ఎం.వి.ఆర్ శాస్త్రి గారు ఆంధ్ర భూమి ఆదివారం అనుబంధం లో సీరియల్ గా ప్రచురిస్తున్న ఆంధ్రుల కథ యదాతథం గా..
మీ పొత్తు మాకొద్దు .....(August 15th, 2010)
‘‘ఒకవేళ ఆంధ్ర రాష్ట్రం వస్తే తమిళులు వదిలినా మమ్ము ఆంధ్రులు వదిలేటట్లు లేరు. ఇంతవరకు అయ్యరులు పాలించారు. ఇప్పుడిక పంతుళ్లు పాలిస్తారు.’’
అనంతపురానికి చెందిన ప్రముఖ నాయకుడు పప్పూరి రామాచార్యులు తన ‘సాధన’ పత్రికలో ‘ఆంధ్ర రాష్ట్రం- రాయలసీమ’ శీర్షికన 1931 జూలైలో చేసిన సంపాదకీయ వ్యాఖ్య ఇది. కేవలం ఆయన వ్యక్తిగత అభిప్రాయం కాదు. ఆంధ్ర రాష్ట్రంలో కలియడం పట్ల సీమవాసులకు ఆదినుంచీ ఉన్న అనుమానాలకు అద్దంపట్టే వాక్యాలివి.
మద్రాసునుంచి విడివడి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం సాధించాలన్న తపన సర్కారు జిల్లాలవారికి ఉన్నంతగా రాయలసీమవారికి ఏనాడూ లేదు. మద్రాసు ముఖ్య పట్టణానికి దగ్గరగా ఉండటంవల్ల... చదువులు, వ్యాపారాలు, రాజకీయాలు వగైరా సంబంధాలు ఆ నగరంతోనే ఎక్కువ అయినందువల్ల... సామాజికంగా కూడా సర్కారు ప్రాంతాలవారితో ఆత్మీయ అనుబంధం అంతంత మాత్రమైనందువల్ల... ఉన్న సదుపాయాలను వదులుకుని రాజధాని ఎక్కడో దూరాన ఉండే ఆంధ్ర రాష్ట్రంకోసం ‘సీమ’ప్రజలు ఉత్సాహపడలేదు. విద్యలో, సంపదలో, రాజకీయ చైతన్యంలో సర్కారువాళ్లు వారికంటే ముందున్నారు.
పైగా ప్రతి రంగానా బ్రాహ్మలదే పైచేయి. కొండ వెంకటప్పయ్య పంతులు, అయ్యదేవర కాళేశ్వరరావు పంతులు, న్యాపతి సుబ్బారావు పంతులు, టంగుటూరి ప్రకాశం పంతులు... ఇలా ఆంధ్రోద్యమం అగ్రనాయకుల్లో ఎక్కువమంది బ్రాహ్మణులైనందువల్ల ఆంధ్ర రాష్ట్రం వస్తే ‘పంతుళ్ల’ పెత్తనం కింద బతకాల్సి వస్తుందన్న సంకోచం సీమలోని బ్రాహ్మణేతర వర్గాల్లో బలంగా ఉండేది. ఆ కాలాన రాయలసీమ ప్రముఖుల్లో కొంతమంది జన్మతః తమిళులో, ఆంధ్రేతరులో కావటం కూడా ఎడాన్ని పెంచింది.
ఆంధ్ర మహాసభ తొట్టతొలి సమావేశంలోనే గుత్తి కేశవపిళ్లె వంటివారు ఆంధ్ర రాష్ట్రాన్ని వ్యతిరేకించారు. ‘సీడెడ్’ సోదరులను కలుపుకొని వెళ్లటానికి ఆంధ్రోద్యమ నాయకులు గట్టి ప్రయత్నం చేసి, విస్తృతంగా పర్యటనలు చేసిన మీదట పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. అనుమానాలను పక్కనపెట్టి ఆంధ్రోద్యమంలో కలిసి పనిచేయటానికి ‘సీమ’ పెద్దలు ముందుకు వచ్చారు. సీడెడ్ జిల్లాల్లో ఆంధ్ర మహాసభలు పెట్టారు. వాటికి సీమ నాయకులు అగ్రాసనాధిపత్యాలూ వహించారు. మాంటేగు దొరవద్దకు రాయబారంలో ‘సీమ’ నాయకులూ కలిసివచ్చి కీలక భూమిక వహించారు. ఈ సుహృద్భావాన్ని ఆసరాచేసుకుని, రాయలసీమ ప్రజలకు విశ్వాసం కలిగించి, మానసిక ఐక్యత సాధించటానికి అందరూ చిత్తశుద్ధితో గట్టి కృషి చేసి ఉంటే బాగుండేది. అదేమికర్మమో! సీమ- సర్కార్ల కాపురం ఆదినుంచీ కలతల నడుమ అడుగడుగునా కలహాలతోనే సాగిపోయింది.
భాషాప్రయుక్త రాష్ట్రాల ప్రతిపాదనను మొట్టమొదట ఆంధ్రులే లేవనెత్తారు. మహాత్ముడు వారించినా పట్టుపట్టి 1918లో ప్రత్యేకంగా ఆంధ్రా కాంగ్రెసు సర్కిలు సాధించారు. బళ్లారి, చిత్తూరు జిల్లాలు కాంగ్రెసు కమిటీలు తాము మద్రాసు పి.సి.సి.లోనే కొనసాగుతామని తీర్మానించినా, అనంతపురం జిల్లా కాంగ్రెసు అధ్యక్షుడైన గుత్తి కేశవపిళ్లే తన జిల్లానూ మద్రాసు పి.సి.సి కిందే ఉంచాలని ఎంత ప్రయత్నంచేసినా ఫలితం లేకపోయింది. భాషా ప్రాతిపదికన రాష్ట్ర కమిటీలు ఉండాలన్న 1920 నాగపూర్ కాంగ్రెసు నిర్ణయం ప్రకారం సీడెడ్ జిల్లాలు ఆంధ్రా పి.సి.సి.లో కొనసాగడం ఖాయమైంది. దశాబ్దాలుగా అలవాటుపడిన మద్రాసును వదిలి తమ పరిధిలోకి చేరటం సీడెడ్ జిల్లాల వారికి ఏమంత ఇష్టంలేదని కనపడుతూనే ఉన్నప్పుడు వారికి విశ్వాసం పెంపొందించి ఎలా దగ్గర చేసుకోవాలని కదా ఆంధ్ర నాయకులు ఆలోచించవలసింది? అది చేయకపోగా వారు విశ్వాస రాహిత్యాన్ని ఎక్కువచేసి దూరాన్ని మరింత పెంచేలా వ్యవహరించారు.
ఉదాహరణకు- 1924 జులైలో బెజవాడలో జరిగిన రాష్ట్ర కాంగ్రెసు సభలో రాయలసీమ ప్రముఖుడైన గాడిచర్ల హరిసర్వోత్తమరావును ఎ.పి.సి.సి. అధ్యక్షుణ్ని చెయ్యాలని దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ప్రతిపాదించారు. ఆంధ్రకు ప్రత్యేకంగా పి.సి.సి. ఏర్పడ్డాక రాయలసీమ వారెవరూ అధ్యక్షుడుగా ఎన్నికవలేదు. ఆ పర్యాయం గాడిచర్లకు ఆ గౌరవం కలిగించి ఉంటే సీమ ప్రజలు సంతోషించేవారు. ఆ ప్రాంతానికి చెందినవాడు అనేకాక హరిసర్వోత్తమరావు కాంగ్రెసు అధ్యక్ష పదవికి అన్ని విధాల యోగ్యుడు. ఆ సంగతి అందరికీ తెలుసు. కాని- డెలిగేట్లలో ఎక్కువమంది సర్కారు జిల్లాలవారు. దుగ్గిరాల పెట్టిన తీర్మానాన్ని తోసిపుచ్చారు. గాడిచర్లకి పి.సి.సి. కార్యదర్శి హోదా మాత్రమే ఇచ్చారు.
సర్కారు జిల్లాలవారంటే సీమవాసులకు అపనమ్మకం అసలే హెచ్చిన ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్ర విశ్వవిద్యాలయం గొడవ వచ్చిపడింది. పరిస్థితితో రాజీపడి బెజవాడ కేంద్రంగా ఆంధ్రా యూనివర్సిటీ పరిధి కిందికి రావటానికి ‘సీమ’వాళ్లు మానసికంగా సిద్ధపడ్డారు. ఆ కేంద్రం అనంతపురానికి వస్తుందని తరవాత చెబితే అవును కాబోలని ఆశపడ్డారు. దానినీ పడనివ్వకుండా ఒకానొక ‘సీమ’రెడ్డిగారు రహస్య తంత్రం నడిపి యూనివర్సిటీని విశాఖపట్నానికి దారి మళ్లించాక రాయలసీమవాళ్లకు మనసు విరిగి ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలో కొనసాగేది లేదని తెగతెంపులు చేసుకున్నారు.
సీడెడ్- సర్కారు ప్రాంతాల నడుమ ఆ రకంగా ఏర్పడ్డ వైమనస్యం అంతకంతకూ పెరిగి 1931 నాటికి అగాథంలా మారింది. అవి సైమన్ కమిషన్ ఇండియాకు వచ్చి వెళ్లిన రోజులు. ఇండియాలో నూతన రాజ్యాంగ సంస్కరణలు ఎలా ఉండాలో చర్చించటానికి లండన్‌లో రెండవ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సుకు కాంగ్రెసు ఏకైక ప్రతినిధిగా గాంధీజీ ఓడ ఎక్కబోతున్న రోజులు. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా భాషప్రాతిపదికన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలన్న డిమాండు సర్కారు జిల్లాల్లో ముమ్మరమైంది. రాయలసీమవారు మాత్రం ఆ కోరస్‌లో శ్రుతి కలపకుండా అచ్చంగా తమకే ఒక ప్రత్యేక రాష్ట్రం ఎందుకు కోరకూడదు అని ఆలోచనలు చేశారు. ‘ఆంధ్ర మహాసభ’ తదుపరి మహాసభను రాయలసీమలో పెట్టుకుంటే ఆ ప్రాంతంవారి మద్ద తు తేలికగా పొందవచ్చునని తలిచి 1931 జూన్ 21న కడపలో కడప కోటిరెడ్డి అధ్యక్షతన సభ తీర్చితే- పప్పూరి రామాచార్యులు అక్కడ మొగమాటం లేకుండా ఏమన్నారో వినండి:
‘‘్భషాప్రయుక్త రాష్టమ్రులక్కరలేదనను. అందువల్ల లాభములనేకములు గలవు. కాని చెన్న రాజధానినుండి ఆంధ్ర రాష్ట్రం విడివడటం లాభకరమైతే ఆంధ్ర రాష్ట్రం నుండి రాయలసీమ విడివడుట మరింత లాభకరం కదా? ఉత్తరాది వారిని మనలను ఎర్రమల కొండలు వేరుచేయుచున్నవి. వారి భాష, ఆహార విహారాలు వేరు. ప్రకృతి సిద్ధమైన విషయం కావున పొత్తు కుదరదు. ఆంధ్ర విశ్వవిద్యాలయం విషయంలో మాకనుభవమైనది. వారిలోవారే కలహించినా... మాకియ్యకూడదనుటలో అందరూ ఏకీభవించినవారే. కావున ఉత్తరాది వారితో చేరుకన్నను వేరు రాష్ట్ర స్థాపనకు గడంగుట మేలు.’’
రాయలసీమ ముఖ చిత్రం, భూమన్, పే.123
రాయలసీమ నుంచి హాజరైన మిగతా ప్రతినిథులూ రామాచార్యులు లాగే ఆలోచించారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించిన తీర్మానం చర్చకు వచ్చినప్పుడు బేషరతుగా బలపరచడానికి వారు తిరస్కరించారు. ప్రతిపాదిత ఆంధ్ర రాష్ట్రంలో చేరాలా వద్దా అనేది నిర్ణయించుకునే స్వేచ్ఛ ప్రతి జిల్లాకూ ఉండాలని తీర్మానానికి పట్టుబట్టి సవరణ చేయించారు. మర్నాడు అదే పందిట్లో జరిగిన రాష్ట్ర కాంగ్రెసు మహాసభలో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు కృషిచేయవలసిందిగా మహాత్ముడిని కోరే తీర్మానాన్నీ బలపరచకుండా రాయలసీమ ప్రతినిధులు తటస్థంగా ఉన్నారు.
దీని తరవాత రాయలసీమ వైఖరి ఇంకా కరకుబారింది. నిర్ణయ స్వేచ్ఛ జిల్లాలకు ఉండాలనటం, ఓటింగులో తటస్థంగా ఉండటంతో ఆగక రాయలసీమకు ప్రత్యేక రాష్టమ్రే కావాలని ఆ ప్రాంతంవారు బాహాటంగా డిమాండు చేయసాగారు. రెండో రవుండ్ టేబుల్ కాన్ఫరెన్సు లండనులో నడుస్తూండగా 1931 అక్టోబరులో ఆంధ్ర మహాసభ ప్రత్యేక సమావేశం మద్రాసులో జరిగింది. దానికి కూడా రాయలసీమ ప్రముఖుడు కడప కోటిరెడ్డే అధ్యక్షత వహించారు. ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటుచేసి, దాని సరిహద్దులు తేల్చేందుకు వెంటనే ఒక కమిషనును నియమించాలని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సును కోరుతూ ఆ సభలో ఒక తీర్మానం చర్చకు వచ్చింది. రాయలసీమ ప్రతినిధులు చాలామంది దానిని వ్యతిరేకించారు. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కావలసిందే... కాని ఒకటికాదు రెండు... రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు కలిపి ఒక రాష్ట్రం; మిగతా తెలుగు జిల్లాలకు ఇంకో రాష్ట్రం- ఉండాలంటూ రాయలసీమకు చెందిన కె.సుబ్రహ్మణ్యం సవరణ ప్రతిపాదించాడు. ఒకవేళ ఆంధ్ర రాష్ట్రంలో చేరినా రాయలసీమకు శాసనసభలో తగిన వెయిటేజి ఉండాలనీ... రాజధాని బెజవాడలో పెట్టినా వేసవి కాలంలో మదనపల్లెకు రాజధాని తరలాలనీ అనంతపురం నేత కల్లూరి సుబ్బారావు ఇంకో సవరణ ప్రతిపాదించాడు. ఆ సంగతి పరిశీలించడానికి కమిటీ వేద్దామని పెద్దలు అన్నమీదట ఆయన దాన్ని వెనక్కి తీసుకున్నాడు.
మొత్తంమీద సర్కారు జిల్లాలంటే రాయలసీమ వారిలో గూడుకట్టిన అవిశ్వాసం, వారితో కలిస్తే తమకు అన్యాయం జరగవచ్చన్న ఆందోళన చర్చల సరళిలో కొట్టవచ్చినట్టు కనిపించింది. దాంతో రెండు ప్రాంతాల మధ్య అంతరాన్ని పూడ్చి సదవగాహన సాధించడంకోసం ఆంధ్ర మహాసభ తరఫున ఒక కమిటీని వేశారు. (కాశీనాథుని నాగేశ్వరరావు, చిలుకూరి నారాయణరావు, పిల్లలమర్రి ఆంజనేయులు, కోటిరెడ్డి, గాడిచర్ల ప్రభృతులు దానిలో సభ్యులు.) అది ఒళ్లు విరుచుకుని తీరుబడిగా పని మొదలెట్టేలోగా జాతీయ రాజకీయాల్లో పెనుమార్పులొచ్చాయి. రౌండ్ టేబుల్ విఫలమైంది. 1932 జనవరిలో గాంధీజీ అరెస్టు అయ్యారు. ఆ వెంటనే కాంగ్రెసు పార్టీ శాసనోల్లంఘన ఉద్యమానికి ఉపక్రమించింది. ఆ సందట్లో ఆంధ్ర రాష్ట్రం గొడవ అడుగున పడింది. కనీసం ఒక్కసారి కూడా సమావేశం కాకుండానే కొత్త కమిటీకి నూకలు చెల్లాయి.
సమస్యల పరిష్కారం విషయంలో నాయకులు శ్రద్ధచూపక, వేరే వ్యాపకాల్లో బిజీ అయిపోవడంతో సమస్య ఇంకా ముదిరింది. 1933 నవంబరులో మద్రాసు లెజిస్లేటివ్ కౌన్సిలులో ఆంధ్ర రాష్ట్రం ప్రతిపాదనపై చర్చ జరిగిన కాలంలో రాయలసీమ మేధావులు చాలామంది ఆ ప్రతిపాదనను వ్యతిరేకించారు. అదే సమయంలో రాయలసీమకు జరుగుతున్న అన్యాయాలను తెలియజెప్పేందుకు రాయలసీమ ప్రయోజనాలను పరిరక్షించేందుకు సి.ఎల్.నరసింహారెడ్డి, కె.సుబ్రహ్మణ్యం ప్రభృతులు ‘రాయలసీమ మహాసభ’ను స్థాపించారు. 1934 జనవరి 28న మద్రాసులో నెమలి పట్ట్భారామారావు అధ్యక్షతన జరిగిన మొదటి మహాసభలో ప్రసిద్ధ తమిళ నాయకుడు సత్యమూర్తి పాల్గొని ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటును వ్యతిరేకిస్తూ ప్రసంగించాడు. ముందు ఖరారైన చర్చనీయాంశాల్లో అప్పుడు జోరుగా నడుస్తున్న యూనివర్సిటీ వివాదంతోబాటు- ఆంధ్ర రాష్ట్రంలో రాయలసీమను చేర్చడాన్ని వ్యతిరేకించే అంశం కూడా ఉంది. ఏకీభావం కుదరక సభికుల్లో పేచీలొచ్చినందువల్ల... ఎలాగూ ఇప్పట్లో ఆంధ్ర రాష్ట్రం వచ్చేది కాదు కనుక రానిదాన్ని వ్యతిరేకించడం ఎందుకని కొందరు వారించినందువల్ల రాష్ట్రం విషయమై తీర్మానమేదీ చేయలేదు.
సర్కారు జిల్లాలతో పొత్తువద్దు- మనము వేరేగా ఉందామని ఉడుకు నెత్తురువాళ్లు ఎంత గట్టిగా అరిచినా రాయలసీమ పెద్దలు మరీ అంత దూరం వెళ్లడానికి ఇష్టపడలేదు. యూనివర్సిటీ విషయంలోనైనా, రాష్ట్రం విషయంలోనైనా మద్రాసుతోనే ఉంటాం, మీతో కలవం అని వారూ అడపాదడపా సర్కారు జిల్లాల వారితో గట్టిగానే అనేవారు. కాని అది బెదిరించి, ఒత్తిడిపెట్టి, తమకు అనుకూల నిర్ణయం జరిపించుకునే ఎత్తుగడగానే ప్రయోగించారు తప్ప నిజంగానే తెగతెంపులు చేసుకొనే ఉద్దేశం వారికి లేదు. 1933 నవంబరులో మద్రాసు లెజిస్లేటివ్ కౌన్సిలులో తీర్మానానికి చర్చ జరిగినప్పుడూ కడప కోటిరెడ్డి ప్రతిపాదిత ఆంధ్ర రాష్ట్రానికి మద్రాసు రాజధానిగా ఉండాలని సవరణ కోరాడే తప్ప ఆంధ్ర రాష్ట్రం వద్దేవద్దనలేదు. అప్పటికే ఆంధ్ర మహాసభలో ప్రముఖ పాత్ర వహిస్తున్న రాయలసీమ ప్రముఖులకు ‘ఆంధ్ర మహాసభ’కు పోటీగా ‘రాయలసీమ మహాసభ’ను పెట్టటమూ మొదట్లో ఇష్టంలేదు. ప్రజల్లో పలుకుబడి లేని కొద్దిమంది వ్యక్తులు నడిపిన వ్యవహారంగానే దాన్ని వారు భావించారు. మద్రాసులో జరిగిన మొదటి రాయలసీమ మహాసభకు గాని, 1935 సెప్టెంబరులో కడపలో జరిగిన రెండో మహాసభకు గాని కోటిరెడ్డి, గాడిచర్ల, రామాచార్యులు వంటి కాంగ్రెసు నాయకులు హాజరుకాలేదు. 1937లో నూతన రాజ్యాంగ చట్టం కింద మద్రాసు అసెంబ్లీ, కౌన్సిల్ ఎన్నికల్లో ‘రాయలసీమ మహాసభ’ ప్రముఖులు జస్టిస్ పార్టీ తరఫునో, ఇండిపెండెంట్లుగానో నిలబడి ఆంధ్ర రాష్ట్రానికి వ్యతిరేకంగా తీవ్ర ప్రచారం చేసినా ఒక్కరూ నెగ్గలేదు. రాయలసీమ ప్రజలు కాంగ్రెసు వారినే పెద్ద మెజారిటీతో గెలిపించారు.
ఐనా కాంగ్రెసు మహానాయకులకు కృతజ్ఞత లేకపోయింది. 1937 ఎన్నికల తరవాత చిత్రమైన పరిస్థితుల్లో చక్రవర్తుల రాజగోపాలాచారి రాజకీయ సన్యాసం విడిచిపెట్టి అప్పనంగా ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన ఏర్పరచిన మంత్రి వర్గంలో పదిమంది మంత్రులు; పది మంది పార్లమెంటరీ సెక్రటరీలు ఉన్నారు. ఉభయ శాసనసభల అధ్యక్ష, ఉపాధ్యక్షులతో కలిసి మొత్తం పదవులు 24. వాటిలో 10 ఆంధ్రులకు దక్కాయి. అన్నీ సర్కారు జిల్లాల వారికే. సీడెడ్ జిల్లాలకు ఒక్కటి కూడా దొరకలేదు. పది మంది మంత్రుల్లో ముగ్గురే ఆంధ్రులు. వారిలోనూ రాయలసీమ మంచి ఎవరూ లేరు. కడప కోటిరెడ్డిని కేబినెట్లోకి తీసుకోమని ప్రకాశం పంతులు చెప్పినా వినకుండా బెజవాడ గోపాలరెడ్డిని తీసుకున్నారు. ఇది రాయలసీమ వారికి సహజంగానే ఒళ్లు మండించింది. కోస్తా, సీమల మధ్య వైషమ్యాలను పెంచింది. కొత్తగా ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెసు అధ్యక్షుడైన పట్ట్భా సీతారామయ్య రాయలసీమలో విస్తృతంగా పర్యటించి, ఆంధ్ర రాష్ట్రానికి మద్దతు కోరినా ఎవరూ పెద్దగా స్పందించలేదు. మదనపల్లెలోనైతే పాపన్నగుప్త అనే నాయకుడు మాకు అన్యాయంచేసి, మా సాయం లేకుండా మీ ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలా తెచ్చుకుంటారో చూస్తామని పట్ట్భా మొగంమీదే సవాలు చేశాడు.
ఇలా- సీమకూ, కోస్తాకూ సంబంధాలు బెడిసి... అనుమానాలు, అపోహలు తారాస్థాయికి చేరిన సంక్లిష్ట సమయంలో ఆంధ్ర మహాసభకు పాతికేళ్లు నిండాయి.
అది ఇంకో ఆశాభంగానికి నాంది. *