ఆంధ్రుల కథ - 28

ఎం.వి.ఆర్ శాస్త్రి గారు ఆంధ్ర భూమి ఆదివారం అనుబంధం లో సీరియల్ గా ప్రచురిస్తున్న ఆంధ్రుల కథ యదాతథం గా..

టైములేని మహాత్ముడు .....(October 31st, 2010)

నిజమేనా? కమ్యూనిస్టు డి.వి. కల్పించి రాశాడా?!
సందేహం సహజమే.
వందేమాతరం పాడటంమీద ఉస్మానియా యూనివర్సిటీలో గొడవ అయిందని మనలో చాలామందిమి ఇంతకుముందూ విని ఉన్నాం. వందేమాతరం పాడటానికి వీల్లేదని అధికారులు అంటే విద్యార్థులు అలిగి యూనివర్సిటీనే బహిష్కరించి నాగపూర్ వెళ్లి చదువుకున్నారని, అలా వలస వెళ్లిన వారిలో భావి ప్రధాని పి.వి.నరసింహారావు కూడా ఉండటమే దీనికి సంబంధించి చెప్పుకోదగ్గ పెద్ద విశేషమనీ ఇప్పటిదాకా అనుకుంటున్నాం. పి.వి. గురువైన స్వామి రామానందతీర్థ సాగించిన స్టేట్ కాంగ్రెసు సత్యాగహంలో సైడ్‌షోగా చాలామంది భావిస్తున్న ఘట్టం వెనుక ఇంత పెద్ద కథ ఉందా? నైజాం అంతటా విద్యార్థుల నాయకత్వంలో అంతటి మహోద్యమం నిజంగానే సాగిందా?
‘వందేమాతరం’ పేరు చెబితే మనకు ఎ.ఆర్.రహమాన్ గుర్తుకొస్తాడు. రహమాన్ ట్యూను బాగానే ఉన్నా ఒరిజినల్ సాంగులో హిందూ మతతత్వం ఉన్నదని, అందుకే మైనారిటీలకు అభ్యంతరకరమైనదనీ, సాధ్యమైనంతవరకూ దానిని పాడకపోవటమే సెక్యులరిజానికి మంచిదనీ భావించేంత పరిణత స్థితికి ఇవాళ మనం చేరుకున్నాం. 1938-39ల్లో అలా కాదే? అప్పటికింకా స్వాతంత్య్ర పోరాటం జోరుదారుగా సాగుతూనే ఉన్నదాయె! లక్షలాది స్వతంత్య్ర యోధులు, కోట్లాది భారతీయులు ‘వందేమాతరా’న్ని ప్రణవనాదంలా జపిస్తునే ఉన్నారాయె! అంత గాఢంగా సెంటిమెంటు నిండి ఉన్న జాతీయ గీతం ప్రైవేటుగా పాడుకున్నందుకే దేశంలో ఒక యూనివర్సిటీ ఆగ్రహించి, వందలాది విద్యార్థులను బయటికి గెంటేస్తే మిగతా దేశం ఎలా ఊరుకుంది? తమ చదువుకంటే జాతిపరువు మిన్న అని తలచి, బంగారు భవిష్యత్తును త్యాగంచేసి, వేల సంఖ్యలో విద్యార్థులు సమ్మెకట్టి, వీధినపడి, నెలల తరబడి పళ్లబిగువున పోరాడుతూంటే మహామహా జాతీయ నాయకులు అంత నిర్లిప్తంగా ఎందుకు ఉండిపోయారు? చదువులు పాడైనాసరే, వందేమాతరం పాడినందుకు క్షమాపణ చెప్పేదిలేదని ఖండితంగా చెప్పి... జాతీయోద్యమ ప్రేరణతో, జాతీయ నాయకుల స్ఫూర్తితో వీరోచితంగా దీర్ఘపోరాటానికి దిగి నెత్తురుమండే నవ యువకులు నానాబాధలు పడ్డ జాతీయ నాయకుల ఉదాసీనత చూసి ఉసూరుమని, నైతికధృతి నీరసించి నిస్పృహ చెంది, చివరికి సిగ్గుచేటు క్షమాపణ చెప్పి మళ్లీ అదే యూనివర్సిటీలో తలవంచుకుని తిరిగి చేరిపోక తప్పలేదంటే అది మొత్తం భారతజాతికి భరించరాని అవమానం కాదా? సాక్షాత్తూ గాంధీ మహాత్ముడే పగ్గాలు చేబూని అతిరథ మహారధులైన జాతీయ నాయకశ్రేష్ఠుల సాయంతో జాతీయోద్యమాన్ని లోకోత్తరంగా నడిపిస్తున్న పుణ్యకాలంలో జాతీయ గీతానికి ఇంతటి దారుణ దుర్గతి పట్టిందంటే నమ్మగలమా?
నమ్మలేము. అందుకే నిజానిజాలను నిర్ధారించడానికి జాతీయ పక్షపు వారు ఏమి చెప్పారన్నదీ ఒకసారి సింహావలోకన చేద్దాం.
హైదరాబాదు స్వాతంత్య్ర పోరాటానికి సంబంధించి ప్రామాణికమని చెప్పదగిన ‘‘హైదరాబాదు స్వాతంత్య్రోద్యమ చరిత్ర’’లో వెల్దుర్తి మాణిక్యరావు ‘వందేమాతరం’ ఘట్టం గురించి చెప్పిన వివరాలివి:
ఉస్మానియా విశ్వవిద్యాలయ కళాశాల వసతి గృహాలలో నివసించే హిందూ విద్యార్థులు ప్రార్థనా సమయంలో ‘వందేమాతరం’ గీతాలాపన చేయటం ప్రారంభించినారు. ... ఒక హాస్టల్‌లో హిందూ విద్యార్థులు ‘వందేమాతరం’ ఆలపించినారని ముస్లిం విద్యార్థులు అభ్యంతరం తెలిపినారు. మరునాడు వార్డన్ హిందూ విద్యార్థుల ప్రార్థనా మందిరాన్ని మూసివేసినాడు... ఆరోజునుంచి ‘వందేమాతరం’ ఆలాపించకూడదని (1938 నవంబర్ 28న) ఉత్తర్వులు జారీఅయినాయి. హిందూ విద్యార్థులు ప్రోవైస్ చాన్సలర్‌కు ఫిర్యాదుచేశారు. దానిపై ఆయన ఇదివరకు పాడినందుకు మొదట క్షమాపణ చెప్పుకొమ్మన్నాడు. ఇష్టంవచ్చిన ప్రార్థన చేసుకునే హక్కు తమకు ఉన్నదని విద్యార్థులు వాదించినారు. కాని ఆయన వినలేదు. రాత్రి 9 గంటల లోపల హాస్టల్ విడిచి వెళ్లవలసినదని ఉత్తర్వులు జారీఅయినాయి. బలవంతాన హాస్టళ్లు ఖాళీ చేయించినారు. రాత్రిపూట నిర్వాసితులైన విద్యార్థులకు సుల్తానుబజారులోని జైన మందిరంలో వసతి అమరినది...
... అప్పుడు హాస్టల్ విద్యార్థులకు సానుభూతిగా విశ్వవిద్యాలయ కళాశాల విద్యార్థులందరూ సమ్మెచేసినారు. అంతేగాదు, నగరంలోని ఇతర కళాశాల విద్యార్థులు కూడా సమ్మెచేసినారు. చూస్తూచూస్తూ రాష్టమ్రంతటా విద్యార్థుల హర్తాల్ జరిగింది. ప్రతిచోటా కాలేజీలతోబాటు హైస్కూలు విద్యార్థులు కూడా హర్తాల్ చేసినారు. ఈ విధంగా ఇదొక రాష్టవ్య్రాప్త మహోద్యమ రూపం దాల్చింది. హిందూ విద్యార్థులందరి పేర్లు రిజిస్టర్లనుండి కొట్టివేసినారు. ...
... వందేమాతరం ప్రార్థన చేసినందుకుగాను- 1938 నవంబర్ 30 తేదీనాడు హిందూ విద్యార్థులను హాస్టళ్లనుంచి వెళ్లగొట్టినారని, కళాశాలల రిజిస్టర్లనుండి వారు పేర్లు కొట్టివేసినారనే వార్త దేశమంతటా దావానలంవలే ప్రాకిపోయింది. హైదరాబాదులోని కళాశాలల, పాఠశాలల విద్యార్థులందరూ కలిసికట్టుగా సమ్మె జరిపినారు. బస్సుస్టాపులలో స్టేషనులవద్ద, ఆయా రోడ్ల కూడలులవద్ద పికెటింగు చేసినారు. కెమిస్ట్రీ ప్రొఫెసరు (అతడు ప్రోక్టరుగూడా) విశ్వవిద్యాలయానికి మోటారు కారులో వెళ్ళుతుండగా, ... కొందరు విద్యార్థులు మోటారుకు అడ్డంగా రోడ్డుమీద పడుకున్నారు. అతడు కోపావేశంతో ‘ఈ కాఫర్‌ల మీదినుండి మోటారు నడుపు’మని డ్రైవరుకు ఆజ్ఞాపించాడు. కాని డ్రయివరు, ప్రొఫెసరుకన్నా వివేకవంతుడనిపించుకున్నాడు. ఇంజన్ ఆఫ్ చేసి మెదలకుండా ఉన్నాడు...
... 6 డిసెంబరు 1938లోగా కాలేజీలు విడిచి వెళ్లినందుకుగాను హిందూ విద్యార్థులు క్షమాపణ పత్రాలు సమర్పించకపోతే, అట్టి విద్యార్థుల పేర్లు కొట్టివేస్తాం అని విశ్వవిద్యాలయం ప్రకటించింది. తాము తప్పుచేయనిది క్షమాపణ కోరుట ఎందుకు అని విద్యార్థులు ఎదురు ప్రశ్నించారు. తత్ఫలితంగా ఉస్మానియా యూనివర్సిటీ కాలేజి, సిటీ కాలేజీలనుండి గాక వరంగల్, గుల్బర్గా కాలేజీలనుండి మహబూబ్‌నగరం మొదలైన అన్ని హైస్కూళ్లనుండి హిందూ విద్యార్థులందరి పేర్లు కొట్టివేశారు. ఔరంగాబాదులో ఈ వుద్యమం ఉధృతరూపం దాల్చింది. నాందేడు, బీదరు, పర్భనీ, ఒకటేమిటి అన్ని జిల్లాలలోని కాలేజీలు, హైస్కూళ్లలో చదివే హిందూ విద్యార్థులు విద్యాసంస్థలను బహిష్కరించినారు.
హైదరాబాదు స్వాతంత్య్రోద్యమ చరిత్ర, వెల్దుర్తి మాణిక్యరావు, పే.225-228
ఈ సంథర్భంలో ఔరంగాబాదు కాలేజి విద్యార్థులు 1938 డిసెంబర్ 3న ప్రిన్సిపాల్‌కిచ్చిన సమ్మె నోటీసును పరిశీలించండి:
It was a shocking news to us to note that 130 student-brethren have been rusticated from the Osmania University, Hyderabad. Never in history of student life of any country such an incident has happened. Also 120 students from Mahboobnagar have gone on hungerstrike. Students of different colleges numbering to 1000 have gone on a sympathetic strike.
... We must express our solidarity with those 130 students who have been removed from the educational institutions and with these Mahboobnagar students who are on hunger strike... We are going on a sympathetic strike tomorrow Sunday 4th December. Nothing can deter us from taking this step because it is a cause of student community in general. It is a lot of 130 students today, tomorrow it may be that the same stroke of pen may seal the fate of the whole student community of Hyderabad State...
[Freedom Struggle in Marathwada, P.430]
(హైథరాబాదు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మా విద్యార్థి సోదరులు 130 మందిని వెళ్లగొట్టారని తెలిసి మేము నివ్వెరపోయాము. చరిత్రలో ఏ దేశపు విద్యార్థి జీవితంలోనూ ఇలాంటి సంఘటన ఎప్పుడూ జరగలేదు. పైగా మహబూబ్‌నగర్ విద్యార్థులు 120 మంది నిరాహారదీక్ష సాగిస్తున్నారు. వివిధ కాలేజిలనుంచి వెయ్యిమంది విద్యార్థులు సానుభూతి పూర్వక సమ్మె సాగిస్తున్నారు.
విద్యాసంస్థల నుంచి వెళ్లగొట్టబడిన, మహబూబ్‌నగర్‌లో నిరసన సమ్మె సాగిస్తున్న విద్యార్థులకు సంఘీభావ సూచకంగా మేము రేపు డిసెంబరు 4 ఆదివారం సానుభూతి పూర్వక సమ్మె చేయబోతున్నాము. ఇది మొత్తం విద్యార్థి లోకానికి సంబంధించిన సమస్య కాబట్టి మేము వెనక్కి తగ్గే ప్రసక్తిలేదు. ఇవాళ 130 మంది విద్యార్థులకు జరిగింది; రేపు అదే కలంపోటుతో మొత్తం హైదరాబాదు స్టేట్‌లోని మొత్తం విద్యార్థుల భవిష్యత్తుకూ సున్న చుట్టవచ్చు...)
దురదృష్టమేమిటంటే... ఔరంగాబాదులో చిన్నవయసు కాలేజి స్టూడెంట్లకున్నపాటి వివేకమైనా మన జాతీయ నాయకులకు లేకపోయింది. ఇటువంటి దుష్పరిణామాన్ని సహించి ఊరుకుంటే ప్రమాదమని, జాతీయ గీతానికోసం చదువులు పాడుచేసుకుని పోరాడుతున్న విద్యార్థులకు బాసటగా నిలవటం తమ కనీస ధర్మమని వారు తలచిన దాఖలాలు లేవు.
‘‘చూస్తూ చూస్తూ ఉండగా ఈ వందేమాతరం ఉద్యమం అఖిల భారత నాయకుల దృష్టినాకర్షించింది. డాక్టర్ జయసూర్య (శ్రీమతి సరోజినీ నాయుడుగారి కుమారుడు) ఉస్మానియా విద్యార్థుల వ్యవహారాన్ని కాంగ్రెసు అగ్రనాయకుల దృష్టికి తీసుకొని వెళ్లినాడు. నేతాజీ సుభాసు చంద్రబోసు ఇచటి విద్యార్థులను ప్రోత్సహిస్తూ ‘‘మీరు లొంగవలసిన పనిలేదు. మీ ఉద్యమం న్యాయమైనది. వందేమాతరం ఒక మంత్రం వంటిది,’’ అని లేఖ వ్రాసినారు. ‘‘నా సహకారం లభించటం తథ్యం’’ అని విద్యార్థులను అభినందిస్తూ నెహ్రూ తెలియజేసినారు. ఇక గాంధీ మహాత్ముడు ‘‘వందేమాతరం ప్రార్థన చేసుకునే హక్కు ప్రతి భారతీయునికున్నది. దాన్ని కాదనేవారెవ్వరు? విద్యార్థులు లేవదీసిన ఉద్యమం సమర్థింపదగ్గది’ అని ప్రకటన చేసినాడు.’’
మాణిక్యరావు, పే.228
మాటలు తియ్యగానే చెప్పారు. ఆచరణకు వచ్చేసరికి మొండిచేయి చూపారు. నమ్ముకున్న విథ్యార్థులను నట్టేట ముంచారు. నాడు అఖిల భారత కాంగ్రెసు అధ్యక్షుడైన సుభాష్ బోసుగారికి తాను ‘ప్రోత్సహించి’న విద్యార్థి పోరాటానికి కాంగ్రెసు పక్షాన మద్దతు తెలిపేందుకు ఏదైనా చేయాలన్న ఆలోచనే వచ్చినట్టు లేదు. ‘నా సహకారం తథ్యం’ అన్న నెహ్రూగారు అష్టకష్టాలు పడుతూ బెంబేలెత్తుతున్న కాలంలో విలువైన సహకారాన్ని అందించి విద్యార్థులను ఆదుకున్న పాపాన పోలేదు. ఇక ‘‘వందేమాతరం ప్రార్థన చేసుకునే హక్కు ప్రతి భారతీయునికున్నది. దాన్ని కాదనేవారెవ్వరు? విద్యార్థులు లేవదీసిన ఉద్యమం సమర్థింపదగ్గది’’అన్న గాంధీ మహాత్ముడు సదరు ఉద్యమాన్ని సమర్థిస్తూ చిటికిన వేలును కదిలించలేదు. ‘విద్యార్థులను వేధించకండి’ ఆయన గట్టిగా ఒక్కమాట అన్నా... తన చెప్పుచేతల్లోని కాంగ్రెసు చేత ఘాటైన తీర్మానం ఒక్కటి చేయించినా, బ్రిటిషు ప్రభువర్గాల్లో తనకుగల అపారమైన పలుకుబడిని బలిపీఠమెక్కిన విద్యార్థుల పక్షాన ఇసుమంత వినియోగించినా నిజాం ప్రభుత్వం అంత దుర్మార్గంగా, బరితెగించగలిగేది కాదు.
అలాగని- నిజాం ప్రభుత్వంతో గాంధీగారు ఈ విషయమే ప్రస్తావించలేదా? ప్రస్తావించకేం? ప్రస్తావించారు. ‘విద్యార్థుల వ్యవహారంలో నాకేమీ ఇంటరెస్టులేదు. వారేమీ నా గైడెన్సులో లేరు. వాళ్లు నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా నాకు మీ సంగతి ఆలోచించే టైములేదని చెప్పాను’ అని మహాత్ములు తేటతెల్లం చేశారు.
నమ్మశక్యం కావడం లేదా? నిజంగా గాంధీగారే అలా అన్నారా అని ఆశ్చర్యపోతున్నారా? 1939 జనవరి 20న బార్డోలీనుంచి నిజాం ప్రధానమంత్రి (ఉస్మానియా యూనివర్సిటీకి ఛాన్సలర్ కూడా) అయన సర్ అక్బర్ హైదరీకి మహాత్ముడు రాసిన లేఖలోని ఈ భాగాన్ని చదవండి:
Bardoli
January 20, 1939
Dear Sir Akbar
... ... ...
Now about "Bande Mataram''. Some students did come to me. I told that "Bande Mataram'' was no religious prayer but that they had a perfect right to say it in their rooms or their prayer room. I told them too that by proper representation they would get their redress and that till they had the redress they should remain without their studies unless they could go else where. I have seen the explanation issued by the Osmania University authorities. It has not given me satisfaction. I do think, that this is a matter you should set right without delay. If I have erred, not having all the facts before me, you will please correct me...
I have not interested myself in it. The students are not under my guidance. And I told those who came to me that I had no time to study their question, important though I admitted it to be.
... I hope this finds you in the possession of the best of health.
Yours sincerely
M.K.Gandhi
[Collected works of Mahatma Gandhi, vol.74, PP.425-246]
(ప్రియమైన సర్ అక్బర్ గారికి
... ...
ఇప్పుడు ‘వంథేమాతరం’ గురించి! కొంతమంది విద్యార్థులు నా దగ్గరికి వచ్చారు. వందేమాతరం అనేది మత ప్రార్థన కాదు; కాని దానిని మీ గదుల్లో, ప్రార్థన గదిలో పాడుకునే హక్కు మీకు తప్పక ఉన్నది అని నేను వారికి చెప్పాను. పై అధికారులకు సరిగా విన్నవించుకుంటే మీ సమస్య తీరుతుంది; అలా తీరేంతవరకు మీరు చదువులను వదులుకోవాలి; ఈలోపు ఇంకెక్కడికైనా వెళ్లగలిగితే సరే- అని కూడా నేను అన్నాను. ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు ఇచ్చిన వివరణ నేను చూశాను. నాకు తృప్తి కలగలేదు. ఇది ఆలస్యం చెయ్యకుండా మీరే సరిచేయవలసిన విషయమని నేను భావిస్తున్నాను. నేనన్నది తప్పయినా, అన్ని వాస్తవాలూ నాకు తెలియకపోయినా, దయచేసి నన్ను సరిదిద్దండి...
ఈ విషయంలో నేను ఇంటరెస్టు చూపడం లేదు. విద్యార్థులు నా గైడెన్సులో లేరు. మీ సమస్య ముఖ్యమైనదే అయనా దాన్ని పట్టించుకునే సమయం నాకు లేదని నా దగ్గరికి వచ్చినవాళ్లకు చెప్పాను.
... మీరు కులాసాగా ఉన్నారని ఆశిస్తున్నాను.
ఎం.కె.గాంధీ)
‘అధికారులకు మొరపెట్టుకోండి. వారు దయతలిచేంతవరకు చదువులు వదులుకోండి. ఇంకెక్కడికైనా పోగలిగితే పోండి’ అని ‘జాతిపిత’గారే అన్నప్పుడు విద్యార్థులకు నీరసం రాక ఏమవుతుంది? ‘ఈ విషయంలో నాకు ఇంటరెస్టు లేదు’ అని సాక్షాత్తూ మహాత్ముడే చెప్పినప్పుడు మిగతా కాంగ్రెసు నాయకులు గాని, నైజాం సర్కారుగాని ఆ విషయంలో ఎందుకు ఇంటరెస్టు చూపుతారు? జాతీయ గీతానికి అవమానాన్ని, జాతీయవాదులకు పరాభవాన్ని పట్టించుకునేందుకే జాతీయ మహా నాయకుడికి టైము లేకపోయినప్పుడు ‘వందేమాతరం’ ఉద్యమం సిగ్గుచేటు క్షమాపణలతో విషాదాంతమయిందంటే ఆశ్చర్యమెందుకు? *