భలే సాకు (November 28th, 2010)
సేఠ్ జమునాలాల్ బజాజ్ నిన్న (1938 నవంబర్ 11) రాత్రి 9.30 గంటలకు బొంబాయలో నన్ను కలిశాడు. వస్తున్నట్టు ఆయన వార్ధానుంచి ముందే టెలిగ్రాం ఇచ్చాడు. ఆయన వెంట దాల్మియా అల్లుడు చునీరామ్ మోతీలాల్ ఉన్నాడు.
నేనేమీ మిమ్మల్ని రమ్మనలేదు. ఏదో వచ్చారని మీతో మాట్లాడుతున్నానంత మాత్రాన మా వ్యవహారాలు చక్కబరచడానికి బయటివారి సహాయాన్ని మేము అర్థిస్త్తున్నట్టు కాదు- అని నేను మొదటే స్పష్టం చేశాను. బయటివాళ్లు కలగజేసుకుంటే మతఘర్షణ ఇంకా పెరిగి రక్తపాతానికి దారితీయవచ్చు; దానికి వారిదే బాధ్యత అని కూడా నేను చెప్పేశాను.
ఇక స్టేటు కాంగ్రెసు విషయానికి వస్తే... అది మతతత్వ పూరితం; దానికి కాంగ్రెసు పేరుపెట్టటం అభ్యంతరకరం; ఆ సంగతి గెజిట్లో ముందుగా హెచ్చరిక చేశాం; ఆ తరవాతే నిషేధాన్ని పెట్టాం- అని నేను వివరించాను. ‘అలాంటి పేరు పెట్టటం నాకూ ఇష్టం లేదు; నన్ను అడిగితే వద్దని చెప్పేవాడినే’ అని బజాజ్ అన్నాడు. స్టేట్ కాంగ్రెసులో మతశక్తులు కొనసాగినంతకాలమూ నిషేధాన్ని ఎత్తివేయలేం; అన్ని మతాల వారినీ కలుపుకుని, పేరులో ‘కాంగ్రెస్’అని లేకుండా వేరే సంస్థను పెట్టుకుంటే మాకు అభ్యంతరంలేదని నేను చెప్పాను. భారత జాతీయ కాంగ్రెసు నిజంగానే జాతీయ సంస్థ అయితే... మత వైషమ్యం రెచ్చగొట్టాలన్న ఉద్దేశమేదీ దానికి లేకపోతే హైదరాబాదుకు దూరంగా ఉండాలని నేను సలహా ఇచ్చాను.
చివరిలో నేను చెప్పింది సేఠ్ జమునాలాల్ బజాజ్‌కి నచ్చినట్టు కనిపించింది. ‘నా సమస్య ఏమిటంటే- కాంగ్రెసు వర్కింగు కమిటీ సమావేశం కాబోతున్నది- అందులో హైదరాబాదు విషయం తప్పక చర్చకొస్తుంది. మాలోని తీవ్రవాదులు, ఊరుకునేలా లేరు. వారిని నిలువరించటం కిందటి సమావేశంలోనే మాకు కష్టమైంది.’ అన్నాడాయన. నేను చెప్పిన పాయింట్లను ఉపయోగించి మీరు ఈసారీ వాళ్ల చేతులు కట్టెయ్యగలరని ఆశిస్తాను- అన్నాను నేను. ఈలోపు మీరు కాని, జవహర్లాల్ కాని, పట్ట్భా సీతారామయ్య గాని, మరెవరు గాని హైదరాబాదుకు వచ్చి వ్యవహారాన్ని ఇంకా క్లిష్టం చెయ్యకుండా ఉంటే బావుంటుంది అని కూడా చెప్పాను. బజాజ్ అర్ధరాత్రి దాకా ఉండి వెళ్లిపోయాడు.
[Freedom Struggle in Marathwada, PP.383, 384]
[WWW.Maharashtra.gov.in/engligh/gazetteer/
Vol.XII/CIVIL_DISO_MOVT_Vol-XII_PAGE-349-400. pdf.]
ఇథీ జాతీయ కాంగ్రెసునుంచి రాయబారిగా వచ్చిన జమునాలాల్ బజాజ్‌తో తన సంభాషణ గురించి నిజాం ప్రధానమంత్రి సర్ అక్బర్ హైదరీ 1938 నవంబరు 12న రాసిపెట్టిన ఆధికారిక రికార్డు. దీన్నిబట్టి ఏమి అర్ధమవుతుంది? ఈ హైదరీ అనే వాడికి కాంగ్రెసన్నా, కాంగ్రెసు జాతీయ నాయకులన్నా బొత్తిగా లక్ష్యం లేదు. గౌరవం లేదు. ఆయన తత్వవేత్త, మంచి మనిషి అని గాంధిగారు ఎన్ని కితాబులిస్తేనేమి? సరోజనినాయుడు మీ ఇంట్లో మనిషి, మేమందరమూ మీ శ్రేయోభిలాషులం అని బజాజ్‌గారు ఎంత ఉబకేస్తేనేమి? అక్బర్ హైదరీ ఉబ్బిపోలేదు. సాక్షాత్తూ గాంధీ మహాత్ముడు షాకయ్యారని విన్నా, కాంగ్రెసు పెద్దలందరూ గట్టిగా కోరినా స్టేట్ కాంగ్రెసు మీద నిషేధం ఎత్తివేయడానికి అతడు ససేమిరా ఒప్పుకోలేదు. పైగా ‘కాంగ్రెసు’ అన్న పేరే నీచ, నికృష్టమైనదన్నట్టూ... స్వామి రామానందతీర్థ వంటి నిష్కళంక దేశభక్తులు స్థాపించిన స్టేట్ కాంగ్రెసు నిండా మతశక్తులు ఉన్నట్టూ, అసలు కాంగ్రెసువన్నీ దురుద్దేశాలే అయినట్టూ నోరుపారేసుకున్నాడు. జవహర్లాల్ నెహ్రూ లాంటి జాతీయ నాయకులు హైదరాబాదులో అడుగుపెడితే వ్యవహారం కంపు అవుతుందని చెప్పి... మీరెవరూ ఇటు రానక్కరలేదని కసరగలిగిన దురహంకారి అతడు.
కాంగ్రెసు వర్కింగు కమిటీ మెంబరూ, గాంధీజీకి బాగా సన్నిహితుడు అయిన సేఠ్ జమునాలాల్ బజాజ్ అంతటివాడితోనే అంత దురుసుగా ప్రవర్తించిన ఘనుడు- ఇక తన రాజ్యంలో స్టేటు కాంగ్రెసు నాయకుల పట్ల, వారు చేపట్టిన గాంధీయ సత్యాగ్రహం పట్ల, అందులో పాల్గొనే దేశభక్తుల పట్ల, వారిని బలపరిచే ప్రజానీకం పట్ల ఎంత రెచ్చిపోతాడో ఊహించవచ్చు. జమునాలాల్ బజాజ్ వచ్చి కలిసేనాటికే స్టేట్ కాంగ్రెసు సత్యాగ్రహం ఉద్ధృతంగా సాగుతున్నది. డజన్లకొద్దీ సత్యాగ్రహులు లాఠీలను, నిర్బంధాలకు భయపడకుండా జట్లు జట్లుగా సత్యాగ్రహాలు చేస్తూ జైళ్లకెళ్లి నరక యాతనలు పడుతున్నారు. పోనీ- అదేమైనా స్టేట్ కాంగ్రెసువారు స్వతంత్రించి, జాతీయ కాంగ్రెసుతో ప్రమేయం లేకుండా, కాంగ్రెసు మహానాయకుల అనుమతి పొందకుండా మొదలెట్టిన ఆకతాయి ఆందోళనా? కాదు. వెల్దుర్తి మాణిక్యరావు తన గ్రంథంలో చెప్పినట్టు-
ఇక్కడి వాస్తవ పరిస్థితులను గాంధీ మహాత్మునికి నివేదించి, వారి ఆదేశాలు పొందటానికి తాత్కాలిక కార్యవర్గ సభ్యులు వార్ధా వెళ్ళి, దేశీయ సంస్థాన ప్రజల మహాసభ అధ్యక్షులైన జవహర్‌లాల్ నెహ్రూగారిని, గాంధీ మహాత్ముని కలిసి ఇక్కడి పరిస్థితులను సవిస్తరంగా నివేదించినారు. యాదృచ్ఛికంగా అదే సమయంలో అఖిల భారత కాంగ్రెసు అధ్యక్షులైన నేతాజీ సుభాష్‌చంద్రబోసుగారు కూడా అక్కడే ఉన్నందున హైదరాబాదు స్టేట్ కాంగ్రెసు తాత్కాలిక కార్యవర్గ సభ్యులు వారితోను కలిసి ఆదేశాలు పొందినారు. గాంధీ మహాత్ముడు కార్యవర్గ నిర్ణయాన్ని ఆమోదించడమేగాక హైదరాబాదులో స్టేట్ కాంగ్రెసు జరపబోయే సత్యాగ్రహానికి మార్గదర్శకులుగా కూడా తాము ఉంటామని చెప్పుతూ కార్యవర్గ సభ్యులను ప్రోత్సహించినారు.
హైదరాబాదు స్వాతంత్య్రోద్యమ చరిత్ర, వెల్దుర్తి మాణిక్యరావు, పే.333-334
మరి అంతగా ఆశీర్వథించి, తానే మార్గదర్శనం చేస్తాను లెమ్మని ప్రోత్సహించిన మహాత్ముడు నిజాం సర్కారు పెడసరపు వైఖరి స్పష్టంగా తెలిసివచ్చాక ఏమిచెయ్యాలి? కాంగ్రెసు నిజంగా జాతీయ సంస్థ అయితే... వేరే దురుద్దేశాలేవీ దానికి లేకపోతే... మా జోలికి రాకూడదు... మేము ఎంత పేట్రేగినా, దేశభక్తులను ఎన్ని హింసలు పెట్టినా చేతులు ముడుచుకుని దూరంగా ఉండి చూస్తూండాలి- అంటూ వదిరిన నిజాం దివాను నోట గడ్డిపెట్టాలి కదా? మీ ప్రజాస్వామిక హక్కులకోసం నిరంకుశ దొరతనంమీద అహింసాయుతంగా మీ సత్యాగ్రహం మీరు సాగించండి; మీకు అండగా మేముంటామని స్టేట్ కాంగ్రెసు వారికి ధైర్యం చెప్పాలి కదా? హైదరాబాదు సత్యాగ్రహాన్ని జాతీయోద్యమంలో భాగంగా పరిగణించి,... మొత్తం జాతీయ కాంగ్రెసు, దాని దేశికుడైన మహాత్ముడు సంఘీభావం ప్రకటించి, ఉద్యమాన్ని ముందుకు నడిపించాలి కదా?
మరి మన మహాత్ముడు ఏమిచేశాడు? ఎవరూ కలనైనా ఊహించనిది చేశాడు. తనకు ఇష్టమైన నిజాం సర్కారుకు, తనకు ఇష్టుడైన అక్బర్ హైదరీకి ఇష్టం లేదు కనుక హైదరాబాదులో సత్యాగ్రహం సాగడానికి వీల్లేదని ఏకపక్షంగా, అర్థంపర్థం లేకుండా నిర్ణయించి, స్టేటు కాంగ్రెసు నెత్తిమీద కూర్చుని బలవంతపెట్టి, చక్కగా నడుస్తున్న సత్యాగ్రహాన్ని ఉన్నపళాన ఆపుచేయించాడు! తన మీద కొండంత ఆశపెట్టుకుని, తన స్ఫూర్తితోనే ఎన్ని కష్టాలనూ లెక్కచెయ్యక ముందుకు సాగుతున్న వేలాది కార్యకర్తల నెత్తిన పిడుగువేశాడు. ఇదేమి నిర్ణయం, దీన్ని ఎలా సమర్థించుకుంటాం, ప్రజలకు ఏమని సమాధానం చెబుతాం అని స్టేట్ కాంగ్రెసువాళ్లు లబలబలాడితే, ఆ సంగతి తనకు వదిలెయ్యమని చెప్పి,... స్టేట్ కాంగ్రెసు చేయవలసిన బహిరంగ ప్రకటనను కూడా స్వహస్తాలతో తానే రాసి పంపించాడు. సత్యాగ్రహ విరమణకు కారణాల గురించి అందులో ఆయన సెలవిచ్చిందిది:
The State Congress has come in for a great deal of misrepresentation. It has been called a communal body. Its activities have been mixed up with those of the Aryan Defence League and the Hindu Civil Liberties Union. Unfortunately the movements of the Arya Samaj and the Hindu Mahasabha synchronised with the civil disobedience of the State Congress. The decisive cause has been the advice given by Gandhiji, Pandit Jawaharlal Nehru and other Congress leaders that in order to make our position absolutely clear it was essential that we should suspend C.D. They say suspension would give the Government of H.E.H. the Nizam an opportunity to review the situation.
[The Collected Works of Mahatma Gandhi, Vol.74, P.351]
(స్టేట్ కాంగ్రెసు అనేక అపోహలకు, థురభిప్రాయాలకు గురి అయింది. దానికి మత పాక్షిక సంస్థ అన్న చెడ్డపేరు వచ్చింది. ఆర్యన్ డిఫెన్సులీగు, హిందూ సివిల్ లిబర్టీస్ యూనియన్ కార్యకలాపాలతో దాని కార్యక్రమాలు కలగలిసిపోయాయి. దురదృష్టవశాత్తూ, ఆర్యసమాజ్, హిందూ మహాసభల ఉద్యమాలూ, స్టేట్ కాంగ్రెసు శాసనోల్లంఘనా ఒకే సమయంలో తటస్థించాయి. మనమేమిటన్నది స్పష్టంగా ఉండాలంటే శాసనోల్లంఘనను నిలుపుచెయటం అత్యవసరమని గాంధీజీ, పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, ఇతర కాంగ్రెసు నాయకులు సలహా ఇచ్చారు. ఆ ప్రకారమే ఈ నిర్ణయము చేయడమైనది. నిలుపుదలవల్ల మహాఘనత వహించిన నిజాం ప్రభువులకు పరిస్థితిని సమీక్షించేందుకు అవకాశం కలుగుతుందని ఆ నాయకులు అంటున్నారు.)
ఇదెక్కడి తర్కం! ఆర్య సమాజ్, హిందూ మహాసభలు కూడా అవే అంశాలపై సమాంతరంగా ఆందోళన జరుపుతున్నాయి కనుక, అవి మత సంస్థలు కనుక... అదే సమయంలో స్టేట్ కాంగ్రెసు కూడా సత్యాగ్రహం సాగిస్తే... వాటి మతతత్వం వచ్చి అంటురోగంలా స్టేట్ కాంగ్రెసుకు అంటుకుంటుందా? స్టేట్ కాంగ్రెసు మతతత్వ పూరితమని గిట్టనివారు ఎవరో అన్నంత మాత్రామే దానికి మతతత్వ సంస్థ అన్న చెడ్డపేరు వచ్చేసినట్టా? వచ్చేస్తుందేమోనని హడలిపోయి పచ్చగా సాగుతున్న ఉద్యమాన్ని అర్ధంతరంగా పీకనులిమి వెయ్యాలా?
అయినా స్టేట్ కాంగ్రెసుకు కమ్యూనల్ అన్న ముద్ర ఎవరు వేశారు? ప్రజలా? విజ్ఞులైన పెద్దలా? కాదు. ఆమాట అన్నవాడు నిజాం దివాను అక్బర్ హైదరీ. కాని- అతడి దృష్టిలో స్టేట్ కాంగ్రెసు ఒకటే కాదు; మొత్తం భారత జాతీయ కాంగ్రెసే హిందూ కమ్యూనల్ సంస్థ. కాంగ్రెసన్నా, కాంగ్రెసు జాతీయ నాయకులన్నా తగని తిరస్కారం చూపిన ఆ నిక్షేపరాయుడు అన్నంతమాత్రానే కాంగ్రెసుకు కమ్యూనల్ తత్వం బంకలా అతుక్కుంటుందా? అతడు కోరినంత మాత్రానే సజావుగా సాగుతున్న సత్యాగ్రహాన్ని ఠక్కున ఆపెయ్యాలా?
అక్బర్ హైదరీ కోరాడు కనుకే గాంధిగారు సత్యాగ్రహం ఆపేశారని ఎలా అనగలమని సందేహమా? 1938 నవంబరు 11 రాత్రి గాంధిగారి దూతగా జమునాలాల్ బజాజ్ పిలవకుండానే బొంబాయ వెళ్లి అక్బర్ హైదరీని కలిసిన నాటికీ... గాంధీ మహాత్ముడి ఆదేశానుసారం కాంగ్రెసు సత్యాగ్రహం ఆపివేయబడుతున్నదని 1938 డిసెంబరు 24న స్టేట్ కాంగ్రెసు తరఫున కాశీనాథ్ వైద్య ప్రకటించేనాటికీ నడుమ ఆరువారాల కాలంలో కాంగ్రెసుకు కమ్యూనల్ ముద్ర కొత్తగా పడిన దృష్టాంతం లేదు. ఆర్య సమాజ్, హిందూ మహసభలు ఆందోళనలు చేస్తున్న సమయంలోనే స్టేట్ కాంగ్రెసు కూడా సత్యాగ్రహం సాగించడంవల్ల కొత్తగా రేకెత్తిన అపోహ ఏదీ లేదు. అలా చేయడంవల్ల గందరగోళం అవుతుందని, కాంగ్రెసు బేషరతుగా సత్యాగ్రహం విరమించాలని నిజాం సర్కారీ వర్గాలకు వెలుపల ఒక్కరు కూడా కోరిన దాఖలాల్లేవు. కాబట్టి కేవలం అక్బర్ హైదరీని ఖుషీ చెయ్యడానికే గాంధిగారు చక్కని సత్యాగ్రహాన్ని నిష్కారణంగా బలి ఇచ్చారన్నది స్పష్టం. ఆ సంగతి అప్పటి ప్రజాజీవితంలో ప్రముఖులైన పెద్దలే ఒప్పుకున్నారు. ఆర్య సమాజం హిందూ సివిల్ లిబర్టీస్ యూనియన్ ఉద్యమాలతోబాటు స్టేటు కాంగ్రెసు ఉద్యమంగూడ జరగడంవల్ల కాంగ్రెసుకు మత పాక్షిక రంగు అంటే ప్రమాదం ఉన్నదని హైదరీ చెప్పటంవల్లే గాంధీ మహాత్ముడు కాంగ్రెసు సత్యాగ్రహాన్ని ఆపించారని కోదాటి నారాయణరావు తన స్వీయచరిత్ర ‘నారాయణీయం’ (పే.100)లో రాశారు.
ఆఖరికి - గాంధీగారికి పరమభక్తుడైన స్వామి రామానందతీర్థకు కూడా (అనంతర కాలంలో తనకుతాను ఎలా సమాధానపరచుకున్నప్పటికీ) సత్యాగ్రహం నిలిపేసిన సమయంలో మహాత్ముడు చేసింది చాలా తప్పు అనే తోచింది.
... మాలో కొందరము మహాత్మాజీ ఇచ్చిన సలహా సరియైనది కాదని కొంత ఆగ్రహాన్ని కూడా వెల్లడించాము. స్టేట్ కాంగ్రెసు ఛిన్నాభిన్నమై ముక్కలవుతుందనీ, మతావేశ శక్తులు విజృంభించి, విచ్చలవిడిగా సంచరిస్తాయనీ మేము వాదించాము. కాని నిస్సహాయులమై ఏమీ చేయలేక అనుకూలమైన సమయంకోసం వేచి ఉన్నాము. ఆర్య సమాజ్ సత్యాగ్రహం బాగా విజృంభించింది. దానితోపాటు జైలులో వారి సత్యాగ్రహుల్ని బాధించడం కూడా హెచ్చింది. అందరమూ సత్యాగ్రహులమే. అందుచేత అందరమూ ఒకటే. మాలోమాకు తరతమ భేదాలూ వేరుపాటు భావాలూ లేవు. హఠాత్తుగా ఒకనాటి ఉదయవేళ ఒక సుముహూర్తాన స్టేట్ కాంగ్రెస్ సత్యాగ్రహుల్ని విడుదల చెయ్యవలసిందని ఆజ్ఞలు జైలరుకు అందాయి. విడుదల అవుతున్న మాకు ఇంకా పోరాటం కొనసాగుతూనే ఉండగా జైలులో ఉన్న వేలాది యువ సత్యాగ్రహుల్ని వదిలి స్వేచ్ఛగా బైటికి పోవడానికి మనస్సు చివుక్కుమంది. కాని, మేము చెయ్యగలిగిందేమీ లేదనిపించింది.
హైదరాబాదు స్వాతంత్య్ర పోరాటము, స్వామి రామానందతీర్థ,
పే.178 **