ఆంధ్రుల కథ - 13

ఎం.వి.ఆర్ శాస్త్రి గారు ఆంధ్ర భూమి ఆదివారం అనుబంధం లో సీరియల్ గా ప్రచురిస్తున్న ఆంధ్రుల కథ యదాతథం గా..

వద్దొద్దు ! ఆపెయ్యండి!!(July 17th, 2010)

గాంధీగారు దేశాన్ని ఉద్ధరించటానికే ఉద్భవించాడు; స్వరాజ్యంకోసమే తపించాడు. బ్రిటిష్ సామ్రాజ్యంపై అహింసే ఆయుధంగా అకుంఠిత దీక్షతో నిజాయతీగా నియమబద్ధంగా ధర్మయుద్ధం సాగించాడు. ఇదీ సాధారణంగా దేశవాసులందరూ అనుకుంటున్నది. అందుకే- అంతటి జాతీయోద్యమ సారధి, స్వాతంత్య్ర సేనాని ప్రతిసారీ యుద్ధం మధ్యలో పోరాటం ఎందుకు ఆపేశాడా అని అందరికీ ఆశ్చర్యం! జన చైతన్యం వెల్లువెత్తి ప్రచండ ప్రజాఉద్యమం ధాటికి తెల్లవాడు గిజగిజలాడుతూంటే... అదే పట్టును ఇంకొంతకాలం అలాగే, బిగించి ఉంచితే ప్రజలకు దిగ్విజయం తథ్యమనుకుంటున్న సమయంలో మన సర్వసైన్యాధ్యక్షుడే ప్రతిసారీ చేతులెత్తేసి, పట్టుసడలించి, శత్రువును సంకటంనుంచి బయట వేయించటం ఎందుకు జరిగిందా అని మనలో చాలామందికి తికమక.
జాతీయోద్యమ నాయకుడికి ప్రధాన విధేయత ప్రజల పక్షాన ఉంటే ఉద్యమాన్ని సాధ్యమైనంత తీవ్రతరం చేసి పాలకుల పీచమణుస్తాడు. అదే పాలకులకు విధేయుడైతే ఉద్యమం తీవ్రతరం కాకుండా ఎప్పటికప్పుడు చన్నీళ్లు చల్లి పాలకవర్గాన్ని శాయశక్తులా సంకటంనుంచి బయటవేస్తూ వట్టిమాటలతో కాలక్షేపం చేస్తుంటాడు. గాంధీగారు ఇందులో రెండో రకం. అసలైన అదనులో తన ఉద్యమాన్ని తానే ఆపేసి, ప్రజాప్రతిఘటనను నిష్కారణంగా నీరుగార్చి పాలకుల నెత్తిన పాలుపొయ్యటంలో ఆయనకు ఆయనే సాటి.
గాంధీగారి నిర్వాకంవల్ల దేశానికి, ఉద్యమానికి ఎంత నష్టం వాటిల్లినా నైతికంగా ఆయన చేసిందే కరక్టు అని గాంధీ భక్తులు విసుగులేకుండా వాదించగలరు- ఒక్క పెదనందిపాడు చరిత్రాత్మక పోరాటం విషయంలో తప్ప! సంశయ లాభానికి రవ్వంతయినా ఆస్కారం లేకుండా గాంధీగారు రెడ్ హాండెడ్‌గా దొరికిపోయేది జాతీయోద్యమం మొత్తంమీద ఇక్కడ ఒక్కచోటే. మహామేధావులకే మతులు పోగొట్టిన ‘గాంధీ మిస్టరీ’ తాళాన్ని విడదీయటానికి పెదనందిపాడే తాళంచెవి.
1922 మొదట్లో పెదనందిపాడు ఫిర్కాలో పన్నుల నిరాకరణ సాగిన కాలంలోనే అదే గుంటూరు జిల్లాలో చీరాల పుర బహిష్కరణోద్యమమూ, పల్నాడు పుల్లరి సత్యాగ్రహమూ కొద్ది మాసాల తేడాతో నడిచాయి. అవి కూడా గాంధీ, ఆయన అనుయాయుల సహాయ నిరాకరణవల్లే ఘోర వైఫల్యం చెందాయి. ఆ రెండూ స్థానిక కాంగ్రెసు వాదులు చొరవ తీసుకుని మొదలెట్టినవే తప్ప కాంగ్రెసు పార్టీ పరంగా జరిగిన పోరాటాలు కావు. కాబట్టి వాటి విషయంలో తమ సహాయ నిరాకరణను సమర్ధించుకునేందుకు కాంగ్రెసు పెద్దలకు వీలుంది. పెదనందిపాడు అందుకు భిన్నం. అక్కడ జరిగింది కాంగ్రెసే తలపెట్టి మహాత్ముడి అనుమతితో కాంగ్రెసే నడిపించిన నూటికి నూరుపాళ్ల గాంధీయ ఉద్యమం.
సహాయ నిరాకరణలో భాగంగా పన్నుల నిరాకరణోద్యమం కొన్ని నిబంధనలకు లోబడి చేపట్టటానికి రాష్ట్రాల కాంగ్రెసు కమిటీలకు 1921 డిసెంబరు ఆఖరులో అహమ్మదాబాదు కాంగ్రెసు మహా అధికారం ఇచ్చింది. ఆ ప్రకారమే గుంటూరు జిల్లాలో పన్నుల నిరాకరణోద్యమం సాగించాలని ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెసు అధ్యక్షుడు కొండ వెంకటప్పయ్య, కార్యదర్శి గొల్లపూడి సీతారామశాస్ర్తీ సంకల్పించారు. అహమ్మదాబాదు కాంగ్రెసు మహాసభల సందర్భంలోనే ఆంధ్ర ప్రతినిధులు బసచేసిన శిబిరానికి గాంధీ మహాత్ముడు స్వయంగా వచ్చి ‘‘హిందూ- ముస్లిం ఐక్యత, అంటరానితనం నిర్మూలన, ఖద్దరు ప్రచారం అహింసలో విశ్వాసం తదితర నిబంధనలను ప్రజలు సాధించగలిగిన ప్రాంతాల్లో పన్నుల నిరాకరణ సహా శాసనోల్లంఘన కార్యక్రమాన్ని చేపట్టవచ్చు’’అని చెప్పారు. సాక్షాత్తూ మహాత్ముడే లైన్ క్లియర్ చేశాక ఇంకేమి కావాలి? అహమ్మదాబాద్ కాంగ్రెసు ముగిసిన వారానికే 1922 జనవరి 7న ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెసు కమిటీ బెజవాడలో సమావేశమై, గుంటూరు, గోదావరి, కృష్ణా జిల్లాల్లో పన్నుల నిరాకరణోద్యమం నడపాలని తీర్మానించింది. దాన్ని పురస్కరించుకుని గుంటూరు జిల్లా కాంగ్రెసు కమిటీ పొన్నూరులో సమావేశమై కొన్ని ఫిర్కాల్లో తప్ప గుంటూరు జిల్లా అంతటా పన్నుల నిరాకరణోద్యమం సాగించాలని ఏకగ్రీవంగా నిశ్చయించింది.
జాతీయ కాంగ్రెసు ఆజ్ఞ అయింది. రాష్ట్ర కాంగ్రెసు అనుమతి దొరికింది. జిల్లా కాంగ్రెసు ఆమోదముద్ర వేసింది. అన్నిటికీ మించి గాంధీ మహాత్ముడి ఆశీర్వాదమూ లభించింది. అది ఆధికారిక ముద్రపడిన కాంగ్రెసు ఉద్యమమనడానికి సందేహం ఏముంది? దేశమాత దాస్య శృంఖలాలు తెంచాలని చిరకాలంగా తహతహలాడుతున్న లక్షలాది దేశభక్తులకు అంతకంటే ఏమికావాలి? క్షణం ఆలస్యం చేయకుండా అందరూ రంగంలోకి ఉరికారు. భూమి శిస్తును దాదాపుగా గుంటూరు జిల్లా అంతటా ఎగవేశారు. శిస్తులు వసూలుచేయాల్సిన గ్రామాధికారులు గాడికింద పారేసి సర్కారీ కొలువుకు సలాం కొట్టారు. రెచ్చిపోయిన ప్రభుత్వం ఉద్యమ నాయకులను అరెస్టుచేసి, నిషేధాజ్ఞలు విధించి, దారుణ దమనకాండకు పాల్పడింది. పన్నుల నిరాకరణోద్యమం ఉద్ధృతంగా సాగిన గుంటూరు జిల్లాలో ఉద్యమానికి కేంద్ర బిందువైన పెదనందిపాడు ఫిర్కాలో జనం గోళ్లూడగొట్టి పన్నులు వసూలుచేయటానికి థామస్ రూథర్‌ఫర్డును స్పెషల్ డ్యూటీ మీద పంపారు. అతడు మర ఫిరంగులను తెచ్చి పెదనందిపాడు ఫిర్కాలో మోహరించాడు. పన్నులు కట్టకపోతే ఆ ప్రాంతాన్ని భస్మంచేస్తానని బెదిరించాడు. ఊళ్లమీద, ఇళ్లమీద పడి అడ్డమైన జబర్దస్తీ చేయమని సైనికులను, పోలీసులను ఉసిగొలిపాడు. అరెస్టులూ, లాఠీ చార్జీలూ, అమాయకుల చిత్రహింసలు, ఆస్తుల జప్తులు, భూముల వేలాలు పిచ్చెత్తినట్టు సాగించాడు. రెండేళ్ల తరవాత మన్యంలో అల్లూరి సీతారామరాజు ఉద్యమాన్ని అణచడానికి తాను అనుసరించబోయే దమన నీతినంతటినీ రూథర్‌ఫర్డు పెదనందిపాడు పోరాటంపై ప్రయోగించాడు. అయినా విఫలమయ్యాడు.
గుంటూరు జిల్లాను ఊపేసిన పన్నుల నిరాకరణ పోరాటంలో అన్ని వర్గాల ప్రజలు మనస్పూర్తిగా పాల్గొన్నారు. ‘ఆంధ్రా శివాజీ’గా పేరుపడ్డ పర్వతనేని వీరయ్యచౌదరి మామూలు మట్టిమనుషులతో గట్టి సేనను నిర్మించి అహింసే ఆయుధంగా గొప్ప పోరుసాగించాడు. కొట్టినా తిట్టినా, మొగంమీద ఉమ్మినా, ఎన్ని బాధలుపెట్టినా ఓరిమి కోల్పోక నిశ్చలంగా నిలబడి పోరాడే ధీరత్వాన్ని ప్రజలకు అలవరచాడు. పశుబలం ప్రయోగించి ఎంత రెచ్చగొట్టినా ఎక్కడా ప్రతిహింసకు పాల్పడకుండా అద్భుత సంయమనం చూపి, అహింసా వ్రతానికి దృఢంగా కట్టుబడ్డ ఈ ప్రజాఉద్యమ ఉద్ధృతి బ్రిటిషు సామ్రాజ్య పునాదులనే ఊపేసింది. గుంటూరులో ఉద్ధృతమైన పన్నుల నిరాకరణ సెగ సముద్రాల అవతల బ్రిటిషు పార్లమెంటు సభ్యులనే నిశే్చష్టులను చేసింది. దీన్ని ప్రజా విప్లవంగా గుర్తించి, ఎలాగైనా అణచివెయ్యాలని ఎంతగా చెలరేగినా ప్రజల కృతనిశ్చయాన్ని నీరుగార్చడం రూథర్‌ఫర్డువల్ల కాలేదు. గవర్నరు వల్ల, వైస్రాయివల్ల, ఆఖరికి లండనులోని ఇంపీరియల్ గవర్నమెంటువల్లా కాలేదు. పరాయి ప్రభుత్వానికి ఎన్ని తంటాలు పడ్డా సాధ్యంకాని పనిని మన జాతీయ మహానాయకుడే అవలీలగా సాధించాడు. మహోద్ధృతంగా ధర్మబద్ధంగా నిఖిల ప్రపంచానికి స్ఫూర్తిదాయకంగా సాగిన మహా పోరాటాన్ని గాంధిగారు, పరమానందయ్య శిష్యుల్లాంటి ఆంధ్ర కాంగ్రెసు నాయకులు కలిసి బలవంతంగా చంపేశారు.
తన శిష్యులు తాను చెప్పిన ప్రకారం నడిచి యావద్భారత దృష్టిని ఆకర్షించేలా, అంతర్జాతీయ ఖ్యాతి పొందేలా గొప్ప పోరాటం సాగిస్తున్నందుకు మహాత్మాజీ మురిసి, మరింత శ్రద్ధతీసుకుని, లోటుపాట్లేవైనా ఉంటే సరిదిద్ది ఉద్యమం ఇంకా బాగా నడిచేందుకు సహాయపడతాడని భక్తజనం అమాయకంగా ఆశపెట్టుకున్నారు. అక్కడే పప్పులో కాలేశారు. తానేదో అహ్మదాబాదులో యథాలాపంగా అంటే ఆంధ్రావాళ్లు దాన్ని సీరియస్‌గా పట్టుకుని ఏకంగా పెద్ద ఉద్యమమే మొదలెట్టేస్తారని గాంధీగారు అనుకోలేదు. అంత పనీ జరిగిందని తెలిశాక ఆయన కంగారుపడ్డాడు. ధిక్కారం కొరివి దేశమంతటా అంటుకుని బ్రిటిషు సర్కారుకు కొంపలు ముంచేలోపే ఆంధ్రా అగ్గిని ఎలా ఆర్పెయ్యాలా అని మొదటినుంచీ తెగ ఆరాటపడ్డాడు. గుంటూరు జిల్లాలో పన్నుల నిరాకరణ ఇలా మొదలైందోలేదో అలా రాష్ట్ర కాంగ్రెసు అధ్యక్షునికి (1922 జనవరి 17న) రాసిన జాబులో గాంధి ఇలా అన్నాడు:
. I think you are not ready for non-payment of taxes. Fifty percent of population of the area of experiment has not yet, I apprehend, got rid of untouchability... nor to khaddar... I therefore strongly suggest that you advise the ryots in all the districts to pay up at least the first instalment...''
[Collected Works of Mahatma Gandhi, Vol.25, PP 462-463]
(పన్నుల నిరాకరణ చేసేంథుకు మీరింకా తయారుకాలేదని నేను భావిస్తున్నాను. ప్రయోగం జరుగుతున్న ప్రాంతాల్లో 50 శాతం జనాభా ఇంకా అంటరానితనాన్ని విడనాడినట్టు... ఖద్దరుకు అలవాటుపడినట్టు లేదని నా అనుమానం...కాబట్టి నేను మీకు గట్టిగా చెబుతున్నాను. కనీసం మొదటి కిస్తీ శిస్తులను చెల్లించమని అన్ని జిల్లాల రైతులకు సలహా ఇవ్వండి.)
మూడు జిల్లాల్లో పన్నుల నిరాకరణోద్యమం ప్రారంభించాలని ఆంధ్రా రాష్ట్ర కాంగ్రెసు కమిటీ తీర్మానించి నిండా పది రోజులు కాలేదు. ఫలానా తాలూకాల్లో ఆ ఉద్యమానికి నిబంధనల మేరకు అనువైన పరిస్థితులు ఉన్నాయని గుంటూరు జిల్లా కాంగ్రెసు కమిటీ నిశ్చయించి ఇంకా వారం తిరగలేదు. సంగతి సందర్భాలన్నీ క్షుణ్ణంగా ఎరిగిన రాష్ట్ర, జిల్లా కమిటీలు చేసిన నిర్ణయాలు శుద్ధ తప్పని ఎక్కడో బొంబాయిలో కూచున్న మహాత్ముడు దివ్యదృష్టితో కనిపెట్టాడు. ఆయా జిల్లాల్లో సగం జనాభాకు అస్పృశ్యత జబ్బుపోలేదని, ఖద్దరుపై గురి కుదరలేదని తుది తీర్పు ఇచ్చేశాడు. తన బుద్ధికి అలా తోచింది కాబట్టి అదే కరక్టనీ, తనకు అనుమానం పుట్టింది కనుక ఎక్కడ ఉద్యమాన్ని అక్కడ ఆపేసి సర్కారుకు శిస్తులు కట్టాలనీ ఫర్మానా జారీచేశాడు.
దానిమీద రాష్ట్ర కాంగ్రెసు అధ్యక్షుడు కొండ వెంకటప్పయ్య, ప్రధాన కార్యదర్శి నడింపల్లి లక్ష్మీనరసింహారావు కలిసి తమ అభిప్రాయం సరికాదని విన్నవిస్తూ గాంధీకి టెలిగ్రాం పంపారు. ‘‘బావుల దగ్గర మినహా అస్పృశ్యత తొలిగిపోయింది. నూటికి 60 మంది గ్రామాల్లో ఖద్దరునే ధరిస్తున్నారు... ఇట్టి పరిస్థితుల్లో పన్నులు మళ్లీ కట్టమంటే మా జిల్లాలో ఉద్యమాన్ని తోసిపుచ్చడమే అవుతుంది. పరిస్థితి మరీ ఘోరమవుతుంది.’’ అని అందులో మొత్తుకున్నారు. ఇక చేసేది లేక ‘‘అక్కడి పరిస్థితి మీకే బాగా తెలుస్తుంది. ఢిల్లీ షరతులు నెరవేరాయని మీకు నమ్మకం ఉంటే నాకు జోక్యం చేసుకునే హక్కులేదు. దేవుడు మేలుచేయుగాక అని గాంధీజీ తిరుగు టెలిగ్రాం పంపాడు.
అలాగని- మేలుచేసే అవకాశం దేవుడికి ఇచ్చాడా? కనీసం సంశయలాభమైనా ఇచ్చి తన అనుంగు శిష్యులు నడుపుతున్న ఉద్యమాన్ని కొంతకాలంపాటు దాని దారిన దాన్ని సాఫీగా నడవనిచ్చాడా? లేదు.
‘‘సొంత బాధ్యతపై ఎవరైనా సత్యాగ్రహాన్ని ప్రారంభించ గలిగిన దశకు మనం చేరుకున్నాం. నన్ను అడిగితే తోచిన సలహా చెబుతాను. అంతే తప్ప ముందుగా నన్ను సంప్రదించకుండా ఎవరూ సత్యాగ్రహం మొదలుపెట్టనే కూడదని నేను చెప్పను అలాంటి షరతు పెడితే సత్యాగ్రహం పనికిరాని ఆయుధమయిపోతుంది. నేను ఎన్ని సమస్యలని చూడగలను? ఏ కాలంలోనైనా ఎక్కడైనా సమర్థులైన స్ర్తిలూ పురుషులూ విరివిగా ఉపయోగించుకున్నప్పుడే సత్యాగ్రహానికి సార్థకత’’ అని ‘నవజీవన్’ పత్రికలో 1924 జూన్ 15న గొప్పగా ఉపదేశమిచ్చిన బాపూజీయే తన మాటలు తానే మింగేసి, నిష్కళంక దేశభక్తులు అత్యద్భుతంగా నడుపుతున్న సత్యాగ్రహ పోరాటాన్ని పీక నులిమేందుకు నానా తంటాలు పడ్డాడు. ‘మీ ఇష్టం! నేనేమీ జోక్యం చేసుకోను’అని తిరుగు టెలిగ్రాం ఇచ్చి రెండు వారాలు కూడా కాకుండా 1922 ఫిబ్రవరి 2న ‘యంగ్ ఇండియా’లో గాంధీగారు ఏమి రాశారో చూడండి:
Andhra People are shrewd and I hope they know the art of humility. In spite of the Government provocation, I have every hope that they will be humble enough not to undertake mass civil disobedience... I would certainly be pleased if no other part of India, not excluding Andhra was to try the experiment till the result of mine was definitely known.
[Collected works of Mahatma Gandhi, Vol.26, P.74]
(ఆంథ్రులు తెలివైనవారు. వినయ వంతులు, ప్రభుత్వం రెచ్చకొట్టినప్పటికీ సామూహిక శాసనోల్లంఘనకు పూనుకోకుండా ఉండేంత వినమ్రత వారికి ఉందని నేను ఆశిస్తున్నాను. (్భవిష్యత్తులో ఏదో ఒకనాడు) నేను చేయబోయే ప్రయోగపు ఫలితం కచ్చితంగా తెలిసేంతవరకూ ఆంధ్ర సహా ఇండియాలో వేరే ప్రాంతమూ ఈ ప్రయోగాన్ని చెయ్యకుండా ఉంటే నేనెంతో సంతోషిస్తాను.)
చూశారా, ప్లేటు ఎలా మార్చేశారో! ప్రతి ఉద్యమాన్నీ నేనే స్వయంగా రంగంలో ఉండి నడిపించటం ఎలా కుదురుతుంది? సమర్థులైన కార్యకర్తలు సొంత బాధ్యతపై సత్యాగ్రహాలు మొదలెట్టవచ్చునని చెప్పింది ఈ మహాత్ముడేకదా? మొదలెట్టిన ఉద్యమాన్ని అర్జంటుగా ఆపెయ్యమని మళ్లీ ఈయనే ఆంధ్రుల గొంతుమీద కూచున్నాడు. బార్డోలీలో సత్యాగ్రహం చేస్తా చేస్తా అనడమే తప్ప ఇంకా మొదలుపెట్టనే లేదు. తానెప్పుడో ఏదో ప్రయోగం చేయాలని అనుకుంటున్నాడు కనుక దానికి కాలంకర్మా కలిసొచ్చి మొదలై, దాని ఫలితం వెల్లడయ్యేంతవరకూ అప్పటికే మొదలైన ప్రయోగాలన్నీ మధ్యలోనే ఆపేయాల్సిందేనట! ఇదేమి దౌర్జన్యం?
ఆపితే బాగుంటుందని మాత్రం చెప్పి మహాత్ముడు ఊరుకోలేదు. వారిచేతా వీరిచేతా చెప్పిస్తే పని అయ్యేట్టులేదని గ్రహించాక పతాక సన్నివేశంలో ఆయనే డైరెక్టుగా రంగంలోకి దిగాడు. అదేమిటో కొండ వెంకటప్పయ్య మాటల్లో వినండి:
‘‘జిల్లా కాంగ్రెసు కార్యవర్గము మా ఇంటిలోనే సమావేశమైన సమయముననే మహాత్ములు వ్రాసిన చిన్న కాగితపు ముక్కనొకటి ఎవరో అందిచ్చిరి. అందులో తాము బార్డోలిలో ఉద్యమము ఆ కాలముననే సాగించుచున్నందున గుంటూరు ఉద్యమమెట్లు సాగుచున్నదోయను యోచన సహితము ఎప్పుడును మనస్సును కలతనొందించు చుండును గాన అచ్చట యుద్యమమును ఆపివేయవలసిందని వ్రాయబడి యుండెను. అంత చక్కగ సాగుతున్న ఉద్యమమును బుద్ధిపూర్వకముగ ఆపివేయుట నాకు ఇష్టము లేకపోయెను. అయినను గాంధీగారే తాము చేయు ఉద్యమమునకిది అడ్డము వచ్చుచున్నదను భావము వెలిబుచ్చినపుడు... ఆపివేయక తప్పినది కాదు.
‘‘గాంధీగారియొద్దనుండి ఆ చిన్న కాగితపు ముక్కనెవరు తెచ్చిరో, నాకే వారేల యుత్తరము వ్రాయలేదో నేను విచారించలేదు. వారు రహస్యముగ నుండవలెనని యుద్దేశించి, అట్లు వ్రాసి యుందురని తలంచితిని...’’
స్వీయచరిత్ర, కొండ వెంకటప్పయ్య, పే.297, 298
తెల్లవారిథి సైతాను ప్రభుత్వమనీ, సత్యాగ్రహంతో దాన్ని పారదోలాలనీ కబుర్లు చెప్పే మహాత్ముడే... ఆ సైతాను సర్కారుకు ఆపద వస్తే చక్రం అడ్డంవేసి ఆదుకుంటాడనడానికి ఇంతకంటే దృష్టాంతం ఏమికావాలి? ఏమి చెప్పినా, చేసినా పారదర్శకంగా ఉండవలెను. చాటు పనులు కూడవు అవి లోకానికి నీతులు చెప్పే మహానుభావుడే రహస్యంగా చీటీలు పంపించి, జిల్లా కమిటీ కాళ్లకు అడ్డంపడి, తట్టుకోలేని ఒత్తిడి పెట్టి, చక్కగా నడిచే ప్రజాఉద్యమాన్ని నిలువును పాతెయ్యడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
ఇదిగో ఇటువంటి మహా నాయకుడిని, ఆ నియంత చేతిలో కీలుబొమ్మ అయిన కాంగ్రెసు మహాసంస్థను నమ్ముకునే మనవాళ్లు చక్కగా నడుస్తున్న ఆంధ్రోద్యమాన్ని పక్కనపడేసి కాంగ్రెసు మందలో కలిశారు. *