నీకూ, నాకూ అస్సలు కలవదురా..నువ్వే నేను, నేనే నువ్వు గా బ్రతకడం కష్టం. మనిద్దరం, భూమికి ఒకరు ఉత్తర ధృవం అయితే, మరొకరు దక్షిణ ధృవం లాంటి వాళ్లం, మనమెప్పుడూ కలవలేము...ప్లీజ్, ఇంక నన్ను విసిగించకు.
నువ్వేమో, అబద్దాలు చెప్పొద్దు అంటావు, మోసాలు చేయొద్దు అంటావు..ఉర్లోంచి వచ్చాం కదా, అక్కడి ప్రకృతి అంతటి స్వచ్ఛంగా, అక్కడి సెలయేరంతటి పారదర్శకంగా ఉండాలంటావు. ఇంకా వదిలేస్తే, మనం పుట్టి పెరిగిన వాతావరణం, మనం తిరిగిన పావురాల గుండ్లు, మాకుళ్ల జాతర, అవన్నీ గుర్తు చేస్తావు నువ్వు నువ్వుగా ఉండరా అంటావు..
నేను అదే అంటున్నాను..అదేదో చెప్పినట్టుగా రోం లో ఉన్నప్పుడు రోమన్ గా కదరా ఉండమన్నారు..నేనూ అలాగే కదా ఉంటున్నాను...పట్టణం లో కదా ఉంటున్నాను, పట్టణీకుడిలా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను.. వాళ్లలా అరిగినా అరగకున్నా, ఆ దిబ్బ రొట్టెలు (పిజ్జాలు) తింటూ, మళ్లీ అది అరగడానికి, శీతాకాలంలో కూడా శీతలపానీయాలు తాగుతూ...మళ్లీ పొద్దున్నే రోడ్డు మీద పరిగెడ్తూ, అప్పుడప్పుడూ భక్తి బురఖా వేసుకుని గుళ్ల చుట్టూ తిరుగుతూ... నేను నేనులా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను.
అయినా, నువ్వన్నట్టుగా, మనుషుల్ని మనుషులుగా చూసే జనాలు ఎక్కడ్రా ఉన్నారు ఈ భూమ్మీద ఇంకా? అమ్మా నాన్నల్ని గౌరవించమంటావు, గౌరవిస్తున్నా కాబట్టే, నన్నెందుకు చిన్నప్పటి నుంచే పట్టణం లో పెంచలేదు, అలా పెంచి ఉంటే ఇప్పుడు ఇవన్నీ ఇలా కొత్తగా నేర్చుకోవాల్సిన అవసరం ఉండేది కాదు కదా అని అడుగుతున్నా..వాళ్ల మనసుని నొప్పించకు అంటావు, నొప్పించక, తానొవ్వక ఉండే సుమతుల గురించి భలే చెప్తావురా.
పొద్దున్న లేచిన దగ్గరి నుంచి, వాట్సప్ లో మొదలు పెట్టి, కాఫీ షాప్ వాడి దగ్గరా, ఇడ్లీ బండి దగ్గరా, ఆటో వాడి దగ్గరా..ఇంకా ఆఫీస్ లో అయితే చెప్పాల్సిన అవసరమే లేదు, నోరు తెరిస్తే వెయ్యి అబద్దాలు చెప్పి, మళ్లీ ఇంటికొచ్చాక, అమ్మ వాళ్లకు ఫొన్ చేయబోయి, అమ్మాయికి ఫోన్ చేసి, మళ్లీ, మళ్లీ, ఇలా అబద్దాలతోనే కదరా మేమందరం కాలక్షేపం చేస్తున్నాం.
ఎవడో ముక్కూ మొహం తెలియని వాడి ముందు తల వంచి, వినయంగా ఉండగలిగినప్పుడు, గౌరవించగలిగినప్పుడు, కన్న తల్లిదండ్రులనెందుకు గౌరవించవురా అంటే, అది ఆఫీస్, అక్కడెంత ప్రొఫెషనల్ గా ఉండాలో నీకేం తెలుసు రా.
అయినా నువ్వెక్కడ దొరికావురా బాబూ...నీతి, నిజాయితీ అంటూ వెంటపడ్తావు. నీకు తెలీదు, నేను ఎంత కష్ట పడుతున్నానో. వ్యాల్యూస్ అంటావ్, ఎథిక్స్ అంటావు, ఈ రోజుల్లో నీతిగా ఉంటే పనులు జరగవ్ అన్న కొత్త నానుడి నువ్వు వినలేదా? అయినా మనం మనుషులం కదా అని నువ్వంటావు. మనుషులం కాబట్టే, మనకామాత్రం స్వేచ్ఛ ఉంది అని నేనంటాను.
ఏం, కుక్కలకి కుక్కత్వం (కుక్కలూ నన్ను క్షమించండి), పిల్లులకి పిల్లుత్వం లేనప్పుడు (పిల్లులూ నన్ను క్షమించాలి), మనుషులకి మాత్రమే మానవత్వం ఎందుకుండాలి రా. అయినా సొంత అన్నని గౌరవించనివాడి గురించి, అమ్మా నాన్నలకి, సంవత్సరానికొక్కసారి ఫోన్ చేస్తూ, అత్తా మామలకి మాత్రం రోజుకొక్కసారికి ఫోన్ చేసేవాడి గురించి నువ్వు వినలేదేమో.
అమ్మాయి కోసం ప్రాణం తీసుకునే వాడు, వాళ్ల అమ్మా నాన్నలు వీణ్ని పెంచడానికి పడ్డ కష్టం కోసం, ఒక వెయ్యిసార్లయినా, ప్రాణం తీసుకోవాల్సొచ్చేది అని నువ్వంటావు. కానీ నీ అంత ఉన్నతంగా ఆలోచించే వాళ్లెవరురా ఈ ప్రపంచం లో. ప్రేమించటం, ప్రేమించబడటం కాదురా, ముందుగా మనిషిగా బతకడం నేర్చుకోరా అంటావు.
నిన్ను నాలో కలుపుకుని, నీతో కలిసి బతకమంటావు, అదెలా సాధ్యం రా. నీ పేరు తెలిసిన వాడెవ్వడూ, నీ క్వాలిటీ గురించి తెలిసిన వాడెవ్వడూ, నిన్ను ఒక క్వాలిటీగా చేసుకొని బ్రతకమంటే, నీ మాట వినడు. ఎందుకంటే, నీ పేరు నిజాయితీ, నా పేరు మనిషి.