ఆంధ్రుల కథ - 43

ఎం.వి.ఆర్ శాస్త్రి గారు ఆంధ్ర భూమి ఆదివారం అనుబంధం లో సీరియల్ గా ప్రచురిస్తున్న ఆంధ్రుల కథ యదాతథం గా..

మోసం జరిగిన విధం --- (February 23rd, 2011)

‘‘ఇది తెలుగు సార్వభౌముడైన శ్రీరంగరాయలు దయ చేయించిన రాజ శాసనం. ఇది చెన్నపట్నమనే నగరం. ఇందలి దేవాదాయ ధర్మాదాయములను అవిచ్ఛిన్నంగా జరపాలి. ఈ స్థలాన్ని ఎల్లప్పుడున్నూ తెలుగు పట్నంగానే గౌరవ ప్రపత్తులతో చూచుకొంటూ ఉండాలి.’’చెన్నపట్నం తెలుగువారిదే, మల్లాది లక్ష్మీనరసింహశాస్ర్తీ, పే.20
17వ శతాబ్దం పూర్వార్థంలో ఇంగ్లిషువారు చెన్నపట్నంలో ఆశ్రయం పొంథి, సెంట్ జార్జి కోట కట్టుకుని, స్థిరపడ్డాక, వారి అవసరాల నిమిత్తం చెన్నపట్నంలో మరి కొంత భూమిని దానమిస్తూ చంద్రగిరి రాజు శ్రీరంగరాయలు బంగారు రేకుమీద రాయించి ఇచ్చిన రాజశాసనంలోని భావమిది.చంద్రగిరిరాజు అప్పయ్యనాయకుడు తన తండ్రి చెన్నప్పనాయకుడి పేర చెన్నపట్టణం కట్టించాడు. అది పదహారణాల తెలుగు పట్నం. మొదటినుంచీ అక్కడ నివసించిన వారిలో అత్యధికులు తెలుగువారేనని ఈస్టిండియా కంపెనీవారి రికార్డులన్నీ ఘోషిస్తున్నాయి. ‘కుంపిణీ’ కాలపు ఆరాలు, వివరాలు ఉటంకిస్తూ మద్రాసు నగరం తెలుగువారిదేనని నిరూపిస్తూ చాలామంది చాలా పత్రాలు, గ్రంథాలు వెలువరించారు. దేశానికి స్వతంత్రం వచ్చిన తొలి ఏళ్లలో ‘మద్రాసు మనదే’అంటూ పెద్ద ఉద్యమమే నడిచింది. మద్రాసు నగరంపై తెలుగువారి హక్కును గట్టిచేస్తూ టంగుటూరి ప్రకాశం పంతులు చేసిన తిరుగులేని వాదనను కిందటి అధ్యాయంలో చూశాం.ఈ కాలంలో ఇవన్నీ వింటే మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఆ వెంటనే ఒక సందేహమూ కలుగుతుంది:ఇంతటి ఘన చరిత్ర కలిగిన తెలుగు నగరం తమిళులపాలు ఎలా అయింది? 20వ శతాబ్ది తొలి వరకూ అక్కడ అత్యధిక సంఖ్యాకులు తెలుగువారే అయినప్పుడు- మంత్రం వేసినట్టు అది తమిళ నగరంగా ఎప్పుడు మారింది? ఎలా మారింది? తమ కళ్లముందే ఈ గోల్‌మాల్ జరుగుతుంటే తెలుగు పెద్దలు ఏమిచేశారు? ఎలా ఊరుకున్నారు?వీటికి సమాధానాలు పైన ఉటంకించిన మల్లాదివారి పుస్తకంలో కొంతవరకు దొరుకుతాయి:
నేడు మదరాసులో అరవం మాట్లాడేవారంతా అరవలు కారు. సగానికి సగం తెలుగువారు. ఈ పట్నం ఇంగ్లీషువారి పాలబడటంతోనే వారి ప్రాపకంకోసం తమిళులు హెచ్చుగా ప్రాకులాడనారంభించారు. ఆదినుండి పాలకులైన తెలుగువారు ఇంగ్లీషువారిని ఉద్యోగాలకు ప్రాధేయపడటం అగౌరవమని తలచి ఉపేక్షించారు... తమిళులు తమకు స్థాన బలిమి లేకపోయినా ఉద్యోగబలంచేత మంచి ప్రవేశం కలిగించుకొని ఆ భాషనే కోర్టులలో వాడుతూ వచ్చారు. వీరితోబాటుగా వీరిని సేవించడానికి వివిధ వృత్తులవారు వచ్చిపడ్డారు... ...... సూర్యోదయం కావటంతోటే కడుపులో కాఫీ పోయాలనుకున్నా, కడుపులో కామన్నను శాంతపరచాలన్నా చెన్నపట్నంలోని ప్రతి తెలుగు వ్యక్తి అరవయ్యర్ని, అతని అరవ భాషనీ ఆశ్రయించవలసి వచ్చింది. గత్యంతరం లేక తెలుగువారికి కూడా అనేక సందర్భాలలో అరవమే మాట్లాడవలసిన అవస్థ తప్పింది కాదు... జన సంఖ్య అంతా 6 లక్షలుగల రుూ పట్నంలో తెలుగువారు 3,23,615 మందని అనేకములైన లెక్కలవలన తెలియుచున్నది. అలా ఉండగా 1931లో జనాభా లెక్కల సందర్భంలో అరవలే ఎక్కువగా ఎన్యూమరేటర్లుగా వుండి తెలుగువారి జనాభా సంఖ్య చెన్నపట్నంలో ఒక లక్షన్నరకంటే యెక్కువ లేదని తేల్చారు. అప్పుడు తెలుగువారేమిన్నీ పట్టించుకోకుండా ఉపేక్షించారే గాని, ఆ లెక్కలు తప్పని సవాలు చేయలేకపోయారు.ఈ విధంగా తెలుగువారి జన సంఖ్య తక్కువ కావడానికి కారణం అరవ జనాభా ఆఫీసర్ల హస్తలాఘవమేనని ఆంధ్రులంతా గుర్తించాలి. ఏమంటే జనాభా లెక్కలను తయారుచేసేప్పుడు మిల్లులోని కార్మికులను, కార్పొరేషను వారిచే వీధులూడ్చుటకు నియమితులైన వారినీ, ఇతర నిరక్షరాస్యులైన వేలకొలది తెలుగువారిని, పై అరవ అధికారులతో మాటలాడుటకై రెండు అరవ ముక్కలను నేర్చిన వారందరిని అరవ జనాభాలో చేర్చి తెలుగువారి జనాభా సంఖ్యను తగ్గించివేశారు. దీన్ని తెలుగువారు నిర్లక్ష్యంచేశారు. అప్పుడే ప్రభుత్వ రికార్డులనన్నిటినీ తీయించి పరిశోధింపజేసిన బండారము బయటపడేది.ఇంక చెన్నపట్నంలో ఆంధ్ర సంస్థలను స్థాపించడంలోగూడా తెలుగువారు కిమన్నాస్తి అన్నారు. వ్రేళ్లమీద లెక్కపెట్టదగిననే్న ఆంధ్ర సంస్థలుండగా అరవ సంస్థలు లెక్కలేనన్ని వెలిశాయి. పెద్దపెద్ద ఉద్యోగస్థులంతా అరవలే. మదరాసులోని మొదటి మేయరు ఆంధ్రుడు అన్నమాట జగమెరిగినదే. పిదప అందులో తెనుగువారి సంఖ్య తీసికట్టయింది. కార్పొరేషనులోని ప్రాథమిక, మాథ్యమిక పాఠశాలలో తెనుగు నేర్పుట మానిపించారు. తెలుగులో బోధించుటకు తరిఫీదు పొందిన ఉపాధ్యాయులు పల్చబడినారు. నూటికి నూరువంతు ఆంధ్ర జనాభాగల ఆంధ్ర కళాశాలలోగూడ అరవ ఉపాధ్యాయులే అధికారులు. చదువబోయేందుకు ఇచ్చే స్కాలర్‌షిప్పు పొందే విద్యార్థులలో నూటికి 96రు ఆంధ్రేతరులే. ఉచిత పఠన మందిరములలో యింగ్లీషు, అరవ పత్రికలేగాని తెలుగు పత్రికలు పూజ్యము.... వీధుల పేర్లను సూచించు బోర్డులందును, రైల్వే, పోలీసు కార్యస్థానములందును, ఇతర సంస్థలందును నుంచు బోర్డులలో అరవము, తప్పితే యింగ్లీషు భాష కనుపించునే గాని తెలుగు భాష మందునకు గూడ గానరాదు. వీధులకు పెట్టిన పేర్లన్నియు ముదలియార్లు, అయ్యర్లు, అయ్యంగార్ల పేర్లేకాని తెలుగువారి పేర్లే మాయమైనవి. మద్రాసులో అప్పుడూ- ఇప్పుడూ నివసించే తెలుగువారైనా తమ ఆంధ్రత్వాన్ని నిలబెట్టుకోవడానికి యత్నింపక తెనుగులో మాటలాడుట ఫేషను కాదని అరవమే మాటలాడటం, అరవ గూడకట్టు కట్టడం, అరవవారి తంబాకుకు అలవాటుపడటం, తెల్లవారకముందే అరవ హోటళ్లలో కాఫీ సాంబారు సముద్ర మధ్యమందు ఇడ్లీ తైరువడ ద్వీపప్రాంతముల మధ్య రుూదులాడటం, తామాంధ్రులమన్న మాటనుంచి, తలిదండ్రులు పెట్టిన పేర్లను తెగగొట్టుకుని గొఱ్ఱెల రీతిగా అరవలననుకరించడం మొదలగు దురలవాట్లకు పాల్పడ్డారు. దీనికంతకు అరవ సాంగత్యం, అరవమోసం, అరవల అసూయ ముఖ్యకారణాలు...... గోవిందప్ప నాయక వీధి, బందరు వీధి, మింటు వీధి, చైనాబజారు, జార్జిటౌన్, గిడ్డంగి వీధి, ఇవన్నీ ఒకప్పుడాంధ్ర మయంగా వుండేవి. ఇపుడు గుజరాతీలు, మార్వాడీలు ఆక్రమించారు. అరవలు కిళ్ళీ దుకాణం మొదలు అన్ని వ్యాపారాలు చేయడంచే అంతా అరవమయమైంది. పట్నంలో వావిళ్ళ, ఆంధ్ర, లోధ్ర, హో అండ్ కో తెలుగచ్ఛ్ఫాసులున్నా తెలుగు పనులు అరవాఫీసులకెడితేగాని కావు. తరతరాలనుంచున్న తెలుగువారికీ ఆంధ్రాభిజాత్యం లేదు. బస్సు, ట్రాం కండక్టర్లు, డ్రైవర్లు, పోలీసులూ, రిక్షావాళ్ళు, కూలీలు కూడా తెలుగువారెక్కువున్నా- అంతా అరవల్లాగే వేషం- వాళ్లలాగే మాట్లాడటంగా మారిపోయారు. తెలుగుదేశం నుంచి ఎవడు వెళ్ళినా అరవమే మాట్లాడి వాళ్ళని డబాయిస్తారు. క్రొత్తగా వెళ్ళిన తెలుగువాడిని, పాతవాణ్ణీకూడా తెలుగువాడురా అని రుూసడిస్తారు.అరవల్లో యేమాత్రం బుఱ్ఱ ఉన్నవాడైనా మద్రాసులో ప్రవేశిస్తాడు. ఎంత గతిలేనివాడైనా చొరవగా కాలెడతాడు. దమ్మిడీలతో రోజులు గడపుతాడు. సంపాదిస్తాడు. నిలదొక్కుకుంటాడు. స్థిరపడతాడు. అక్కడనుంచి కదలడు. మనవాడు వెళ్ళనే వెళ్లడు. వెడితే ధనికుడే పోతాడు. సంపాదించలేడు. ఇంటిదగ్గరనుంచి డబ్బు తెప్పించుకొని వెచ్చబెడతాడు. చివరికి కాళీపర్సుతో తయారై చిల్లర బాకీలకి నోట్లు రాస్తాడు. ఇప్పుడు పట్నంలో వున్న అరవ లాయర్లేమి, డాక్టర్లేమి, వర్తకులేమి, గుమస్తాలేమి, పనివాళ్లేమి, కూలీలేమి, ఆఫీసర్లేమి, ఎడిటర్లేమి. అంతా చేతిలో దమ్మిడీ లేకుండా అరవ జిల్లాలనుంచి పట్నం వచ్చి సంపాదించుకుని స్థిరపడ్డవారేగాని తరతరాలుగా ఉన్నవారు కాదు.తెలుగునాడులో హైకోర్టుకి అలంకారాలుగా వుండదగ్గ తెలుగు లాయర్లున్నారు. అశ్వినీ దేవతలను మించిన డాక్టర్లున్నారు. ఎటువంటి వాణ్ణయినా బోల్తాకొట్టించగల ఆఫీసర్లున్నారు. కుబేరుడికి అప్పివ్వగల ధనవంతులున్నారు. ఒక్కడూ పట్నంచేరడే? రాజకీయాలలో మహోద్దండులైన నాయకులు తెలుగువారిలో ఉన్నారు. మహాత్యాగులూ, వక్తలూ, కార్యశూరులు కూడా వున్నారు. కాని ఒక్కరూ మద్రాసులో మకాం పెట్టరు. మద్రాసు మనకి రాజధాని కావడంచేత మనకు సంబంధించిన రాజకీయ విషయాలు చాలావరకు అక్కడే సుడి తిరుగుతూ నమ్మిని తిమ్మిని, తిమ్మిని నమ్మిని చేస్తూంటాయి. మన తెలుగు నాయకులు దాడీమేడీ తగిలించుకొని హడావడి చేస్తూ ఏ రెండురోజులో మద్రాసులో వుండి నానా హైరానుపడి వస్తారుగాని అక్కడుండరే? మనలో పట్ట్భాగారి వంటి నాయకులు మద్రాసులో వుంటే ఎంత బాగుండేది? ఉన్నవారేమన్నా పట్టించుకున్నారా- వారంతా భావ దాస్యంలో లీనులౌతున్నారు. మన జాతిమాటే యెత్తరు. ...ఇల్లా ఉపేక్షా సముద్రంలో ఉరకలు, మునకలు వేస్తూ కూచుని మదరాసు విడిచిపెడితే యటు చెంగల్పట్టు దాకానూ ఇటు హోస్సూరు దాటి సేలందాకానూ విస్తరిల్లవలసిన ఆంధ్ర రాష్ట్రం యిటు నాయుడుపేట యవతలికీ, అటు తిరుపతి యివతలికీ ముడుచుకుపోతుంది. చెన్న రాజధానిలో కాంగ్రెసు వుద్యమం ప్రబలిన నాటినుండి ఆంధ్రులా ఉద్యమంలోని వివిధ శాఖలలోననేక విధముల త్యాగాలుచేసి పేరుప్రతిష్ఠలార్జించుకున్నారు. ప్రత్యేకాంధ్ర రాష్ట్రోద్యమ మారంభింపబడి ప్రచారం సాగించడంలో అరవలకు కళ్లుకుట్టి, ఆంధ్రుల మద్రాసు నెప్పుడు కబళిస్తారోనని గుసగుసలు మొదలెట్టారు. అరవ నాయకులు ఆవేశంలో అన్ని ఉద్యోగాలలోను అరవల్ని దూర్చడం, ఆంధ్ర జనాభాను అరవ జనాభాగా మార్చడం, పట్నంలోని తెలుగు వీధుల పేర్లకు, అరవపేర్లు తగిలించడం, తెలుగువారమని చెప్పుకునేవారిని ఈసడించటం మొదలెట్టారు.. కొలది తెలుగు నాయకుల్ని వశపరచుకుని రాజకీయాలలో అందెలువేసుకున్న ఆంధ్ర నాయకులకు అడ్డుతగిలి అన్యాయాలు చేయసాగారు.ఒకప్పుడు తమిళ నాయకాగ్రేసరుడై బాపూజీకి వియ్యము నెఱపిన రాజాజీగారు ఆంధ్ర రాష్ట్రం విషయమై ఆడిన నాటకానికింకా అశ్వాసాంతం కానేలేదు. చచ్చి స్వర్గాన్నున్న బాపూజీ యించుకంతా ఆదరణ ఈ విషయంలో చూపలేదు. జవహరు పండితుడు కూడా దూరాన్నుంచే మొగం చాటువేశాడు. వంగదేశ నాయకుడు సుభాసుభాసు దీనిమాటే పట్టించుకోలేదు. పట్ట్భా సీతారామయ్యగారి పట్టుదల సడలిపోయింది. భూస్వామియైన గోపాలరెడ్డిగారీ పొంతకే చూడలేదు. సాంబమూర్తిగారు దుర్గాదేవి నారాధించడంలో నిమగ్నులై యుండిపోయారు. సత్యమూర్తిగారి మిథ్యాప్రలాపాల కంతూపొంతూ లేక పోయింది. కామరాజుకసరుకోపం ఎక్కువైంది. ఆంధ్రకేసరి గర్జనలు విశ్రాంతి తీసుకున్నాయి. మాగంటిచౌదరి అఱవల తెఱవెనుక అంతర్లీనమయ్యాడు. వి.వి.గిరి గిరగిర తిరిగి ప్రదక్షిణ నమస్కారాలర్పించాడు. ఆచార్య రంగాగారప్పట్లో రుూ గొడవే యెత్తలేదు.(చెన్నపట్నం తెలుగువారిదే, మల్లాది లక్ష్మీనరసింహశాస్ర్తీ)
‘మద్రాసు మనదే’ నినాదం ఊపందుకున్న సమయాన మల్లాది లక్ష్మీనారాయణ శాస్ర్తీ వెలువరించిన గ్రంథంలోని ఈ భాగాలు చదివితే ఏమనిపిస్తుంది? రాసి 62 ఏళ్లయినా - ఇదేదో మనల్ని చూసి నిన్నమొన్న రాసినట్టు లేదూ?! ఊరు, పేర్లు వివరాలు వేరైనా ఇప్పటికీ మన తీరు అంతేకదా? మన భాష, మన సంస్కృతి మనకు పట్టదు. ఉజ్వలమైన వారసత్వాన్ని సగర్వంగా నిలబెట్టుకుందామన్న ధ్యాస మనకు ఉండదు. ఎంతసేపూ పరాయి సంస్కృతుల అనుకరణలు; మన గురించి మనకే ఆత్మన్యూనతా భావనలు; స్వార్థాలు, స్వప్రయోజనాలు, పలాయన ధోరణులే తప్ప సమష్టి హితం మనకు గుర్తుకురాదు. ఇవాళ హైదరాబాదులో ఇద్దరు ఆంధ్రులు తారసపడ్డా వచ్చీరాని ఉర్దూలో మాట్లాడుకుంటున్నట్టే... ఆంధ్ర దేశంలోని ఎక్కడి ఆంధ్రులైనా వంటింట్లో కూడా వచ్చీరాని ఇంగ్లిషులో సంభాషిస్తున్నట్టే... తెలుగువారమని చెప్పుకోవటాన్ని, తమ బిడ్డలకు తెలుగు నేర్పించటాన్ని, తెలుగు మీడియంలో చదివించటాన్ని నామోషీగా భావిస్తున్నట్టే... రెండుమూడు తరాలకింద మద్రాసులోని మన సోదరులూ అరవదాసులయ్యారన్నమాట!బాగుంది! తెలుగు జనానికి తెలుగుతనం పట్టలేదు సరే. భాష జండా పట్టుకుని, ప్రత్యేక అస్తిత్వానికి వెంపర్లాడి, మిగతా భాషావర్గాలకు కంటగింపు కావటం సామాన్య ప్రజానీకానికి ఇష్టంలేకపోవటం అర్థం చేసుకోదగ్గదే. కాని ఆంధ్ర నాయకులమని, ఆంధ్ర జాతికి, సంస్కృతికి ఉద్ధారకులమని, ఆంధ్ర ప్రయోజనాల పరిరక్షణకే కంకణం కట్టుకున్నామని చెప్పే మహాపురుషులు ఏమిచేసినట్టు? తమ రాష్ట్ర రాజధాని నగరంలో తమ భాషావర్గానే్న అణగదొక్కి, లెక్కల్లో మాయచేసి తిమ్మిని బమ్మిగా చూపిస్తూంటే ఆ మహామహులు ఎలా స్పందించారు? ఆదినుంచి మద్రాసు నగరంపై, తమకుగల తిరుగులేని హక్కును నిలబెట్టుకునేందుకు ఎంత పట్టుదల చూపారు? ఎంత బాధ్యతాయుతంగా, ఎంత వ్యూహాత్మకంగా వ్యవహరించారు?చెప్పుకుంటే సిగ్గుచేటు. చెన్నపట్నం తెలుగురాజు కట్టించింది; తెలుగు ప్రభువు ఇంగ్లిషువారికి దానమిచ్చింది; కుంపిణీ కాలంలో దానినిండా ఉన్నది తెలుగువాళ్లు- అని పాత చరిత్రలు ఏకరువుపెట్టటమే తప్ప- ఆ నగరం మీద మన కాలంలో మనకున్న హక్కును గట్టి చేసుకోవాలన్న ఆలోచనే మనవాళ్లకు మొదటినుంచీ లేదు. మద్రాసు నగరం రాబోయే ఆంధ్ర రాష్ట్రంలో భాగం కావాలన్న తలపే ఆంధ్రోద్యమం తొలి దశలో వారికి లేదు. ఆ కాలాన ప్రతిపాదిత ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి మనవారు తయారుచేసిన మాపుల్లో మద్రాసు కనపడదు. పొరపాటునో, మతిమరపువల్లో అనుకుంటున్నారా? కాదు. రాజధాని నగరం విసిరేసినట్టు ఎక్కడో దూరాన ఉండటంవల్లే, అందులోనూ అక్కడ పెత్తనం, ప్రాబల్యం తమిళులది కావటంవల్లే ఆంధ్ర ప్రాంతం వెనకబడిందని ఆ కాలంలో మహామేధావులు పత్రికల్లో విరివిగా వ్యాసాలు రాశారు.ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి దానికి నడిబొడ్డున రాజధాని ఉన్నప్పుడు ఆంధ్రులకు దశ తిరగదని మన రాజకీయ పండితులు నిర్ధారణ చేశారు. బహుశా ఈ కారణంగానే కావొచ్చు... 1916లో ఆంధ్రమహాసభ స్థారుూ సంఘం ‘్భరత రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ’ గురించి జాతీయ కాంగ్రెసుకు నివేదికలో మద్రాసును తమిళ రాష్ట్రంలో భాగంగా చూపించారు.‘‘చెన్నపురి యొక్క ప్రాచీన చరిత్రమును, అందలి యాంధ్ర వర్తక సంఘముల ప్రముఖతను ఒకసారి పరికించినచో, ఈ పట్టణమున తక్కినవారికి వలె ఆంధ్రులకు గూడ హక్కుగలదని తేటపడుతున్నది’’ అని 1913లో ప్రథమాంధ్ర మహాసభలోనే రావుబహదూరు బి.ఎన్.శర్మ అధ్యక్షోపన్యాసంలో ప్రస్తావించడమైతే చేశారు. ‘ఆంధ్రులు క్రమక్రమముగా ఈ పట్టణమున ప్రముఖతగాంచకుండుటయు, వీరి జనసంఖ్య నూటికి 5గురు వంతున తగ్గిపోవుటయు తటస్థమాయెనని’ ఆయన ఆ వెంటనే విచారించారే తప్ప అలా ఎందుకు జరిగిందన్న వివరాలలోకి పోలేదు. పోదలచుకోలేదు.ఆంధ్ర రాష్ట్రానికి మద్రాసు రాజధాని కావాలన్న ప్రతిపాదన మొట్టమొదట వచ్చింది. ఆంధ్ర మహాసభ పుట్టిన నాలుగేళ్ల తరువాత. 1917లో నెల్లూరులో జరిగిన ఐదవ మహాసభలో. అదికూడా సీడెడ్ జిల్లాలను దగ్గరికి తీసుకోవలసి వచ్చింది కనుక! తమకు సౌకర్యంగా ఉన్న చెన్నపట్నాన్ని వదులుకొని, ఎక్కడో కోస్తా జిల్లాల్లో రాజధాని అంటే రాయలసీమ వాసులు ప్రత్యేకాంధ్ర రాష్ట్రానికి కలిసిరారు కనుక!!బహుశా ఈ కారణంవల్లే మద్రాసు ఆంధ్ర రాష్ట్ర రాజధాని కావాలన్న డిమాండు 1918నుంచీ ఊపు అందుకుంది. ఆ సంవత్సరం ఎ.పి.సి.సి. మద్రాసును తన క్షేత్ర పరిధిలో చేర్చింది. అది మొదలుకుని మద్రాసు రాజధానిగా 12 జిల్లాలతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పరచాలన్న తీర్మానం ప్రతిఏటా ఆంధ్ర మహాసభ రివాజుగా చేస్తూ వచ్చింది. 1923లో మొదటిసారిగా ఆంధ్ర మహాసభ వార్షిక సభ మద్రాసులో ఘనంగా జరిగింది. మద్రాసు నగరం మాదంటే మాదంటూ ఆంధ్ర, తమిళనాడు పి.సి.సి.లు చేసిన క్లెయిములకు కాంగ్రెసు నాయకులు ఆలకించి, ఎటూ తేల్చలేక నగరంలోని ఏ వార్డునుంచైనా ఏ పి.సి.సి. అయినా సభ్యులను చేర్పించుకోవచ్చని వెసులుబాటు ఇచ్చింది. 1927 డిసెంబరులో మద్రాసులో కాంగ్రెసు వార్షిక మహాసభ తరవాత మిగిలిన 20వేల రూపాయల నిధులను ఎపిసిసి, టిఎన్‌సిసిలకు అధిష్ఠానం సమానంగా పంచింది. సైమన్ కమిషన్ బహిష్కరణ, ఉప్పుసత్యాగ్రహం వంటి జాతీయ ఉద్యమాలను ఆంధ్ర నాయకులు మద్రాసు నగరంలో ముందుండి నడిపించారు. ప్రకాశం పంతులు మద్రాసు నగరంనుండే శాసనసభకు ఎన్నికయ్యేవారు. ఆంధ్ర రాష్ట్రానికి మద్రాసు రాజధాని కావాలన్న తీర్మానం 1933లో మద్రాసు లెజిస్లేటివ్ కౌన్సిలులో ఒకేఒక్క ఓటు తేడాతో వీగిపోయింది. మద్రాసు విషయంలో ఆంధ్రుల పట్టు ఆ సమయాన ఎంత గట్టిగా ఉండేదీ దీన్నిబట్టే స్పష్టమవుతుంది.సరే! మొదట్లో లేకపోయినా మద్రాసుమీద ఆంధ్రుల హక్కును 1918 తరవాతైనా ఆంధ్ర నాయకులు గుర్తించసాగారు. 1933నాటికి చట్టసభలోనే తమ పంతం దాదాపు నెగ్గించుకోగలిగిన స్థితికి చేరుకున్నారు. మరి అప్పుడైనా 1931 జనాభా లెక్కల మోసాన్ని వారు గుర్తించి ఉండాలి కదా. తమ బలాన్ని మాయదారిన తక్కువచేసే కుత్సితాన్ని అప్పటికైనా వారు ఎండగట్టి ఉండాల్సింది కదా? కనీసం 1946లో నేరుగా తనకే అధికార దండం చేతికందిన తరవాతైనా ఆంధ్రకేసరి తనకు బాగా తెలిసిన నగరంలో తాను క్షుణ్నంగా ఎరిగిన అరవ చేతివాటాల ఆటకట్టించేందుకు ఏమిచేశారు? మిగతా ఆంధ్ర మహానాయకులూ ఆంధ్రుల ప్రయోజనాలను కాపాడేందుకు ఎంత గొప్పగా పాటుపడ్డారు?వచ్చేవారం చూద్దాం. *