ఆంధ్రుల కథ - 61

ఎం.వి.ఆర్ శాస్త్రి గారు ఆంధ్ర భూమి ఆదివారం అనుబంధం లో సీరియల్ గా ప్రచురిస్తున్న ఆంధ్రుల కథ యదాతథం గా..

1956 నవంబర్ 1(June 26th, 2011)

ఏక్ మాసూమ్ బచ్చీకీ ఏక్ నట్‌ఖట్ కే సాధ్ షాదీ హో రహీహై.
కరుూ దిన్‌కేబాద్ మే ఇత్త్ఫోక్ నహీఁ హోనేకే వజేసే తలాక్ దే సక్‌తే హైఁ.
(అమాయకపు అమ్మాయికి గడసరి అబ్బాయితో పెళ్లి అవుతున్నది. కొన్నాళ్ల తరవాత కాపురం పొసగకపోతే విడాకులు ఇచ్చెయ్యవచ్చు.)
1956 మార్చిన నిజామాబాద్‌లో భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చేసిన సుప్రసిద్ధ వ్యాఖ్య ఇది. భారత్ సేవక్ సమాజ్ మహాసభను ప్రారంభించటానికి నిజామాబాద్ వచ్చినప్పుడు ఆంధ్ర, తెలంగాణలను కలిపేసి ఒకే రాష్ట్రాన్ని చేయబోతున్నట్టు ప్రధానమంత్రి తొలిసారిగా బహిరంగ సభలో ప్రకటించాడు. ఆ సందర్భంలో చేసిందే పై వ్యాఖ్య.
విన్న జనం నవ్వలేదు. నిర్ఘాంతపోయారు.
అప్పటిదాకా తెలంగాణ ప్రజలు- ఎస్సార్సీ చెప్పిన ప్రకారం తమను కనీసం కొంతకాలం విడిగా ఉండనిస్తారనే అనుకుంటున్నారు. స్వామి రామానంద తీర్థలాంటి కొద్దిమంది పెద్దలు విశాలాంధ్ర వాదాన్ని గట్టిగా వినిపిస్తున్న మాట నిజమే. స్వామీజీ నాయకత్వంలో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ప్రతినిధి వర్గం 1946లో అంటే అప్పటికి పదేళ్ల కిందటే మద్రాసు వెళ్లి నాటి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకాశం పంతులును కలిసి తెలంగాణ కలిసిన విశాలాంధ్రకోసం మద్దతు ఇమ్మని కోరిన సంగతీ యధార్థమే. హైదరాబాద్ స్టేట్‌ను మూడు ముక్కలుచేసి నైజామాంధ్రను పొరుగునున్న ఆంధ్ర రాష్ట్రంలో కలిపెయ్యాలని అదే నిజామాబాద్‌లో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెసు తీర్మానించింది. పి.వి.నరసింహారావు వంటి రామానందతీర్థ శిష్యులు తెలంగాణలో ఊరూరా తిరిగి విలీనానికి మద్దతు కోరారు కూడా.
ఇంకో వంక కమ్యూనిస్టులూ విశాలాంధ్రలో ప్రజారాజ్యం నినాదాన్ని చాలాకాలం కిందటే అందుకుని ఒక్క రాష్ట్రంకోసం గట్టి ప్రచారం చేస్తున్నారు. ‘ప్రత్యేక తెలంగాణ’ వాదాన్ని నెత్తికెత్తుకున్న కె.వి.రంగారెడ్డి, చెన్నారెడ్డి లాంటివాళ్లు పక్కా ఫ్యూడల్ దొరలు, తెలంగాణ సాయుధ పోరాటాన్ని వ్యతిరేకించిన ఘనులు కావటం కూడా విప్లవ పోరాటాన్ని అభిమానించిన వర్గాలకు కంటగింపైంది. వారి మీది వ్యతిరేకత కారణంగా వారందుకున్న ప్రత్యేక వాదం మీదా కమ్యూనిస్టు అభిమాన వర్గం వ్యతిరేకత పెంచుకుంది. ఇంకోవంక గడియారం రామకృష్ణశాస్ర్తీ, దేవులపల్లి రామానుజరావు వంటివారి పూనికతో విశాలాంధ్ర మహాసభా తెలంగాణలో అక్కడక్కడ సభలు పెట్టి ఈమధ్యకాలంలో చురుకుగా పనిచేస్తున్నది. అయ్యదేవర వంటి ఆంధ్ర నాయకుల అండదండలతో, ఆంధ్రావారితో సమన్వయంతో ‘విలీనం’ అవసరాన్ని అది బాగానే ప్రజల దృష్టికి తేగలిగింది.
అయినా తెలంగాణ ప్రజాబాహుళ్యానికి విశాలాంధ్ర ‘కిక్కు’ పెద్దగా ఎక్కలేదు. తరతరాలనుంచి విడిగా ఉన్నవాళ్లం ఇప్పుడు పోయి ఆంధ్రాలో కలిసిపోతే ఏమవుతుందో, మొదటికే ఎక్కడ మోసం వస్తుందోనన్న అనుమానం నైజామాంధ్ర పట్టణ ప్రాంతాల్లోని విద్యాధిక వర్గాల్లో బలంగా నాటుకుంది. విశాలాంధ్ర శిబిరంలో కదలిక, కార్యకలాపాలు ఎంత జోరుగా సాగుతున్నా మొత్తంమీద తెలంగాణ ప్రజలు విలీనానికి విముఖంగానే ఉన్నారు. వేరుపాటు జండాను జోరుదారుగా లంకించుకున్న రంగారెడ్డి, చెన్నారెడ్డి ఇత్యాదులు ఏదో ఉద్ధరిస్తారనే... తెలంగాణ పక్షాన బలంగా పోరాడుతున్నారనే అప్పటిదాకా అందరూ అనుకుంటున్నారు. కొద్ది వారాలుగా తెరచాటున సాగుతున్న వ్యవహారాలు, లోపాయకారీ సర్దుబాట్ల మతలబులు చాలామందికి తెలియవు.
అందుకే- తెలంగాణను ఐదేళ్లు విడిగా ఉండనివ్వాలని ఫజలాలీ కమిషన్ చెప్పి నిండా నాలుగు నెలలు తిరగకముందే,... ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఏమీచేయమని నెహ్రూ పండితుడు హామీ ఇచ్చిన కొద్ది వారాలకే- ఆంధ్ర, తెలంగాణలకు కొంగుముడి వేస్తున్నట్టు అదే మహానాయకుడు నిండు సభలో ప్రకటించటంతో జనం నివ్వెరపోయారు. మహత్తర ప్రకటనకు ఆశించిన స్పందన రాకపోవటంతో జనం ‘మూడ్’ను గ్రహించే కాబోలు నెహ్రూజీ విడాకుల ఊసూ అప్పుడే ఎత్తాడు.
ఏమైతేనేం- అటు నలుగురూ, ఇటు నలుగురూ మొత్తం ఎనిమిది మంది కాంగ్రెసు పెద్దమనుషులు కలిసి, మిగతా పార్టీలను అడగాపెట్టకుండా, ప్రజలతో నిమిత్తం లేకుండా... ముఖ్యంగా కాంగ్రెసు రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, కాంగ్రెసు కేంద్ర పెద్దల కనుసన్నల్లో కుదుర్చుకున్న, పెద్దమనుషుల ఒప్పందంతో విశాలాంధ్రకు లైన్ క్లియరయింది. ప్రధానమంత్రే వచ్చి ఆ శుభవార్తను ప్రకటించటంతో ‘‘పెద్దమనుషుల’’ నిర్ణయానికి అధికార ముద్రపడింది.
‘‘పెద్దమనుషుల’’ మధ్య ఏకాభిప్రాయం కుదరకుండా మిగిలినవి, తేలవలసినవి మూడే విషయాలు. మొదటిది కొత్త రాష్ట్రం పేరు. రాష్ట్రాల పునర్విభజనకు ఉద్దేశించి పార్లమెంటులో ప్రవేశపెట్టిన ముసాయిదా బిల్లులో దీన్ని ‘‘ఆంధ్ర తెలంగాణ’’ రాష్టమ్రని పేర్కొన్నారు. జాయింటు సెలక్టు కమిటీ దగ్గరికి వెళ్లేసరికి అది కాస్తా ‘‘ఆంధ్రప్రదేశ్’’ అయి కూచుంది. తెలంగాణవారు మొదటిదే బాగుందన్నారు. ఆంధ్రావాళ్లు రెండోదే ఉండాలన్నారు. కాసేపు పెనుగులాట తరవాత తెలంగాణవాళ్లు ఆంధ్రావాళ్ల దారికి వచ్చారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌ల్లాగే ‘ఆంధ్రప్రదేశ్’ పేరు రాష్ట్రాల జాబితాకు ఎక్కింది.
రెండోది- హైకోర్టు ఎక్కడ ఉండాలన్నది. మద్రాసు రాష్ట్రంనుంచి వేరుపడినది లగాయతు ఆంధ్రా హైకోర్టు గుంటూరునుంచి పనిచేస్తున్నది. అందువల్ల ఆ ప్రాంత ప్రజల సౌలభ్యంకోసం గుంటూరులో హైకోర్టు బెంచిని ఏర్పాటుచేయాలని ఆంధ్రా ‘‘పెద్దమనుషులు’’ అడగవలసింది. కాని వారు వేరే బెంచి అక్కర్లేదు మొత్తం హైకోర్టు రాజధాని హైదరాబాదులోనే ఉండాలని కోరారు. తెలంగాణ ‘‘పెద్ద మనుషులే’’మో గుంటూరులో ఒక బెంచి ఉండాల్సిందే అన్నారు!
చిత్రంగా ఉందా? దీనికీ ఒక కారణం ఉంది. నైజాం రాజ్యంలో ఉర్దూ అధికార భాష. అప్పటిదాకా హైదరాబాదులో లీగల్ వ్యవహారాలు అత్యధిక భాగం ఉర్దూలోనే సాగేవి. కాబట్టి తెలంగాణ లాయర్లు ఉర్దూకే అలవాటుపడ్డారు. ఇంగ్లిషులో కేసులు వాదించటం వారికి ఇబ్బంది. అదే ఆంధ్రా లాయర్లకయితే ఇంగ్లిషులో పని కొట్టిన పిండి. కొత్త రాష్ట్రానికి హైకోర్టు మొత్తం రాజధానిలోనే ఉండేట్లయితే ఆంధ్రా లాయర్లు హైదరాబాదుకు తరలివచ్చి, ఇక్కడే స్థిరపడి తెలంగాణా న్యాయవాదుల ప్రాక్టీసును దెబ్బతీస్తారన్న భయం తెలంగాణావారికి ఉంది. అందుకే గుంటూరులో హైకోర్టు బెంచి ఉండాలని అక్కడి ‘‘పెద్దమనుషులు’’ పట్టుబట్టారు.
తీవ్ర తర్జన భర్జనల తరవాత దీనిమీదా అంగీకారం కుదిరింది. ప్రస్తుతానికి హైదరాబాదులోనే హైకోర్టును పనిచేయిద్దాం; వీలు చూసుకుని రాష్ట్రంలో ఒకచోటో, రెండుచోట్లో పర్మనెంటు బెంచిలు ఏర్పాటుచేద్దాం అని ఆంధ్రా పెద్దలు తెలంగాణ వారిని తెలివిగా ఒప్పించారు. ఆమాటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 51(2) సెక్షనులో చేర్చారు. (నాటినుంచి నేటిదాకా హైకోర్టు బెంచి అతీగతీ లేదన్నది వేరే సంగతి.)
ఇక మిగిలింది నాయకత్వం సమస్య. తెలంగాణ ప్రజలకు పెద్దగా ఇష్టంలేకపోయినా ఆంధ్రావాళ్లే వెంటపడి, అడగకుండానే వరాలిచ్చి హైదరాబాదు రాజధానిగా విశాల రాష్ట్రం కావాలని వెంపర్లాడారు. వారితో కలిస్తే తమ గతి ఏమవుతుందోనన్న బెంగ తెలంగాణవారికి మొదటినుంచీ ఉంది. కాబట్టి వారికి నమ్మకం కలిగించాలంటే విశాల రాష్ట్రానికి నాయకత్వం తెలంగాణావారికి అప్పగించటమే సముచితం. పైగా అప్పటి హైదరాబాద్ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు తన పదవి, తన భవిష్యత్తు ఏమైపోయినాసరే అని తెగించి -అసలు కారణాలు ఏమైతేనేమి- విశాలాంధ్ర వాదాన్ని బలపరచటంవల్లే ఏకీకరణ సుకరమైంది. అలా చూసినా- సరికొత్త పెద్ద రాష్ట్రానికి బూర్గులను ముఖ్యమంత్రిగా చెయ్యటమే న్యాయం.
కాని- ముఖ్యమంత్రి ఎవరన్న ప్రశ్న వచ్చేసరికి బూర్గుల బరిలోనే లేడు. ఆంధ్రకేసరి ప్రకాశం ఎవరికీ గుర్తులేడు. ఆంధ్ర నాయకుడు సంజీవరెడ్డే విశాల ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన వచ్చీరాగానే పెద్దమనుషుల ఒప్పందాన్ని తుంగలో తొక్కాడు. తెలంగాణ ప్రయోజనాలకు జెల్లకొట్టాడు. తెలంగాణ మీద ఆంధ్రోళ్ల ఆధిపత్యం అప్పటినుంచే మొదలైందంటారు నేటి తెలంగాణవాదులు. అక్కర తీరగానే బూర్గులను కరివేపాకులా పక్కన పారేసి, ఆంధ్రావాడు మొదటి ముఖ్యమంత్రి కావటమే తెలంగాణకు జరిగిన మొదటి అన్యాయమని వారు గొంతెత్తి చాటుతారు.
బూర్గులను పక్కన పారేసిన మాట నిజమే. తెలంగాణకు అన్యాయం జరిగిన సంగతీ యథార్థమే. కాని బూర్గులను పక్కకి నెట్టటానికి చేయి వేసినవారూ తెలంగాణవారే. తెలంగాణకు తీరని అన్యాయం చేసిందీ తెలంగాణవాడే.
ఆంధ్రలో తెలంగాణ విలీనానికి ఒప్పుకోవటమంటే తనకు తాను రాజకీయంగా డెత్ వారంటు ఇచ్చుకున్నట్టేనని బూర్గుల రామకృష్ణారావు మొదటినుంచీ అంటూనే ఉన్నాడు. రాబోయే పెద్ద రాష్ట్రానికి తనను ముఖ్యమంత్రిని కానివ్వరన్న నిస్పృహతోటే ఆయన ఆమాట అన్నాడు తప్ప ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఆశ లేక కాదు. అలాంటి కోరిక తనకు ఉన్నట్టు ఆయన నోరు తెరిచి చెప్పాడు కూడా.
తరతరాలుగా అలవాటుపడ్డ మద్రాసు రాజధానినుంచి ఉన్నపళాన తట్టాబుట్టా సర్దుకుని బయటపడి, కర్నూలు గుడారాల్లో చాలీచాలని వసతులతో ఇబ్బందిపడుతున్న స్థితిలో హైదరాబాద్‌ను పొందితే తప్ప ఆంధ్రులకు రాజధాని సమస్య తీరదు. తెలంగాణ ప్రాంతంపై ఆధిపత్యం ఉంటే గానీ ఆంధ్రా ప్రాంతంలో కృష్ణ, గోదావరి ప్రాజెక్టులు సాఫీగా సాగవు. ఆంధ్రతో కలవటంవల్ల తెలంగాణకు కలిగే మేలుకంటే తెలంగాణలో కలవటంవల్ల ఆంధ్రాకు లాభం ఎక్కువ. అందుకే ఏ వరమైనా ఇచ్చి, ‘బ్లాంక్ చెక్కు’ ఇచ్చేసి, ఏ షరతుకైనా ఒప్పుకుని తెలంగాణను ప్రసన్నం చేసుకునేందుకు ఆంధ్రా నాయకులు అప్పట్లో సిద్ధంగా ఉన్నారు. హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రే విలీనం తరవాతా ముఖ్యమంత్రిగా కొనసాగాలని తెలంగాణవారు పట్టుబడితే ఆంధ్రావాళ్లు బహుశా ‘సరే’ అనేవాళ్లే. కాని ఆ రకమైన డిమాండు ఏదీ తెలంగాణనుంచి రాలేదు. ఎందుకంటే బూర్గుల ముఖ్యమంత్రిగా కొనసాగటం తెలంగాణ మోతుబరులకే ఇష్టంలేదు.
తెలంగాణలో ప్రాబల్యం రెడ్లది. వారి నాయకుడు రంగారెడ్డికీ, ఆయన ప్రాతినిధ్యం వహించే భూస్వామ్య వర్గాలకూ బూర్గుల అంటే గిట్టదు. విప్లవాత్మకమైన భూసంస్కరణలను తెచ్చిపెట్టి ఆయన తమ కొంప ఎక్కడ ముంచుతాడోనని ఆ వర్గాల భయం. కన్నడిగులూ, మహారాష్ట్రులతో కలిసి ఉన్న దశలో కాలం కలిసివచ్చి రామకృష్ణారావు అవిభక్త హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినపుడే రంగారెడ్డి వర్గం ఆయనపై ధ్వజమెత్తి శతవిధాల సతాయించింది. ఆంధ్రాతో విలీనం తరవాతా ఆంధ్రావాడు ముఖ్యమంత్రి అయినా సరే... బూర్గులకు మాత్రం ఆ పదవిని దక్కనివ్వరాదని రెడ్లు నిశ్చయించారు. అది గ్రహించి రామకృష్ణరావు ఆరంభంలోనే పోటీనుంచి విరమించుకున్నాడు. పోటీ ఆంధ్ర నాయకుల మధ్యనే పరిమితం అయింది.
పోటీలో నిలిచిన ఆంధ్ర నాయకులలో బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి ఇద్దరూ సమఉజ్జీలే. ఇద్దరూ తెలంగాణా నాయకుల మద్దతు మీద ఆశలు పెంచుకొన్నారు. ఆంధ్ర నాయకుల మధ్య పోటీలో తెలంగాణ శాసనసభ్యుల బలం నిర్ణయాత్మక శక్తిగా మారింది. ఇరువర్గాలు కొండా వెంకట రంగారెడ్డి చెలిమిని కాంక్షించాయి. రంగారెడ్డి వర్గం ఆంధ్ర ప్రాంతపు రెండు వర్గాలతో ఆంతరంగికంగా సంప్రదింపులు జరుపుతూ ఎవరిది ఎక్కువ బలమో తేల్చుకోండని చెప్పింది. గెల్చే అవకాశం వున్నవారితో చేతులు కలుపుతామన్నారు. చెలిమికోసం బెజవాడ, నీలం వర్గాలు తమ బలాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఏర్పడింది. నాయకత్వ ఎన్నిక ప్రచారంలో సంజీవరెడ్డి గెలిస్తే భూసంస్కరణల చట్టం తెస్తారు; ఆయన రాక రాష్ట్రానికి అరిష్టం అని ప్రచారం చేశారు... ఈ నాయకత్వ ఎన్నికల్లో బూరుగుల రామక్రిష్ణారావు, నీలం సంజీవరెడ్డిని బలపరిచారు. ‘‘అనారోగ్య కారణాలవల్ల’’ కొండా వెంకటరంగారెడ్డి ఎన్నికలో పాల్గొనలేదు. ఆయన అనుచరులు రెండుగా చీలిపోయారు. చెన్నారెడ్డి వర్గం గోపాలరెడ్డిని బలపరచగా, జె.వి.నర్సింగరావు సహచరులు నీలం సంజీవరెడ్డిని బలపరిచారు. లాంఛనేతరంగా ఎన్నికకు ముందే రహస్య ఓటింగ్ పద్ధతి ద్వారా అభ్యర్థుల బలాబలాలను పరీక్షించి, ఎన్నికల రోజున లాంఛనంగా ఏకగ్రీవంగా సంజీవరెడ్డిని ఎన్నుకోవటం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు,
మారంరాజు సత్యనారాయణరావు, పే.91
ఆ ప్రకారంగా 1956 నవంబరు 1న భారత ప్రథాని జవహర్లాల్ నెహ్రూ అమృత హస్తాల మీదుగా ఫతేమైదాన్‌లో జరిగిన బ్రహ్మాండమైన బహిరంగ సభలో హైదరాబాద్ రాజధానిగా, సంజీవరెడ్డి తొలి ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించింది. 1913లో ఆంధ్రోద్యమ నిర్మాతలు కలగన్న విశాలాంధ్ర 43 ఏళ్ల తరవాత సాకారమైంది. ఎన్నో తరాల కిందట వేరైపోయి ఎవరికి వారేగా, ఒకరికొకరు దాదాపు అపరిచితులుగా బతికిన మద్రాసాంధ్రులు, నైజామాంధ్రులు తిరిగి చేరువై, ముక్కోటి ఆంధ్రులది మళ్లీ ఒకే ఉమ్మడి కుటుంబం అయంది. తెలుగుజాతికి అది పర్వదినం.
సర్కారాంధ్రులు
రాయలసీమా
తెలంగాణమూ
మూడూ కలసీ
అంతా ఒకటే
ఆంధ్రుల మంచును
ఢంకా మీదా
దెబ్బకొట్టుచూ
చాటర వెనుక
ఆంధ్రుడవైతే అని ఆంధ్రోద్యమ కాలంలో గుమ్మడిదల వెంకటసుబ్బారావు ప్రకటించిన ‘స్వరాజ్యదండు’ పాటకు ఎట్టకేలకు ప్రాణం వచ్చింది.
మూడు చెలగుల నేలల మూడు కోట్లు
ముడివడిన యట్లు కన్నుల ముందు తోచె
అందలమునెక్కి, యావజ్జనాళి మెచ్చ
సుందరోషస్సు వచ్చె వసుంధరకును
- అని ప్రజాకవి దాశరథి పరవశించినట్టు ఆంధ్రుల చరిత్రలో కొత్త అధ్యాయం తెలుగుతల్లి కడుపు చల్లగా మొదలైంది.
తరవాత కథ చాలా జరిగింది. అనేక మలుపులు తిరిగింది. అవన్నీ చెప్పాలంటే పెద్ద గ్రంథమవుతుంది.
ఇప్పటికి ఇక్కడ ఆగుదాం.
(వచ్చే వారం ముగింపు)