మన వారు... పరాయి వారు

మన్మధుడు సినిమా లో అనుకుంటా, అంతవరకూ వదిన గారూ, వదిన అనుకుంటూ వచ్చిన బంకు (సునీల్), ఎప్పుడైతే తన పెళ్లికోసం వెళ్తున్న హీరోయిన్ హీరో కోసం నదిలో దూకేస్తుందో, "నాన్నా నేను బంకు, పెళ్లి కూతురు జంపు" అని అనేస్తాడు. ఇక్కడ విశ్లేషించుకోవాల్సిన విషయం ఏంటంటే...అప్పటి వరకూ, ఆ హీరోయిన్ తన అన్నయ్యకు కాబోయే భార్య గనుక, తనకు వదిన లా, తన అన్న రాముడు గనక, ఈమెను తనకు సీతలా భావిస్తుంటాడు. అలాగే పిలుస్తుంటాడు కూడా..(అక్కడ హీరో వాళ్ల బాబాయి దగ్గర డైలాగ్ లో, రాముడు..అంటూ ఏదో వార్నింగ్ కూడా ఇస్తాడు).

అయితే, మనం ఎదుటి వారిని మన వారు అనుకున్నంత వరకూ అంతా బాగానే ఉంటుంది, కానీ వచ్చిన చిక్కల్లా, ఎప్పుడైతే ఆ ఎదుటి వారు మనళ్ని 'మన వారు' అనుకోనప్పుడే. ఇక్కడా అదే జరిగింది, అప్పటి వరకూ, వదినా, సీతా అంటూ అనుకుంటున్న/అంటున్న బంకు, ఎప్పుడైతే ఆమె తన అన్నయ్యనీ, తన కుటుంబాన్నీ హీరో కోసం వదులుకుందో, అప్పుడే తను కూడా రియలైజ్ అయ్యి పెళ్లి కూతురు జంపు అంటాడు, మరోలా అయితే వదిన జంపు అనో, సీతమ్మ జంపు అనో అని ఉండాల్సింది, కానీ మనం మన వారు అనుకున్న వాళ్లు, మనల్ని కాదనుకున్నప్పుడు, మనల్ని వదిలి వెళ్లినప్పుడు.. బంధాలూ, బాంధవ్యాలూ, పిలుపులూ మారిపోతూ ఉంటాయి, మారిపోవాలి అని కూడా చెప్పే చక్కటి సన్నివేశం.