ఆ అలల కెరటా లలో మీ మూఢత్వం కొట్టుకు పోతే ఎంత బాగుండు?.

వాడెవడో!
తెల్ల పంచె!!, నల్ల మీసం!!!
తుమ్మ మొద్దు లాంటి ధృఢమైన కాయం,
ప్రపంచ అందమంతా తన నోట్లోనే దాగుంది చూడండి అన్నట్లు వెకిలి నవ్వొకటి,
వాడి చదువేంటో, అది వాడికి నేర్పిన ఈ కుసంస్కారమేంటో తెలియదు.
నిన్నటి వరకు వాడి ముక్కు మొహం తెలియదు, అభిరుచి తెలియదు,
ఈ సమాజం వాడికి కట్టబెడుతున్న హక్కుల పుర్వాపరాలు తెలియదు.
ఈ మూడు రోజుల తతంగం వెనుక దాగున్న నా మనో క్షోభ వాడికి పట్టదు.

నా ఆశలు, ఆశయాలు, అభిరుచులు చంపుకోవాలి.
దాన్ని మీరు నా త్యాగమంటారు,
కాదు, మీ స్వార్ధ మంటాను నేను.
ప్రతివత అంటారు మీరు,
కాదు, ముర్ఖత్వo అంటాను నేను.

చెదలు పట్టిన సాంప్రదాయలకు బద్ద లవుతున్న గుండెలెన్నో!
దుష్ట సంస్కృతికి భ్రష్టు పడుతున్న జీవితాలెన్నో!!

చిన్నప్పటి నుంచి అపురూపంగా నేర్చుకున్న చిత్ర లేఖనాన్ని ఏ వర్ణం తో ముగించను?
దశాబ్ధ కాల సంగీత సాధనని ఏ అపస్వరం తో సమాధి చేయను??

తలవంచుకుని, మనసు చంపుకుని గుండెలవిసేలా
ఏడుస్తున్న అమ్మాయిల కన్నీటి కాల్వలే సముద్రాలై
సునామి లా ఎగసి, ఆ అలల కెరటా లలో మీ మూఢత్వం కొట్టుకు పోతే ఎంత బాగుండు?.