ఈ దేహం లోని ప్రాణం అనణ్త వాయువులతో మమేకమైపోయేదాకా, ఈ శ్వాసా, ఈ ఊపిరీ, ఈ మనసూ, ఈ హృదయమూ...నిన్ను తలుస్తూనే ఉంటాయి.
ఆత్మ వంచన చేసుకుంటూ..అంతా అయిపోయాక, ఇప్పుడు నేను నిన్నేమీ అడగలేను..అలాగనీ చెప్పకుండా ఉండలేను..ఎందుకంటే, నాకు చెప్పుకోడానికీ, నాదంటూ వినడానికీ..ఉన్నది నువ్వొక్కటే.
నువ్వు నన్ను విడిచి వెళ్లినప్పటినుండీ, దూరంగా వెళ్లిపోయినప్పటినుండీ, ఈ జీవితపు గతీ, బ్రతుకు భ్రమణం, లయ తప్పాయి. నువ్వు లేని నేను లేనని తెలిసి కూడా, నువ్వు నన్ను ఒంటరి వాణ్ని చేసి వెళ్లిపోయావు కనుక, ఇప్పుడు మళ్లీ తిరిగి వస్తావన్న ఆశ కూడా లేదు...ఒకవేళ అలాంటిదేదయినా ఉందీ అంటే, అది ఖచ్చితంగా దురాశే అవుతుంది.
నీతో అనుభవించిన క్షణాలు, ఆ చిలిపి మాటలు, మూతి విరుపులూ, నీ ఎదపై సేద దీరిన మధురానుభూతులు, మనం తిరిగిన ప్రదేశాలూ..ఇలా, ఇవన్నీ..నన్ను నిలవనీయడం లేదు. పఠనం, నియమం, సేవా, ఆలోచన..ఇవే, నా గురించి నేను చెప్పుకునేవి, నన్ను నలుగురికీ పరిచయం చేసినవి. ఇప్పుడివేవీ నాకు ఆలంభనగా నిలబడటం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే, నేనూ, నా మనసూ, నా జీవిత ఛట్రమూ..ఇవన్నీ ఇప్పుడు శూన్యం ఆవహించబడి ఉన్నాయి.