ఎం.వి.ఆర్ శాస్త్రి గారు ఆంధ్ర భూమి ఆదివారం అనుబంధం లో సీరియల్ గా ప్రచురిస్తున్న ఆంధ్రుల కథ యదాతథం గా..
ఒక పిల్లి తలచుకుంటే...(October 3rd, 2010)
లేకలేక లోకాయి పుట్టినట్టు మనకిన్నాళ్లకు సభలు చేసుకునేటందుకనుమతి దొరికి యా సభలు ఖమ్మంమెట్టులో జరుపుటకు పెద్దలు నిశ్చయించేసరికి రుూ పట్టణములో సనాతన ధర్మాలన్ని యెక్కడ నశించుతాయోనని మనవాండ్లలో కొంతమంది ప్రముఖులకు ఎన్నడు లేని ధైర్యసాహసాలతో బ్రహ్మత్వమునకు యెక్కడ కళంకం వచ్చిపోతుందోనని మిక్కిలి పట్టుదలతో రుూ సభలను ఎట్లానన్న ఆపుచేయించే ప్రయత్నంలో కుతూహలంగా వుంది. ... ... సభల యొక్క అర్థమేమంటే మనమంతా ఒకచోట సమావేశమై మనయొక్క అన్ని విషయాలు సాంఘిక నైతిక సంబంధమైనవి చర్చించుకోవడము, తదుపరి పది మంది అభిప్రాయాల ప్రకారము నడ్చుకోవడము, యిదే కాని మరేమియు లేదు. దీనికై అట్టి ఆదుర్దాపడి యింత గట్టి ప్రయత్నాలు చేసే అగత్యమేమి గనుపించదు.
సభలన్న తర్వాత మనముకూడా సమయమొస్తే ఘట్టిగా మాట్లాడవచ్చును. మన పురాణ గ్రంథాలన్నిటిని సాదృశ్యములు చూపించుచు వాద వివాదములు జరపవచ్చును. మన ధర్మాల కొరకై పోట్లాడవచ్చును... అంతేకాని మనకు కొద్దోగొప్పో ఉర్దూ భాషలో ప్రవేశం వుందిగదాయని పదే పదే సభలు వద్దని దరఖాస్తులు వ్రాస్తే లాభము లేదు... నూరు పిల్లులు కలిసి ఒక పెండ్లి చేయలేవుగాని ఒక పిల్లి తల్చుకుంటే ఒక పెండ్లిని జెడగొడ్తుంది... ...
నిజాం రాష్ట్రాంధ్ర మహాసభలు, కె.జితేంద్రబాబు,
ప్రథమ భాగము, పేజి 278-279
1934 చివరిలో నిజాం రాష్ట్ర తృతీయాంథ్ర మహాసభలకు ముందు జములాపురం వెంకట్రావు ఖమ్మం పురవాసులకు పత్రికాముఖంగా చేసిన విజ్ఞప్తి ఇది.
విషయం స్పష్టమే గనుక దీనిపై వివరణ అవసరం లేదు. ఆంధ్రోద్యమాన్ని అడ్డంకొట్టడానికి ప్రజావ్యతిరేక మారీచశక్తులు మొదటినుంచీ వివిధ రూపాల్లో, వివిధ నెపాలతో లేవనెత్తిన అకారణ ప్రతిఘటనల మాయదారి యుద్ధంలో ఖమ్మం వివాదం రసవత్తర ఘట్టం.
సర్కారు చుట్టూ తిరిగి, బధిరాంధక అధికారుల అర్థంలేని కొర్రీలన్నిటికీ జవాబులు చెప్పి ఎట్టకేలకు తృతీయాంధ్ర మహాసభకు అనుమతి తెచ్చుకునేసరికే తలప్రాణం తోకకొచ్చింది. 1931 మార్చిలో దేవరకొండలో ద్వితీయ మహాసభ తరవాత తదుపరి మహాసభను జటప్రోలు సంస్థానంలోని కొల్లాపురంలో జరపాలని మొదట అనుకున్నారు. అనుమతి కోరితే- సంస్థానములోపల గాని, బయటగాని సభలకు సెలవియ్యబడదని సాక్షాత్తూ నిజాం రాజ్య ప్రధానమంత్రి సర్ కృష్ణప్రసాద్ బహదరువారు హిరణ్యకశిపుడి లెవెల్లో ప్రశస్తమైన ఉత్తర్వుచేశారు. సంస్థానంలోపలా కూడదు; బయటా వీల్లేదు అంటే మరి మహాసభను ఎక్కడ పెట్టుకోవాలో బోధపడక నాయకులకు మతులుపోయాయి. ఏళ్ల తరబడి కాళ్లరిగేట్టు ఏలినవారి చుట్టూ తిరిగి, లెక్కలేనన్ని విజ్ఞప్తులు, చేసిన మీదట ఎట్టకేలకు 1934 మార్చి 13న పోలీసుశాఖ మంత్రి కర్నల్ ట్రెంచ్ కేంద్ర సంఘానికి దర్శనమిచ్చారు. కేంద్ర సంఘ కార్యదర్శి మాడపాటి హనుమంతరావుగారు, బూర్గుల రామకృష్ణరావుగారు ఆయనను కలవబోయినప్పుడు పోలీసుశాఖాధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ కూడా అక్కడ ఉన్నాడు. ఈ ఉద్యమానికి రాజకీయాలతో సంబంధం లేదు, గ్రంథాలయాల ద్వారా విజ్ఞానం వ్యాప్తిచేయటంలాంటి పనులు చేస్తుందంతే అని బూర్గులవారు దొరవార్లకు విన్నవించారు. ‘‘ఆమాట నాకు చెప్పకండి. నాకు తెలుసు. ఇంతకుముందు బెంగాల్‌లో నాకు చాలా అనుభవమైంది. గ్రంథాలయాలంటే విప్లవ సంఘాలు’’ అన్నాడట పోలీసు బాసు. మేము అలాంటివాళ్లము కామని నానావిధాల నచ్చచెప్పాక పోలీసు మంత్రిగారు- ప్రభుత్వ విధానాల గురించి మీ సభలో చర్చించకూడదు. దానికి పూచీగా రెండువేల రూపాయలు జమానతు కట్టండి అన్నాడు. మనవాళ్లు కట్టమన్నారు. అప్పుడు జరిగిన సంభాషణ ఇది:
మంత్రి: జమానతు దాఖలుచేయుటకేల ఆక్షేపణ? అంత మాత్రము ద్రవ్యము మీరు చెల్లించజాలరా! చెల్లించినచో, అది తుదకు ప్రభుత్వమువారు లాగుకొనెదరనుకొనుచున్నారా?
బూర్గుల: రాజ్యములోని సగము భాగమునకు ప్రాతినిధ్యము వహించుమేము, ఈ మాత్రపు ధనము చెల్లించ జాలమనికాదు. దీనిని సర్కారువారు ఎట్లెయినను లాగుకొందురనియు కాదు. జమానతిచ్చి మహాసభ జరుపుట మా ఆత్మగౌరవమునకు భంగకరము. కనుక మేము ఒప్పుకొనము.
మంత్రి: మంచిది సెలవిత్తుము. ముందైన, బుద్ధిగల పిల్లలవలె వర్తింపుడు.
తెలంగాణా ఆంధ్రోద్యమము, మాడపాటి హనుమంతరావు పేజి 93
అలా ఆంథ్ర నాయకులకు తెల్లతోలు పోలీసు మంత్రి క్లాసు తీసుకున్నాక మూణ్నెల్ల ఎదురుచూపుల తరవాత మహాసభ జరుపుకోవటానికి ‘బాబెహుకూమత్’ (నిజాం మంత్రి మండలి) అతికష్టంమీద అనుమతి ఇచ్చింది. మళ్లీ మూణ్నెల్లకు హోం సెక్రటరీ మహాశయుడు కేంద్ర సంఘ కార్యదర్శిని కేకేసి ‘‘ప్రభుత్వాధికారుల కొరకు పనులు చేయవద్దని ప్రజలకు బోధించగూడదు; ప్రభుత్వంతో ఘర్షణ కలిగే ఏ ఇతర చర్యలు జరపకూడదు’’ అని షరతులు విధించి, వాటికి సమ్మతిస్తున్నట్టు మాడపాటి వారిచేత సంతకం చేయించుకున్నారు. సరే! మహాప్రభూ! తమరి సెలవుమేరకు మేము ఖమ్మంలో మహాసభ జరుపుకుంటాం. ఆజ్ఞ దయచేయండి అని మాడపాటి అడిగితే మరో మూణ్నెల్ల తరవాత పైనుంచి ఇంకో ఉత్తర్వు వచ్చింది. ఏమనంటే- ‘వరంగల్ జిల్లా అవ్వలు తాలూకుదారుగారికి ఖమ్మములో మహాసభాసమావేశము గురించి వ్రాయబడినది. ఆజ్ఞల వివరములు వారే మీకు తెలుపగలరు’ అని! అంటే- వాయిదాల పద్ధతిలో వేధించే డ్యూటీని అవ్వలు తాలూక్దారు అనే కలెక్టరు మీదికి నెట్టి అర్జీదారుల మెడమీద కత్తిని అలాగే ఉంచారు. అదెలా ఉన్నా సభకు అనుమతైతే వచ్చింది కదా, అదే పదివేలనుకున్నారు ఆంధ్ర పెద్దలు.
నల్లగొండలో ప్రముఖ న్యాయవాది పులిజాల వెంకట రంగారావు అధ్యక్షులుగా ఆ సంవత్సరం (1934) డిసెంబరు 13, 14, 15 తేదీల్లో ఖమ్మం పట్టణాన మూడో ఆంధ్ర మహాసభకు హుటాహుటిన సన్నాహాలు మొదలయ్యాయో లేదో కొత్తరకం తలనెప్పి! ఆ ముచ్చట మాడపాటివారి మాటల్లో వినండి:
‘‘సంవత్సరముల కొలది కష్టించి నాలుగేండ్లకు ప్రభుత్వమువారి అంగీకారమును సంపాదించువరకు ఖమ్మము మెట్టులోని మన సోదరులకు ఈ మహాసభ జరుగకుండ చేయవలయునను సత్సంకల్పము జనించెను... ఈ మహాసభలో సంఘ సంస్కార విషయములు చర్చకు వచ్చును. సనాతన ధర్మావలంబులకు తమకందరికి అపారమగు దుఃఖము కలుగును. దీనిమూలమున శాంతికి గొప్ప భంగము వాటిల్లును. రక్తపాతము కలుగవచ్చును. కనుక ఖమ్మములో ఈ సభ జరుగకుండ నిషేధించి హిందూ ధర్మమును రక్షించవలసినదని సంఘ విజ్ఞాపనలు పురవాసుల దస్కతులతో పై యధికారులకు పంపుకొనబడెను! ఆంధ్రోద్యమమును వ్యాపించనీయవలదనియు, హిందువులకు ప్రజలలో విజ్ఞానము వ్యాపించకుండ అరికట్టుటయే మహోద్దేశముగాగల ప్రభుత్వాధికారులకు ఇట్టి మహాజరులు ప్రోత్సాహకరములు కాకయుండునా? ఈ కారణమున కలిగిన యాందోళనము ఉద్యమ కార్యకర్తలను విచారమగ్నులగావించినది! ఆటంకములను కల్పించిన సోదర మహాశయుల నిట్టి ప్రయత్నములనుండి తప్పించుటకు ప్రధాన కార్యకర్తలు ఎంతయో కృషి జరిపిరి. బ్రతిమాలుకొనుట, భంగపడుట, సమాధానమునకై షరతుల యాచించుట ఇట్టివి...’’
అదే గ్రంథం పే.96-97
అయినా ప్రయోజనం లేకపోయింథి. ఖమ్మం మహాసభల సమయంలో దురాచారాలు జరుగుతాయని, కులభేదాలు లేక అంతా కలిసి తింటారని, సంఘ సాంకర్యం జరుగుతుందని సనాతనులు విరామం లేకుండా ప్రచారం చేశారు. ఆ సమయాన దాశరథి వెంకటాచార్యులు (దాశరథి కృష్ణమాచార్యులు, దాశరథి రంగాచార్యుల తండ్రి) ‘అస్పృశ్యతా విషయములు’ అనేపేర వేసిన ఈ కరపత్రం మచ్చుకు చిత్తగించండి:
‘‘విచక్షణ దక్షులారా! విమర్శింపుడు. అస్పృశ్యత దోషమనియు, నిది ప్రాచీనుల వాడుక కాదనియు, దీనిని మాన్పవలయుననియు ఆధునికులల్లాడుచున్నారు. చండాల పుల్కసులకూరి బైట నిండ్లుండవలయునని మనువు పదియవ యధ్యాయమున నేబదొకటవ శ్లోకమున వ్రాసెను. వీరూర, మనతో కలసి యుండదగువారగుదురేని యాతడట్లేల వ్రాయును? అంతియకాక వారికన్నమే మనచేత బెట్టరాదనెను. యిట్టివారితో మనమేల కలసియుండవలయు?... రాత్రియందీ యస్పృశ్యులు గ్రామ, నగరములందు తిరుగరాదట. దానియర్థము ప్రమాదముతో నెవరేని చీకటియందు తాకుదురని ‘దివాచరేయుః’అనినాడు మనువు. అట్టివారిని మనమెట్లు ముట్టుకొనవలయును? శూద్రునితో ప్రమాదముగాదినిన చాంద్రాయణము చరించవలయునని శంఖుడు వ్రాసెను. చండాలాన్నము దినెనేని చాంద్రాయణము చరింపవలయునని పరాశరస్మృతి... ...’’
నిజాం రాష్ట్రాంధ్ర మహాసభలు, కె.జితేంద్రబాబు, ప్రథమ భాగము, పే.270
కరపత్రమే అయినా ఇథి నైజాం అంతటికీ వెళ్లింది. దీనిమీద మేధావి వర్గాల్లో ఎంత సంచలనం కలిగిందంటే గోలకొండ పత్రికలో సురవరం ప్రతాపరెడ్డిగారు దీనికి సవిస్తరమైన సమాధానం ఇచ్చారు. వెంకటాచార్యులు చూపిన ప్రమాణాల అసంబద్ధతను ఎత్తిచూపి ఆయన కొన్ని సూటి ప్రశ్నలు వేశారు. ఏమనంటే...
‘‘ఆచార్లవారు పేరునుబట్టి శ్రీవైష్ణవులుగానున్నారు. వారికి కొన్ని ప్రశ్నలు వేయుదును.
శ్రీమద్రామానుజ పూజ్యపాదులవారు సర్వులకు మంత్రోపదేశము చేసిరికదా! ఉపదిష్టలందరు పూజితులేకదా! చండాలురును వైషవ దీక్ష పొందిన పూజితులా కాదా?
తిరుప్పాళ్వారు శ్రీవైష్ణవులకు పూజ్యులేనా? వారు చండాల జాతివారే కదా? నందనారు చండాలుడేకదా? చోభాకుళును చండాలుడే? వీరిని సర్వులేల పూజించిరి?... ...’’
అదే గ్రంథం పే.274
అసలు విషయం పక్కథారిపట్టి, ఆంధ్రోద్యమం వెనక్కిపోయి, అన్ని వర్ణాలవారు ఒకచోట కలిస్తేనే, కలిసి భోంచేస్తేనే సనాతన ధర్మాలు, ఆచారాలు మంటకలుస్తాయని ఒక వర్గం నిజాం సర్కారు పరోక్ష ప్రోద్బలంతో గావుకేకలు లంకించుకుని సభను భగ్నం చేయజూస్తున్న సమయంలో మాదిరాజు రామకోటేశ్వరరావుగారు ‘గోలకొండ పత్రికలో’ సనాతనులకు ఒక విజ్ఞప్తిచేశారు. ఎవరి మడి, ఆచారాలకూ ఇబ్బంది రాకుండా మధ్యేమార్గంగా ఈ పరిష్కారాన్ని సూచించారు:
‘‘రాబోవు సభలో సనాతనుల ఆచారములకు భంగము కలుగని పద్ధతిలో భోజనములనేర్పాటు చేయుటకు ప్రత్యేక ప్రయత్నము జరుగవలెను. భోజన ప్రయత్నములలో నొకటి సనాతనాచార ప్రకారమును, మరియొకటి సంస్కరణాచార ప్రకారమును జరిపి రెండు భాగములకు బోర్డులువేసి నిగరాని చేయవలెను. సంస్కరణ ప్రియుల పంక్తిలో బ్రాహ్మణుడు మొదలు హరిజనులవరకు గల తెగలలో ఎవరెవరు చేరవచ్చునో, ఎవరు వంట చేయవలెనో, ఎవరు వడ్డించవలెనో తెలిపి తమ దార్యమను ప్రకటించవలెను. ఒకపూట ఒక భాగములోను, రెండవ పూట రెండవ భాగమున చేరే అవసరము కలిగించరాదు. సేవాదళము కార్యకర్తలు కూడా తామేపక్షమువారో ముందుగా తెలుపవలెను. ఒకరు రెండవవారిని దూషించరాదు. కాలప్రవాహమున జరుగుచున్న సంస్కరణము సంకరమని సనాతనులు విచారపడరాదు.’’
అదే గ్రంథం పే.277-278
ఇన్ని రకాల సర్దుబాట్లు జరిగినా ఖమ్మం సభకు చిక్కులు విడలేథు. ఉద్రిక్తత తొలగలేదు. డిసెంబర్ 13న దాదాపు రెండువేల ప్రతినిధులతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. సాయంత్రం ఐదున్నర గంటల వేళ ఊరేగింపు ప్రారంభమై ముఖ్యవీధులగుండా సాగింది. ఒక మోటారు బండిలో మహాసభాధ్యక్షుడు పులిజాల రంగారావు, దాని వెనుక బండిలో మహిళా సభాధ్యక్షురాలు ఎల్లాప్రగడ సీతాకుమారి ఆసీనులవగా మొదట బ్యాండు వాయిద్యాలు, తర్వాత బారులు తీరిన స్వచ్ఛంద సేవకులు, ఆ వెనక నగర ప్రముఖులు వెంటరాగా ఊరేగింపు పురవీధుల్లో సాగింది. కొంచెం దూరం పోగానే పోలీసు అధికారులొచ్చి అధ్యక్షోపన్యాసం ముద్రిత ప్రతి వెంటనే కావాలని తొందరబట్టారు. ఏదో సాకుచెప్పి నాయకులు ఎలాగో తప్పించుకున్నారు. ఊరేగింపు సభామండపం చేరి, కార్యక్రమం మొదలై, ఆహ్వాన సంఘాధ్యక్షుడు ప్రసంగం ఆరంభించగానే వ్యతిరేక వర్గంవారు లేచి దాన్ని చదవకూడదని పట్టుబట్టారు. ఎందుకంటే దానిలో ఆక్షేపణీయమైన విషయాలున్నాయట! అనవసరపు గొడవ ఎందుకులెమ్మని ఆహ్వాన సంఘాధ్యక్షుడు ఉపన్యాసం ఆపేశాడు.
ప్రారంభ సమావేశం ముగిశాక భోజనానంతరం విషయ నిర్ణయక సభ రాత్రి పదకొండున్నరకు మొదలైంది. కొంచెం పని సాగిందో లేదో అవ్వల్ తాలూక్దారు ఖమ్మం తాసిల్దారును పంపి బూర్గులను, మాడపాటిని తన సన్నిధికి పిలిపించారు. వీరు వెళ్లేసరికి ఎగస్పార్టీ నాయకులూ అక్కడ ఉన్నారు. మహాసభ జరిగితే సరే కాని కొన్ని తీర్మానాలు వదులుకోవాలని వారు వాదించారు. తెగేదాకా లాగటం ఇష్టంలేక మూడు తీర్మానాల్ని వదులుకోవటానికి, ఒక తీర్మానాన్ని ఉపన్యాసం లేకుండా అధ్యక్షపీఠం నుంచి నేరుగా ప్రవేశపెట్టటానికి ఒప్పుకోక తప్పలేదు.
సభాధ్యక్షుడికి కలెక్టరు దొర పిలుపురావటం, నాయకులు హుటాహుటిన దొరవారిని దర్శించటానికి పరిగెత్తడం చూసి జమలాపురం కేశవరావులాంటి యువ నాయకులకు ఒళ్లు మండింది. ఇకనైనా జోహుకుం సర్కార్ రాజకీయాలను కట్టిపెట్టి ప్రజాసమస్య ల మీద కార్యాచరణకు పూనుకోవాలని వీరంతా ఎదురుతిరిగారు.
‘‘సభాధ్యక్షుని ప్రవర్తన కార్యకర్తలకు తీవ్రమైన మనస్తాపానే్న కాదు, ఆగ్రహావేశాలను కూడా కలిగించింది. చివరికి చర్చనీయాంశాల ఖరారు కూడా పెద్ద సమస్య అయింది. అర్ధరాత్రి 2.30 గంటలకు కచేరీనుంచి బయటపడి నాయకులు ఎలాగో తిరిగొచ్చినా- చర్చనీయాంశాల ఖరారు పెద్ద సమస్య అయింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రాజకీయాలు చర్చించకూడదు. అటు బ్రిటిష్ ప్రభుత్వాన్నికాని, ఇటు నైజాం సర్కారుని కాని పల్లెత్తు మాట అనకూడదు. రాజకీయ ఆందోళనలకు దారితీసే విషయాలేవీ చర్చనీయాంశాలు కాకూడదు. మరి ఏ ముఖ్యమైన విషయమూ చర్చించకుండా సభా కార్యక్రమం నడిపేది ఎలా? ఏ ప్రయోజనాన్ని ఆశించి ఈ మహాసభను ఏర్పాటుచేశారని ప్రశ్నించేవాళ్లను సమాధానపరచడం ఎలావీలవుతుంది? చాలాసేపు తర్జనభర్జనల తరవాత చివరకు రైతాంగ సమస్యలను చర్చకు పెట్టాలనే నిర్ణయానికి వచ్చారు.
సర్దార్ జమలాపురం కేశవరావు, హీరాలాల్ మోరియా, పే.53
మాడపాటివారి మాటల్లో చెప్పాలంటే- ‘పూర్తిగా వథలవలసిన, లేక చర్చ మానుకోవలసిన తీర్మానముల గురించి సభాసదులకు వివరంగా సభ్యులు విచారము ప్రకటించి, ఎట్లెట్లో సభాకార్యములు సమాధానపు షరతులకు లోబడియే సాగించి పూర్తిచేసిరి.’’
పూర్తిచేసిన మాట నిజమే కాని, ఖమ్మం మహాసభలకో కొసమెరుపు ఉంది. రెండోరోజు మధ్యాహ్నం ఎల్లాప్రగడ సీతాకుమారి అధ్యక్షతన మహిళా మహాసభ జరుగుతుండగా ఈ సభలు గిట్టనివర్గపు పెద్దలు జిల్లా కలెక్టరును వెంటబెట్టుకుని ఆయన కారులో సభాప్రాంగణం మీదికి దండయాత్ర చేశారు. కేంద్ర సంఘ కార్యదర్శి మాడపాటిని అవ్వల్ తాలూక్దారు (కలెక్టరు) తన దగ్గరికి పిలిపించి ‘మహిళా సభ జరుగుతున్నదట కదా? దానిలో సనాతన వర్గంవారికి మనస్తాపం కలిగించే తీర్మానాలు, ప్రసంగాలు జరుగుతాయట. శాంతికి భంగం కలగకుండా వాటిని ఆపించమని ఇదిగో వీరు కోరుతున్నారు. మీరు వెళ్లి ఆ పని చూడండి’ అన్నాడు. దానికి కార్యదర్శి, ‘అయ్యా ఇది స్ర్తిల సభ. వేల మంది యువతులు సభలో ఉన్నారు. నేను అక్కడికి పోజాలను అన్నాడు. ‘అదేమీ లేదండీ. ఈయన వెళితే ఎవరూ ఆక్షేపించరు. సభలోకి వెళ్లొచ్చు’ అన్నారు ఎగస్పార్టీ వాళ్లు. ‘మరింకేం? వెళ్లి అధ్యక్షురాలిని హెచ్చరించి రండి’ అని ఆర్డరు వేశాడు కలెక్టరు.
ఇక మాడపాటికి సహనం నశించి ఒళ్లుమండి కలెక్టరు మొహం మీదే ఇలా అనేశాడు:
‘‘అయ్యా! ఈ సభలకు తమరు ఎన్నియో విధముల ఆటంకములు చిక్కులు కల్పించుచున్నారు. జరుగుచున్నది స్ర్తిల సభ; నేను దానిలోనికి ప్రవేశించజాలను. నన్ను తమరు అరెస్టుచేసి తగిన చర్యలు గైకొనవచ్చును’’.
తెలంగాణ ఆంధ్రోద్యమము- మాడపాటి, పే.105
థీనికి అవతలి అధికారి ఎంత భగ్గుమంటాడో, ఎక్కడ కొంపలంటుకుంటాయోనని పక్కవాళ్లు భయపడ్డారు. కాని ఏమీకాలేదు. తాలూక్దారు మారు మాట్లాడక తనకు షికాయతుచేసిన వారిని పక్కకు తీసుకువెళ్లి ముక్కచివాట్లు పెట్టి కారెక్కి చక్కాపోయాడు. గండం గడిచింది. *