అచంచలమైన నీ భక్తి, అనంతమైన నీ ప్రేమ, అపరిమితమైన నీ విశ్వాసం ముందు, వయస్సును ప్రతిబింబించని నా మాటలు, నా ఆలోచన, నా దుందుడుకు తనం..నిన్నెంత
బాధించాయో కదా. రంధ్రాన్వేషణ చేసే నా ప్రవర్తన, తులనాడే నా స్వబావం నిన్నూ, నీ మనసును ఎంతగా మెలివేశాయో ఇప్పుడు తలుచుకుంటే, నా మీదా, నా వ్యవహార శైలి మీదా నాకే అసహ్యంగా ఉంది.
నీ ఆలోచనా విధానం, నీ ఆచరణా, నీ పద్దతీ, నీ నిబద్దతా ...ఇవన్నీ ఇప్పుడిప్పుడే నాలో చొరబడి, నన్ను, నా వయస్సుతో పెరగని నా బుద్ది నీ అపహస్యం చేస్తున్నాయి.
వయస్సు చూద్దామన్నా, లేదా అనుభవం చూద్దామన్నా ఎందులోనూ తర్పీదు పొందినట్లుగా అగుపించని నీవు, చదువులోనూ, అందులోంచి నువ్వు నేర్చుకున్న సంస్కారాన్నీ,
విజ్ఞాణాన్నీ, ఎంత ఒడుపుగా, మరెంత ఒద్దికగా వాడుతావో, నీ అభిబాషణని ఎంత సరళంగా వ్యక్తం చేస్తావో..ఎక్కడినుంచి వచ్చింది నీకంతటి నేర్పరితనం?
నీ ప్రేమని అర్థం చేసుకునేంతటి మనస్సు నాకెందుకు లేకపోయింది? నీ భావ చాతుర్యం, భావ గాంభీర్యం...నీ చతురత..నన్నెందుకు నీవెప్పుడూ అడ్డుకోలేదు? నా అపరిపక్వ వాక్కునీ, నా తొందరపాటునీ నీవెప్పుడూ వేలెత్తి చూపలేదెందుకు?
మలినమైన నా మనస్సు, ఏ మాత్రం స్పురించని మానవత్వం, నీ అమాయకత్వం..నిన్నెంత కృంగదీశాయో!
అంత సున్నితమా ప్రేమంటే? అంత విశ్వాసమా ప్రేమంటే?
నా మటుకైతే, ప్రేమించాలి, ప్రేమించబడాలి. ఎప్పటికెయ్యది ప్రస్తుతమో కావొచ్చు లేక మరేదైనా కావొచ్చు కానీ, నాకు గురి కలిగినంత వరకే ప్రేమ. అనంతమైన ప్రేమ,
ప్రాణమివ్వగలిగేంతటి ప్రేమ, ఏదైనా భరించగలిగే ప్రేమ, దేనికైనా సిద్దమెన ప్రేమ.ఇవన్నీ ఒట్టి ట్రాష్. అంతా బూటకం. నాకు లేని ప్రేమ నీకెలా కలుగుతుంది? నేను
విసిగించుకుంటున్నా, నా మనసు నిన్ను అంత ఇదిగా కోరుకోకున్నా, నీకెలా ఇవన్నీ సాధ్యం?
అయినా, నాకు నచ్చిన పనిని నువ్వు చేసినప్పుడే, నాకు నచ్చినట్టుగా నువ్వు మాట్లాడినప్పుడే, నువ్వు నడుచుకున్నప్పుడే, నాకు నీ మీద ప్రేమ పుడుతుంది గాని, నన్నుమార్చాలని
చూసినప్పుడు, నాకేదో నేర్పించాలని ప్రయత్నించినప్పుడు, నాకు నీ మీదెలా ప్రేమ పుడుతుంది? నేను పై మెట్టు మీద ఉండి, నిన్ను బెట్టు చేస్తున్నప్పుడు, నిన్ను, నేను నవ్వుకోవడం
కోసం నిన్ను పరిహసిస్తున్నప్పుడు , నువ్వు ఉడుక్కోవడం. ఇలాగే ఉండాలి ప్రేమ గాని, త్యాగం, సాహసం, అంకితం ..వీటన్నిటికి అర్థాలు కూడా వెతకాలా పైగా?
నీకైనా, నాకైనా, మరెవరికైనా, ప్రేమంటే అంతే, ఏదో అప్పటివరకు నువ్వు కావాలనిపించినంతవరకు, అది మోహమో, కామమో, ప్రేమో లేక అవసరమో, అంతే,
అప్పటివరకు నువ్వు కావాలి, ఆ క్షణంలో నీకోసం ఏది చేయడానికైనా నేను సిద్ధం. ఆ సమయంలో, నువ్వు నా పక్కన లేకున్నా, నీ ఆలంభన, నీ చుంభనం, నీ ఓదార్పు, నన్ను
నీ కౌగిలిలో బంధించుకోవటం, ఇందులో ఏ ఒక్కటి మిస్సయ్యినా, నా వల్ల కాదు.
అంతేకానీ, జీవితాంతం, ఇలాగే ఉండు, ఇలాంటి ప్రేమనే చూపించు అంటే మాత్రం, ప్లీజ్!
ఇలా, ఇలా మాట్లాడే, నిన్నూ, నీ ప్రేమనూ, నీ సాంగత్యాన్నీ దూరం చేసుకుని, బ్రతుకును భారం చేసుకుని, ఏదో బతుకీడుస్తున్నాను. మరలా బ్రతికేచోట, మనిషినీ,
మనసునీ ఏ మాత్రం గౌరవించని చోట, మళ్లీ మళ్ళి నిన్నే తలుచుకుంటూ, నీకై పరితపిస్తూ..ఉషోదయం వైపు చూస్తూ..