ఆంధ్రుల కథ - 14

ఎం.వి.ఆర్ శాస్త్రి గారు ఆంధ్ర భూమి ఆదివారం అనుబంధం లో సీరియల్ గా ప్రచురిస్తున్న ఆంధ్రుల కథ యదాతథం గా..

కాంగ్రెసు కాటు.......(July 25th, 2010)

నిజమే కావాలా? అయితే కాంగ్రెస్సు మనల్ని తొక్కేసింది; వుద్ధరించలేదు...
...ఆంధ్రోద్యమమూ ‘ఆంధ్ర మహాసభా రెండూ ‘‘నాయనా! నువ్వు ‘ఆంధ్రుడవోరుూ’’, అని మనల్ని తట్టి లేపాయి... ‘‘వురుకు, వెనకపడిపోతున్నావు. సాటివారు తొక్కేస్తారు సుమా’’ అని వుత్సాహం కలిగించాయి. నిజంగా మనకి అప్పుడు ప్రబోధం కలిగింది... రక్తనాళాల్లో వేడివేడి కొత్త రక్తం ఉరకలు వేసింది; కాని మంచి రసకందాయపు పట్టులో నడమంత్రపు కాంగ్రెస్సు వచ్చి వీటిమీద దెబ్బకొట్టింది.
ఇంతేకాదు... గుజరాతీలకీ, హిందూస్థానీలకీ మనల్ని భృత్యులుగా తయారుచేసింది కాంగ్రెస్సు. మన ఆంధ్రోద్యమాన్ని అడిచేసింది. మన ఆంధ్ర మహాసభని నేలమట్టం చేసింది. మన రాష్ట్ర వాంఛని తునాతునకలు చేసింది.
‘‘సంపూర్ణ స్వరాజ్యమే మనకి లక్ష్యం. తెనుగు జిల్లాలను విడదీసి వొక ప్రత్యేక రాష్ట్రంగా నిర్మించవలసిందని దొరతనం వారిని కోరడం సహాయ నిరాకరణ వ్రతులమైన మనకి నామోషీ పని. అది మన ఆత్మగౌరవానికి భంగకరం’’ ఇదీ మనకి కాంగ్రెస్సు చేసిన వుపదేశం.
మనం ఈ వుపదేశాన్ని పూర్తిగా తలకెక్కించుకున్నాం. దీనితో మనకి ఆంధ్రత్వం మరుపువచ్చింది...
1934 అక్టోబరు ‘‘ప్రబుద్ధాంధ్ర’’ సంచిక (పేజీలు 413, 414)లో శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్తిగారు చేసిన సంపాదకీయ ‘‘వ్యాఖ్యానములు’’ ఇవి. వినడానికి పరుషంగా, కాంగ్రెసువాదులకు కర్ణకఠోరంగా తోచవచ్చు. తెలుగునాట గాంధీనీ, ఖాదీనీ, హిందీనీ ఆదినుంచీ దృఢంగా వ్యతిరేకించిన బహుకొద్దిమందిలో శ్రీపాద అగ్రగణ్యుడు. గాంధీ అంటే ఎలర్జీ కాబట్టే ఆయన ఇలా అడ్డగోలు ఆరోపణలు చేశాడులెమ్మని గాంధీ భక్తులు కొట్టిపారేయవచ్చు. కాని ములుకుల్లాంటి శ్రీపాద పలుకులు ఆ కాలపు ఆంధ్రోద్యమ నిస్తబ్ధతకు నిలువుటద్దాలు.
స్వరాష్ట్రం సాధించాలన్న చిరకాల వాంఛ తీరాలంటే ఆంధ్రులు చేయవలసినవి ముఖ్యంగా మూడు: అప్పటికే స్థాపించుకున్న ఆంధ్ర మహాసభను పటిష్ఠంగా పనిచేయించి, ప్రజలను సమీకరించి, అన్ని వర్గాలను కలుపుకొని విస్తృత ప్రాతిపదికన విశాల ఉద్యమాన్ని నడపాలి. శాసనసభా వేదికలపై ఆంధ్రుల వాణిని బలంగా వినిపించి, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ప్రభుత్వాన్ని ఒత్తిడిచేయాలి. అనుకూల నిర్ణయం జరిగేట్టుగా రాష్ట్ర రాజధాని మద్రాసులోనూ, దేశ రాజధాని ఢిల్లీలోనూ, ఇంపీరియల్ కేంద్రం లండనులోనూ ఒడుపుగా లాబీయింగూ చేయాలి. కావాలనే చేసినా, అసంకల్పితంగా జరిగినా ఈ మూడింటిలోనూ కాంగ్రెసు బంధమే ఆంధ్రులకు ప్రతిబంధకమైంది.
ఆంధ్రులు మిగతావారిలా కాదు. మహా ఆవేశపరులు. చూసి రమ్మంటే కాల్చి వచ్చే ప్రమాదకరమైన వ్యక్తులు- అని గాంధీగారికి మొదట్లోనే అర్థమైంది. ఊళ్ళో ఉండలేకపోతే ఊరొదిలి పోరాదా అని తాను ఏదో మాటవరసకు అంటే- దాన్ని పట్టుకుని దుగ్గిరాల ‘రామదండు’ నిజంగానే అంత పనీ చేసి మొత్తం చీరాలను ఖాళీ చేయించినప్పుడే ఆంధ్రుల తత్వం మహాత్ముడికి అర్థమైంది. ఎన్ని సత్యాగ్రహాలు చేసినా, ఎన్ని ఉద్యమాలు నడిపినా వాటివల్ల తెల్లదొరతనానికి ఇబ్బంది లేకుండా చూడాలని ఒక చెంప తాను ఆరాటపడుతూంటే... ఈ ఆంధ్రా కుంకలేమిటి? తన బొమ్మను పెట్టుకుని, తన మాటను పట్టుకుని మహాఘనత వహించిన బ్రిటిషు ప్రభువులపైనే ధ్వజమెత్తి, పన్నులు ఎగ్గొట్టి ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తున్నారు- అని ఆయన ఎంత ఇదయ్యారు? వారిచేతా వారిచేతా కబురు పంపించి, చీటీలు రాసి, పత్రికాముఖంగా సందేశాలంపి, గుంటూరు జిల్లాలో పన్ను నిరాకరణ ఉద్యమాన్ని మాన్పించటానికి ఎంత శ్రమపడ్డారు? ఇలాంటి ‘కోతులకు’ జడిసేకదా దేశంలో చక్కగా నడుస్తున్న సహాయ నిరాకరణోద్యమానే్న ఏదో మిష చూపి మొత్తంగా గుంటపెట్టి గంట వాయించారు? గుంటూరు కారం ఒకసారి నసాళానికెక్కాక మళ్లీ ఆంధ్రావాళ్లు ఉద్యమం నడపటానికి గాంధీగారు కంఠంలో ప్రాణం ఉండగా అనుమతిస్తారా? తానే ఉపదేశించిన పన్ను నిరాకరణ అస్త్రానే్న తిన్నగా ప్రయోగించనివ్వకుండా అడ్డుపడ్డ మహాత్ముడు అసలు తన ఉపదేశాల్లోనే లేని ఆంధ్ర రాష్ట్ర ఉద్యమానికి అంత తేలిగ్గా అనుమతి ఇస్తారా?
ఇవ్వరు. అందుకే ఆంధ్ర నాయకులు తనదగ్గర ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఊసెత్తినప్పుడల్లా- ‘‘స్వరాజ్యం వచ్చేదాకా గుర్రం కట్టేయండి; అది వచ్చీరాగానే నేనే మీరు కోరిన రాష్ట్రాన్ని మీకిప్పిస్తా’’నని ఊరించి జోకొట్టేవారు. వీధికెక్కి ఉద్యమించడానికే కాదు, లౌక్యంగా ప్రభుత్వానికి నచ్చచెప్పి, ఆంధ్రుల డిమాండు సమంజసమన్న నమ్మకం కలిగించి, దౌత్యంతో కార్యం సాధించడానికి కూడా ఆయన ఇష్టపడేవారు కాదు.
రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సుకు కాంగ్రెసు ఏకైక ప్రతినిధిగా లండను పోతున్న సమయంలో అక్కడ మా రాష్ట్రం సంగతి కాస్త ప్రయత్నం చేయండి- అని ఆంధ్ర నాయకులు అడిగినప్పుడు కూడా ‘‘స్వరాజ్యం వస్తే అన్ని సమస్యలూ తీరుతాయి. ఓపిక పట్టండి’’అనే గాంధీగారు ప్రశస్తమైన శుష్కప్రియంతో శూన్యహస్తం చూపారు.
మద్రాసు రాష్ట్రంనుంచి సంపన్న ఆంధ్ర ప్రాంతాలు విడిపోతే తమిళులకు నష్టం కనుక, అలా ఎన్నటికీ జరగనివ్వరాదని అరవ పెద్దలు పట్టుదలతో ఉన్నారు. లౌక్యాలు, లోపాయకారీ మంత్రాంగాల విషయంలో వారు మనకంటే నాలుగు ఆకులు ఎక్కువ చదివారు. అన్నిటికీ మించి అసలైన అరవ శకుని రాజగోపాలాచారి గాంధీగారికి అంతేవాసి. స్వయానా వియ్యంకుడుకూడా. గాంధీకి ఏమిచెప్పాలో, ఆయనచేత ఏమి చెప్పించాలో, ఆయన వైఖరిని, నిర్ణయాలను తెర వెనకనుంచి ఎలా ప్రభావితం చెయ్యాలో రాజాజీకి బాగా తెలుసు. పదే పదే తల బొప్పికట్టినా ఈ శకుని తంత్రాలను, గాంధీగారి మీద పనిచేస్తున్న ప్రతికూల ప్రభావాలను మహామేధావులైన ఆంధ్ర ప్రముఖులే పోల్చుకోలేకపోయారు. స్వరాజ్యం వచ్చేదాకా ఆంధ్ర రాష్ట్రం సంగతి పక్కనపెట్టమన్న గాంధీ బోధను దైవశాసనంగా ఔదలదాల్చి, ఆంధ్రోద్యమాన్ని చేజేతులా నీరుగార్చారు.
పోనీ- సర్వరోగ నివారణి అనుకున్న సదరు స్వరాజ్యమైనా
శీఘ్రంగా సిద్ధిస్తుందా అంటే అదీ లేదు. ఆ స్వరాజ్యం ఎండమావి. వెంటపడేకొద్దీ వెనక్కిపోతుంది. సహాయ నిరాకరణ బ్రహ్మాస్త్రంతో సంవత్సరంలోగా స్వరాజ్యం సాధించి తీరుతానని 1920 డిసెంబరు నాగపూర్ కాంగ్రెసులో గాంధీజీ శపథం చేసినప్పుడు నిజంగానే 1921 సంవత్సరం వెళ్ళేలోపే స్వరాజ్యం పెట్టేబేడా పట్టుకుని వచ్చేస్తున్నదని అందరిలాగే ఆంధ్రులూ మురిశారు. అలాంటి సంవత్సరాలు ఎన్ని గడిచినా, దశాబ్దాలే తిరిగినా స్వరాజ్యం జాడలేదు. పెళ్లి కుదిరితే గానీ పిచ్చి కుదరదన్నట్టు- స్వరాజ్యం వస్తే గానీ స్వరాష్ట్రం రాదని లంకె పెట్టటంతో అది వెనక్కి పోయేకొద్దీ ఆంధ్ర రాష్ట్రోద్యమమూ బలహీనపడింది.
అసలు ఆంధ్ర మహాసభనే మొత్తంగా ఎత్తివేసి రాష్ట్ర సాధన బాధ్యతను రాష్ట్ర కాంగ్రెసుకు వదిలివేయాలని 1921 సెప్టెంబరులో గంపలగూడెం కుమారరాజా కె.వి.కృష్ణారావు అధ్యక్షతన బరంపురంలో జరిగిన ఆంధ్ర మహాసభ వార్షిక సమావేశంలో ఒక ప్రతిపాదన వచ్చింది. బహుశా అంత పనీ జరిగేదేమో. కాని మన అదృష్టంకొద్దీ ‘ఆంధ్రరత్న’ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య అడ్డుపడ్డాడు. అఖిలపక్ష రాజకీయ వేదికగా ఆంధ్ర మహాసభను విడిగా కొనసాగనివ్వాల్సిందేనని ఆయన పట్టుబట్టి అందరినీ ఒప్పించాడు. ఆ తరవాత ఆంధ్రోద్యమాన్ని కాపాడటానికి దుగ్గిరాల బతికిలేడు. బరంపురం సభల్లోనే బ్రిటిషు దొరతనం ఆయనమీద తప్పుడు అభియోగం మోపి చెరలో వేసింది. కొద్దికాలానికే ఆయన అకాలమృత్యువు పాలయ్యాడు.
కాంగ్రెసు పులుసులో కలపకుండా, జనాభిప్రాయానికి వెరిచి ఆంధ్ర మహాసభను కొనసాగనిచ్చినా దానిది పరాధీనపు బతుకే అయింది. రాష్ట్ర కాంగ్రెసు వార్షిక సభలు జరిగినప్పుడల్లా అదే పందిట్లో ఆంధ్ర మహాసభ వాలాయతీని లాగించి తూతూ తీర్మానాలకు మమ అనడమే తప్ప ఆంధ్రోద్యమానికి ఒక దశ, మార్గం, నిర్దిష్ట కార్యక్రమం ఏర్పరచి విశాల ప్రజావేదికగా పనిచేయనివ్వాలని కాంగ్రెసు పెద్దలు ఏనాడూ అనుకోలేదు. 1923, 1930 సంవత్సరాల్లో ఆ మొక్కుబడి సమావేశాలు కూడా జరగలేదు. 1932నుంచి 1937 వరకూ స్పెషల్ సమావేశాలే తప్ప రెగ్యులర్ మహాసభలు జరగలేదు. దాంతో ఎన్నికలంటూ లేక 1931లో ఎన్నికైన ఆఫీస్ బేరర్లే ఏడేళ్లపాటు కొనసాగారు.
ఈ ప్రకారంగా ఉద్యమ మార్గం మూసుకుపోయింది. అధికార కేంద్రాలవద్ద లాబీయింగునూ పై నాయకత్వం ప్రోత్సహించలేదు. బ్రిటిషు పాలక వర్గాల్లో తనకు అపారంగాగల పలుకుబడిని తనకోసం చొక్కాలు చించుకునే తెలుగు వీరాభిమానుల సబబైన కోర్కెను తీర్చేందుకు వెచ్చించటానికి మహాత్మాజీ సుతరామూ ఇచ్చగించలేదు. ఇక మిగిలింది శాసనసభా వేదికపై ఆంధ్ర రాష్ట్రంకోసం పాటుపడటం. అక్కడా చుక్కెదురే అయింది.
మాంట్‌ఫర్డ్ సంస్కరణల ప్రకారం 1920 నవంబరులో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పాల్గొంటుందనే అందరూ అనుకున్నారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ నిలిపే అభ్యర్థులను... కాంగ్రెస్ కార్యక్రమానికీ, ఆంధ్ర రాష్ట్ర సాధనకు కట్టుబడేవారినే బలపరచాలని ఆంధ్ర మహాసభ చేత తీర్మానాలు కూడా చేయించారు. కాంగ్రెస్ అభ్యర్థులు పెద్ద మెజారిటీతో గెలిచి, లెజిస్లేచర్లను కైవసం చేసుకుంటారని, ఆ వెంటనే ఆంధ్ర రాష్ట్రాన్ని పట్టుబట్టి సాధిస్తారని జనం ఎదురుచూస్తూండగా కథ అడ్డం తిరిగింది. ఎన్నికలు దగ్గరపడేసరికి పరిస్థితి మారింది. మాంట్‌ఫర్డ్ సంస్కరణలను స్వాగతిద్దామని మొదట్లో చెప్పిన గాంధీ హఠాత్తుగా మనసు మార్చుకున్నాడు. 1920 సెప్టెంబరు స్పెషల్ సెషన్లో ఆయన పెట్టిన సహాయ నిరాకరణ తీర్మానం పెద్ద మెజారిటీతో ఆమోదం పొందింది. ఎన్నికలను బహిష్కరించటంతో కౌన్సిళ్లలో అడుగుపెట్టి ఆంధ్రవాణిని వినిపించే అవకాశాన్ని కాంగ్రెసువారు కోల్పోయారు. The Emergence of Andhra Pradesh గ్రంథంలో కె.వి.నారాయణరావు అన్నట్టు The first casualty of the non-cooperation Movement in Andhra it appeared, was the demand for an Andhra Province. (ఆంధ్రాలో సహాయ నిరాకరణోద్యమానికి ఆంధ్ర రాష్ట్రం డిమాండే మొట్టమొదట బలి అయింది.)
ప్రజల్లో అత్యధిక సంఖ్యాకుల మద్దతు అప్పట్లో కాంగ్రెసుకే ఉన్నందున ఆ పార్టీ ఎన్నికల్లో పాల్గొనకపోవటం ప్రజాప్రయోజనాలకు నిస్సందేహంగా నష్టమే. కాంగ్రెసు గోదాలో లేని కారణంగా బ్రాహ్మణాధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ కొత్తగా బ్రాహ్మణేతరులు పెట్టిన జస్టిస్ పార్టీ ఎక్కువ సీట్లను గెలుచుకుని మంత్రివర్గం ఏర్పాటుచేసింది. 1937 ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ గెలిచి వచ్చేదాకా మద్రాసు ప్రెసిడెన్సీలో జస్టిస్ పార్టీ ఆధిపత్యం ఒకటిన్నర దశాబ్దంపాటు కొనసాగింది. జాతీయవాదం, ఆంధ్రోద్యమం పక్కకు తప్పుకుని బ్రాహ్మణ-బ్రాహ్మణేతర కుల స్పర్థలే ఆ కాలంలో జనజీవితాన్ని శాసించాయి. ఆధునిక సంఘ సంస్కరణోద్యమాల ప్రభావంవల్ల నిమ్న కులాల్లో చైతన్యం వచ్చి, చాందస సంప్రదాయాలకు, బ్రాహ్మణాధిక్యానికి వ్యతిరేకంగా ఏకమైన సహజ క్రమానికితోడు... జాతీయవాదుల శిబిరాన్ని చీల్చడానికి కుల సంకుల సమరాలను ఎగదోసి బ్రిటిషు పాలకులు ఆడిన కుటిల రాజకీయం పరిస్థితిని సంక్లిష్టంచేసి, వైషమ్యాలను రెచ్చగొట్టింది. ఆంధ్రుల విశాల ప్రయోజనాల దృష్ట్యా కుల మతాలకు అతీతంగా అందరూ ఏకమవాల్సిన సందర్భాల్లో కూడా ఐక్యకార్యాచరణకు కుల ద్వేషాలు అడ్డుతగిలాయి.
బ్రాహ్మణ-బ్రాహ్మణేతర విభేదాలు చాలవన్నట్టు బ్రాహ్మణేతరుల్లోనే మళ్లీ తెలుగు- తమిళ వైరుధ్యాలు. జస్టిస్ పార్టీ మొదటి మంత్రివర్గంలో తెలుగువారిదే పెత్తనమై, తమిళ మంత్రులు ఎవరూ లేకపోవటం అరవలకు కంటగింపైంది. తెలుగు బ్రాహ్మణేతర హిందూ మంత్రివర్గం పెత్తనానికి తల ఒగ్గి ఊరకుంటే మునుముందు మద్రాసు ప్రెసిడెన్సీలో తమిళ బ్రాహ్మణేతర హిందువులకు, మైనారిటీలకు తీరని నష్టం వాటిల్లుతుంది కనుక వారు సకాలంలో మేలుకోవాలంటూ అరవ మేధావులు అగ్గిపుల్ల గీశారు. "In the last 3 years, the Council's energies were utilised in tackling the Brahmin-non- Brahmin problem. In the next triennium is the council to have nothing better to do than set up and attempt to solve a Tamil-Andhra problem?'' (గఢచిన మూడేళ్లుగా కౌన్సిల్‌కున్న శక్తులన్నీ బ్రాహ్మణ- బ్రాహ్మణేతర సమస్యను నిభాయించటానికే సరిపోయాయి. ఇక వచ్చే మూడేళ్లూ తమిళ- ఆంధ్ర సమస్యను సృష్టించి, పరిష్కరించడానికి వెచ్చిస్తారా ఏమిటి?) అని 1923 నవంబర్ 11న ‘హిందూ’ పత్రిక చేసిన సంపాదకీయ వ్యాఖ్య ఆనాటి రాజకీయ స్థితికి మచ్చుతునక.
ప్రభుత్వంలో ఆంధ్ర మంత్రులు ఉన్నందువల్ల ఆంధ్ర ప్రాంతమేదో వల్లమాలిన లాభం పొందుతున్నట్టు తమిళులు తెగ గింజుకున్నా వాస్తవానికి ఆంధ్రులకు ఒరిగిందేమీ లేదు. పానగల్ రాజా రామారాయణింగార్ జస్టిస్ పార్టీ మొదటి ముఖ్యమంత్రి. ఆంధ్ర రాష్ట్రం అవసరం గురించి ఆయనకు ఒకరు చెప్పాల్సిన పనిలేదు. ఆరేళ్లకింద ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుచేయాలని గట్టిగా డిమాండు చేసింది ఆ పెద్దమనిషే. తానే ముఖ్యమంత్రి అయ్యాక ఆయన చిత్రంగా ప్లేటు మార్చి భాషాప్రతిపదికన రాష్ట్రాల విభజన వెంటనే కుదిరే పనికాదని కొత్త రాగం అందుకున్నాడు. మూడేళ్ల కాలపరిమితి చొప్పున 1920నుంచీ 1926 దాకా రెండు టర్ముల్లో ముఖ్యమంత్రిగా పానగల్ రాజావారు ఉండీ రాష్ట్ర సాధనకు చిటికెన వేలును కదిలించలేదు.
ఆయన హయాంలో ఆంధ్రులకు మేలు అనదగ్గది ఏదైనా జరిగిందంటే అది ఆంద్ర విశ్వవిద్యాలయం ఏర్పాటు ఒక్కటే.
అది ఇంకో ప్రహసనం.