ఆంధ్రుల కథ - 3

ఎం.వి.ఆర్ శాస్త్రి గారు ఆంధ్ర భూమి ఆదివారం అనుబంధం లో సీరియల్ గా ప్రచురిస్తున్న ఆంధ్రుల కథ యదాతథం గా..


ఆదిలోనే హంసపాదు (May 9th, 2010)

‘‘...ఈ రాజధానియందలి తెలుగు జిల్లానొక ప్రత్యేక రాష్టమ్రుగా స్థాపించుటకు ప్రభుత్వము వారిని కోరవచ్చునా యను నంశమును గూర్చి ఆంధ్ర మహాసభా నిబంధనలను విమర్శించుట కేర్పడిన సంఘమువారు ప్రజల యభిప్రాయములను నిర్ధారణచేసి రాబోవు నాంధ్ర మహాసభ వారికి నివేదించునటులీ సభవారు నిశ్చయించుచున్నారు.’’
బాపట్లలో ప్రథమాంధ్ర మహాజనసభ తీర్మానం మే 27, 1913
ఆంథ్రదేశమంతటా అత్యంత ఆసక్తిని రేకెత్తించి, ఆంధ్రుల్లో అపూర్వ ఉత్సాహాన్ని నింపిన ప్రథమాంధ్ర మహాజనసభ కొసరు విషయాలన్నీ సాకల్యంగా చర్చించింది. అసలు విషయాన్ని మాత్రం పక్కనపెట్టింది.
కొన్ని కుల వర్గాలు, మత వర్గాలు రాష్ట్ర స్థాయిలో మహాసభలు జరుపుకోవటం గతంలోనూ జరిగాయి. కాని - యావదాంధ్రులకు ప్రాతినిధ్యం వహిస్తూ ఆంధ్రజాతి పునరుజ్జీవనాన్ని, అభ్యుదయాన్ని, ఆత్మగౌరవాన్ని కాంక్షిస్తూ అంత విస్తృతస్థాయిలో మహాసభ జరగటం చరిత్రలో అదేమొదలు. 1913 మే 26న మొదలైన ప్రథమాంధ్ర మహాసభకు మొదటిరోజునే 800 మంది ప్రతినిధులు నమోదు అయ్యారు. డెలిగేట్లుకాక చూడవచ్చినవారి సంఖ్య రెండువేల పైచిలుకు. మద్రాసు రాష్ట్రంలోని జిల్లాల నుంచే కాక వరంగల్లు, హైదరాబాదు, నాగపూర్‌ల నుంచి కూడా ప్రతినిధులు హాజరయ్యారు. ఆంధ్ర మహాకవులు, మహావీరులు, వివిధ రంగాల మహా పురుషుల పేర సభాస్థలంలో 22 ద్వారాలను చూడముచ్చటగా నెలకొల్పారు. అన్ని జిల్లాల వారు ఒక్క ఆశయంతో ఒక్క చోట కలవటంతో ఆత్మీయత, సంఘీభావం పెరిగి అందరిలో నూతనోత్సాహం వెల్లివిరిసింది. తొలిరోజు తెల్లవారగానే వందలాది ప్రతినిధులు స్వదేశీ దుస్తుల్లో జాతీయ గీతాలు, త్యాగరాజ కృతులు ఆలపిస్తూ జయజయ ధ్వానాలు చేస్తూ ప్రధాన వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి సభాధ్యక్షుడు రావుబహదూర్ బయ్యా నరసింహేశ్వరశర్మ విడిదికి వెళ్లి వేద స్వస్తితో మంగళహారతి ఇచ్చి, పూలమాలలు వేసి, కొత్త పెళ్లికొడుకులా సభాస్థలికి తోడ్కొని వెళ్లారు. న్యాపతి సుబ్బారావు, గుత్తి కేశవపిళ్లె, దివాన్ బహదూర్, ముట్నారి ఆదినారాయణయ్య, ఉన్నవ లక్ష్మీనారాయణ, భోగరాజు పట్ట్భాసీతారామయ్య, అయ్యదేవర కాళేశ్వరరావు, చిలకమర్తి లక్ష్మీనరసింహంవంటి ఆంధ్ర నాయకులెందరో మహాసభకు హాజరయ్యారు. ప్రేక్షకులతో కిక్కిరిసి సభా ప్రాంగణం మహదానందంకొల్పింది. ఆంధ్రుల యొక్క, ఆంధ్ర భాష యొక్క సర్వతోముఖమైన అభివృద్ధికి చేయవలసిన కృషిని గురించి తీర్మానాలన్నీ ఏకగ్రీవంగా ఆమోదం పొందాయి. ఎటొచ్చీ అసలైన ఆంధ్ర రాష్ట్ర తీర్మానం దగ్గరే మడతపేచీ పడ్డది. ఆ వైనాన్ని ఆహ్వాన సంఘం అధ్యక్షుడైన కొండ వెంకటప్పయ్య మాటల్లో చదవండి:
అంత సభాసదులు ఆనందపూరితులై అత్యుత్సాహముతో కరతాళధ్వనులు చేయుచుండ అధ్యక్షులు దీర్ఘము, గంభీరమగు నుపన్యాసమిచ్చిరి. అందు ఆంధ్రదేశ వైశాల్యమును, ఆంధ్రులు దేశదేశములు వ్యాపించుటయునుగ్గడించి, పూర్వాంధ్ర రాజుల శౌర్యప్రతాపముల వర్ణించిరి. తుదకు ఆంధ్ర రాష్ట్ర నిర్మాణమును గూర్చి సూచన మాత్రము చేసి తను అభిప్రాయమును స్పష్టీకరించి ఉపన్యాసము ముగించిరి. పిమ్మట ఆంధ్ర రాష్ట్ర నిర్మాణావశ్యకమును గూర్చి యొక తీర్మానము వేమవరపు రామదాసు పంతులుగారు ప్రవేశపెట్టిరి. ఆ తీర్మానము సభలో గొప్ప కలకలము పుట్టించెను. దానికి అనుకూలురు పలువురుండినను ప్రతికూలురలో దేశమందలి ప్రముఖులగు వారుండిరి. న్యాపతి సుబ్బారావు పంతులు, మోచర్ల రామచంద్రరావు పంతులు, గుత్తి కేశవపిళ్లే మొదలగువారు ప్రతికూలాభిప్రాయములు ప్రకటించి యుండిరి. సుబ్బారావు పంతులుగారు చెన్నపురి శాసనసభ యందును, కేంద్ర శాసనసభలోను సభ్యులై ప్రఖ్యాతిగాంచిరి... శ్రీ కేశవపిళ్లేగారు గుత్తిలో న్యాయవాదిగా నున్నను మిక్కిలి పలుకుబడి సంపాదించి, శాసనసభలో సభ్యత్వము బడసి, రాయలసీమలో ప్రాధాన్యము వహించియుండిరి. మోచర్ల రామచంద్రరావుగారు చెన్నపురి శాసనసభలో ప్రఖ్యాతి వహించినారు. అప్పటి కాలములో ఆంధ్రదేశమున ఈ మువ్వురిని మించిన వారు రాజకీయములలో లేరు. కావున వారి అభిప్రాయమును ముందే తొలగతోసినచో ఆంధ్రోద్యమమునకే విఘాతము సంభవించుననుట స్పష్టమే. దేశమున ఈ విషయమున చీలికలు బలమగును.
ముట్నూరి ఆదినారాయణయ్యగారు ఆంధ్ర రాష్ట్ర తీర్మానమును ప్రతిఘటించుచు దీర్ఘముగనుపన్యసించిరి. వారు చేసిన ఆక్షేపణలో ముఖ్యమైనదేమనగా ఆంధ్ర మహాసభోద్దేశములలో ఆంధ్రరాష్ట్ర విషయము లేదనియు, ఆంధ్రుల పురోభివృద్ధియే సామాన్యముగా వక్కాణించి యుండుటచే తమవంటివారు సభలో పాల్గొనుట సంభవించెననియు, ముందు తెలుపకయే ఈ తీర్మానము ప్రవేశపెట్టుట క్రమముగాదనియు వాదించిరి. ప్రజాభిప్రాయము తెలుసుకొనకయే యిట్టి తీర్మానము చర్చించుట అసమంజసమని ఆక్షేపించిరి. తొలుతనే భేదాభిప్రాయములు చెలరేగుట వలన అపుడపుడే మొలకెత్తిన ఆంధ్రోద్యమము మాసిపోవునేమోయని మిక్కిలి భీతినొందితిని.
స్వీయ చరిత్ర, కొండ వెంకటప్పయ్య పంతులు పే.172-173
విన్నారుకథా? ‘ఆంధ్రులలో ఆంధ్ర రాష్టమ్రుపట్ల ఉత్సాహము పెరిగిపోవుచుండెను’ అని స్వయంగా ఎరిగీ... అన్ని జిల్లాల నుంచి హాజరైన ప్రతినిధుల్లో అత్యధికులు ఆంధ్ర రాష్ట్రానికి అనుకూలంగా ఉన్నారని తెలిసి కూడా... ముగ్గురు గొప్పవాళ్లు వద్దనేసరికి ఉద్యమం ఏమైతుందో, ఎక్కడ చీలికల పాలవుతుందోనని ‘దేశభక్త’కి భయం పుట్టింది. పైకి చెప్పకపోయినా ఆయనా ఆ ముగ్గురు పెద్దలను సమర్ధించేవాడే. ఆంధ్ర రాష్ట్రంకోసం నడుంకడదామని అంతకుముందు గుంటూరు మిత్రులు తనతో అన్నప్పుడు అది ఆవేశపూరితంగానూ, అత్యాశగానూ, దుస్సాధ్యంగానూ తాను భావించానని ఆయనే అన్న సంగతి గుర్తుంది కదా? ‘వినేవారికి వెర్రిగా కనిపిస్తుందని’ తలిచాడు కాబట్టే బాపట్ల ప్రథమాంధ్ర సభకు చర్చనీయాంశాల తయారీలో వెంకటప్పయ్యగారు ఆహ్వాన సంఘాధ్యక్షుడి హోదాలో తగు జాగ్రత్తలుపడి, ఆంధ్ర రాష్ట్రం ఊసు ఎక్కడా లేకుండా చూశారు. సభ ఉద్దేశాల్లో, అజెండాలో ప్రస్తావనే లేనిదాన్ని మహాసభలో ఎలా చర్చిస్తారని ఆదినారాయణయ్య నిలదీయడానికి చేతులారా ఆస్కారమిచ్చారు. సహజంగానే అభ్యంతరం వచ్చేసరికి ఉద్యమాన్ని చీలకుండా చూసే నెపంతో అసలు అంశాన్ని తెలివిగా దాటవేయించారు. అదీ ఎలాగ?
వాదోపవాదములు ముదరకమునుపే లేచి, ప్రజాభిప్రాయమును సమకూర్చుకొనకయే ఈ తీరుమానమును ప్రవేశపెట్టుట సరికాదను వాదన సమంజసముగ నున్నదనియు, మనలో ప్రముఖుల యుద్దేశములను గూడ పాటింపవలసి యున్నదనియు నుడివి, రాష్ట్ర నిర్మాణము ఆంధ్రుల పురోభివృద్ధికి అవసరమని నమ్మువాడనైనను (?!) అందు విషయమున ప్రజలలో ఆందోళనగావించి అంగీకారమును చేకూర్చుకొనుట యుక్తమనియే నేను నా అభిప్రాయమును వెలిబుచ్చితిని. ఒక్క సంవత్సరకాలము ఇట్టి ప్రచారము దేశమంతట గావించి, మన ప్రముఖులనుగూడ సమ్మతి పరిచి, ముందు సంవత్సరము ఈ తీర్మానమును ప్రవేశపెట్టవచ్చునని పలికిన మీదట సభలో నామాటలు అంగీకృతముగ గన్పడినందున ఆంధ్రోద్యమ స్థాయి సంఘము వారిని దేశమున ప్రచారము సల్పి ఏకాభిప్రాయమును సమకూర్పుడని కోరుచు తీర్మానము సవరణకాబడి మహాసభచే నంగీకరించబడెను.
(అదే గ్రంథం పే 173)
ఈ వ్యాసం మొదట్లో ఉటంకించిన తీర్మానం అదే.
ఆంధ్ర రాష్ట్ర తీర్మానంపై మూడుగంటలు తీవ్రస్థాయిలో వాగ్వాదాలు చెలరేగి... 1907లో మితవాదులు, అతివాదులు చెప్పులు విసురుకున్న సూరత్ కాంగ్రెసులాగే బాపట్ల మహాసభ కూడా రసాభాసగా ముగుస్తుందా అని సభల్లో పలువురు భయపడిన మాట నిజం. శుభమా అని ఆంధ్ర మహాసభను స్థాపించి, మొట్టమొదటి సభలోనే అల్లరిపాలవటం తగదనీ... ప్రజాభిప్రాయాన్ని కూడగట్టి, అందరికీ నచ్చచెప్పి మరుసటి ఏడు మహాసభలో ఆంధ్ర రాష్ట్రానికి అనుకూలంగా తీర్మానం చేయవచ్చుననుకోవటం కూడా అప్పటి పరిస్థితుల్లో అర్థం చేసుకోదగ్గదే.
ఆంధ్రులలో కొత్త చైతన్యం తెచ్చి, బాపట్ల మహాసభ ఆంధ్రోద్యమానికి కొత్త ఊపునిచ్చిన మీదట ఆంధ్ర మహాసభ ఆంధ్రుల ఆశయాలను నెరవేర్చే ఏకైక సంస్థగా స్థాపించబడ్డది. దానికి కొండ వెంకటప్పయ్యగారిని ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకుని కార్యభారమంతా ఆయనమీదే పెట్టారు. అన్ని ఆంధ్ర జిల్లాల ప్రముఖులతో గట్టి స్థారుూ సంఘం ఏర్పరచారు. అన్ని జిల్లాలలో ఆంధ్రోద్యమాన్ని బాగా ప్రచారం చేయాలని, జిల్లా, తాలూకా సభలు స్థాపించాలని నిర్ణయించేశారు. ఆ ప్రకారమే బాపట్ల సభ ముగిసిన కొద్దికాలానికే విశాఖపట్నంలో జిల్లా మహాసభ జరిగింది. ఆంధ్ర రాష్ట్రం అవశ్యం ఏర్పాటు కావాలని అందులో విస్పష్టంగా తీర్మానించారు.
పట్ట్భాసీతారామయ్య, కొండ వెంకటప్పయ్య, ముట్నూరి కృష్ణారావు, వల్లూరి సూర్యనారాయణరావులు ప్రచార సంఘంగా ఏర్పడి రాయలసీమలో విస్తృతంగా పర్యటించారు. ఆయనను వెంటబెట్టుకుని చాలా సభలు పెట్టారు. ఎక్కడికి వెళ్లినా ప్రజల స్పందనను చూస్తే ఆంధ్ర రాష్ట్రానికి సామాన్యజనం అనుకూలంగా ఉన్నట్టే కమిటీ వారికి తోచింది. బాపట్ల సభలో వచ్చిన అభ్యంతరాలపై పత్రికల్లో విస్తృతంగా సాగిన వాదోపవాదాలను, ఆంధ్ర రాష్ట్రానికి అనుకూలంగా, ప్రతికూలంగా వచ్చిన వాదనలను గుదిగుచ్చి యూ ఘశజూ ఘజశఒఆ శజ్ద్ఘూ -్య్పజశషళ ఫేర ఆంధ్ర మహాసభ తరఫున ఒక పుస్తకం ప్రచురించారు. దానికి ముక్తాయింపుగా పట్ట్భాసీతారామయ్య తనదైన శైలిలో ఆంధ్ర రాష్ట్రానికి ప్రతికూలంగా వచ్చిన వాదనలన్నిటినీ చాలా గొప్పగా చీల్చిచెండాడారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజాభిప్రాయం కూడగట్టటానికి, ప్రజల నాడి తెలుసుకోవటానికి జరగాల్సిందంతా జరిగింది. అనుకున్న ప్రకారం తదుపరి మహాసభలో ఆంధ్ర రాష్ట్ర తీర్మానాన్ని చేయడమే మిగిలింది. మరుసటి సంవత్సరం (1914) ద్వితీయ మహాసభ విజయవాడలో మహా ఘనంగానూ జరిగింది.
మరి ఆంధ్ర రాష్ట్రం సంగతో...?