ఎప్పటికెయ్యది ప్రస్తుతమో అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగువాడు ధన్యుడన్నాడు సుమతీ శతకకారుడు. ఆ రకంగా చూస్తే జాతీయ కాంగ్రెసు నాయకులను మించిన ధన్యజీవులు లేరు. సమయానుకూలంగా ప్లేటుమార్చడంలో వారికి వారే సాటి.
జాతీయోద్యమ కాలంలో ‘మా రాష్ట్రం సంగతేమిటి’ అని మనవాళ్లు ఎప్పుడు అడిగినా కాంగ్రెసు మహానేతలు ‘స్వతంత్రం వచ్చీరాగానే ముందు చేసే పని అదే. అప్పటిదాకా గుర్రాన్ని కట్టెయ్యమని’ బదులు చెప్పేవాళ్లు.
1931లో రౌండ్ టేబిల్ కాన్ఫరెన్సుకోసం గాంధీగారు లండన్ వెళ్ళబోతుండగా ఆంధ్రా నాయకుల డెలిగేషను ఆయన చెంతకుపోయి ‘దయచేసి కాస్త మా రాష్ట్రం సంగతి కూడా అక్కడ మాట్లాడండి’ అని వేడుకుంటే మహాత్ముడు ఏమన్నాడు? ‘‘ఆ హామీ ఇవ్వలేను. కాని స్వరాజ్యం రాగానే భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పరచటం గ్యారంటీ. కాంగ్రెసు విధానమే అది అయినప్పుడు మన చేతికి పవరు రాగానే మీ రాష్ట్రం మీకు రాకేం చేస్తుంది’ అని నమ్మకంగా భరోసా ఇచ్చాడు.
1938లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు ప్రతిపాదనను బ్రిటిషు విదేశాంగమంత్రి పార్లమెంటులో కరాఖండిగా తోసిపుచ్చి ఆంధ్రుల ఆశలమీద చన్నీళ్లు చల్లాడు. అది అన్యాయం అని మేమే వెళ్లి బ్రిటిషు ప్రభువులకు నచ్చచెప్పుకుంటాం. దయచేసి అనుమతించండి అని రాష్ట్ర కాంగ్రెసువారు ప్రాధేయపడ్డప్పుడు కాంగ్రెసు వర్కింగు కమిటీ ఏమి చేసింది? కుదరదు పొమ్మని కొట్టిపారేసింది. ప్రతినిధి వర్గం లండన్ వెళ్లి దేబిరించడం కాంగ్రెసుకు పరువుతక్కువ అని బింకాలకు పోయింది. అదేమిటయ్యా అని పత్రికలవాళ్లు అడిగితే అప్పటి అఖిల భారత కాంగ్రెసు అధ్యక్షుడు సుభాస్ చంద్రబోస్ ఏమన్నాడు? ‘ఇంగ్లండుకు ప్రతినిధివర్గం పంపటం అనుచితం, అనవసరం; మీరు ఆందోళన చేసినా చెయ్యకపోయినా, కాంగ్రెసుకు రాజ్యాధికారం రాగానే తన ప్రకటిత విధానం ప్రకారం భాషారాష్ట్రాలను ఏర్పాటుచేస్తుంది. ఆలోగా మీరు మనసు మార్చుకోకపోతే... మీకూ రాష్ట్రం వస్తుంది’ అని బల్లగుద్ది చెప్పాడు.
మనవాళ్లు ఔనుకాబోలనుకున్నారు.
1946లో ఆంధ్ర రాష్ట్రం కావాలంటూ అవసరమైతే సత్యాగ్రహం చేయాలని ఆంధ్ర మహాసభ తీర్మానించాక, మార్గదర్శనం చెయ్యమంటూ ఆంధ్ర మహాసభ అధ్యక్షుడు సర్ విజయ లేఖ రాస్తే మహాత్మాజీ ఏమని బదులిచ్చాడు?
‘‘At a time when Independence is coming, why any agitation or threat of civil disobedience for it? Is there any Indian who has got a different opinion on the subject?’’
(స్వాతంత్య్రమే వచ్చేస్తున్న తరుణంలో ఇప్పుడు మీ రాష్ట్రంకోసం ఆందోళనెందుకు? శాసనోల్లంఘన బెదిరింపు ఎందుకు? ఈ విషయంలో ఏ భారతీయుడికైనా ఇందులో భిన్నాభిప్రాయం ఉన్నదా?)
నేతాజీ మొదలుకుని మహాత్మాజీ దాకా జాతీయ మహానాయకులు వరసగా ఇస్తూ వచ్చిన ఈ హామీలనుబట్టి ఎవరికైనా ఏమనిపిస్తుంది? భాషాప్రయుక్త రాష్ట్రాల విధానానికి కాంగ్రెసు సంస్థ శాశ్వత చందా కట్టింది కనుక- ఆ విధానానికి ఆదిమూలమని, అసలు ప్రేరణ అని మహాత్ముడే అంగీకరించిన ఆంధ్ర రాష్ట్రం కోరికను కాంగ్రెసు చేతికి అధికారం వచ్చీరాగానే అర్జంటుగా తీర్చేస్తారనే కదా?
కాని- మన నాయకుల మాట నీటి మీద రాత. బిడ్డను జోకొట్టటానికి తల్లి ‘చందమామరావె’ అని పాట పాడినట్టు- ఆందోళనలూ, శాసనోల్లంఘనలూ చేసి బ్రిటిషు సర్కారువారికి నెత్తినెప్పి తేకుండా ఆంధ్రులను జోకొట్టటానికి ‘ఆంధ్ర రాష్ట్రం రావె’ అని ఏళ్లతరబడి జోలపాట పాడారు. అక్కర తీరి, తీరా అధికారం తమ చేతికి కాస్త చిక్కగానే అడ్డం తిరిగి, ‘ఆంధ్ర రాష్ట్రం రాదె’ అని బాణీ మార్చారు. ఆంధ్రులనోట మన్నుకొట్టారు.
‘స్వాతంత్య్ర’రథమెక్కి ఆంధ్ర రాష్ట్రం అదిగో వచ్చేస్తున్నదని ఆంధ్ర మహాసభ అధ్యక్షుడు సర్ విజయకు 1946 మార్చి 22న గాంధీ మహాత్ముడు గ్యారంటీ లేఖ రాసి మూణ్నెల్లు తిరక్కుండా ‘కేబినెట్ మిషను ప్లాను’ తయారైంది. హిందూ మెజారిటీ రాష్ట్రాలు, ముస్లిం మెజారిటీ రాష్ట్రాలు అంటూ రెండు విభాగాలు చేసిన ఆ సర్కారీ ప్లానులో భాషారాష్ట్రాల ఏర్పాటు ఊసే లేదు. ‘ప్లానులోనే లేనప్పుడు మాకు రాష్ట్రం ఎలా వస్తుందండీ; దయచేసి మీరు దీని గురించి ప్రభుత్వాన్ని అడగండి’అని కాంగ్రెసు వర్కింగు కమిటీని ఆంధ్ర మహాసభ అడిగింది. వర్కింగ్ కమిటీ దాన్ని ఈ చెవితో విని ఆ చెవితో వదిలేసింది.
స్వాతంత్య్రం రావటం, దానితోబాటు దేశ విభజన కావటం తప్పదని రూఢి అయ్యాక 1947 ఏప్రిల్‌లో మద్రాసు శాసనసభ ఓ తీర్మానం చేసింది. మా రాష్ట్రాన్ని తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాలుగా విడగొట్టి రాబోయే రాజ్యాంగంలో చేర్చవలసిందని అందులో భారత సర్కారుకు సిఫారసు చేసింది. అదే నెల ఆంధ్రమహాసభ అత్యవసరంగా సమావేశమై... నూతన రాజ్యాంగంతోబాటే ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకూ అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయవలసిందని కాన్స్టిట్యుయెంట్ అసెంబ్లీ (రాజ్యాంగ నిర్మాణసభ)ని గట్టిగా కోరింది. ఈ విషయంలో అప్పటికే జరిగిన విపరీత జాప్యంపై సభికులు తీవ్ర ఆందోళనను, ఆగ్రహాన్ని వెలిబుచ్చారు.
బహుశా దీన్ని గమనించే... రాజ్యాంగ నిర్మాణ సభ వారి సబ్ కమిటీ భాషా రాష్ట్రాల ఏర్పాటుపై ఒక కమిషను వేయాలని భారత ప్రభుత్వానికి 1946 జూన్‌లో సిఫారసు చేసింది. అప్పుడు భారత ప్రభుత్వాన్ని నడుపుతున్నది కాంగ్రెసు మహానేత జవహర్లాల్ నెహ్రూగారే. ఐనా ఆ సిఫారసును పట్టించుకున్న దిక్కులేదు.
1947 ఆగస్టు 15 వచ్చింది. దేశ విభజన జరిగిపోయింది. తరవాత ఎప్పుడో తీరిగ్గా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగేదాకా ఆంధ్ర రాష్ట్రం డిమాండు ఎక్కడ అడుగున పడుతుందోనని ఆంధ్ర నాయకులు భయపడ్డారు. టంగుటూరి ప్రకాశం, దుర్గాబాయి దేశ్‌ముఖ్, ఎన్.జి.రంగా, అనంతశయనం అయ్యంగార్లు ప్రతినిధి వర్గంగా వెళ్లి ఉప ప్రధానమంత్రి సర్దార్ పటేల్‌ని కలిశారు. ‘మీకు మొదటినుంచీ అన్నీ తెలుసుకదా! మా రాష్ట్రం ఏర్పరుస్తూ మీ అధికారాన్ని ఉపయోగించి వెంటనే ఉత్తర్వు ఇవ్వండ’ని వేడుకున్నారు. పటేల్‌గారు ఆ విషయం తప్పక చూస్తానన్నారు. కాని- చూడలేదు.
స్వతంత్ర భారత ప్రథమ ప్రధాని నెహ్రూగారు 1947 నవంబర్ 27న రాజ్యాంగ నిర్మాణ సభలో నిలబడి ఒక గొప్ప ప్రసంగం చేశారు. ‘ఆంధ్రరాష్ట్రం డిమాండు చాలా న్యాయం, బోలెడు సమంజసం. కర్ణాటక, మహారాష్టల్ర విషయంలోనైతే సమస్యలున్నాయి కాని, ఆంధ్రరాష్ట్రం ఏర్పాటుకు చిక్కేలేదు. రాజ్యాంగంలో రాష్ట్రాల జాబితాలో దాన్ని నిరభ్యంతరంగా చేర్చవచ్చు.’ అని ఆయన ఎలుగెత్తి చాటాడు. ప్రధానమంత్రే ఒప్పుకున్నాక ఇక అడ్డేముంది, మన రాష్ట్రం మనకు వచ్చేసినట్టేనని ముక్కోటి ఆంధ్రులూ తెగ మురిసిపోయారు.
ప్రధాని ప్రకటన తరవాత- రాబోయే రాజ్యాంగం మొదటి షెడ్యూల్‌లో, ఉండబోయే రాష్ట్రాల జాబితాలో ఆంధ్ర రాష్ట్రాన్నీ చేర్చారు. రాజ్యాంగం ముసాయిదాకు కూడా ఎక్కాక ఆంధ్రరాష్ట్రానికి న్యాయంగా అయితే అడ్డేమీ ఉండకూడదు. 1950 జనవరిన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినరోజే ఆంధ్ర రాష్టమ్రూ ఆటోమెటిగ్గా అవతరించి ఉండాలి. కాని- ఆంధ్రుల దురదృష్టమేమిటో గానీ- ప్రతిదీ సమస్యే; వారు కోరేది ఏదైనా ఎండమావే.
రాజ్యాంగం అమలయ్యేదాకా ఆగనక్కర్లేదు. లోగడ మేము సర్దార్‌పటేల్‌ని అడిగిన ప్రకారం ఇంకో మూణ్నెల్లలోనే భారత ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పరుస్తూ ఉత్తర్వు చేయబోతున్నదని 1948 జనవరిలో టంగుటూరి ప్రకాశం ఒక ప్రకటన చేశాడు. ఇంకేం- మరీ మంచిదని తెలుగువాళ్లు మహదానందపడ్డారు. అది అరవలకు కంటగింపైంది. అలాగైతే ఆంధ్రతోబాటు అచ్చంగా మాకూ ప్రత్యేక రాష్ట్రం కావాలని రాజ్యాంగ సభలో పదిమంది తమిళ సభ్యులు ప్రధానమంత్రిని కలిసి డిమాండు చేశారు. తమిళ రాష్ట్రం కావాలంటూ తమిళులు గవర్నమెంటును కోరటం చరిత్రలో అదే మొట్టమొదటిసారి. వాళ్లు నిలదీసేసరికి నెహ్రూగారు నీళ్లు నమిలారు. ఆంధ్రులకు రాష్టమ్రా? అబ్బే, అలాంటిది ఏమీలేదు. తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదు- అని చెప్పి తప్పించుకున్నారు.
అదే సమయంలో అంబేద్కర్‌గారు ఇంకోమాట అన్నారు. తమిళులే కాదు- కన్నడిగులు కూడా ప్రత్యేక రాష్ట్రం అడుగుతున్నారు; తమ సంగతి తీర్చేదాకా ఆంధ్ర రాష్ట్రాన్ని ఇవ్వకూడదని పట్టుబడుతున్నారు- అని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించాడు. దాంతో నెహ్రూగారికి చిర్రెత్తింది. ఆంధ్రులకు రాష్ట్రాన్నిచ్చి కందిరీగల తుట్టెను కదిలించడమెందుకు, ఎగ్గొడితే పోదా- అని ఆయన తలిచాడు. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా? నూతన రాజ్యాంగం ముసాయిదా ఫస్ట్ షెడ్యూల్‌లో చేర్చిన ఆంధ్ర రాష్ట్రాన్ని సర్కారు ఉత్తర్వు ప్రకారం అర్జంటుగా చెరిపేశారు. ఆంధ్రుల సంబరం మూణ్నాళ్ల ముచ్చటయింది.
ఇది జరిగిన కొద్దివారాలకు (1948 మార్చిలో) నెహ్రూగారు విశాఖపట్నం వచ్చారు. ఏమిటండీ మాకిలా అన్యాయం చేశారు అని అడిగితే ఆయనో సంగతి చెప్పాడు. రాజ్యాంగం ఖరారవకుండానే ఫస్ట్ షెడ్యూలులో ఆంధ్ర పేరు చేర్చితే ముసాయిదా రాజ్యాంగాన్ని ఆమోదించే లోపే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయిపోవాలట. దానికి వ్యవధి చాలదట. అందుకని ఆంధ్రరాష్ట్రం ఏర్పాటుగురించి అన్ని అంశాలూ పరిశీలించడానికి వచ్చేనెల ఓ కమిటీ వేస్తారట. దాని సిఫారసులనుబట్టి కొత్త రాష్ట్రం హద్దుల నిర్ధారణకు ఇంకో కమిషనును వేస్తారట.
ఇది తెలిసి మిగతా భాషలవారికి కళ్లుమండాయి. ఒక్క ఆంధ్రులకోసమే కమిటీ ఏమిటి? కమిషను ఏమిటి? మాకూ రాష్ట్రం కావలసిందే, మా సంగతీ తీర్చాల్సిందేనంటూ కన్నడిగులు, మహారాష్ట్రులు పేచీపెట్టారు. సర్కారు పెద్దలూ వారిని బుజ్జగించటం మొదలెట్టారు. ఇక ఊరుకుంటే లాభంలేదని ఆంధ్రులకు అర్థమైంది. తమ రాష్ట్రం ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసేందుకు సత్యాగ్రహం చెయ్యాలని ఒక దశలో వారు ఆలోచించారు. 1948 ఏప్రిల్ ఎ.ఐ.సి.సి.లో ఈ విషయమై నెహ్రూని నిలదీస్తే స్వరాజ్యంలో సత్యాగ్రహమేమిటని చిరాకుపడ్డాడు. ప్రజాభిప్రాయ తీవ్రత అర్థమయ్యాక దారికివచ్చి, కమిషను వేస్తాములెమ్మని వరమిచ్చాడు.
అన్నట్టే ఎస్.కె.్ధర్ అధ్యక్షతన కొత్తగా ఒక కమిషను వేశారు. కాని దాని పరిశీలనాంశాల దగ్గరికి వచ్చేసరికి మళ్లీ ఆంధ్రులకు అన్యాయం జరిగింది. ఆంధ్రాకోసం ప్రత్యేకంగా ఒక కమిషను వేస్తామని మొదట్లో ఇచ్చిన మాట గాలికి పోయింది. ‘ఆంధ్ర, కర్ణాటక, కేరళ, మహారాష్టల్ల్రో ప్రత్యేక రాష్ట్రం ఇవ్వదగ్గవేవి? వాటికి సరిహద్దులు ఎలా ఉండాలి? ప్రత్యేక రాష్ట్రం ఇవ్వటంవల్ల పాలనాపరంగా సాధకబాధకాలేమిటి? పొరుగు ప్రాంతాల్లో తలెత్తే సమస్యలేమిటి’ అన్నవి ధార్ కమిషన్‌ను ఆలోచించమన్నారు. దాంతో ఆంధ్రరాష్ట్ర వ్యవహారం దక్షిణ భారతపు పులుసులో కలిసిపోయింది. ‘ఆంధ్రరాష్ట్రాన్ని ఎలా ఇవ్వాలి’ అన్నది పోయి ‘ఇవ్వాలా వద్దా? ఇస్తే ఏమవుతుంది?’ అన్నది చర్చనీయాంశంగా మారడంతో ఆంధ్రరాష్ట్రం రావడమే ప్రశ్నార్థకమైంది.
ధార్ కమిషనువారు వెయ్యి మెమొరాండాలను స్వీకరించి, 6700 మంది సాక్షులను విచారించారు. తమ ముందుకు వచ్చినవారిని వారు ప్రశ్నించిన తీరునుబట్టే భాషాప్రయుక్త రాష్ట్రాలకు మొండిచెయ్యి చూపటానికి తెరవెనుక ఏదో పెద్ద కథే నడుస్తున్నదన్న అనుమానం చాలామందికి కలిగింది. తనకు అప్పగించిన పనిని ఆరునెలల లోపే చకచకా ముగించి 1948 డిసెంబరు 1న కమిషను ఏకగ్రీవంగా ఒక బృహత్ నివేదికను సమర్పించింది. 13న దాన్ని ప్రజలముందు పెట్టారు. ఘనత వహించిన కమిషనువారు అందులో తేల్చింది ఏమిటంటే- భాషాప్రయుక్త రాష్ట్రాలను జనం గట్టిగానే కోరుతున్నారట. కాని భాష ప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పరచటం చాలా తప్పట. ఎందుకంటే అది ఉపజాతీయతను ప్రేరేపించి భారత జాతీయతకు గొడ్డలిపెట్టు అవుతుందట. పెద్ద రాష్ట్రాలను ఎలాగైనా విడగొట్టవచ్చు- ఒక్క భాష ప్రాతిపదికన తప్ప.. అని ధార్ సంఘం ఉవాచ.
ఈ కమిషను రిపోర్టు దేశంలో ఎవరినీ తృప్తిపరచలేదు. భాషా రాష్ట్రాలకోసం ఆంధ్రలోనూ, ఇతర ప్రాంతాల్లోనూ ప్రభుత్వంమీద ఒత్తిడి పెరిగింది. అదే సమయంలో పట్ట్భా సీతారామయ్య అఖిల భారత కాంగ్రెసు అధ్యక్షుడయ్యాడు. ఆ ఏడు డిసెంబరు ఆఖరున జైపూర్‌లో జరిగిన కాంగ్రెసు వార్షిక మహాసభలో ఆంధ్ర ప్రతినిధులు రాష్ట్రంకోసం గట్టిపట్టుపట్టారు. ఇక తప్పనిసరయి కాంగ్రెసు తరఫున ఒక హైలెవెల్ కమిటీని వేశారు. ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, ఉప ప్రధాని వల్లభ్‌బాయ్ పటేల్, కాంగ్రెసు అధ్యక్షుడు పట్ట్భా అందులో సభ్యులు. ముగ్గురి పేర్లమొదటి అక్షరాలతో ఇది జె.వి.పి. కమిటీగా ప్రసిద్ధిచెందింది. ఆ కమిటీ మూడునెలలు మల్లగుల్లాలు పడి 1949 ఏప్రిల్ మొదట్లో వర్కింగ్ కమిటీకి నివేదిక ఇచ్చింది. అందీ అందగానే వర్కింగ్ కమిటీ (ఏప్రిల్ 9న) దాన్ని ఆమోదించింది. చివరికి అందులో చల్లగా తేల్చింది. ఏమనంటే- భాషారాష్ట్రాల ఏర్పాటు ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచిదికాదు; కనీసం కొన్ని సంవత్సరాలయనా వాయిదావెయ్యాలని!
కాకపోతే ఆంధ్రులమీద దయతలిచి దీనికో షరా పెట్టారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు విషయంలో విస్తృతమైన ఏకాభిప్రాయం ఉన్నందున మొదటగా ఆ రాష్ట్రాన్నయితే ఇచ్చెయ్యవచ్చట. కానీ- కొన్ని షరతులకు లోబడి!
షరతులు?
వచ్చేవారం చూద్దాం. *