ఎం.వి.ఆర్ శాస్త్రి గారు ఆంధ్ర భూమి ఆదివారం అనుబంధం లో సీరియల్ గా ప్రచురిస్తున్న ఆంధ్రుల కథ యదాతథం గా..
ఎస్సార్సీ ఏమి చెప్పింది? --(May 22nd, 2011)
ఎస్సార్సీ, ఎస్సార్సీ అనగా వినడమే కాని, ఆ ఎస్సార్సీ ఏమిటో, దాని నివేదికలో ఏముందో చాలామందికి తెలియదు. ఎవరి వాదానికి, అవసరానికి తగ్గట్టువారు అందులో కొన్ని పేరాలలోని కొన్ని వాక్యాలను ఎడిట్ చేసి ఉటంకించడం కద్దు. విన్నవారికి వాటి సందర్భం ఏమిటో, ఆయా వాక్యాలకు ముందూ వెనకా ఏముందో తెలియదు.
గుణదోషాలు ఎలా ఉన్నా రాష్ట్రాల పునర్విభజన సంఘం (ఎస్.ఆర్.సి.) నివేదిక ముఖ్యమైన డాక్యుమెంటు. స్వాతంత్య్రం వచ్చాక జరిగిన రాష్ట్రాల వ్యవస్థీకరణకు చాలామటుకు అదే ప్రాతిపదిక. మొత్తం 267 పేజీల నివేదికలో అప్పటి మద్రాసు, కేరళ, కర్నాటక, హైదరాబాద్, ఆంధ్ర, బొంబాయి, మధ్యప్రదేశ్, రాజస్తాన్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల ఎల్లలను ఎలా మార్చదగునన్నదానిమీద విలువైన ప్రతిపాదనలు చాలా ఉన్నాయి. (కేవలం ఒరిస్సా, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాల విషయంలోనే కొత్తగా ఏ సూచనా చేయకుండా యథాస్థితిని కొనసాగించవచ్చునని కమిషన్ చెప్పింది.)
మనకు సంబంధించినంతవరకూ - తెలంగాణను ఆంధ్ర రాష్ట్రంలో కలపకుండా కనీసం ఐదేళ్లపాటు విడిగా ఉంచాలన్నదే నివేదిక సారాంశం. ఆ సంగతి పదే పదే వినడంవల్ల ఎస్సార్సీ రిపోర్టు విశాలాంధ్రకు వ్యతిరేకమన్న అభిప్రాయం చాలామందిలో నాటుకుపోయింది. వాస్తవానికి తెలంగాణ వాదులనేకాక సమైక్యవాదులను సంతోషపెట్టే విషయాలూ ఫజలాలీ కమిషన్ రిపోర్టులో అనేకం ఉన్నాయి. వారూ వీరూ సావధానంగా అధ్యయనం చేయదగిన సూచనలు అందులో చాలా కనిపిస్తాయి. ఇప్పుడు హోరాహోరీగా నడుస్తున్న విభజన వివాదాన్ని విశాల దృష్టితో అర్థంచేసుకోవటానికి ఈ రిపోర్టు బాగా పనికొస్తుంది. 103నుంచి 111వరకూ తొమ్మిది పేజీల్లో హైదరాబాద్, ఆంధ్ర రాష్ట్రాల పునర్విభజన, మరీముఖ్యంగా విశాలాంధ్ర, తెలంగాణవాదులకు సంబంధించి ఫజలాలీ కమిషన్ చెప్పింది ఇది:
విశాలాంధ్ర వాదం
359. ఇప్పటి హైదరాబాద్ స్టేట్‌లో ముఖ్యంగా ‘విశాలాంధ్ర’ డిమాండును దృష్టిలో పెట్టుకుని తెలుగు మాట్లాడే ప్రాంతాల భవిష్యత్తును పరిశీలించవలసి ఉంది.
370. ఆంధ్ర రాష్ట్రం 1953 అక్టోబరు 1న ఏర్పాటైపోయింది కాబట్టి ఆంధ్రోద్యమ చరిత్ర వివరాల్లోకి మనం వెళ్లవలసిన అవసరం లేదు. నిజానికి, 1953లో జరిగినవి పక్కా ఏర్పాట్లని కొత్త రాష్ట్రంలోని ఆంధ్రులు, ముఖ్యంగా సర్కార్లవారు భావించలేదు.
371. తెలంగాణ కలిసిన విశాల ఆంధ్ర రాష్ట్రంవల్ల ప్రయోజనాలు ఏమిటంటే- 3 కోట్ల 20 లక్షల జనాభాతో ఒక పెద్ద రాష్ట్రం ఆవిర్భవిస్తుంది. దానికి విశాలమైన జల, విద్యుత్ వనరులు, కావలసినంత ఖనిజ సంపద, విలువైన ముడి పదార్థాలు అమరుతాయి. విశాలాంధ్రకు రాజధాని కావడానికి హైదరాబాద్, సికిందరాబాద్ జంట నగరాలు అన్ని విధాల తగివున్నందున ఆంధ్ర రాష్ట్రానికి శాశ్వత రాజధాని సమస్య పరిష్కారమవుతుంది.
372. విశాలాంధ్ర వల్ల ఇంకో లాభమేమిటంటే- కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగం ఒకే కంట్రోలు కిందికి వస్తుంది. భారతదేశంలోని మిక్కిలి ప్రయోజనాత్మక ప్రాజెక్టుల్లో కృష్ణ, గోదావరి ప్రాజెక్టులు ఎన్నదగినవి. వివిధ సాంకేతిక, పాలనాపరమైన కారణాలవల్ల సుదీర్ఘ కాలహరణం తరవాత ఈ ప్రాజెక్టులు డెల్టా ప్రాంతంలో రూపుదిద్దుకున్నాయి. కృష్ణా లోయను గాని, గోదావరి లోయను గాని పూర్తిగా ఏకీకరించడం సాధ్యమయ్యే పనికాదు. కాని- తెలంగాణకున్న ప్రత్యేక రాజకీయాధికార వ్యవస్థను తీసివేయగలిగితే ఈ నదుల ముఖ ద్వారాలలో ఉన్న తూర్పు ప్రాంతాలకు అభివృద్ధి పథకాల్ని రూపొందించడానికి, శీఘ్రంగా అమలుపరచడానికి అవకాశాలుంటాయి. విశాలాంధ్రలో భాగంగా తెలంగాణ ప్రాంతం దీనివల్ల ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ప్రయోజనం పొందుతుంది. కాబట్టి ఆ ప్రాంతాన్ని ఆంధ్ర రాష్ట్రంలో చేర్చటం అభిలషణీయం.
373. కలయికవల్ల ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు కలిగే పరస్పర ప్రయోజనాలు తక్కువ కాదు. కరువుకాలంలో తెలంగాణలో ఆహార కొరత ఉంటుంది. ఆంధ్రరాష్ట్రంలో సాధారణంగా మిగులు ఉంటుంది. మిగులు ఉత్పత్తిని తెలంగాణ ఉపయోగించుకోగలుగుతుంది. ప్రస్తుత ఆంధ్ర రాష్ట్రంలో బొగ్గు నిక్షేపాలు లేవు. తెలంగాణలోని సింగరేణి నుండి ఆంధ్ర ప్రాంతానికి బొగ్గు చేరవేయవచ్చు. ఆంధ్ర రాష్ట్రంలో కలిసినట్లయితే సాధారణ పరిపాలనకు సంబంధించి ఎంతో ఖర్చును తెలంగాణ ఆదాచేయగలుగుతుంది.
374. విశాలాంధ్ర ఏర్పడాలని ఇటు ఆంధ్రలోనూ, అటు తెలంగాణలోనూ ఎందరో వ్యక్తులు, ఎన్నో ప్రజాసంస్థలు ఎంతోకాలంగా తహతహలాడుతున్నారు. వద్దనడానికి బలమైన కారణాలు లేనప్పుడు విశాలాంధ్ర సెంటిమెంటును మన్నించవచ్చు.
తెలంగాణ వాదం
375. ఇలా- విశాలాంధ్ర ఎందుకన్నదానికి మనసుకు హత్తుకునే వాదనలు ఉన్నాయి. అంతమాత్రాన- ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి అనుకూలమైన అంశాలూ తేలిగ్గా తోసివేయగలిగినవి కావు.
376. ప్రస్తుత ఆంధ్ర రాష్ట్రం పుట్టిననాటినుంచి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నది. తెలంగాణతో పోలిస్తే ఇప్పుడున్న ఆంధ్ర రాష్ట్రానికి తలసరి రెవిన్యూ తక్కువ. విడిగా ఉంటే తెలంగాణకు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం చాలా తక్కువ. ఎందువల్లంటే- తెలంగాణలో భూమి శిస్తు హెచ్చు. ఎక్సయిజ్ రాబడి సంవత్సరానికి ఐదు కోట్ల రూపాయల స్థాయిలో ఉంటుంది. తెలంగాణకు అభివృద్ధి పథకాల నిర్వహణకు నికరమైన ఆదాయ వనరులున్నాయి. విలీనం అంటూ జరిగితే తెలంగాణ ప్రాంతంలో అభివృద్ధి పథకాలకు ఉద్దేశించదగిన నిధులను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్ర రాష్ట్రంతో పంచుకోవలసి వస్తుందన్న భయం తెలంగాణా వారికి ఉంది. పరిపాలనాపరంగా చూసినా ఏకీకరణవల్ల తెలంగాణ ప్రాంతానికి లాభమేమీ ఉండదని వారు భావిస్తున్నారు.
377. విశాలాంధ్రలో అభివృద్ధి పథకాల రూపకల్పనలో తమ ప్రాంతానికి తగినంత ప్రాధాన్యం లభించకపోవచ్చుననే భయం తెలంగాణ ప్రాంతీయులకు ఉంది. తెలంగాణాయేకాక దేశం మొత్తంమీద చేపట్టిన ప్రాజెక్టుల్లోనే నందికొండ, కుష్టాపురం (గోదావరి) ప్రాజెక్టులు ముఖ్యమైనవి. కోస్తాలోని డెల్టా ప్రాంతాలకు కూడా ఈ నదుల నీటిని వినియోగించే ప్రతిపాదన ఉంది. అందువల్ల కృష్ణ, గోదావరి నదుల నీటిని వాడుకోవటంలో తనకున్న స్వతంత్ర హక్కుల్ని వదులుకోవటానికి తెలంగాణ ఇష్టపడటంలేదు.
378. One of the Principal Causes of opposition to Vishalandhra also seems to be the apprehension felt by the educationally backward people of Telangana that they may be swamped and exploited by the more advanced people of the coastal area. In the Telangana districts outside the city of Hyderabad education is woefully backward. The result is that a lower qualification than in Andhra is accepted for public services. The real fear of the people of Telangana is that if they join Andhra they will be unequally placed in relation to the people of Andhra and in this partnership the major partner will derive all the advantages immediately, while Telangana itself may be converted into a colony by the enterprising coastal Andhra.
(విశాలాంధ్రను వ్యతిరేకించడానికి మరో ముఖ్య కారణం ఉంది. అభివృద్ధి చెందిన తీరాంధ్రవారు తమని బురదలో తొక్కేసి దోచుకుంటారని విద్యాపరంగా వెనకబడ్డ తెలంగాణ వాసులు శంకిస్తున్నారు. హైదరాబాద్ నగరం మినహాయిస్తే తెలంగాణా జిల్లాలు విద్యావ్యాప్తిలో దారుణంగా వెనకబడి ఉన్నాయి. ఫలితంగా పబ్లిక్ సర్వీసులకు ఆంధ్రలోకంటే తక్కువ అర్హతను తెలంగాణలో అంగీకరిస్తున్నారు. ఆంధ్రతో కలిసిపోయేటట్లయితే ఆంధ్ర ప్రజలకూ, తమకూ నడుమ అసమానత నెలకొంటుందని తెలంగాణవాసులు భావిస్తున్నారు. ఆ రకమైన భాగస్వామ్యంలో పెద్ద్భాగస్వామి వెంటనే అన్ని లాభాలూ పొందుతుందని, తెలివిగల తీరాంధ్రకు తెలంగాణ వలసగా తయారవుతుందని తెలంగాణవారి అసలు భయం.)
379. తెలంగాణ దానివరకు అదే స్థిరమైన యూనిటుకాగలదు. కరంటు అకౌంటులో దాని రెవిన్యూ వసూళ్లు సుమారు 17 కోట్ల రూపాయలు ఉండవచ్చు. కృష్ణా, గోదావరి ప్రాజెక్టులపై పెట్టుబడి కొత్త రాష్ట్రానికి భారమైనా, లోటు పెద్దగా ఉండకపోవచ్చు. పరిస్థితులు అనుకూలిస్తే రెవిన్యూ బడ్జెటు సరితూగవచ్చు. స్వల్పంగా మిగులూ ఉండవచ్చు. ఇలా ఆశించడానికి అనేక కారణాలున్నాయి.
380. ఫైనాన్స్ కమిషన్ సిఫారసులను 1952 ఏప్రిల్ నుంచి అమలుచేస్తున్నందువల్ల మొత్తంగా హైదరాబాద్ స్టేటు, దానిలో భాగంగా తెలంగాణా గణనీయంగా లాభపడ్డాయి. సంస్థానంలోపల కస్టమ్స్ డ్యూటీలను రద్దుచేయవలసి వస్తే ఖజానాకు నష్టమే. కాని రాష్ట్రాలతో పంచుకోవలసిన ఆదాయపు పన్ను, సెంట్రల్ ఎక్సయిజ్‌ల వాటాల రూపేణా కేంద్ర చెల్లింపుల్లో పెరుగుదలవల్ల ఆ నష్టం మొత్తంమీద భర్తీ అవుతుంది. కొన్ని రెవిన్యూ పద్దుల మీద రాబడి పెంచుకునే అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకుంటే తెలంగాణ ఆర్థిక స్థితి గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదు.
హైదరాబాదు స్టేటు
381. విశాలాంధ్ర ఏర్పాటువల్ల ప్రయోజనాలు స్పష్టంగా కనపడుతున్నాయి. కృష్ణా, గోదావరి నదుల బేసిన్లు ఏకీకృతమైన కంట్రోలు కిందికి రావటం, ఆంధ్ర తెలంగాణలమధ్య ఉభయ తారకమైన ఆర్థిక బంధాలు, విశాల రాష్ట్రానికి హైదరాబాదు రాజధాని కాగలగటం వీటిలో ప్రధానమైనవి.
382. కాబట్టి విశాల రాష్ట్రాన్ని ఏర్పాటుచేయటం మంచిదని, ఈ లక్ష్యసాధనకు అడ్డుకునే పని ఏదీ చేయకూడదని మాకు అనిపిస్తున్నది. ఇదే సమయంలో ఇంకో ముఖ్యవిషయం గమనించాలి. ఆంధ్ర ప్రాంతంలో ప్రజాభిప్రాయం విశాల రాష్ట్రానికి అనుకూలంగా వెల్లువెత్తింది. తెలంగాణలో మాత్రం ప్రజాభిప్రాయం ఇంకా తేటపడలేదు. ఆంధ్రలో తెలంగాణ విలీనమవడం అభిలషణీయమే అయినా ప్రజలు స్వచ్ఛందంగా, ఇష్టపూర్తిగా అంగీకరించినప్పుడే అది జరగాలని. ఆంధ్రలోని ముఖ్యనాయకులు సైతం ఒప్పుకుంటున్నారు. తమ భవిష్యత్తు గురించి ప్రధానంగా తెలంగాణ ప్రజలే ఒక నిర్ణయానికి రావలసి ఉందని వారూ అంగీకరిస్తున్నారు.
383. ఆంధ్రలో విలీనమయ్యే పక్షంలో తెలంగాణ ప్రయోజనాలు కాపాడేందుకు సరిపడినన్ని రక్షణలు పొందుపరచడానికి ప్రస్తుత ఆంధ్రరాష్ట్ర నాయకులు సిద్ధంగా ఉన్నట్టు మేము విన్నాం. రాయలసీమ, తీరాంధ్రల నడుమ శ్రీబాగ్ ఒప్పందం తరహాలో అవి ఉండవచ్చు. జనాభా దామాషా ప్రకారం కనీసం మూడోవంతు మేరకు కొత్త రాష్ట్ర పబ్లిక్ సర్వీసుల్లో తెలంగాణకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు అవి గ్యారంటీని ఇవ్వవచ్చు. అలాగే ఈ ప్రాంతం అభివృద్ధికి శ్రద్ధవహిస్తామనీ, ఈ ప్రాంతం అభివృద్ధి ప్రణాళికలపై ప్రత్యేక ధ్యాస పెడతామనే హామీ ఇవ్వవచ్చు.
384. ఈ మాదిరి ఏర్పాట్లను మేము లోతుగా వివరంగా పరిశీలించాం. మాకేమనిపిస్తున్నదంటే- శ్రీబాగ్ ఒప్పందం తరహా గ్యారంటీలు గాని, ఇంగ్లండులో ‘స్కాటిష్ వికేంద్రీకరణ’లాంటి రాజ్యాంగ ఏర్పాట్లుగాని ఇక్కడ పనికిరావు. సంధికాలంలో తెలంగాణ అవసరాలకు అవి సరిపోవు. కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటేగానీ ప్రాంతీయ ప్రత్యేక అవసరాలు తీర్చటానికి ఉద్దేశించిన చర్యలు సార్థకం కావు. తెలంగాణ విషయంలో అలాంటి ఏర్పాటును సూచించటం మాకు ఇష్టంలేదు.
385. ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్ర రాష్ట్రం ఈమధ్యే ఏర్పడింది. ఆరంభంలో ఉండే ఒడిదుడుకుల ఒత్తిళ్లనుంచి ఇంకా బయటపడలేదు. ఉదాహరణకు - కాంపోజిట్ మద్రాసు రాష్ట్రంనుంచి విభాగం మూలంగా ఉత్పన్నమైన సమస్యలు ఇంకా ఒక కొలిక్కిరాలేదు. భూసంస్కరణలపై విధానాన్ని ఇంకా రూపొందించనే లేదు. ఈ దశలో తెలంగాణను ఆంధ్రలో కలిపేస్తే ఆంధ్రలోనూ, తెలంగాణలోనూ పాలనాపరమైన చిక్కులు రావచ్చు.
386. After taking all these factors into consideration, we have come to the conclusion that it will be in the interests of Andhra as well as Telangana if, for the present, the Telangana area is constituted into a separate state, which may be known as the Hyderabad State, with provision for its unification with Andhra after the general elections likely to be held in or about 1961, if by a two-thirds majority, the legislature of the residuary Hyderabad State expresses itself in favour of such unification.
(ఇవన్నీ పరిశీలించాక మేమొక నిర్ణయానికి వచ్చాం. ప్రస్తుతానికి తెలంగాణ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రం చేయటం ఆంధ్రకూ, తెలంగాణకూ కూడా మంచిది. దాన్ని ‘హైదరాబాద్ స్టేటు’ అనవచ్చు. 1961 ప్రాంతాల్లో జరిగే సాధారణ ఎన్నికల తరవాత కొత్త ‘హైదరాబాద్ స్టేటు’ శాసనసభ మూడింట రెండువంతుల మెజారిటీతో అనుకూలత తెలిపే పక్షంలో- ఆ రాష్ట్రాన్ని ఆంధ్రతో విలీనం చేయవచ్చని షరా పెట్టాలి.)
387. ఈ ఏర్పాటువల్ల లాభమేమిటంటే- తెలుగువాళ్లు ఏకంకావాలన్న ధ్యేయం మసకబారదు. దానికి అవరోధమూ ఉండదు. పాలనా యంత్రాంగాన్ని చక్కపరచుకుని, వీలైతే, ఏకరూపత ఉండేలా భూమిశిస్తు వ్యవస్థల వంటివి సమీక్షించుకుని స్థిరపడేందుకు ఉభయప్రాంతాలకూ ఐదారేళ్ల వ్యవధి దొరుకుతుంది. అనుమానాలను తొలగించి రెండు రాష్ట్రాలమధ్య నిజమైన కలయికకు అవసరమైన ప్రజల ఏకాభిప్రాయాన్ని సాధించటానికి ఈమధ్యకాలంలో సావకాశం ఉంటుంది.
388. ఆంధ్ర, తెలంగాణలకు ఉమ్మడి ఆసక్తులున్నాయి. ఇవి ఉభయ ప్రాంతాల ప్రయోజనాలను దగ్గరికి చేర్చగలవని మేము ఆశిస్తున్నాం. రెండు ప్రాంతాల విలీనానికి అనువైన పరిస్థితులు, వాతావరణం పెంపొందగలవన్న ఆశ నెరవేరకపోతే... రెండు రాష్ట్రాల విలీనానికి వ్యతిరేకంగా తెలంగాణలో ప్రజల సెంటిమెంటు ప్రస్ఫుటమైన పక్షంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగానే కొనసాగవలసి ఉంటుంది.
389. మేము పేర్కొన్న కొత్త హైదరాబాద్ స్టేటును ప్రస్తుతానికి- ఈ కింది జిల్లాలతో ఏర్పరచవచ్చు: మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం సహా వరంగల్లు, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, మెదక్, బీదర్ జిల్లాలు. నల్లగొండ జిల్లా నడుమ ఉండీ ఇప్పటిదాకా కృష్ణా జిల్లాలో భాగమైన మునగాల పరగాణాను కూడా కొత్త రాష్ట్రంలో చేర్చాలి.