంస్థాగత స్వరూపం ఏర్పడలేదు. దీనికి భిన్నంగా నైజాం ఆంధ్ర మహాసభ మొదటినుంచే క్రమపద్ధతిన ముందుకు సాగటం విశేషం.
అయినా వివాదాలు తప్పలేదు. మొట్టమొదటిది ‘నైజాంలో ఆంధ్రులు’ అంటే ఎవరు అన్నది. తెలంగాణ, మరఠ్వాడా, నైజాం కర్ణాటక ప్రాంతాల్లో పుట్టిపెరిగిన తెలుగువారు మహాసభలో సభ్యులు కావచ్చునన్నంతవరకూ పేచీలేదు. కాని వేరే ప్రాంతాలనుంచి వలస వచ్చి నైజాం స్టేటులో పొట్టపోసుకుంటున్నవారి మాటేమిటి? బ్రిటిష్ ఇండియాలోని మద్రాసు రాష్ట్రంలో అరవల ప్రాబల్యంవల్ల తెలుగువారికి ఉద్యోగావకాశాలు సన్నగిల్లాయి. నైజాంలో అక్షరాస్యత, విద్యాధికుల సంఖ్య బహుతక్కువ కావటంవల్ల బయటివారికి ఇక్కడ ఉపాధి అవకాశాలు హెచ్చు. అందుకే పలువురు ఆంధ్రులు బయటి తెలుగు జిల్లాలనుంచి ముఖ్యంగా హైదరాబాదుకు వచ్చి రకరకాల వృత్తివ్యాపారాలు చేసుకోసాగారు. వారిలో చాలామంది ఇక్కడే స్థిరపడ్డారు. తామూ ఆంధ్రులమే కనుక ఇక్కడ కొత్తగా ఏర్పడ్డ ఆంధ్ర మహాసభలో వారూ పాలుపంచుకున్నారా? లేదు. ఎందువల్ల? ఇష్టం లేక- అనుకుంటారు చాలామంది.
‘‘ఉద్యోగరీత్యా హైదరాబాదులో ఉంటున్న ఆంధ్రులు కూడా నిజాం రాష్ట్ర ఆంధ్రోద్యమంతో సంబంధం పెట్టుకునేవారు కారు. సంఘ సభ్యత్వం పొందటానికి కూడా నిరాకరించేవారు’’ అని హైదరాబాదు స్వాతంత్య్రోద్యమ చరిత్ర (పే.111)లో వెల్దుర్ది మాణిక్యరావు అంతటి సీనియర్ నాయకుడు కూడా ఆక్షేపించారు. అదే అభిప్రాయం ఇంకా చాలామందికి ఉంది. తెలంగాణకు, తీరాంధ్రకు మధ్య మానసికంగా దూరం పెరగటానికి తొలి కారణాల్లో ఇది కూడా ఒకటి.
నిజానికి అసలు సమస్య ఇంతకుముందు ఉటంకించిన నైజాం మహాసభ నియమాల్లోనే ఉంది. అదేమిటో తెలంగాణ ఆంధ్రోద్యమ నిర్మాతల్లో ముఖ్యుడైన మాడపాటివారే చెబుతారు వినండి:
‘‘పై నియమములనుబట్టి, సంఘ సభ్యత్వము నిజాము రాష్ట్ర వాసులకు వారకు మాత్రమే పరిమితముగా నుంచవలయునని అప్పటి ముఖ్య కార్యకర్తలగువారు భావించి యుండినట్లు ఎవరికైనను స్ఫురింపక మానదు. నిజాం రాష్ట్రేతరులగునాంధ్రులు కొందరుండిరనుట నిస్సంశయము. అట్టివారు ప్రభుత్వోద్యోగములందును, ఇతర వృత్తులందును ఉండియుందురు. అట్టివారు ఈ సంఘమున చేరలేదని తోచుచున్నది. ఇందునకు పైన వివరించబడిన నియమముల పరిమిత స్వభావమే కారణమని చెప్పవలయును.’’
తెలంగాణా ఆంధ్రోద్యమము, మాడపాటి హనుమంతరావు, పే.11
అలాగని బయటినుంచి వచ్చిన ఆంథ్రులను దగ్గరికి రానివ్వకుండా తలుపులు మూసి నైజాం వారికే ఆంధ్రోద్యమాన్ని పరిమితం చేశారని తెలంగాణ నాయకులను అధిక్షేపించడమూ తప్పే. ఎందుకంటే వారాపని చేసింది తీరాంధ్రులమీద ద్వేషంతో కాదు. తప్పనిసరి అయి! తెలంగాణలో ఆంధ్రోద్యమం 1922లో మొదలయ్యేనాటికే సర్కారు జిల్లాల్లో ఆరు ‘ఆంధ్ర మహాసభ’లు జరిగాయి. తొలి దశలో నానా గుంజాటనల తరవాత ఏకాభిప్రాయం కుదిరి ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం తన ధ్యేయమని ఆంధ్ర మహాసభ స్పష్టీకరించింది. సర్కారు, సీడెడ్ జిల్లాల ఆంధ్రులు ఈ వైఖరి ప్రకటించినప్పుడు, వారితో కలిసి, లేదా అక్కడినుంచి వచ్చిన ఆంధ్రులను కూడా కలుపుకొని తెలంగాణలో ఆంధ్రోద్యమం సాగిస్తే... వారు లేవనెత్తిన ప్రత్యేకాంధ్ర రాష్ట్రం డిమాండును వీరూ బలపరుస్తున్నట్టు లోకం భావిస్తుంది. నిజాం నవాబూ అలాగే అనుకుంటే మొదటికే మోసం వస్తుంది.
ఎందుకంటే- తెలంగాణ, మరాఠ్వాడ, కర్ణాటక ప్రాంతాలతో కూడిన నైజాం స్టేటులోని ఆంధ్రులు ప్రత్యేకాంధ్ర రాష్ట్రాన్ని కోరటమంటే నిజాం రాజ్యంనుంచి తెలంగాణ వేరుపడాలని అడగడమే. నైజాం రాజ్యం మొత్తం వైశాల్యం 82,698 చదరపు మైళ్లు కాగా అందులో తెలంగాణ వైశాల్యం 41,502 చదరపు మైళ్లు. అంటే సగం కంటే ఎక్కువ. 1921 జనాభా లెక్కల ప్రకారం నైజాంలో మొత్తం జనసంఖ్య 1,24,71,770 కాగా అందులో తెలంగాణ జనాభా 64,19,298. తన రాజ్యంలో సగం జనాభాకు వేరుపడాలన్న కోరిక పుట్టిందనీ... వారి ప్రయత్నం ఫలిస్తే సగానికి పైగా రాజ్యాన్ని, అందులోనూ తాను పీఠంపెట్టిన అతి ప్రధాన రాజధాని నగరాన్ని తాను వదులుకోవలసి వస్తుందనీ తెలిస్తే నిజాం ఊరుకుంటాడా? మోర సాచిన ఉద్యమాన్ని మొగ్గలోనే తుంచెయ్యాలని చూడదా? ఆ రకమైన ప్రమాదం రాకూడదన్న ముందుచూపుతోనే కేవలం నైజామాంధ్రులకు మాత్రమే తమ కార్యకలాపాలను పరిమితం చేసి ఉండవచ్చు. మాడపాటివారు కూడా అదే మాట అన్నారు:
‘‘మదరాసు రాజధానిలోని’’ ఆంధ్ర జిల్లాలు తమిళాది ఇతర
ప్రాంతముల నుండి విడిపోయి, ప్రత్యేక ప్రాంతముగా నేర్పడునట్లు ఆందోళన సల్పుట అచ్చటి మన సోదరుల కార్యక్రమమున ప్రధాన విషయమై యుండెను. ఆ కారణమువలన, నిజాం రాష్టమ్రులో ప్రారంభమగుచున్న ఆంధ్రోద్యమమును విడిగాను ప్రత్యేక లక్షణలక్షితముగాను ఉంచుట ఉద్యమ స్థాపకులు అవసరమని భావించి యుండవచ్చును. దూరదృష్టిలేనివారు కొందరు, ఈ విషయమున అపోహలు కలిగించి, అసూయభావ ప్రేరితులై ఇచ్చట ఆంధ్రోద్యమ వ్యాప్తికి కొన్ని అంతరాయముల కలిగించుట మా పాఠకులు ముందు చూడగలరు.’’
(పే.12)
బయటి జిల్లాల ఆంధ్రులనూ కలుపుకొని పోరాడితే నైజాం ఆంధ్రులశక్తి పెరిగి విజయావకాశాలు మెరుగవుతాయి కదా? నైజామాంధ్రులు నిజాం కింద ఉన్నట్టే సీమాంధ్రులు బ్రిటిష్ పెత్తనంలో ఉన్నారు. తెల్లవాళ్లూ దుర్మార్గులే. మరి విదేశీ వలసపాలకులను చూస్తే సీమాంధ్రులకు లేని భయం నిజాంను చూస్తే తెలంగాణ వారికి మాత్రం ఎందుకు? అతగాడు ఎక్కడ ఆగ్రహిస్తాడోనని హడలిపోవలసినంత అగత్యమేమిటి?