ఆంధ్రుల కథ - 4

ఎం.వి.ఆర్ శాస్త్రి గారు ఆంధ్ర భూమి ఆదివారం అనుబంధం లో సీరియల్ గా ప్రచురిస్తున్న ఆంధ్రుల కథ యదాతథం గా..


తడవకో గొడవ ..... (May 16th, 2010)


‘తెలుగువాళ్లకు ఆంధ్ర రాష్ట్రం కావాలని మీ ప్రాంతంలో కుర్రవాళ్లు ఉద్యమం మొదలుపెట్టారట నిజమేనా?’అని ‘ఆంధ్ర భీష్మ’ న్యాపతి సుబ్బారావు పంతులుగారిని ప్రశ్నించాడో సీమదొర. ఇండియాలో పబ్లికు సర్వీసులకు సంబంధించి బ్రిటిషు ప్రభుత్వం పనుపున ఇండియాలో పర్యటించిన ఇస్లింగ్టన్ రాయల్ కమిషనులో అతడూ ఒక సభ్యుడు. కమిషన్ పనిమీద 1913 జనవరిలో మద్రాసులో మకాంచేసి ప్రముఖ నాయకుల అభిప్రాయ సేకరణ చేసిన సందర్భంలో జరిగిందీ ముచ్చట.
---------------------
ఆంధ్రులకు సొంత రాష్ట్రం కావాలన్న కోర్కె బలపడటమూ, దానిమీద జాతీయ, స్థానిక పత్రికల్లో విస్తృత చర్చ జరగటమూ, అనేక జిల్లాల ఆంధ్రులు కలిసి ఆ సంవత్సరం మేలో బాపట్లలో ప్రథమాంధ్ర మహాసభ జరప తలపెట్టటమూ వేగుల ద్వారా బ్రిటిషు సర్కారు చెవిన అప్పటికే పడింది. ఆ సమాచారం లండన్ దాకా పాకింది. దాని గురించి మరింత తెలుసుకోవాలన్న కుతూహలంతోనే ఆంధ్ర ప్రముఖుల్లోకెల్లా అగ్రగణ్యుడైన సుబ్బారావుపంతులు గారిని మిస్టర్ స్లయ్ ప్రశ్నించాడు.
పంతులుగారు చాలా పెద్దమనిషి. ఇలాంటి ఆకతాయి ఆందోళనల్లో పాల్గొంటున్నారన్న చెడ్డపేరు తనకూ, తన జాతి జనులకూ ఎక్కడ వస్తుందోనని కలవరపడ్డాడు. సదరు దురభిప్రాయాన్ని దొరల మనసుల్లోంచి తక్షణం తుడిచివెయ్యాలన్న ఆరాటంతో చప్పున బదులిచ్చాడు: ‘‘అట్లాంటి ఆందోళనను బాధ్యతగల ప్రజాప్రతినిధులు గాని, ఆంధ్ర ప్రముఖులు గాని ఎవరూ బలపరచడంలేదు. నాకూ దానితో సంబంధం లేదు’’ అని! ఈ సంగతి బయటికి పొక్కింది. ఆంధ్ర వర్గాల్లో పెద్ద రాద్ధాంతమైంది. సుబ్బారావుగారంతటివాడు అంతమాట ఎలా అన్నాడని పత్రికలు దుమ్మెత్తిపోశాయి. దానిమీద తన వైఖరిని సమర్ధించుకుంటూ హిందూ పత్రికలో ఆయన వరసగా కొన్ని వ్యాసాలు రాశాడు. ఆంధ్రోద్యమంలో ఆంధ్ర రాష్ట్ర సాధన భాగం కానేకాదని, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రంకోసం పట్టుబడితే చాలా చిక్కులు వస్తాయని వాటి సారాంశం.
అప్పట్లో అదో పెద్ద వివాదం.
ఆంధ్ర రాష్ట్రం వద్దేవద్దని భీష్మించిన ఆ ‘ఆంధ్ర భీష్ముల’వారినే బెజవాడలో జరిగిన ద్వితీయాంధ్ర మహాసభకు అగ్రాసనాధిపతిగా మనవాళ్లు ఏరికోరి ఎన్నుకున్నారు! ఇక ఆ సభ ఎంత లక్షణంగా సాగిందో వేరే చెప్పాలా?
బాపట్లలో చరిత్రాత్మకమైన ప్రథమాంధ్ర మహాసభ ముగిసి మరునాడు తిరుగు ప్రయాణానికి ప్రతినిధులు రైలుస్టేషనుకు పోయేసరికి అకస్మాత్తుగా పెద్ద వర్షం కురిసింది. ఎంతసేపటికీ ఆగలేదు. రైళ్లు రాలేదు. ఆ సంగతి తెలిసి సభానిర్వాహకులు కష్టపడి వంటలు చేయించి, స్టేషన్లో చిక్కుబడిన వారికి భోజనాలు పెట్టించారు. మండు వేసవిలో కుంభవృష్టి ఏమిటని అప్పుడే అందరూ విస్తుపోయారు. ఇక మరుసటి సంవత్సరం మళ్లీ మండుటెండాకాలంలో బెజవాడలో రెండో మహాసభ జరిగింది. వేల సంఖ్యలో తరలిరానున్న ప్రతినిధుల వసతికి భారీస్థాయిలో పాకలు వేయించారు. ఈసారి ప్రతినిధులకంటే ముందే జడివాన వచ్చింది. పాకలు, పందిళ్లు, కష్టపడి నెలకొల్పిన స్వాగత ద్వారాలు అన్నీ నేలమట్టమయ్యాయి. అతికష్టంమీద వాటిని మళ్లీ నిర్మించారో లేదో మళ్లీ ఫెళఫెళార్భాటంతో గాలివాన! కట్టినవన్నీ మళ్లీ కుప్పకూలాయి. కార్యక్రమం తరుముకొస్తున్నది. రావలసిన వాళ్లు అప్పటికే రైళ్లు ఎక్కి దారిలో ఉన్నారు. సభను వాయిదావేయటం కుదరదు. వాతావరణం ఇంకా నెమ్మదించలేదు. దేవుడి మీద భారంవేసి నానా అవస్థాపడి అర్జంటుగా మళ్లీ పాకలు, స్వాగత ద్వారాలు ఏర్పాటుచేశారు. అదృష్టం బాగుండి సభలు సజావుగానే మొదలయ్యాయి. కాని ఆ సంతోషమూ ఆట్టే కాలం నిలవలేదు.
అనుకున్నట్టే బెజవాడ మహాసభకు డెలిగేట్లుగానే రెండువేల మందికి పైగా హాజరయ్యారు. కిందటి బాపట్ల సభతో పోలిస్తే ఆ సంఖ్య మూడురెట్లు. గంజాం, బళ్లారి, తంజావూరు వంటి సుదూర ప్రాంతాలనుంచి ప్రతినిధులు వచ్చారు. ఆంధ్ర దేశంలో పెద్దలనదగ్గవారు దాదాపు అందరూ అక్కడ చేరారు. తిరువూరు, మైలవరం, గంపలగూడెం, రంగాపురం జమీందార్లు వెన్నుదన్నుగా నిలబడ్డారు. 1914 ఏప్రిల్ 11 ఉదయానే ప్రతినిధులు కృష్ణ స్నానాలు చేసి, ఊరేగింపుగా వెళ్లి సభాధ్యక్షుడికి పుష్పాభిషేకం చేసి సభాస్థలికి యధావిధిగా తోడ్కొని వెళ్లారు. బళ్లారి సరస వినోదిని సభవారు కళాత్మకంగా అలంకరించిన వేదికపై పెద్దలందరూ ఆశీనులయ్యారు. అధ్యక్షులవారు తన అమోఘ ఉపన్యాసంలో తెలుగుజాతికి, భాషా సంస్కృతులకు సంబంధించిన సమస్త విషయాలను విపులీకరించిన మీదట ఆంధ్రరాష్ట్రం ఇప్పట్లో చేకూరదని, దాన్ని ఒక ఆదర్శంగా మాత్రమే భావించాలని అమూల్యాభిప్రాయం వెలిబుచ్చారు. అది సభికుల్లో చాలామందికి నచ్చలేదు.
రెండోరోజు సుదీర్ఘ ప్రసంగాలు అయ్యాక రావు బహదూర్ కందుకూరి వీరేశలింగం పంతులుగారు లేచి ‘‘ఆంధ్ర మండలాల్లో చరిత్ర ప్రసిద్ధమైన కట్టడాల పరిరక్షణ గురించి తీర్మానం ప్రవేశపెట్టారు. గురజాడ అప్పారావుగారు దాన్ని బలపరిచారు.
అలాంటివి మరికొన్ని ఆమోదం పొందాక విజయంనుంచి వచ్చిన మంథా సూర్యనారాయణగారు ‘‘ఈ రాజధానిలోని తెలుగు జిల్లాలను ప్రత్యేక రాష్టమ్రుగ చేయుట వాంఛనీయము’’అని తీర్మానం ప్రవేశపెట్టారు. రామదాసు పంతులుగారు, ఇంకా పలువురు దాన్ని బలపరిచారు. వెంటనే ఆనరబుల్ ఎ.ఎస్.కృష్ణారావుగారు లేచి ఆంధ్ర రాష్ట్రం విషయాన్ని ఇంకో సంవత్సరం వాయిదా వేయాలని సవరణ తీర్మానం తెచ్చారు. దానిమీద పెద్ద గొడవ అయింది. మొత్తం మహాసభే రసాభాసగా ముగుస్తుందా అని చాలామంది భయపడ్డారు. అప్పుడు ఏమి జరిగిందో మర్నాడు ‘మద్రాసు మెయిల్’ ప్రచురించిన వార్త చెబుతుంది:
బెజవాడ, 13 ఏప్రిల్: ఆంధ్ర మహాసభ నిన్న దాదాపుగా భగ్నమయ్యే పరిస్థితి నెలకొంది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించిన తీర్మానంపై చాలా వేడిగా వాగ్వాదాలు జరిగాయి. యువ ప్రతినిధుల్లో కొందరు ఉద్వేగంగా మాట్లాడారు. సభలో నెలకొన్న గందరగోళాన్ని ఇంకా పెంచుతూ హఠాత్తుగా అప్పుడే కుండపోతగా వర్షం మొదలైంది. గడ్డి కప్పు కింద ఉన్న పందిరి మొత్తం లీకయి, ప్రతినిధులందరూ ముద్దగా తడిశారు. ఆ పరిస్థితిలో కార్యక్రమం నడవదని నిశ్చయించి అధ్యక్షుడు సభకు మర్నాటికి వాయిదావేసి, తన విడిదికి వెళ్లిపోయాడు. ప్రతినిధులు చాలామంది కూడా నిష్క్రమించారు.
"A small but excited section of the delegates, however took possession of the platform immediately and loudly demanded the return of the President and putting to the vote of the amended resolution at one step. These even threatened to elect a new president if only to see the resolution through, in case Mr.Subba Rao didnot return in an hour and resume the proceedings. The scene in the pandal was one of indescribable confusion, and it was apparent that the youthful section would go to any length to see their pet resolution put through... Mr. Subba Rao forthwith returned to the pandal and the resolution of the Andhra Province was put to the vote and carried by a large majority.''
[The Madras Mail, April 14, 1914]

(ఆవేశఫూరితులైన కొంతమంథి డెలిగేట్లు వెంటనే వేదికను స్వాధీనపరచుకున్నారు. అధ్యక్షుడు తిరిగి వచ్చి సవరించిన తీర్మానాన్ని ఓటింగుకు పెట్టాలని బిగ్గరగా కేకలు వేయసాగారు. సుబ్బారావు గంటలోగా తిరిగి రాకపోతే కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునైనా తీరా రాష్ట్ర తీర్మానం ఆమోదింపజేస్తామని ఒక దశలో వారు బెదిరించారు కూడా. పండాల్‌లో నెలకొన్న గందరగోళ దృశ్యాన్ని వర్ణించ నలవికాదు. తీర్మానాన్ని పాస్ చేయించటానికి యువకులు ఎంత దూరమైనా వెళ్ళేట్టు కనిపించారు... ఇక సుబ్బారావు హుటాహుటిన సభాస్థలికి తిరిగొచ్చి ఆంధ్ర రాష్ట్ర తీర్మానంపై ఓటింగు నిర్వహించారు. పెద్ద మెజారిటీతో దాన్ని సభికులు ఆమోదించారు.)
ఇదీ రెండో ఏటి మహాసభ ముచ్చట! ఇంత అవస్థా పడి, ఇంత గలభా జరిగాక ఎట్టకేలకు ఆమోదానికి నోచుకున్న తీర్మానమైనా ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం వచ్చి తీరాలని సర్కారును డిమాండు చేసేది కాదు. ‘‘మద్రాసు రాష్ట్రంలోని తెలుగు జిల్లాలను ప్రత్యేక రాష్ట్రంగా చేయటం అభిలషణీయం’’ అని మహాసభ చేత అనిపించడానికే ఇంత హైరాణ పడవలసి వచ్చింది!

‘‘పైనుంచి వర్షము గురియుచు తాటాకు పందిరి మీద పడిన వర్షము సభాసదుల మీద పడుచున్నను కొందరు గొడుగులు వేసుకొనియు, కొందరు తలపైన గుడ్డలు కప్పుకొనియు సభాస్థలము విడువక జయజయధ్వానములు మిన్నుమిట్టినట్లు హర్షధ్వానులు గావించుచు తీర్మానమును అంగీకరించిరి... పెద్ద తటాకములోని నీరు కట్ట తెగి ప్రవాహమున పారి, చుట్టుప్రక్కల నేలపై పెద్ద వెల్లువలై పారినట్లు ఆంధ్ర రాష్ట్ర నిర్మాణాశయము ఇకనే అడ్డులేక ఆంధ్ర దేశమందంతటను వ్యాపించగలదని స్పష్టమయ్యెను.’’
స్వీయ చరిత్ర, కొండ వెంకటప్పయ్య పే.177
వెంకటప్పయ్యగారన్నట్టే ఆంథ్ర రాష్ట్ర నిర్మాణాశయం ఆంధ్ర దేశమంతటా వెల్లువలా వ్యాపించింది. కాని నాయకుల మధ్య పేచీలు, వివాదాలు, వృధా ఉద్రిక్తతలు, విపరీత కాలహరణాలు మాత్రం షరామామూలే. బెజవాడలో జడివానను కూడా లెక్కచెయ్యక ప్రతినిధులు పట్టుబట్టి అధ్యక్షుణ్ణి బలవంతంగా రప్పించి ఆమోదించిన ఆంధ్ర రాష్ట్ర తీర్మానం రికార్డులలోకి ఎక్కినా చాలామంది నాయకులు దానిని గుర్తించలేదు. బెజవాడలో అతి ముఖ్య నాయకుడు, ఆహ్వాన సంఘానికి ప్రథమ కార్యదర్శి అయిన అయ్యదేవర కాళేశ్వరరావుకు అసలు తీర్మానం జరిగినట్టే తెలియదు.
‘‘నాకు చాలా జబ్బుచేసినందున... బెజవాడ మహాసభలో పాల్గొను భాగ్యము నాకు కలుగలేదు... ఆ మహాసభలో కూడ అధ్యక్షులగు న్యాపతి సుబ్బారావు పంతులుగారికి యిష్టము లేకపోవుటచేత ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర తీర్మానము మంజూరుకాలేదని తెలిసినది.’’
నా జీవిత కథ- నవ్యాంధ్రము, అయ్యదేవర కాళేశ్వరరావు. పే.224- 225
ఆ సమయాన ఊళ్ళోనే లేడు కనుక రాష్ట్ర తీర్మానం సంగతి అయ్యథేవరవారికి తెలియలేదేమో అని సరిపెట్టుకోవచ్చు. కాని తాను స్వయంగా హాజరైన తదుపరి విశాఖపట్నం మహాసభలో జరిగిన తీర్మానమూ ఆయనకు గుర్తులేదు.
విశాఖపట్నంలో పానగల్ రాజా పానుగంటి రామారాయణింగారి అధ్యక్షతన 1915 వేసవిలో జరిగిన తృతీయాంధ్ర మహాసభలో ఆంధ్ర రాష్ట్ర తీర్మానం మీద పెద్ద గొడవే జరిగింది. ‘‘మన రాష్టమ్రులోని తెలుగు జిల్లాలను కలిపి ప్రత్యేక రాష్టమ్రుగా ఏర్పరుచుట సముచితము, ఆవశ్యకము’’ అని ప్రవేశపెట్టిన తీర్మానాల మీద వాడిగా వేడిగా ఐదారు గంటలపాటు చర్చ జరిగింది. కొండ వెంకటప్పయ్య లాంటివారు తీర్మానాన్ని ఇంకో సంవత్సరం వాయిదావేయాలని కోరారు. చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు, పట్ట్భా సీతారామయ్య వంటివారు తీర్మానాన్ని గట్టిగా బలపరిచారు. చివరికి ఓటింగు పెడితే బ్రహ్మాండమైన మెజారిటీతో తీర్మానం హర్షధ్వానాల మధ్య ఆమోదం పొందిందని, రాజకీయ నాయకత్వంపైన ప్రజాభిప్రాయం విజయం సాధించిందని ‘హిందూ’ పత్రిక 1915 మే 31న రాసింది. కాని అయ్యదేవర వారు మాత్రం ‘అభిప్రాయ భేదములు రానివ్వకుండుటకై ఆంధ్ర రాష్ట్ర తీర్మానం ఆమోదము కావలెనని పట్టుబట్టక విడిచి వేసితిమి (నా జీవిత కథ, పే 226) అంటారు!
మరుసటి సంవత్సరం 1916 మేలో కాకినాడలో జరిగిన చతుర్థాంధ్ర మహాసభలోనూ ఇదే తంతు. రావు బహదూర్ మోచర్ల రామచంద్రరావుగారు దీనికి అధ్యక్షుడు. తెలుగు జిల్లాలన్నిటికీ కలిపి ప్రత్యేక రాష్ట్రం చేయటం అవసరం, సమంజసం; యుద్ధం అయిపోయాక సాధ్యమైనంత త్వరగా దీన్ని అమలుపరచాలి అని ప్రభుత్వాన్ని కోరే తీర్మానాన్ని అధ్యక్షులవారే వ్యతిరేకించి, వచ్చే ఏటి సమావేశంలో దాని సంగతి చూద్దాము లెమ్మన్నారు. కాని సభికులు ఓటింగుకు పట్టుబట్టారు. పెద్ద మెజారిటీతో తీర్మానం ఆమోదం పొందింది.
తరువాతి ఐదవ ఆంధ్ర మహాసభకు వేదిక నెల్లూరు. (1917 జూన్ 2, 3). కొండ వెంకటప్పయ్య దానికి అధ్యక్షుడు. గొడవలు షరామామూలే.
‘‘నా ఉపన్యాసములో నెల్లూరివారి వ్యతిరేక వాదమును ఖండించుచు ‘‘ఇది ఎట్టి నీతియో తెలియకున్న’’దని నేను వచించితిని. ఆ వాక్యమునకు కోపించి నెల్లూరివారు సభను విడిచిపోయిరి. అంత సభలో కలవరము సాగెను. ఆంధ్ర రాష్ట్ర తీర్మానము గూర్చి వాద ప్రతివాదములు హెచ్చుగా నడిచెను. రాత్రి పొద్దుపోవునప్పటికి సమ్మతులు తీసుకొనుట సంభవించెను. వ్యతిరేకుల కంటే మున్నూరు మంది అనుకూలురే లెక్కకు వచ్చిరి. ఇట్లు జయము చేకూరినను కొందరైనను వ్యతిరేకులుండుటచే ప్రజలకు ఉద్యమము పట్ల పట్టుదల కొరతగనే యుండెనని స్పష్టమయ్యెను.
స్వీయ చరిత్ర, కొండ వెంకటప్పయ్య, పే 192-193

థేశభక్తగారు పరిస్థితి తీవ్రతను తగ్గించటానికి బాగానే తంటాలు పడ్డారు. కాని ఆ సమయాన ‘హిందూ’, ‘న్యూ ఇండియా’ పత్రికల్లో వచ్చిన వార్తలను చూస్తే కళ్లకు కట్టే చిత్రం వేరు. ఆ రిపోర్టులను ఉటంకిస్తూ The Emergence of Andhra Pradesh గ్రంథంలో (పే 148-149) కె.వి.నారాయణరావు రాసిందిది:
సీడెడ్ జిల్లాలకంటే నెల్లూరే మద్రాసుకు దగ్గర. తమకు నిత్యసంబంధాలుండే ఆ రాజధాని వదిలేసుకుని ఆంధ్ర రాష్ట్రంలో చేరటానికి నెల్లూరువారు సహజంగానే సిద్ధంగా లేరు. ఆంధ్ర రాష్ట్ర తీర్మానాన్ని అడ్డుకోవాలని వారు గట్టి ప్రయత్నమే చేశారు. మొత్తం 740 డెలిగేట్లలో 480 మంది నెల్లూరు జిల్లావారేకనుక ఓపెన్ ఓటింగు అంటూ పెడితే తీర్మానం వీగిపోవటం ఖాయంగానే కనిపించింది. ఒక్క జిల్లా వారివల్ల మొత్తం ఆంధ్ర దేశ మహదాశయం వమ్ముకావడం ఇష్టంలేని గాడిచర్ల హరిసర్వోత్తమరావు (ఆయన కర్నూలు జిల్లా ప్రతినిధి) పరిస్థితిని గమనించి జిల్లాలవారీగా ఓటింగు జరగాలని, ఒక జిల్లా నిర్ణయాన్ని ఒక ఓటు కింద పరిగణించి, అన్ని జిల్లాల అభిమతాన్ని ఆ ప్రాతిపదికన మదింపు చేయాలని సూచించాడు. ఇలా చేస్తారని తెలిస్తే తాము సభను పెట్టనిచ్చేవాళ్లమే కాదని నెల్లూరు పెద్దలు కస్సున లేచారు. ఓటింగుకు పెడితే- 547 మంది డెలిగేట్లు హరిసర్వోత్తమరావు ప్రతిపాదనను సమర్థించగా 450 మంది వ్యతిరేకించారు. తమ పంతం నెగ్గేట్టులేదని గ్రహించి నెల్లూరువారు సభనుంచి నిష్క్రమించారు. సాయంత్రం టౌన్‌హాలులో ప్రత్యేక సమావేశం పెట్టుకున్నారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం అనవసరమనీ... మద్రాసును కూడా కొత్త రాష్ట్రంలో చేర్చి, రాజధానిని చేస్తేనే అది అభిలషణీయం అవుతుందనీ తీర్మానం చేశారు. బి.ఎన్.శర్మగారొచ్చి వారిని సముదాయించి మర్నాటి సభలో పాల్గొనేట్టు చేశారు. రాష్ట్ర తీర్మానం ప్రవేశపెట్టగానే కొత్త రాష్ట్రానికి మద్రాసు రాజధాని కావాలని నెల్లూరువారు సవరణ ప్రతిపాదన చేశారు. ఓటింగుకు పెడితే సవరణలు వీగిపోయి, కిందటి సంవత్సరం కాకినాడ సభలో మాదిరిగానే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఒరిజినల్ తీర్మానాన్ని మహాసభ ఆమోదించింది. సీడెడ్ జిల్లాల వారిని ఆకట్టుకుని తమవైపు తిప్పుకుంటే తప్ప ఆంధ్ర రాష్ట్రం ముందుకు సాగదని సర్కార్ల ప్రముఖులకు అర్థమైంది.