ఎం.వి.ఆర్ శాస్త్రి గారు ఆంధ్ర భూమి ఆదివారం అనుబంధం లో సీరియల్ గా ప్రచురిస్తున్న ఆంధ్రుల కథ యదాతథం గా..
భాషా ఘోష ...(October 10th, 2010)
ఇప్పుడు వింటే మనకు నవ్వొస్తుంది.
ఆఫ్టరాల్ భాషకోసం ఇంత రాద్ధాంతం చేసే సిల్లీ ఫెలోస్ కూడా ఉంటారా అని బోలెడు ఆశ్చర్యం వేస్తుంది.
మనమంటే- నాగరికత ముదిరి పండిపోయాం. మన మాతృభాషమీద ఎవరెన్ని అఘాయిత్యాలు చేసినా పట్టించుకోని పరిణత స్థితికి చేరుకున్నాం. తెలుగు అధికార భాష అయిన రాష్ట్రంలో పరిపాలన వ్యవహారాలు యావత్తూ కొన్ని తరాలుగా ఇంగ్లిషులోనే సాగుతున్నా... తెలుగు చట్టసభలో తెలుగు మంత్రులు, తెలుగు శాసనకర్తలు తెలుగు మాట్లాడేది లేదని ఒట్టేసుకున్నట్టు వచ్చీరాని ఇంగ్లిషులోనే అహరహం అభిభాషిస్తున్నా... తెలుగు భాషకూ సంస్కృతికీ పట్టంకట్టేందుకు పెట్టిన తెలుగు మహాసభల్లోనే తెలుగొచ్చిన ఆసాములు సైతం ఇంగ్లిషులో వాగేస్తున్నా- తప్పుగా తలచని, చీమకుట్టినంతయినా చలించని స్థితప్రజ్ఞులం మనం.
కాబట్టి 1937లో నిజామాబాద్‌లో జరిగిన ఆరవ నిజాం రాష్ట్రాంధ్ర మహాసభల్లో తెలుగురానివాళ్లను వేరే భాషలో మాట్లాడనివ్వాలా వద్దా అన్న అంశంమీద పెద్ద వివాదం లేచిందంటే మనకు విడ్డూరంగానే ఉంటుంది.
కాని ఆ రోజులు వేరు. అప్పటి పరిస్థితి వేరు.
తెలంగాణలో ఆంధ్రోద్యమం మొదలైందే మాతృభాషాభిమానంతో. హైదరాబాదు సంఘ సంస్కార సభలో ఆంధ్రులను ఆంధ్ర భాషలో మాట్లాడనివ్వకపోవటమే చరిత్రాత్మక కదలికకు నాంది. భాషాభిమానం అలాగే క్రమక్రమంగా పెరిగి ‘ఆంధ్ర మహాసభ’లతో మారాకు వేసింది. సిరిసిల్ల నాలుగో ఆంధ్ర మహాసభలో నియమావళిని రూపొందిస్తున్నప్పుడు ఆంధ్ర మహాసభంటే ఎవరిది? ఆంధ్రులంటే ఎవరు- అనే ప్రశ్న వచ్చింది. తెలుగు మాతృభాషగా కలవారే ఆంధ్రులు, వారిదే ఈ ఆంధ్రమహాసభ అని సభాసదులు దాదాపు అందరూ అభిప్రాయపడ్డారు.
మందుముల నరసింగరావులాంటి ఉర్దూ భాషాభిమానులకు అది నచ్చలేదు. ఆంధ్రం మాతృభాషగా గలవారిదే ఈ మహాసభ అంటే ఇది కేవలం హిందువుల మహాసభ అవుతుంది. తురకవాళ్లని దీంట్లోంచి గెంటేసినట్టు అవుతుంది. అదేమి న్యాయం అని మందుములవారు ఆక్షేపించారు. ‘‘ఇదెక్కడి వాదన? ఉర్దూ కేవలం తురకల భాష ఎట్లాకాదో తెలుగుకూడా కేవలం హిందువుల భాష కాదు. మన ఊళ్లలో కేవలం తెనుగు మాత్రం వచ్చి ఉర్దూ ఎరుగని మహమ్మదీయులు ఎందరో ఉన్నారు. వాళ్లందరూ మన మహాసభలో పాల్గొనవచ్చు గదా?’’ అని నందగిరి వెంకటరావులాంటివాళ్లు జవాబు చెప్పారు. ‘‘కాదు. మీరంతా హిందూ సంఘ పక్షపాతులు. అట్లాగైతే నేనిప్పుడు వెళ్లిపోతాను.’’ అని మందుములవారు భీష్మించారు. మధ్యవర్తులు కలగజేసుకుని ఇరుపక్షాలనూ సమాధానపరిచారు. తెలుగు మాతృభాష అయినాకాకపోయినా తెలుగు మాట్లాడగలవాళ్లను కూడా సభ్యులుగా అంగీకరించేట్టు సభా కార్యకలాపాలన్నీ తెలుగులోనే జరిగేట్టు సంధి కుదిరింది.
ఆ ప్రకారమే ‘‘నిజాము రాష్టమ్రున స్థిరనివాసులై ఆంధ్రము మాతృభాషగా గలవారును, నిజాం రాష్ట్రాంధ్ర దేశమున స్థిరనివాసము గలిగి ఆంధ్రులమని చెప్పుకొనువారును ఈ నియమావళియందు ఆంధ్రులుగా ఎంచబడుదురు’’అని 2వ నియమంలోనూ... ‘‘మహాసభ కార్యక్రమము, చర్చలు, కవిలె (రికార్డు) ఆంధ్ర భాషయందే జరగవలయును’’ అని 31వ నిబంధనలోనూ తేటతెల్లంచేశారు. అంతవరకూ జరిగిన మహాసభల్లో గాని, మరుసటి సంవత్సరం షాద్‌నగర్‌లో ఐదో ఆంధ్ర మహాసభలో గాని ఇందుకు సంబంధించి పేచీ లేకపోయింది. ఎటొచ్చీ 1937 డిసెంబరు 6,7,8తేదీల్లో నిజామాబాదులో జరిగిన ఆరవ మహాసభలోనే పెద్ద చిక్కు వచ్చిపడింది.
అసలే నిజామాబాదు సరిహద్దు జిల్లా. పొరుగున మరఠ్వాడా ప్రాంతానికి చెందిన నాందేడ్ జిల్లాతో అక్కడివారికి సంబంధ బాంధవ్యాలు ఎక్కువ. ఆంధ్రులై ఉండీ ఆంధ్ర భాష మాట్లాడలేని విద్యాధికులు అక్కడ ఎందరో ఉన్నారు. అలాంటివారే ముగ్గురు (కాశీనాథరావు ముఖ్‌పాల్‌కర్, పప్పు కిషన్‌రావు, వౌల్వీ గులాం అహమదు భషానీ) నిజామాబాద్ జిల్లా ఆంధ్ర సంఘంనుంచి ప్రతినిధులుగా ఎన్నికయ్యారు. కాశీనాథరావు, గులాం అహమదులైతే విషయ నిర్ణయ సంఘానికీ సభ్యులుగా ఎన్నుకోబడ్డారు. మొదటిరోజు రాత్రి విషయ నిర్ణయ సంఘం సమావేశమైనపుడు వౌల్వీగులాం అహమ్మదుగారు ఉర్దూలో ఉపన్యాసం ఇయ్యసాగారు. అది నియమావళిలో 31వ సూత్రానికి విరుద్ధం; తెలుగులో తప్ప ఇంకో భాషలో మాట్లాడకూడదు; ఉర్దూలో ప్రసంగిస్తే మాకు అర్థంకాదు-అని ఎ.బి.నరసారెడ్డి అభ్యంతరం తెలిపాడు.
ఆక్షేపణ సబబే. నిబంధనలకు భంగం కలుగుతున్న సంగతిని ఒకరు ఎత్తిచూపిన తరవాతైనా అధ్యక్ష స్థానంలోనివారు అభ్యంతరాన్ని మన్నించవలసింది. కాని నిజామాబాద్ మహాసభకు అగ్రాసనాధిపతి జనాబ్ మందుముల నరసింగరావుగారు. ఆంధ్ర మహాసభ ఆంధ్రులకోసమే; ఆంధ్ర భాషలోనే అన్న వాదాన్ని నియమావళి తయారీ దశలోనే వ్యతిరేకించిన మహానుభావుడాయన. పుట్టుకతో తెలుగువాడే అయినా ఉర్దూమీద ఆయనకు అభిమానం జాస్తి. అప్పట్లో హైదరాబాదులో ‘రయ్యత్’ పేరుతో ఒక సుప్రసిద్ధ ఉర్దూ వారపత్రికను నడుపుతున్నారు కూడా. బహుశా ఆ మమకారంతోనే అభ్యంతరాన్ని తోసిరాజని, ప్రత్యేక పరిస్థితినిబట్టి ఉర్దూలో మాట్లాడటానికి వీరికి నేను అనుమతిస్తున్నానని ప్రకటించారు.
ఇది తొలిరోజు సబ్జెక్ట్ కమిటీ సమావేశంలో ముచ్చట. మర్నాడు మహాసభలో గస్తీ నెంబరు 53ను ఎత్తివేయాలన్న తీర్మానంమీద చర్చ జరిగింది. వౌల్వీగారు దానిమీదా నిండు సభలో ఉర్దూలో అనర్గళంగా మాట్లాడసాగారు. మళ్లీ నర్సారెడ్డి లేచి అభ్యంతరం లేవదీశాడు. నిన్నరాత్రే ఈ సంగతి తేల్చేశాము కాబట్టి మళ్లీ ఆక్షేపణకు అవకాశంలేదని అధ్యక్షులవారు కొట్టిపారేశారు. నేను రూలింగు ఇచ్చాక మారుమాట్లాడకూడదని గద్దించి నర్సారెడ్డిని కూర్చోమన్నారు. అధ్యక్షుడి అనుచరులు అందరూ కమ్ముకుని కేకలువేసి నర్సారెడ్డి నోరు మూయించారు. దానిమీద సభలో కాస్త అల్లరికూడా జరిగింది.
అధ్యక్షుడు పెద్దమనసుతో తమను ఉర్దూలో మాట్లాడనిచ్చినా తెలుగురానివాళ్లకు సంతృప్తి కలగలేదు. ఇక్కడందరూ తెలుగులో మాట్లాడేస్తున్నారు. మాకు ఒక్కముక్కా అర్థంకావటంలేదు. కాబట్టి విషయనిర్ణయ సంఘం సభ్యులుగా మేము ఉండలేమంటూ అదేరోజు మధ్యాహ్నం సబ్జెక్ట్స్ కమిటీ సమావేశంలో కాశీనాథరావు, వౌల్వీ గులాం అహమ్మదులు రాజీనామాలిచ్చారు.
అప్పుడు ఆంధ్ర మహాసభ అధ్యక్ష మహాశయుడు ఏమిచేశాడు? రూలు రూలే. మీ ఇద్దరికి తెలుగు అర్థంకానంత మాత్రాన తెలుగు మాధ్యమాన్ని మార్చలేము. ఇష్టంలేకపోతే ఇంటికి పొండి- అని రాజీనామాలు ఆమోదించారా? లేదు. నిబంధనల ప్రకారం సభాకార్యక్రమాన్ని తెలుగులోనే జరపాల్సి ఉంటుంది; ఐనా మీరు ఉర్దూలో మాట్లాడవచ్చు- అని ప్రత్యేక అనుమతి ఇచ్చారు. అంతటితో ఆగలేదు. మీకోసం ఇక్కడ జరిగే తెలుగు ప్రసంగాలని ఉర్దూలోకి అనువాదం చేయిస్తామని అడక్కుండానే వరమిచ్చి, రాజీనామాలకు పట్టుబట్టవద్దంటూ ఉర్దూలో గంభీరంగా ఉపన్యసించి వారిని బతిమిలాడారు. తర్వాత మహాసభ కార్యదర్శుల్లో ఒకరైన మందుముల రామచంద్రరావుచేత విషయ నిర్ణయ సభలో అప్పటిదాకా పరిశీలించిన ముసాయిదా తీర్మానాలను, వాటిమీద తెలుగులో జరిగిన చర్చను ఆ ఇద్దరికోసం ఉర్దూలోకి తర్జుమా చేయించారు. మళ్లీ వాటిమీద ఆ ఇరువురు ఉర్దూలో వెలిబుచ్చిన అమూల్యాభిప్రాయాలని మిగతావారికి తెలియడంకోసం తెలుగులో తర్జుమా చేయించారు. ఆ రకంగా- సభా కార్యక్రమాలు, చర్యలు, కవిలె యావత్తూ తెలుగులోనే జరగాలన్న నియమాన్ని నడ్డివిరిచి, కేవలం ఇద్దరికోసం తెలుగునుంచి ఉర్దూలోకి, ఉర్దూనుంచి తెలుగులోకి తర్జుమా ప్రోగ్రాంలు పెట్టించి, అధ్యక్షులవారు అతికష్టంమీద ఆ ఇద్దరి రాజీనామాలనైతే మాన్పించారు. ఈ తమాషాలకు ఒళ్లుమండిన ఆంధ్ర సోదరుల ఆగ్రహాన్ని మాత్రం తప్పించుకోలేకపోయారు.
అధ్యక్షుడిచ్చిన రూలింగు న్యాయబద్ధంకాదని ఆ రాత్రి మళ్లీ జరిగిన సబ్జెక్ట్ కమిటీ సమావేశంలో నరసారెడ్డి మళ్లీ ఒక తీర్మానం ప్రతిపాదించాడు. ఇలాంటి తీర్మానం అసలు తేనేకూడదని కొండా వెంకటరంగారెడ్డి గట్టిగా వాదించి అధ్యక్షుడి రూలింగును ప్రశ్నించడానికి వీల్లేదన్నారు. మనస్తాపం చెందిన అసంతృప్తులు ఇక వేరేదారి లేక సభా కార్యక్రమాన్నంతటినీ నిలిపేసి ఈ విషయానే్న తేల్చాలంటూ మర్నాడు మహాసభలో ఏకంగా అడ్జర్న్‌మెంటు తీర్మానం తెచ్చారు. ఆ వైనాన్ని మాడపాటివారి మాటల్లో చిత్తగించండి:
...ముఖ్యముగా యువకులగువారు, ఆంధ్రేతర భాషకు దేనికిని మహాసభ వేదికపైన తావిచ్చుట నియమావళికి విరుద్ధమని... విషయనిర్ణయ సభలో పట్టుబట్టుటయేకాక...’’ అత్యంత ముఖ్యమును, మహాసభా జీవితమునకై మూలకందమని నమ్మి, ఈ విషయమును బహిరంగముగ విచారణము చేయుటకై మహాసభా కార్యక్రమమును కొంతసేపు నిలుపుచేయుటకు ‘‘87గురు ప్రతినిధుల సంతకములతో నీక్రింది చిత్తు తీర్మానము పంపిరి:
‘‘ఆంధ్ర మహాసభ నియమావళిలో 31 సూత్రమునకు వ్యతిరిక్తమగు చర్యలు ఈ ఆరవ ఆంధ్రమహాసభలో జరుగుచున్నవి గాన అట్టి విరుద్ధ చర్యలు జరగకుండ నిలుపుచేసి సక్రమమైన పద్ధతిని ఈ మహాసభా కార్యక్రమమును నడిపించుటకు అధ్యక్షుని ఈ మహాసభవారు కోరుచున్నారు.
... మహాసభ యొక్క మూడవ దినమున ఉదయము గం.8-30 నుండి మధ్యాహ్నము వరకు ఈ తీర్మానమే చర్చించబడినది. తీర్మానము ప్రతిపాదించిన శ్రీ నందగిరి వేంకటరావుగారిని ప్రతిఘటించిన వారిలో శ్రీ కొండా వేంకట రంగారెడ్డిగారును, శ్రీ రావి నారాయణరెడ్డిగారును ప్రముఖులు... నాలుగైదు గంటల తీవ్ర వాదోపవాదముల తరువాత వోట్లు తీసుకొనగా, అధిక సంఖ్యాక ప్రతినిధులయభిప్రాయముననుసరించి తీర్మానము వీగిపోయినది. కాని, యువ నాయకులకు పై ఫలితము అత్యంత మనస్తాపము కలిగించినది. వారితోబాటు... చాల పరితాపపడిన పెద్దలలో ముఖ్యులు శ్రీ సురవరము ప్రతాపరెడ్డిగారు... ... ఎట్లయిననేమి? ఆరవ ఆంధ్ర మహాసభయొక్క ఈ తుది సమావేశమున చాల నిరుత్సాహ వాతావరణము, పొడకట్టినది!
తెలంగాణా ఆంధ్రోద్యమము, మాడపాటి హనుమంతరావు పే.134, 135
మరి నిజామాబాథ్ మహాసభకు అధ్యక్షత్వం వహించిన మందుముల వారేమంటారు?
‘‘నందగిరి వేంకటరామారావుగారు ఈ తీర్మానమును ప్రవేశపెట్టిరి. వల్లూరి బసవరాజుగారు మరియు నరసారెడ్డిగారు బలపరిచిరి. ఈ తీర్మానమును ప్రతిఘటించినవారిలో కొండా వెంకట రంగారెడ్డి, రావి నారాయణరెడ్డి మరియు బూర్గుల రామకృష్ణారావుగారలు ముఖ్యులు. ఇవి తెలంగాణ మహాసభ కాని ఆంధ్ర భాషా మహాసభకాదని తెలంగాణా ప్రాంతములో నివసించువారందరు మహాసభ నియమావళిననుసరించి, ఆంధ్రులేయని, అట్టి ప్రతి ఆంధ్రునికి ఆంధ్ర మహాసభలో సభ్యుడుగా చేరటానికి హక్కుకలదని, మరియు అట్టి ప్రతి సభ్యునికి తనకు వచ్చిన భాషలో అభిప్రాయం తెలుపు హక్కుగలదనే విషయం విశదీకరించబడెను. మొత్తంపైన నాలుగైదుగంటల తీవ్రవాదోపవాదముల తర్వాత అధిక సంఖ్యాక ప్రతినిధుల యభిప్రాయముననుసరించి నందగిరి వెంకటరావుగారి తీర్మానము వీగిపోయినది. కాని భాషాభిమానులకు కొంత మనస్తాపము కలిగినది. దీని ఫలితముగా ‘అభివృద్ధి పక్షము’అను పేరుతో ఆంధ్ర మహాసభలో ఒక ప్రతిపక్షము స్థాపించబడినది. సురవరము ప్రతాపరెడ్డిగారు దీనికి అధ్యక్షులుగాను, వల్లూరి బసవరాజుగారు ప్రధాన కార్యదర్శిగా నుండిరి.’’
50 సంవత్సరాల హైదరాబాదు, మందుముల నరసింగరావు, పే.172
అప్పట్లో యువ నాయకుడు, ఫైర్‌బ్రాండ్‌గా పేరుపడ్డ రావి నారాయణరెడ్డి యువ భాషాభిమానులకు ఎథురునిలిచి ఈ కీలక తీర్మానాన్ని ప్రతిఘటించటానికి కారణమేమిటి? అదీ ఆయన మాటల్లోనే విందాం:
తీవ్ర భాషావాదులు ప్రవేశపెట్టిన క్లాజు దుష్ఫలితాలు ఈ మహాసభలో మరీ స్పష్టంగా బయటపడ్డాయి... నియమావళిలోని 31వ క్లాజు ప్రకారము ఆంధ్రేతర భాషలో ఎవరూ ప్రసంగించటానికి వీలులేదని నందగిరి వెంకటరావుగారి నాయకత్వాన తీవ్రవాదులు అభ్యంతరం లేవదీశారు... ఈ తీర్మాన ప్రతిపాదకుల వాదం ప్రకారం తెలుగురానివారు మహాసభలో ప్రసంగించటానికి వీల్లేదు. నేను ఈ వాదాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రదేశ ప్రజలకు మహాసభలో పాల్గొనే హక్కునే వీరు నిరాకరిస్తున్నారన్నాను. ఇది ఆంధ్ర మహాసభేకాని ఆంధ్ర భాషా మహాసభ కాదని వాదించాను. ఒక వేళ గాంధీజీ స్వయంగావచ్చి ఈ మహా సభలో సందేశం ఇస్తానంటే రుూ క్లాజు ప్రకారం ఆయనకు అట్టి అవకాశం లేకుండా పోతుందన్నాను. అంతేకాదు మన కార్యదర్శిగారు నిజాం ప్రభుత్వంతో ఏమేరకు తెలుగులో ఉత్తరప్రత్యుత్తరాలు జరపగలరని ప్రశ్నించాను. మహాసభ ప్రతినిధులంతా కరతాళ ధ్వనులు చేశారు. తీవ్రవాదుల తీర్మానం ఓడిపోయింది... అయినా ఇది మితవాద నాయకత్వంమీద తీవ్రవాదులకున్న ఏవగింపును మాత్రం స్పష్టం చేసింది.’’
వీర తెలంగాణా- నా అనుభవాలు, జ్ఞాపకాలు,
రావి నారాయణరెడ్డి, పే.28
ఇథి వింటే నారాయణరెడ్డిగారి వాదన సబబే అనిపిస్తుంది. మందుముల నరసింగరావు, కె.వి.రంగారెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, రావి నారాయణరెడ్డి వంటి తెలంగాణ అతిరధ మహారథులు దృఢంగా వ్యతిరేకించి, ఆంధ్ర మహాసభను ఆంధ్రభాషకే పరిమితం చేయడం తగదని ఇన్ని విధాల చెప్పినా సోకాల్డ్ ‘తీవ్రవాదులు’ ఎందుకు వినలేదు? తెలంగాణ వైతాళికుల్లో ఒకడనదగ్గ సురవరం ప్రతాపరెడ్డి అంతటి పెద్దమనిషే ఈ పెద్దల వైఖరికి ఎందుకు మనస్తాపం చెందారు? ఆంధ్ర మహాసభ మూలాలకు సంబంధించి వౌలిక ప్రశ్నలను రేకెత్తించిన చరిత్రాత్మక చర్చలో ఇంతకూ ఆంధ్ర పితామహుడు మాడపాటి వారు ఎటు?