ఎం.వి.ఆర్ శాస్త్రి గారు ఆంధ్ర భూమి ఆదివారం అనుబంధం లో సీరియల్ గా ప్రచురిస్తున్న ఆంధ్రుల కథ యదాతథం గా..
ఎంచాలంటే అన్నీ కంతలే ---- (February 27th, 2011)
‘‘కాంగ్రెస్ మంత్రివర్గాలు 1937లో వచ్చినవి. అందులో రాజాజీ ప్రధాని అయినాడు. శ్రీ ప్రకాశం, గిరి, గోపాలరెడ్డిగారలు తెలుగు మంత్రులు. వీరు చొరవ తీసుకుని ఆంధ్రరాష్ట్రం సాధించలేక పోయినారు. యుద్ధ కారణంగా మంత్రి పదవులు రాజీనామా పెట్టిన తర్వాత 1941లో విశాఖపట్నం ఆంధ్ర మహాసభా వేదికపై- ఆంధ్ర రాష్ట్రం ఇస్తే రక్తపాతం జరుగుతుందని మద్రాసు ప్రభుత్వంలో బాధ్యత కలిగిన వ్యక్తి లండనుకు వ్రాశారని శ్రీ ప్రకాశం గారన్నారు. తాము మంత్రివర్గంలో వున్నపుడు రుూ విషయంలో తమరెంతవరకు అభ్యంతరపెట్టిరో తెల్పనేలేదు.
‘‘1946లో మరల ఏర్పడిన కాంగ్రెస్ మంత్రి వర్గాలలో అగ్రనాయకుల అభీష్టానికి వ్యతిరేకంగా కూడా శ్రీ ప్రకాశంగారే ప్రధానిగా ఎన్నుకోబడ్డారు. అయినా తాను ప్రధానిగా ఆంధ్ర రాష్ట్ర విషయం పట్టించుకోనే లేదు. పైగా రాజ్యాంగ పరిషత్తే అంతా చేస్తుందిలెమ్మని తేల్చివేశారు. తాము అందులో సభ్యులై రుూ విషయం ప్రస్తావించనైనా లేదు. ఈ విషయం ఆలోచించడానికి తనకు గాని, యిండియా మంత్రికి గాని తీరికయే లేదని 7-9-47న ఎసెంబ్లీలో అన్నారు. కృపాలనీ అధ్యక్షతను జరిగిన మీరట్ కాంగ్రెస్‌లో ఆంధ్ర రాష్ట్ర విషయం చర్చించవలసినదిగా కోరుతూ పంపిన మహజరు (రిక్విజిషను) తీర్మానంపై ప్రధానిగా వుండీ ప్రకాశంగారు సంతకం చేయ నిరాకరించారు.‘‘ఇంతలో మంత్రిత్వం పోయింది. అరవల బలంవల్ల ప్రకాశంగారు వోడిపోయినారని ప్రకాశం అనుయాయులు ప్రచారం ప్రారంభించిన రోజులలో ప్రకాశంగారే తనకు 40 మంది అరవలు ఓటుచేయడంవల్లనే ఈ మాత్రం బలమైనా వచ్చిందని తెనాలిలో అన్నారు. (మీజాన్ 4-4-47) కాని మరల గత 12 లేక 14 నెలల నుండి చెన్న రాష్ట్రంలో ప్రత్యేకంగా యేర్పడిన ఆందోళనకరమైన పరిస్థితులనుబట్టి ఈ రాష్ట్రంలోని యితర వర్గాలతో కలిసి సన్నిహితంగా వ్యవహరించడానికి అనువగు వాతావరణం లేకపోవడంవల్లను, తాను తన మిత్రులు కొందరు కలసి సత్వరాంధ్రరాష్ట్ర నిర్మాణం జరగవలసిందిగ కోరవలసి వచ్చిందని, లేకపోతే ఈ విషయాన్ని గురించి ఇక్కడ మద్రాసు ఎసెంబ్లీలోగాని, రాజ్యాంగ పరిషత్తులో గాని చర్చ జరుపవలెననే పట్టుదల తమకు లేనే లేదని శ్రీ ప్రకాశంగారు 28-4-48న ఎసెంబ్లీలో అన్నారు.’’విశాలాంధ్రం, వావిలాల గోపాలకృష్ణయ్య, పే.100-101
విశాలాంథ్ర నిర్మాణం ఆవశ్యకతను నొక్కిచెబుతూ, ఈ విషయంలో అప్పటిదాకా పడిన తప్పటడుగులను, ఆంధ్ర నాయకుల అలసత్వాన్ని ఎండగడుతూ వావిలాల గోపాలకృష్ణయ్య 1951లో తనదైన శైలిలో రచించిన ‘విశాలాంధ్రం’ పుస్తకంలో అన్న ములుకుల్లాంటి పలుకులివి. వావిలాల తత్వం గురించి కొంచెం తెలిసినవారెవరూ ఆయన నిజాయతీని శంకించలేరు. దురుద్దేశాలను ఆపాదించలేరు. ప్రకాశమంటే పడక అలా రాశాడేమోనని అనుమానించడానికి వీలేలేదు.‘‘ఆంధ్రజాతి మేల్కొని విశాలాంధ్ర కొరకురొమ్మువిరువక యున్న ఆంధ్రమ్మె సున్న’’అంటూ వావిలాలవారు తన పుస్తకం మొదలెట్టారు.’’ విమర్శనలు వ్యక్తిగతంగా కాకుండా ఉద్యమానికి సంబంధించినవిగా గమనించి, ఆంధ్రాభ్యుదయానే్న ఆశించి, ఆంధ్ర జీవితంలో అట్టివి జరగకుండా చూచుటకు విజ్ఞప్తిగా భావించండి’’ అని ముందుమాటలోనే విన్నవించారు.నిజంకూడా అంతే.మనం పరిశీలిస్తున్న కాలాన ఆంధ్ర నాయకుల్లో ‘టవరింగ్ పర్సనాలిటీ’ అనదగ్గవాడు టంగుటూరి ప్రకాశం పంతులే! స్వార్థాన్ని దరిచేరనివ్వనివాడు, జీవితాన్ని జాతికి అంకితం చేసినవాడు, మహాత్యాగి, గొప్ప ధీరుడు, ప్రజలు మెచ్చిన ప్రజానాయకుడు అని నిస్సంశయంగా మనం చెప్పుకోగలిగినవాడూ ఆయనొక్కడే. అంతటి మహాపురుషుడిలోనే- ఆంధ్రరాష్ట్ర సాధన విషయంలో, ఆంధ్ర ప్రయోజనాలకోసం పాటుపడే విషయంలో అన్నన్ని లొసుగులు వావిలాల అంతటి నిస్వార్థ యథార్థవాదికే కనిపించాయంటే... ఇక మిగతా బతకనేర్చిన నాయకుల సజ్జు మాటేమిటి?!తెల్లని కాకులు లేనట్టే వంక లేని నాయకులు రాజకీయాల్లో దొరకరు. ఎంచాలంటే మంచమంతా కంతలే అన్నట్టు రాజకీయ జీవుల్లో ఎంచబోతే అన్నీ లోపాలే కనిపిస్తాయి. ఈ భాష, ఆ భాష... ఈ ప్రాంతం, ఆ ప్రాంతం అనికాక రాజకీయ శాల్తీల నడవడి ఎక్కడైనా ఒకటే తీరు. కాకపోతే తమిళులకూ, మనకూ ఒక తేడా. అరవలు, వారి నాయకులు తమలోతమకు ఎన్ని గొడవలున్నా, ఎంత తన్నుకున్నా తమిళ ప్రయోజనాల దగ్గరికి వచ్చేసరికి అంతా ఒకటవుతారు. తమిళులకు ఉన్నదని తాము అనుకునే హక్కును నిలబెట్టుకోవటానికి, కోరుకున్నది రాబట్టటానికి ఒక్క గొంతుతో మాట్లాడుతారు. విడివిడిగా అయినా ఒకలాగే వ్యవహరిస్తారు. రాజాజీకీ, కామరాజ్‌కీ, సత్యమూర్తికీ నడుమ ఎన్ని పేచీలున్నా మద్రాసులో సూదిమోపినంత స్థలం ఆంధ్రులకు వదలరాదన్నంతవరకూ మగ్గురిదీ ఒకటేమాట. ఒకటే తీరు.అదే మనవాళ్లో? ఎవడి బాగువాడికి కావాలి. అవతలివాడు బాగుపడకపోవటం అంతకంటే ఎక్కువ కావాలి. ఎదుటివాడిని దెబ్బతీయటంకోసం దయ్యాలతో వియ్యమందడానికి కూడా సిద్ధమే. భాష ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజాప్రయోజనాలు ఎంత మట్టికొట్టుకుపోయినా సరే... తమ పదవి, తమ పవరు తిన్నగా ఉండటమే మన నేతాశ్రీలకు కావలసింది. మళ్లీ ఒక్కొక్కడూ మహామేధావే. ఆలిండియాలో ఓహో అనిపించుకున్న అతిరథుడే! పై స్థాయిలో అవసరానికి మించిన పలుకుబడి దండిగా ఉన్నవాడే. కాని అవేవీ అతగాడికే తప్ప జాతికి ఉపయోగపడేవి కావు.ఉదాహరణకు భోగరాజు పట్ట్భాసీతారామయ్యనే చూడండి. ఆయన జాతీయ కాంగ్రెసుకు ఆధికారిక చరిత్రకారుడు. గాంధీ మహాత్ముడి అంతేవాసి. నమ్మినబంటు. కాంగ్రెసు జాతీయ నాయకులకు దగ్గరివాడు. గొప్ప మేధావిగా పేరుతెచ్చుకున్నవాడు.అంతేకాదు. భాష ప్రాతిపదికన రాష్ట్రాలను పునర్విభజించాలని, మద్రాసు ప్రెసిడెన్సీనుంచి ఆంధ్రరాష్ట్రాన్ని వేరుచేయాలని అందరికంటే ముందు పట్ట్భా కోరాడు. 1913లో మొట్టమొదటి ఆంధ్ర మహాసభలోనే ఈ విషయమై కొండ వెంకటప్పయ్యతో కలిసి ఒక వివరణ పత్రం వెలువరించాడు. 1917 కలకత్తా కాంగ్రెసులో అధ్యక్షురాలు అనీబిసెంట్‌తో హోరాహోరీగా వాదించి భాషావాదాన్ని నెగ్గించి ఆంధ్ర ప్రాంతానికి ప్రత్యేక పి.సి.సి.ని ఆయన సాధించాడు. అదే సంవత్సరం 16 మంది ఆంధ్ర ప్రముఖులతో మాంటేగు దొరను దర్శించి, భాషాప్రయోక్త రాష్ట్రాల ఏర్పాటుకు, మద్రాసునుంచి ఆంధ్ర రాష్ట్ర వేర్పాటుకు అంగీకరించాలని బ్రిటిష్ ప్రభుత్వాన్ని గట్టిగా కోరాడు. ఆయనపై చేసిన రాజకీయ అధ్యయనంలో డాక్టర్ ఎ.ప్రసన్నకుమార్ అన్నట్టు- he was one of the earliest to conceive the vision of an Andhra Province and he pursued the ideal with irrepressible zeal through thick and thin for forty years. (ఆంధ్రరాష్ట్ర ఆవశ్యకతను పట్ట్భా అందరికంటే ముందు గుర్తించి, దానికోసం నలభై ఏళ్లు కఠోర దీక్షతో విడవకుండా పోరాడాడు.)మరి అంతటి మహనీయుడే స్వతంత్ర భారతంలో అఖిల భారత కాంగ్రెసు అధ్యక్షుడైతే ఇక కావలసింది ఏముంది? రాష్ట్రాన్ని ఇవ్వవలసింది కేంద్ర ప్రభుత్వం. అది కాంగ్రెసు చేతిలో ఉన్నది. వేర్పాటుకు సమ్మతించవలసింది మద్రాసు ప్రభుత్వం. అక్కడా కాంగ్రెసుదే అధికారం. ప్రభుత్వాలకు విధానం నిర్దేశించవలసిన కాంగ్రెసుకు మనవాడే అగ్రాసనాధిపతి. పైగా- రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణపై కాంగ్రెసు వేసిన నాయకత్రయ జెవిపి కమిటీలో ‘పి’ అంటే పట్ట్భా. ఇక మన రొట్టె విరిగి నేతిలో పడ్డట్టే. ఆంధ్రరాష్ట్రానికి తొలి వైతాళికుల్లో ఒకడైన పట్ట్భాగారు తన భాషావాదాన్ని గట్టిగా వినిపించి, పట్టుబట్టి రాష్ట్రం సాధించిపెట్టినట్టే... అని అశేషాంధ్రులు మురిశారు.చివరికి హతాశులయ్యారు. దేశంలో తొలుదొలుత భాషారాష్ట్రాల వాదాన్ని మొదలెట్టిన పట్ట్భా దాన్ని స్వహస్తాలతో తుంగలో తొక్కాడు. కాంగ్రెసుకు అధికారమంది, ప్రకటిత విధానం అమలు దగ్గరికి వచ్చేసరికి భాషా రాష్ట్రాల ఏర్పాటు తగదన్న వాదానికి తల ఊచి, ప్లేటు మార్చాడు. ఆంధ్రులమీద దయతలిచి వారికి ప్రత్యేక రాష్ట్రం ఇవ్వవచ్చునని చెబుతూనే మద్రాసుమీద హక్కు వదులుకోవాలని, మిగతావారికి అభ్యంతరం లేని ప్రాంతాలతోనే ఆంధ్రరాష్ట్రం ఏర్పడాలని దిక్కుమాలిన షరతులు పెట్టి జెవిపి నివేదికలో ఆంధ్రుల ఆశల మీద చన్నీళ్లు కుమ్మరించాడు.ఇలా ఎందుకు చేశారంటే పట్ట్భాగారు, ఆయన అనుయాయులు చాలా కారణాల కబుర్లు చెప్పారు. వారు చెప్పని, ఒప్పుకోని అతి పెద్ద కారణమేమిటంటే... ప్రకాశమంటే పట్ట్భాకి పడదు. సాటి ఆంధ్రుడు, ఆంధ్రులు మెచ్చిన ప్రజానాయకుడు అయిన ప్రకాశంతో చేయి కలిపి ఆంధ్ర ప్రయోజనాలకోసం పోరాడటం కంటే... మద్రాసు రాజకీయాల్లో ప్రకాశమంటే తనకులాగే గిట్టని అరవ నాయకులతో మొగమాటానికి పట్ట్భా ఎక్కువ విలువ ఇచ్చాడు. తమిళులు లాభపడ్డా సరే, ఆంధ్రులు నష్టపోయినా సరే, రేపు ఏర్పడబోయే రాష్ట్రంలో ప్రకాశం తోకను సాధ్యమైనంత కత్తిరించడం ఎలాగన్నదే ఆయనగారికి ముఖ్యమైంది.అది జనానికీ అర్థమైంది. మద్రాసుమీద ఆంధ్రుల హక్కును కాంగ్రెసు ఎప్పటినుంచో గుర్తించి... ఆ నగరంలో ఎ.పి.సి.సి, టి.ఎన్.సి.సి.లకు ఉమ్మడి అధికారం ఎప్పుడో దఖలుపరిస్తే... తమరేమిటి, ఇప్పుడిలా చేశారు? అరవ శకుని రాజాజీ అనవలసిన మాటను మీరే అని, మద్రాసు మీద హక్కును మనం వదిలేసుకోవాలని తేల్చారు? అని పదుగురూ నిలదీశారు. దాంతో పట్ట్భాకి దిమ్మతిరిగింది. అబ్బే, నా ఉద్దేశం అది కాదు. మద్రాసుమీద హక్కు వదిలేసుకోవాలంటే మద్రాసు నగరం పూర్తిగా మనకు దక్కకుండా పోతుందని కాదు. దానిమీద పూర్తి హక్కు తమిళులకే ఉండాలనీ కాదు. తమిళ రాష్ట్రంలోనే అది ఉండి తీరాలనీ కాదు. ఆంధ్ర రాష్ట్రంలో మద్రాసును చేర్చకూడదని మేము అన్నామే గానీ- తమిళులకు, ఆంధ్రులకు ఉమ్మడి రాజధానిగా మద్రాసు కాకూడదని చెప్పలేదుగదా? ఆ విధంగా ఆంధ్ర రాష్ట్రానికి మద్రాసునే రాజధానిగా కనీసం కొంతకాలం నిరభ్యంతరంగా కొనసాగించవచ్చు. లేదా - తమిళ రాష్ట్రంలో చేర్చకుండా మద్రాసు నగరాన్ని ప్రత్యేక రాష్ట్రంగా చేయనూ వచ్చు- అని పట్ట్భా మహాశయుడు గొప్ప వివరణ ఇచ్చాడు.జాగ్రత్తగా గమనిస్తే ఇందులోనూ కానరాని మెలికలున్నాయి. పానగల్ రాజా మద్రాసు ముఖ్యమంత్రిగా ఉండి ఏనాడో సూచించినట్టు కూమ్ నదిని సరిహద్దుగా తీసుకుని, దానికి దక్షిణాన ఉన్న తమిళభాషా ప్రాంతాన్ని తమిళులకూ, ఉత్తరంవైపున్న తెలుగు ప్రాంతాన్ని ఆంధ్రులకూ పంచడం- లాంటి ప్రతిపాదన ఏదైనా వస్తే ఆంధ్రులకు న్యాయం జరుగుతుందన్న ఆశకు ఆస్కారం ఉండేది. అటువంటిదేమీ లేకుండా వేరే రాజధాని కట్టుకునేదాకా కొంతకాలంపాటు మనకూ మద్రాసును రాజధానిగా అనుమతించవచ్చు- అని పట్ట్భా అనడమంటే... అద్దెకున్నవాడిని వేరే ఇల్లు దొరికేదాకా మరికొన్నాళ్లు అదే ఇంట్లో ఉండనివ్వటం లాంటిదే. అది తాత్కాలికమైన వెసులుబాటే తప్ప హక్కును గుర్తించినట్టు కానేకాదు.అయినా అల్పసంతోషులైన మనవాళ్లు అదే మహద్భాగ్యమనుకున్నారు. పేచీలున్న ప్రాంతాలను అరవలు మనకు వదలకపోయినా సరే; మద్రాసును ఏనాటికైనా వదిలిపెట్టటం తప్పకపోయినాసరే... ఆంధ్రరాష్టమ్రంటూ వస్తే చాలు; కొంతకాలంపాటు మద్రాసును దానికి రాజధానిగా అనుమతిస్తే అదే పదివేలు అనుకున్నారు. ఆంధ్రరాష్ట్రంలో చేర్చకపోయినా పట్ట్భాగారు చెప్పినట్టు మద్రాసు నగరాన్ని ప్రత్యేక రాష్ట్రంచేస్తే దానిమీద మన హక్కు మనకు మిగిలే ఉంటుంది కనుక అదీ బాగానే ఉందనుకున్నారు. ప్రకాశంగారు సరే కానీ అన్నారు. ఆంధ్ర కాంగ్రెసు అధ్యక్షుడు ఎన్.జి.రంగాగారు అలాగైతే నాకూ అభ్యంతరం లేదన్నారు. పట్ట్భా వివరణతో సంతృప్తి చెంది, జె.వి.పి. నివేదికను ఆమోదిస్తున్నామనీ, ఆ వివరణ మేరకు ఆంధ్ర రాష్ట్రాన్ని భారత ప్రభుత్వం అవశ్యం ఏర్పరచాలనీ అంటూ అంతా కలిసి 1949 నవంబరు 14న ఎ.పి.సి.సి.లో తీర్మానం చేశారు. ఇంకేం, అలాగే కానివ్వండి అని కాంగ్రెసు వర్కింగు కమిటీ కూడా అర్జంటుగా (నవంబరు 16న) పచ్చజండా ఊపింది.కాని- వర్కింగు కమిటీ తీర్మానంలో పట్ట్భా వివరణ ఊసులేదు. ఆ వివరణను చూసే జెవిపి నివేదికను అంగీకరిస్తున్నామని ఎపిసిసి పెట్టిన షరాను వర్కింగు కమిటీ పట్టించుకోనే లేదు. నాయకత్రయ నివేదిక ప్రకారం మద్రాసు లేకుండా వివాద రహితమైన జిల్లాలతో ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పరచాలని మాత్రమే వర్కింగు కమిటీ చెప్పింది. ఎల్లల నిర్ధారణ బాధ్యత ఒక కమిషనుకు అప్పగించాలని ప్రభుత్వానికి సూచించింది.ఆ ప్రకారమే మద్రాసు ప్రభుత్వం బౌండరీ కమిషనుకు ముందస్తు చర్యగా పార్టీషన్ కమిటీని ఏర్పాటుచేసింది. టంగుటూరి ప్రకాశం, బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి, కళా వెంకట్రావు, ఎం.్భక్తవత్సలం, టి.టి.కృష్ణమాచారి, కె.మాధవమీనన్‌లు అందులో సభ్యులు. ముఖ్యమంత్రి పి.ఎస్.కుమారస్వామిరాజా దానికి అధ్యక్షుడు.అప్పటికే నవంబరు నెల చివరికి వచ్చింది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చే 1950 జనవరి 26 తేదీకి రెండునెలలు మాత్రమే వ్యవధి ఉంది. ఆలోపే అయితే ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు సులువవుతుంది. ఆ తరవాత కొత్త రాజ్యాంగం కింద కొత్త రాష్ట్రం ఏర్పాటంటే చాలా తతంగం ఉంటుంది. ఆలస్యమూ అవుతుంది. కాబట్టి ఈలోగానే పనికానివ్వాలని పార్టీషన్ కమిటీలో ఆంధ్ర సభ్యులు పట్టుబట్టారు. వీలైతే అలాగే చేద్దామని మిగతావారూ అన్నారు. కానీ- వీలుకాకుండా యథాశక్తిగా వారు అడ్డంపడ్డారు.ఆంధ్రరాష్ట్రానికి సొంత రాజధాని అమరేదాకా మద్రాసును దాని ముఖ్యపట్టణంగా కొనసాగనివ్వవచ్చునని కదా పట్ట్భా భాష్యం?! దాన్ని నమ్మేకదా ఆంధ్ర కాంగ్రెసు సరేనన్నది? అసలైన ఆ ఏర్పాటుకే అరవలు అడ్డంకొట్టారు. మీ రాజధాని మొదటినుంచీ మీ ప్రాంతంలోనే ఉండాలి. అది ఏదన్నది ఇప్పుడే తేల్చాలి. మీ గవర్నరు, మంత్రులు అక్కడే ప్రమాణ స్వీకారం చెయ్యాలి; మీ శాసనసభ తొలి సమావేశం అక్కడే జరగాలి. సెక్రటేరియటు కూడా మొదటినుంచీ అక్కడే పనిచేయాలి- అని వారు డిసెంబరు 23న మడతపేచీ పెట్టారు.అది ఎలా కుదురుతుందండీ? ఇప్పటికప్పుడు మద్రాసు వదిలి పొమ్మంటే ఎలా? జనవరి 26కు ఇక నెలరోజులే గడువు మిగిలింది. ఇప్పటికిప్పుడు మాకు సొంత రాజధాని ఎక్కడ దొరుకుతుంది? రాజధాని కావటానికి అన్ని హంగులూ సిద్ధంగా ఉన్న నగరమేదీ మా ప్రాంతాల్లో లేదు. ఉన్నపళాన మద్రాసు ఖాళీచేసి పొమ్మనటం మాకు అవమానం. వాస్తవంగా సాధ్యపడేదీ కాదు. కాబట్టి కనీసం ఆగస్టు 15దాకానైనా మద్రాసును ఉమ్మడి రాజధానిగా ఉండనివ్వండి. కాలూచెరుూ్య కూడదీసుకుని హైకోర్టు, అసెంబ్లీ, సెక్రటేరియటు మా ప్రాంతంలో ఏర్పాటుచేసుకుని, తరలిపోయేందుకు కనీసం 1950 ఏప్రిల్‌దాకా ఐదు నెలలైనా గడువివ్వండి- అని పరిపరివిధాల వేడాడు ప్రకాశంగారు.అరవలు ఆ మొర ఆలకించలేదు. నాలుగురోజులకోసమైనా మిమ్మల్ని ఉండనిస్తే ఆ తర్వాత మీరు పోతారన్న నమ్మకం ఏమిటి? మీరు ఇక్కడే తిష్ఠవేస్తే మేమేమి కావాలి? ససేమిరా కుదరదు. తక్షణమే తుండూ, తుపాకీ భుజాన వేసుకుని మీరు వెళ్లిపోవలసిందేనని వారు పంతంపట్టారు. పోనీ ఏమిచేయాలన్నది భారత ప్రభుత్వం నిర్ణయానికి వదిలేద్దాం అని ప్రకాశం సూచించాడు. దాన్నీ అవతలివారు కొట్టిపారేశారు. అద్దెకున్నవాడిని ఖాళీచేయించటానికి సాధారణంగా ఏ ఇల్లుగలాయనయినా ఇచ్చే కనీస వ్యవధిని కూడా ఆంధ్రులకు అరవలు ఇవ్వదలచలేదు. అంతా తాము చెప్పినట్టే జరగాలంటూ అడ్డగోలుగా రిపోర్టు ఖరారుచేసి పడేశారు. ప్రకాశం దానితో విభేదించి తాను విడిగా వేరే నివేదిక ఇచ్చాడు. ఏకాకి కావటంతో ఆయన మాట చెల్లుబాటు కాలేదు.పార్టీషను కమిటీలో మొత్తం సభ్యులు 8 మంది. అందులో నలుగురు ఆంధ్రులు. అధ్యక్షుడితో కలిసి ముగ్గురు తమిళులు. మాధవమీనన్ కేరళవాడు. సగం మంది తెలుగువారే అయినప్పుడు ఉన్న నలుగురూ ఒక కట్టుమీద ఉండి ఉంటే వారి వాదానిదే పైచేయి అయ్యేది. అరవలది మైనారిటీ అయ్యేది. ప్రకాశం ఒక్కడే వేరై అసమ్మతి తెలియజేశాడంటే మిగతా ముగ్గురు ఆంధ్రులూ అరవలతో చెయి కలిపారని స్పష్టం.వాళ్లు ఎలా ఎందుకు చేశారంటే ప్రకాశమంటే వారికి గిట్టదు కనుక! నీలం సంజీవరెడ్డిని రాజకీయాలలోకి తెచ్చింది పట్ట్భా. కళా వెంకటరావూ ఆయన మనిషే. బెజవాడ గోపాలరెడ్డీ పట్ట్భాకి ఇష్టుడు. లోగడ ప్రకాశాన్ని గద్దెదించే పుణ్యకార్యంలో ఆయనా ఒక చెయ్యివేసినవాడే. పార్టీషను కమిటీలో ప్రకాశం చెప్పింది సబబాకాదా? ఆంధ్ర ప్రయోజనాలకు అది మంచిదా కాదా?- అన్నది వారికి పట్టలేదు. తమకు విరోధి అయిన ప్రకాశాన్ని ఏకాకిని చెయ్యటమే వారికి ముఖ్యమైంది.ఇలాంటివాళ్లు నాయకులు కావటంవల్లే మొదటినుంచీ ఆంధ్రుల బతుకులు ఇలా అఘోరించాయి.పార్టీషను కమిటీ నివేదిక భారత ప్రభుత్వానికి 1950 జనవరిలో చేరింది. అది ఏకగ్రీవ నిర్ణయం కాదుకనుక, భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి కనుక తదుపరి నిర్ణయం ప్రధాని నెహ్రూ చేయవలసి వచ్చింది. తమిళులు కుదరదు పొమ్మన్నంత మాత్రాన భారత ప్రభుత్వం దానికి తల ఊచాల్సిన పనిలేదు. ఇప్పటికిప్పుడు పొమ్మంటే వారెక్కడికిపోతారు, సొంత రాజధాని తయారయ్యేదాకా ఆంధ్ర ప్రభుత్వాన్ని మద్రాసునుంచే పనిచేయనివ్వండి అని ప్రధానమంత్రి అంటే ఎవరూ కాదనలేరు. ఆంధ్రులకు న్యాయం చేయాలన్న చిత్తశుద్ధి నెహ్రూకి ఉండి ఉంటే, ఆధికారిక ఉత్తర్వు జారీచేసి 1950 జనవరిలోగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పరచడానికి ఏ అడ్డంకీ లేదు.అయినా నెహ్రూ ఆ పని చెయ్యలేదు. సమస్యను తేల్చటంకంటే మాగవేయటం మంచిదని తన సహజశైలిలో ఆయన తలచాడు. అభిప్రాయ భేదాలు సర్దుబాటు అయ్యేంతవరకూ ఈ విషయంలో నిర్ణయం కుదరదని 1950 జనవరి 24న భారత ప్రభుత్వం ఆధికారికంగా ప్రకటించింది. రెండురోజుల తరవాత ఆంధ్ర రాష్ట్రం లేకుండానే కొత్త రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.ఆంధ్రులకు బస్సు మళ్లీ మిస్సయింది.*