ఆంధ్రుల కథ - 21

ఎం.వి.ఆర్ శాస్త్రి గారు ఆంధ్ర భూమి ఆదివారం అనుబంధం లో సీరియల్ గా ప్రచురిస్తున్న ఆంధ్రుల కథ యదాతథం గా..

గద్దెమీద శకుని (September 10th, 2010)

సీ॥ కొండెంకటప్పన్న గుండు సున్నగదన్న
గోపాలకిట్టాయి కొక్కిరాయి
టంగుటూరు ప్రకాశమింగిలీసు పిశాచి
నాగేశ్వరుడు వట్టి నాగజెముడు
పట్ట్భా సీతన్న తుట్టపురుగు గదన్న
ఉన్నవలచ్చుమన్న దున్నపోతు
గొల్లపూడ్సీతన్న కళ్లులేని కబోది
బులుసు సాంబడు వట్టి పుట్టుకుంక
అయ్యదేవరవాడు పెయ్యనాకుడుగాడు
అయ్యంకి రమణయ్య దయ్యమయ్య
డాక్టర్ సుబ్రహ్మణ్య మాక్టింగ్ ఫుల్‌స్టాపు
దువ్వూరి సుబ్బమ్మ దృష్టిబొమ్మ
అనుచు పల్కుచు నుందురీ ఆంధ్ర జనులు
నాయకత్వంబు నడచిన నాటనుండి
తపములేనిది యెన్నరే నెపములెల్ల
రామనగరీ నరేంద్ర రామచంద్ర
‘దేశభక్త’ కొండ వెంకటప్పయ్య గుండుసున్న! ‘ఆంధ్రకేసరి’ టంగుటూరు ప్రకాశం ఇంగిలీసు పిశాచి! ‘దేశోద్ధారక’ కాశీనాథుని నాగేశ్వరరావు ఎక్కడపడితే అక్కడ ఉండే మొండిజాతి నాగజెముడు! పట్ట్భా సీతారామయ్య తుట్టపురుగు! ఉన్నవ లక్ష్మీనారాయణ దున్నపోతు!! గొల్లపూడి సీతారామశాస్ర్తీ (అనంతరకాలంలో స్వామి సీతారాం) కళ్లులేని కబోది!! బులుసు సాంబమూర్తి పుట్టుకుంక! అయ్యదేవర కాళేశ్వరరావు పెయ్యనాకుడుగాడు! గ్రంథాలయోద్యమ నిర్మాత అయ్యంకి రమణయ్య దయ్యమయ్య! దువ్వూరి సుబ్బమ్మ దిష్టిబొమ్మ!
వీళ్లంతా మనం పెద్ద బిరుదులిచ్చి, విగ్రహాలు వేయించి, పట్టాలు కట్టిపూజించి, పాఠాల పుస్తకాల్లో గొప్ప దేశభక్తులుగా, ఆదర్శనాయకులుగా పిల్లలకు చూపెడుతున్న విశిష్ట వ్యక్తులు. వీరిని ఇంతలేసి మాటలనడం దారుణం, దుర్మార్గం అని మనకు అనిపించడం సహజం.
విశేషణాలు దారుణమైనవే. కాని వాటిని వాడినవాడు దుర్మార్గుడు కాదు. పెద్దల గొప్పతనాన్ని ఓర్వలేని రాలుగారుూగాడు. నమ్ముతారో లేదో - రెండుమూడు తరాలకు పూర్వం ఆంధ్రదేశంలో సంచలనం రేపిన ఈ వివాదాస్పద చాటువుకు కర్త ‘ఆంధ్రరత్న’ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. ఆయన నిష్కళంక దేశభక్తుడు. నిక్కమైన గాంధీయ వాది. సుశిక్షితమైన ‘రామదండు’ను తయారుచేసి, చరిత్రకెక్కిన చీరాల - పేరాల పోరాటాన్ని మహోద్ధృతంగా, అత్యద్భుతంగా నడిపిన గొప్ప ప్రజానాయకుడు. మనిషి స్వచ్ఛమే; మనసు మంచి ముత్యమే; కాని మాట మహా పెళుసు. ఎవరినీ లెక్క చెయ్యక ఉన్నదున్నట్టు మాట్లాడే యథార్థవాది. అదే ఆయనకు లెక్కలేనంతమంది విరోధులను తెచ్చిపెట్టింది. కొక్కిరాయినంటూ తన పేరూ ఇరికించి, అవన్నీ జనమనుకునే అన్యాయపు మాటలని చమత్కారం చేసి తన కాలపు ఆంధ్ర మహానాయకుల అసలు స్వరూపాలపై ‘గోపాలకిట్టయ్య’ అల్లిన చాటు పద్యమిది. ఏడు దశాబ్దాల కింద ఆయన మరణించే సమయానికి మన మహామహుల పస ఏమిటో జనానికి ఇంకా తేటపడలేదు. కాబట్టి కొంటె గోపాలకృష్ణుని ‘వికట కవి’త్వంలో ఈ విసురూ ఒకటి అనుకున్నారు. కాని అనంతరకాలపు అనుభవాలను, మహానేతల మహాదౌర్బల్యాలను దృష్టిలో ఉంచుకుంటే దుగ్గిరాల చాటువు కటువే కాని చాలావరకు నిజమేనని ఒప్పుకోకతప్పదు.
ఉద్దేశాలు మంచివే కావచ్చు. వ్యక్తిత్వాలు విశిష్టమైనవీ, వంకలేనివే కావచ్చు. కాని ఆంధ్ర మహానాయకులు అమాయక చక్రవర్తులు. వారి బుద్ధి తీక్షణమైనదే. కాని కొన్ని రకాల మాయలను అది పోల్చుకోలేదు. దేశంకోసం ప్రజాహితం కోసం అవసరమైతే ఎంతటివాడినైనా ఎదిరించే తెగువ మన పెద్దలకు లేదు. నమ్ముకున్న నాయకుడిపట్ల విధేయతకూ, బానిస మనస్తత్వానికీ తేడాను వారి గ్రహించినట్టు కనపడదు. మోసగించిన వారి చేతిలో మళ్లీమళ్లీ మోసపోవటమే పార్టీ క్రమశిక్షణ అనుకోవటం వారి ప్రత్యేకత.
కొత్తగా వచ్చిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 చట్టం కింద ఎన్నికలు జరిగాయి. అప్పట్లో కాంగ్రెసులో రెండు వర్గాలుండేవి. 1920ల్లో చేపట్టిన త్రివిధ బహిష్కారాన్ని అలాగే కొనసాగించి, శాసనసభలనూ, ఎన్నికలనూ బహిష్కరించాల్సిందేననే ‘నో ఛేంజర్స్’ ఒక వర్గం. ఎన్నికల్లో పోటీ చెయ్యాలి, చట్టసభల్లో ప్రవేశించాలి, లోపలినుంచే వ్యవస్థను దెబ్బతీయాలనే ప్రొ ఛేంజర్స్‌ది ఇంకో వర్గం. మద్రాసు రాష్ట్రంలో ‘నో ఛేంజర్స్’కి చక్రవర్తుల రాజగోపాలాచారి నాయకుడు. ఎంచుకున్న విధానం ప్రకారం 1937లోనూ రాష్ట్ర ఎన్నికలను బహిష్కరించి, కాంగ్రెస్ పార్టీ విజయానికి వీసమెత్తు సాయపడకుండా, చిటికెనవేలునైనా కదిలించకుండా, పనిచేసే వారిని తిట్టుకుంటూ ఇంటి పట్టున కూచున్నాడు ఆ మహానుభావుడు. అవతలివైపు టంగుటూరి ప్రకాశం, సత్యమూర్తి లాంటి నాయకులేమో రెక్కలు ముక్కలు చేసుకుని రేయింబవళ్లూ కష్టపడి కాంగ్రెసు పార్టీని గెలిపించారు. సభలోని మొత్తం 215 స్థానాల్లో 160 కాంగ్రెసుకు దక్కాయి. ప్రకాశంగారి నిర్విరామ ప్రచారంవల్ల ఆంధ్ర ప్రాంతంలో రెండు మినహా అన్ని సీట్లూ కాంగ్రెస్‌నే వరించాయి. జస్టిస్ పార్టీని చిత్తుగా ఓడించి ఘనవిజయం సాధించాక కొత్త కాంగ్రెసు ప్రభుత్వానికి నాయకుడు ఎవరు కావాలి? ఆ విజయానికి ముఖ్యకారకుడు, తిరుగులేని ప్రజానాయకుడు అయిన ప్రకాశానే్నకదా? కచ్చితంగా ఆయనే ప్రధానమంత్రి (అప్పట్లో రాష్ట్ధ్రానేత పదవిని అలాగే వ్యవహరించేవారు) అవుతాడని అందరూ అనుకున్నారు.
కాని - ఆశ్చర్యం! జరిగింది వేరు! అదేమిటో ప్రకాశంగారి ‘నా జీవితయాత్ర’ను పూర్తిచేసిన తెనే్నటి విశ్వనాథం మాటల్లో వినండి:
‘‘ఆంధ్ర ప్రాంతంలోనుంచి ఎన్నికయిన సభ్యులు యావన్మంది చెన్నపట్నంలో ‘దేశోద్ధారక’ కాశీనాధుని నాగేశ్వరరావుగారి యింట్లో సమావేశమయ్యారు. అందరూ కూడా ప్రకాశంగారు తప్పకుండా ముఖ్యమంత్రి కాగలరన్న దృఢమయిన అభిప్రాయంలో ఉన్నారు... రాష్ట్ర కాంగ్రెసులో కొంతమంది పెద్దలకు ప్రకాశంగారంటే పడదన్న విషయం అందరికీ తెలుసు. అయినప్పటికీ, ఒక తెలుగు నాయకుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే సందర్భంలో భేదాభిప్రాయాల ప్రభావం వ్యతిరేకంగా ఉండదని ఒక వెర్రి ఊహ అందరి మనసుల్లోనూ వుండేది... ...’’
‘అసలు గాంధీగారికిష్టంలేని ప్రకాశంగారు ముఖ్యమంత్రి కావాలని మనమంటే తమిళులు ఎందుకు ఒప్పుకుంటారయ్యా?’ అని ఆలోచిస్తున్న తెలుగు నాయకులు కూడా ఒకరిద్దరు లేకపోలేదు. అందుచేత, ప్రకాశంగారు తప్పక ముఖ్యమంత్రి కాగలరు అన్న మొదటి భావం ఓ రెండు సూర్యాస్తమయాలు గడచేసరికి మెత్తబడి, పలుచబడి, నీరయిపోయింది.
‘‘నాయకుని ఎన్నుకోవలసిన దినం వచ్చింది. దానికి క్రితం రాత్రి తెలుగు సభ్యులు యావన్మంది మరొకమారు నాగేశ్వరరావు గారి మేడపైన సమావేశమై... కొంతమంది (వీరంతా పెద్దలే) వివిధములైన అభిప్రాయాలు వ్యక్తపరచి, తుది నిర్ణయాలు ప్రకాశంగారికి వదిలివేశారు.
‘‘ప్రకాశంగారు తమ మనస్సులోని ఊహ ఎవరికీ చెప్పలేదు. ఏమి చెప్పగలరు? ఆంధ్ర రాష్ట్రంలో వున్న ఇద్దరు పెద్ద నాయకులే వైమనస్యం చూపినట్టు తోచినవేళ ఏం మాట్లాడటానికీ వీలులేదు కదా?... మరునాడు ప్రకాశంగారే నాయకుని ఎన్నుకునే సభలో స్వయంగా రాజాజీ చెన్న రాష్ట్ర కాంగ్రెసు పార్టీ నాయకుడుగా ఉండాలనే ప్రతిపాదన అనుమానం లేని గొంతుకతో చేశారు.’’
నా జీవితయాత్ర, అనుబంధ ఖండం, తెనే్నటి విశ్వనాథం, పే. 444-445
అథి పరిస్థితుల వాస్తవికతపై ఆధారపడి చేసిన నిర్ణయమని కొన్ని సంవత్సరాల తర్వాత తెనే్నటి వారికి తెలిసిందట. ప్రకాశం, సాంబమూర్తి లాంటి పెద్దలు కలిసి ఆ నిర్ణయం తీసుకున్నారని విశ్వనాథం అంటారుకాని నమ్మశక్యం కాదు. వెరపెరగని ప్రకాశం లోపాయకారీ లాలూచీలు పడి, అంత తేలిగ్గా చేతులెత్తేసే రకం కాదు.
ప్రకాశంలా రాజగోపాలాచారి ప్రజల మనిషి కాకపోవచ్చు. ప్రకాశం మద్రాసులో సైమన్ కమిషనును వెనక్కి పొమ్మంటూ ఎక్కుపెట్టిన తుపాకులకు గుండె చూపిన సమయంలో రాజాజీ సత్యాగ్రహాలకు చెన్నపట్నం అనువైనది కాదని చెప్పి వేదారణ్యానికి వలసపోయి తలదాచుకుని ఉండవచ్చు. తాజా ఎన్నికల్లో ఆయన పాత్ర గుండుసునే్న కావచ్చు. కాని రాజగోపాలాచారికి తెరచాటున పావులు లాఘవంగా కదిపే కౌటిల్య ప్రజ్ఞ ఉంది. ఎన్ని అక్షౌహిణుల జనం ప్రకాశం వైపు ఉంటేనేమి? అందరినీ సమ్మోహపరచి కనికట్టు చేయగల అసలైన చక్రధారి గాంధీ ఆయనకు కొండంత అండ. తెరచాటు మంత్రాంగాల్లో, చీటీలు పంపి, ఒత్తిడిపెట్టి వెంటపడి అనుకున్నది ఎలాగైనా సాధించటంలో గాంధీగారు దిట్ట అని ఇంతకుముందు పెదనందిపాడు పోరాటఘట్టంలోనే మనకు అర్థమైంది. అవే తెలివి తేటలను తన వియ్యంకుడు, ప్రియమిత్రుడు అయిన రాజగోపాలాచారిని గద్దెనెక్కించటానికీ గాంధీగారు ఒడుపుగా ప్రయోగించి ఉంటారని ఊహిస్తే తప్పులేదు. ఆరాధ్య నాయకుడి నుంచి పైకి చెప్పుకోలేని ఒత్తిడిరానిదే ప్రకాశం అంతటివాడు నీరసించి, తన తత్వానికి సరిపడని... నాటి మద్రాసు కాంగ్రెస్‌లో కాసుకు చెల్లని రాజాజీని ముఖ్యమంత్రిగా తన నోటితో తాను ప్రతిపాదించే వాడు కాదు. ఏమైనా ఆ విధమైన లొంగుబాటు ‘ఆంధ్రకేసరి’ అసమాన ధీరత్వానికి ఏవిధంగానూ వనె్నతెచ్చేది కాదు.
ఎవరు పుణ్యం కట్టుకుంటేనేమి ముఖ్యమంత్రి కావలసిన ప్రకాశం అరవశకుని కేబినెటులో వట్టి (రెవిన్యూ) మంత్రి అయ్యాడు. స్వయంగా ఆంధ్రుడికి సింహాసనం దక్కకపోతేనేమి? ఆంధ్ర ప్రజలు అభిమానించి అఖండ విజయం కట్టబెట్టిన కాంగ్రెసు పార్టీకే అధికారం దక్కింది కదా? ఆంధ్ర ప్రజ ప్రత్యేకాంధ్ర రాష్ట్రంకోసం తహతహలాడుతూ, అవకాశమున్న అన్ని విధాలా తమ మనోరథాన్ని నొక్కి చెబుతున్నప్పుడు ప్రజాభీష్టాన్ని తీర్చటం ప్రభుత్వ బాధ్యత కాదా? స్థానిక ప్రభుత్వం, స్థానిక శాసనసభ ఆమోదిస్తే రాష్ట్ర విభజనకు అభ్యంతరం లేదని ఇంపీరియల్ ప్రభుత్వం పలుమార్లు ప్రకటించింది. మద్రాసు శాసనసభలో కాంగ్రెస్‌కు అత్యధిక బలాధిక్యం ఉన్నప్పుడు, ప్రభుత్వాన్ని నడిపేదీ ఆ పార్టీవారే అయినప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు అడ్డేమిటి?
గద్దెమీది శకునే అసలైన అడ్డంకి. అతడు ఆడిన మాయా జూదాన్ని అప్పటి ‘చీఫ్ విప్’ అయ్యదేవర వివరిస్తాడు. వినండి.
‘‘1938 సంవత్సరంలో ఆంధ్ర రాష్టమ్రు కావలెనను తీర్మానమును శాసనసభలో ప్రవేశపెట్టి అంగీకరింప జేయవలెనని ఆంధ్ర కాంగ్రెస్ శాసనసభ్యులలో చాలామంది దస్కతులు చేసిన అర్జీని నేను మా పార్టీ నాయకులైన రాజగోపాలాచారిగారికి చూపితిని. రాష్ట్ర స్వపరిపాలన మేర్పడగానే మొదటి శాసనసభలోనే తీర్మానము తెచ్చుట బాగా లేదే అని వారన్నారు... సభ్యులందరు కోరుచుండగ మనము దీనిని తిరస్కరించుట భావ్యము కాదని వారికి నేను సలహానిచ్చితిని. అందుమీద దానిని శాసనసభ పార్టీలో పెట్టుటకు వారు నాకు అనుమతినిచ్చిరి... ఆ తీర్మానము చర్చకు వచ్చేసరికి కేవలము ఆంధ్ర రాష్టమ్రు కావలెనని కోరుటకు మారుగ, మద్రాసు రాష్టమ్రును ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్టమ్రులుగా విభజించవలెనని తీర్మానమును సవరించి ఆమోదింపచేయించెను... ఆ తీర్మానమునంత గొప్ప యుపన్యాసముతో బలపర్చిన రాజగోపాలాచార్యులుగారు పిమ్మట 1954లో హైదరాబాదులో జరిగిన కాంగ్రెసు మహాసభలో భాషాప్రయుక్త రాష్టమ్రులను కోరుట ఆజఇ్ఘ జజూళ్ఘ అనగా అనాగరిక జాతులవారి కోరికయని చెప్పుట అందరికిని ఆశ్చర్యము కలగజేసినది. గొప్ప నాయకులు ఎట్లు మారినను ప్రజలు వారితోపాటే మారుచుందురని యనుకొనుట గొప్ప పొరపాటు.
‘నా జీవిత కథ - నవ్యాంధ్రము, కాళేశ్వరరావు, పే. 249 - 251
సరే! ‘ట్రయిబల్ ఐడియా’ అని మనసులో భావించిన భాషా రాష్ట్రాల ఏర్పాటు తీర్మానాన్ని లెజిస్లేచరులో ప్రవేశపెట్టటానికి విథిలేక రాజగోపాలాచారి అంగీకరించాడు. 1938 మార్చిలో మద్రాసు లెజిస్లేటివ్ అసెంబ్లీలో కొండ వెంకటప్పయ్య, లెజిస్లేటివ్ కౌన్సిలులో కాశీనాధుని పూర్ణమల్లికార్జునుడు తీర్మానాన్ని ప్రతిపాదించారు. దానిమీద విస్తారంగా జరిగిన చర్చలో రెవిన్యూ మంత్రి టంగుటూరి ప్రకాశం అనర్గళంగా మాట్లాడాడు - ‘‘అసలు - రౌండ్‌టేబిల్ కాన్ఫరెన్సు సమయంలో ఆంధ్రరాష్ట్రం కావాలని మన తరఫున ఎవరైనా గట్టిగా డిమాండ్ చేసి ఉంటే ఒరిస్సా, సింధ్‌లతోబాటు మనకూ ప్రత్యేక రాష్ట్రం వచ్చేది. అంత తేలిగ్గా అయ్యేపని అడిగేవారు లేనందువల్లే కాకుండా పోయింది’’ - అని ఆయన చరిత్ర చెప్పుకొచ్చాడు. ఆలస్యంగానైనా ఇప్పుడు పెట్టిన తీర్మానం కాంగ్రెసు ఉన్నతాదర్శాలకు అనుగుణంగా ఉందని, తమ ప్రభుత్వం కూడా దానిని అంగీకరించిందని ముఖ్యమంత్రి రాజాజీ గంభీరంగా ప్రకటించాడు.
సుదీర్ఘమైన చర్చ తరవాత ఉభయసభలూ 1938 మార్చి 30, 31 తేదీల్లో తీర్మానాన్ని ఆమోదించాయి. రాజాజీ మంత్రివర్గమూ దానిని ఔదలదాల్చి అవశ్యం చర్య తీసుకోవలసిందంటూ 1938 ఏప్రిల్ 21న భారత ప్రభుత్వానికి పంపించింది. భారత ప్రభుత్వం మూడువారాలు తిరక్కుండా (మే 11న) దాన్ని లండన్‌లో సెక్రటరీ ఆఫ్ స్టేట్‌కి తక్షణ చర్య కోరుతూ పంపించింది. అది అడంగు చేరకపూర్వమే బ్రిటిష్ విదేశాంగశాఖ ఉపమంత్రి లార్డ్‌స్టాన్లీ ఇప్పట్లో కొత్త రాష్ట్రాలు ఏర్పరిచే ఉద్దేశం తమకు లేదని (1938 మార్చి 2న) బ్రిటిషు పార్లమెంటులో ప్రకటించి ఆంధ్రుల ఆశల మీద చన్నీళ్లు చల్లాడు.
అంతా నిశే్చష్టులయ్యారు. *