సేవ

అసలు సేవ అంటే ఏంటి?

తమ స్వార్థం కోసమో, వేరే అవకాశం లేకనో, బలవంతం గానో ఒక రంగం లో స్థిరపడి ఆ రంగంలో తర్పీదు పొందిన వారు, ఆ రంగం లో చాలాకాలం మనగలిగిన వారు గొప్పవారా, వారు చేసింది సేవనా, లేక ఒక రంగాన్ని ఎంచుకుని, ఆ రంగంపై పట్టు తెచ్చుకుని, ఎలాంటి స్వార్థం, లాభాపేక్ష లేకుండా, చిరస్థాయిగా ఆ రంగంలో సమాజ హితం కోసం చేసిన సేవ గొప్పదా?

అసలు సేవకు నిర్వచనం ఏమిటి? నిస్వార్ధంగా చేస్తే సేవేనా? సమాజ హితం కోసం చేస్తే? అసలు ఫలితాన్ని ఆశించకుండా చేస్తే? ఎవరూ అడగకుండానే చేస్తే? ఎవరికి తెలియకుండా చేస్తే?

ఈ మధ్య, ఎవరైనా చనిపోయినప్పుడు, పలానా వారు పలానా రంగానికి ఎనలేని సేవ చేశారని అంటూ సంతాప సభలు జరుగుతున్నాయి. అసలు ఎనలేని సేవ అంటే ఏంటి? ఏమీ ఆశించకుండా సేవ చేశారనా? ఎవరూ చేయలేనిది చేశారనా? ఇలాంటిది భూత భవిషత్ వర్తమానాల్లో ఎవరూ చేయలేరనా? అందరికీ, అందరినీ అవే మాటలతో సంతాపాన్ని తెలుపుతుంటే..

సంతాప సభలు పక్కకు పెడితే, పొగడ్తల సభలు జరుగుతున్నాయి, అవే మాటలు, అవే సేవల గురించిన పొగడ్తలు. ఒక సేవ కన్నా మరొక సేవ మిన్న అని చెప్పగలగాలి అంటే, అసలు సేవకు ఒక నిర్వచనం అంటూ ఉండాలి గా.

నిస్వార్థంతో చేసేదే సేవ అయితే, అసలు నిస్వార్థపరులెవ్వరు ఈ భూమ్మీద? మళ్లీ అక్కడ కూడా, నిస్వార్థం అంటే ఏమిటి? లాభాపేక్ష లేకుండా చేసేదే సేవ అయితే, ఎలాంటి లాభాన్ని ఆశించకుండా? నిర్మలమైన మనసుతో చేసేదే సేవ అయితే, అసలు మనసెప్పుడు నిర్మలంగా ఉంటుంది, నిర్మలంగా ఉన్నప్పుడు మనిషి చేసే సేవ నా?