ఆంధ్రుల కథ - 10

ఎం.వి.ఆర్ శాస్త్రి గారు ఆంధ్ర భూమి ఆదివారం అనుబంధం లో సీరియల్ గా ప్రచురిస్తున్న ఆంధ్రుల కథ యదాతథం గా..

నిజాంగారి నరకం...(June 27th, 2010)

గుంటూరులో నలుగురూ కూడారు. ఫలానా తేదీన బాపట్లలో తొలి ఆంధ్ర మహాసభ పెట్టాలనుకున్నారు. పెట్టారు. సర్కారువారు సభను జరపనిస్తారో లేదో అన్న సంశయం వారికి కలగలేదు. నిజంగానే ఏ సమస్యా ఎదురుకాలేదు.
అదృష్టవంతులు. వారి నెత్తిన నిజాం నవాబులేడు.
అదే వాళ్లు తెలంగాణ వాళ్లయినా, తెలంగాణలో సభ పెట్టాలనుకున్నా వాళ్లను మించిన దురదృష్టవంతులు ఉండరు.
తెలంగాణ కూడా భారతదేశంలోనే ఉంది. మిగతా భారతదేశాన్ని నిరంకుశంగా అణచిపెట్టిన తెల్లవాళ్లే తెలంగాణానేలే నిజాం మీదా నిరంకుశంగా పెత్తనం చేస్తున్నారు. ఐనా మిగతా బ్రిటిషిండియాలో అరకొరగా ఉన్నపాటి రాజకీయ పౌరహక్కులకు, స్థానిక స్వపరిపాలన వ్యవస్థలకు కూడా నైజాం వంటి సంస్థానాల ప్రజలు నోచుకోలేదు.
సర్కారు జిల్లాల్లో ఆంధ్రోద్యమ భావాలు 1911లో అంకురించే నాటికే మద్రాసు రాష్ట్రంలో శాసనసభ ఉండేది. దానికీ, పై ఎత్తున జాతీయస్థాయిలో సెంట్రల్ అసెంబ్లీకీ ఆంధ్ర ప్రాంతాలనుంచి ప్రతినిధులు ఎన్నికవుతూండేవారు. వారిలో గొప్ప పార్లమెంటేరియన్లుగా పేరుతెచ్చుకుని ప్రభుత్వానికీ, ప్రజలకూ గౌరవ పాత్రులైనవారు ఉండేవారు. అలాగే 1880ల నాటికే మిగతా బ్రిటిష్ ఇండియాతోబాటు తీరాంధ్ర, సీడెడ్ జిల్లాల్లోనూ స్థానిక స్వపరిపాలన సంస్థలు ఏర్పడ్డాయి. రాజమండ్రిలో వీరేశలింగం పంతులు వంటివారు స్థానిక పురపాలక సంస్థల్లో జరిగే అవకతవకలను పత్రికల్లో చీల్చిచెండాడుతూ, అధికారుల అక్రమాలను, అవినీతిని నిర్భయంగా ఎదిరిస్తూండేవాళ్లు.
హైదరాబాదుకూ పేరుకు శాసనసభ ఉంది. 1894నుంచీ అది పనిచేస్తున్నది. కాని దానిలో ప్రజలకు ప్రాతినిధ్యం సున్న. దానిలోని సభాసదుల సంఖ్య 20. వారిలో ఎన్నుకోబడే సభ్యులు కేవలం నలుగురు. వారినైనా ఎన్నుకునేది ఎవరు? ఇద్దరినేమో సంవత్సరానికి ఆరువేల రూపాయల ఆదాయంగల జాగీర్దార్లు ఎన్నుకుంటారు. మిగతా ఇద్దరిని నైజాం రాజ్యంలోని హైకోర్టు వకీళ్లు ఎన్నుకుంటారు. అదీ నిజాం మార్కు ప్రజాస్వామ్యం!
పేరుగొప్ప శాసనసభ అలంకారానికే. శాసన వ్యవహారాల్లో సైతం దానికి అధికారాలు సున్న. లార్డ్ రిపన్ వైస్రాయిగా ఉన్న 1880-84 కాలంలోనే హైదరాబాద్ రాజ్యంలోనూ స్థానిక స్వపరిపాలన సంస్థలు జన్మనెత్తాయి. కాని వాటిలో ఎక్కడా సభ్యులను ఎన్నుకునే పద్ధతి లేదు. అందరినీ నైజాము సర్కరోళ్లే ఇష్టానుసారం పైనుంచి రుద్దుతారు. ప్రజల్లో తగినంత విజ్ఞానం కలిగిన తర్వాత ఎన్నికల పద్ధతి ప్రవేశపెడతామని స్థానిక సంస్థలను పెట్టిన కొత్తలో ప్రభువులు ఊరించారు. ఎన్ని దశాబ్దాలు తిరిగినా సర్కారు దృష్టిలో జనానికి విజ్ఞానం కలగాలేదు. ఎన్నికల అవసరం కనపడనూ లేదు. ఏ స్థానిక సంస్థలోనైనా అంతా నియంతృత్వమే. నవాబుల ఇష్టారాజ్యమే!
1914లో ఆంధ్రపత్రిక ఆనంద సంవత్సరాది సంచిక నైజాం రాజ్యంలో ఆంధ్రుల స్థితిగతుల గురించి ఏమి రాసిందో చిత్తగించండి:
‘‘నిజాం రాష్టమ్రున తెలుగువారు ఏమాత్రమును గొప్ప స్థితికి వచ్చినట్లు కానరాదు. హైకోర్టు జడ్జి పదవికి వచ్చిన తెలుగువాడు లేనేలేడు. ఉన్నతోద్యోగములందున్న తెలుగువారు లేనేలేరు. తుదకు హైదరాబాదు హైకోర్టులో పనిచేయుచున్న న్యాయవాదులలో ఆంధ్రుడెవడైన నున్నాడాయని సంశయింపవలసి యున్నది. 1895లో హైదరాబాదునందు శాసన నిర్మాణ సభ యొకటి స్థాపింపబడినది. అప్పటినుండి నేటివరకు ఒక యాంధ్రుడేనియు దానిలో సభ్యుడగు భాగ్యమును పొందలేదు.
‘‘ఈ రాజ్యమున చదువుకొనిన వారి సంఖ్య వేయింటికి 28 మంది కంటె మించలేదు... తురకలలో చదువు వచ్చినవారు వేయింటికి 59 మంది; హిందువులలో అట్టివారు 23 మాత్రమే.
‘‘ఇక ఇచ్చటి తెలుగువారు మాట్లాడు భాషను చూడుడు. ఉర్దూతోనె కలయికవలన తెలుగు భాషకు కలిగిన దురవస్థ ఇట్టిదని చెప్పుట కష్టము. ఉదాహరణము: ‘‘ఈమొకద్దమాలో చలాయించిన కార్రవాయి అంతా జాలీది. సాహెబ్ జిల్లా జాయె వౌక్ఖాకు పోయి తహకీకాతుచేసి వైఫ్యియతు రాసినాడు గదాకె, ఫరీజు దావా బిల్కులు నాజాయజు. అయిందా రుూ తౌర్న కార్రవాయి చేసిన సూరతులో మాఖూలు తదారకు చేయటం కాగలదు.’’
ఈ వ్యవహారంలో నడచిన చర్య అంతా తప్పు సృష్టి. జిల్లా తాలూక్దారు ఆ స్థలానికి పోయి విచారణ చేసి నివేదిక రాశాడు. ఏమనంటే- కక్షిదారు చేసిన వాదం పూర్తిగా అక్రమం. ఈ విధంగా చర్య తీసుకుంటే తగిన శిక్ష విధించినట్టు కాగలదు- అనడానికి వచ్చిన తురక తెలుగు తిప్పలివి.
నైజాం రాజ్యం వైశాల్యంలో సగం తెలంగాణలోనే ఉన్నా, అక్కడి ప్రజల్లో అత్యధిక సంఖ్యాకులు తెలుగువారైనా, తెలుగు భాషకు దిక్కులేదు. తాము తెలుగువాళ్లమన్న స్పృహే చాలామంది ఆంధ్రుల్లో ఉండేది కాదు. వేషం, భాష, అలవాట్లు, ఆచారాలు, ఆలోచనలు అన్నిటిమీదా ముస్లిం సంస్కృతి ప్రభావం బాగా ఉండేది. సంస్థానంలో ప్రజలకు పౌర హక్కులు లేనే లేవు. సమావేశ స్వాతంత్య్రం అసలే లేదు. ‘గస్తీ నిషాన్ తిర్పన్’ అనే జీవో ప్రకారం ఏవయినా ఒక సమావేశం జరగడానికి నిజాం కేబినెటునుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి. ఎక్కడ ఏ సమావేశాన్ని లేక ఏ సంఘాన్ని ఏర్పాటుచేసుకోవాలన్నా నాలుగైదు ఫారాలు నింపి వివిధ అధికారులకు దరఖాస్తుపెట్టాలి. ఆ సంఘం లేక సమావేశం దేనికోసం, దానిలో ఎవరుంటారు, ఎవరు అధ్యక్షత వహిస్తారు, ఏమి చర్తిస్తారు. ఎవరెవరు ఏమి మాట్లాడుతారు అన్నది వాటిలో రాయాలి. అన్నీ పరిశీలించిన మీదట అనుమతికాస్తా సర్వసాధారణంగా నిరాకరించబడేది. ఆఖరికి జాతీయ నాయకులు అస్తమించినప్పుడు సంతాప సభలు జరుపుకోవడానికి కూడా అనుమతి లభించేది కాదు. అతి కష్టంమీద అనుమతి వచ్చినా, సవాలక్ష ఆంక్షలతో సభ జరుపుకోవలసి వచ్చేది. ఎక్కడైనా పొరపాటున అనుమతి లేకుండా ఏ కార్యక్రమమో నిర్వహిస్తే క్రూరమైన శిక్షలకు గురికావలసి వచ్చేది. ఆఖరికి బంధుమిత్రులు ఒక ఇంట్లో చేరి సమావేశమైనా ఆ సంగతి తెలిస్తే పోలీసులు వచ్చివాలి నానా ఆగం చేసేవాళ్లు.
ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రులంతా కలిసి ఓ సంఘం పెట్టుకుంటాం అంటే నైజాం సర్కారు రాకాసులు ఊరుకుంటారా? ‘అసలు ఆంధ్ర’ పదమంటేనే నిజాంకు ఎలర్జీ. ఎక్కడైనా పత్రిక పెట్టుకోవడానికి పొరపాటున అనుమతి ఇచ్చినా పత్రిక పేరులో ‘ఆంధ్ర’ ఉండకూడదని సర్కారు ఆంక్ష పెట్టేది. (ఈ కారణంవల్లే ‘గోలకొండ పత్రిక’కు ఆ పేరు వచ్చింది.) ‘ఆంధ్ర’ పదమే చెవిన పడకూడదనుకునేవాళ్లు ఏకంగా ‘ఆంధ్ర మహాసభ’నే పెడతామంటే విరుచుకుపడరా? ఆంధ్రులంతా కలవాలనో, ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలనో కోరుతున్నామంటే అందిన వారిని అందినట్టు లాక్కెళ్లు బందీఖానాలో వెయ్యరా? బడిలో తెలుగు నేర్పటానికి వీల్లేదన్నవారు... ఆఖరికి ప్రైవేటుగా బడి నడపటానికి కూడా తమ అనుమతి కంపల్సరీ అని ఫర్మానావేసి, అప్పటిదాకా నడుస్తున్న ప్రైవేటు తెలుగుబడులను మూయించిన ఘనులు, తెలుగువాళ్లు ఏకమై రాజకీయ డిమాండ్లతో సంఘం పెడతాం, సభలు జరుపుతాం అంటే కస్సున లేచి కాటెయ్యరా? పౌర హక్కులకు దిక్కులేని ఇలాంటి రాక్షస రాజ్యంలో 1921 దాకా ఆంధ్రోద్యమం లేవకపోవటం వింత కాదు. కనీసం అప్పుడైనా లేవటమే అబ్బురం!
అలాగని 1921లో తెగించి ‘ఆంధ్ర జన సంఘం’ పెట్టేదాకా తెలంగాణ ఆంధ్రులు చేతులు ముడుచుకునేమీ కూర్చోలేదు. ఏమి చేయాలా, ఏమి చేయగలమా అని దారులు వెతుకుతూనే ఉన్నారు. రాజకీయ కార్యకలాపాల మీద, రాజకీయ వాసన ఉండొచ్చని ‘పైవాళ్లకు’ అనుమానంతోనే అన్ని కార్యాలమీద పూర్తి నిషేధం ఉన్నప్పుడు ఎవరైనా చేపట్టగలిగింది రాజకీయేతరమైన కార్యక్రమాలు మాత్రమే. కావాలనుకుంటే సంఘ సంస్కార సభలు పెట్టుకోవచ్చు. సర్కారుకు అభ్యంతరం లేదు. కాని నూటికి 97 మంది నిరక్షరాస్యులైన సమాజంలో సంఘ సంస్కారం గురించి మాట్లాడితే ఎవరికి అర్థమవుతుంది? పోనీ మతపరమైన కార్యక్రమాల ద్వారా జనంలోకి వెడదామా అంటే దానికీ వీలులేదు. చివరి నిజాం ఉస్మానలీఖాన్ పక్కా ముస్లిం మతోన్మాది. హిందువులు పండుగలు పబ్బాలు ఎవరింట్లోవాళ్లు గుట్టుగా చేసుకోవలసిందే తప్ప పదిమందీ ఒకచోట కూడి వేడుకలు జరుపుకోవటానికి వీలే లేదు. మత స్వాతంత్య్రం మచ్చుకు కూడా లేదు. హిందూ, మహమ్మదీయ పండుగలు రెండూ ఒకసారి రావటం తటస్థిస్తే హిందూ పండుగల్ని ప్రభుత్వం నిషేధించేది.
ఇలాంటి దుస్థితిలో ప్రజల్లో స్వాభిమానం, ఆంధ్రత్వభావం పురికొల్పాలంటే దూరదృష్టితో ఆచితూచి అడుగువెయ్యాలి. ప్రభుత్వధికారులకు అనుమానం రాకుండా, రాజకీయ లక్షణాలు ఎక్కడా కానరాకుండా జనానికి మాతృభాష పట్ల అభిమానం కలిగించి, చైతన్యం ఎలా తేగలమా అని ఆలోచిస్తే వెనకటి నాయకులకు కనపడిందల్లా గ్రంథాలయాల, పఠన మందిరాల స్థాపన ఒక్కటే! కొమర్రాజు లక్ష్మణరావుగారు సంకల్పించారు. మునగాల జమీందారు రాజానాయని వెంకట రంగారావు అండగా ఉంటానన్నారు. రావిచెట్టు రంగారావు లాంటి ప్రముఖులను కలుపుకొని మునగాల రాజావారి పోషకత్వంలో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయాన్ని హైదరాబాదు రెసిడెన్సీ బజారులో 1901 సెప్టెంబరు 1న స్థాపించారు. మళ్లీ మూడేళ్లు తిరగకుండా అదే జమీందారు పోషణలో శ్రీ రాజరాజ నరేంద్ర ఆంధ్ర భాషా నిలయం హనుమకొండలో వెలసింది. క్రమంగా సికిందరాబాదు, ఎర్రుపాలెం, రేమిడిచర్ల, సూర్యాపేట, నల్లగొండ, వరంగల్లులోనూ గ్రంథాలయాలు ఏర్పడ్డాయి. 1921లో ఆంధ్రోద్యమం మొదలయ్యేనాటికి ఇలాంటి గ్రంథాలయాలు పదివరకూ నడుస్తూ తెలంగాణలో ఆంధ్ర భాషా ప్రచారానికి యధాశక్తిగా పాటుపడుతూండేవి. రాజకీయ స్వభావం లేకుండా, సర్కారువాళ్ల వక్రదృష్టి పడకుండా ఎంత జాగ్రత్తపడ్డా గ్రంథాలయాల నిర్వహణలో చాలా చిక్కులు వస్తూండేవి. దేశ భాషల్లో పాఠశాలలు నెలకొల్పే విషయంలో చూపిన పక్షపాతాన్నీ, పరమత ద్వేషానే్న ఆంధ్ర గ్రంథాలయాల మీద చూపిస్తూ నైజాం సర్కారు అయినదానికీ కానిదానికీ సతాయిస్తూ, ఎప్పుడెప్పుడు వాటిని మూయించాలా అని సాకులు వెదుకుతూండేది.
ఉదాహరణకు 1920లో కాబోలు నల్లగొండ జిల్లా సూర్యాపేటలోని ఆంధ్ర విజ్ఞాన ప్రకాశినీ గ్రంథాలయం అటువైపు పర్యటనకు వెళ్లిన అవ్వల్ తాలూక్దారు (జిల్లా కలెక్టరు) కంట పడింది. తన ఇలాకాలో అలగాజనమంతా కలిసి చందాలు వేసుకుని గ్రంథాలయం నడపటం అతగాడి ఒళ్లుమండించింది. ‘గ్రంథాలయం పెట్టుకోవటానికి సర్కారు అంగీకారం పొందారా’ అని అక్కడివాళ్లను అడిగాడు ‘లేదు’ అని జవాబువచ్చింది. ఇంకేం? అనుమతి పొందలేదు కనుక ఇది నడవటానికి వీల్లేదని హుంకరించి బలవంతంగా మూతవేయించాడు. దానిమీద చచ్చీచెడి హైదరాబాదులో హోం సెక్రటరీగా ఉన్న సర్ అక్బర్ హైదరీకి మొరపెట్టుకుంటే- గ్రంథాలయం పెట్టటానికి ప్రభుత్వ అనుమతి అక్కర్లేదని స్పష్టం చేశాడు. ఆయన పుణ్యమా అని గ్రంథాలయం తలుపులు మళ్లీ తెరచుకున్నాయి.
గవర్నమెంటు నుంచి ఈ వివరణ ఇప్పించుకున్నాక అయినా అధికార ప్రమథగణం గ్రంథాలయాలను వాటి మానాన వాటిని బతకనిచ్చిందా? లేదు. ఉదాహరణకు వరంగల్ జిల్లా మడికొండలో పోలీసు పటేలు ఆ ఊరి గ్రంథాలయాన్ని సర్కారు అనుమతి లేకుండా ఎలా నడుపుతున్నారని గొడవపెట్టాడు. గ్రంథాలయానికి అనుమతి అక్కర్లేదని సర్కారే చెప్పిందని కార్యదర్శి మొత్తుకున్నా వినకుండా కేసు పెట్టాడు. దానిమీద వరంగల్ జిల్లా ఆదాలతు నాజింసా-
‘‘ప్రతిరోజు సదర్ లైబ్రరీకి పుస్తకములు చదువుకొనగలందులకు జనులు వస్తూ ఉన్నారు. మరిన్ని ఆంధ్ర పత్రిక, కృష్ణపత్రిక, ముషీరె దకన్ వగైరా పత్రికలు వస్తూ వున్నవి. హాల్ సదరు లైబ్రరీ ఖాయం చేయుటకు మీరు యే మహకమా నుంచి అయినా హుకుం పొంది వున్నారా? లేదా? అగరు హుకుం పొందనట్లయితే ఫవురన్ పొందవలసినది. మరియొక హుకుము పంపువరకు లైబ్రరీ మూసి యుంచవలెను’’ అని ఆజ్ఞాపించాడు. ఈ ఆజ్ఞ అక్రమమని, గ్రంథాలయానికి అలాంటి అనుమతి ఏదీ అక్కర్లేదని కార్యదర్శి ఎంతమంది అధికార్లకు ఎన్నితీర్ల మొత్తుకున్నా ఆలకించినవారు లేరు. 1948లో పోలీసు యాక్షను అయ్యేదాకా సర్కారునుంచి జవాబేలేదు.
విశేషమేమిటంటే-ప్రభుత్వం ఎన్నివిధాల వేధించి వెంటాడినా కార్యకర్తలు నిస్పృహచెందలేదు. గ్రంథాలయాలకు చందాలిచ్చేవారిని, అద్దెకు భవనమిచ్చేవారిని అధికారులు ఎంత భయపెట్టినా, కార్యనిర్వాహక సమావేశం జరుగుతూంటే పోలీసులు వచ్చి కూర్చుని ఎంత గొడవపెట్టినా, రికార్డులు పట్టుకుపోయి, ఎప్పటికీ తిరిగివ్వకుండా కార్యదర్శిని తిప్పినా నడిచే గ్రంథాలయాలు నడుస్తూనే ఉండేవి. గ్రామాల్లో చదువుకున్నవారు ఏ పదిమంది ఉన్నా ఒక గ్రంథాలయమో రీడింగ్ రూమో పెట్టుకుని పత్రికలు, పుస్తకాలు తెప్పించుకుని చదివేవారు. తీరిక సమయాల్లో సాధక బాధకాలను చర్చించుకునేవారు.
మొదట్లో ఎవరికివారేగా పనిచేసి నానా ఇబ్బందులు పళ్లబిగువున సహించిన వారికి 1921 నవంబరులో ఆంధ్ర జన సంఘం ఏర్పడటంతో కొత్త ఉత్తేజం వచ్చింది. ‘ఆంధ్ర జన సంఘం’ పేర నైజాంలో అనేక ప్రాంతాల్ల సంఘాలు ఏర్పడ్డాయి. తరవాత వాటినన్నిటిని సమన్వయం చేయటానికి 1923 ఏప్రిల్ 1న హనుమకొండలో మాదిరాజు రామకోటీశ్వరరావుగారి చొరవతో అందరూ కలిసి ‘ఆంధ్ర జన కేంద్ర సంఘం’ ఏర్పాటుచేశారు. అర్థరాత్రిదాకా చర్చించి దానికి నియమావళిని ఖరారుచేశారు. రాజకీయపరమైన కార్యకలాపాలకు నైజాం దుష్టపాలనలో ఆస్కారం బొత్తిగా లేదు కనుక గ్రంథాలయాలు, పఠన మందిరాలు, పాఠశాలలు స్థాపించటం... విద్యార్థులకు సహాయం చేయటం... విజ్ఞానాన్ని వ్యాపించెయ్యటం, ఆంధ్ర భాష ప్రచారానికి కృషిచేయటం, తాళపత్ర గ్రంథాలను, శాసనాలను సంపాదించి పర్కిష్కరించటం, అనాధలకు సాయపడటం వంటి కార్యాలకే ఆంధ్ర సంఘం తొలి దశలో పరిమితమైంది. కేంద్ర సంఘం ఏర్పడ్డాక గ్రంథాలయోద్యమానికీ మంచి ఊపు వచ్చింది. 1925 ఫిబ్రవరిలో మధిరలో ఆంధ్ర జన కేంద్ర సంఘం మూడో సమావేశంతోబాటు నైజాంలో ప్రప్రథమంగా గ్రంథాలయాల మహాసభ జరిగింది. అలాగే మరుసటి సంవత్సరం (1926 జూన్‌లో) సూర్యాపేటలో రెండో మహాసభ పెడదామనుకున్నారు. కాని అన్ని ఏర్పాట్లు అయ్యాక నైజాం ప్రభుత్వం సభలు జరిపేందుకు వీల్లేదని నోటీసిచ్చి అడ్డుకున్నది. అయినా పట్టువదలక ఆహ్వాన సంఘంవారు మూడేళ్లపాటు తీవ్రంగా ప్రయత్నించి, అత్యున్నత స్థాయివరకూ వెళ్లిన తరవాత గానీ 1929 జూన్ 1న సూర్యాపేటలో ఆంధ్ర కేంద్ర జన సంఘం సమావేశాలు, గ్రంథాలయాల మహాసభలు జరుపుకోవటానికి అనుమతి రాలేదు. వ్యయప్రయాసలు ఎన్నిపడ్డా గ్రంథాలయ సభల్లో గ్రంథాలయాల గురించే చర్చించటానికి వీలుంటుంది కదా? దానికి బదులు జన సామాన్యం ఎదుర్కొనే సమస్యలన్నీ చర్చించటానికి ఏకంగా ఆంధ్ర మహాసభలే ఎందుకు జరపకూడదు అన్న ఆలోచన మాడపాటి వంటి పెద్దలకు వచ్చింది. ఎనిమిదేళ్ల ఆంధ్రోద్యమ అనుభవంతో అలాంటి సభను జరపగలమన్న ఆత్మవిశ్వాసం కలిగింది. మెదక్ జిల్లా జోగిపేటలో ప్రథమాంధ్ర మహాసభకు తెర లేచింది. *