ఆంధ్రుల కథ - తుదిపలుకు

ఎం.వి.ఆర్ శాస్త్రి గారు ఆంధ్ర భూమి ఆదివారం అనుబంధం లో సీరియల్ గా ప్రచురిస్తున్న ఆంధ్రుల కథ యదాతథం గా..

తుదిపలుకు(July 3rd, 2011)

ఆంధ్రులది అంతులేని కథ. అందులో నేను చెప్పదలచుకున్న చిన్న భాగం అయిపోయింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక్కటిగా ఉండాలా; విడిపోవాలా; విడిపోతే ఎన్ని ముక్కలుగా... అన్న
విషయంపై తీవ్ర స్థాయిలో ఖండన మండనలు అవుతూ, చర్చోపచర్చలు జోరుగా సాగుతూ,
అవి వెలుగుకంటే ఎక్కువగా వేడిని పుట్టిస్తూ, తెలుగు జన జీవితాన్ని కుతకుతలాడిస్తున్న
సమయంలో...
అసలు- ఆంధ్రప్రదేశ్ ఏ పరిస్థితుల్లో ఏర్పడింది; ఆంధ్రోద్యమం ఎలా మొదలై, ఎన్ని మలుపులు తిరిగి, ఎక్కడికి చేరింది; ఇప్పుడు రాష్ట్రాన్ని దహిస్తున్న అశాంతికి మూలాలేమిటి- అని ఆలోచిస్తూ, వెదుక్కుంటూ, వెనక్కి, దాని వెనక్కి పోతే ఈ గ్రంథం తయారైంది.
ఇప్పటికి ఆరు చరిత్ర గ్రంథాలు రాసినా నేను చరిత్రకారుడిని ఎంతమాత్రం కాను. వృత్తిరీత్యా జర్నలిస్టును. ప్రవృత్తిరీత్యా జాతీయవాదిని. దేశానికి, ధర్మానికి, ప్రజాహితానికి ఎటువైపునుంచి ఏ రూపంలో ఎవరు హాని తలపెట్టినా ఒళ్లుమండే మామూలు పౌరుడిని. ఎక్కడ చూసినా స్వార్థం పెరిగి, దుర్మార్గం ప్రబలి, ఆలోచన తగ్గి, ఆవేశకావేశాలు రెచ్చి, కల్లలూ కపటాలూ ఎల్లలు దాటి జనం బాగును కాటుమీద కాటు వేస్తున్న స్థితిలో- మాయ రాజకీయాల కాలకూట విషానికి విరుగుడు కనుగొని, సొమ్మసిల్లిన జాతికి కళ్లు తెరిపించి, స్వస్థత చేకూర్చేందుకు ఏ కొంచెమైనా ఉపయోగపడాలన్న తపనే తప్ప చరిత్రలు మధించేందుకు కావలసిన ప్రతిభ, ఎకడమిక్ అర్హత నాకు లేవు. నా పద్ధతిలో నేను గతంలోకి తొంగిచూసి, వర్తమానాన్ని బేరీజు వేస్తే నాకు తోచిందిది:
ఆంధ్రులు అన్నీ ఉండీ ఏమీ లేని రాజకీయ విధి వంచితులు. ఆంధ్రోద్యమం ఆదినుంచీ దిక్కులేని అనాథ. కాంగ్రెసువాళ్లు పట్టిపల్చార్చటంవల్ల ఆంధ్రాలోనూ, కాంగ్రెసువాళ్లు బొత్తిగా పట్టించుకోకపోవటంవల్ల తెలంగాణాలోనూ ఆంధ్ర మహాసభలు అస్తవ్యస్తమై ఆంధ్రోద్యమం నిస్తేజమైంది. నడిపిస్తే ఎంత దూరమైనా నడవటానికి, ఎలాంటి త్యాగమైనా చేయడానికి, ఎంతటి ప్రతాపమైనా ప్రదర్శించటానికి ప్రజలు మొదటినుంచీ సిద్ధంగానే ఉన్నారు. ఎటొచ్చీ వారు నమ్ముకున్న నాయకులే వారిని నట్టేట ముంచుతున్నారు. మహాత్మాగాంధీతో మొదలుపెట్టి సోనియాగాంధీ వరకూ జాతినేతలనుకోబడే వారందరివీ ఆంధ్రుల నెత్తిన మొట్టటంలో అందెవేసిన చేతులే. అక్కడ కొండా వెంకట అప్పయ్య అయినా, ఇక్కడ కొండా వెంకట రంగారెడ్డి అయినా అవసరమైనప్పుడు అక్కరకు రాక ఉద్యమాన్ని నీరుగార్చిన ఘనులే.
ఆంధ్రుల ఆత్మగౌరవం కాపాడి, అభ్యుదయం సాధించాలన్న సద్భావం ఉన్న సత్పురుషులు రాజకీయ పెద్దల్లో చాలామందే ఉన్నారు. కాని ఏం లాభం? దుర్జనులకున్న లౌక్యం, ఐకమత్యం, కార్యం సాధించే సామర్థ్యం సజ్జనులకు లేకపోవటంవల్ల, ఏటికి ఎదురీది అన్యాయాన్ని, అక్రమాన్ని ఒంటరిగా అయినా ఎదిరించి, కడదాకా పోరాడే తెగువ యోగ్యులైన వారిలో లోపించటంవల్ల ముఖ్యమైన ప్రతిఘట్టంలోనూ దౌర్జన్యానిదే ఇష్టారాజ్యమైంది.
చెన్నపట్నంనుంచి చెంగల్పట్టు దాకా, బళ్లారినుంచి బరంపురం వరకూ అన్నీ పోగొట్టుకోవటమే తప్ప రాబట్టుకోవటం ఆంధ్రుడు ఎరగడు. రాబట్టుకోవాలని జనానికి ఉన్నా వారి నెత్తినెక్కిన నేతలు పడనివ్వరు. నాయకుడనుకున్నవాడే అడుగడుగునా ఆంధ్రుడి మెడకు ఆదినుంచీ గుదిబండ.
1956కు ముందు ఆంధ్ర రాజకీయ నాయకులు మద్రాసాంధ్ర ప్రాంతానికి, తెలంగాణ రాజకీయ నాయకులు నైజామాంధ్ర ప్రాంతానికి శాయశక్తులా అన్యాయం చేశారు. 1956 తరవాత వారూ, వీరూ కలిసి ఎవరి పరిధిలోవారు విశాలాంధ్ర రాష్ట్రానికి శక్తివంచన లేకుండా హాని చేస్తున్నారు. ప్రాంతంకోసం ప్రాణం ఇస్తామని ఎవరికివారు ఎన్ని ప్రగల్భాలు పలికినా, వారిపై వీరు, వీరిపై వారు ఎంత కొట్లాడినట్టు నటించినా... అది నిజమని తలిచి, వారే తమ ఉద్ధారకులని భ్రమసి అటూఇటూ జనం ఎంత రెచ్చిపోయినా... నాయకులకు ఏకాడికీ తమ బాగే తప్ప ప్రాంతం బాగుపట్టదు. రాష్ట్రం, దేశం ఏమైపోయినా వారికి అక్కర్లేదు.
గుర్రానికి ముందు బండి కట్టెయ్యటంలో మన లీడర్లు దిట్టలు. తరవాత నడక తిన్నగా సాగకపోతే కారణం నువ్వంటే నువ్వని బండి, గుర్రం గొడవ పడాల్సిందే. బండిలోనివాళ్లు నానా అవస్థాపడుతూ కిందామీదా కావలసిందే. ఆంధ్రావాళ్ల నుంచి రక్షణలు అడిగి పుచ్చుకుని, తెలంగాణ వేరుపాటు వాదాన్ని వదిలేసుకుని, 1956లో తెలంగాణ పెద్దలు విశాలాంధ్రకు జైకొట్టటం కూడా బండికి వెనుక గుర్రాన్ని కట్టెయ్యటం లాంటిదే.
ఎందుకంటే తెలంగాణకు ప్రత్యేక రక్షణలివ్వాలన్న అద్భుత ఆలోచన 1956 ఫిబ్రవరి 20న ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో కాంగ్రెస్ అధిష్ఠానం కూడగట్టిన తెలంగాణ- ఆంధ్ర కాంగ్రెస్ పెద్దతలకాయల భేటీలోనే మొట్టమొదటిసారిగా మొలకెత్తింది కాదు. అది కొనే్నళ్లుగా ఆంధ్రా నేతలు అంటున్నదే. పదే పదే తెలంగాణవాళ్లు వింటున్నదే. వినివిని వద్దనుకున్నదే.
ప్రొహిబిషన్ గొడవలో ప్రకాశం మంత్రివర్గం పతనమయ్యాక 1955 మధ్యంతర ఎన్నికల అనంతరం ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అరుూ్యకాగానే బెజవాడ గోపాలరెడ్డి తెలంగాణ వారికి ఇలా అభయం ఇచ్చాడు:
We do not want to gain at your expense. An agreement between Andhra and Telangana can be had on the lines of Sri Bagh pact. In appointment to posts superior or subordinate, one third would be reserved for Telangana when Visalandhra is formed.
[Quoted in Emergence of Andhra Pradesh, K.V.Narayana Rao, P.300]
(మీకు అన్యాయంచేసి లాభపడాలని మేము కోఠుకోవడం లేథు. శ్రీ బాగ్ ఒప్పందం తరహాలో ఆంధ్ర, తెలంగాణలు అగ్రిమెంటు కుదుర్చుకోవచ్చు. విశాలాంధ్ర ఏర్పడ్డాక ఉన్నతస్థాయి సబార్డినేట్ పోస్టుల్లో మూడోవంతును తెలంగాణకు రిజర్వు చేయగలం.)
రక్షణలు, గ్యారంటీల గురించి తెలంగాణకు బ్లాంక్ చెక్ ఇస్తాం. మీరు ఏది కావాలంటే దానికి ఒప్పేసుకుంటాం- అని 1955 నవంబరులో ఢిల్లీలో జరిగిన చర్చల్లో కూడా తెలంగాణ నాయకులకు ఆంధ్ర నాయకులు ఆఫర్ ఇచ్చారు. దానికి కె.వి.రంగారెడ్డి జె.వి.నరసింగరావు ఏమన్నారు? చట్టపరమైన చెల్లుబాటు లేకుండా మీరు ఎన్ని హామీలిచ్చినా అవి అమలవుతాయన్న నమ్మకం మాకు లేదు. గ్యారంటీలవల్ల ఒరిగేది లేదు. మాకు ప్రత్యేక రాష్ట్రం కావలసిందే- అని పట్టుపట్టారు.
అప్పుడు వద్దన్న డొల్లరక్షణలే మూణ్నెల్లు తిరక్కుండా తెలంగాణ పెద్దలకు ముద్దొచ్చాయి. ‘నెహ్రూగారు విశాలాంధ్ర వైపే మొగ్గారు. మీకు ప్రత్యేక రాష్ట్రం రాదు. ప్రాంతీయ మండలిని తీసుకుని, కావలసిన షరతులను మాట్లాడుకుని మర్యాదగా దారికి రండి- అని హోంమంత్రి గోవింద వల్లభ్‌పంత్ ఈలవెయ్యగానే తెలంగాణ లీడర్లు ప్లేటు మార్చారు. అంతకుముందు అందరూ ఆలోచించి, పనికిమాలినదని నిర్ధారణకు వచ్చిన రక్షణలు, గ్యారంటీలనే- పైవాళ్లు కనుసైగ చేయగానే మళ్లీ నెత్తినెత్తుకుని, అద్భుతమేదో సాధించినట్టు, తెలంగాణ కష్టాలన్నీ దాంతో తీరిపోతాయన్నట్టు సమయానుకూలంగా గొప్ప ప్రచారం చేశారు. ఆ రకంగా- ఇష్టంలేదని గింజుకుంటున్న తెలంగాణ గుర్రం ముందు కృత్రిమ రక్షణల బండిని కట్టేసి తాంబూలాలిచ్చారు.
అప్పటినుంచీ నేటిదాకా జనం తన్నుకు చస్తున్నారు.
అనేక తరాల తరబడి ఎడబాటువల్ల భాషలో, యాసలో, సంస్కృతిలో, వ్యవహారాల్లో తేడాలొచ్చాయి. పరాయి పంచల్లో, పర భాషీయుల పెత్తనం కింద బతుకు వెళ్లదీయడం మూలంగా రాజకీయంగా, సామాజికంగా వ్యత్యాసాలు, అన్యప్రభావాలు గోచరించాయే తప్ప మద్రాసాంధ్రులూ, నైజామాంధ్రులూ అన్నదమ్ములే. ఒక్క తల్లి బిడ్డలే. ఇరు ప్రాంతాల పెద్దలు కొంచెం నిజాయితీగా ఇచ్చిపుచ్చుకునే సౌమనస్యంతో కలిసి ముందుకు సాగితే తొలినాళ్ల అనుమానాలు, అపోహలు తొలిగి, ఆత్మీయత కలిగి పరస్పర విశ్వాసం పెంపొందడం కష్టంకాదు. కలిసేముందు చేసుకున్న బాసలను, ఇచ్చుకున్న హామీలను కలయిక తర్వాతా మన్నించి, నమ్మిన ప్రజలకు న్యాయం చేయాలన్న ఇంగిత జ్ఞానం గద్దెలెక్కిన పెద్దలకు ఉంటే తెలుగుజాతి చరిత్రగతి అప్రతిహతంగా సాగేది. ఏళ్లు గడిచేకొద్దీ ప్రాంతాల మధ్య సఖ్యత, అన్యోన్యానుబంధం గట్టిపడుతూ పోయేది.
దురదృష్టవశాత్తూ అసలైన ఆ విజ్ఞత, ఆపాటి నిజాయతీయే మన నెత్తినెక్కిన నేతాశ్రీలకు లోపించాయి. పెద్దమనుషుల ఒప్పందంమీద సంతకాల తడి ఆరకముందే దానికి తూట్లు పొడిచే కార్యక్రమానికి అంకురార్పణ జరిగింది. రాష్ట్రం పేరు విషయంలో, హైకోర్టు బెంచిల విషయంలో తెలంగాణవారి మాట చెల్లుబాటు కానట్టే... వారూ వీరూ ఏకీభవించిన అంశాల్లోనూ అక్కర తీరగానే ఆంధ్ర నాయకులు వెనక్కిపోయి మాట తప్పసాగారు.
ఉదాహరణకు ఈ ప్రాంతంవారు ముఖ్యమంత్రి అయితే ఆ ప్రాంతంవారు ఉపముఖ్యమంత్రి కావాలన్నది కాంగ్రెసు పెద్దమనుషుల ఒప్పందంలో ఒక అంశం. ఆ ప్రకారమే సంజీవరెడ్డి తొలి ముఖ్యమంత్రి కాగానే కె.వి.రంగారెడ్డిని ఉప ముఖ్యమంత్రిని చేశారు. తరవాత తెలంగాణ నాయకుల మధ్య ఉన్న స్పర్థలను, విరోధాలను తెలివిగా ఉపయోగించుకుని, ఉప ముఖ్యమంత్రి పదవే అక్కర్లేదని వారిచేతే అనిపించారు. ఆ పోస్టునే ఏకంగా ఎత్తేశారు. అదేమిటంటే ఉప ముఖ్యమంత్రి అనేది ఆరో వేలు; దండగమారి పదవి- అని వాదించారు. ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి కావడానికి ముందువరకు తానూ ఉప ముఖ్యమంత్రినేనన్న సంగతి సంజీవరెడ్డి సమయానుకూలంగా మరచాడు.
ఫిబ్రవరి 20న కుదిరిన ఒప్పందాన్ని ఆంధ్ర పాలకులు తమ మనసులో ఆనాడే తగులపెట్టారు... వరుసగా 1956నుంచి 1971 వరకు ముఖ్యమంత్రి పదవిని ఆంధ్ర ప్రాంతం వారే గుత్తకు తీసుకున్నప్పటికీ ఉప ముఖ్యమంత్రిగా ఒప్పందం ప్రకారం తెలంగాణ వారిని నియమించలేదు. కన్నీటి తుడుపులుగా తెలంగాణ మంత్రులకు బైటికి కనిపించేటట్టు ముఖ్యశాఖలు అప్పగించినా లోలోపల చేయవలసిన బద్మాషీ చేశారు. హోంశాఖ తెలంగాణ వారికి ఇచ్చినప్పుడల్లా లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రే ఉంచుకున్నారు. పరిశ్రమల శాఖ ఇచ్చినప్పటికీ దాన్ని మధ్య రకం, పెద్ద రకం, చిన్న రకం అని మూడు తునకలు చేసి ఒక తునక తెలంగాణవారికి పారేశారు. నీటి పారుదల విషయంలో అదే జరిగింది. తెలంగాణ వారికి నీటి పారుదలశాఖ అప్పగించిన ప్రతిసారీ తెలంగాణకు ద్రోహం చేసేందుకే సదరు తెలంగాణ మంత్రిని వాడుకున్నారు.
తెలంగాణ రాష్ట్రోద్యమాలు, ఆదిరాజు వెంకటేశ్వరరావు, పే.38
ఆంథ్రప్రదేశ్ రాజ్యాంగ రథానికి అమర్చిన రెండు చక్రాలలోనూ... మద్రాసు చక్రం ఇంగ్లీషులో, హైదరాబాద్ చక్రం ఉర్దూలో కిరకిరమనడం ప్రారంభించాయి. ఉద్యోగుల సీనియారిటీలలో ఆదిలోనే యిబ్బందులేర్పడ్డాయి... ఎంతో మంది ఉద్యోగులు తెలంగాణావారు పై స్థాయినుంచి కిందికి దిగవలసి వచ్చింది.
దీనికితోడు ఆంధ్ర రాష్ట్రంలో అమలులో వున్న మద్రాసు వారసత్వం అయిన టాటెన్ హం కోడు ప్రకారం పరిపాలన జరుగాలన్నారు. అదివరకు హైదరాబాద్‌లో బొంబాయి పద్ధతి అమలులో ఉండేది. ఒకటి సవ్యం; ఇంకొకటి అపసవ్యం. ఈ సవ్యాపసవ్యాల సామరస్యం కుదరలేదు... గవర్నరు మొదలు బంట్రోతువరకూ తెలంగాణావారికి పనిరాదని, వీరు సోమరులనీ అన్నారు. ప్రభుత్వంలో కీలకమైన ఉద్యోగస్థులమధ్య రాజీ కుదరలేదు. ఇరుపక్షాల రాజకీయ నాయకుల మధ్య అనుమానాలు సడలలేదు. మనంమనం అనే భావం ఆదిలోనే కలగలేదు...
... విశాలాంధ్ర వాదులైన మందుముల నరసింగరావు, వి.బి.రాజులకు తెలంగాణా గ్రామీణ ప్రాంతాలలో పెద్దగా బలం లేదు. బలం ఉన్న నాయకుడు కొండా వెంకటరంగారెడ్డి. ఆయన వర్గం రెండుగా చీలి ఉంది. ఇలాంటి రాజకీయవేత్తలకు నిలయంగా ఉన్న తెలంగాణాలో నీలం చక్కని పద్మవ్యూహం పన్నారు. విశాలాంధ్ర వాదులను చేతిలో పట్టుకుని తెలంగాణావాదులను చీలగొట్టారు.
... తెలంగాణా అభివృద్ధికి విడిగా అభివృద్ధిసంస్థ అవసరమని తెలంగాణావారు కోరగా, విడి సంస్థ అనేది అవరోధమే కాని, అసలు పని జరుగనివ్వదని సంజీవరెడ్డి అన్నారు. తెలంగాణా మంత్రులందరూ తమ ప్రాంతం అభివృద్ధికి శ్రద్ధ చూపుతూ ఉంటే తాను కాదనన్నారు. కాని ఆచరణలో అలాంటి ప్రత్యేక శ్రద్ధలేదనిపించారు... తెలంగాణాలో జరిగిన పెద్దమనుషుల ఒడంబడిక అమలు అనవసరమని తెలంగాణావాదులే అనేట్టుచేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్ర, జి.వెంకట రామారావు, పే.70-73
నాడు సంజీవరెడ్డి థిద్దిన ఒరవడే నేటికీ కొనసాగుతున్నది. పార్టీలూ నాయకుల పేర్లలో తేడాలే తప్ప రాజకీయ మోతుబరుల వైఖరిలో మార్పులేదు. గద్దెమీద తెలంగాణవాడున్నా తెలంగాణకు ఒరిగింది ఏమీలేదు. ఆమాటకొస్తే గద్దెమీద ఏ ప్రాంతంవాడున్నా ఏ ప్రాంతానికీ నికరంగా ఒరిగిందిలేదు. ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడుతూ ఎంతమంది ఎన్ని ఉద్యమాలు నడిపినా... చివరికి చాటుమాటున బేరాలు కుదుర్చుకుని, జేబులు నింపుకుని, ఉద్యమాన్ని అమ్ముకుని, నమ్ముకున్న జనాన్ని మోసంచేయటమే ఎక్కువగా చూశాము.
నడిపేవాడు రాజకీయ జీవి అయినంతకాలమూ, లేదా ఉద్యమ నాయకత్వం రాజకీయ దుష్ప్రభావానికి మెల్లిగా అయినా లోనయినంతకాలమూ ఏ ఉద్యమంవల్లా ఏ ప్రాంతానికీ నికరంగా ప్రయోజనం ఉండదు. సమైక్యవాదుల నెత్తినా, వేర్పాటువాదుల నెత్తినా రాజకీయ దుష్టగ్రహాలు తిష్ఠవేసినంత పర్యంతమూ... ఇక్కడి తోలుబొమ్మలను ఢిల్లీవాళ్లు ఆడించే పాపిష్టి పద్ధతి సాగినంతదాకా... జాతి నేతలనబడే జాతీయ పీతల దయాదాక్షిణ్యాలపై తెలుగువారి ప్రాప్తం ఆధారపడినంతవరకూ... తమవాళ్లనుకున్నవాళ్లే నిజానికి తమ పగవాళ్లన్న అసలు రహస్యాన్ని ప్రజలు గుర్తించి, కళ్లు తెరవనంతవరకూ...
ఈ కథ ఇంతే! రాష్ట్రం కలిసున్నా, విడిపోయినా ప్రజల నోట మట్టిగడ్డే!!
(అయిపోయంది.)