ఆంధ్రుల కథ - 27

ఎం.వి.ఆర్ శాస్త్రి గారు ఆంధ్ర భూమి ఆదివారం అనుబంధం లో సీరియల్ గా ప్రచురిస్తున్న ఆంధ్రుల కథ యదాతథం గా..

వందేమాతరం (October 24th, 2010)

వందేమాతరం!
ఆ పదం వింటేనే ప్రతి భారతీయుడికీ... కనీసం, భారతీయత మిగిలిన ప్రతి వాడికీ ఒళ్లు పులకరిస్తుంది.
వంగ విభజన కాలంలో ‘వందేమాతరం’ జాతీయ పోరాటానికి గొప్ప ఊపునిచ్చి కొత్త ఊపిరులూదింది. బ్రిటిషిండియా కంటే కొన్ని దశాబ్దాలు లేటుగా నిజాం నిరంకుశ రాజ్యంలో జాతీయోద్యమం రగిలిన కొత్తలోనూ ‘వందేమాతరం’ విద్యార్థి లోకాన్ని కదిలించి, ముందుకు ఉరికించింది. చరిత్రకెక్కిన అపూర్వ పోరాటానికి ప్రాణం, ప్రణవం అయింది. ఆ దివ్యస్ఫూర్తి అలాగే కొనసాగి ఉంటే, యువతలో పెల్లుబికిన ఉద్యమదీక్షను, పోరాట కాంక్షను చేజేతులా భగ్నంచేయడానికి జాతీయ మహానాయకులనబడేవారు పుణ్యంగట్టుకోకుండా ఉంటే చరిత్రగతి మరో విధంగా ఉండేది. ఒక మహోజ్వల ప్రజాసంగ్రామానికి హైదరాబాద్ స్టేటు ఆటపట్టు అయ్యేది.
ఏంచేస్తాం? మొదటినుంచీ- మనం నమ్ముకున్నవాళ్లే మన గొంతుకోసినవాళ్లు!
రాజకీయ కార్యకలాపాలు ఎక్కడా సాగకుండా, రాజకీయ డిమాండ్లు తలెత్తకుండా, ఏ విధంగానూ ప్రజలను సంఘటితం కానియ్యకుండా నిజాం ప్రభువు ఎంత దారుణ దమననీతిని అనుసరిస్తేనేమి... దేశ కాల పరిస్థితుల అనివార్య ప్రభావంవల్ల కొన్ని తరాలు ఆలస్యంగానైనా నైజాంలోనూ అలజడి మొదలైంది. ‘స్టేట్ కాంగ్రెస్’ ఒక చెంప... ఆర్యసమాజ్, హిందూ మహాసభలు ఇంకో వంక విడివిడిగా సత్యాగ్రహాలు సాగిస్తూ, రాజకీయ వాతావరణం చాలా తీవ్రంగా సెగలుకక్కుతున్న సమయాన (1938 చివరిలో) ‘వందేమాతరం’ ఉద్యమానికి తెర లేచింది. అది ఎలా మొదలైంది, ఎలా సాగింది, ఎటు దారితీసింది అన్న దానిపై విభిన్న కథనాలు వినవస్తాయి. ‘వందేమాతరం’ పోరాటాన్ని మతశక్తులు లేవదీశాయని మహామహా జాతి నేతలే ఆరోపించారు. కాంగ్రెసు నాయకుల పాత్రమీద ఆర్య సమాజికులు, హిందూ మహాసభవారు తీవ్రాక్షేపణ తెలిపారు. కాబట్టి ఆ సమయాన ఏమి జరిగిందన్న దానిపై వారూ, వీరూ కాక ఆందోళనతో ఎటువంటి సంబంధంలేని మూడోపక్షంవారు చెప్పేది విందాం. ఆ కాలపు కమ్యూనిస్టు మేధావి దేవులపల్లి వెంకటేశ్వరరావు సుప్రసిద్ధమైన తన ‘‘తెలంగాణా ప్రజల సాయుధ పోరాట చరిత్ర’’లో వందేమాతరం ఆందోళన గురించి రాసింది ఇది:
ఆ కాలంలో ఉస్మానియా యూనివర్సిటీలో మూడు హాస్టళ్లుండేవి... విద్యార్థులకోసం ఒక్కొక్క హాస్టలులో ఒక్కొక్క రూమును (రాత్రివేళ) ప్రార్థనకొరకు ప్రత్యేకించేవారు... ప్రార్థన గది ఒకటున్నదని, అక్కడికి వెళ్లి ప్రార్థన చేయాలని చాలామందికి తెలియదు.
స్టేటు కాంగ్రెసు సత్యాగ్రహ ఉద్యమంతో వచ్చిన ఊపులో ‘‘సి’’హాస్టలు విద్యార్థులు కొందరు ప్రార్థన చేయాలనే ప్రతిపాదన చేశారు. మొదటిరోజున ఇద్దరో ముగ్గురో ఉన్నారు. రెండవనాటికి సంఖ్య పెరిగింది. కొందరు హిందీ పాటలు, మరికొందరు మరాఠీ పాటలు చదివేవారు... నాలుగైదు రోజుల తర్వాత ‘‘వందేమాతరం’’ అనే గేయాన్ని చదివినారు. ఇలా రెండుమూడు రోజులు జరిగింది. ఈలోగా ‘‘ఎ’’, ‘‘బి’’ హాస్టల్ విద్యార్థులకు కబురువెళ్లింది. అంతా చదువటం ప్రారంభించారు... ఇంతలో యూనివర్సిటీ అధికారులకు ఈ సంగతి తెలిసింది. అధికారులు హాస్టళ్లలోని విద్యార్థులను విడివిడిగా పిలిచి, ‘‘ఇది సరైనదికాదు. మీరు మానేయాల’’ని చెప్పారు. దీనితో విద్యార్థుల పట్టుదల హెచ్చింది. ‘‘ఇది ప్రార్థన గది. ఆ గదిలో విద్యార్థులు ఏ పాట పాడితే ఏమిటి? రాముడి మీద, కృష్ణుడి మీద పాడితే మీరు వద్దనరు కదా! వందేమాతరం పాడితే ఎందుకు వద్దనాలి? దీనిపై శాసించడానికి వీల్లేద’’ని విద్యార్థుల వాదన, ఇవి ప్రభుత్వ హాస్టళ్లు, విద్యార్థులు తమ ఇష్టం వచ్చింది పాడుకోవటానికి వీల్లేదని అధికారుల వాదన... ...
విద్యార్థులు పాడేదే ఖాయమని అన్నారు. అధికారులు హెచ్చరిక చేశారు. దీనితో ప్రార్థన గదుల్లో విద్యార్థుల సంఖ్య పెరుగసాగింది. అంతవరకు పాడుబడినట్టుగా ఉండే గదులు విద్యార్థులతో నిండి కళకళలాడినవి. వారి మొహాల్లో ఉత్సాహమేకాక దీక్ష, పట్టుదల కొట్టవచ్చినట్టుగా కన్పించింది... దీనితో అధికారులు గేయాన్ని నిషేధిస్తూ నోటీసులు జారీచేశారు. అయినా విద్యార్థుల సంఖ్య మరికొంత పెరిగి గదులు క్రిక్కిరిసిపోయాయి. అంతా వస్తే గదులు సరిపోయేవి కావు. చివరి రోజున ప్రభుత్వ ఆజ్ఞలను ధిక్కరించి హిందూ, విద్యార్థులంతా వచ్చారు. స్థలం చాలక బయట నిలుచోవలసి వచ్చింది. బిగ్గరగా గొంతెత్తి ‘వందేమాతరం’ పాడారు.
తెల్లవారేవరకు విద్యార్థులను హాస్టళ్లనుంచి వెళ్లగొడుతున్నట్టు ఒక నోటీసును నోటీసుబోర్డుపై పెట్టారు. మధ్యాహ్న భోజనం ఉండదనీ, గదులను ఖాళీచేయాలని స్పష్టంచేశారు. నోటీసును చూసి విద్యార్థులు తమ సామానంతా సర్దేసుకున్నారు. హాస్టళ్లనుంచి ఎక్కడికి వెళ్లాలి? సిటీకి పోదామని అనుకున్నారు. సిటీకి కబురుచేశారు. ఉదయం 8 గంటలవరకు లారీలు రానే వచ్చాయి. సామానును లారీలో నింపారు. ‘‘సామానులు ఎక్కడికీ పోవు. లారీలు జైనమందిరానికి వెళ్తాయి. మీరు అక్కడికి రమ్మని’’ చెప్పి వెళ్లారు.
ముస్లిం విద్యార్థులలో చాలామంది మతతత్వవాదులున్నా అంతా ఒకే విధంగా వ్యవహరించలేదు. కరడుగట్టినవారు అధికారవర్గంతో కలిసి వున్నా ఎవరూ ఘర్షణ పడలేదు. హిందూ విద్యార్థులతో సన్నిహితంగానూ, స్నేహభావంతోనూ ఉండేవారు చాలా బాధపడ్డారు... వారిలో విచారమూ, సమ్మెచేస్తున్న విద్యార్థులలో ఉత్సాహమూ ప్రస్ఫుటమైనవి...
ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్సునుంచి బహిష్కరింపబడిన విద్యార్థులంతా ఊరేగింపుతో వెళ్ళాలని నిర్ణయం. వీరంతా సుమారు వందమందికి మించి ఉంటారు. హాస్టళ్లనుంచి ఊరేగింపు అడిక్‌మెట్, పుత్లీబౌలీ, గౌలిగూడావరకు వెళ్లి అక్కడ ఆగిపోయింది. దారిపొడవునా పోలీసులు ఉన్నా జోక్యం కలిగించుకోలేదు. విద్యార్థులు గౌలీగూడా చేరేవరకు సుమారు 1-2 గంటలు అయింది. కీ.శే. వామన్ నాయక్‌గారి భవనంలో భోజనాల ఏర్పాట్లు చేశారు. భోజనం పూర్తికాగానే అందరూ జైన మందిరం చేరుకున్నారు.
సాయంత్రం బహిరంగ సభ జరిగింది. బహిష్కరింపబడిన విద్యార్థులేకాక ఇతరులు కూడా హాజరయినారు. ఒక కార్యాచరణ కమిటీ ఏర్పడింది. ముందు కర్తవ్యమేమిటి? అనే ప్రశ్న ఉదయించింది. కాలేజీ విద్యార్థులంతా సమ్మెచేయాలని పిలుపుఇచ్చారు. యూనివర్సిటీ కాలేజీ, సిటీ కాలేజీలో ఉండే హిందూ విద్యార్థులంతా సమ్మెలో పాల్గొన్నారు. కొందరు విద్యార్థులు వరంగల్, ఔరంగాబాద్, గుల్బర్గా నగరాలకు వెళ్లి ఆ కాలేజీల విద్యార్థులతో సమ్మె చేయించారు. అంతా విజయవంతంగా సాగింది. మొత్తం 600 మంది విద్యార్థులు బయటకు వచ్చేసారు. జైనమందిరంలో ప్రతిరోజు బహిరంగ సభ జరిగేది.
రోజులు గడిచిపోయాయి. యూనివర్సిటీ అధికారులు ఒకరోజును నిర్ణయించి, ఆనాటివరకు విద్యార్థులు వచ్చి చేరకపోతే వారిని తొలగించి వేస్తామని నోటీసు ఇచ్చారు. ఆనాడు ఎవ్వరూ వెళ్లలేదు. కొంత వ్యవధినిచ్చి తొలగించారు. అయినా సమ్మె మాత్రం నూటికి నూరుపాళ్లు విజయవంతమయింది. తర్వాత ఏంచేయాలనే సమస్య విద్యార్థుల ముందుకి వచ్చింది. ఎవరి జిల్లాలకు వారు వెళ్లి విద్యార్థులతో స్కూళ్లలో సమ్మెలు చేయించాలనీ, గ్రామాలకు వెళ్లి రైతులలో ప్రచారం చేసి వాళ్లందరినీ పన్నులు కట్టకుండా చేయాలనే ఆలోచనలు విద్యార్థులలో కలిగినవి... ఉద్యమం స్కూళ్లస్థాయికి వెళ్లగూడదని, ప్రజా ఉద్యమ స్వరూపం తీసుకోకూడదని రాజభక్తి పరాయణుడైన రాజబహద్దూరు వేంకట రామారెడ్డిగారు ప్రయత్నించి కొంతవరకు సఫలులైనారు.
విద్యార్థుల ప్రతినిధివర్గమొకటి దేశంలోని యూనివర్సిటీలకు వెళ్లి ప్రవేశమిప్పించమని అడిగారు. తెలుగువారిదైన ఆంధ్రా యూనివర్సిటీ అడ్మిషన్ ఇస్తుందనే భ్రమలతో వెళ్లారక్కడికి. కట్టమంచి రామలింగారెడ్డిగారు దానికి వైస్ చాన్స్‌లర్. ఆంధ్రా యూనివర్సిటీలో ‘‘మీకు అడ్మిషన్ దొరకదని’’ చెప్పారు. నిజాం నవాబు ఆంధ్రా యూనివర్సిటీకి సంవత్సరానికి రెండు లక్షల రూపాయల విరాళం ఇస్తున్నాడని, ఆ కారణంవల్లనే ఆయన అడ్మిషన్లు ఇవ్వనిరాకరించాడని తర్వాత తెలిసింది. నిజాం ప్రభుత్వానికి కట్టమంచి వారికి మంచి సంబంధాలున్నాయని కూడా తెలిసింది.
అక్కడినుంచి బెనారసు యూనివర్సిటీకెళ్లారు. సర్వేపల్లి రాధాకృష్ణన్‌గారు దానికి వైస్ చాన్సలర్. అది హిందూ యూనివర్సిటీ. దాని గురించి ఎన్నో గొప్పలు చెప్పేవారు. అక్కడైనా ప్రవేశం దొరుకుతుందని ఆశ ఉండేది. కాని వారు కూడా ‘లేద’న్నారు. నిజాం ప్రభుత్వం ఆ యూనివర్సిటీకి కూడా ప్రతి సంవత్సరమూ రెండు లక్షల రూపాయల విరాళం ఇస్తున్నదని తెలిసింది... తాము చేసే సమ్మె దేశభక్తియుతమైన, అఖిల భారత ప్రాధాన్యత కలిగిన గొప్ప పోరాటం కదా! తమను గుర్తించేవారు ఎవరూ లేరే అనే సందేహం వచ్చింది విద్యార్థులకు. తక్కిన యూనివర్సిటీలన్నీ వరుసగా తిరిగి వచ్చినారు. అంతా ‘మాకు సాధ్యంకాదంటే మాకు సాధ్యం కాద’ని చెప్పేశారు.
నిరుత్సాహంతో తిరిగి వస్తూ నాగ్‌పూర్‌లో ఆగి అక్కడి వైస్ చాన్సలర్‌ను కలుసుకున్నారు. ఆయన పేరు కేదార్. ప్రతినిధులు చెప్పినమాట సావధానంగా విని ఆయన ‘‘మీరు వచ్చి అడ్మిషన్ కావాలంటే ఎక్కడినుంచి వస్తుంది? నాకూ ఇవ్వాలనే ఉంది. ‘వందేమాతరం’ గేయంకోసం మీరు సమ్మెచేసి త్యాగం చేశారు. మిమ్మల్ని గౌరవించవలసిందే. కానీ ఇక్కడ యూనివర్సిటీ సెనేట్, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాయి. తమకు తాముగా మీకు అడ్మిషన్ ఇవ్వడానికి వారు అంగీకరించరు. అందువలన ముందు మీరు ఇక్కడికి వచ్చేసేయండి. వచ్చి బజారున పడితే (ఊరేగింపులు మొదలగు ఆందోళనలు) నేను ఒత్తిడి చేసి సెనేట్‌ను, ఇతర యూనివర్సిటీ అధికార వర్గాన్ని ఒప్పించి అడ్మిషన్ సంపాదిస్తాను. ఖర్చులకు డబ్బు కావలిస్తే ‘నేను ఇల్లిల్లు తిరిగి సమకూరుస్తాను’అని అన్నాడు. ప్రతినిధి వర్గం హైదరాబాదు తిరిగి వచ్చి బహిరంగ సభలో ఈ విషయం చెప్పారు. అందరూ వెళ్లడానికి నిర్ణయించుకున్నారు.
నాగపూర్‌లో రైలు దిగిన తర్వాత ఊరేగింపుగా వెళ్లారు. అక్కడ ఉండటానికి తాత్కాలికమైన ఏర్పాట్లుచేశారు. తర్వాత స్థిరమైన ఏర్పాట్లుచేశారు. అడ్మిషన్లకొరకు ప్రయత్నాలు ప్రారంభమైనాయి. సెనేట్ సమావేశాలు జరిగాయి. ఆ సందర్భంలో వైస్-్ఛన్సలర్ వారించడం, ఇతరులు కాదనడం, ప్రభుత్వం జోక్యం కలిగించుకోవడం, విద్యార్థులు ఊరేగింపులు తీయడం, బహిరంగ సభలు జరగటం- ఇదంతా రెండుమూడు నెలలపాటు జరిగిన పిమ్మట అడ్మిషన్లు ఇవ్వటానికి అంగీకరించారు. సైన్సు విద్యార్థులంతా నాగపూర్‌లో, ఆర్ట్స్ విద్యార్థులు జబల్‌పూర్‌లో చదివినారు.
ఈ సందర్భంలో జరిగిన రెండుమూడు ఘటనలు:
విద్యార్థులంతా నాగపూర్‌లో ఉన్న మొదటిరోజుల్లో గాంధీ గారిని, వారి ఆశ్రమాన్ని చూసి రావాలని విద్యార్థులు అనుకున్నారు. లారీలను ఏర్పాటుచేసుకుని సేవాగ్రామ్‌కి వెళ్లారు. ఇంటర్వ్యూ సమయం 5 నిమిషాలు మాత్రమే. సాయంత్రం వేళ. ఆయన రాగానే అంతా నిశ్శబ్దంగా ఉన్నారు. గాంధీగారే మాట్లాడటానికి ముందు చొరవ తీసుకున్నారు. నివాస, భోజన వసతులు ఎలా ఉన్నాయని ప్రశ్నించారు. చదువులు పూర్తిచేసుకుని ఇళ్ళకు తిరిగి వెళ్ళిన తర్వాత ఏంచేస్తారని ప్రశ్నించారు. కొందరు ప్రజాసేవ చేస్తామని, మరికొందరు హరిజన సేవ చేస్తామని చెప్పారు. కాంగ్రెసులో పనిచేస్తామని ఇంకొందరు అన్నారు. తర్వాత ఒకరు లేచి ‘వందేమాతరం సమస్యమీద సమ్మెచేసి వచ్చాం. ఇది ఎలా పరిష్కారమవుతుంది? ఎప్పుడు పరిష్కారమవుతుంది’ అని అడిగారు. ‘బహుత్ కఠిన్ సమస్యా హై’అన్నాడాయన. ‘ఇది చాలా క్లిష్టమైన సమస్య, అంత తేలికగా పరిష్కారంకాద’ని చెప్పేశాడు. ‘ఇక వెళ్ళిపొండి’ అని 5 నిమిషాల సమయం పూర్తికాగానే వెళ్లిపోయారు. దీని ఫలితంగా వారిలో వివిధ ఆలోచనలు బయలుదేరినవి. ‘వందేమాతరం’లాంటి చిన్న సమస్యను కూడా ఈయన ఇంత క్లిష్టమైన సమస్య అంటాడే, ఇది పరిష్కారం కావడం చాలా కష్టం అంటున్నాడే, పరిష్కారం కాదా?’ అని కొంతమందిలో అనుమానమేర్పడినది. ఇంత పెద్ద నాయకుడు ఈయన ఈ రకంగా చెప్తున్నాడేమిటి అని మరొక ఆలోచన. ...
సరోజినీదేవి జబల్పూరు పర్యటన సందర్భంలో ఆమెను విద్యార్థులు ఆహ్వానించారు. ఆమె జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలపై ఉపన్యసించింది. ఒక విద్యార్థి- ‘‘హైదరాబాదులో మేము ‘వందేమాతరం’ సమస్యపై సమ్మెచేసి ఇక్కడికి వచ్చాం. మాకోసం మీరు ఏం చేస్తున్నారు?’’ అని అడిగినాడు. దానికామె ఏ సమాధానమూ ఇవ్వలేదు. దీనితో విద్యార్థుల్లో ఆమెపై వ్యతిరేకత వచ్చింది. ఈమె హైదరాబాదు నివాసి. నిజాం ప్రభుత్వం ఈమెను హైదరాబాదు రాకుండా నిషేధించింది. ఈ సమస్య విషయమై ఆమె ఇంత నిస్సహాయంగా ఉన్నదేమిటీ అనే అనుమానం కలిగింది.
త్రిపుర మహాసభలో కాంగ్రెసు అధ్యక్షుడుగా కొత్తగా ఎన్నికైన సుభాష్‌చంద్రబోస్ వచ్చాడు. మామూలుగా మాట్లాడాడు. ఈ సమస్యపై ఆయన కల్పించుకోలేదు.
నాగపూర్‌లో ఉన్న సమయాన బి.ఎన్.ముఖర్జీ అను ఒక కమ్యూనిస్టు నాయకుడు కొందరు విద్యార్థులను మాత్రం కలిసివెళ్లాడు. వారితో సంబంధాలు పెట్టుకోవడానికి కృషిచేయలేదు.
విద్యార్థులు పరీక్షలు పూర్తిచేసుకుని ఇళ్లకు చేరుకున్నారు. రాతపూర్వకంగా క్షమాపణ చెప్పిన వారందరినీ క్లాసులలో చేర్చుకుంటామని యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. హెచ్చుమంది, క్షమాపణ ఇచ్చి చేరారు. కొద్దిమంది మాత్రం నాగపూర్‌లోనే తమతమ చదువులను కొనసాగించారు. కొందరు ఉద్యోగాలు చూసుకున్నారు.
ఈ విధంగా సమ్మెచేసిన విద్యార్థులంతా ఎలాంటి పరిష్కారం లేకనే తిరిగి కాలేజీల్లో చేరిపోయారు. తర్వాత ‘వందేమాతరం’ సమస్యను లేవదీసిన వారే లేరు.
తెలంగాణా ప్రజల సాయుధ పోరాట చరిత్ర,
దేవులపల్లి వెంకటేశ్వరరావు, మొదటి భాగము, పే.178-187
*