ఆంధ్రుల కథ - 2

ఎం.వి.ఆర్ శాస్త్రి గారు ఆంధ్ర భూమి ఆదివారం అనుబంధం లో సీరియల్ గా ప్రచురిస్తున్న ఆంధ్రుల కథ యదాతథం గా..


ఎంత విడ్డూరం, ఎంత సాహసం (May 2nd, 2010)

ఒక్కోసారి చిన్న ఘటనలే గొప్ప పరిణామాలకు దారితీస్తాయి. ఆ సమయాన ఎవరూ పెద్దగా పట్టించుకోని స్వల్ప విషయాలే మునుముందు చరిత్రను మలుపుతిప్పే సంచలనాలకు నాందీ వాచకమవుతాయి.
నూరేళ్ల కిందటి మాట.
వందేమాతరం, స్వదేశీ ఉద్యమాలు ఉద్ధృతంగా సాగి దేశమంతటా జాతీయ భావాలు ఉప్పొంగిన కాలమది. గుంటూరు మండలంలో జాతీయవాదులైన నవ యువకులు ‘యంగ్‌మెన్స్ లిటరరీ అసోసియేషన్’ పేర సోషల్ క్లబ్బు ఒకటి పెట్టారు. గుంటూరు పట్టణంలో పాత ట్రావెలర్స్ బంగళా పక్కన చిన్న భవనం దాని కార్యస్థానం. ప్రముఖ న్యాయవాదులు, రచయితలు, సంఘసేవకులు రోజూ సాయంత్రం అక్కడ చేరి సమకాలిక అంశాలను చర్చిస్తుండేవాళ్లు.
ఆ ప్రముఖుల్లో ఒకరు న్యాయపతి నారాయణరావుగారు. ఆయన పేరుమోసిన న్యాయవాది. 1911 సంవత్సరం సెప్టెంబరు నెలలో ఒక సాయంత్రం ఆయన కోర్టునుంచి ధుమధుమలాడుతూ ఎకాఎకి క్లబ్బుకు వెళ్లాడు. వెళ్లీవెళ్లగానే కోటు గుండీలు విప్పుతూ ‘‘ఈ అరవవాళ్లతో వేగలేమయ్యా. ఇక మన రాష్ట్రం మనం తెచ్చుకోవలసిందే’’ అన్నాడు చిరాకుగా, నిష్ఠూరంగా. పక్కనున్నవాళ్లు ‘‘ఏమైందేమిటి’’ అని అడిగారు.
ఏముంది? ఎప్పుడూ ఉన్నదే. గుంటూరుకు సబ్ జడ్జిగా ఓ అరవాయన వచ్చాడు. ఆయన కోర్టులో డఫేదారు పోస్టు ఖాళీ అయింది. ఎంతోమంది తెలుగువాళ్లు అర్జీ పెట్టుకున్నారు. అన్ని అర్హతలూ ఉన్నవాళ్లు వారిలో చాలామంది ఉన్నారు. ఐనా- అందరినీ కాదని- తన సొంత ఊరు కుంభకోణానికి చెందిన తమిళుడికి జడ్జిగారు ఆ వేళే కొలువు ఇప్పించాడు.
ఇది విని నారాయణరావులాగే మిగతావాళ్లూ బాధపడ్డారు. అరవల దాష్టీకానికి అంతులేకుండా పోతున్నదని ఎవరో అన్నారు. దానిమీద చాలా చర్చ జరిగింది. ఊరకే ఆక్షేపించి లాభం లేదు; అసలు జిల్లా మొత్తంమీద సర్కారీ కొలువుల్లో తమిళులు ఎంతమందో, తెలుగువాళ్లు ఎందరున్నారో లెక్కలు తీద్దామని అనుకున్నారు అలాగే- ఆరాలు తీసి, సమాచారం రాబట్టి పట్టికలు తయారుచేశారు. వాటిని చూసినవారికి మతిపోయింది. గుంటూరు పట్నంలోని ప్రతి గెజిటెడ్ ఆఫీసరూ తమిళుడే. జిల్లా మొత్తంమీద ఆఫీసర్లలో ఒక్క తెలుగువాడూ లేడు. ఆఖరికి లోకల్ స్కూళ్ల టీచర్లలో కూడా అత్యధికులు అరవలే.
‘‘ఈ గణాంకాలు చూస్తే మాకు ఎంతో ఆశ్చర్యం కలిగింది. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం సాధించి తీరాలన్న పట్టుదల అప్పటినుంచే మా అందరిలో పెరిగింది’’ అంటారు ఆనాటి చెట్టుకింద ముచ్చట్లకు ప్రత్యక్ష సాక్షి అయిన విష్ణుబొట్ల సూర్యనారాయణగారు ఆ దరిమిలా ఆంధ్రోద్యమం గురించి రాసిన చిరుపొత్తంలో.
అన్నట్టు- దీనికి ఐదు నెలలముందు ఇంకో సంఘటన జరిగింది. మద్రాసు వెళుతున్న రైల్లో ఒక తెలుగువాడికీ, తమిళుడికీ ఉబుసుపోక కబుర్లలో మాటామాటా పెరిగింది. ‘‘మీది వెనకబడ్డ జాతి. తెలుగువాళ్లకు మెదడన్నది లేదు. మా భాష్యం అయ్యంగార్, ముత్తుస్వామి దీక్షితార్ లాంటివాళ్లు తెలుగు గడ్డన ఒక్కరైనా పుట్టారా’’ అని ఈసడించాడు అరవాయన. ఆంధ్రుడి మనసు కలుక్కుమంది. ఇంటికి చేరాక తన అనుభవాన్ని ఉదహరిస్తూ, తమిళుల్లో గూడుకట్టిన దురభిప్రాయాలను ఖండిస్తూ ‘హిందూ’ పత్రికకు పెద్ద ఉత్తరం రాశాడు. ‘తెలుగువారు వెనకబడ్డవారా’ అన్న శీర్షికతో 1911 ఏప్రిల్ 15న అది అచ్చయింది. అది పలువురి దృష్టిని ఆకర్షించింది. పత్రికల్లో దానిమీద చర్చ జరిగింది. తరువాత కొద్దినెలలకే గుంటూరు యువజన సంఘం ముఖ్యుడైన చల్లా శేషగిరిరావు ఆంధ్ర రాష్ట్ర వాదాన్ని స్థానిక ‘దేశాభిమాని’ పత్రికలో వివరంగా ప్రకటించడం ఆంధ్ర మేధావి, యువజన వర్గాల్లో పెద్ద సంచలనం రేపింది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తమిళుల పెత్తనంలో ఆంధ్రులకు అన్నివిధాలా అన్యాయం జరుగుతున్నదని చిరకాలంగా తెలుగువారి మనసుల్లో లీలగా ఉన్న అసంతృప్తి ఈ తిరుగులేని సాక్ష్యాధారాల, గణాంక వివరాలతో నిర్దిష్టరూపం దాల్చి, ఎలాగైనా స్వరాష్ట్రం సాధించి తీరాలన్న కాంక్ష ప్రగాఢమైంది.
ఇంచుమించుగా అదేసమయంలో చరిత్రాత్మకమైన ‘్ఢల్లీ దర్బారు’లో బ్రిటిష్ సామ్రాట్టు ఒక ముఖ్యమైన విధాన నిర్ణయం ప్రకటించాడు. హిందీ మాట్లాడే బీహారీ ప్రాంతాలు అప్పటిదాకా బెంగాల్ రాష్ట్రంలో భాగంగా ఉండేవి. మద్రాసు రాష్ట్రంలో తమిళుల పెత్తనంకింద తెలుగువారు ఇక్కట్లపాలైనట్టే అక్కడ బీహారీలూ అన్ని రంగాల్లో వెనకబడి, అడుగడుగునా దుర్వివక్షకు లోనవుతూ, ప్రత్యేక రాష్ట్రంగా వేరుపడాలని కోరుకుంటున్నారు. వారు అడిగేదానిలో న్యాయం ఉన్నది కనుక బీహార్‌ను ప్రత్యేక రాష్ట్రం చేయాలని వైస్రాయ్ లార్డ్ హార్డింజ్ సిఫారసు చేశాడు. 1911 డిసెంబర్ 12న ‘్ఢల్లీ దర్బారు’లో చక్రవర్తి దాన్ని ఆమోదించి, ప్రత్యేక రాష్ట్రాన్ని అధికారికంగా ప్రకటించాడు. దాంతో ఆంధ్రులకూ కొత్త ఆశలు మోసులెత్తాయి. తమకు జరుగుతున్న అన్యాయాన్నీ సర్కారుకు విన్నవించి, గట్టిగా పట్టుబడితే తమకూ ప్రత్యేక రాష్ట్రం తప్పక ఇస్తారని నమ్మకం కుదిరింది. రెట్టించిన ఉత్సాహంతో యువ కార్యకర్తలు కార్యాచరణకు ఉపక్రమించారు. ఆంధ్ర ప్రజానీకం నుంచీ వారికి మంచి స్పందన వచ్చింది.
అప్పుడే కాదు... ఆంధ్రోద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లటానికి, ప్రజా ప్రయోజనాలు కాపాడటానికి ఉద్దేశించిన ప్రతి చర్యనూ ప్రజలు ప్రతిసారీ సమర్థించి, తమవంతు తోడ్పాటును వీలైన మేరకు అందిస్తూనే ఉన్నారు. ఎటొచ్చీ ముందుండి నడిపించాల్సిన నాయకులే సరైన సమయంలో జావగారి, రకరకాల కారణాలతో అడ్డం తగులుతూ వచ్చారు.
కొత్త ఆశలు రేకెత్తిన 1911 సంవత్సరంలోనే ఏలూరులో కృష్ణా జిల్లా మహాసభ జరిగింది. అక్కడేమైందో వావిలాల గోపాలకృష్ణయ్యగారి మాటల్లో వినండి:

‘‘్భషలను బట్టి రాష్ట్రాలను పునర్విభాగం చేయవలెననే తీర్మానాన్ని ఉన్నవ లక్ష్మీనారాయణగారు ఉపపాదించారు. బలపరిచేవారెవరూ ముందుకు రానందున తీర్మానాన్ని అసలే త్రోసివేసి హేళన చేసి పంపవలెనని పెద్దలు భావించుచుండగా దేశాభిమాని సంపాదకుడు దేవగుప్తాపు శేషాచలపతిరావుగారు ముందుకు వచ్చి బలపరిచిరి. అంతలోనే సభలో ‘ఎంత విడ్డూరం, ఎంత సాహసం, ఈ కారు చిన్నవాళ్లకు ఎంత విపరీతపుటూహలు! కలెక్టర్లు, గవర్నర్లు వింటే మనకు పుట్టగతులుంటాయా’ అని పెద్దలంతా పెడబొబ్బలు పెట్టి తీర్మానం సక్రమంగా లేదని తోసివేశారు.
విశాలాంధ్రం, వావిలాల గోపాలకృష్ణయ్య, పే.23

ఏలూరు సభ నాటికి బీహార్ విషయంలో బ్రిటిషు సర్కారు చేసిన సానుకూల నిర్ణయం ప్రజలకు తెలియరాలేథు. కాబట్టి ఆంధ్ర రాష్ట్రం అనేకులకు ‘‘సింహస్వప్నంగానూ, తొందరబాటు ఆలోచనగాను, దేశాన్ని ముక్కలు ముక్కలు చేయడంగానూ’’ తోచడంలో వింతలేదు. కాని భాష ప్రాతిపదికన బీహారీలకు సొంత రాష్ట్రం ఇచ్చేస్తున్నారని తెలిశాకయినా అదేరకమైన డిమాండును మనం కూడా పెట్టవచ్చన్న ధైర్యం నాటి మన పెద్దలకు కలిగిందా? లేదు. సంవత్సరం తిరక్కుండా కృష్ణా జిల్లా మహాసభలు (అప్పట్లో గుంటూరు, పశ్చిమ గోదావరి ప్రాంతాలుకూడా కృష్ణా జిల్లా మహాసభ పరిధిలోనే ఉండేవి) ఈసారి నిడదవోలులో (1912 మే 22న) జరిగాయి. కృష్ణా, గుంటూరు, గోదావరి ప్రాంతాలనుంచి ఆంధ్ర ప్రముఖులందరూ అక్కడ కొలువుతీరారు. ఈ మహాసభలో ఆంధ్ర రాష్ట్రం అంశాన్ని చర్చించి, దానికి అనుకూలంగా తీర్మానం చేయటం చాలా అవసరమని ‘కృష్ణాపత్రిక’, ‘దేశాభిమాని’ లాంటి పత్రికలు నొక్కి చెప్పాయి. చల్లా శేషగిరిరావు వంటి మేధావులు విస్తృతంగా వ్యాసాలు రాసి, ప్రజాభిప్రాయాన్ని కూడగట్టారు. గొప్ప తీర్మానమే ఏదో చేయబోతున్నారని అందరూ ఉత్కంఠతో ఎదురుచూశారు. తీరా నిడదవోలు మహాసభలో జరిగిందిది.

"Valluri Suryanarayana Rao moved the resolution that the Andhras should be granted a separate province. After a few minutes' discussion an amendment for its postponement was carried by a vast majority. Thus the very first attempt to pass a resolution at a conference, in a district known for its political consciousness, proved a failure; but the young men of Guntur did not lose heart.''
[The Emergence of Andhra Pradesh, K.V.Narayana Rao, p.33]

(ఆంథ్రులకు వేరే రాష్ట్రం మంజూరు చేయాలని కోరుతూ వల్లూరి సూర్యనారాయణరావు తీర్మానం ప్రతిపాదించాడు. దానిమీద కొద్ది నిమిషాలు చర్చ జరిగిన మీదట, ఆ ప్రతిపాదన వాయిదా వేయాలన్న సవరణను బ్రహ్మాండమైన మెజారిటీతో ఆమోదించారు. ఈ విధంగా రాజకీయ చైతన్యానికి వేరుపడ్డ జిల్లాలో జరిగిన మహాసభలో తీర్మానం ఆమోదింపజేయటానికి జరిగిన మొట్టమొదటి ప్రయత్నమే విఫలమైంది. ఐనా గుంటూరు యువకులు ఆశ వదులుకోలేదు.)

వదులుకోక ఏమి చేశారు?
నిడదవోలు కాంగ్రెస్ మహాసభ పుణ్యమా అని గుంటూరు, కృష్ణ, గోదావరి మండలాల ప్రముఖులందరూ ఒక చోట కలిశారు. పరస్పరం పరిచయాలూ పెరిగాయి. ఇలాగే ప్రతి సంవత్సరం ఆంధ్ర జిల్లాల వారందరూ గూడి ఆంధ్ర మహాసభ జరిపితే బాగుంటుందని మర్నాడు గోదావరి కాలవలో స్నానం చేస్తుండగా గుంటూరు మిత్రుల్లో ఒకాయన దేశభక్త కొండ వెంకటప్పయ్యకు సూచించారు. బాగానే ఉంటుందని ఆయనా అన్నాడు. అంతటితో ఆ సంగతి వదిలేశాడు. ఆయన వదిలినా మిత్రులు వదిలిపెట్టలేదు. గుంటూరు తిరిగి వెళ్లగానే ఈ విషయం బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు. అదేమిటో వెంకటప్పయ్య చెబుతారు చిత్తగించండి:

‘‘కొలది దినములకు గుంటూరు పట్టణములో పలుకుబడిగలిగిన శ్రీ వింజమూరి భావనాచార్యులుగారి యింటి యొద్ద కొందరు యువకులు చేరి నాకు కబురు పంపిరి. శ్రీ ఉన్నవ లక్ష్మీనారాయణగారును, చల్లా శేషగిరిరావును, జొన్నవిత్తుల గురునాథముగారును అక్కడ హాజరైనవారిలో ముఖ్యులు. ఆంధ్ర జిల్లాలను చెన్నపురి రాష్టమ్రునుండి విడదీసి, ప్రత్యేక రాష్టమ్రుగా నిర్మాణము చేయవలసినదనియు... అందుకు తగిన ఆందోళన సాగించవలెననియు ప్రస్తావించి, నన్ను ఆ విషయమైన భారము వహింపవలసినదని కోరిరి. కాని నాకు వారి సంభాషణ ఆవేశపూరితమై, అత్యాశలతో గూడినదిగా గన్పట్టెను. అంతటి మహత్కార్యము దుస్సాధ్యముగ గాన్పించెను. అందని మ్రానిపండ్లకర్రులు సాచినట్లేయని తలంచితిని. కాని వారితో బొత్తుగా నేకీభవించనని మాత్రము చెప్పజాలకపోతిని’’.
స్వీయ చరిత్ర, కొండ వేంకటప్పయ్య, పే.169

అంత ఉత్సాహంతో ఉన్నవారు తాను వథ్దన్నా వినేట్టు లేరని గ్రహించాక, ‘దేశభక్త’గారు లౌక్యంగా ఇలా అన్నారట: ఈ ఉద్యమం వినేవారికి వెర్రిగా కనిపించొచ్చు. మనలో ప్రముఖులైన వారికి ఇష్టమూ లేకపోవచ్చు. అందరినీ కూడదీసుకున్నాక గాని ఉద్యమం బలోపేతం కాదు. ముందు ఆంధ్రులందరినీ మేల్కొలిపి ఐక్యపరచాలి. కాబట్టి ఓ పని చేద్దాం. ఆంధ్ర మహాసభను స్థాపించి ఏటేటా ముఖ్యస్థానాల్లో సభలు పెడదాం- అని. మొదట్లో కొంతమంది విభేదించినా, చివరికి అంతా కలిసి బాగుంది. అలాగే చేద్దాం’ అన్నారట. మరుసటి వేసవిలో బాపట్లలో ఎలాగూ గుంటూరు జిల్లా కాంగ్రెసు మహాసభ జరగబోతున్నది కనుక పనిలోపనిగా ‘ఆంధ్ర మహాసభ’నూ అక్కడే పెట్టేద్దామనుకున్నారు. గుంటూరు జిల్లా కాంగ్రెసు అధ్యక్షుడి హోదాలో దాని బాధ్యతా కొండ వెంకటప్పయ్యగారే స్వీకరించారు. అందరిలో చైతన్యం తేవటం కోసం ఆయన స్వయంగా ‘‘ఆంధ్రోద్యమము’’ అనే చిరుపొత్తం కూడా ప్రచురించారు. బాపట్లలో జరగబోయే అఖిలాంధ్ర మహాసభకు నైజాం, సీడెడ్ జిల్లాలు సహా ఎక్కడెక్కడి ఆంధ్ర ప్రముఖులకూ ఆహ్వానాలంపారు. భారీ ప్రచారం చేసి భారీఎత్తున ఏర్పాట్లు చేశారు.