ఆంధ్రుల కథ - 18

ఎం.వి.ఆర్ శాస్త్రి గారు ఆంధ్ర భూమి ఆదివారం అనుబంధం లో సీరియల్ గా ప్రచురిస్తున్న ఆంధ్రుల కథ యదాతథం గా..

ఉత్తుత్తి ఒప్పందం (August 22nd, 2010)

అనగనగా ఒక ఆంధ్ర మహాసభ.
(అప్పట్లో) ముక్కోటి ఆంధ్రుల వాణిని వినిపించే మహా రాజకీయ వేదిక.
అంత గొప్ప సంస్థకు పాతికేళ్లు నిండాయి. ఆంధ్ర దేశం నడిగడ్డన బెజవాడలో వెండి పండుగ వేడుకలు మహాఘనంగా జరుగుతున్నాయి.
మద్రాసు ప్రెసిడెన్సీలో ఒరిజినల్‌గా పనె్నండు తెలుగు జిల్లాలు. మనవాళ్ల అసమర్థ నిర్వాకంవల్ల అప్పటికే గంజాం జిల్లా గల్లంతై కొత్తగా వచ్చిన ఒరిస్సాలో కలిసింది. ఇక మిగిలినవి పదకొండు జిల్లాలు. నెల్లూరు పోను వాటిలో ఐదు సర్కారు ప్రాంతానివి. ఐదు రాయలసీమవి. 1937 అక్టోబరుకు రజతోత్సవ మహాసభకు ఐదు సర్కారు జిల్లాలనుంచి మూడు వేల మంది హాజరయ్యారు. ఐదు సీడెడ్ జిల్లాలనుంచి వచ్చిన డెలిగేట్ల సంఖ్య వేదిక మీద కూచున్న నాయకులను కలిపినా, ఎటునుంచి ఎటుకూడినా ముప్ఫైకి మించలేదు!
దీన్నిబట్టి ఏమి అర్థమవుతుంది? ఆంధ్రోద్యమమన్నా, దాన్ని భుజాన వేసుకున్న ఆంధ్ర మహాసభన్నా, ప్రత్యేకాంధ్ర రాష్ట్రంకోసం అది సాగిస్తున్నదనుకునే పోరాటమన్నా రాయలసీమ పెద్దగా ఆసక్తి చూపలేదు. గతంలో ఉన్న ఆసక్తికూడా ఇటీవలి పరిణామాల మూలంగా సన్నగిల్లింది. ‘సీమ’కాంగ్రెసు పెద్దలు నోళ్లు, చొక్కాలు ఎంత చించుకున్నా ‘ఆంధ్ర’ వ్యవహారాలపట్ల రాయలసీమ జీవన స్రవంతి పుట్టెడు అనుమానాలతో నిర్లిప్తంగా ఉంది. ‘సర్కారు’ సోదరుల దగ్గరికి పోయి ఎంత మొత్తుకున్నా తమకు న్యాయం జరుగుతుందన్న ఆశ ‘సీమ’వాసులకు లేకపోయింది.
ఘనత వహించిన ‘శ్రీ బాగ్ ఒప్పందం’ విషయంలో ఇది గుర్తుపెట్టుకోవలసిన మొట్టమొదటి పాయింటు. ఎందుకంటే ఆ ఒప్పందానికి అంకురార్పణ జరిగింది మనం మాట్లాడుకున్న బెజవాడ మహాసభలోనే.
రాయలసీమకు ఆసక్తి లేకపోవచ్చు. కాని రాయలసీమతో ఆంధ్ర నాయకులకు అవసరం చాలా ఉంది. 1937 ఎన్నికల తరవాత చిక్కులన్నీ తొలిగి, మద్రాసులో కాంగ్రెసు మంత్రివర్గం కొత్తగా ఏర్పడ్డది. దాన్ని ఒత్తిడి పెట్టి లెజిస్లేచరులో ఆంధ్ర రాష్ట్ర తీర్మానం లాగించాలని ఆంధ్ర నేతలు తహతహలాడుతున్నారు. సొంత రాష్టమ్రంటూ వస్తే ఎంచక్కా పదవులు, అధికారాలు పంచేసుకోవచ్చు. రాజకీయ కోటి విద్యలన్నీ అధికారపు కూటికోసమే కదా? అదృష్టంకొద్దీ పరిస్థితులూ కలిసి వచ్చాయి. ఎటొచ్చీ ఒకటే చిక్కు. అధికారానికీ ఆంధ్ర నాయకత్వానికీ నడుమ ఒక్కటే అడ్డంకి: రాయలసీమ. సర్కారు జిల్లాల వాళ్లన్నా, వాళ్ల రాజకీయాలన్నా సీమవాళ్లు మహాగుర్రుగా ఉన్నారు. కొత్త మంత్రివర్గంలో తమ ప్రాంతానికి ఒక్క స్థానమూ దక్కకపోవటంతో ఈమధ్య మరీ ధుమధుమలాడుతున్నారు. ‘సీమ’ను దువ్వి, దగ్గరికి తీసుకుంటే గానీ కార్యం నెరవేరేట్టు లేదు. వారిని మచ్చిక చేసుకునే సాధనం ఏమిటా అని ఆలోచిస్తే ‘ఆంధ్ర మహాసభ’ రజతోత్సవ సందర్భం స్ఫురించింది.
ఇంకేం? అట్టహాసంగా వెండి వేడుకలు పెట్టారు. అప్పటికే రెండుసార్లు (1928లో, 1931లో) ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించిన కడప కోటిరెడ్డితో ఈసారీ అగ్రాసనం మీదే అన్నారు. (ఇదే కోటిరెడ్డి కొద్దిరోజులకిందే ఎ.పి.సి.సి ఎన్నికల్లో ఉపాధ్యక్ష పదవికి నిలబడితే, ఇదే బెజవాడ పెద్దాయన అయ్యదేవర కాళేశ్వరరావు ఎదురు నిలిచి ఓడించాడు. రాష్ట్ర కాంగ్రెసు ఉపాధ్యక్షుడుగా ఉండదగడనుకున్న వాడినే ఆంధ్ర మహాసభకు ఏరికోరి అధ్యక్షుణ్ని చేశారు. బళ్లారి ప్రముఖుడు హెచ్.సీతారామరెడ్డిని మీరే సభాప్రారంభం చేయాలని పిలిచారు. రజతోత్సవ సందర్భాన పెట్టిన ప్రత్యేక జూబిలీ సెషనుకు అధ్యక్షత్వాన్ని మదనపల్లెకి చెందిన టి.ఎన్.రామకృష్ణారెడ్డికి అప్పగించారు. రాయలసీమ మాకు ప్రాణం, మనం మనం ఒకటి అని పెద్దలందరూ కోరస్ పాడారు.
ఏమాటకామాటే చెప్పాలి. ఆంధ్ర నేతలు ఒకందుకు పిలిస్తే సీమ నేతలు మరొకందుకు బెజవాడ వేదికను బాగా ఉపయోగించుకున్నారు. పైన పేర్కొన్న ముగ్గురు పెద్దలు ప్రసంగాల్లో రాయలసీమకు జరిగిన అన్యాయాలను, వాటిని వెంటనే సరిదిద్ది సీమకు ప్రత్యేక రక్షణలు కల్పించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. పప్పూరి రామాచార్యులైతే మరీనూ! తన సుదీర్ఘ ఉపన్యాసంలో ఆయన సీమ, కోస్తాంధ్రల మధ్య పెరిగిన దూరానికి కారణాలను చక్కగా విశే్లషించాడు. రాయలసీమలో మాట్లాడేది తెలుగే కాదని ఉత్తరాదివారు ఈసడించటం, అక్కడి గ్రంథాలను పాఠ్యపుస్తకాలుగా ఎంపిక కానివ్వకపోవటం, జవాను మొదలు దివానువరకు అన్ని కొలువులను ఉత్తరాదివారో, అరవలో కొట్టేయడం వంటి సంగతులను ఆంధ్ర నాయకుల మొగంమీదే మొగమాటం లేకుండా వివరించాడు. ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెసుకు కొత్తగా అధ్యక్షుడైన పట్ట్భాసీతారామయ్యగారు రామాచార్యుల ప్రసంగాన్ని శ్రద్ధగా విని తెగ మెచ్చుకున్నాడు. ఆంధ్ర రాష్ట్ర సాధనకు కలిసి పనిచేయడానికి ముందు రాయలసీమ కోరుతున్న హామీలను, రక్షణలను పరిశీలించి, తగు సిఫారసులు చేయడానికి ఉభయ ప్రాంతాల ప్రముఖులతో ఒక కమిటీని వేయాలని ఆయన పట్టుబట్టి తీర్మానం చేయించాడు. అలాగే హుటాహుటిన కమిటీని కూడా వేశారు. కడప కోటిరెడ్డి, టి.ఎన్.రామకృష్ణారెడ్డి, పప్పూరి రామాచార్యులు, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, హెచ్.సీతారామరెడ్డి, కల్లూరి సుబ్బారావు తదితర ‘సీమ’ ప్రముఖులు, కొండ వెంకటప్పయ్య, పట్ట్భా సీతారామయ్య, వావిలాల గోపాలకృష్ణయ్య వంటి ‘ఆంధ్ర’ నేతలు ఇందులో సభ్యులు.
తొందర నాయకులది కాబట్టి కొత్త కమిటీ కాలం వృధాచేయకుండా పనిలోకి దిగింది. దీపావళి వెళ్లిన మరునాడు (1937 నవంబరు 15న) మద్రాసులో ఆంధ్రపత్రికాధిపతి కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారి బంగళాలో కమిటీ సభ్యులు కొందరు కూడి, రాయలసీమ కళ్లనీళ్లు తుడిచేందుకు గొప్ప ఫార్ములా కనిపెట్టారు. సుదీర్ఘ తర్జనభర్జనల అనంతరం ఒప్పందాన్ని కూడా ఖరారుచేశారు. అది కుదిరిన బంగళా పేరు ‘శ్రీ బాగ్’. కాబట్టి ‘శ్రీబాగ్ ఒప్పందం’గా అది చరిత్ర ప్రసిద్ధికెక్కింది. రాయలసీమ హక్కులకు సంబంధించినంతవరకూ దాన్నో ‘మాగ్నకార్టాగా’ అక్కడివారు పరిగణిస్తారు. సీమకు జరిగిన అన్యాయాలను ఏకరువు పెట్టేటప్పుడు ప్రతి మేధావీ ‘శ్రీబాగ్ ఒప్పందా’నే్న రిఫరెన్సు పాయింటుగా ఉదాహరిస్తుంటాడు. ఇదంతా వినివిని ఈ కాలపువాళ్లు ‘శ్రీబాగ్ ఒడంబడిక’ అనేది రాయలసీమ ప్రత్యేక రక్షణలకు సంబంధించి, అనుల్లంఘనీయమైన, రాజ్యాంగ ప్రతిపత్తి కలిగిన శిలాశాసనం కాబోలని అనుకోవటం కద్దు.
ఉన్నమాట చెప్పాలంటే అది ఆపద్ధర్మంగా కుదుర్చుకున్న ఉత్తుత్తి ఒప్పందం. దానిమీద సంతకాలు చేసినవారికే అది నిజంగా అమలు అవుతుందన్న (లేక అమలు చేస్తామన్న) నమ్మకం లేదు. అనంతర కాలంలో సీమకు జరిగిన ఎనె్నన్నో మోసాలను, వాగ్దాన భంగాలను జ్ఞాపకం పెట్టుకుని ఒప్పంద పత్రాన్ని ఒకసారి తిరగేస్తే చాలు అందులోని మర్మం ఈ కాలపువారికి ఇట్టే తెలిసిపోతుంది.
తీర్చే ఉద్దేశం లేనివాడు ఏ వరమైనా ఇవ్వగలడు. ఏ వాగ్దానమైనా చెయ్యగలడు. శ్రీబాగ్ ఒప్పందమూ ఆ బాపతే. దాని నిండా రాయలసీమకు వరాలే. అడగటమే ఆలస్యంగా ‘సీమ’కోరుకున్నదల్లా ఆంధ్ర నాయకులు ఇచ్చేశారు. యూనివర్సిటీ వాల్తేరుకు పోయిందన్న బాధలేకుండా (వాల్తేరుది వాల్తేరులోనే ఉండనిచ్చి) అనంతపురంలో యూనివర్సిటీ సెంటరు పెట్టేస్తామన్నారు. కోస్తా జిల్లాల స్థాయికి రాయలసీమ నెల్లూరు జిల్లాలను వ్యవసాయపరంగా, ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు పదేళ్లపాటు (అవసరమైతే ఇంకా ఎక్కువ కాలానికి) నీటిపారుదల పథకాలను ప్రాధాన్యమిచ్చి అమలుచేస్తామన్నారు. ముఖ్యంగా కృష్ణా, పెన్నా, తుంగభద్ర జల వినియోగంలో ఈ జిల్లాలకే ప్రయారిటీ అన్నారు. ఈ జిల్లాకు మేలుచేసేలా భారీ ప్రాజెక్టుల మీద ప్రత్యేక శ్రద్ధ పెడతామన్నారు. నదీ జలాల పంపకంలో ఈ జిల్లాల అవసరాలను మొదట తీర్చాకే ఇంకేదైనా అన్నారు. లెజిస్లేచర్‌లో జనరల్ సీట్లు ప్రతి జిల్లాకు సమానంగా పంచడానికి ఓయస్ అన్నారు. యూనివర్సిటీ, హైకోర్టు, రాజధాని మూడూ ఒకేచోట ఉంచి, ఒక్క ప్రదేశానే్న పెద్ద చేయడమెందుకు మూడూ మూడుచోట్ల పెట్టేద్దామంటే చప్పున ఒప్పుకున్నారు. వాల్తేరులో ఉన్న యూనివర్సిటీని అలాగే ఉండనిచ్చి, హైకోర్టు, రాజధానిలలో మీరూమేము చెరొకటి తీసుకుందామంటే అలాగే కానిద్దామన్నారు. అందులో కూడా మాకేది కావాలో మేము ఎంచుకుంటాం- మేం వదిలేసిందే మీరు తీసుకోండి- అంటే సరే అన్నారు. ఈ ప్రకారం రాసుకున్న ఒప్పందంమీద కె.కోటిరెడ్డి, కల్లూరు సుబ్బారావు, ఎల్.సుబ్బరామరెడ్డి, హెచ్.సీతారామరెడ్డి, పట్ట్భా సీతారామయ్య, కొండ వెంకటప్పయ్య, పప్పూరు రామాచార్యులు, ఆర్.వెంకటప్పనాయుడు సంతకాలు చేశారు.
రాయలసీమకు ఈ మాత్రం రక్షణలే ఎందుకు ఇచ్చారు, ఇంకా చాలా ఎందుకు ఇవ్వలేదు అంటే- ‘సీమ’ ప్రతినిధులు ఇవి మాత్రమే కోరుకున్నారు కనుక. అంతకుముందు బెజవాడ ఆంధ్ర మహాసభ (1937)లో రాయలసీమ నాయకులు చాలా తీవ్రంగా ప్రాంతీయ రక్షణలకోసం పట్టుబట్టినప్పుడు- మంత్రివర్గంలో కోస్తా, రాయలసీమలకు చెరిసగం స్థానాలు ఉండాలనీ, రాష్ట్ర ఆదాయాన్ని రెండు ప్రాంతాలమీద సమానంగా ఖర్చుపెట్టాలనీ డిమాండు చేశారు. అడిగితే చాలు వాటిని కూడా బహు ఉదారంగా శ్రీబాగ్ ఒప్పందంలో చేర్చేవారే. కాని సీమ నాయకులు అలాంటి చిన్నవాటితో అవసరం లేదనుకున్నారు. ఎందుకంటే అన్నిటినీ సాధించగల అసలైన మంత్రదండానే్న సర్కార్ల సోదరులను తెలివిగా ఒప్పించి తాము దొరికించుకున్నాక చిన్నచిన్న వాటికోసం దేబిరించడమెందుకని అనుకున్నారు. ఆ ‘మంత్రదండ’మేమిటంటారా?
సాధారణంగా జిల్లా భౌగోళిక స్వరూపాన్నిబట్టి, జనసాంద్రత వగైరా అంశాలనుబట్టి చట్టసభలో దానికి ఎన్ని సీట్లు ఉండాలన్నది నిర్ణయమవుతుంది. పెద్ద జిల్లాలకు ఎక్కువ సీట్లు, చిన్నవాటికి తక్కువ సీట్లు లభిస్తాయి. ఉదాహరణకు అప్పట్లో ‘వైజాగ్ పట్నం’ దేశంలోనే పెద్ద జిల్లా. మొత్తం ఉత్తరాంధ్రకు విస్తరించిందది. అలాగే గోదావరి, గుంటూరు జిల్లాలూ పెద్దవే. వాటితో పోలిస్తే కడప, అనంతపురం వంటి రాయలసీమ జిల్లాలు చిన్నవి. కాబట్టి అసెంబ్లీలో సర్కారు జిల్లాలకే హెచ్చు సీట్లు ఉంటాయి. ఇది గ్రహించి మహా తెలివిగల ‘సీమ’ పెద్దలు ఏమిచేశారు? లెజిస్లేచరులో ప్రతి జిల్లాకు సమాన ప్రాతినిధ్యం ఉండాలన్నారు. ఆ ప్రకారమే ఒప్పందంలో రాయించుకున్నారు.
గంజాం పోయి ఒరిస్సాలో చేరాక మద్రాసు ప్రెసిడెన్సీలో ఆంధ్రులకు మిగిలినవి 11 జిల్లాలే. వాటిలో రాయలసీమ (బళ్లారి సహా 5), నెల్లూరులకు కలిపి 6 జిల్లాలుంటే సర్కారు జిల్లాలు 5. ప్రతి జిల్లాకూ సమానమైన సీట్లు ఉంటే 5 జిల్లాల ప్రాంతంకంటే 6 జిల్లాల ప్రాంతానిదే చట్టసభలో పైచేయి అవుతుంది. ఆ కీలకం చేతిలో ఉన్నాక కొండమీద కోతి అయినా చిటికె వేస్తే దిగివస్తుంది. అంతకంటే ఏమికావాలి?! కె.వి.నారాయణరావు తన గ్రంథంలో అన్నట్టు-
If each district was equally represented even in the matter of general seats, Rayalaseema and Nellore have an effective voice in the Legislature, as well as in the formation of the Ministry, which might enable them to decide how the expenditure was apportioned between the circar Districts and Rayalaseema and Nellore Districts. Possibly that was why there was no reference to parity in the Ministry and to equal expenditure between these two groups of districts.
[The Emergence of Andhra Pradesh, K.V.Narayana Rao, P.165]
(జనరల్ సీట్లలో కూడా ప్రతి జిల్లాకు సమాన ప్రాతినిథ్యం ఉంటే చట్టసభల్లో రాయలసీమకు, నెల్లూరు జిల్లాకు గట్టి పట్టు ఉంటుంది. అంతేగాక మంత్రివర్గం ఏర్పాటులోనూ వారిమాటే చెల్లుబాటవుతుంది. తద్వారా సర్కారు జిల్లాలకూ, రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు మధ్య నిధులు ఎలా ఖర్చుపెట్టాలన్న నిర్ణయమూ ‘సీమ’వారి చేతిలోనే ఉంటుంది. బహుశా ఈ కారణంవల్లే మంత్రివర్గంలో సమతూకం, రెండు ప్రాంతాలమధ్య సమాన వ్యయం అంశాలను ఒప్పందంలో పేర్కొనలేదు.)
ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించటానికి రాయలసీమ మద్దతు తప్పనిసరి కనుక ఆ తక్షణ అవసరం తీర్చుకోవటానికి ఆంధ్ర నేతలు ఏ వరానికైనా సిద్ధపడ్డారు. వారి అక్కరను తెలివిగా వాడుకుని అల్లావుద్దీన్ అద్భుత దీపంలాంటి శ్రీబాగ్ ఒప్పందాన్ని ఇట్టే సాధించామని సీమ పెద్దలు మురిశారు. సర్కారు జిల్లాలవాళ్లతో వేగలేమని, వాళ్లు మనకు అన్యాయమే చేస్తారు కనుక మన దారి మనం చూసుకోవలసిందేనని, విభజన అంటూ జరిగితే రాయలసీమకు ప్రత్యేక రాష్ట్రం కోరాలని... అప్పటిదాకా వీర స్టేట్‌మెంట్లు ఇచ్చిన పప్పూరి రామాచార్యులు ధోరణి శ్రీబాగ్ ఒప్పందంమీదసంతకం చేశాక హఠాత్తుగా మారింది. చారిత్రక కారణాలవల్ల కలిగిన ఇబ్బందులను తొలగించటానికి ఆ ఒడంబడిక కుదుర్చుకున్నామని, ఆంధ్ర జాతి ఐక్యతను కోరే ప్రతి ఒక్కరూ దాన్ని ఒప్పుకుని తీరాల్సిందేనని ఆయన కొత్తబాణి అందుకున్నాడు. రాష్ట్ర కాంగ్రెసు సంఘం ఆమోదముద్ర కూడా పడినందున ఆ ఒప్పందం స్థిరంకాదని సందేహించాల్సిన పనిలేదని మిగతా సీమ నేతలూ నమ్మకంగా (అమాయకంగా) చెప్పారు.
ముందు అనుకున్న ప్రకారం కమిటీ సభ్యులు కుదుర్చుకున్న ఒడంబడికను ఆంధ్ర కాంగ్రెసు ధ్రువీకరించిన మాట యధార్థమే. కాని దానికి కట్టుబడాలన్న పట్టుదల ఆంధ్ర నాయకమ్మన్యులకు ఏనాడూ ఏ కోశానా లేదు. ‘ఆంధ్ర మహాసభ’ నిర్ణయం ప్రకారం నియుక్తమైన ఆధికారిక కమిటీ పనుపున కుదిరి, ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెసు అధ్యక్షుడు పట్ట్భా కూడా సంతకం చేసిన శ్రీబాగ్ ఒప్పందాన్ని సీరియస్‌గా తీసుకోవాలన్న ఆలోచనే కాంగ్రెసు పెద్దలకు ఉన్నట్టులేదు. అప్పట్లో ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు ప్రధాన కార్యదర్శి అయిన అయ్యదేవర కాళేశ్వరరావు ఈ ఒడంబడిక గురించి ఏమన్నాడో చూడండి:
1937 సం.లో డాక్టర్ మట్ట్భా సీతారామయ్య, కొండా వెంకటప్పయ్య, పప్పూరి రామాచార్యులు, కల్లూరి సుబ్బారావు, కడప కోటిరెడ్డిగార్లు కలిసి శ్రీబాగు ఫాక్టు అనునొక ఒడంబడికను గావించుకొనిరి... దానిమీద నాగేశ్వరరావు పంతులుగారు దస్కత్తు పెట్టుటకు నిరాకరించిరి. అపుడు మదరాసు రెవిన్యూ మంత్రియైన టంగుటూరు ప్రకాశం పంతులుగారికి గాని, స్పీకరుగానున్న బులుసు సాంబమూర్తిగారికి గాని, నాకు గాని ఆ సంగతి తెలియదు గాని, దానిని తరువాత విధి లేక అందరము ఒప్పుకొనినటులే తీర్మానములు చేయుచు వచ్చినాము.
నా జీవిత కథ- నవ్యాంధ్రము, అయ్యదేవర కాళేశ్వరరావు, పే.254
తీర్మానాలైతే చేశారు. అమలును మాత్రం గాలికి వథిలేశారు. ఆంధ్రా యూనివర్సిటీ సెంటరు అనంతపురానికి రానేలేదు. హైకోర్టు రాజధానిలో ఏ ఒక్కటీ సీమకు దక్కనే లేదు. ఆంధ్ర రాష్ట్రానికి తొలి రాజధాని కావటమూ మూడేళ్ల ముచ్చటే అయింది. 1956కల్లా కర్నూలులో డేరాలు పీక్కొని రాజధాని హైదరాబాదుకు తరలిపోయింది. శ్రీబాగ్ ఒప్పందం ద్వారా కృష్ణా, తుంగభద్ర, పెన్నా నీటిపై సీమకు సిద్ధించిన సంపూర్ణ హక్కు కాగితంమీదే కొడిగట్టింది. నీటిపారుదల రంగంలో రాయలసీమకు దారుణమైన అన్యాయం జరిగింది. చట్టసభలో పైచేయి కలగానే మిగిలింది. పదేళ్లపాటు ప్రత్యేక శ్రద్ధతో కోస్తా స్థాయికి ‘సీమ’ను అభివృద్ధిచేస్తామన్న మాట నీటిమూట అయింది.
ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే శ్రీబాగ్‌లో కుదిరింది ఉత్తుత్తి ఒప్పందం. అది పనికిమాలిన ఒక చిత్తు కాగితం. *