ఆంధ్రుల కథ - 42

ఎం.వి.ఆర్ శాస్త్రి గారు ఆంధ్ర భూమి ఆదివారం అనుబంధం లో సీరియల్ గా ప్రచురిస్తున్న ఆంధ్రుల కథ యదాతథం గా..

మద్రాసు మనదే --(February 13th, 2011)

‘‘ప్రస్తుతం మద్రాసు నగర విషయంలో వివాదం చెలరేగుతున్నది గనుక అప్రతిహతమైన సాక్ష్యాధారాలతోను, లెక్కలతోను మద్రాసు తెలుగు నగరమనీ, తెలుగు జిల్లాలలో ఒకటిగా పరిగణింపబడవలసిందేననీ ఇక్కడ రుజువు చేస్తాను.
నగరం వెలిసినటువంటి స్థలం తెలుగువాడైన చంద్రగిరి రాజుది. ఆరాజు పేరు మాదిరాజు. అతని పేరు మీదుగానే ఈ నగరానికి మొదట మాదిరాజు పట్టణం అని పేరు వచ్చింది. తరువాత క్రమంగా అది మాదిరాస్ అయి చివరికి మద్రాస్ అయింది.
ఫోర్ట్ సెంట్ జార్జికి పునాదులను ఈస్ట్ ఇండియా కంపెనీవారు వేయలేదు. ఆ పునాది వేసినవాడు కరణం రాఘవబత్తుడు... మచిలీపట్టణంలో వ్యాపారం మందగించిన తర్వాత ఇంగ్లీషు వారు కూడా ఈ ప్రాంతానికి వచ్చి, ఇక్కడ ఫ్యాక్టరీలు వగైరాలు కట్టుకుని వ్యాపారం సాగించుకోదలిచారు. రాఘవబత్తుణ్ణి పట్టుకొని అతని ద్వారా చంద్రగిరిరాజు దగ్గిరనుంచి ఈ భూభాగాన్ని సంపాదించటంలో కృతకృత్యులయ్యారు. ఎంతో శ్రమపడి కరణం రాఘవబత్తుడు సాలీనా 1200 పగోడాల అద్దె ఇచ్చే షరతుమీద ఈ ప్రదేశాన్ని కంపెనీవారికి సంపాదించిపెట్టాడు. ఆ కౌలు తెలుగు భాషలోనే వ్రాయబడి ఉంది.
1687లో తామస్ బేరీ వ్రాసిన ‘బంగాళాఖాత ప్రాంత దేశాలు’ అనే గ్రంథంలో బంగాళాఖాత సముద్ర తీరాన నివసించే దేశీయులలో ఎక్కువమంది ‘జెంటూస్’ (తెలుగువారు) అని వ్రాశాడు.
ఈస్ట్ ఇండియా కంపెనీకీయబడిన ‘రాయల్ చార్టర్’ ద్వారా మద్రాసు కార్పొరేషన్ ముగ్గురు ఆల్డర్‌మెన్‌తో స్థాపించబడింది. ఆ ముగ్గురు 1. చిన్న వెంకటాద్రి 2. మాడ వీరన్న 3. అలంగత పిళ్లె. ఆనాటి దేశీయ వర్తకులలో ఈ ముగ్గురూ ప్రముఖులు. ముగ్గురూ తెలుగువారే. 1690 ప్రాంతంలో ఒక భారతీయుడూ, ముగ్గురు ఆంగ్లేయులూ న్యాయాధిపతులుగా ఒక న్యాయస్థానాన్ని స్థాపించారు. ఆ భారతీయ న్యాయాధిపతి ‘జెంటు’ (తెలుగువాడు.) ఈ విధంగా మద్రాసు కార్పొరేషనూ, న్యాయస్థానం కూడా తెలుగు సభ్యులతోనే స్థాపించబడినవి.
మద్రాసు ప్రజలు ‘జెంటూసే’ అనటానికి మరొక సాక్ష్యం కూడా ఉంది. 1673 జూలైలో మద్రాసును సందర్శించిన జాన్ ప్రయర్ తాను వ్రాసిన ‘ప్రాచ్య భారతము- పర్షియా’ అనే గ్రంథంలో ‘‘మద్రాసు ప్రజలూ, వర్తకులూ జెంటూస్’’ అని స్పష్టముగా వ్రాశాడు.
మూడు ఏక కేంద్ర వృత్తాలు గీయబడిన ఒక గుండ్రని సీలు ఈ రోజులలో వాడుకలో ఉండేది. ఈ సీలులోని పై వృత్తంలో ‘‘మద్రాసులోని కంపెనీ వర్తకులు’’ అని ఆంగ్లంలో ఉంది. లోపలి వృత్తంలో ‘‘చెన్నపట్నం కంపెనీ వర్తకులు’’అని తెలుగులో ఉంది. తమిళ భాష ఈ సీలులో లేనే లేదు. ఆ రోజులలో పన్నులను విధించే ప్రతిపాదనలు జెంటూ భాషలోనే జారీచేయబడేవి.
తెలుగు విలేఖకుడైన కరణం రాఘవబత్తునిచేత పునాది వేయబడిన ఫోర్ట్ సెంట్‌జార్జ్ క్రమంగా విస్తృతి చెంది, హైదరాలీ, టిప్పుసుల్తాన్‌లకు, ఫ్రెంచివారికి దండయాత్ర లక్ష్యంగా పరిణమించింది. 1799లో టిప్పు చనిపోయిన అనంతరమే మద్రాసు నగరవాసులకు నిరంతర భయాందోళనలనుండి విముక్తి ఏర్పడింది. ఈ కాలమందరూ మద్రాసులో ప్రధానంగా తెలుగువారే నివసిస్తూ ఉండేవారు.
1840 ప్రాంతంలో ఆధునిక విద్యాసంస్థలు స్థాపించబడినవి. ముత్యాలపేట అనేది తెలుగు పేరు. ముత్యాలవారి ఇంటి పేరిట ఆ పేటకాపేరు వచ్చింది. ఒకవంక ముత్యాలవారి కుటుంబం, వేరొక వంక రత్నాలవారి కుటుంబం ఆనాటి సంపన్న వర్తక కుటుంబాలుగా ఉండేవి. మద్రాసులో చాలా ప్రాంతాలు ఈ రెండు కుటుంబాలకూ చెంది ఉండేవి. ఈ కాలంలోనే ఈస్ట్ ఇండియా కంపెనీవారు స్థాపించిన ఆంగ్ల కళాశాలలుగాక, తెలుగు వర్తక ప్రముఖుడైన పచ్చయప్ప 1842లో తన పేరిట పచ్చయప్ప కళాశాల స్థాపించాడు.
1819-1835 మధ్య సుప్రీమ్‌కోర్టులో ఇంగ్లీషుకు తెలుగు తర్జుమా చెప్పే ప్రధాన అనువాదకుడుగా ఏనుగు వీరాస్వామి అనే ఆయన పనిచేశాడు. అతడు వ్రాసిన ‘కాశీయాత్ర’అనే పుస్తకంలో ఈ నగరం పేరు ‘మాదిరాస్’ అని పేర్కొన్నాడు. ఆదిలో ఇక్కడి పెద్ద వర్తకులుగా ఉండిన వారంతా వైశ్యులో, నాయుళ్ళో, సాలెవారో అయి ఉండేవారు. అట్టి కుటుంబాలలో ముఖ్యంగా వైశ్యులలో కొల్లావారినీ, నాయుళ్లలో రత్నాల వారినీ, సెట్టిబలిజలలో ముత్యాలవారినీ పేర్కొనవచ్చు.
............
............
ఇంచుమించు 400 సంవత్సరములనుంచీ మద్రాసు నగరం పూర్తిగా తెలుగు నగరంగానే ఉందనీ, తిరువళిక్కేళి, మైలాపూరులైనా ఆదిలో తెలుగురాజుల పాలన కిందనే ఉండి, తెలుగువారే ఎక్కువగా నివసించే ప్రాంతాలుగా ఉండేవనీ ఇప్పటికి రుజువైనది గనుక తమిళులకు మద్రాసు నగరంమీద వీసమైనా హక్కులేదని మనం ఘంటాపథంగా చెప్పవచ్చును. ఇక చెంగల్పట్టు జిల్లాకు చెందిన మద్రాసు నగర పరిసర గ్రామాలలోని జనాభాను తాలూకా వారీగా పరిశీలిస్తే-
పొనే్నరి తాలూకా 400 గ్రామాలలో 300 గ్రామాలలో తెలుగువారున్నారు. అందులో 117 గ్రామాలలో సగంకంటే ఎక్కువ ఉన్నారు. తిరువళ్లూరు తాలూకాలో 334కీ 114 గ్రామాలలో, శ్రీ పెరంబుదూరు తాలూకాలో 246కీ 114 గ్రామాలలో, కాంచీపురం తాలూకాలో 300కీ 32 గ్రామాల్లో సగంకంటే ఎక్కువమంది తెలుగువారున్నారు. నిజానికి కాంచీపురము ఆంధ్ర రాష్ట్రానికి దక్షిణపు సరిహద్దు కావలసి ఉన్నది. ఈనాటికీ కంచి తెలుగు పట్టణమే.
ఒక సక్రమ పద్ధతిలో జనాభా లెక్కలు సేకరించే విధానం అమలులోకి వచ్చాక 1891లో సేకరించిన జనాభా లెక్కల ప్రకారం మద్రాసు నగర జన సంఖ్య 4,52,518. వీరిలో ముప్పాతిక మూడువీసాలు తెలుగువారే. తమిళులు అత్యల్పసంఖ్యాకులు మాత్రమే ఉన్నారు.
నేను స్వయంగా మద్రాసు నగరాన్ని 1892నుంచీ ఎరుగుదును. బ్లాక్‌టౌన్ లేక జార్జిటౌన్ అని ప్రసిద్ధిచెందిన మద్రాసు ప్రధాన నగరంలో వీధివీధీ నేనెరుగుదును. ఆనాడు ఎక్కువ భాగం ఇళ్లు తెలుగువారి ఇళ్లే; ఎక్కువమంది పౌరులు తెలుగువారే.
.... .... .... ....
పై వివరాల దృష్ట్యా, వ్యతిరేకంగా తగినన్ని సాక్ష్యాధారాలు దొరికేవరకూ 1891నాటి సుమారు 5 లక్షల మంది మద్రాసు పౌరులున్ను తెలుగువారేనని విశ్వసింపవలసి ఉంటుంది. అ తరవాతి సంవత్సరాలలోను కూడా ఆంధ్రుల సంఖ్య పెరుగుతూనే ఉండి ఉండాలి. వాస్తవ పరిస్థితులీవిధంగా ఉండగా 1931 జనాభా లెక్కలననుసరించి 4,11,828 మంది తమిళులకూ 1,24,649 మంది మాత్రమే తెలుగువారున్నారనీ, అందుచేత మద్రాసు తమిళులదనీ వాదిస్తూ ఉండటం చిత్రంగా ఉన్నది. ఆంధ్ర హరిజనులూ, షెడ్యూల్డ్ తరగతులవారూ కలిసే మొత్తం లక్ష మందిపైగా ఉన్నారు. ఆంధ్రులు నగరంలో 1,24,649 మంది మాత్రమేనని చూపిన యుక్తులు సక్రమమైనవి కావు.
‘సైమన్ కమిషన్ బోయ్‌కాట్’ ఉద్యమం సందర్భంలో ఆ ఏడు జనాభా లెక్కల స్వీకరణ కార్యక్రమం కూడా బోయ్‌కాట్ చేయబడింది. లెక్కల స్వీకరణకు ఆంధ్రులు నియుక్తులు కాలేదు. తాము పనిచేస్తామని ముందుకువచ్చిన ఆంధ్రుల ప్రార్థనలు నిరాకరించబడినవి. పరిశుద్ధమైన పట్టికలు తయారుకాలేదు. మేమానాడే జనాభా లెక్కలు తప్పుల తడకలని నిరాకరించాము.
1670లో మద్రాసు జనాభా 40,000 అని అంచనా. 1774సరికి ఈ జనాభా 2,50,000కు పెరిగింది. ఈ 104 ఏళ్లలోను విజయనగర సామ్రాజ్యానికి కేంద్రస్థానమైన దత్త మండలాలనుంచీ, నెల్లూరు, గుంటూరు, తూర్పు, పశ్చిమగోదావరులు, విశాఖ మొదలగు సర్కారు జిల్లాలనుంచీ ధనము, పలుకుబడిగల ఆంధ్రులందరు- వైశ్య, నాయుడు మొదలయిన పలు తెగల వర్తకులు మద్రాసు చేరుకున్నారు. ఇంచుమించు ఇక్కడి అన్ని వీధులనూ వారే నిర్మించారు. ఆ వీధులకు ప్రముఖ నాయకుల పేళ్లు పెట్టారు. ఇంగ్లీషువారు మద్రాసు రావటానికి పూర్వం మచిలీపట్నంలోను, విశాఖపట్నంలోను ఫాక్టరీలు నిర్మించుకొని తమ వ్యాపారం సాగించి ఉన్నందువల్ల అక్కడ చిరకాలంగా వారితో సన్నిహిత పరిచయం కలిగి ఉండిన ఆ ప్రాంతాల తెలుగు వర్తకులే, వివిధ వర్గాలవారు, ఇంగ్లీషు వారితోబాటుగా ఇక్కడకు వచ్చి ఈ మహానగరాన్ని నిర్మించారు. 1774-75 సంవత్సరములలో మద్రాసు ఆవాసులుగా పేర్కొనబడిన 2,50,000 మందీ ఆ విధంగా వచ్చి చేరిన తెలుగు వర్తకులే. ఈ 2 లక్షల 50వేల మందే ఇతోధికంగా పెరిగిపెరిగి 1891 జనాభా లెక్కల స్వీకరణనాటికి 4 లక్షలయినారు.
ఇటువంటి పరిస్థితులలో మద్రాసులోని తెలుగు జనాభా హఠాత్తుగా హరించుకుపోయి 1931 జనాభా లెక్కల నాటికి 1,24,000కు తగ్గిపోవటం ఏ విధంగా సంభవం? ఆనాటి మద్రాసు పౌరుల వారసులూ, వారి ఇళ్ళూ ఈనాటికీ నిలిచి ఉన్నవి. మదరాసులోని తెలుగువారిని సక్రమంగా లెక్కించవలెనంటే ఆదినుంచీ ఇక్కడ స్థిరపడిన వివిధ వర్ణాలవారీగా అట్టి లెక్కలు తీసుకోవాలి. సాలెవృత్తిచేసే ఒక్క దేవాంగ వర్ణస్థులే తండయార్‌పేటలోని తిరువొత్తియూరు హైరోడ్డు ప్రాంతమంతటా వ్యాపించి, మద్రాసు ఏర్పడిన నాటినుండీ శతాబ్దాల తరుబడి అక్కడ జీవిస్తున్నారు. వారి వర్ణం వారొక్కరే లక్షమంది దాకా ఉంటారు. వడ్డె కులస్థులు ఒక ప్రత్యేక ప్రాంతమందు నివసిస్తున్నారు. వారిళ్లన్నీ ఒకేచోట కలసి ఉన్నవి. వారి సంఖ్యకూడా పెద్దదే. ఇక రజకులు. వీరొక ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. వీరి సంఖ్యకూడా పెద్దదే.
ఏ దృక్కోణమునుంచి చూడండి- 1931 జనాభా లెక్కలలో నగరములోని తెలుగుల సంఖ్యను 1,24,000 అని చూపించటము శుద్ధ అసందర్భముగా కనిపించక మానదు. ఈ లెక్కలు వట్టి తప్పుల తడికెలనటానికి బోలెడన్ని సాక్ష్యాధారాలున్నవి. 1941నాటి జనాభా లెక్కలే నగరములో తెలుగు జనాభా 1,24,000కంటే మూడురెట్లెక్కువ ఉన్నదని రుజువు చేసినవి.
తాము అధిక సంఖ్యాకులుగా ఉండటమువలన మద్రాసు తమకే రావాలని తమిళులు భావిస్తున్నారు. సరియైన పద్ధతిలో జనాభా లెక్కలు సేకరిస్తే- ఆదినుంచీ ఇక్కడ ఉంటున్న తెలుగువారి సంఖ్యకూ, ఇటీవల వచ్చి చేరి, తాత్కాలికంగా ఇక్కడ నిలిచి ఉన్న తమిళుల సంఖ్యకూ ఎక్కడా పోలికే లేదని స్పష్టమవుతుంది.
నా 55 ఏళ్ళ ప్రత్యక్షానుభవాన్నీ పురస్కరించుకుని నగరం ఏ విధంగా అభివృద్ధి చెందినదీ వివరిస్తాను. సౌత్ ఇండియన్ రైల్వే స్థాపించటంలో దక్షిణాదిని ఉన్న తమిళులకు మద్రాసు నగర ద్వారాలు తెరిచినట్లయినవి. రైలుమార్గాల ద్వారానే తమిళులు మద్రాసుకు రావటము, ప్రధాన నగరాన్ని తెలుగువారికే వదిలి, పరిసర గ్రామాలలో స్థిరపడటము జరిగినది. ... ఆదిలో మద్రాసువచ్చిన గుజరాతీలు వేషభాషలలోను, ఇతర ఆచారములలోను తెలుగువారిని అనుసరించి పూర్తిగా తెలుగువారితో కలసిపోయారు. అనేకులు ఇతరులు కూడా ఇదే విధంగా తెలుగువారితో పొత్తుకలుపుకొన్నారు.
దక్షిణపు జిల్లాలలో కాలేజీలనేకంగా వెలసినా, ఆంధ్ర ప్రాంతంలో మాత్రం చాలాకాలంవరకు రాజమహేంద్రవరం సెంట్రల్ కాలేజీ ఒక్కటే ఉండేది. ఆంధ్ర ప్రాంతంలోని మిగిలిన కాలేజీలన్నీ ఇటీవల పుట్టినవే. తమిళ యువకులకు విద్యాభ్యాసావకాశం ఎక్కువగా లభించుటవలన లాయర్లు, ప్రొఫెసర్లు వారిలోనుండి ఎక్కువమంది తయారైనారు. తమిళ లాయరులెందరో మద్రాసు హైకోర్టు ప్రాక్టీసులో ప్రసిద్ధిపొందారు. వీరందరూ మైలాపూరులో స్థిరపడ్డారు. ఈ లాయర్లతోబాటు ఇతర తమిళులు కూడా అనేకులు నగరం చేరుకున్నారు. తమిళులే లా కాలేజీలలో ప్రొఫెసర్లుగా కూడా ఉండేవారు. 1892-93 సంవత్సరములలో వారివద్ద చదువుకొన్న విద్యార్థులలో నేనొకడను. నేను బారిస్టరు పట్టం పొంది మద్రాసు హైకోర్టులో 1907లో ప్రాక్టీసు ఆరంభించేటంతవరకూ ఆంధ్రా, తమిళ, కన్నడ, మలయాళ ప్రాంతాలనుంచి వచ్చే ప్రాక్టీసంతా తమిళ లాయర్ల ఆధీనంలోనే ఉండేది. నేనిక్కడ ప్రాక్టీసుపెట్టిన రెండేళ్లలో, ఆంధ్ర ప్రాంతపు ప్రాక్టీసంతా నా చేతులలోకీ, నా సహాధ్యాయ నారాయణమూర్తి చేతులలోకీ వచ్చేసింది.
మద్రాసు కార్పొరేషను 1688లో వ్యవస్థాపితమైంది. మొదట్లో ఒక మేయరు, ముగ్గురు ఆల్డర్మెన్నూ ఉండేవారు ఆనాటి ఆల్డర్మెన్ ముగ్గురూ తెలుగువారే. ఎన్నిక అయి అధికారంలోకి వచ్చిన మొదటి అధ్యక్షుడు సాలె వర్ణస్థుడు, సుప్రసిద్ధ నాయకుడు అయిన సర్ పి.టి.త్యాగరాయశెట్టి. ఆయన అనంతరం కూడా ఎవరో ముగ్గురు నలుగురు తప్ప అధ్యక్షులందరూ తెలుగువారే. ‘అధ్యక్ష పదవి’ మేయర్ పదవిగా మార్పుచెందిన తరువాత కూడా ఎక్కువమంది మేయర్లు తెలుగువారే. కమీషనరు ఉద్యోగం ఏర్పాటైన తరువాత తెలుగువారే ఎక్కువమంది కమిషనరులుగా నియమితులైనారు.
నగరంలోని ప్రముఖ భవనములలో ఒకటైన విక్టోరియా పబ్లిక్ హాలును విశాఖ జిల్లాలోని విజయనగర మహారాజగారు దానం చేశారు. నగరంలోని వివిధ వీధులలో ధర్మశాలలు, లేక సత్రములు తెలుగువారిచే స్థాపితమై ఈరోజువరకు నడుస్తున్నవి ఎన్నో ఉన్నవి.
ఈ విధంగా- మద్రాసు నగరం నిలిచి ఉన్న నేల తెలుగురాజుచే ఆంగ్ల వర్తకులకు కౌలుకీయబడింది. అందుచేత నేడు ఫోర్డ్‌సెంట్ జార్జ్ నిలచి ఉన్న స్థలం తెలుగువారిది. ఈ నగరంలోని వీధులు, భవనములు, కార్యాలయాలు అన్నీ తెలుగువారు నిర్మించారు. పైనుంచి క్రిందివరకూ హార్బరంతా పూర్తిగా తెలుగువారి చేతులలోనే ఉండేది. గత 30 సంవత్సరములలో మద్రాసు నగరంలో స్వాతంత్య్రోద్యమాలన్నీ పురజనుల ధన, ద్రవ్య సాహాయ్యముతో తెలుగు నాయకుల చేతనే నడపబడినవి. ఈ వివరాల దృష్ట్యా మద్రాసు నగరంమీద తమిళులకు లవలేశమైనా హక్కులేదని విస్పష్టమవుతున్నది.’’
ఆంధ్రరాష్ట్ర విభజన, టంగుటూరి ప్రకాశం, 1952