ఆంధ్రుల కథ - 31

ఎం.వి.ఆర్ శాస్త్రి గారు ఆంధ్ర భూమి ఆదివారం అనుబంధం లో సీరియల్ గా ప్రచురిస్తున్న ఆంధ్రుల కథ యదాతథం గా..

దెబ్బదెబ్బకు ‘వందేమాతరం’ (November 21st, 2010)

ముందు నడవవలసిన వారు బాగానే నడిచారు.
వెనక అండగా ఉండి నడిపించవలసినవారే నట్టేట ముంచారు.
నిజాం దొరతనం పశుత్వానికి పెట్టింది పేరు. కించిత్తు ధిక్కారాన్ని కూడా క్రూరంగా శిక్షించే రాజ్యమది. అలాంటిచోట నిషేధాజ్ఞను ఉల్లంఘించి ఏకంగా సర్కారునే ఎదిరిస్తే ఏమవుతుందో ఊహిస్తేనే సామాన్యులకు గుండెలదురుతాయి. అయినా హైదరాబాదు జాతీయవాదులు జంకలేదు. అన్ని వర్గాలను ఒక్క తాటిమీదికి తెచ్చి బాధ్యతాయుత ప్రభుత్వంకోసం పోరాడేందుకు తలపెట్టిన స్టేట్ కాంగ్రెసుకు పురిట్లోనే పీకనొక్కినా వారు నీరుగారలేదు.
అప్పటిదాకా హైదరాబాదు రాజ్యంలో జాతీయోద్యమం ఉందంటే ఉంది. లేదంటే లేదు. ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెసు కమిటీకి అనుబంధంగా హైదరాబాదు జిల్లా కాంగ్రెసు కమిటీ పేరుకు మాత్రం ఉండేది. ఆంధ్ర చరఖా సంఘానికి అనుబంధంగా ఖాదీసంస్థ ఒకటుండేది. దాని ఆధ్వర్యంలో నిజామాబాద్, కరీంనగర్ లాంటి జిల్లాల్లో ఖాదీ ఉత్పత్తి సంస్థలు పనిచేస్తుండేవి. హైదరాబాద్ నగరంలో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం సమీపాన ఓ ఖాదీ భండారం ఉండేది. దేశభక్తులైన పాతకాలపు పెద్దలు ఖద్దరు ధరించి, ‘రఘుపతి రాఘవ రాజారాం’ పాడుతూ... ఏడాదికొకసారి కాంగ్రెసు మహాసభలు దేశంలో ఎక్కడ జరిగినా... హాజరవుతూ... జాతీయ నాయకుల బోధలు ఆలకిస్తూ... అడపాదడపా అవసరమైనప్పుడు నిజాం సర్కారువారికి పెద్దమనిషి తరహాలో విన్నపాలుచేసూ... తమకు రాజకీయ ఉద్దేశాలేమీ లేవని, రాజకీయ కార్యకలాపాలను తలపెట్టే ముచ్చటే లేదని శాయశక్తులా నమ్మకం కలిగిస్తూ కాలక్షేపం చేసినంతకాలమూ వారికి గాని, నైజాం గవర్నమెంటుకు గాని, కాంగ్రెసు జాతీయ నాయకులకు గాని- ఏ సమస్యా లేకపోయింది. ఏటేటా ఆంధ్ర మహాసభలు జరిగినా అవి రాజకీయాంశాల జోలికి పోయేవి కావు. నిజాం సర్కారే రాజ్యాంగ సంస్కరణలు సూచించడానికి అరవముదు కమిటీని కంటి తుడుపుగా ఏర్పాటుచేయడంతో 1937 నిజామాబాదు మహాసభలో మాత్రం బాధ్యతాయుత ప్రభుత్వం కావాలని కోరే రాజకీయ తీర్మానాన్ని ప్రప్రథమంగా చేసే అవకాశం చిక్కింది.
ఇటువంటి నిస్తబ్ద నేపథ్యంలో స్టేట్ కాంగ్రెసు సంస్థాపన నైజాం జన జీవితంలో కొత్త చైతన్యం తెచ్చింది. అంతవరకు ప్రభుత్వంతో రాజీ సంప్రతింపులకోసం ఉత్తర ప్రత్యుత్తరాలు, రాయబారాలు జరుపుతున్న బూర్గుల రామకృష్ణరావులాంటి మితవాద నాయకులు నిషేధాజ్ఞలకు జడిసి ఇంటిపట్టున ఉండిపోతేనేమి? స్వామి రామానందతీర్థ, రావి నారాయణరెడ్డి వంటి ఉత్సాహవంతులు చొరవ తీసుకుని నిరంకుశ నిషేధాన్ని నిరసిస్తూ చరిత్రాత్మక సత్యాగ్రహం చేపట్టారు. ఆ ముచ్చటను రావి నారాయణరెడ్డి ఇలా వివరించారు:
ఆనాటి నైజాం నిరంకుశ పాలనలో ఎంతో ధైర్యసాహసాలున్నవారికి తప్ప ఆనాడు సత్యాగ్రహం గురించి తలపోసే అవకాశమే వుండేదికాదు... మొదటి జట్టు సత్యాగ్రహుల్లో చేరడానికి తెలంగాణ తరఫున ఎంతమంది నాయకులను ప్రార్థించినా ముందుకు రాగల ధైర్యం ఎవరికి లేకపోయింది. అందుకని ప్రథమ దశలో తెలంగాణా ప్రాతినిధ్యం వహించే భారం నేను వహించాను. కర్ణాటక ప్రాంతం తరఫున జనార్దనరావు దేశాయిగారు సత్యాగ్రహ దళంలో చేరారు. నగరంనుంచి రామకృష్ణ ధూత్‌గారు, శ్రీనివాసరావు బోరేకర్ అనే యువకుడు కూడా చేరారు.
ఈ దళం (1938 అక్టోబరు 24న) సుల్తాన్‌బజార్ నుండి బ్రహ్మాండమైన ఊరేగింపు వెంట రాగా కోఠీవద్దగల టెలిగ్రాఫ్ ఆఫీసు ప్రాంతానికి చేరింది. ప్రజలు మమ్ము పూలహారాలతో ముంచెత్తారు. సత్యాగ్రహ దళ సభ్యులమంతా ప్రకటనలను తయారుచేసుకుని తెచ్చుకున్నాం. గోవిందరావు నానల్‌గారు ముందు తమ ప్రకటన చదివారు. నిషేధాజ్ఞలను ధిక్కరించిన నేరం మీది పోలీసులు మమ్మల్ని వెంటనే అరెస్టుచేశారు. చుట్టూ ఉన్న వేలాది కంఠాలు ‘స్టేట్ కాంగ్రెస్ జిందాబాద్’అనే నినాదాలు మిన్నుముట్టుతుండగా ప్రథమ సత్యాగ్రహ దళం పోలీసుల మధ్య సాగింది... మేజిస్ట్రేటు మాకు రెండు నెలల శిక్ష విధించాడు. రెండు వందల రూపాయల జుల్మానా, అది ఇవ్వకపోతే మరో పదిహేను రోజుల జైలుశిక్ష.
రెండవ సత్యాగ్రహ దళానికి స్వామీరామానందతీర్థ నాయకత్వం వహించారు. అక్కడినుంచి రెండునెలలవరకు రాష్ట్రంలో సత్యాగ్రహోద్యమం సాగింది. ఈమారు నాలుగువందల మంది జైళ్లకు వెళ్లారు. హైదరాబాదు సంస్థాన చరిత్రలో ప్రభుత్వ ఆజ్ఞలను ధిక్కరించడమే ఒక పెద్ద సాహసం. అలాంటిది ఆజ్ఞలను ధిక్కరించి సత్యాగ్రహ దళాలు జైలుకు వెళుతున్నాయన్న వార్త ప్రజల్లో విశేష సంచలనాన్ని కలిగించింది. వారిలో రాజకీయ చైతన్యాన్ని ప్రదీప్తం చేసింది. హైదరాబాదు, మధిర, మరట్వాడలో ఔరంగాబాదు, కర్ణాటక ప్రాంతంలో ఒకటి చొప్పున మొత్తం నాలుగు సత్యాగ్రహ శిబిరాలు నడిచాయి.
వీర తెలంగాణా, నా అనుభవాలు- జ్ఞాపకాలు,
రావి నారాయణరెడ్డి, పే.22-24
1938 అక్టోబరు 27న రెండో జట్టు సత్యాగ్రహానికి నాయకత్వం వహించిన స్వామి రామానంథతీర్థ నాటి ప్రజల ఉత్సాహాన్ని, కార్యకర్తల ధీరత్వాన్ని, జైల్లో సత్యాగ్రహుల అనుభవాలను ఇలా గుర్తుచేసుకున్నారు:
ప్రజలలో ఉత్సాహం పరవళ్లు తొక్కుతోంది. వారు వేల సంఖ్యలో అక్కడ కూడారు. సగం ప్రకటన చదివానో లేదో నన్ను అరెస్టుచేశారు. ప్రజలలో కొంత అలజడి కన్పించింది. మమ్మల్ని వెంటనే జైలుకు కొనిపోయారు. మమ్మల్ని రెండుగదుల్లో బంధించారు... రెండురోజుల తర్వాత నేర విచారణ అనే ఫార్సు జరిగింది. మేజిస్ట్రేటు నాకు 18 నెలల కఠిన జైలుశిక్ష వేశారు. నా జట్టులో వున్న వారందరికి కూడా వేర్వేరు కాల పరిమితుల కఠిన జైలు శిక్షలు వేసాడు.
... కాళ్లకు ఇనప కడియముతో బంధము జైలులో ప్రవేశించినప్పుడే పడింది. కప్పుకునేటందుకు ఒక గొంగడీ, తిండి తినేటందుకు కంచము, నీరు తాగేటందుకు ఒక లోటా, పడుకునేటందుకు
ఒక చాప, తువాలు, ఒక జత నిక్కర్లు, ఒక బనీను జైలులో ఆస్తిగా మాకు సంక్రమించినాయి.
నేనున్న జైలుగది చిన్న కూపం. దాని పొడుగు ఎనిమిది అడుగులు. వెడల్పు నాలుగడుగులు. గదిలోవున్న నాకు బైట వున్నదేదీ కనిపించే అవకాశం లేదు. రాత్రి దీపం ఏమీలేదు. ఒక గదిలో ఒక మూల ఒక మూకుడు మలమూత్రం విసర్జన ఏర్పాటుకోసం వుండనిచ్చారు. రోజుకొకసారి నన్ను స్నానంకోసం కొన్ని నిమిషాలు బైటకి కొనిపోయే ఏర్పాటుచేశారు. ఆ సమయంలో నేను ఎవరితోనూ ఏమీ మాట్లాడకూడదు. ...
... క్రమంగా మా జైలు సత్యాగ్రహులతో నిండిపోయింది. వారి సంఖ్య వందలకు పెరిగింది. యువకులు గొంతెత్తి పాడే దేశభక్తి గేయాలూ, భక్తి కీర్తనలూ మమ్మల్నందరినీ తెల్లవారుజాముననే మేల్కొల్పేవి.
... సత్యాగ్రహులలో హిందువులైన వారిని అరెస్టుఅయిన వెంటనే పోలీసులు ప్రత్యేకంగా హింసించడం ప్రారంభించారు. అట్లాంటి హింసా చర్యలు, విధానాలు ఊహాతీతములు... హిందువుల భుజం మీద వేలాడుతూ వుండే యజ్ఞోపవీతాలను లాగి పారవేసేవారు. అందుచేత ఆ సత్యాగ్రహులు సహజంగా తమ జంఝాలు తిరిగి తమకు సమర్పిస్తే గాని భుజించమని నిరాకరించేవారు. జంఝాలను తిరిగి ఇచ్చినా జంఝం వేసుకోవడమనేది మత సంబంధమైన కర్మ కలాపమనీ అందుచేత తాము వాటిని తిరిగి వేసుకునేటందుకు మంత్రం చెప్పే పురోహితుడిని పిలిపించాలనీ పట్టుపట్టారు! జైలరు నా దగ్గరికి వచ్చి నేను మంత్రం చెప్పి సత్యాగ్రహులు తిరిగి తమ జంఝాలు ధరించేటట్లు నచ్చచెప్పవలసిందని కోరాడు.
... సత్యాగ్రహులను నా దగ్గరకు కొని తెచ్చారు. వారు వరసగా ఒకరొకరే స్నానాలుచేసి వచ్చారు. నేను మంత్రం ఉచ్చరిస్తూంటే నా మాటలను వారూ ఉచ్చరించాక వారికి వరసగా జంఝాలు ఇవ్వడంతో క్రియ పూర్తయింది. నాకు వారందరు కొంత దూరంగా వుండేటట్లు కూర్చుండబెట్టారు. వారు నాతో మరేమీ సంభాషించకూడదని ఆ జాగ్రత్త తీసుకొన్నారు. ఇంతచేసినా కొందరు యుక్తిపరులైన సత్యాగ్రహులు మంత్రవాక్యంలో నడుమ దానితో యేమీ సంబంధంలేని కొన్ని ఇతర వాక్యాలను చొప్పించి జైలుకు బైటవున్న ప్రపంచంలో సంభవిస్తున్న సంఘటనల సమాచారం కొంత అందించారు. జైలరుకు సంస్కృత భాషతోగాని, దాని ఉచ్ఛారణతోగాని ఎంతమాత్రమూ పరిచయము లేనందువల్ల ఆ వాక్యాలు కూడా మంత్ర సందర్భోచితమైనవనే భ్రమలో ములిగిపోయాడు. ఈ రీతిగా జైలులో యేకాంతవాస కఠినశిక్ష అనుభవిస్తున్న నాకు అత్యంత నవీన ధోరణిలో వార్తాప్రసారం వినే అవకాశం లభించింది!
ఒకరోజున వేకువ జామున జైలు గదుల శ్రేణిలో ఒక మూలనుంచి ‘వందేమాతరం’ వినవచ్చింది. వెంటనే ప్రతి సత్యాగ్రహీ ఆ జాతీయగేయం పాడటం మొదలుపెట్టాడు. ఈ విధంగా వేకువ వేళల వందేమాతరం బృందగానం మరో మూడురోజులు కొనసాగిన మీదట జైళ్లలో వందేమాతరం గేయాన్ని పాడటం నిషేధిస్తున్నట్టు ఉత్తరువులు ప్రకటించాడు. అయినా సత్యాగ్రహులు పాట పాడడం కొనసాగించారు.
ఒకనాడు మధ్యాహ్నము ఖైదీలందరూ వారివారి గదుల్లో నిర్బంధింపబడ్డారు. వందేమాతరం పాట పాడుతూ అధికారుల ఆజ్ఞ ధిక్కరించిన నేరానికి ఒక సత్యాగ్రహిని పేము బెత్తంతో గొడ్డును బాదినట్టు ఎడాపెడా మూడు డజన్ల దెబ్బలు కొట్టారు. ఈ శిక్షకు పాత్రుడైన నేరస్థుడ్ని ఒక గుంజకు కట్టిమరీ కొడతారు. ఆ శిక్షాస్థానం నా గదికి దగ్గరగా ఏర్పాటుచేశారు. అందుచేత ప్రతి దెబ్బవల్లా కలిగిన చప్పుడు నా చెవుల్లో పడుతూనే ఉంది. ఒక్కొక్కదెబ్బ తగిలినప్పుడల్లా ఆ సత్యాగ్రహి ‘వందేమాతరం’ అంటూ గొంతెత్తి నినాదం చేస్తూనే ఉన్నాడు. రక్తబిందువులు శరీరంనుంచి పైకి చిందుతూనే ఉన్నాయి. నేను 14సార్లు, ఆ ‘వందేమాతరం’అనే నినాదం విన్నాను. తర్వాత ఆయన సొమ్మసిల్లి స్మృతి తప్పి పడిపోయినట్లున్నాడు. నినాదం వినిపించలేదు- అది ఆయన శరీరం మీద పడుతూన్న దెబ్బల చప్పుడులో లీనమైపోయింది.
ఆ ధీర సత్యాగ్రహి వందేమాతరం రామచంద్రరావు. ‘‘వందేమాతరం’’ అనేది ఆయన పేరుతో ముడిపడి కలిసిపోయి కీర్తి పతాకగా ఉంది.’’
హైదరాబాదు స్వాతంత్య్ర పోరాటము, స్వామిరామానందతీర్థ, పే.166-173
ఇలా హైథరాబాదు స్టేట్ కాంగ్రెస్ ఉద్యమం ఆరంభమై నడుస్తూండగానే ఆర్య ప్రతినిధి సభ ఆర్య సమాజ సత్యాగ్రహాన్ని ప్రారంభించింది. వారి కార్యస్థానం షోలాపూర్. అక్కడినుంచి సత్యాగ్రహులు జట్లుజట్లుగా ప్రవేశించి హైదరాబాదు నగరంలో శాసనోల్లంఘన చేసేవారు. ఇదేకాక హిందు సివిల్ లిబర్టీస్ యూనియన్ ఆధ్వర్యంలో హిందువుల పౌర హక్కుల నిమిత్తం ఇంకో సత్యాగ్రహ ఉద్యమం జరిగింది. ఈ విధంగా ఒకే కాలంలో మూడు సత్యాగ్రహోద్యమాలు ఉద్ధృతంగా నడిచాయి.
అంటే- దేశీయ రాజ్యాల ప్రజలు మామీద ఆధారపడకుండా స్వశక్తి మీద నిలబడి తమ పోరాటాలను తామే సాగించాలి అని హరిపుర కాంగ్రెసు చేత మహాత్ముడు చెప్పించినదాన్ని హైదరాబాద్ ప్రజలు తుచ తప్పక పాటించారు. అదీ అల్లరిచిల్లరిగా కాకుండా మహాత్ముడు చూపిన అహింసా మార్గానే్న పట్టి, ఆయన ప్రసాదించిన సత్యాగ్రహ ఆయుధానే్న ధరించి, ఆయన నిర్దేశించిన నిబంధనలకే కట్టుబడి నియమబద్ధంగా తమ నిరసన తెలియజేయసాగారు. అంతా తాము చెప్పినట్టే జరుగుతున్నప్పుడు మహాత్ముడు, కాంగ్రెసు జాతీయ నాయకులు సహజంగానే హైదరాబాదు సత్యాగ్రహాన్ని దీవించి, సమర్థించి, దానికి వెన్నుదన్నుగా నిలబడి ఉండాలి కదా?
కాని- మన మహానాయకులు కోట్లాది ప్రజలను చీకటి కూపంలో బంధించి అమానుషంగా వేధిస్తున్న నిజాం కర్కోటక ప్రభుత్వంపై ధర్మాగ్రహం ప్రకటించి, పోరాటయోధులకు బాసటగా నిలవాల్సిందిపోయి నిజాం సర్కారుకే నిజమైన మిత్రుల్లా వ్యవహరించారు. ఆ ప్రభుత్వంచేత మంచి అనిపించుకోవటానికే... ఆ ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా, ఇరకాటంలో పడకుండా బయట వేయటానికే అత్యుత్సాహం చూపారు. తమను నమ్ముకున్నవారిని వారి కర్మానికి వదిలేశారు.
ఆ సమయాన నిజాం సర్కారులో కాంగ్రెస్ నాయకులకు మంచి పలుకుబడే ఉంది. అప్పటి నైజాం ప్రధాని సర్ అక్బర్ హైదరీ గాంధీగారికి, కాంగ్రెసు అగ్రనాయకులకు బాగా తెలిసినవాడు. పూర్వపు కాంగ్రెసు అధ్యక్షుడు బద్రుద్దీన్ తయ్యబ్జీకి ఆయన స్వయాన అల్లుడు. కాని- ఆ పలుకుబడిని ఉపయోగించుకుని స్టేట్ కాంగ్రెసుకు ఉపకారం ఎలా చేయగలమా అని కాకుండా... స్టేట్ కాంగ్రెసుపై తమ పలుకుబడిని ఉపయోగించి దివాన్జీకీ, నిజాం సర్కారుకూ ఎలా సహాయపడగలమా అనే మన మహాత్ములు ఎంతసేపూ ఆలోచించారు.
స్టేట్ కాంగ్రెసుపై ముందస్తు నిషేధాన్ని విధించారని తెలిశాక గాంధీగారికి ఆంతరంగికుడైన సేఠ్ జమునాలాల్ బజాజ్ సర్ అక్బర్ హైదరీకి రాసిన ఈ ఉత్తరాన్ని చూడండి:
1 October 1938
... You have in the working committee many true friends. Gandhiji is never tired of mentioning you as a Philosopher... Smt.Sarojini Devi is like a member of your family. Sardar remembers your invitation to him... Somehow or other your recent measures have given us a shock...
I hope you have appreciated the mildness of the reference to these measures in the A.I.C.C. resolution.

1 అక్టోబరు 1938
... కాంగ్రెసు వర్కింగు కమిటీలో మీకు నిజమైన మిత్రులు చాలామంది ఉన్నారు. గాంధీజీ మిమ్మల్ని తత్వవేత్త అని ఎప్పుడూ పేర్కొంటుంటారు. సరోజినీదేవి మీ ఇంట్లో మనిషిలాంటిది. సర్దార్ పటేల్ మీ ఆహ్వానాన్ని గుర్తుచేసుకుంటారు... ఏమైనప్పటికీ మీరు తీసుకున్న ఇటీవలి చర్యలతో మేము షాకయ్యాము... ఈ చర్యల గురించిన ప్రస్తావన ఎఐసిసి తీర్మానంలో ఎంత మృదువుగా చేసిందీ మీరు గమనించి సంతోషించారని నేను ఆశిస్తున్నాను.
ఇక ఇంకో ఆరు రోజుల్లో స్టేట్ కాంగ్రెస్ సత్యాగ్రహం మొదలవనున్నదనగా ఇదే సేఠ్‌జీ అదే హైదరీకి రాసిన ఈ లేఖను చిత్తగించండి:

18 October 1938
... I had shown your letter to Mahatmaji, Sardar Patel, Mrs.Naidu and other members of the Working Committee, and we had all felt almost sure that the ban on the formation of the State Congress would be lifted without avoidable delay...
I understand that the Provisional Committee of the State Congress contemplate some sort of direct action in the immediate future. This will only complicate matters... If you feel that my services could be of any use in preventing matters from coming to a head I shall try to render such help as I can...
You are yourself well aware of the policy of the Indian National Congress with regard to the States. As I told you at Pondicherry, that policy has all along been of helping to avoid a conflict... I shall therefore request you to lift the ban as soon as possible. If you deem it necessary I am prepared to go to Hyderabad and meet the organisers of the State Congress... I shall be willing to start even if I receive an intimation telegraphically.
[Freedom Struggle in Marathwada, P.381,
WWW.maharashtra.gov.in/english/gazetteer/
Vol.XII/CIVIL_DISO_MOVT-Vol.XII-PAGE-349-400.pdf.]

18 అక్టోబరు 1938
(మీ ఉత్తరాన్ని మహాత్మాజీకీ, సర్దార్‌పటేల్‌కూ, సరోజినీ నాయుడుకూ చూపించాను. స్టేట్ కాంగ్రెసు ఏర్పాటుమీథ నిషేధాన్ని ఆలస్యం చేయకుండా ఎత్తివేస్తారనే మేమందరం విశ్వసిస్తున్నాం...
స్టేట్ కాంగ్రెస్ తాత్కాలిక కమిటీ కొద్దిరోజుల్లో ఏదో ప్రత్యక్ష చర్యకు దిగదలిచినట్టు నేను విన్నాను. ఇది వ్యవహారాన్ని ఇంకా జటిలం చేస్తుంది. పరిస్థితి విషమించకుండా చేయడానికి నా సేవలు ఏమైనా ఉపయోగపడతాయని మీరు అనుకుంటే నేను చేయగలిగిన సహాయం చేస్తాను...
దేశీయ రాజ్యాల విషయంలో భారత జాతీయ కాంగ్రెసు పాలసీ ఏమిటో మీకు బాగా తెలుసు. ఘర్షణను నివారించడమే మొదటినుంచీ మా విధానమని మీకు పాండిచ్చేరిలో చెప్పాను... కాబట్టి నిషేధాన్ని సాధ్యమైనంత త్వరగా ఎత్తివేయమని నేను మిమ్మల్ని కోరుతున్నాను. మీరు కనుక అవసరమనుకుంటే నేను హైదరాబాదు వచ్చి స్టేట్ కాంగ్రెస్ ఆర్గనైజర్లతో మాట్లాడగలను. టెలిగ్రాం ఇచ్చినా చాలు వెంటనే బయలుదేరగలను.)
బజాజ్‌గారు ఇంత ఓవరైపోయినా హైదరీగారు ఉలకలేదు. పలకలేదు. ఎదురుచూసిన టెలిగ్రాం ఎంతకీ రాకపోయేసరికి... సేఠ్‌గారే టెలిగ్రాం ఇచ్చి పయనమై బొంబాయి మకాంలో దివాన్జీని దర్శించారు.
అప్పుడు ఏమి జరిగిందన్నది అక్బర్ హైదరీగారే వచ్చేవారం చెబుతారు. *