ఎం.వి.ఆర్ శాస్త్రి గారు ఆంధ్ర భూమి ఆదివారం అనుబంధం లో సీరియల్ గా ప్రచురిస్తున్న ఆంధ్రుల కథ యదాతథం గా..
ఆంధ్రులకు అన్యాయం --------(May 29th, 2011)
‘ఆంధ్ర’ప్రాంతానికి తెలంగాణతో బంధం తరతరాల కిందటే తెగిపోయింది. రాజకీయంగా, సాంస్కృతికంగా, సామాజికంగా ఎడం పెరిగింది. కాబట్టి తెలంగాణను కలిపేసుకోవడం 1955నాటికి ‘ఆంధ్రా’వారికి సెంటిమెంటల్ ఇస్యూ కాదు. అప్పటికి కొనే్నళ్లుగా ‘విశాలాంధ్ర మహాసభ’ కదలిక మొదలైనా... హైదరాబాదును రాజధాని చేసుకోవచ్చన్న ఆశతో ఆంధ్ర రాజకీయ నాయకులకు తెలంగాణ మీద ప్రేమ పెరిగినా... తెలంగాణతో కలవాలన్న తహతహ ‘ఆంధ్ర’ ప్రాంత ప్రజల్లో ఆ సమయాన పెద్దగా లేదనే చెప్పాలి.
విశాలాంధ్ర అంటే సర్కారు, సీడెడ్, నైజాం జిల్లాలు మాత్రమేనని ఆంధ్రులు ఎప్పుడూ అనుకోలేదు. చెన్నపట్నం, చెంగల్పట్టునుంచి బళ్లారి, బరంపురాల వరకూ, హోసూరు నుంచి హైదరాబాదు దాకా తెలుగు మాట్లాడే తెలుగు ప్రాంతాలన్నీ చేరిన ‘ఆంధ్రరాష్ట్రం’కోసమే 1913లో ఆంధ్ర మహాసభ పుట్టకముందునుంచీ ఆంధ్రోద్యమ నాయకులు ఆకాంక్షించారు. ఇవి అన్నీ కలిసిన ఆంధ్ర దేశ పటానే్న ఉగాది వేడుకల్లో ఆంధ్ర ప్రభలమీద ఊరేగించేవారు.
హైదరాబాదుకంటే ఎక్కువగా వారికి ఆత్మీయత ఉన్నది మద్రాసు నగరంతో. తెలంగాణ కంటే మిన్నగా వారు కలుపుకోవాలనుకున్నది ఆంధ్ర రాష్ట్రంలో చేర్చని కోలారు, బళ్లారి, బరంపురం, కోరాపుట్, గంజాం లాంటి అచ్చతెనుగు ప్రాంతాలను. ‘విశాలాంధ్ర’కు వారు జైకొట్టింది ప్రధానంగా ఈ ప్రాంతాలు పరాయితనం నుంచి బయటపడి, తెలుగునాడులో తిరిగి చేరాలన్న ఆశతో! రాష్ట్రాల పునర్విభజన సంఘం తీర్పుకోసం ఆంధ్రులు ముఖ్యంగా ఎదురుచూసింది వీటి గురించి ఏమి చెబుతుందోనన్న ఉత్కంఠతో.
మరి ఎస్సార్సీ ఏమిచేసింది? ఆంధ్రులకు కొంచెం న్యాయం, చాలావరకు అన్యాయం చేసింది. పొట్టిశ్రీరాములు ఆత్మబలిదానానికి ముఖ్యకారణమైన మద్రాసు నగరంమీద కనీసం తాత్కాలికంగానైనా ఆంధ్రులకు ఉమ్మడి హక్కు కుదరదు పొమ్మంది. సరిహద్దులోని తిరుత్తణి లాంటి తెలుగు ప్రాంతాలను తమిళనాడుకే అర్పించేందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అప్పటికే ఒప్పేసుకున్నది కనుక మళ్లీ వాటి జోలికి తాను పోదలచుకోలేదన్నది. కోరాపుట్, గంజాం జిల్లాల్లో ఒరియా మాట్లాడేవారిదే మెజారిటీ కాబట్టి వాటిమీద ఆంధ్రాకు హక్కులేదన్నది. పూర్వంనుంచి ఆంధ్ర దేశంలో ఉండి, కొనే్నళ్ల కిందట బ్రిటిషు సర్కారు ఒరిస్సాలో అడ్డగోలుగా కలిపేసిన పర్లాకిమిడి, బరంపురం లాంటి పదహారణాల తెలుగు ప్రాంతాలనూ తెలుగువారికి తిరిగి ఇవ్వనక్కరలేదన్నది. ఒరియాలది మెజారిటీ అని చెప్పి కోరాపుట్, గంజాం జిల్లాలపై ఆంధ్రుల క్లెయిమును కొట్టిపారేసిన ఎస్సార్సీ తెలుగువారిది మెజారిటీ అయిన కోలార్ జిల్లాను మాత్రం కర్ణాటకకే దఖలు పరచింది. బీదర్ జిల్లాలోని తెలుగు ప్రాంతాల మీదా ఆంధ్రులకు హక్కులేదని తేల్చింది.
చరిత్ర ఏమైతేనేమి, ఇప్పుడు అరవలదే మెజారిటీ కాబట్టి చెన్నపట్నం మీద హక్కులేదు; తమిళ సరిహద్దుల్లోని తెలుగు ప్రాంతాలు మీకు రావు; కోలారు మీది కాదు; కోరాపుట్ మీది కాదు; గంజాం, బరంపురం, పర్లాకిమిడిలను అడగటానికే వీల్లేదు... అని వరసపెట్టి కొట్టిపారేసిన ఫజలాలీ కమిషను ఎట్టకేలకు బళ్లారి, దాని చుట్టుపట్ల ప్రాంతాలని మాత్రమే ఆంధ్రులకు అనుగ్రహించింది.
ఆ సంగతి తెలిసి రాయలసీమకు, మరీ ముఖ్యంగా అనంతపురం జిల్లాకు ప్రాణం లేచి వచ్చింది.
ఎందుకంటే 150 ఏళ్లుగా బళ్లారి మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా తెలుగు జిల్లాలతో కలిసిమెలిసి ఉన్నది. దాని సంబంధ బాంధవ్యాలు రాయలసీమతోనే హెచ్చు. పైగా అనంతపురం జిల్లా సాగునీటికి ప్రాణాధారమైన తుంగభద్ర ప్రాజెక్టు ఉన్నదీ బళ్లారిలోనే! అక్కడ దాదాపుగా ప్రతి ఇంటా తెలుగు మాట్లాడుతారు. చారిత్రకంగా, సాంస్కృతికంగా బళ్లారికీ తెలుగువారికీ విడదీయలేని అనుబంధం ఉంది.
బళ్లారి తమకు చెందాలన్న కోరిక ఆంధ్రులకు మొదటినుంచీ బలంగా ఉన్నా, ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు ఘట్టంలో బళ్లారి విషయం తేల్చటానికి నెహ్రూ ప్రభుత్వం నియమించిన జస్టిస్ మిశ్రా కమిటీ కేవలం భాషాపరమైన గణాంకాలనే కొలబద్దగా తీసుకుని, ఇతర ముఖ్యాంశాలను విస్మరించి, బళ్లారిని మైసూరు స్టేటులో చేర్చాలని చెప్పింది. అది అన్యాయమని ఆంధ్రులు మొత్తుకుంటున్నారు. అదృష్టవశాత్తూ ఫజలాలీ కమిషన్ వారి మొరను ఆలకించి బళ్లారిని వారికే ఇచ్చేసింది. అందుకు కారణాలనూ విపులీకరించింది క్లుప్తంగా వాటిలో కొన్ని:
331. అన్ని అంశాలూ నిశితంగా పరిశీలించాక ప్రస్తుత బళ్లారి జిల్లాలో తుంగభద్ర తీరం వెంబడి ఉన్న ఒక భాగాన్ని కర్ణాటక నుంచి ఆంధ్ర రాష్ట్రానికి బదిలీ చేయాలని మేము సిఫారసు చేయదలిచాము. విఖ్యాత న్యాయమూర్తి జస్టిస్ మిశ్రా చెప్పిన దానికి, బళ్లారి జిల్లా ప్రాంతాలకు సంబంధించి 1953లో భారత ప్రభుత్వం చేసిన నిర్ణయానికి ఇది విరుద్ధమని మాకు తెలుసు.
332. సరిహద్దుల్లో అనేక భాషలు మాట్లాడే ప్రాంతాలను ఎటుచేర్చాలన్నది నిర్ణయించడానికి భాష ఒక్కటే నిర్ణాయక అంశం కాజాలదు. పరిపాలనా సౌకర్యం, ఆర్థిక బంధాలు, రాయలసీమ జిల్లాలకు తుంగభద్ర ప్రాజెక్టు ప్రాధాన్యం అనే మూడు విషయాలను కూడా దృష్టిలో పెట్టుకుని మేము బళ్లారిని ఆంధ్రలో చేర్చాలని నిర్ణయించాం.
334. బళ్లారికీ, మిగతా రాయలసీమకూ కమ్యూనికేషన్ సంబంధాలు బాగా ఉన్నాయి. రాయలసీమలోని ప్రతి జిల్లా కేంద్రంతోనూ దానికి రైలు, రోడ్డు లింకులున్నాయి. బెంగుళూరు కంటే దానికి కర్నూలే దగ్గర. వర్తక వాణిజ్యాలపరంగా బళ్లారి పట్టణం మైసూరు కంటే కూడా ఆంధ్ర రాష్ట్రంమీదే ఆధారపడి ఉంది. నూటయాభై ఏళ్లుగా బళ్లారి కాంపోజిట్ మద్రాసు రాష్ట్రంలో భాగమై మొత్తం రాయలసీమకు అనధికార రాజధానిగా అభివృద్ధి చెందింది. పాత సంబంధాలు ఈమధ్య హఠాత్తుగా తెగిపోవటంతో పట్టణ ప్రజలు చాలా ఇక్కట్లు పడుతున్నారు. వీటన్నిటి దృష్ట్యా మైసూరుకంటే ఆంధ్ర రాష్ట్రంతోనే ఈ మూడు తాలూకాలకు దగ్గరి సంబంధాలున్నాయని ఆంధ్ర ప్రభుత్వంచేసిన వాదంలో చాలా బలం ఉంది.
336. ... మేము సూచిస్తున్న ప్రకారం ఈ ప్రాంతాలను ఆంధ్రకు బదిలీ చేసినట్లయితే తుంగభద్ర ప్రాజెక్టు విషయంలో ఘర్షణకు అవకాశాలు బాగా తగ్గుతాయి.
337. ఈ ప్రాజెక్టు దక్షిణ పార్శ్వాన్ని కరువుల బారినుంచి రాయలసీమను కాపాడేందుకే ఉద్దేశించిన సంగతి గుర్తుచేసుకోవాలి.
338. కొత్తగా మంజూరుఅయిన హైలెవెల్ కెనాల్ ఆయకట్టును కూడా పరిగణనలోకి తీసుకుంటే ఆంధ్రవాదన మరీ బలపడుతుంది.
339. జల విద్యుత్కేంద్రాలు, ఇరిగేషన్ హెడ్ వర్క్సు ఉన్న ప్రాంతాలపై క్లెయిములను అన్ని కేసుల్లోనూ అంగీకరించలేము. కాని- ఇతర అంశాలు అంత ముఖ్యమైనవి కానప్పుడు అలాంటి క్లెయిమును నిర్లక్ష్యమూ చేయకూడదు.
340. ఈ మూడు తాలూకాలు ఒకే భాష మాట్లాడేవి కావు. పైగా హోస్పేట, బళ్లారి పట్టణ ప్రాంతాలు మిశ్రమ స్వభావాన్ని త్వరితంగా సంతరించుకుంటున్నాయి. కోలారు జిల్లాలో తెలుగు మాట్లాడేవారు జనాభాలో 54 శాతం దాకా ఉన్నప్పటికీ ఆ జిల్లాను కర్ణాటకలో కలపాలన్నప్పుడు మేము భాష విషయానికి పెద్ద ప్రాముఖ్యం ఇవ్వలేదు. బళ్లారి ప్రాంతాన్ని ఆంధ్రకు బదలాయించే విషయంలోనూ అలాగే జరగాలి. (ఈ మూడు తాలూకాల్లో భాషాపరంగా కన్నడిగులది ఆధిక్యమైనా, పైన పేర్కొన్న ఇతర సౌలభ్యాల దృష్ట్యా ఈ ప్రాంతాలు ఆంధ్ర రాష్ట్రానికే చెందాలి.)
మన నాయకాగ్రేసరుల అలసత్వం మూలంగా పావుశతాబ్దం కింద పర్లాకిమిడి, గంజాం పరిసర ప్రాంతాలను ఒరిస్సా ఎగరేసుకుపోయినది మొదలుకుని, అరవలు, కన్నడిగులు నోరుచేసుకుని అనేక తెలుగు ప్రాంతాలను నొల్లుకోవటంవరకూ కాలక్రమంలో ఆంధ్రులకు జరిగిన అన్యాయాలను ఎస్సార్సీ అయినా సరిదిద్ది, కనీసం రాష్ట్రాల పునర్విభజన తరుణంలోనైనా విశాల ఆంధ్ర రాష్ట్రం రూపుదిద్దుకోగలదనుకుంటే- చివరికీ అదీ అడియాసే అయింది.
దయగల నెహ్రూ సర్కారు బళ్లారి ప్రాంతాన్నీ ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వలేదు. ఇవ్వాల్సిందేనని మన నాయకాగ్రేసరులూ పట్టుబట్టలేదు. బళ్లారి, దాని దగ్గరి తుంగభద్ర ప్రాజెక్టు ఆంధ్రులకు దక్కడం రాయలసీమకు ఎంతవరమో, ముఖ్యంగా- అనంతపురం జిల్లాను ఎడారి కాకుండా కాపాడటానికి అది ఎంత అత్యవసరమో అనంతపురంలోనే పుట్టిన నీలం సంజీవరెడ్డికి ఒకరు చెప్పనక్కర్లేదు. ఎస్సార్సీ నివేదిక వెలువడేనాటికి ఆయన ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. ఢిల్లీ పెద్దల దగ్గర కావలసినంత పలుకుబడి ఉన్నవాడు. మంచి కార్యసాధకుడు. తలచుకుంటే బళ్లారి, హోస్పేటలను ఆయన ఆంధ్రులపరం చేయించగలిగేవాడే. కాని తలచుకోలేదు. ఉప ముఖ్యమంత్రి నుంచి ముఖ్యమంత్రిగా ప్రమోషన్ కొట్టెయ్యటమెట్లా, హైదరాబాదు రాజధానిగా విశాల ఆంధ్ర రాజ్యాన్ని ఏకచ్ఛత్రంగా ఏలడమెట్లా అన్నదే ఆయనకి ఆ సమయాన ప్రధానమైంది. అమోఘమైన తన రాజకీయ శక్తియుక్తులన్నీ ఆ అత్యవసర కార్యక్రమం మీదే కేంద్రీకరించడంతో బళ్లారిలాంటి చిన్న విషయాలను పట్టించుకోవడానికి ఆయనకూ, ఆయన సీమ సహచరులకూ తీరిక లేకపోయింది.
ఇలా- ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినంతవరకూ ఎస్సార్సీ ఇచ్చిన ఒకే ఒక్క వరమూ ఆచరణలో వమ్మయింది. ఇక మిగిలింది తెలంగాణ.
అక్కడా ఎస్సార్సీ చెప్పిందొకటి. జరిగింది వేరొకటి.
మూడు భాషా ప్రాంతాల మిశ్రమమైన హైదరాబాద్ స్టేటును విడగొట్టి, మరాట్వాడను మహారాష్టల్రోనూ, కన్నడ ప్రాంతాలను కర్ణాటకలోనూ కలిపెయ్యమని చెప్పిన ఫజలాలీ కమిషన్ మూడోముక్క తెలంగాణను మాత్రం ఆంధ్ర రాష్ట్రంలో కలిపెయ్యాలనలేదు. కనీసం కొనే్నళ్లపాటు దానిని విడిగా ఉండనివ్వాలన్నది.
ఇప్పటికీ చాలామంది అనుకుంటున్నట్టు- ఎస్సార్సీ విశాలాంధ్రకు వ్యతిరేకం కాదు. తెలుగు మాట్లాడే ప్రాంతాలు ఒక్కటిగా ఉంటే మంచిదనే రాష్ట్రాల పునర్విభజన సంఘం చెప్పింది. ఆంధ్ర తెలంగాణలు ఏకమవటంవల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయనీ అంగీకరించింది. కాని ఈ విషయంలో తెలంగాణ వారికి ఇంకా గురి కుదరలేదు కనుక వారికి అనుమానాలు, అపనమ్మకాలు పోయేదాకా ఆగటం అందరికీ మంచిదని ఎస్సార్సీ హితవు పలికింది. పరిస్థితులు కుదుటపడి, పరిపాలన చక్కబడి, అపోహలు తొలగేందుకు వీలుగా ఐదేళ్లపాటు తెలంగాణను వేరుగా ఉండనిచ్చి, ఆ తర్వాత తెలంగాణ శాసనసభ్యుల్లో మూడింట రెండువంతుల మంది ఇష్టపడితే ఆంధ్రలో తెలంగాణ విలీనమవచ్చని కమిషన్ సలహా ఇచ్చింది.
అప్పుడున్న పరిస్థితుల్లో ఈ విషయంలో ఇంతకుమించిన ధర్మ నిర్ణయం ఎవరూ చేయలేరు. కొత్తగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రం మొదట్లో ఉండే ఒడిదుడుకుల నుంచి కుదుటపడలేదు. రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాల మధ్యనే సరైన అవగాహన, సమన్వయం ఇంకా కుదరలేదు. అంతలోనే ఆదరాబాదరా తెలంగాణనూ కలిపేసుకుంటే కొత్త తలనెప్పులు తప్పవు. ఆంధ్ర, రాయలసీమలు నూటయాభై ఏళ్లుగా మద్రాసు ప్రెసిడెన్సీలో బ్రిటిషు పరిపాలన కింద ఉన్నందున అక్కడా ఇక్కడా చట్టాలు, నియమ నిబంధనలు, పరిపాలనా వ్యవస్థలు, పాలనా విధానాలు అన్నీ ఒకటే. కాబట్టి కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డా పాలనాపరంగా ఇబ్బందులు పెద్దగా ఉండవు.
అదే తెలంగాణ సంగతి వేరు. మరాఠా, కన్నడ ప్రాంతాలతో కలిసి తరతరాలుగా నిజాం దొరతనంలో ఉన్నందున దాని పరిపాలనా వ్యవస్థే వేరు. చట్టాలనుంచి కట్టుబాట్లదాకా దానికీ, మిగతా ఆంధ్ర ప్రాంతానికీ ఎక్కడా పోలికలేదు. సంక్లిష్టమైన తేడా పాడాలన్నీ ఒక్క కలంపోటుతో పోయేవి కావు. పైగా ఆంధ్ర ప్రాంతంతో కలిస్తే ఆంధ్రా వాళ్లొచ్చి అన్నివిధాల వెనకబడ్డ తమను అన్ని రంగాల్లో అణగదొక్కేస్తారన్న భయం తెలంగాణ వర్గాల్లో గట్టిగా నెలకొని ఉంది. ఒకవేళ అవి అకారణ భయాలే అయినా, అలాంటి దురుద్దేశం ఆంధ్రావారికి లేదనుకున్నా... లేదన్న నమ్మకం తెలంగాణ వారికి అంత తేలిగ్గా కుదరదు. దానికీ చాలా సమయం పడుతుంది. అనుమానాలు తొలిగి, అక్కడా ఇక్కడా పరిపాలన చక్కబడేంత వరకూ ఆగితే ఇరుప్రాంతాల వారికీ మనసులు కలిసి, వివాదాస్పద అంశాలను సర్దుబాటు చేసుకుని ఇరుప్రాంతాల ఏకీకరణను సాఫీగా, ఐచ్ఛికంగా కానివ్వటానికి వీలుంటుంది.
సరైన రాజధాని లేక ఆంధ్ర రాష్ట్రం అవస్థపడుతున్న మాట నిజమే. హైదరాబాదు రాజధాని అయితే అన్నివిధాల బాగుంటుందన్నదీ వాస్తవమే. కాని శాశ్వత రాజధాని ఎక్కడన్న విషయంలో ఆంధ్ర వారికి తలలు కలవడం లేదు కనుక రాజధానికోసం తెలంగాణను హడావుడి విలీనానికి తొందరబెట్టటం విజ్ఞతకాదు. దానివల్ల ఒక సమస్య తీరవచ్చుగాని అనేక కొత్త సమస్యలు అనివార్యంగా పుట్టుకొస్తాయి.
అయినా తాత్కాలిక రాజధానిగా ఉన్న కర్నూలు మరీ ఎడారి కాదు. బొత్తిగా సౌకర్యాల్లేని ఊరూ కాదు. కష్టమో నిష్ఠూరమో రెండేళ్లుగా అక్కడినుంచి పరిపాలన నడుస్తూనే ఉన్నది. ఇంకో ఐదేళ్లు ఎలాగో పళ్లబిగువున కాలక్షేపం చేయటం కష్టంకాకపోవచ్చు. ఒకవేళ అక్కడి గుడారాల బతుకు భరించలేనంత దుర్భరమనుకుంటే అంతా కలిసి ఆలోచించి, అకారణ భయాలను, రాజకీయ కుత్సితాలను పక్కనపెట్టి ఏ విజయవాడ- గుంటూరు ప్రాంతానికో తాత్కాలిక రాజధానిని తరలించడం తలచుకుంటే అసాధ్యంకాదు. హైదరాబాదుకు తరలేలోగా ఐదేళ్లపాటు అక్కడ రాజధాని నడిస్తే ఆ ప్రాంతమూ తగిన వనరులతో అభివృద్ధి చెందగలదు. భవిష్యత్తులో ఎప్పుడైనా ఆంధ్ర, తెలంగాణలు విడిపోవలసిన పరిస్థితి వస్తే ఆంధ్ర రాష్ట్రానికి రడీమేడ్ రాజధాని సిద్ధంగానూ ఉండగలదు.
ఇలా- ఏ రకంగా చూసినా ఫజలాలీ కమిషన్ చెప్పినట్టు తెలంగాణను కొనే్నళ్లు విడిగా ఉండనిచ్చి, నెమ్మది మీద ఆంధ్ర రాష్ట్రంలో విలీనం కానివ్వటమే ఉత్తమం. కాని- ఏమిలాభం? ఎస్సార్సీ ఏది వద్దన్నదో అదే జరిగింది. అదీ మహా చిత్రవిచిత్రంగా!! *