ఆంధ్రుల కథ - 58B

ఎం.వి.ఆర్ శాస్త్రి గారు ఆంధ్ర భూమి ఆదివారం అనుబంధం లో సీరియల్ గా ప్రచురిస్తున్న ఆంధ్రుల కథ యదాతథం గా..

ముఖ్యమంత్రి పిల్లిమొగ్గ (June 5th, 2011)

ప్రియమైన ధేబర్‌భాయ్
ఇప్పుడు నేను రాస్తున్నది మధ్యంతర నివేదిక. శ్రీ భార్గవ రేపు ఢిల్లీకి బయలుదేరుతున్నారు. మరీ ఆలస్యం కాకముందే మీకు ఈ సంగతి రాద్దామనిపించింది.
ముఖ్యమైన ఈ సమస్యమీద తెలంగాణలో పెద్ద ఆందోళన ఉంది. నగరాలకే పరిమితంకాకుండా అది రాష్టమ్రంతటా వ్యాపించి ఉంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండాలనే మెజారిటీ ప్రజలు కోరుకుంటున్నారు.
‘విశాలాంధ్ర’కు అనుకూలమైన వర్గమూ బలంగానే ఉన్నది. కాని ఎస్సార్సీ సిఫారసు చేసినట్టు తెలంగాణ వేరే రాష్ట్రంగా ఉండాలనే మెజారిటీ కోరుకుంటున్నది. అలాచేస్తే ఏమిటి, చేయకపోతే ఏమిటి అన్నవి నేను క్లుప్తంగా పేర్కొంటాను.
విశాలాంధ్రను కోరుకునేవాళ్లు చెప్పే కారణాలివి:
1. హైదరాబాదు స్టేటు ఇప్పుడున్నట్టే కొనసాగితే మంచిదే. కాని భాషాపరమైన ముక్కల కింద అది విడివడి ఉన్నది. రెండు పెద్ద ముక్కలు ఆయా భాషారాష్ట్రాల్లో చేరిపోయాయి. కాబట్టి మూడో విభాగమైన తెలంగాణ కూడా విశాల ఆంధ్ర రాష్ట్రంలో చేరడం సబబు.
2. విశాలాంధ్ర నినాదం చాలాకాలంగా రంగంలో ఉన్నది. జనానికి అది భావోద్వేగం కలిగిస్తుంది. ఫ్యూడల్ వ్యవస్థనుంచి బయటపడాలన్న ఆకాంక్షను అది ప్రతిబింబిస్తుంది.
3. పక్కపక్కనే నివసిస్తున్న తెలుగువాళ్లు కలిసిపోవటం మేలని సాంస్కృతిక సమైక్యత కోరేవారి అభిమతం. అలా కలిస్తే, పెద్ద రాష్ట్రం సాంస్కృతికంగా గొప్ప లాభం. ముఖ్యంగా ఒక వర్గం సాహితీపరులు దీన్నిగట్టిగా కోరుతున్నారు.
4. పెద్ద రాష్ట్రంలో పాలనా వ్యయం తక్కువ. ఒకే పని రెండుచోట్ల జరగవలసిన అవసరం ఉండదు. విశాల రాష్ట్రం మొత్తానికి ఒక గవర్నరు, ఒక హైకోర్టు, ఒక పబ్లిక్ సర్వీసు కమిషను ఉంటే సరిపోతుంది. రెండు రాష్ట్రాలకు కలిపి ఉండే సిబ్బందిని చాలా డిపార్ట్‌మెంట్లలో సగానికి తగ్గించవచ్చు.
5. పెద్ద రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి అవకాశాలు హెచ్చు.
విశాలాంధ్ర వల్ల ఒనగూడే ప్రయోజనాల్లో ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే.
ఇక తెలంగాణను విడిగా ఉంచాలని గట్టిగా ఉద్యమిస్తున్నవారు చెప్పే కారణాలేమిటంటే-
1. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటంతో విశాలాంధ్ర భావోద్వేగం బలహీనపడింది. తెలంగాణ తమలో కలిసిపోవాలని ఆంధ్ర ప్రాంతంలో గట్టి ఆందోళనేదీ లేదు. కాని - ఆంధ్రలో కలవకూడదని తెలంగాణలో గట్టి ఆందోళన ఉంది.
2. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రం చేస్తే ఎవరూ కిందుమీదు కారు. సమైక్యవాద ఐడియాలజీ, భావావేశం ఉన్నవాళ్లు కాస్త నిరాశ చెందుతారు. కాని జనంలో ఆందోళన ఉండదు. అలాకాక- తెలంగాణను బలవంతంగా ఆంధ్రలో కలిపేస్తే అవతలివైపు కలిగే లాభం పెద్దగా ఉండదు. తెలంగాణ మాత్రం వ్యధ చెందుతుంది.
3. తాము తెలుగువారమే అయినా, గడచిన 175 ఏళ్లలో తమకంటూ ప్రత్యేక జీవన విధానం ఏర్పరచుకున్నామని తెలంగాణవారు భావిస్తారు. ఇది ఆంధ్రాలోని తెలుగువారి జీవన విధానానికి చాలావిధాల భిన్నమైనది. ఆంధ్రాలోకంటే తెలంగాణలో కాస్మోపాలిటనిజం ఎక్కువ. విలీనంవల్ల తమ జీవన విధానం నాశనమవుతుందని తెలంగాణవారి బెంగ.
4. తెలంగాణలో చాలామందికి ఉర్దూ తెలుసు. ఎంతోమంది ఉర్దూ మాట్లాడతారు. నూరేళ్లుగా ప్రజాజీవితంలో ఉర్దూకు ప్రముఖస్థానం ఉన్నది. పరిపాలన సాగేది ఉర్దూలోనే. రికార్డులన్నీ ఉర్దూలోనే. కోర్టు వ్యవహారాలు సాగేదీ ఉర్దూలోనే. లాయర్లు, ఇతర వృత్తులవారు పనిచేసేదంతా ఉర్దూలోనే. విలీనం జరిగితే తమ జీవితంలో ఉర్దూ ప్రాముఖ్యాన్ని హరించివేస్తుందని వీరందరూ భయపడుతున్నారు. అలా జరగడం వారికి ఇష్టంలేదు.
5. విద్యావిషయంలో ఆంధ్రతో పోలిస్తే తెలంగాణ బాగా వెనకపడి ఉంది. ముఖ్యంగా ఇంగ్లిషు విద్యలో. ఇంగ్లిషు నేర్వడానికి ఇక్కడ వసతులు చాలా తక్కువ. కాబట్టి విశాల రాష్ట్రంలో సర్వీసుల అంశంలో తమకు అననుకూలత తీవ్రంగా ఉంటుందని తెలంగాణ వారి భయం. ఆంధ్రాలో బి.యేలు, ఎం.ఎ.లు అనేక వేల సంఖ్యలో ఉండగా తెలంగాణలో కొన్ని వందల మంది కూడా లేరు. ఎన్ని గ్యారంటీలు ఇచ్చినా ఈ అసమానత చెరిగిపోదు. విలీనంవల్ల సర్వీసుల్లో తెలంగాణకు ప్రతికూల ప్రభావం తప్పదు.
6. విశాలాంధ్ర ఏర్పడితే ఆర్థికంగా తమకు బాధలు తప్పవని తెలంగాణవారు భయపడుతున్నారు. సగటున చూస్తే తెలంగాణ ప్రజలు పేదలు. ఆంధ్రాలో కొంతమందికి ఉన్నట్టు వారికి డబ్బుల ముల్లెలు లేవు. విలీనం అయిన వెంటనే తమ భూమి, చిన్నాపెద్దా వ్యాపారాలు ఆక్రమణకు లోనవుతాయని వారి భయం. అవకాశం చిక్కితే ఆంధ్రా ప్రాంతం తెలుగువారు తెలంగాణా తెలుగువారిని ఆర్థికంగా దోచుకోవటానికి వెనకాడరనడానికి చాలా దృష్టాంతాలున్నాయి. అన్నిటికంటే ఇదే పెద్ద భయం.
7. భాష ఒకటే అయినా రెండు ప్రాంతాల్లోని తెలుగువారి మధ్య వల్లమాలిన ప్రేమ ఏమీలేదు. రజాకార్ ఆందోళన కాలంలోనూ, ఇండియన్ యూనియన్‌లో హైదరాబాద్ విలీనం అయిన వెంటనే- ఆంధ్రా ఆఫీసర్ల వైఖరి ఈ పరస్పర అనిష్టతకు గొప్ప ఉదాహరణ. మరాఠీ, కన్నడ అధికారులు, ఇంకా ఇతర భాషలు మాట్లాడేవారు కూడా హైదరాబాద్ ప్రజల పట్ల సాపేక్షంగా దయ చూపించారు. ఆంధ్రా అధికారులు మహాకర్కశంగా జనాన్ని బాధించారు. ఆ చేదు జ్ఞాపకాలు చెరిగిపోలేదు. కాబట్టే ఆంధ్రా సోదరుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడే పరిస్థితి తమకు రాకూడదని తెలంగాణవారు కోరుకుంటున్నారు.
8. విశాలాంధ్ర డిమాండులో కమ్యూనిస్టులూ, కమ్యూనలిస్టులూ శ్రుతి కలిపారు. వారికది రాజకీయ క్రీడ. విశాల రాష్ట్రాన్ని బలపరచడంలో వారికి చిత్తశుద్ధి లేదు. ఇలాంటివారి చేరికవల్ల తమకు ఏమి సుఖమన్న భావన మిగతావర్గాల్లో ఉన్నది.
9. ఎస్సార్సీ చెప్పిన ప్రకారం తెలంగాణను విడిగా ఉండనివ్వాలనికోరేవారు ప్రజాభీష్టం తెలుసుకునేందుకు ఏ పరీక్షకైనా సిద్ధమంటున్నారు. తెలంగాణలో విశాల ప్రజానీకం విలీనానికి వ్యతిరేకమని ఎలాంటి పరీక్ష పెట్టినా తేలుతుందని వారి వాదన. ఈ సమస్యమీద ఎన్నికలను పెట్టినా కమ్యూనిస్టులకు, కమ్యూనలిస్టులకు, ఇతర విశాలాంధ్రవాదులకు ఒక్క సీటునైనా దక్కనివ్వబోమని వారంటారు.
ఉన్న పరిస్థితి రెండు పార్శ్వాలనూ నేను రేఖామాత్రంగా మీముందు పెట్టాను. దీనిపై నా అభిప్రాయాన్ని తెలపటం సరికాదు. ఈ విషయంలో నాది ఓపెన్ మైండు. పక్షపాతం లేకుండా, ఆవేశపడకుండా మీకు పరిస్థితిని క్లుప్తంగా చెప్పాను. ఇక్కడ ఒకటి మాత్రం చెప్పదలిచాను. తెలంగాణను ప్రత్యేక యూనిటుగా ఉంచినప్పటికీ రెండు యూనిట్లకు కలిపి గవర్నరు, హైకోర్టు, పబ్లిక్ సర్వీసు కమిషను లాంటి పరిపాలనా వ్యవస్థలను ఉమ్మడిన ఉండనిస్తే హాని ఏమీ కలగదు. ఈ విషయాన్ని హైకమాండు నిర్ణయానికి వదిలివేస్తున్నాను.
1955 చివరిలో అప్పటి హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు నాటి కాంగ్రెస్ అధ్యక్షుడు యు.ఎన్.్ధబర్‌కి రాసిన ఉత్తరమిది. ఐదేళ్లపాటు తెలంగాణను విడిగా ఉంచాలంటూ ఫజలాలీ కమిషన్ చేసిన సిఫారసుమీద రాజకీయ వర్గాల్లో తీవ్ర తర్జన భర్జనలు సాగుతున్న సమయమది.
ఐదేళ్లదాకా ఆగటానికి వీల్లేదు, ఇప్పుడే వెంటనే తెలంగాణను ఆంధ్రతో కలిపి వేయాలని విశాలాంధ్రవాదులు తొందరపడుతూ, కేంద్ర నాయకత్వాన్ని తొందరపెడుతున్న కాలమది. వారు ఒత్తిడి చేస్తున్నట్టు తెలంగాణను అర్జంటుగా ఆంధ్రలో కలిపివేస్తే తెలంగాణకు జరిగే నష్టమేమిటి? కలవడంపట్ల తెలంగాణకున్న అనుమానాలు ఏమిటి? అభ్యంతరాలకు కారణమేమిటి - అన్నవి ఈ ‘మధ్యంతర’ నివేదికలో వివరంగా పేర్కొన్నారు. తెలంగాణ వాదాన్ని ఇంతకంటే బాగా అప్పట్లో ఎవరూ వినిపించలేదు.
పైగా రాసినవాడు సామాన్యుడుకాడు. ఎక్కడోపుట్టి, నైజాంకు వలసవచ్చి, తెలంగాణ చాంపియన్లుగా చలామణి అయిన కొందరు కుహనా నాయకుల్లా కాక - రామకృష్ణారావు తెలంగాణ గడ్డమీద పుట్టాడు. తెలంగాణ ఆత్మను, దాని హృదయస్పందనను ఆయన చక్కగా ఎరిగినవాడు. తెలంగాణ ఆంధ్రోద్యమంలో ఆయన మొదటినుంచీ ముందున్నాడు. 1921 నవంబరు వివేకవర్థనీ సభలో తెలుగుకు జరిగిన అవమానానికి నిరసనగా నిష్క్రమించిన కొద్దిమంది పెద్దల్లో బూర్గుల ఒకడు. ‘ఆంధ్ర జనసంఘం’లాగే ‘ఆంధ్ర మహాసభ’ స్థాపనలోనూ ఆయన క్రియాశీల ప్రమేయం ఉంది. 1931లో దేవరకొండలో జరిగిన రెండవ ఆంధ్ర మహాసభకు ఆయనే అధ్యక్షుడు. తరవాత ఏడేళ్లకు ఆవిర్భవించిన స్టేట్ కాంగ్రెసుకూ ఆయనే సంస్థాపక కన్వీనరు.
ఇలా తెలంగాణ ఆంధ్రోద్యమంతో ఆదినుంచీ సన్నిహిత సంబంధం ఉన్నందువల్ల తెలంగాణ రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి బూర్గుల వ్యక్తిగత హోదాలో చెప్పేమాటకైనా ఎనలేని ప్రాముఖ్యం ఉంది. పైగా ఆయన మొత్తం హైదరాబాదు స్టేటుకు ముఖ్యమంత్రి.
‘నా అభిప్రాయం చెప్పటం బాగుండదు. నేను ఓపెన్‌మైండుతో ఉన్నాను. ఏమి చేస్తారో మీ ఇష్టం’ అని రామకృష్ణారావు అన్నా, వాస్తవానికి ఆయన అభిమతమేమిటో లేఖ చదివిన వారెవరికైనా విస్పష్టం. ఇరువైపు వాదనలను ఆయన పేర్కొన్న తీరునుబట్టే - తెలంగాణను ఆంధ్రలో కలపకుండా కనీసం కొంతకాలం దాని మానాన దాన్ని బతకనివ్వడం మేలన్నదే ఆయన ఉద్దేశమని ఎవరికైనా అర్థమవుతుంది. తాను ముఖ్యమంత్రిగా ఉన్న విశాల రాష్ట్రం భవిష్యత్తుకు, తన సొంతగడ్డ మనుగడకు సంబంధించిన అత్యంత కీలక అంశం కాబట్టి బూర్గుల తాను దృఢంగా నమ్మినదాన్ని చెప్పవలసినచోట దృఢంగా చెబుతాడని, తాను న్యాయమనుకున్న దానికోసం గళమెత్తి నిర్భయంగా నిలబడతాడని ఎవరమైనా ఆశిస్తాం.
కాని - జరిగింది వేరు. తెలంగాణ మనోగతాభిప్రాయాన్ని ఇంత చక్కగా వ్యక్తపరచిన బూర్గులవారే ఎవరూ కలనైనా ఊహించని రీతిలో పిల్లిమొగ్గ వేశాడు. రాత్రికిరాత్రి ప్లేటు ఫిరాయించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఆ ముచ్చటను ఇంకో తెలంగాణ యోధుడు కె.వి.రంగారెడ్డి చెబుతారు వినండి:
ఈ సందర్భములో ఏదో పనిమీద శ్రీ రామకృష్ణారావు (ముఖ్యమంత్రి) ఢిల్లీ వెళ్ళిరి. అక్కడ ఏమి జరిగినదో తెలియదుగాని వారు తిరిగి వచ్చేటప్పుడు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయములో పత్రికా విలేఖరులతో తెలంగాణ రాష్టమ్రు వేరుగానుండుట నష్టదాయకమని తెలంగాణ, ఆంధ్ర కలిసి విశాలాంధ్ర ఏర్పడుట మంచిదని చెప్పిరి. ఆ స్టేట్‌మెంటు చదివి నాకు, నా అనుయాయులకు చాలా ఆశ్చర్యము కలిగినది. శ్రీ రామకృష్ణారావు ఢిల్లీ పోయేవరకు మాతోపాటు బల్లగ్రుద్ది తెలంగాణము వేరే స్టేటుగా నుండవలెనని చెప్పుచున్నవారు, ఢిల్లీనుంచి వస్తూనే మాకు ఏ విషయము తెలుపకుండ ఈ విధముగా స్టేట్‌మెంటు ఇవ్వడం చాలా అన్యాయమని భావించితిమి. శ్రీ బి.రామకృష్ణారావు గారిని కూడా అడిగితిమి. దానికి వారు ఏమి సమాధానము చెప్పలేదు. తరువాత ఆలోచిస్తే రెండును కలిపి ఒక స్టేటుగా ఉంటే మంచిదని తోచినది; అందువల్ల నా అభిప్రాయమును మార్చుకొని ఆ స్టేట్‌మెంటు ఇచ్చితిని అని చెప్పిరి. వారు ఏ కారణములవల్ల తమ అభిప్రాయము మార్చుకొనిరో చెప్పినట్లయితే, అవి సరియైన కారణములైతే మేము కూడా మా అభిప్రాయములను మార్చుకుంటామని వారిని కారణములు అడిగితిమి. కాని వారు ఏమి చెప్పకపోయిరి.
స్వీయచరిత్ర, కె.వి.రంగారెడ్డి, పే.143
అభిప్రాయాలు మార్చుకోవటంలో తప్పులేథు. గిరీశం అన్నట్టు అప్పుడప్పుడూ ఒపీనియన్సు ఛేంజి చేయనివాడు పొలిటీషియనే కాడు. దానికీ ఒక పద్ధతీపాడూ ఉండాలి కదా?
ఫజలాలీ కమిషను తన నివేదికను భారత ప్రభుత్వానికి అందజేసింది 1955 సెప్టెంబర్ 30న. దాన్ని బహిరంగ పరచింది ఆఏడు అక్టోబరు 9న. తరవాత కొద్దిరోజులకే ప్రత్యేక తెలంగాణ వైపు మొగ్గుచూపుతూ అఖిలభారత కాంగ్రెసు అధ్యక్షుడు ధేబర్‌కు ముఖ్యమంత్రి హోదాలో బూర్గుల మధ్యంతర నివేదిక పంపాడు. మళ్లీ మూణ్నాళ్లకే ఒకసారి విమానంలో ఎగిరి ఢిల్లీలో వాలగానే తెలంగాణను, ఆంధ్రనూ అర్జంటుగా కలిపెయ్యటం మంచిదని ఆయనకు ఆకస్మిక జ్ఞానోదయమైంది.
కె.వి.రంగారెడ్డి ఆయనకు రాజకీయ ప్రత్యర్థి కాబట్టి ‘తెలంగాణము వేరే స్టేటుగా ఉండవలెనని’ బూర్గుల బల్లగుద్ది చెప్పేవాడన్న రంగారెడ్డి మాటను పూర్తిగా నమ్మడానికి వీల్లేదు. నిజమే. కాని ధేబరుకు బూర్గుల రాసిన లేఖను చూసినా- కనీసం ఐదేళ్లదాకా తెలంగాణను విడిగా ఉండనివ్వటం మేలన్నదే 1955 అక్టోబరు నెల మధ్యవరకూ ఆయన అభిప్రాయపడినట్టు స్పష్టం. మళ్లీ అదే పెద్దమనిషి అదే నెలలో మరికొద్ది రోజులకే (అక్టోబరు 22న) విలీనం వెంటనే జరగాలన్న కోరస్‌లో గొంతు కలిపాడు.
At the Chief Ministers' conference on 22 october 1955 at New Delhi, the Andhra and Hyderabad Chief Ministers suggested the immediate merger of Telangana with Andhra in stead of waiting for five years as proposed by the S.R.C. The acceptance of Visalandhra by Ramakrishna Rao, the Hyderabad Chief Minister, surprised many... Some considered that it was a volte face
[The Emergence of Andhra Pradesh, K.V.Narayana Rao, P.294]
(ఎస్.ఆర్.సి. చెప్పినట్టు ఐథేళ్లు ఆగకుండా తెలంగాణను ఆంధ్రలో వెంటనే కలిపెయ్యాలని న్యూఢిల్లీలో 1955 అక్టోబర్ 22న ముఖ్యమంత్రుల భేటీలో హైదరాబాద్, ఆంధ్ర ముఖ్యమంత్రులు సూచించారు. హైదరాబాద్ ముఖ్యమంత్రి రామకృష్ణారావు విశాలాంధ్రకు అంగీకరించటం చాలామందిని ఆశ్చర్యపరచింది. కొందరైతే దాన్ని ప్లేటు ఫిరాయించడమనుకున్నారు.)