ఆంధ్రుల కథ - 6

ఎం.వి.ఆర్ శాస్త్రి గారు ఆంధ్ర భూమి ఆదివారం అనుబంధం లో సీరియల్ గా ప్రచురిస్తున్న ఆంధ్రుల కథ యదాతథం గా..


సీడెడ్ సై! (May 30th, 2010)


"As for the Ceded Districts, Chittoor and Nellore, what madness should possess them to wish to get themselves severed from the near Madras, where they have trade connections, command credit system, easily educate their children, possess facilities to carry on their appeals and litigation and what not? How will the 1,07,501 Telugu traders and south Telugu Professionals in the town of Madras like a patriotic self - sacrifice, so that the Telugus in the Northern Circars may have their hobby?... I have consulted many leading gentlemen of the Ceded Districts, and I have known so far none who would like to be tied to the exclusion of Madras and the adjoining Districts of South Arcot, North Arcot etc.''
[History of Andhra Movement, G.V. Subba Rao, Vol. I, PP 378-380]

‘‘సీడెడ్ జిల్లాలకు వ్యాపార సంబంథాలు మద్రాసుతో ఉన్నాయి. అక్కడ వాళ్లకు పరపతి సదుపాయాలున్నాయి. పిల్లల్ని చదివించుకోవటం, దావాలు, హైకోర్టులో అపీళ్లు వేయటం అక్కడైతేనే తేలిక. ఇలాంటి సౌకర్యాలెన్నో ఉన్న మద్రాసు నుంచి తమను తాము తెగగొట్టుకోవటానికి సీడెడ్ జిల్లాలకేమైనా పిచ్చా?! ఉత్తర సర్కార్ల తెలుగువాళ్ల హాబీకోసం, మద్రాసు నగరంలో లక్షకుపైగా ఉన్న తెలుగు వ్యాపారులు, దక్షిణ ప్రాంతాలకు చెందిన తెలుగు వృత్తులవారు దేశభక్తి పూర్వకంగా ఆత్మత్యాగాలు చెయ్యాలా?... సీడెడ్ జిల్లాల్లో ప్రముఖులైన పెద్ద మనుషులు చాలా మందితో నేను మాట్లాడాను. మద్రాసును, దాని చుట్టుపక్కల ఉన్న దక్షిణ ఆర్కాటు, ఉత్తర ఆర్కాటు జిల్లాల నుంచి వేరుపడవలసివచ్చేందుకు కట్టుబడాలని నాకు తెలిసినంతలో ఒక్కరు కూడా ఇష్టపడటం లేదు.’’

ఆంధ్ర రాష్ట్రం కావాలా, అందులో తాము చేరాలా వద్దా అన్న అంశంపై 1913లో మేధావివర్గాల్లో తీవ్రస్థాయిన తర్జనభర్జనలు సాగిన సమయంలో గుత్తికి చెందిన ప్లీడరు జి.లక్ష్మణరెడ్డి పత్రికాముఖంగా వెలిబుచ్చిన అభ్యంతరమిది. ఆంధ్ర రాష్ట్రం వద్దంటున్నది అరవదేశం నుంచి వలసవచ్చిన కేశవ పిళ్లేలాంటి సెట్లర్లు మాత్రమే కాదని, ఆంధ్రా సెంటిమెంటు కోసం మద్రాసుతో తమకున్న సౌలభ్యాలను వదులుకోవటానికి సీడెడ్ జిల్లాల ప్రజలు సుముఖంగా లేరనడానికి ఈ ఆక్షేపణ మచ్చుతునక. అలా అని ఎలా అనగలమంటే... 1911లో ఆంధ్రోద్యమం ఆలోచన మొలకెత్తింది మొదలుకుని 1913లో బాపట్ల ప్రథమాంధ్ర మహాసభ జరిగేంతవరకూ, ఆ తరవాత కూడా ఇటువంటి ఆక్షేపణలు, అనుమానాలు, అభ్యంతరాలు సీడెడ్ జిల్లాలకు చెందిన మేధావుల నుంచి, రాజకీయ ప్రముఖుల నుంచి, వివిధ సామాజిక వర్గాల నుంచి విస్తృతంగా వచ్చాయి. ఆ సంగతి ఆ కాలపు ‘హిందూ’, మద్రాస్ మెయిల్, శశిలేఖ వంటి పత్రికలను తిరగేస్తే అర్థమవుతుంది.
ఆంధ్ర రాష్ట్రంలో కలిస్తే మద్రాసుకు దూరమవుతాము, రాజధానికి దగ్గరగా ఉండటంలోని సదుపాయాన్ని కోల్పోతాము అన్న గుత్తి లక్ష్మణరెడ్డివంటి వారి అభ్యంతరాలనుబట్టి ఇంకో సంగతీ తెలుస్తుంది. అదేమిటంటే మద్రాసు నగరం మీద ఆంధ్రులకు హక్కు ఉన్నదనిగాని, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రానికి మద్రాసే రాజధాని కావచ్చునని కాని, అలా డిమాండ్ చేయాలనిగాని సీడెడ్ జిల్లాల ప్రముఖులకు ఆలోచనే ఉన్నట్టు లేదు. (కనీసం 1913 వరకూ)
మద్రాసుతో తరతరాలుగా పెనవేసుకుపోయిన అనుబంధాన్ని తెగతెంపులు చేసుకోవటం ‘సీమ’ వాసులకు ఇష్టం లేనప్పుడు ఏమి చెయ్యాలి? సెంటిమెంటును దానికంటే బలమైన సెంటిమెంటుతో ఎదుర్కోవాలి. ఆంధ్ర నాయకులు అదే చేశారు. ఆంధ్రుల ప్రశస్తిని, ఇప్పటి దుస్థితిని, ఒక్క భాష మాట్లాడే ఆంధ్ర సోదరులంతా అరవపంచలను వీడి, తిరిగి ఒక్కటై, కష్టాలను, నష్టాలను లెక్క చేయక ఉదాత్త ధ్యేయం కోసం త్యాగాలుచేసి, ఆంధ్ర జాతి పునర్వైభవానికి పాడుపడాల్సిన అవసరాన్ని వారు పత్రికలలోనూ, వేదికలపైనా, గ్రంథాలలోనూ పరిపరి విధాల నొక్కి చెప్పారు. ఉదాహరణకు - యూ ఘశజూ ఘజశఒఆ శజ్ద్ఘూ -్య్పజశషళ ఫుస్తకం చివరిలో ఆంధ్ర రాష్ట్రానికి అనుకూల, ప్రతికూల వాదాలను సింహావలోకనం చేస్తూ గుత్తి లక్ష్మణరెడ్డి ఆక్షేపణను ప్రస్తావించి, డాక్టర్ పట్ట్భా సీతారామయ్య ఏమన్నారో గమనించండి:
"The pride which all Telugus feel for their country and their literature is the only thing that is sought of our brethren... All of them have equal attachment to their motherland, cherish with equal regard the memory of the long and illustrious role of its kings, warriors, poets, statesmen, philosophers, saints, martyrs and heroes, derive equal inspiration from its temples, palaces, battle- fields... and pay equal homage to Krishna Devaraya, Yugandhara, Prataparudra, Venkatadri Nayaka, Potana, Nannaya, Tikkana, Vidyaranya, Ramadasu, Tyagaraya, Apastambha, Rudramadevi, Rukmini, Sasibindu, Salivahana, Adivishnu, Timmarusu, Anagondi, Kondavidu, Dhana kataka, Bobbili...''
[For and Against Andhra Province, PP 225-26]"The pride which all Telugus feel for their country and their literature is the only thing that is sought of our brethren... All of them have equal attachment to their motherland, cherish with equal regard the memory of the long and illustrious role of its kings, warriors, poets, statesmen, philosophers, saints, martyrs and heroes, derive equal inspiration from its temples, palaces, battle- fields... and pay equal homage to Krishna Devaraya, Yugandhara, Prataparudra, Venkatadri Nayaka, Potana, Nannaya, Tikkana, Vidyaranya, Ramadasu, Tyagaraya, Apastambha, Rudramadevi, Rukmini, Sasibindu, Salivahana, Adivishnu, Timmarusu, Anagondi, Kondavidu, Dhana kataka, Bobbili...''
[For and Against Andhra Province, PP 225-26]

(తమ థేశమన్నా, తమ సారస్వతమన్నా తెలుగు వాళ్లందరికీ ఎంత గర్వం ఉందో దానే్న మన (సీడెడ్) సోదరుల నుంచీ మనం ఆశిస్తున్నాం... మాతృభూమిపట్ల మనకున్నంత అభిమానం వారికీ ఉంది. ఆంధ్ర రాజులు, యోధులు, కవులు, రాజనీతిజ్ఞులు, తత్వవేత్తలు, సాధువులు, వీరులూ అమరవీరుల మహనీయ ఘనతల మధురస్మృతులు మనలాగే వారూ గుర్తు చేసుకుంటారు. ప్రసిద్ధ ఆంధ్ర దేవాలయాలు, రాజప్రాసాదాలూ, రణరంగాల నుంచీ వారూ సమానమైన ఉత్తేజం పొందుతారు. కృష్ణదేవరాయలు, యుగంధరుడు, ప్రతాపరుద్రుడు, వెంకటాద్రినాయకుడు, పోతన, నన్నయ, తిక్కన, విద్యారణ్యుడు, రామదాసు, త్యాగరాజు, ఆపస్తంభుడు, రుద్రమదేవి, రుక్మిణి, శశిబిందు, శాలివాహనుడు, ఆదివిష్ణు, తిమ్మరుసు, ఆనగొంది, కొండవీడు, ధాన్యకటకం, బొబ్బిలి... వగైరాలకు ఆంధ్రులందరిలాగే వారూ సమానమైన నివాళి అర్పిస్తారు)

సెంటిమెంటును దట్టించడమే తప్ప ఇందులో పాయింటు లేదు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే తమకు రాగల సమస్యల గురించి సీడెడ్ జిల్లాల్లో తలెత్తిన అనుమానాలను, లేదా అపోహలను సూటిగా, స్ఫుటంగా తొలగించటానికి ఇదమిత్థమైన వివరణ గాని, హామీ గాని ఏదీ లేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రతిపాదనను వ్యతిరేకించిన సీడెడ్ ప్రముఖులు ఆంధ్రుల చరిత్ర, తెలుగువారి ఘనవారసత్వాల గురించి తెలియని వారు కారు. ‘‘శ్రీ కేవశపిళ్లెగారు గుత్తిలో న్యాయవాదిగానున్నను, మిక్కిలి పలుకుబడి సంపాదించి, శాసనసభలో సభ్యత్వము బడసి, రాయలసీమలో ప్రాధాన్యము వహించియుండిర’’నీ... అప్పటికాలంలో ఆంధ్రదేశమున వారిని మించిన వారు లేరని అనదగ్గ ముగ్గురిలో ఒకరనీ కొండ వెంకటప్పయ్యగారు ‘స్వీయ చరిత్ర’లో మెచ్చుకున్నారని ఇంతకుముందే చూశాం.
బాపట్ల తొలి సభలోనే నిష్కర్షగా వ్యతిరేక గళమెత్తి, ఆ తర్వాతా ఆంధ్ర నాయకులతో మొగమాటం లేకుండా విభేధించిన ‘సీడెడ్’ ప్రముఖులు ఆదరిమిలా కాస్త మెత్తపడ్డారు. పట్ట్భాసీతారామయ్య అంతటి జాతీయస్థాయి నాయకులే అంతలా చెప్పాక మొండికేయడం బాగుండదనుకున్నారో... విశాల ఆశయంకోసం ప్రాంతీయ సమస్యలపై పంతాలకు, పట్టుదలలకు పోకూడదనుకున్నారో... ఆంధ్ర మహాసభ నాయకులు తరచుగా పర్యటనలు జరిపి సాగించిన ప్రచారం ప్రభావమో తెలియదు కాని క్రమంగా ‘సీమ’వారి వైఖరి మారింది. 1915లో జరిగిన కర్నూలు జిల్లా రెండవ మహాసభ ఆంధ్ర ఉద్యమాన్ని, దాని ఆశయాలను పూర్తిగా బలపరిచింది. అదే సంవత్సరం విశాఖపట్నంలో జరిగిన తృతీయాంధ్ర మహాసభకు అధ్యక్షత వహించిన చిత్తూరుకు చెందిన పానుగంటి రాజా రామారాయణింగార్ ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు వెంటనే వద్దన్నాడే కానీ అసలే వద్దన లేదు. ఇదే సభలో పాల్గొన్న నంద్యాల ప్రముఖుడు దేశపాండ్య సుబ్బారావు ఆంధ్ర రాష్ట్రాన్ని బేషరతుగా, మనస్ఫూర్తిగా సమర్థిస్తూ ఇలా అన్నారు:
"I have come from the Ceded Districts... The Ceded Districts are as enthusiastic as you are about getting an Andhra Province. Every Andhra who has read and enjoyed Tikkana must have that desire. Once more I tell you that the Ceded Districts do want an Andhra Province.''
[History of Andhra Movement,
G.V. Subba Rao, Vol. I, P. 382]

(నేను సీడెడ్ జిల్లాలకు చెంథిన వాడిని... ఆంధ్ర రాష్ట్రం సాధించాలన్న ఉత్సాహం మీకెంత ఉన్నదో మాకూ అంతే ఉన్నది. తిక్కనను చదివి, ఆనందించిన ప్రతి ఆంధ్రుడికీ ఆ కోరిక ఉండాలి. ఇంకోసారి చెబుతున్నాను - సీడెడ్ జిల్లాలు ఆంధ్ర రాష్ట్రం కావాలంటున్నాయి)
దేశ పాండ్య సుబ్బారావు లాంటివారి మద్దతుతో సీడెడ్ జిల్లాల ప్రతికూలతపట్ల సర్కార్ జిల్లాల వారికి సందేహాలు తగ్గాయి. ఆ జిల్లాలకు వెళ్లి సభలు పెడితే అక్కడివారూ మనకు ఇంకా చేరువవుతారు, మనతో కలిసి వస్తారు అని వల్లూరి సూర్యనారాయణరావు, కె.ఆర్.వి. కృష్ణరావు తదితరులు విశాఖపట్నం మహాసభలో సూచించారు. 1917లో నెల్లూరులో జరిగిన ఐదో ఆంధ్ర మహాసభకైతే రాయలసీమ నుంచి పెద్ద సంఖ్యలో ప్రతినిధులు వచ్చారు. మరుసటి సంవత్సరం మహాసభను నంద్యాలలో జరపాలని కర్నూలు జిల్లా ప్రతినిధులు కోరారు.
ఆంధ్ర నాయకులూ ఆనందంగా అంగీకరించారు. కాని నంద్యాలలో పెద్దఎత్తున కలరా విజృంభించటంతో, సభాకేంద్రాన్ని హుటాహుటిన కడపకు మార్చారు. కడపలో జరిగిన ఆరవ ఆంధ్ర మహాసభకు ఆహ్వాన సంఘాధ్యక్షుడైన మాకల వెంకట సుబ్బయ్య తన స్వాగతోపన్యాసంలో ‘తెలుగదేలయన్న దేశంబు తెలుగు’అన్న శ్రీకృష్ణదేవరాయల ప్రసిద్ధ పద్యపాదాన్ని ఉటంకించి ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కావలసిందేనని ప్రబోధించారు. సభకు అధ్యక్షత వహించిన ‘నెమలి పట్ట్భారామారావు’ అదే మాట అన్నారు. భాష ప్రాతిపదికన తెలుగువారికి ఆంధ్ర రాష్ట్రం డిమాండుకు ఇప్పటిదాకా దూరంగా ఉన్న సీడెడ్ జిల్లాల సోదరులు తమ వైఖరిని పునఃపరిశీలించుకోవాలని ఆయన హితవు చెప్పారు. ఆయన మాట వృథా కాలేదు. కొద్ది నెలల తర్వాత బెజవాడలో జరిగిన ఆంధ్ర మహాసభ ప్రత్యేక సమావేశంలో సీడెడ్ జిల్లాల ప్రతినిధులు ఆంధ్ర రాష్ట్ర తీర్మానానికి అనుకూలంగా ఓటుచేశారు. వారి మద్దతువల్లే ఆ తీర్మానం మొదటిసారిగా ఏకగ్రీవామోదం పొందింది. ఏమైతేనేం- అపనమ్మకాల మబ్బులు తొలిగి, సీడెడ్ జిల్లాలు ఆంధ్ర రాష్ట్రానికి సై అన్నాయి. మద్రాసు ప్రెసిడెన్సీలో ఆంధ్రోద్యమం తెలుగు మాట్లాడే అన్ని జిల్లాల్లో బలోపేతమైంది.
అంతకంటే కావలసిందేముంది అని ఆంధ్రులందరూ సంతోషపడుతూండగానే కాలం కలిసివచ్చింది. ఎవరూ ఊహించని వేగంతో పరిస్థితులు మారాయి. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అయ్యే పనికాదని, ఆశయం మంచిదైనా ఆచరణలో ఎన్నో చిక్కులు ఉన్నాయని, ఎన్నో సమస్యలు ఎదురవుతాయని అప్పటిదాకా పెదవి విరిచిన పెద్దల మనసులు హఠాత్తుగా మారాయి. అంతకుముందు ప్రతి ఆంధ్ర మహాసభ వార్షిక సమావేశంలోనూ రాష్ట్ర తీర్మానాన్ని వ్యతిరేకించినవారు, మొగమాటానికి మిన్నకున్నా నొసలు ముడిచి నిరుత్సాహపరచినవారు కూడా ఉన్నట్టుండి ఉత్సాహం పుంజుకున్నారు. ఆంధ్రులందరూ ఏకమవాల్సిందే, ఉమ్మడిగా పోరాడాల్సిందే, ఇప్పుడు కాకపోతే ఆంధ్ర రాష్ట్రం ఇంకెప్పటికీ రాదు అంటూ తామే ఇతరులను తొందరబెట్టసాగారు.
ఏమైంది? ఎందుకిలా? ఇంతమందిలో కొత్త ఆశలు నింపి, ముందుకు నెట్టిన పరిణామం ఏమిటి?