"If an Andhra Province is to be formed, its protagonists will have to abandon their claims to the City of Madras... (An Andhra Province) will have to be confined to the well-defined areas mutually agreed upon and confined to the Province of Madras and can be brought about only with the willingness and consent of the other component parts of the Madras Province.''
(ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటుచెయ్యాలీ అంటే మద్రాసు నగరంమీద క్లెయిమును ఆంధ్రులు వదులుకోవాలి. ఏర్పడబోయే ఆంధ్ర రాష్ట్రం అందరికీ అంగీకారయోగ్యమైన నిర్దిష్ట ప్రాంతాలకే అదీ ప్రస్తుత రాష్ట్ర భాగాలకే పరిమితం కావాలి. మద్రాసు రాష్ట్రంలోని ఇతర భాగాలవారి ఇష్టంతో, ఆమోదంతోనే దాని వేర్పాటు జరగాలి.)
ఇదీ- ఆంధ్రులు ఎప్పటినుంచో కోరుతున్న రాష్ట్రాన్ని వారికి ఇచ్చేందుకు ముగ్గురు మూర్తుల జె.వి.పి. కమిటీ పెట్టిన మెలిక. ఇది అడ్డదిడ్డపు ఆంక్ష. తరతరాలుగా తెలుగు మాట్లాడే పర్లాకిమిడి, బరంపురం, జయపురం, గంజాం వంటి పదహారణాల తెలుగు ప్రాంతాలను అప్పటికి దశాబ్దాలకిందటే ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా, ఎవరినీ అడగాపెట్టకుండా... కొత్తగా పెట్టిన ఒడిస్సా రాష్ట్రంలో అడ్డగోలుగా కలిపేశారు. అవి తమకు తిరిగిరావాలని ఆంధ్రులు ఎప్పటినుంచో తహతహలాడుతున్నారు. ఎలాగూ ఆంధ్ర రాష్ట్రం వస్తుంది కనుక వీటిని అప్పుడు కలిపేయవచ్చులెమ్మని కేంద్ర నాయకులూ చెబుతూ వచ్చారు. ఆ మాటలన్నీ ఇప్పుడు గాలికిపోయాయి. జె.వి.పి. కమిటీవారి షరా ప్రకారం మద్రాసు రాష్ట్రానికే విభజన పరిమితం కావాలంటే ఒడిస్సా రాష్ట్రంలోని ఈ తెలుగు ప్రాంతాలు కొత్తగా ఏర్పడే ఆంధ్ర రాష్ట్రంలో చేరే ఆశే ఉండదు.
అంతేకాదు, మధ్య రాష్ట్రంలోని దక్షిణ బస్తర్‌లో తెలుగువారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. తెలుగే మాట్లాడే తాలూకాలు కొన్ని ఉన్నాయి. మద్రాసు రాష్ట్ర విభాగాలకే విభజన పరిమితం కావాలంటే ఆ తెలుగు ప్రాంతాలకూ నీళ్లు వదులుకోవలసిందే.
పోనీ- మద్రాసు రాష్ట్రంలోని తెలుగు ప్రాంతాలు అన్నీ అయినా ప్రత్యేకాంధ్ర రాష్ట్రంలో చేరగలవన్న భరోసా ఉందా? లేదు. దానికీ ఇతర భాషా వర్గాల ఇష్టం, ఆమోదం కావలసిందే. ఉదాహరణకు బళ్లారి తెలుగు జిల్లా. అక్కడ ఇంటింటా మాట్లాడేది తెలుగు. తరతరాలుగా అది ఆంధ్రుల ప్రాణంలో ప్రాణం. అక్కడ కన్నడిగులు ఆ ప్రాంతం తమదేనంటారు. తమకే కావాలంటారు. న్యాయంగా ఆంధ్రులకే చెందాల్సి ఉన్నా వారి నోటితోవారు ఆ సంగతి కలలో కూడా ఒప్పుకోరు. వారు ఇష్టపడితే గానీ కుదరదంటే బళ్లారి మనకు దక్కడం కల్ల.
ఆ ప్రాంతాల్లో కన్నడులకు ప్రధాన పట్టణమేదీ లేదన్న సాకుతో అప్పటికి కొంతకాలం కిందటే బళ్లారి ప్రాంతాన్ని రెండుగా విభజించి తెలుగువారు ఎక్కువగా నివసించే బళ్లారి, హోస్పేట పట్టణాలను కన్నడులకు ధారాదత్తం చేశారు. అది అన్యాయమని ఆంధ్రులు మొత్తుకుంటున్నారు. వారి వాదనలలోని బలాన్నీ సామంజస్యాన్ని గుర్తించి అన్యాయాన్ని సరిదిద్దాల్సిందిపోయి ఆంధ్ర ప్రాంతాలపై పరాయి భాష వారికి వీటో హక్కును ఇవ్వడం దారుణం.
అలాగే ఇలాంటి జిల్లాలు తమిళ సీమలోనూ ఉన్నాయి. ఉదాహరణకు, చెంగల్పట్టు, సేలం జిల్లాల్లో తెలుగువారివి మెజారిటీ అయిన తాలూకాలు చాలా ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో అవి చేరేదీ లేనిదీ తమిళుల దయమీద ఆధారపడినట్టయితే అవి మనకు శాశ్వతంగా దూరమైనట్టే.
ఇక రాష్ట్రం కావాలంటే మద్రాసు నగరం మీద క్లెయిమును ఆంధ్రులు వదులుకోవాలని కండిషను పెట్టటం మరీ ఘోరం.
ఇంతకీ ఏమిటా క్లెయిము? ఏమా కథ?
గొడవంతా మద్రాసు నగరం ఎవరికి చెందాలన్న దానిమీద. ఆంధ్రులు అది మాదంటారు. అరవలేమో అది ముమ్మాటికీ తమిళనగరం; మాకే చెందాలి; మాతోనే ఉండాలంటారు. కనీసం దానిని ఉమ్మడి రాజధానినైనా చేయమని తెలుగువాళ్లంటారు. తమిళులు అది ససేమిరా కుదరదు; సూది మోపినంత హక్కు అయినా వదిలేది లేదు- అంటారు.
అది వట్టి డబాయింపు కాదు. తమ వాదానికి రుజువుగా తమిళులు కావలసినన్ని సాక్ష్యాలు ఏకరువుపెట్టగలరు. మద్రాసు నగరంలో తమిళులదే మెజారిటీ. ఆ నగరం చుట్టూ ఉన్నవీ తమిళం మాట్లాడే తమిళ ప్రాంతాలే. కాబట్టి ఎక్కడో ఉన్న ఆంధ్ర ప్రాంతానికి ఆ నగరాన్ని రాజధానిగా చేయడమనే ప్రసక్తేలేదని తమిళుల వాదన. తెలుగు మాట్లాడేవారిది మైనారిటీ అయినప్పుడు నగరంమీద హక్కు ఆంధ్రులకెక్కడిదని వారి ప్రశ్న. 1881లో తీసిన జనాభా లెక్కలు చూసినా మద్రాసులో మాదే మెజారిటీ; 1931 జనాభా లెక్కల ప్రకారం నగర జన సంఖ్యలో 63 శాతం పైగా మేమే ఉన్నాం. అలాంటప్పుడు అది మాదికాక ఎవరిదవుతుందని గద్దిస్తారు వారు.
వారు చెప్పేది నిజమే కూడా. మద్రాసు రాష్ట్ర రాజకీయాల్లో ఆంధ్రులు మొదటినుంచీ ఎంత ప్రముఖపాత్ర వహిస్తున్నా, మద్రాసుతో ఆంధ్రులకు తరతరాలుగా ఎంత అనుబంధం ఉన్నా మద్రాసు నగరంలో తమిళులదే మెజారిటీ అన్నది నిస్సందేహం. కాబట్టి ఆ నగరంమీద మనకు హక్కులేదు. తమిళులు అంత పట్టుదలగా ఉన్నప్పుడు వ్యవహారాన్ని తెగేదాకా లాగకుండా పసలేని పంతాన్ని మనం వదిలేసుకోవడం ఉత్తమం. ఈ మాట వేరెవరో కాదు కొంతమంది తెలుగు పెద్దలే అంటారు.
వారిలో మొట్టమొదట ఎన్నదగ్గ ముఖ్యుడు భోగరాజు పట్ట్భా సీతారామయ్య. మనం ప్రస్తావిస్తున్న కాలాన ఆయనే అఖిల భారత కాంగ్రెసు అధ్యక్షుడు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న జె.వి.పి. కమిటీ నాయకత్రయంలో ఆయనా ఒకడు. మద్రాసును వదులుకుంటే తప్ప ఆంధ్ర రాష్ట్రం రాదని మడతపేచీ పెట్టిన నివేదికకు తానూ కర్త కావడం ఒకటే కాదు. ఆంధ్ర నాయకుల మెడలువంచి ఆ షరతుకు ఒప్పించే బాధ్యతనూ ఆయనే పైన వేసుకుని, జబర్దస్తీగా రంగంలోకి దిగాడు. ఆ ముచ్చట తెనే్నటి విశ్వనాథం చెబితేనే రమ్జుగా ఉంటుంది:
పట్ట్భాగారు అధ్యక్షులైన తర్వాత ఆయన చెన్నపట్నం వచ్చినపుడు, నేను వారి బసకు గౌరవ సందర్శనం చేయడానికి వెళ్లాను. రెండుమూడు మాటలు కుశలప్రశ్నలు సాగిన తర్వాత, ఆయన చటుక్కున లేచి, లోపలికి వెళ్ళి, ఒక అరఠావు సైజు కాగితం తెచ్చి దానిమీద సంతకం చేయమన్నారు. దానిమీద అప్పటికే ఆయన సంతకం, కామరాజునాడార్ గారి సంతకం ఉన్నాయి. వారు సంతకం పెట్టిన భాగంపైన ఉన్న మాటలివి:
‘‘చెన్నపట్నం మీద ఆంధ్రులు హక్కులు వదులుకోగలందుకును, తిరుపతిపై తమిళులు హక్కులు వదులుకోగలందుకును, ఇందు మూలముగా అంగీకరించడమైనది.’’
ఇటువంటి కాగితాలపైన ఆయన బుజ్జగింపు మాటల మధ్య నన్ను సంతకం చేయమని, రెండుమూడు పర్యాయాలు చెప్పగా, ‘‘మీరీ విషయం ప్రకాశంగారితో చర్చించకూడదా?’’ అని ప్రశ్నించాను.
దానిపైన ఆయన, ‘‘ప్రకాశంగారితో ఎవరికి కుదురుతుంది? మా మటుకు మాకు ఆయన సంతకంకన్నా నీ సంతకమే ఎక్కువ విలువగలది’’ అన్నారు.
కాని నేను ఆయనకు తిరిగి మెల్లిగా నచ్చచెప్పి, ‘‘సాయంత్రం మీరు ఒకమారు స్వయంగా ప్రకాశంగారిని కలుసుకుంటే మనమంతా ఒక పద్ధతికి రాగలముగదా!’’ అన్నాను.
అందుకు, ‘‘సరే ఎందుకు చెప్పావో! ఈ సాయంత్రం జరగబోయే మీ కాంగ్రెస్ శాసనసభ్యుల సమావేశంలో ఇందులో వ్రాసింది ఆమోదించడానికి, ఎజెండాలో ఈ విషయం కలపబడుతుంది. కాబట్టి, అక్కడే ప్రకాశంగారు ఉన్నారు గనుక, ఒక అరగంట ముందుగా వచ్చి ఆయనతో మాట్లాడుతానులే’’ అని ఆయన చెప్పారు.
అనుకున్నట్టు, పట్ట్భాగారు ఆ సాయంకాలం వచ్చి, నా గది దగ్గర కారు నిలిపారు. దిగి వచ్చి, ‘‘ఏం విశ్వనాథం! నువ్వు చెప్పినట్టు వచ్చాను. ప్రకాశంగారు ఇక్కడ ఎక్కడున్నారు?’’ అని అడిగారు. ప్రకాశంగారు బసచేసిన మేడ గదులు చేత్తో చూపించాను. అది గవర్నర్ భవనం కాక ప్రత్యేకంగా వేరే కట్టి ఉన్న ఒక చిన్న మేడ భాగము. పట్ట్భాగారు, ప్రకాశంగారి గదిలోకి వెళ్ళడమనేది ఒక విశేష కార్యంగా భావించి, పది పదిహేనుగురు సభ్యులు నా గది దగ్గరగా ఉన్న కారు చుట్టూ మూగారు.
మేము- ప్రకాశంగారు, పట్ట్భాగారు కలుసుకున్నప్పుడు ఎలా మాట్లాడుతారో ఊహాగానం చేయనారంభించేంతలోనే పట్ట్భాగారు ఒక చేత్తో జారిపోతున్న పంచె గోచీ సర్దుకుంటూ, రెండవ చేత్తో క్రిందికి మీదికి జారిపోతున్న కాగితాలను పట్టుకుంటూ కారు దగ్గరికి ఇలా కేకలేసుకుంటూ వచ్చారు:
‘‘ఆ ముసలి మూర్ఖునితో ఎవరు వేగగలరు? ఛ... ఛ... విశ్వనాథం; నువ్వు సంతకం పెట్టనన్నావు! మీ పార్టీ మీటింగుకి నేను రానూ అక్కరలేదు, ఈ ఒడంబడిక కాగితం మీరు అంగీకరించనూ అక్కర్లేదు. పోండి! మీకు చేతనైనది ఏదో చేసుకోండి!’’
కఠోరమైన కంఠంతో ఈ మాటలు చెప్పి, అతి విసురుగా చేతులు ఊపి, కారులో తొందరగా ఎక్కి కూచుని, డ్రైవరుతో, ‘‘తిప్పు కారు మన యింటికి’’ అని ఆదేశించి ఆగ్రహంగా వెళ్లిపోయారు.
నా జీవితయాత్ర, అనుబంధ ఖండము, తెనే్నటి విశ్వనాథం, పే.593-595
ఒక్క ప్రకాశంగారినే కాథు; నాయకత్రయ సంఘంవారు పెట్టిన కండిషన్లు ఆంధ్ర దేశంలో ఎవరికీ నచ్చలేదు. కొంతమందికైతే ఇది సర్కార్లకు, రాయలసీమకు మధ్య చిచ్చుపెట్టి దూరంచేసే ఎత్తుగడగా కనిపించింది. ఎందుకంటే రాయలసీమకు మొదటినుంచీ మద్రాసుతో సంబంధం ఎక్కువ. అది లేని ఆంధ్ర రాష్ట్రంలో చేరి ఎక్కడో ఏ విజయవాడలోనో, విశాఖపట్నంలోనో వెలిసే రాజధాని చుట్టూ తిరగడం వారికి బొత్తిగా ఇష్టం ఉండదు.
మద్రాసు నగరంపై హక్కును వదులుకోవటాన్ని ప్రకాశంగారు గట్టిగా వ్యతిరేకించగా ఆంధ్రా పి.సి.సి. కూడా జాతీయ నాయకుల అభిమతాన్ని, ఆలిండియా కాంగ్రెసు అధ్యక్షుడి మాటనుకాదని ప్రకాశానే్న అనుసరించింది. కాంగ్రెసు వర్కింగు కమిటి జె.వి.పి. రిపోర్టును ఆమోదించిన నెలరోజులకే (1949 మేలో) ఎపిసిసి సమావేశమై అదే రిపోర్టును ఖండితంగా తోసిపుచ్చింది ఎపిసిసి పరిధిలో చేరిన ప్రాంతాలతో ఆంధ్ర రాష్ట్రాన్ని ఆలస్యంలేకుండా ఏర్పాటుచేసి, దానికి మద్రాసును రాజధానిని చేయాలని ప్రభుత్వాన్ని, కాంగ్రెసును కోరుతూ తీర్మానించింది. (అప్పట్లో ఎన్.జి.రంగా ఎ.పి.సి.సి. అధ్యక్షుడు)
అయినా ఏమీకాలేదు. రాష్ట్ర కాంగ్రెసు మాట చెల్లుబాటు కాలేదు. తరవాత వ్యవహారం చాలా మలుపులు తిరిగింది. ప్రతిసారీ మద్రాసు నగరం దగ్గరే పీటముడి పడి, ఆంధ్ర రాష్ట్రం అంతకంతకూ వెనక్కి పోయింది. ఆ వివరాల్లోకి వెళ్లేముందు మద్రాసు విషయంలో ప్రకాశంగారికి, ఆయన అనుయాయులకు ఎందుకంత పట్టుదల అన్నది తెలుసుకోవాలి.
ఆ సంగతి ప్రకాశమే చెప్పాలి!