ఎం.వి.ఆర్ శాస్త్రి గారు ఆంధ్ర భూమి ఆదివారం అనుబంధం లో సీరియల్ గా ప్రచురిస్తున్న ఆంధ్రుల కథ యదాతథం గా..
రాజధాని రాజకీయం (April 6th, 2011)
మన పక్షాన గట్టిగా మాట్లాడేవాళ్లు అప్పుడే అవసరం.
సరిగ్గా అప్పుడే మనవాళ్ల నోళ్లు మూతపడ్డాయి.
నలభయ్యేళ్ల ఆంధ్రోద్యమం ఫలించి, తరతరాల కలలు పండి, ఆంధ్రులకు ఎట్టకేలకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడబోతున్నది. జరగాల్సిన ఏర్పాట్లు, తేలాల్సిన వాటాలు, తేల్చుకోవలసిన వ్యవహారాలు సవాలక్ష ఉన్నాయి. ఆంధ్రుల అభిమతాన్ని గట్టిగా వినిపించి, అందులోని న్యాయాన్ని తమిళులకు నచ్చచెప్పి, కేంద్రంచేతా ఔననిపించుకుని, ఒడుపుగా కార్యం సాధించాలి. సమర్థ, సమైక్య నాయకత్వం అప్పుడే కావలసి వచ్చేది.
సరిగ్గా అప్పుడే మన నాయకత్వం చేవచచ్చి చచ్చుబడింది.
ఉండటానికి ఆంధ్ర నాయకుల్లో హేమాహేమీలే ఉన్నారు. కేసరులు, శార్దూలాలూ, మత్త్భాలు మన రాజకీయ గుడారంనిండా ఉన్నాయి. పోటీలుపడి గాండ్రించటానికి, పరస్పరం తలపడటానికే తప్ప పరులను గెలవటానికి వాటి ప్రతాపం పనికిరాదు.
ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి సమస్య రాజధాని! ఉన్న రాజధాని తెలుగునగరమే! అయినా ఆ సంగతి నిర్ద్వంద్వంగా నిరూపించి, దానిని తమిళమయం కావించడానికి పథకం ప్రకారం జరిగిన మోసాలను సకాలంలో బయటపెట్టి, సహేతుక వాదనతో మద్రాసుపై మన హక్కును గట్టి చెయ్యటం మనవారివల్ల కాలేదు. ఆ హక్కుకోసమే పొట్టిశ్రీరాములు ప్రాయోపవేశం చేసిన తరవాతైనా మద్రాసు గురించి పట్టుబట్టి, తమిళులకు తెలుగు తడాఖా చూపించాలన్న పౌరుషం మన నేతాశ్రీలకు కలగలేదు. ఉన్నపళాన మద్రాసు వదిలి మీ రాష్ట్రానికి మీరు పొమ్మని తమిళులు హుంకరించినప్పుడైనా పోక ఏమిచేస్తామని అనుకున్నారే తప్ప- ఎందుకు పోవాలి? కనీసం కాలూచెయ్యి కూడతీసుకునేంతవరకైనా మద్రాసునుంచి మమ్మల్ని ఎందుకు పనిచేయనివ్వరు... అని నిలదీసి నోరుచేసుకున్నవాడు లేడు.
అంతకుముందు పార్టీషన్ కమిటీలో అదే సమస్య వచ్చినప్పుడు... మా రాజధాని మాకు ఏర్పడేంతవరకూ, మద్రాసును ఉమ్మడి రాజధాని చెయ్యాలని ప్రకాశం ఒక్కడే ఒంటరి యోధుడులా పోరాడాడు. కమిటీలోని మిగతా తెలుగు నాయకమ్మన్యులు సిగ్గులేకుండా తమిళులకే వంత పాడారు. ఆ వైనం ఇంతకుముందే చూశాం. ప్రకాశం ఉలిపికట్టెలా అడ్డం తగిలాడు కనకే ఆంధ్రరాష్ట్రాన్ని రాజ్యాంగంలో చేర్చలేకపోతున్నామని కేంద్ర నాయకులు చెప్పుకున్నారు.
కాని- ఆనాడు ప్రకాశం అన్నమాటే 1953లో వాంఛూ కమిషను కూడా చెప్పింది. శ్రీరాములు బలిదానం తరవాత ఆంధ్రరాష్ట్రం ఏర్పాటును 1952 డిసెంబరు 19న ప్రధాని నెహ్రూ పార్లమెంటులో ప్రకటించినప్పుడే దానికి సంబంధించిన ఆర్థిక సర్దుబాట్లను, ఇతర సాధకబాధకాలను పరిశీలించి నెలలోగా తగిన సిఫారసు చేయటానికి జస్టిస్ ఏ.ఎన్.వాంఛూను నియమించారు. ఆయన 1953 జనవరి 7నుంచి పని మొదలుపెట్టి ఫిబ్రవరి 7కల్లా రిపోర్టు ఇచ్చాడు. ఆంధ్ర రాజధాని గురించి అందులో ఆయన చెప్పిందిది:
"The best solution would be to allow the temporary capital of the new state to be located in the city of Madras for a period of three to five years at the outset.''
(కొత్త రాష్ట్రానికి తాత్కాలిక రాజధానిని మద్రాసు నగరంలోనే మూడునుంచి ఐదేళ్లవరకూ ఉండనివ్వటం అత్యుత్తమ పరిష్కారం)
అంటే మూడేళ్లకింద ప్రకాశం అన్నమాటనే జస్టిస్ వాంఛూ బలపరిచాడు. ఆ వైనం వాంఛూ నివేదిక ఆధికారికంగా ప్రభుత్వానికి అందడానికి ముందే బయటికి పొక్కింది. అందరిలాగే ఆంధ్ర నాయకులూ ఆ ఊసు విన్నారు. వారిలో చాలామందికి ప్రకాశమంటే పడదు కనుక అతడిమాటే నెగ్గిందా అని కుళ్లుకున్నారు. అలా జరగకపోతే భలే బాగుండని లోలోపల కోరుకునీ ఉంటారు.
వారిలాగే తమిళులూ ఆ కబురు విన్నారు. వెంటనే ఎక్కడెక్కడివాళ్లూ ఒక్కటయ్యారు. మద్రాసు గడ్డమీద ఆంధ్ర రాజధానికి సూదిమోపినంత స్థలం కూడా అనుమతించరాదని కంకణం కట్టుకుని పద్ధతి ప్రకారం కాంపెయిన్ నడిపారు. తాత్కాలిక ఆంధ్ర రాజధానిని మద్రాసులో ఉండనివ్వరాదంటూ మద్రాసు రాష్ట్రానికి చెందిన 24 మంది ఆంధ్రేతర ఎం.పీలు. ప్రకటన చేశారు. మద్రాసు నగరంలో అఖిలపక్ష నిరసన కార్యక్రమం నడిచింది. తాత్కాలిక రాజధానిని అక్కడ అనుమతిస్తే మద్రాసు నగరం యుద్ధ్భూమి అవుతుంది. తమిళనాట మిగతా ప్రాంతాల్లో అల్లర్లు లేస్తాయి. అక్కడి ఆంధ్రులు ప్రశాంతంగా బతకలేరు- అంటూ 32 మంది ఆంధ్రేతర ఎం.పిలు ప్రధానమంత్రికి మెమొరాండం ఇచ్చారు. మద్రాసు శాసనసభలోని 153 మంది ఆంధ్రేతర సభ్యులూ అదే మాట అన్నారు. మద్రాసు ముఖ్యమంత్రి రాజగోపాలాచారి అయితే- వాంఛూ సిఫారసును ఆమోదిస్తే నేను రాజీనామా చేస్తానని బెదిరించారు.
ఇవన్నీ తెరచాటున రహస్యంగా జరిగినవి కావు. ఆంధ్రులను ఇబ్బంది పెట్టటానికి అరవలు శ్రేణులను సమీకరించి, సమష్టిగా తలపడుతున్నప్పుడు ఆంధ్ర నాయకులకు ఇంగిత జ్ఞానమనేది ఉంటే ఆంధ్ర ప్రయోజనాలు కాపాడేందుకు తామూ కలసికట్టుగా పోటీ కాంపెయిన్ నడపాలి కదా? కాని మన పెద్దల్లో ఉలుకూ లేదు పలుకూ లేదు. కనీసం ప్రకాశం పంతులైనా ఈ దశలో గట్టిగా గళమెత్తిన దాఖలాల్లేవు. ఉప రాష్టప్రతి రాధాకృష్ణన్, కార్మిక మంత్రి వి.వి.గిరిలు మాత్రం నెహ్రూకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. తాత్కాలికంగా రాజధానిని ఉండనిస్తే ఆంధ్రులు ఎల్లకాలం మద్రాసులో ఏమీ తిష్ఠవేయరు. తాత్కాలికమంటే తాత్కాలికమే. అందుకు మాది పూచీ అని వారన్నారు. అయినా ఆంధ్రులకు అన్యాయం చేయటంలో ఎప్పుడూ ముందుండే నెహ్రూ పండితుడు వారి మాటను వినలేదు. ‘తాత్కాలిక రాజధాని ఆంధ్ర ప్రాంతంలోనే ఏర్పాటవ్వాలి. అది ఎక్కడన్నది మద్రాసు అసెంబ్లీలోని ఆంధ్ర సభ్యులు తేల్చాలి’ అని 1953 మార్చి 25న లోక్‌సభలో ఆంధ్ర రాష్ట్ర విధి విధానాలకు సంబంధించి చేసిన సుదీర్ఘ ప్రకటనలో నెహ్రూ అనుశాసించాడు.
మనవాళ్లు మన ప్రాప్తమింతేలెమ్మని మద్రాసులో మూటాముల్లె సర్దుకోవటంలో బిజీ అయిపోయారు.
ఆంధ్రులకది నవ్వాలో, ఏడవాలో తెలియని స్థితి. కోరుకున్న రాష్టమ్రైతే వచ్చింది. తరతరాలుగా అనుబంధం పెంచుకున్న చెన్నపట్నం వారికి కాకుండా పోయింది. తమిళ, కర్ణాటక, ఒడిస్సా రాష్ట్రాల్లో తెలుగు మాట్లాడే ఎన్నో ప్రాంతాలు ఆంధ్ర రాష్ట్రానికి పరాయివి అయిపోయాయి. వివాదం లేని తెలుగు జిల్లాలతోనే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడాలని కేంద్ర నాయకులు పెట్టిన కండిషనువల్ల, దాన్ని ఎదిరించి పోరాడలేని ఆంధ్ర నాయకుల చేతకానితనంవల్ల పదకొండు (శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు) జిల్లాలతోనూ, బళ్లారి జిల్లాలోని మూడు (ఆదోని, ఆలూరు, రాయదుర్గం) తాలూకాలతోనూ ఆంధ్రరాష్ట్రం 1953 అక్టోబరు 1న కాళ్లు, చేతులు లేని మొండెంలా అవతారమెత్తబోతున్నది.
నెహ్రూ ప్రకటన వచ్చేనాటికి మార్చి నెల ముగింపుకొచ్చింది. రాష్ట్రావతరణ ముహూర్తానికి ఆరే నెలల వ్యవధి ఉంది. అరవలైతే గెంటేశారు. కాని ఎక్కడికి పోవాలో అర్థంకాదు. రాజధాని ఎక్కడో తెలియదు. తాత్కాలిక రాజధాని ఏదన్నదే పెద్ద ప్రశ్న. గవర్నరు రాజభవనమూ, ప్రభుత్వ సచివాలయమూ, శాసనసభా పనిచేయటానికి రడీమేడ్‌గా వసతులు ఏ ఆంధ్ర పట్టణంలోనూ లేవు. కొత్త రాజధానిని కట్టుకోవడానికి ఎన్నో ఏళ్లు పడుతుంది. అప్పటిదాకా ఎక్కడ తలదాచుకోవాలన్నది ప్రశ్న. జాలిగొలిపే అయోమయమది. చివరికి- కర్నూలులో గుడారాలే గతి అయ్యాయి.
అదీ చప్పున తేలలేదు. దాని వెనకా చిత్రమైన కథ ఉంది. విచిత్రమైన మలుపులున్నాయి. కాంగ్రెసుతో తెగతెంపులు చేసుకుని కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ పెట్టి, 1952 ఎన్నికల తరవాత దాన్ని జయప్రకాశ్ నారాయణగారి సోషలిస్టు పార్టీలో విలీనం చేసి, ప్రజా సోషలిస్టు పార్టీ అనే కొత్త గుడారానికి నాయకుడుగా ఉన్న ప్రకాశంగారు దాన్ని వదిలి తిరిగి కాంగ్రెసు పంచన చేరటం మతిపోగొట్టే మొట్టమొదటి మలుపు. అప్పటిదాకా ఆంధ్ర రాజకీయాల్లో ప్రకాశంగారు (అడపా దడపా రంగాగారు) ఒకవైపు... పట్ట్భా, కళావెంకట్రావు, బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి, ఇంకోవైపు ఉండి పరస్పరం కత్తులు దూసుకుంటూండేవారు. వైరి వర్గంలోని సంజీవరెడ్డిని ప్రకాశంగారు చేరదీయటంతో కొత్త రాజకీయ ప్రహసనం మొదలవుతుంది. తరవాత ఏమి జరిగిందో నాటి ఘటనల ప్రత్యక్ష సాక్షి తెనే్నటివారు చెబుతారు వినండి:
నీలం సంజీవరెడ్డి తన అభిప్రాయాలకు కొంచెం అనుకూలంగా ఏదో బహిరంగ సభలో మాట్లాడినట్టు పత్రికలో చూసి, ఒకసారి వచ్చి తనతో మాట్లాడవలసిందని ప్రకాశంగారు కబురు పెట్టారు. కబురు అందుకొని వచ్చి సంజీవరెడ్డిగారు ఆయనను చెన్నపట్నంలో కలుసుకున్నారు. రెండు పర్యాయాలు కలిసి చర్చించాక జవహర్‌లాల్ నెహ్రూగారితో చర్చించడానికి నిర్ణయించారు.
సంజీవరెడ్డిగారు అలా ప్రకాశంగారితో కలుసుకోవడం ఆయన సీనియరులైన గోపాలరెడ్డి, వెంకటరావుగారలకు ఇష్టంలేదు. అలాగే ప్రకాశంగారు సంజీవరెడ్డిగారితో ముచ్చటించడం ప్రకాశంగారి అనుయాయులకు చాలామందికి ఇష్టం లేదు.
... జవహర్‌లాల్ నెహ్రూ గారు నిర్ణయించిన తేదీకి ప్రకాశంగారు, నేనూ ఢిల్లీ వెళ్లాము... ఆ తర్వాత రోజున నెహ్రూగారిని సంజీవరెడ్డిగారు కలుసుకోవడానికి వెళ్ళారు. నెహ్రూగారు రెడ్డిగారితో, ‘‘ఏమయ్యా సంజీవరెడ్డి! మీ ముసలివానితో వేగడం చాలా కష్టము. ఆయన ఈ రోజున వస్తాడని నా ఇతర కార్యక్రమాలన్నీ రెండుగంటలు వాయిదా వేసుకున్నాను. ఆయన వచ్చాడు కాదు. చూశావా ఆయన వైఖరి?’’ అన్నారు.
అందుకు సంజీవరెడ్డిగారు, ‘‘అదేమి అలాగ అంటారు? ఆయన మిమ్మల్ని పదకొండు గంటలకు కలుసుకోవడానికి వచ్చి సిద్ధంగానే ఉన్నారు. ఆయన యిక్కడికి వస్తున్నట్టు మీ పేర తంతివార్త కూడా యిచ్చారు’’ అన్నారు...
... నెహ్రూగారు తమ పెర్సనల్ అసిస్టెంటును వెంటనే పిలిచి ‘‘ప్రకాశం గారి దగ్గర నుంచి తంతి వార్త వచ్చిందా?’’ అని ప్రశ్నిస్తే ఆయన ‘‘వచ్చింది’’ అన్నాడు. ‘‘ఎప్పుడు’’ అని ప్రశ్నిస్తే ‘‘మొన్న’’ అని ఆయన జవాబిచ్చారు. అది విని ‘‘సరే వెళ్లు’’ అన్నారు నెహ్రూగారు.
... ఏర్పాటుచేసిన ప్రకారం ప్రకాశంగారు, సంజీవరెడ్డిగారు, నెహ్రూ గారు కలుసుకున్నారు. ఒక గంటసేపు చర్చించిన ఫలితంగా... తాత్కాలిక రాజధానిని సూచించడానికి ఆంధ్ర ప్రాంతానికి చెందిన శాసనసభ్యుల సమావేశం ఏర్పాటుచేయడానికి అధికారరీత్యా ఆదేశం పంపుతామని నెహ్రూగారు అన్నారు. రాజధాని పేరు సూచించాక విభజన సంఘం పని ఆరంభించగలదని కూడా ఆయన చెప్పారు.
మేము తిరిగి వచ్చేసరికి ఆ ఆదేశం చెన్న రాష్ట్ర ప్రభుత్వానికి అందింది. దాని ప్రకారం చిన్న రాష్ట్ర శాసనసభ మందిరంలో శ్రీ ప్రకాశంగారి అధ్యక్షతన ఆంధ్ర శాసనసభ్యుల సమావేశం ఏర్పాటయింది.
అంతకు నెలరోజుల దగ్గరనుంచి, అన్ని జిల్లాలలోను ఈ తాత్కాలిక రాజధాని ‘మా పట్నంలో ఉండాలంటే - మా పట్నంలో ఉండాలి’ అని తీవ్రమైన వాగ్వివాదాలు బయలుదేరాయి.
విశాఖపట్నం అనువైన స్థలమని విశాఖపట్టణం శాసనసభ్యులమంతా అనుకున్నాము. గోదావరి జిల్లాల ప్రసక్తి రాలేదు. కృష్ణ, గుంటూరు జిల్లాలు కమ్యూనిస్టు సభ్యుల సంఖ్య హెచ్చుగా ఉన్న జిల్లాలు గనుక, తాత్కాలిక రాజధాని ఆ ప్రాంతంలో ఉండాలనీ, అది విజయవాడ, గుంటూరుల మధ్య ఎక్కడో ఏర్పాటుకావాలనీ - కమ్యూనిస్టులు అతి తీవ్రమైన ప్రచారం లేవదీశారు. రాయలసీమ సభ్యులలో ఒకరిద్దరు కమ్యూనిస్టులు తప్ప మిగిలిన వారంతా - 1938 ఒడంబడిక ప్రకారం ఆంధ్రా యూనివర్సిటీ కోస్తా జిల్లాలో ఏర్పాటయింది గనుక, తాత్కాలిక రాజధాని అయినా రాయలసీమలో ఏర్పాటుకావాలనీ, అలాకాకుంటే తాము చెన్న రాష్ట్రంలోనే ఉండిపోతామనీ దాదాపు అందరూ సంతకం పెట్టిన కాగితం జేబులో పెట్టుకుని కూచున్నారు. ఈ పరిస్థితులలో రాజధానిని సూచించడానికి అధికార సమావేశాన్ని ప్రకాశంగారు తమ ఇంటి దగ్గర ఏర్పాటుచేశారు. మిత్రులు తమ పట్నాలలోగల సౌకర్య సంపదల ఛాయాచిత్రాలను తెచ్చి, సభ్యులకు చూపించి ప్రచారాలు చేసుకోనారంభించారు.
ఉదయం ప్రకాశంగారి ఇంటిలో జరిగిన సమావేశంలో దీర్ఘమైన చర్చ జరిగింది. ‘‘మీకు హార్బరు ఉంది, షిప్ యార్డు ఉంది. ఈ విషయంలో మీరు విశాఖపట్నం పేరు చెబితే మేము ఒప్పుకొనేది లేదు’’ అని మిగిలిన జిల్లాలవారు నాతో అన్నారు.
రాయలసీమకు శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం తాత్కాలిక రాజధాని ఇవ్వవలసిందే. అది, తిరుపతిలో ఉన్నట్లయితే చిత్తూరు జిల్లా మనతో కలిసి వస్తుందని మిత్రులు గౌతులచ్చన్నగారు తిరుపతిలో గల భవనాల బొమ్మలు చూపుతూ వాదించారు.
కడపలోగల భవనాల చిత్రాలు చూపుతూ కె.కోటిరెడ్డిగారు చాలాసేపు చెప్పారు. తాత్కాలిక రాజధాని ఇచ్చినంత మాత్రాన రాయలసీమకు ఒరిగేది ఏమీలేదు గనుక, దానిని గుంటూరు-బెజవాడ మధ్య ఉండాలని కమ్యూనిస్టులు వాదించారు.
అనంతపురం రాయలసీమ ప్రాంతాలలో కొంచెం సమశీతోష్ణ వాతావరణంగల స్థలమయినా, రాష్ట్రం ఏర్పాటులో ఒక విధమైన ప్రధాన పాత్ర వహించడంవల్ల తాను ఆ విషయం ప్రచారం చేసుకోవడం భావ్యంకాదని సంజీవరెడ్డిగారు ఊరుకున్నారు. దానికితోడుగా, అనంతపురం ప్రసక్తి వచ్చినప్పుడు, ప్రకాశంగారు ‘‘సంజీవరెడ్డి అనంతపురం విషయమై ప్రచారం చేసుకోడు లెండి’’ అని, సంజీవరెడ్డి గారికి ఒకవేళ మాట్లాడుదామన్నా అవకాశం ఇవ్వలేదు.
చివరికి ఒంటిగంట అయినా, ఏ నిర్ణయానికీ రాలేకపోయాము. ప్రకాశంగారిపైనే నిర్ణయభారం వదిలివేద్దామని ఎవరో మెల్లిగా అన్నారు. అందరూ గట్టిగా ఆ అభిప్రాయంతో ఏకీభవించారు.
‘‘అయితే, మీరంతా మూడుగంటలకు రండి, తిరిగి సమావేశమవుదాము. అందులో నా నిర్ణయం చెబుతాను’’ అన్నారు ప్రకాశంగారు.
మూడుగంటలకు తిరిగి ప్రకాశంగారి గదిలో కూచున్నాము. ప్రకాశంగారు ‘‘లచ్చన్నగారూ! ఒక కాగితం, పెన్సిలూ పెట్టుకోండి’’ అన్నారు. అక్కడ కూడిన ఏడెనిమిది మందిమీ ఒక కన్ను ప్రకాశంగారి మీదా, రెండవది లచ్చన్నగారి పెన్సిలుపైనా ఉంచి చూస్తున్నాము.
ప్రకాశంగారు, ‘వ్రాయండి! ‘కర్నూల్’ అని వ్రాయండి’’ అన్నారు. లచ్చన్నగారు వ్రాశారు. అందరూ ఆశ్చర్యంలో నిశ్శబ్దంలో మునిగారు.
నవ్యాంధ్ర రాష్ట్ర తాత్కాలిక రాజధాని జన్మ, నామకరణం ఆ క్షణంలో జరిగింది. అందరూ లేచి ఎవరి మానాన వారు వెళ్లారు.
(ప్రకాశం, ‘నా జీవితయాత్ర’, అనుబంధఖండము, తెనే్నటి విశ్వనాథం, పే.615-620)