ఆంధ్రుల కథ - 26

ఎం.వి.ఆర్ శాస్త్రి గారు ఆంధ్ర భూమి ఆదివారం అనుబంధం లో సీరియల్ గా ప్రచురిస్తున్న ఆంధ్రుల కథ యదాతథం గా..

పల్టీలు, కన్నీళ్లు, ఎక్కిళ్లు...(October 16th, 2010)

మహాసభ మూడవ దినం రాత్రి భోజనాలైన తర్వాత... నేను అందరికంటే, ముందు స్పెషల్ రైలుబండికి పోయి బిఛానా వేసినా. చలి కొంచెం బాధిస్తుందని ఒక కప్పు ‘చా’ పట్టించినాను. పాన్ బీడా నములుతూ గోలకొండ ముట్టించి నా వెంట వచ్చిన ఒక షేర్వాని తుర్కిటోపి ఆంధ్రునితో ముచ్చట్లు సాగిస్తూ కూచున్నాను. ఇంతలో మా డబ్బాలోకి కొందరు సోదరులు జొరబడినారు. వారిని చూచి తుర్కీటోపీ ఆంధ్రుడు ఇంకో డబ్బాలోకి వెళ్లుతానంటూ లేచిపోయినాడు. నేను దుప్పటి కప్పుకుని పండుకున్నాను. నిద్ర మాత్రం రాలేదు.
డబ్బాలో క్రమంగా మంది నిండుకున్నారు. వారిలో ఇష్టాగోష్ఠి ప్రారంభమైంది.
‘‘ఇప్పుడు పోయిన తురకాయన యెవరూ?’’
‘‘తురకాయన కాడోయ్ ఆయన... ... గారు’’
‘‘మరైతే ఆ తుర్కీటోపీ, ఆ షేర్వాని, అ లాగూ, ఆ పగటివేషమంతా యేమిటీ?’’
‘‘అది ఆయనకు చిన్నప్పటినుండి అలవాటైంది. వదులుకోలేడు. యేం చేస్తాడు మరీ!’’
‘‘అబ్బే! ఈలాటి వాళ్లంతా మహాసభలు నడిపితే ఇంక ఏడ్చినట్టు వుంటుంది.’’
ఇంతట్లో వక సూర్యాపేట ఆయన కాబోలు- యువకుడు, డబ్బాలోకి వచ్చినాడు. వచ్చీరాకముందే డబ్బాలోని మహాసభకు అధ్యక్షత వహించినాడు. ముచ్చట్లన్నీ ఆయనవే. ఎత్తుకుంటూనే ఉడుకుడుకు సమస్యపైననే పడింది దెబ్బ.
‘‘ఏమండీ! ఆంధ్ర భాషలో వ్యవహారాలన్నీ జరుపవలసిన ఆంధ్ర మహాసభలో తురకం మొదలైంది. రేపు సభ మహారాష్ట్ర నాయకుల వశం అవుతుందేమో...’’
‘‘చూచారా! వేంకటరంగారెడ్డిగారు అధ్యక్షుల చర్యను ముప్పుతిప్పలుపడి సమర్థిస్తుంటే నాకు ఒక చందూలాల్ కథ జ్ఞాపకం వచ్చింది. రెడ్డిగారు పాత వకీలు కదూ! వకీళ్ల చేతుల్లో సభలు పడిన తర్వాత ఖానూనీబహస్ బలమైపోతుంది సుమా!’’
అయితే ఆ చందూలాల్ కథేమిటో చెప్పవయ్యా! అని అన్నారు ఇద్దరు ముగ్గురు ఆత్రంతో.
‘‘చెప్తా. చెప్తా. నిదానించండి. పూర్వం చందూలాల్ కాలంలో ఒక జాగీర్దారు తన జాగీరు జప్తుకాగా, బహాలీకొరకు ఎన్నో ఏండ్లు పైరవీ చేసినా ఫలం లేకపోయిందట. ఇంతట్లో ఇంకొకడు వచ్చి ‘‘అయ్యా! నేను ఫలానా జాగీర్దారు కుమారున్ని, ఇంకైనా నా పేర మంజూరీ చేయండి.’’ అని బాగా పసందుగా నజరానా యిచ్చుకుని తన పేర జాగీరు మంజూరీ చేయించుకొన్నాడట. అస్సలు జాగీర్దారు వచ్చి, ‘‘ఇదేమి అన్యాయమండీ! నా జాగీరుకు గాను నేను ఇన్ని యేండ్లుగా పైరవీ చేస్తుంటే నన్ను వదిలి ఇంకెవ్వనికో యిచ్చినారు?’’ అని విచారించినాడు. రిజిస్టర్లు తీసి చూడగా జాగీర్దారు చచ్చిపోయినాడు అని తేలింది. ఇదేమిటయ్యా నేను బ్రతికి వుండగానే నన్ను చచ్చిపోయినాడని వ్రాసుకున్నారు? అని విచారిస్తే ‘‘అరె, నీవు సచ్చీపోయినావ్ బే! సచ్చీనావూ అంటే బత్కినా అంటావ్? నీవు నిజంగా బతికినా గానీ మా రిజిస్టర్లలో సచ్చీ సున్నం అయినావు. పో గప్‌చుప్ ఎళ్లిపో’’ అన్నారట.
అట్లే వుంది వేంకట రంగారెడ్డిగారి సమర్ధన. ‘‘యువకులేమన్నాసరే మేము నియమావళిని విరిచి కొత్త అర్థం సాగతీసినము. మేము వకీళ్లం. అందులో కొమ్ములు తిరిగి పండుబారిన వకీళ్లం. మాదే సహీ. మాకు వ్యతిరేకంగా చెప్పేవాళ్లంతా కొంటెకాయలు- జిమ్మేదారులేని మనుసులు. బేఖూఫులు, దమాక్ లేనివాళ్లు,’’ అయితే ఇన్ని మాటలు వారనలేదు పాపం. అల్లా ధ్వనించేలాగు కనపడ్డది వారి సమర్ధన.
ఇంతలో ఒక పట్వారి ప్రవేశించినాడు. వచ్చీరావడంతోనే వాదంలో కాలుపెట్టినాడు-
‘‘ఏమండీ! మాడపాటి హనుమంతరావుగారు 10-12 ఏండ్లనుంచీ వారి యింటికి పోయినప్పుడంతా మాతో చెప్తూ వుండెనే మన ఆంధ్రం, మన ఆంధ్రులు, మన భాషను, మనవారిని వృద్ధిచేయండీ అని. ఇప్పడేమైందో ఆ బోధంతా. నాయకులే యిట్లా సెలవిస్తే ఇంకేముంది? కంచే చేనుమేస్తే?’’
ఒక యువకుడు: చూచారా! హనుమంతరావుగారు ఏడుస్తూ ఏడుస్తూ ఉపన్యాసం ఇచ్చినారు. ఎక్కిళ్లు పట్టినై వారికి తీరా సమయానికి.
ఇంకో ఆయన: నీ పాపం గూలా! ఆ ఏడ్పేనయ్యా మన తీర్మానాన్ని తుదకు ఏడ్పించి వేసింది. ‘‘పేరు ధర్మరాజు పెను వేప విత్తయా’’ అన్నారు ఆ తిక్క వేమారెడ్డిగారు.
పట్వారీగారు: ఏమండోయ్, నాకో పద్యం జ్ఞాపకం వస్తుంది. అయితే సగమే వస్తది.
యువకుడు: ఆ సగమే చెప్పేసెయ్యరాదు. విందామేంటో?
పట్వారీ: పూర్వం అర్జునుడు తుదకు తాను కర్ణున్ని చంపినాను గదా అని గర్వించినాడట! ఆ గర్వాన్ని పోగొడ్దామని శ్రీకృష్ణమూర్తి ఇల్లా అన్నాడట.
నరవర! నీచే నాచే
వరమడిగిన కుంతిచేత వాసవు చేతన్-
మతలబ్ ఏమంటే కర్ణున్ని చంపింది ఒక్క అర్జునుడు కాదట. మాయలమారి కృష్ణుడు, వగలమారి కుంతి, జిత్తులమారి ఇంద్రుడు, గురువర్యుల తాపము, బ్రాహ్మణుని కోపం- ఇన్ని అంగాంగాలు కలిసి ఆయన్ని చంపినవట. అదే విధంగా మన అధ్యక్షులైన నరసింగారావుగారు అదేందీ- ఆ తీర్మానం పేరు, ఆ జోన్నమంటా- అదేమిటీ నోరే తిరగదు...
‘‘అడ్‌జోర్నమెంటు’’ అండీ...
ఆఁ.అదే- ఆ తీర్మానం వోడిపోయిందని గర్వించినారు. కాని యథార్థం ఏమంటే- యువకులకు షాదునగరులో పెద్దరికం పుచ్చుకొని వచ్చిన పోల్కంపల్లి వేంకట రామారావుగారు చేసిన పార్టీ ద్రోహంవల్ల, యువకులలో కాస్త బుద్ధిమంతుడనిపించుకున్న రావి నారాయణరెడ్డిగారి పల్టీలవల్ల, సమయంకొద్దీ యువకులకు గిలిగింతలు పెట్టే కార్యదర్శులవారి గోడమీది పిల్లి వాలకంవల్ల, యువకులలో ముఖ్యులైన మాడపాటి రామచంద్రరావుగారున్ను, యన్.కోదండ రామారావుగారున్ను మున్నగువారు మహాసభకు రానందువల్ల, మాడపాటి హనుమంతరావుగారి ఎక్కిళ్లవల్ల, అధ్యక్షులవారు ‘‘తీర్మానం వప్పుకుంటిరా యిదుగో యిప్పుడే కుర్చీగిర్చీ వదిలి మూటాముల్లె తీసుకుని బంధుమిత్ర సహ కుటుంబ సపరివార సమేతంగా తక్షణమే హైద్రాబాదుకు పొయ్యే మొదటి బండిలోనే రవాణా అవుతున్నాను ఖబర్దార్’’ అనే ధకీవల్ల యువకులు తెచ్చిన తీర్మానం ఓడిపోయింది కాని...
‘‘అంతే అంతేనండి. మా యువక నాయకులు చాలామంది రాలేదండీ. లేకపోతేనా’’ అన్నాడు సూర్యాపేట ఆయన.
‘‘అస్సలు వాండ్లతట్టు వోటిచ్చిన వాళ్లంతా తెలుసుకొని యిచ్చినారా? వాళ్ల మొహం. వాళ్లకేం తెలుసు? మాడపాటివారు కన్నీరుకార్చారే అని జాలిపడినారే కాని, అధ్యక్షులు లేచిపోతే సభ ఆగిపోతుందేమో అని భయపడినారే గాని లేకుంటే వాళ్లకు వోటు దొరికేదేనా?...
నిజామాబాదు మహాసభ ముగిసిన తరువాత సురవరం ప్రతాపరెడ్డిగారు 1937 డిసెంబర్ 13వ తేదీ ‘‘గోలకొండ పత్రిక’’లో తిరుగు ప్రయాణంలోని విశేషాలను సామాన్య ప్రజాభిప్రాయాన్ని స్ఫురించేటట్టు ‘‘ఆంధ్ర మహాసభ ముచ్చట్లు’’ పేరుతో ప్రచురించిన గల్పికలోని భాగమిది. నియమావళి నడుము విరగ్గొట్టి, స్పష్టమైన సూత్రాలకు విపరీతార్థాలు తీసి పెద్దలందరూ కలిసి ఆంధ్ర భాషకు ఎంత అన్యాయం చేశారో, ఎలా చేశారో కళ్లకు కట్టించే వాక్చిత్రమిది. ఆంధ్ర మహాసభలకు సంబంధించిన సమస్త వివరాలనూ, రికార్డులనూ, వాటి పూర్వాపరాలనూ కష్టపడి సేకరించి కె.జితేంద్రబాబు వెలువరించిన నిజాం రాష్ట్రాంధ్ర మహాసభలు రెండవ భాగం 667-673 పేజీల్లో ఈ గల్పిక పూర్తి పాఠాన్ని చదవొచ్చు.
గల్పిక అన్నారు కాబట్టి ఇందులో రాసింది నిజమో కాదో, సాటి ఆంధ్ర ప్రముఖులపై తమాషాగా విసుర్లు విసిరారే తప్ప నిజామాబాదులో జరిగిన దానిపై వాస్తవంగా సురవరంవారికి అంత తీవ్రాభ్యంతరం ఉండి ఉండకపోవచ్చనేమో అని సందేహించనక్కర్లేదు. మనలాంటి సంశయాత్ములు ఉంటారనే. ప్రతాపరెడ్డిగారు ఈ గల్పిక వచ్చిన రోజునే (1937 డిసెంబరు 13) గోలకొండ పత్రికలో తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు ఇలా వివరించారు:
ఇంతవరకు సాధారణంగా ఎక్కడ గాని శాసనసభల వంటి సభలలోను, కొన్ని సంఘముల సమావేశములందును తప్ప, మహాసభలలో అడ్జర్నమెంటు ప్రతిపాదనము చర్చించబడియుండుట మేమెఱుగము. అట్టిది మొన్న నిజామాబాదునందలి ఆంధ్ర మహాసభలో జరిగినది... న్యాయము, క్రమము సరిగా సాగునట్లు చేయుటకును, అన్యాయమును, అక్రమమును, అ విధిని నిరోధించుటకును ఇతర సాధారణ మార్గములన్నియు నిరుపయోగములైన తర్వాత గాని అడ్జర్నమెంటు ప్రతిపాదన వైపుపోరు. మన ఆంధ్ర మహాసభలో పరిస్థితులంత దూరమువరకు పోగలవని మేము కలనైన ఊహించి యుండలేదు.
మహాసభ కార్యక్రమ సందర్భమున నొకరు ఉర్దులో ఉపన్యసింపగోరిరి. దానికి... నియమావళి యొక్క 31వ సూత్రము సమ్మతించదని కొందరు ఆక్షేపణము చేసిరి. కాని అధ్యక్షులవారు వారిని ఉర్దూలో మాట్లాడనిచ్చుటకు తమకు అధికారముగలదని, తమ పట్టును నెగ్గించుకొనిరి. ఈ చర్యపట్ల అసమ్మతిని వెల్లడించుటకై అడ్జర్నమెంటు ప్రతిపాదనము చేబడెను. దీనిపై చర్చ సందర్భములో అధ్యక్షులవారి చర్యను సమర్ధించినవారు కొందరు తమ వక్తృత్వ సార్వభౌమ శక్తినంతయు వినియోగించిరి. ... తుదకు కన్నీళ్లతోను, బెదిరింపులతోను అడ్జర్నమెంటు ప్రతిపాదనము ఓడెను...
మహాసభ నియమావళిలో దివిటీలు పెట్టి శోధించినను అధ్యక్షులవారికి ఆ అధికారము దొరకదని మా అభిప్రాయము... ఇప్పుడు మహాసభ నియమావళి 31వ సూత్రము నుల్లంఘించబడినది. ఆ శాసనోల్లంఘనము మహాసభచే ఆమోదించబడినది. ముందుకు కూడా ఇతరులెవరుగాని వీలుకొలది మహాసభా నియమములనుల్లంఘించి, ఎవరైనా ఆక్షేపించుచో, దానికి మహాసభవారి ఆమోదమునే పొంది, పనులు సాగించుకొనుటకు ఉపాయము చూపించబడినది.
నిజాం రాష్ట్రాంధ్ర మహాసభలు, రెండవ భాగం, కె.జితేంద్రబాబు, పే.615- 616
ఇప్పటికీ మనకు ఒక సంశయం తీరథు. మాడపాటివారు కన్నీళ్లు కార్చారు, ఎక్కిళ్లు పట్టారు అని సురవరంవారు గల్పికలో రాసింది అక్షరాలా నిజమా? లేక కవి చమత్కారమా? ‘కన్నీళ్లతోను, బెదిరింపులతోను తీర్మానం ఓడిందని’ సురవరం సంపాదకీయంలో ప్రస్తావించిన కన్నీళ్లు మాడపాటివారివేనా? ఆయనకు అంత అవస్థ ఏమి వచ్చింది? అయినా సంవత్సరంకింద షాద్‌నగర్‌లో ఆంధ్ర మహాసభ నియమావళి రూపొందిందే మాడపాటివారి అధ్యక్షత్వంలో, ఆయన ప్రత్యక్ష పర్యవేక్షణలో కదా? ‘ఆంధ్ర భాషా కుటీరం’నుంచి ఆంధ్రోద్యమాన్ని నారుపెట్టి నీరుపోసి పెంచి పెద్దచేసిన ఆంధ్రపితామహుడే సభాకార్యకలాపాల్లో ఆంధ్ర భాషను మహారాణి స్థానంనుంచి పక్కకు పడదోసే అడ్డగోలు అకృత్యాన్ని ఎలా సహించారు? ఎలా సమర్ధించారు?
నిజామాబాదులో ఆపుదల తీర్మానాన్ని ప్రవేశపెట్టి పోరాడిన నందగిరి వెంకటరావు 30.12.1937 తేది గోలకొండ పత్రికలో రాసిన వ్యాసంలో వీటికి జవాబులు దొరుకుతాయి:
ఆంధ్ర మహాసభ మూల సిద్ధాంతానికే భంగం కలుగుతున్నప్పుడు సభా చర్యను ఆపి ముందుగా ఈ విషయాన్ని తీర్మానించమనడంకన్నా గత్యంతరం మాకు వేరు లేకపోయింది... మన రాష్ట్రంలో ఆంధ్రోద్యమం ఆరంభించి, ఊరూరూ తిరిగి... ఆంధ్ర భాషాభిమానం నూరిపోసిన... మాడపాటి హనుమంతరావుగారి కళ్లయెదుటనే ఆంధ్రోద్యమం పెడదారినిబడి మళ్లీ తెలంగానా ఉద్యమానే్న సమీపిస్తోందనడం, అది వారు కళ్లార చూస్తూ కూడా గంభీరించడమూ, పైగా మొహమాటంవల్లనో, ‘‘ఆంధ్రోద్యమమునకు ఆంధ్ర భాష ముఖ్యముకాదు’’అనే మాటలు (పాపం శమించుగాక!) శ్రీ పంతులవారి నోటినుంచి జారటం మన ఉద్యమ చరిత్రలో అత్యంత దురదృష్ట ఘట్టం... ఆ దుర్దినంనాడు నేను ఆయన యెదుటే కూచుని చూశాను. ఆ మాటలు విన్నాను.
అదే గ్రంథం, పే.683-684
ముక్తాయింపుగా- విషయ నిర్ణాయిక సభలనుంచీ తెలుగుభాషకోసం పట్టువథలక పోరాడిన ఎ.బి.నరసారెడ్డి రెణ్నెల్ల తరవాత గోలకొండ పత్రికలో వెలిబుచ్చిన ఈ మనోవేదననూ ఆకర్ణించండి:
ఈ ఆపుదల తీర్మానము వీగిపోయినందువల్ల మహాసభకు గాని, ఆంధ్ర భాషకు గాని, ఆంధ్ర సంస్కృతికి గాని ఏలాంటి అపాయము కలుగలేదనుటకల్ల. అపాయము కలిగినది నిజమే. ఈ సభ ‘‘తౌరక్యాంధ్ర మహాసభ’’గా తక్షణమే మారకపోవచ్చును గాని రానురాను ఈ మహాసభ ఇట్లే నడిపించిన, ఆంధ్ర భాషకు అనన్యప్రాముఖ్యత తగ్గి, ఉరుదు భాషకు అనన్య ప్రాముఖ్యత కలిగించి, ఆంధ్రుల సర్వతోముఖాభివృద్ధికి పాటుపడజాలక కొందరి వ్యక్తుల స్వీయ ప్రాముఖ్య (self advertisement) ప్రకటన మహాసభగా మారునని నేను నమ్ముచున్నాను.
అదే గ్రంథం, పే.614
అక్షర సత్యం! తరవాత జరిగింథి సరిగ్గా అదే. *