ఎం.వి.ఆర్ శాస్త్రి గారు ఆంధ్ర భూమి ఆదివారం అనుబంధం లో సీరియల్ గా ప్రచురిస్తున్న ఆంధ్రుల కథ యదాతథం గా..
రంగారెడ్డి దయచేతను..(June 24th, 2011)
ఇక ఏమనకుండ శ్రీ నెహ్రూ అందరికీ స్వయముగా టీనిచ్చి, శ్రీ రామకృష్ణారావుగారి వైపు తిరిగి, ‘‘ఏమి’’ అని అడిగిరి. ఆయన ‘‘శ్రీ రంగారెడ్డి, డా.చెన్నారెడ్డిగార్లు అంగీకరిస్తే అందరు అంగీకరిస్తారు’’ అనిరి. నేను, ‘‘ఏమిటి? అట్లు చెప్పుతారు. మేము చెప్పితే ఎవరు వింటారు?’’ అని అంటిని. ఇంతలో అందరు ఫలహారములు తీసుకుని వౌనము వహించిరి. తరువాత మేము హైదరాబాదుకు తిరిగి వస్తిమి.
కేంద్రమునకు ఒక స్టేటు చేయవలెనని పట్టుదల ఉన్నట్టు ఉన్నది. మన ముఖ్యమంత్రి యగు శ్రీ బి.రామకృష్ణారావుగారు కూడా దానికి అనుకూలముగానే ఉన్నారు. మనము చట్టబద్ధముగా రక్షణలను తీసుకుని ఒక స్టేటుకొరకు ఒప్పుకొనుటకు ఏమయినా అవకాశములున్నవా? అని చట్టాలు, కేస్‌లా పరిశీలించితిమి. ఒక రీజినల్ కమిటీ పెట్టి రక్షణలు తీసుకొనగల ఆధారము దొరకెను. దీనిని తెలంగాణములోని అప్పటి కార్యకర్తలనందరిని పిలిచి, మూడు దినములు వారితో చర్చించి వారి అనుమతిని పొందితిమి. అదే సమయములో నెహ్రూ ప్రభుత్వము పరిశీలనములో కూడ ఈ ఆధారము దొరికి ఈ విషయము కనిపెట్టిరి.
ఆ తరువాత ఆంధ్ర నాయకులను, మమ్ములను ఢిల్లీకి హోంమంత్రి శ్రీ గోవింద వల్లభపంత్ పిలిపించిరి. శ్రీ పంత్‌గారి ఇంట్లో జరిగిన ఒక సమావేశములో శ్రీయుతులు వౌలానా ఆజాద్, ధేబర్, శ్రీ నెహ్రూ మరియు ఆంధ్ర ముఖ్యనాయకులు కూడ ఉండిరి.
పంత్‌గారు ‘‘ఒక స్టేటు చేయడంలో మీ అభిప్రాయము ఎట్లు ఉన్నది?’’ అని మమ్ములనడిగిరి. ‘‘మీకు రక్షణలు ఇచ్చి, వాటికొరకు ‘రీజినల్ కమిటీ’ పెట్టితే మీకు ఒక స్టేటు చేయుటకు ఇష్టమేనా?’’ అని అడిగిరి. రీజినల్ కమిటీ పెట్టి ఒక స్టేటు చేయుటకు హైదరాబాదు కార్యకర్తల అంగీకారమును పొంది ఢిల్లీ వెళ్లియుంటిమి. కనుక, ‘‘సరే’’ అని అంగీకరించితిమి. ‘‘మీకు ఏమి రక్షణలు కావలెనో ఉభయులు సంప్రదించుకొని, ఏకాభిప్రాయముతో... వ్రాసుకొని రండి’’ అనివారు అనిరి.
రీజినల్ కమిటీ పెట్టి ఒకే స్టేటు చేయుటకు మాకు ఇష్టమేగాని, హైదరాబాదులో కొందరు వకీళ్ళకు, అడ్వొకేట్లకు ఇంగ్లీషు రాదు కనుక, హైకోర్టులో ఇప్పుడున్నట్లుగ ఆంధ్ర హైకోర్టు గుంటూరులోను, తెలంగాణ హైకోర్టు హైదరాబాదులోను యధాతథముగా ఉంచవలెనని కోరితిమి. దానికి వారు ‘సరే’అని అంగీకరించిరి. మేమందరము హైదరాబాదు గెస్టుహౌసుకు పోయి ఒక ఒప్పందపత్రము వ్రాసి దాని 5 ప్రతులు తీసి తెలంగాణ పక్షమున నేను, శ్రీయుతులు బి.రామకృష్ణారావు, డాక్టరు చెన్నారెడ్డి, జె.వి.నరసింగరావు, ఆంధ్ర పక్షమున శ్రీయుతులు నీలం సంజీవరెడ్డి, శ్రీ బెజవాడ గోపాలరెడ్డి, అల్లూరి సత్యనారాయణరాజు, గౌతు లచ్చన్నగార్లు సంతకములు చేసి తీసుకొని పోతిమి.
స్వీయచరిత్ర, కె.వి.రంగారెడ్డి, పే.146-148
ఇథీ చరిత్రకెక్కిన ‘‘పెద్దమనుషుల ఒప్పందం’’ పుట్టుక. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావానికి అదే ప్రాతిపదిక.
1956 ఫిబ్రవరి 20న న్యూఢిల్లీలో కుదిరిన పెద్దమనుషుల ఒప్పందంలో ఏముంది అన్న వివరాల్లోకి వెళ్ళేముందు కొన్ని ముఖ్య వాస్తవాలను గుర్తుంచుకోవాలి.
వేరెవరో కాదు సాక్షాత్తూ కె.వి.రంగారెడ్డిగారు స్వీయచరిత్రలో స్వయంగా రాసిపెట్టిన దానిబట్టి కథాక్రమం ఇది:
1953 డిసెంబరు 22న ఫజలాలీ అధ్యక్షతన రాష్ట్రాల పునర్విభజన సంఘం ఏర్పాటైంది. 1954 జూన్ జూలైల్లో అది హైదరాబాద్‌లో మకాం చేసింది.
అప్పుడు రంగారెడ్డి, అల్లుడు చెన్నారెడ్డి ఏమిచేయుచుండిరి?
‘‘తెలంగాణ, ఆంధ్రములను కలపకూడదని ప్రచారము చేయుచుంటిమి. ఇదే విధముగ కమిషన్ ముందు కూడ వాజ్ఞ్మూలమును ఇస్తిమి.’’
1955 సెప్టెంబరు 30న ఎస్సార్సీ నివేదిక ప్రభుత్వానికందింది. తెలంగాణను ఆంధ్రలో కలపకుండా కనీసం ఐదేళ్లు విడిగా ఉండనివ్వాలని కమిషన్ సిఫారసు చేసింది. అప్పుడు కొండావారు ఏమి చేసిరి?
‘‘ప్రత్యేక తెలంగాణమును గురించి ప్రచారము బాహాటముగా చేసితిమి... (హైదరాబాదు నగర పర్యటనలో నెహ్రూ వెళ్లిన చోటల్లా) కాగితపు జండాలు మరియు బట్టల జండాలతో బ్రహ్మాండముగా ప్రచారము చేసితిమి.’’
కొన్నాళ్ల తర్వాత నెహ్రూగారు కె.వి.రంగారెడ్డి అండ్ కోను ఢిల్లీకి పిలిపించి ‘‘రెడ్డిగారూ తెలంగాణ సమస్య ఎంతవరకు వచ్చింది’’ అని అడిగారు. తెలంగాణలో నూటికి 95 మంది- ఆంధ్రాతో కలవడానికి వ్యతిరేకంగా ఉన్నారని రెడ్డిగారు ఎలుగెత్తి చాటారు. ఇక చేసేది లేక ప్రధానిగారు ఊరుకున్నారు.
ఆ తరవాత రెడ్డిగారు ఏమిచేశారు? రెట్టించిన ఉత్సాహంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంకోసం పట్టు బిగించారా? ప్రజాభిప్రాయాన్ని కూడగట్టి, తెలంగాణవాదులను సమీకరించి, కేంద్రం మీద, ప్రధాని మీద ఒత్తిడి మరింత పెంచారా?
లేదు. కేంద్రానికి విశాల ఆంధ్ర రాష్ట్రం చేయాలని పట్టుదల ఉన్నట్టు తోచగానే రంగారెడ్డి తన పట్టును జారవిడిచేశారు. ‘‘నూటికి 95 మంది’’ తెలంగాణ ప్రజల కోర్కెను తీర్చడం ఎలాగా అన్నది కాక నెహ్రూగారి ముచ్చట ఎలా తీర్చాలా, దానికోసం ఎలా రాజీపడాలా అని ఉపాయాలు వెదకసాగారు. అమోఘమైన తన వకీలు బుర్రను సానబెట్టి, చట్టాలు, కేస్‌లాలు తిరగేసి, ‘రీజినల్ కమిటీ’ ఆధారాన్ని కష్టపడి కనుక్కున్నారు. వెంఠనే ‘యురేకా’ అని కేకవేసి, తెలంగాణలోని కార్యకర్తల్ని హుటాహుటిన పిలిచి, వారినీ పిల్లిమొగ్గ వేయించి విశాలాంధ్రకు ఒప్పించారు.
గుర్తుపెట్టుకోవలసింది ఏమిటంటే- అప్పటిదాకా బల్లగుద్ది తెలంగాణ వాదాన్ని గాట్ఠిగా వినిపించిన కొండావారే, ఎవరూ అడగకుండానే, పైవాళ్లనుంచి ఒత్తిడి రాకుండానే, తెలంగాణవాదాన్ని పాతిపెట్టి విశాలాంధ్ర వాదానికి ఎలా జైకొట్టగలనా అని తీరి కూర్చుని ఆలోచన చేశాడు. ప్రాంతీయ కమిటీ తీగను దొరకబుచ్చుకుని లాగి, అదేదో మహత్తరమైన డిస్కవరీ అయినట్టు... తనను నమ్ముకున్న తెలంగాణ సహచరుల్ని కేకేసి, తన బుద్ధిచాతుర్యంతో వారిని బుట్టలోవేసి ఒప్పించి... అందరినీ కమిట్ చేయించి, ఢిల్లీ వెళ్లాడు. అక్కడ కేంద్రాధిష్ఠాన మహాజ్ఞానులకూ సరిగ్గా అదే బ్రెయిన్ వేవ్ వచ్చి, వారికీ ప్రాంతీయ కమిటీయే తారకమంత్రమని స్ఫురించిందట.
ఇంకేం? వారూ వీరూ కలిసి, ఆంధ్రా పెద్దమనుషులనూ కేకేశారు. ఆంధ్రా పెద్దమనుషులనూ, తెలంగాణా పెద్దమనుషులనూ ఒక గదిలో కూలేసి ఏం కావాలో, ఏం జరగాలో తేల్చుకోమని సెంట్రల్ పెద్దమనుషులు పురమాయించారు. తీవ్ర తర్జనభర్జనల తరవాత
ఉభయవర్గాల పెద్దలూ రడీమేడ్ ఒప్పందానికి బుద్ధిగా తల ఊపారు. కేంద్ర దేవతలూ ఆశీర్వదించి, ‘తథాస్తు’ అన్నారు. అలా కుదిరిన ‘‘పెద్దమనుషుల ఒప్పందం’’ ఆధారంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1956 నవంబరు 1న నెహ్రూ పండితుడి ఆధ్వర్యంలో అవతరించింది.
ఆ ఒప్పందం బూటకమని, ‘ఆంధ్రప్రదేశ్’ ఏర్పాటే పెద్ద మోసమని, 1956లో జరిగింది తెలంగాణకు ద్రోహమని మనకాలపు తెలంగాణవాదులు ఇల్లెక్కి చాటుతారు. మోసాన్ని గుర్తుచేసేందుకు ఏటేటా నవంబరు 1ని విద్రోహ దినంగానూ పాటిస్తారు. ఆరోజున ‘తెలుగుతల్లి’ని నాలుగు తిట్లు తిట్టి, పొట్టిశ్రీరామలు లాంటి వాళ్ల విగ్రహాలకు తోచిన అవమానం చేసి తరిస్తారు. వారి ఆక్రోశం, ఆవేదన అర్థంచేసుకోదగ్గవే. కాని వారు గుర్తించాల్సింది ఏమిటంటే... ఒప్పందం కుదుర్చుకోమని, విశాల రాష్ట్రానికి ఒప్పుకోమని ఏ ఆంధ్రావాడూ తెలంగాణవాళ్లని బలవంతం చెయ్యలేదు. రాజకీయ నాయకుల హడావుడే తప్ప తెలంగాణా వచ్చి తమలో కలిసిపోవాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలేమీ అంగలార్చలేదు. మహా ఉద్యమాలూ నడపలేదు.
ఢిల్లీలో జరిగింది ఢిల్లీ కాంగ్రెసు పెద్దల కనుసన్నల్లో ఆంధ్రా కాంగ్రెసు పెద్దలూ, తెలంగాణ కాంగ్రెసు పెద్దలూ కూడబలుక్కుని, తమ స్వార్థంకోసం, తమ పార్టీ స్వార్థంకోసం చేసిన గూడుపుఠాణి! అందులో మిగతా పార్టీలకి ప్రమేయం లేదు. ఇరు ప్రాంతాల్లోనూ ఉన్న ప్రజాహిత సంస్థలకు, సామాజిక వర్గాలకు ప్రమేయం లేదు. ఆంధ్రలోనూ, తెలంగాణలోనూ ఆంధ్రోద్యమాన్ని కుంటుతూనో, తూలుతూనో నడిపించిన ‘‘ఆంధ్ర మహాసభ’’ల అభిప్రాయాన్ని అడిగిన దిక్కులేదు. ప్రజల ప్రమేయం అసలే లేదు.
అంతేకాదు. తెలంగాణవాదులనుకుంటున్నట్టు ఆనాడు జరిగింది ద్రోహమైతే, ఆ విద్రోహానికి మొట్టమొదటి ముద్దాయి తెలంగాణ మహానాయకుడు కె.వి.రంగారెడ్డే. ఆ సంగతి పైన చెప్పిన కథాక్రమాన్నిబట్టే మందమంతులకు సైతం బోధపడుతుంది.
ఇంతకీ ఏమిటా పెద్దమనుషుల ఒప్పందం?
చరిత్రకెక్కిన ‘అగ్రిమెంటు’లో ఆంధ్రా, తెలంగాణ కాంగ్రెసు జంటిల్మెన్లు ఉల్లేఖించిన నిబంధనలు ఇవి:
1. రాష్ట్ర ప్రభుత్వపు ముఖ్య సాధారణ పరిపాలనా విభాగాలపై అయ్యే ఖర్చు తగు నిష్పత్తిలో రెండు ప్రాంతాలు భరించాలి. తెలంగాణా ప్రాంతంనుండి వచ్చే మిగులు ఆదాయాన్ని ఆ ప్రాంతపు అభివృద్ధికే కేటాయించాలి. ఈ నిబంధనను ఐదేళ్ల తరవాత సమీక్షించి అసెంబ్లీలోని తెలంగాణా శాసనసభ్యులు కోరిన పక్షంలో మరల అయిదేళ్ళపాటు వర్తింపజేయాలి.
2. తెలంగాణాలో మద్యపాన నిషేధాన్ని అసెంబ్లీలోని తెలంగాణా శాసనసభ్యులు కోరిన విధంగా అమలుచేయాలి.
3. తెలంగాణాలో ప్రస్తుతం అమలులో ఉన్న విద్యా సౌకర్యాలన్ని తెలంగాణా విద్యార్థులందరికి వర్తింపజేసి మరింతగా అభివృద్ధిచేయాలి. తెలంగాణాలోని సాంకేతిక విద్యాసంస్థల్లో ప్రవేశం తెలంగాణా విద్యార్థులకే పరిమితం చేయాలి. లేకపోతే రాష్ట్రం మొత్తంమీద 1/3 వంతు సీట్లను తెలంగాణా విద్యార్థులకు ప్రత్యేకంగా కేటాయించాలి. అయితే ఈ రెండింటిలో తెలంగాణా వారికి ఏది ప్రయోజనమైతే దానినే ఎంచుకోవచ్చు.
4. విశాలాంధ్రను ఏర్పాటుచేసినపుడు ఎక్కువైన ఉద్యోగుల్ని తీసివేయాల్సి వచ్చినపుడు ఆయా ప్రాంతాలకు తగిన నిష్పత్తిలోనే జరగాలి.
5. ఉద్యోగ నియమకాల్లో మాత్రం ఆయా ప్రజల జనాభాను ప్రాతిపదికగా తీసుకోవాలి.
6. తెలంగాణలోని సాధారణ పరిపాలన, న్యాయ విభాగాల్లో ఉర్దూ భాషకున్న ప్రస్తుత స్థానాన్ని మరో అయిదేళ్లపాటు కొనసాగించాలి. అయిదు సంవత్సరాల తర్వాత ప్రాంతీయ మండలి పరిస్థితిని సమీక్షిస్తుంది. ఉద్యోగ నియామకాలకు తెలుగు భాషా పరిజ్ఞానం తప్పనిసరి అనే నిబంధనను పెట్టకూడదు. అయితే ఉద్యోగంలో చేరిన రెండేళ్లకు ఉద్యోగులపై నిర్వహించే తెలుగు పరీక్షలో తప్పక ఉత్తీర్ణుడు కావాలి.
7. తెలంగాణా ప్రాంతంలోని ఉద్యోగాల్లో చేరేందుకు 12 సంవత్సరాలు స్థానికుడై ఉండాలనే నిబంధన వంటి కొన్ని నియమాల్ని కూడ రూపొందించాలి.
8. తెలంగాణా ప్రాంతంలోని వ్యవసాయిక భూముల అమ్మకం ప్రాంతీయ మండలి అధికార పరిధిలో ఉండాలి.
9. తెలంగాణా ప్రాంతపు బహుముఖాభివృద్ధిపై ఒక ప్రాంతీయ మండలిని ఏర్పాటుచేయాలి.
10. ప్రాంతీయ మండలిలో 20 మంది సభ్యులుండాలి. వీరిలో 9 మంది అసెంబ్లీ సభ్యులై ఉండాలి. వీరిని జిల్లాకు ఒక్కరు చొప్పున ఆయా జిల్లాల సభ్యులు ఎన్నుకుంటారు. మరల 6 మంది సభ్యుల్ని అసెంబ్లీ నుండి గాని, పార్లమెంటునుండి గాని తెలంగాణా అసెంబ్లీ సభ్యులు ఎన్నుకుంటారు. మరో 5 మంది సభ్యులు బయటివారై ఉంటారు. వీరిని తెలంగాణావారే ఎన్నుకుంటారు.
11. ప్రాంతీయ మండలి ఈ కింది విషయాల్లో నిర్ణయాధికారాన్ని కలిగి ఒక చట్టబద్ధమైన సంస్థగా రూపొందాలి.
(ఎ) తెలంగాణా ప్రాంతానికి సంబంధించిన వరకు పై విషయాలతోపాటు సాధారణ ప్రణాళికలోని ప్రణాళిక, అభివృద్ధి విషయాలు, ఉద్యోగ నియామకాలపై అదుపు కలిగి ఉంటుంది.
(బి) ఈ ఒప్పందాన్ని ముందుగా సవరించితే తప్ప పదేళ్ల తర్వాత సమీక్షించాలి.
12. కాబినెట్ మంత్రుల నియామకం 60:40 నిష్పత్తిలో జరగాలి. తెలంగాణాకు చెందిన మంత్రుల్లో ఒకరు ముస్లిం అయి ఉండాలి.
13. ముఖ్యమంత్రి ఆంధ్ర ప్రాంతంవాడై, ఉప ముఖ్యమంత్రి తెలంగాణా ప్రాంతానికి చెందినవాడై ఉండాలి. ఒకవేళ ముఖ్యమంత్రి తెలంగాణా ప్రాంతానికి చెందిన వ్యక్తి అయితే ఉప ముఖ్యమంత్రి ఆంధ్ర ప్రాంతానికి చెందినవాడై ఉండాలి. హోంశాఖ, ఆర్థికశాఖ, రెవిన్యూ శాఖ ప్రణాళిక మరియు అభివృద్ధి వ్యవహారాల శాఖ, వాణిజ్యము మరియు పరిశ్రమ శాఖ- వీటిల్లో ఏదేని రెండు శాఖలు తెలంగాణా వారికి అప్పగించాలి.
14. తెలంగాణాకు 1962వరకు ప్రత్యేక కాంగ్రెసు కమిటీ కావాలని హైదరాబాదు రాష్ట్ర కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు కోరారు. ఇందుకు ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు కూడ తన ఆమోదాన్ని తెలిపారు.
ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర, పి.రఘునాథరావు, పే.251-25