కాంగ్రెస్ మార్కు రాజకీయం....... (January 2nd, 2011)
"There is a strong feeling among us, Andhras, that you do not like us, that you are against the formation and the establishment of a separate province. Despite Andhra Desh being overwhelmingly Congress, it never received your blessings... The Andhras would like to know whether you ever gave any advice to Tamilnad regarding Andhras and wish to know whether, during the last ministry, the Andhra question was referred to you or not; if so, what advice did you give them?... Is it not a fact that, owing to stead-fast loyalty of the Andhras to the Congress movement, they did not achieve what Orissa did? It is felt that, had the Andhras taken a different line of action, when the Simon Commission came to India, they would have got their hearts, desire... ...''
[History of Andhra Movement, G.V.Subba Rao, Vol.II, PP.272-273]
(మీకు మేమంటే ఇష్టం లేథు; మాకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు మీరు వ్యతిరేకం- అని మా ఆంధ్రులకు గట్టి నమ్మకం. కాంగ్రెసును ఎంత నెత్తిన పెట్టుకున్నా ఆంధ్ర దేశానికి మీ దీవెనలు ఎప్పుడూ లేవు. ఆంధ్రులు మిమ్మల్ని అడిగేది ఏమిటంటే... మా గురించి తమిళనాడుకు మీరు ఎన్నడైనా సలహా ఇచ్చారా? కిందటి మంత్రివర్గ కాలంలో ఆంధ్ర సమస్యపై ఏమి చేయమంటారని మిమ్మల్ని అడిగారా లేదా? అడిగి ఉంటే మీరు ఏమి చెప్పారు?... కాంగ్రెసు ఉద్యమాన్ని అంటిపెట్టుకుని ఉన్నందువల్లే ఆంధ్రులు ఒరిస్సాపాటి అయినా సాధించలేకపోయారన్నది వాస్తవం కాదా? సైమన్ కమిషన్ ఇండియాకు వచ్చినప్పుడు ఇంకోదారి పట్టి ఉంటే ఆంధ్రుల మనోరథం ఈడేరేదే కదా?...)
ఈ మాటలన్నది బాధ్యతలేని ఎవరో అనామకుడు కాదు. ఆంధ్రోద్యమానికి సారథ్యం వహించిన ఆంధ్ర మహాసభకు అధ్యక్షుడైన విజయనగరం రాజా సర్ విజయ ఆనంద్. ఆయన నిలదీసి అడిగింది- నమ్ముతారో లేదో- సాక్షాత్తూ మన ‘జాతిపిత’ మహాత్మాగాంధీని.
సర్ విజయకు గాంధీగారంటే ద్వేషమూ లేదు. కాంగ్రెసు మీద అక్కసూ లేదు. జాతీయోద్యమమన్నా, దాన్ని నడిపించిన కాంగ్రెసు సంస్థన్నా, దానికి సర్వాధికారి అయిన గాంధీజీ అన్నా ఆయనకు గౌరవమే. ఎటొచ్చీ అన్నిటికీ ఆ మహాత్ముడినే నమ్ముకున్నందువల్ల ఆంధ్రులకు, ఆంధ్రోద్యమానికి జరిగిన తీరని అన్యాయం గురించే ఆయన ఆవేదన.
సర్ విజయ తన పని తనకు చేతకాక వేరేవారిపై పడి ఏడ్చే రకం కాదు. ఆయన బహు సమర్థుడు. అసాధారణ ప్రతిభావంతుడు. క్రీడా రంగంలోనేకాక జన జీవనంలోనూ మంచి పేరుతెచ్చుకున్నవాడు. 1941 నవంబరు విశాఖ మహాసభలో ఆయన ఆంధ్ర మహాసభకు అధ్యక్షుడుగా ఎన్నికైన తరవాతే ఆంధ్రోద్యమం ఒక గాడిన పడింది. పుట్టిన ఇరవై ఎనిదిమిదేళ్లకు ఆంధ్ర మహాసభకంటూ ఒక నిబంధనావళి తయారైంది. విజయవాడలో దానికి కార్యాలయ భవనమంటూ ఏర్పడింది. ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి, ప్రజలను సమీకరించి స్వరాజ్యం సాధించడానికి గట్టి యాక్షన్ ప్లానంటూ తయారైంది.
సర్ విజయ ఎప్పుడూ కాశీలోని విజయనగరం పాలెస్‌లోనే ఉండటంవల్ల ఆంధ్ర దేశంలో పరిచయాలు తక్కువే. అధ్యక్షుడు అయిన తరవాత కూడా ఆయన పూర్తి కాలాన్ని ఆంధ్రదేశానికి వెచ్చించని మాట నిజమే. అయినా మహాసభ కార్యదర్శి జి.వి.సుబ్బారావు వంటి సమర్థ సహచరుల పూనికవల్ల ఆయన హయాంలో ఆంధ్రోద్యమానికి కొత్త ఊపు వచ్చింది. ఏం లాభం? అడుగు ముందుకు వెయ్యాలంటే అన్నీ అడ్డంకులే. పెద్ద తలకాయల నుంచి అడుగడుగునా సహాయ నిరాకరణలే.
దీనికి తగ్గట్టు గాంధీజీకీ సర్ విజయ అంటే మొట్టమొదలే దురభిప్రాయం నాటుకుంది. ఆయన అధ్యక్షుడు అరుూ్యకాగానే విశాఖపట్నం మహాసభలో ఒక కలకలం రేగింది. ఆంధ్ర రాష్ట్ర తీర్మానంమీద అందరూ పట్టుబట్టి టంగుటూరి ప్రకాశాన్ని మాట్లాడమన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి ఎవరు ఏ విధంగా అడ్డుపడ్డారన్న దానిమీద ప్రకాశంగారు రెండుగంటలు అనర్గళంగా మాట్లాడాడు. సభాసదులు శ్రద్ధగా విన్నారు. ఆంధ్రకేసరి చెప్పినదానిలో ఎవరికీ అనౌచిత్యం కనపడలేదు. ఆయనా ఎవరినీ పేరుపెట్టి నిందించలేదు. కాని ఆంధ్ర రాష్ట్రం రాకుండా తెర వెనుక అడ్డుపడింది అప్పటి ముఖ్యమంత్రి రాజగోపాలాచారేనని ఆయన అన్యాపదేశంగా అన్నట్టు గాంధీ వీర విధేయులకు తోచింది. వెంఠనే ఆ వైనాన్ని వాళ్లు మహాత్ముడికి చేరవేశారు. తన ముద్దుల వియ్యంకుడు రాజాజీని నిండు సభలో అంతమాట అనే అవకాశాన్ని ఆకతాయి ప్రకాశానికి ఇస్తాడా... అని పెద్దాయన సర్ విజయ మీద ఆగ్రహించినట్టుంది. ఆయన ఏమి చెప్పాడో, ఆ ఉపదేశాన్ని అనుయాయులు ఎలా అర్థంచేసుకున్నారో తెలియదు గాని- విజయానంద్‌కి కాంగ్రెసు పెద్దలనుంచి అన్నీ చికాకులే. ఆంధ్ర మహాసభకు అధ్యక్షుడైన మూణ్నెల్లకే ఆయనకి కాంగ్రెసు తత్వం, గాంధీ మహత్వం బోధపడ్డాయి. నేరుగా మహాత్ముడితోనే నేరుగా మాట్లాడాలని నిశ్చయించుకుని 1942 మార్చిలో వార్ధావెళ్లి గాంధీజీని కలిశాడు. ఎందుకిలా చేస్తున్నారని ఆయన మొగంమీదే అడిగేశాడు.
బాపూ అంతా సావధానంగా విన్నాడు. కాని దేనికీ బదులుచెప్పలేదు. నువ్వు అడగదలచుకుంది ప్రశ్నల రూపంలో రాసి పంపించు. ‘హరిజన్’ పత్రికలో అన్నిటికీ జవాబు చెబుతా- అన్నాడు. అదే ప్రకారం సర్ విజయ వారణాశి తిరిగి వెళ్లాక 1942 మార్చి 18న గాంధీగారికి రాసిందే పైన ఉటంకించిన ఉత్తరం.
ఆంధ్ర మహాసభ అధ్యక్షుడి అభియోగాన్ని విన్నారుకదా? దానికి (1942 మార్చి 29) హరిజన్ పత్రికలో మహాత్ముడి సమాధానాన్నీ చిత్తగించండి:
I can only say that the Maharaj Kumar is in bad hands. I should like to know the Andhras who have given him the information which he has chosen to transmit to me. I am not a stranger to Andhra Desa myself. I refer the Maharaj Kumar to Deshbhakta Konda Venkatappayya, Shri Prakasam, Dr.Pattabhi Sitaramayya, Shri Kaleswara Rao and Shri Sitaram Sastry. They will probably bear witness to the fact that I was principally instrumental in securing from the Congress the recognition of the redistribution of the provinces for Congress purposes on a linguistic basis. I have always agitated for the acceptance by the Government of such re-distribution. I have indeed advised TamilNad, when such advice was needed, not to resist the Andhra demand. I know that the Congress Ministry Leaded by Shri C.Rajagopalachari tried to get Andhra recognised as a separate province, and it was no fault of the Ministry that Andhra Desh has not been so recognised... ...
[The Collected Works of Mahatma Gandhi, Vol.82, P.128]
(మహారాజ్ కుమార్ చెడ్డ చేతుల్లో పడ్డాడని మాత్రమే నేను చెప్పగలను. ... ఆయనకు ఈ సమాచారం అంథించిన ఆంధ్రులు ఎవరు అని నేను అడుగుతున్నాను. నేనేమీ ఆంధ్ర దేశానికి కొత్త కాదు. దేశభక్త కొండా వెంకటప్పయ్య, శ్రీ ప్రకాశం, డాక్టర్ పట్ట్భా సీతారామయ్య, శ్రీకాళేశ్వరరావు, శ్రీ సీతారామశాస్ర్తీలను అడిగి తెలుసుకోమని నేను మహారాజ్ కుమార్‌కి చెబుతున్నాను. భాష ప్రాతిపదికన రాష్ట్రాలను పునర్విభజించే విధానాన్ని కాంగ్రెసులో ప్రవేశపెట్టించింది నేనేనన్న వాస్తవాన్ని బహుశా వాళ్లు ధ్రువీకరించగలరు. అటువంటి పునర్విభజనకు ప్రభుత్వాన్నీ ఒప్పించడానికి నేనూ ఎప్పుడూ ఆందోళన చేస్తూనే ఉన్నాను. తమిళనాడును సలహా అడిగినప్పుడు ఆంధ్రుల డిమాండును నిరోధించవద్దనే నేను చెప్పాను. శ్రీ సి.రాజగోపాలాచారి నాయకత్వంలోని కాంగ్రెసు మంత్రివర్గం ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం ఇప్పించటానికి ప్రయత్నం చేసిందని నాకు తెలుసు. ఇప్పటిదాకా ఆంధ్ర దేశానికి అలాంటి గుర్తింపు రాకపోతే అది మంత్రివర్గం తప్పుకాదు.)
తప్పులెన్నకు. చెప్పుడు మాటలు వినకు. తెలియకపోతే కొండా వెంకటప్పయ్యనో, పట్ట్భా సీతారామయ్యనో, కాళేశ్వరుడినో, మరొకరినో అడిగి నేనేమిటో తెలుసుకో- అని గాంధీగారు చివాట్లు బాగానే పెట్టారు. కాని- తన పక్షాన సాక్ష్యం చెప్పగలిగినవారని ఆయన ఎన్నిక చేసిన ఆ పెద్దలే కదా ఆంధ్రోద్యమాన్ని ముందుకు సాగకుండా చేసింది? అప్పటి కాంగ్రెసు మహామహులనూ, వారి నిర్వాకాలనూ చూస్తే విజ్ఞులకు ఎంత ఒళ్లు మండేదో కొసరాజు రాఘవయ్యచౌదరి 1939 ‘ప్రజాతంత్ర’ సంక్రాంతి సంచికలో రాసిన ఈ పద్యాలను చూస్తే అర్థమవుతుంది:
సీ. సాంబమూర్తి స్వతంత్రశక్తి స్పీకరు పదం
బందున మున్గి చల్లారిపోయె
ఆంధ్రకేసరి గర్జలణగి మంత్రిత్వాన
తమిళ రాజాజీకి దాసుడయ్యె
పట్ట్భా గాంధి దెబ్బకు నసాళంబంటి
మెత్తమెత్తగ గ్రుడ్లు మిటకరించె
రంగా కిసాను సంరంభంబులో దూకి
యితర సమస్యలూహింపడయ్యె
తే.గీ. గూడవల్లి సినిమాల గోల జిక్కి
పట్టుమని అట్టె పల్లెత్తి పలుకడాయె
ఇంక మన యాంధ్రులకు రాష్టమ్రెట్లు వచ్చు
తెలుసుకోవమ్మ నీ శక్తి తెలుగుతల్లి!
* * *
సీ. కాళేశ్వరయ్య మొగ్గలువేసి రాజాజి
కడియేన టంచు దాసోహమిడియె
గిరిమంత్రి గింగిరాల్ దిరిగి నోరు మెదల్ప
కావదిన్నట్టు మాట్లాడకుండె
గోపాలరెడ్డి శ్రీ గురు పాదములబట్టి
తెలుగు పత్రికలనే తిట్టిపోసె
బాపినీడ రవ సంబంధమ్మునకు మెచ్చి
వేమారు గుటకలు వేయుచుండె
తే.గీ. కాంగ్రెసే రాష్టల్రక్ష్మి తేగలదటన్న
వెఱ్ఱికేకలు విని విఱ్ఱవీగబోము
మూఢభక్తిని బడి యింక మోసబోము
తెలిసిపోయె యథార్థంబు తెలుగుతల్లి
సినిమా కవి ఆత్రేయ మీద ఓ జోకు ఉంది. ఆయన పాట రాసి ప్రేక్షకులనీ, రాయక నిర్మాతలనూ ఏడిపించేవాడట! కాంగ్రెసువారిదీ అదే టైపు! వాళ్లు నాయకత్వం వహించక నైజామాంధ్రకూ, నాయకత్వం వహించి సీమాంధ్రకూ సమానంగా అన్యాయం చేశారు. హైదరాబాద్ స్టేటుకు జాతీయోద్యమాన్ని విస్తరించనివ్వకుండా, ప్రజాపోరాటానికి తానై నాయకత్వం వహించకుండా... తన ప్రమేయం లేకుండా మొదలైన పోరాటాన్నీ ముందుకు సాగనివ్వకుండా... శల్య సారధ్యంచేసి జాతీయ కాంగ్రెసు నిజాంకు తాబేదారులా వ్యవహరించిన వైనాలు కిందటి అధ్యాయాల్లో చూశాం.
బ్రిటిష్ ఆంధ్ర పరిస్థితి దీనికి పూర్తిగా భిన్నం. అక్కడ జాతీయోద్యమాన్ని కాంగ్రెసు నాయకులు (మహాత్ముడు అనుమతించిన మేరకు... ఆయన పెట్టిన సవాలక్ష ఆంక్షలకు, షరతులకు లోబడి) అవకాశమున్నంతలో జోరుగానే నడిపారు. ప్రజా పోరాటాలన్నీ తమ గుప్పిట్లో ఉండి ప్రతిదీ తాము చెప్పినట్టే జరగాలన్నారు. మళ్లీ ఆ సోకాల్డ్ పోరాటాలవల్ల బ్రిటిషు సర్కారుకు ఏ విధమైన ఇబ్బంది గాని, అసౌకర్యంగాని లేకుండా గాంధీగారి ఒద్దికలో సకల జాగ్రత్తలూ తీసుకున్నారు. తెలంగాణలో ఆంధ్ర మహాసభను బొత్తిగా పట్టించుకోకుండా దాని కర్మానికి వదిలేయటం ద్వారా నిజాంను సేవించినట్టే... కోస్తాలో ఆంధ్ర మహాసభను పూర్తిగా పట్టించుకుని, దానిని ఎందుకూ కొరగాకుండా చేయటంద్వారా తెల్లదొరలనూ, పనిలోపనిగా అరవ శకునులనూ సంతోషపెట్టారు. అక్కడా ఇక్కడా ఆంధ్రుల నోట మట్టే కొట్టారు!
తీరాంధ్రలో ఆంధ్ర మహాసభ 1913లో పుట్టినది మొదలుకుని తిరుగులేకుండా సాగిన కాంగ్రెసు పెత్తనానికి మధ్యలో ఐదేళ్లు మాత్రమే ప్రతిఘటన ఎదురైంది. 1941 నవంబరులో విచిత్ర పరిస్థితుల్లో తలవని తలంపుగా సర్ విజయ అధ్యక్షుడయ్యాక ఆంధ్ర మహాసభ అనేది కాంగ్రెసు జేబు సంస్థ అన్న అభిప్రాయం మారింది. అడుగు తీసి అడుగు వేయాలంటే వార్ధానుంచి అనుమతికోసం ఎదురుచూడకుండా అధ్యక్షుడు చొరవతో కదిలాడు. ఆంధ్రలో అనేక ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించాడు. ఇండియాకు వచ్చిన సర్ స్జ్ఫార్డ్ క్రిప్సును కలిసి ఆంధ్ర రాష్ట్రం అవసరాన్ని గట్టిగా వినిపించాడు. మద్రాసు, ఒరిస్సా గవర్నర్లతో, ప్రభుత్వ, ప్రభుత్వేతర ప్రముఖులతో ఆంధ్రుల డిమాండ్లను వివరంగా చర్చించాడు. ఆంధ్ర మహాసభ క్రమబద్ధంగా ముందుకు సాగటానికి గట్టి కృషి చేశాడు. అందుకే ఆంధ్రులు ఆయనని నెత్తిన పెట్టుకుని వరసగా మూడుసార్లు (1941, 1943, 1946లో) ఆంధ్ర మహాసభకు అధ్యక్షుడుగా ఎన్నుకున్నారు.
అదే పెద్ద అద్భుతం. దేశం మొత్తంమీదే గాంధీగారికి ఎదురు మాట్లాడి నిలవగలిగిన వారిని వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. మహాత్ముడి ఇష్టానికి వ్యతిరేకంగా... ఆయన నిలిపిన పట్ట్భాపై పోటీచేసి కాంగ్రెసు అధ్యక్షుడుగా ఎన్నికైన సుభాష్‌చంద్రబోస్ అంతటివాడే సామూహిక సహాయ నిరాకరణకు తట్టుకోలేక కొద్ది నెలలకే కాంగ్రెసునుంచి ఎలా నిష్క్రమించవలసి వచ్చిందో తెలిసిందే. అలాంటిది- గాంధీ తప్పులను నిర్భయంగా ఎత్తిచూపడమనే నిష్క్రృతిలేని నేరానికి పాల్పడ్డ సర్ విజయ వరసగా మూడోసారీ సంస్థకు అధ్యక్షుడు కాగలగటం అబ్బురమే.
అయితేనేమి? అంతిమ విజయం షరామామూలుగా గాంధీగారి భక్త బృందానిదే అయింది. మొదట్లో కొంతకాలం వెనక్కి తగ్గినా కాంగ్రెసు పెద్దలు అదనుచూసి వెంటపడ్డారు. 24 మంది సభ్యులున్న స్టాండింగ్ కమిటీలో 18 మంది కాంగ్రెసు వాదులే కనుక అధ్యక్ష, కార్యదర్శుల మాటనెగ్గకుండా అడుగడుగునా అడ్డుపడ్డారు. దానికితోడు సర్ విజయ అనారోగ్యం కొంత... అధ్యక్షుడయ్యాక కూడా ఆయన కాశీ నివాసం వదిలిపెట్టక పోవటం, ముఖ్యమైన సమావేశాలకు గైర్హాజరవటం వంటి తప్పిదాలు కొంత ఆయన వ్యతిరేకులకు లాభించాయి. ఆంధ్ర రాష్ట్రంకోసం ప్రభుత్వంతో తలపడి శాసనోల్లంఘన సత్యాగ్రహాలను సాగించాలని 1946 ఫిబ్రవరిలో గుంటూరులో ఆంధ్ర మహాసభ చేసిన చరిత్రాత్మక నిర్ణయాలను కాంగ్రెసు పెద్దలు జయప్రదంగా తుంగలో తొక్కించారు. ఎలాగూ స్వతంత్రం రానున్నది కనుక ఇప్పుడు శాసనోల్లంఘన అవసరమేమిటని సాక్షాత్తూ మహాత్ముడిచేతే (పూనా నుంచి 1946 మార్చి 22న) సర్ విజయకు ఉత్తరం రాయించారు. అధ్యక్షుడికి సమాంతరంగా గుంటూరు సభలోనే వర్కింగు ప్రెసిడెంటుగా ఎన్.వి.ఎల్.నరసింహారావును తెచ్చిపెట్టారు. పైకి చెప్పుకోలేని అనేక చికాకులకు విసిగివేసారి సర్ విజయ పదవికాలం ముగియడానికి ముందే రాజీనామా చెయ్యక తప్పని పరిస్థితి తీసుకొచ్చారు.
అధ్యక్షుడు రాజీనామా ఇవ్వగానే ఎగిరి గంతేసి ఉయ్యూరు కుమార్‌రాజా రంగయ్యప్పారావును ఆ స్థానంలో ఎన్నిక చేసుకున్నాక కనీసం కాంగ్రెసు వారైనా సఖ్యంగా ఉన్నారా? ఆంధ్ర మహాసభను తమ పద్ధతిలోనైనా సవ్యంగా నడవనిచ్చారా? లేదు. పూర్వపు అధ్యక్ష, కార్యదర్శులు ఇద్దరూ పనిచేసిన నేరానికి బయటికి పంపబడ్డ తరవాత ఆంధ్ర మహాసభ గొడవలు మరీ బజార్నపడ్డాయి. వర్కింగు ప్రెసిడెంటు ఎన్.వి.ఎల్.నరసింహారావుకూ, ప్రధాన కార్యదర్శి పున్నయ్యశాస్ర్తీకీ సరిపడక సంస్థ రెండు శిబిరాలుగా చీలింది. బళ్లారిలో వర్కింగ్ కమిటీ, గుంటూరులో స్టాండింగ్ కమిటీ పోటీ సమావేశాలు పెట్టుకుని, ఒకరిపై ఒకరు దుర్భాషలాడుకుని, ఒకరి నిర్ణయాన్ని ఒకరు తోసిపుచ్చి నానాగత్తర చేశాయి.
రెండో ప్రపంచ యుద్ధం ముగిసి, ఇంగ్లండులో ప్రభుత్వం మారి, కొత్త లేబర్ మంత్రివర్గం ఇండియాకు లార్డ్ పెథిక్ లారెన్స్ నేతృత్వంలో కేబినెట్ బృందాన్ని పంపిన రోజులవి. భారతదేశ రాజకీయ భవిష్యత్తు నిర్ణయమవబోతున్న కీలక తరుణమది. నూతన రాజ్యాంగ ఏర్పాట్లలో భాగంగా ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించటానికి యావచ్ఛక్తినీ వినియోగించి అందరూ సమష్టిగా పోరాడవలసిన సందర్భమది. సరిగ్గా ఆ కీలక ఘట్టంలోనే కాంగ్రెసు మార్కు కొట్లాటలు, కాట్లాటలు, పరస్పర ఈర్ష్యలు, ద్వేషాలు ఆంధ్రమహాసభను కుళ్లబొడిచి, ఆంధ్రోద్యమాన్ని నిర్వీర్యం చేశాయి. ఆంధ్ర జాతికి తీరని నష్టంచేసిన అడ్డగోలు రాజకీయాల సిగ్గుచేటు అంకానికి తెర లేచింది.