ఆంధ్రుల కథ - 11

ఎం.వి.ఆర్ శాస్త్రి గారు ఆంధ్ర భూమి ఆదివారం అనుబంధం లో సీరియల్ గా ప్రచురిస్తున్న ఆంధ్రుల కథ యదాతథం గా..

అనుమతి ఇయ్యవీలులేదు(July 4th, 2010)

మజార్యా నం.25
7 ఫర్వర్ది 1339 (18- ఫిబ్రవరి- 1930)
మింజానబు మహమ్మదు ఫయాజ్ హుసేన్, ముంతజిం
కొత్వాలి స్టేషన్ హౌసు, జోగిపేట, అందోలు తాలూకా
గోపాల వేంకటరావుగారు, కార్యదర్శి, ఆంధ్ర మహాసభ, జోగిపేట వారికి వ్రాయునదేమనగా, మీ యాజమాన్యములో ఏదో కాన్ఫరెన్సు త్వరలో జోగిపేట యందు సమావేశము కానున్నట్లు మాకు విశ్వాసపాత్రమైన మార్గము ద్వారా తెలిసినది. ఇట్టి సభల ఉద్దేశము ఎట్టిదైననుసరే ఇట్టి కాన్ఫరెన్సుల విషయములో సెలవు పొందవలయునని ప్రభుత్వమువారి ఆజ్ఞలు పరిపాలనా విషయకములు కలవు. కనుక పై హుకుము ప్రకారము మీకు నోటీసు ఇచ్చుట ఏమనగా, ఈ సంగతి నిజమైన పక్షమున సభయొక్క నిర్ణీతమగు తారీఖుకు వారముముందు జాబితా ప్రకారము అనుజ్ఞాపత్రము పొంది దాని ధ్రువ పరుపబడిన నకలును పంపుచు మాకు తెలియజేయవలసినది... ఆ ప్రకారము చేయని పక్షమున ఈ సభను అక్రమ సమావేశముగా భావించి క్రమమైన చర్య జరుపుట పోలీసువారికి తప్పని పనియగును. దీని జవాబుదారి మీ యొక్కయు, మీ సభాసదుల యొక్కయు తలపైన యుండగలదు.
ఫయాజ్ హుసేన్, ముంతజిం కొత్వాలి
నిజాం రాష్ట్రాంధ్ర మహాసభలు, ప్రథమ భాగము,
కె.జితేంద్రబాబు, పే.79-80
మెథక్ జిల్లా జోగిపేటలో మొట్టమొదటి నిజాం రాష్ట్రాంధ్ర మహాసభ ఇంకో రెండు వారాల్లో జరుగుతుందనగా ఆహ్వాన సంఘం కార్యదర్శికి స్థానిక పోలీసుఠాణానుంచి అందిన నోటీసు ఇది. దీనిలోని భాషనుబట్టే ఆ కాలంలో ఆంధ్రులన్నా, వారి సమావేశాలన్నా నిజాం సర్కారు అధికార గణానికి ఎంత అక్కసో బోధపడుతుంది.
నిజానికి పోలీసువాడు హెచ్చరించకముందే అలాంటి అనుమతి ఒకటి సర్కారునుంచి పొందాలని సభా నిర్వాహకులకు తెలుసు. కొత్తగా వచ్చిన గస్తీ నిషాన్ 53 ఫర్మానులో శాసించిన ప్రకారం తమను మహాసభకు అనుమతికోసం అప్పటికి రెణ్నెల్లకిందటే మెదక్ అవ్వల్ తాలూక్‌దారు (జిల్లా కలెక్టరు)కు ఆహ్వాన సంఘ కార్యదర్శి దరఖాస్తు చేశాడు. తాము జరిపేది రాజ్యాంగేతర సమావేశమని, సాంఘిక, విద్య, నైతిక విషయాలు మాత్రమే చర్చిస్తామని అందులో స్పష్టం చేశారు. దానిమీద - సభ రాజ్యాంగ స్వరూపము కలది కాని యెడల సెలవు ఇయ్యవచ్చును. కాని ఏయే ఉపన్యాసములు జరుగునో వాటి కాపీలు, ఉపన్యాసకులెవరెవరో వారి పేర్లు తెలియజేయాలని కలెక్టరు కొర్రీ వేశాడు.
అదెట్లా కుదురుతుంది? సభకు ఎవరిని పిలిచామన్నది చెప్పగలమేతప్ప వారిలో ఎవరు వస్తారో, ఎవరు రారో, వస్తే ఏమి మాట్లాడుతారో, రానివారి స్థానంలో ఆ సమయానికి ఎవరు ఉపన్యాసమిస్తారో మాకెలా తెలుస్తుంది? ఉపన్యాసాల్లో రాజకీయ విషయాలు ఉండవనీ, రాజకీయ అంశాలు సభలో చర్చించబోమని మేము హామీ ఇస్తున్నాం. దయచేసి అనుమతివ్వండి- అని కార్యదర్శి వేడుకున్నాడు. ఇవ్వాలోవద్దో హోం సెక్రటరీని అడుగుతామని కలెక్టరు అన్నాడు. కలెక్టరేట్ చుట్టూ, హోం సెక్రటరీ చుట్టూ తిరగగా తిరగగా ఎట్టకేలకు సమావేశాలకు షరతులతో కూడిన అనుజ్ఞ వచ్చింది. ఆ షరతులు ఏమిటంటే:
1. అధ్యక్షుడు గైర్ ముల్కీ (పరదేశీయుడు) కాకూడదు. ముల్కీ (నైజాం పౌరుడే) ఉండాలి.
2. ఇతర మతస్థులకు మనస్తాపం గాని, అనుమానం కాని కలిగే పరిస్థితి కల్పించకూడదు.
3. రాజకీయ విషయాలు ఏమాత్రం మాట్లాడకూడదు.
ఇన్ని ఆంక్షల మధ్య సర్కారీ ఏజంట్ల నిరంతర నిఘాలో జరిగిన ప్రథమాంధ్ర మహాసభలో సహజంగానే విశేషాలు పెద్దగా లేవు. అప్పటి పరిస్థితుల్లో నిజాంకు ఎలర్జీ అయిన ‘ఆంధ్ర’ పేరుమీద అనేక జిల్లాల పౌరులు కలిసి మహాసభ పెట్టుకోవటమే పెద్ద విశేషం.
1930 మార్చి 3న మొదలై మూడు రోజులు సాగిన జోగిపేట మహాసభకు అధ్యక్షుడు సురవరం ప్రతాపరెడ్డి. ఆయన అరవై మంది ప్రతినిధులతో ప్రత్యేక బస్సుల్లో బయలుదేరి 3వ తేది మధ్యాహ్నానికి అందోలు చేరుకున్నారు. అప్పటికే ట్రావెలర్స్ బంగళా దగ్గర వేల జనం వారికోసం వేచి ఉన్నారు. ‘ఆంధ్ర మాతకు జై’, అన్న నినాదాల నడుమ ప్రతాపరెడ్డి తెల్లగుర్రం ఎక్కారు. ఆయన వెనక వంద మంది వలంటీర్లు లాఠీలు పట్టి, యూనిఫాంలో బారులు తీరారు. మూడువేల జనం జయజయ ధ్వానాలతో వారిని అనుసరించారు. ఆ వెనక ప్రతినిధులున్న మోటారు బండ్లు! గంటకు పైగా కన్నుల పండువగా సాగిన ఊరేగింపు సాయంత్రం 6 గంటలకు రంగుల తోరణాలతో అందంగా అలంకరించిన జోగిపేట పురవీధుల గుండా సభా మందిరం చేరుకుంది. ‘ఆంధ్ర దేశపు మట్టి అది మాకు కనకము’ అన్న సుప్రసిద్ధ ఆంధ్ర గీతాన్ని ఆదిరాజు వీరభద్రరావు శ్రావ్యంగా పాడటంతో సభ మొదలైంది. ‘ఆంధ్ర జన కేంద్ర సంఘం ఆధ్వర్యాన తెలుగుభాషా సంస్కృతుల పునరుజ్జీవంకోసం, ఫ్యూడల్ దురంతాలకు వ్యతిరేకంగానూ చెదురుమదురుగా సాగుతున్న ఉద్యమాలు వాగులన్నీ చేరిన మహానది లాగ మహాసభలో చేరాయి.’ సభలూ సమావేశాలపై ఆంక్షలను ఎత్తివేయాలని, ప్రైవేటు పాఠశాలలపై నిషేధం తీసెయ్యాలని, వెట్టిచాకిరిని నిరోధించాలని సర్కారును కోరే తీర్మానాల్లాంటివి కొన్ని ఉన్నా ఈ మహాసభలో చేసిన 31 తీర్మానాల్లో అత్యధిక భాగం సాంఘిక సమస్యలకు సంబంధించినవే. బాల్య వివాహాలను నిషేధించాలని, స్ర్తి విద్యను ప్రోత్సహించాలని తెచ్చిన తీర్మానాలు పెద్ద గొడవల్లేకుండా పాసయినా, సభాసదులు వాటిని మనస్ఫూర్తిగా ఆమోదించారని చెప్పటానికి వీలులేదు. పూర్వాచార పరాయణులైనవారు సామాజిక సంస్కరణల పట్ల వైముఖ్యాన్ని దాచుకోలేదు.
ఆహ్వాన సంఘాధ్యక్షుడు టేకుమాల అనంత వెంకటరావే పెద్ద ఛాందసవాది. ఆయన స్వాగతోపన్యాసాన్ని సొంతంగా రాసుకోలేడు. కేంద్ర ప్రచార సంఘ కార్యదర్శి ఉన్నవ వెంకటరామయ్య రాసిపెట్టాడు. అధ్యక్షుల వారికి చూపించి సరే అనిపించుకున్నాకే దాన్ని అచ్చుకు పంపారు. తీరా ఆహ్వాన సంఘాధ్యక్షుడి ఉపన్యాసాన్ని సభలో చదివేటప్పుడు నిర్బంధ ప్రాథమిక విద్య, స్ర్తి విద్య, బాల్య వివాహాల్లాంటి సంస్కరణల ప్రసక్తి వచ్చినపుడల్లా ప్రసంగాన్ని చదివి ‘‘ఇవి నా మాటలు కావు. ఉన్నవ వెంకట్రామయ్యగారి అభిప్రాయాలు సుమండీ’’ అని బిగ్గరగా అరిచాడు. ఈ తమాషా చూసేవారికి ఉచిత వినోదం.
ఇక అంటరాని తనాన్ని తొలగించాలనే తీర్మానాన్ని హరిజన నాయకుడు భాగ్యరెడ్డి ప్రవేశపెట్టి, సభ దానిని ఆమోదించే సందర్భంలో పెద్ద గొడవ అయంది. అస్పృశ్యుడైన భాగ్యరెడ్డి తమను తాకుకుంటూ వెళ్లి తీర్మానాన్ని ప్రతిపాదించినందుకు పూర్వాచర పరాయణులు దిగ్గున లేచి తీవ్రాభ్యంతరం తెలిపారు. వారిలో కొందరు సభనుంచి నిష్క్రమించసాగారు. సభ రసాభాస అవుతుందా అని పెద్దలు ఆందోళన పడ్డారు. ఆ సందర్భాన మహారాష్ట్రుల నాయకుడు వామన్ నాయక్ పరిపరివిధాల నచ్చచెప్పిన మీదట సనాతనులు చల్లబడ్డారు. మహాసభ చెదిరిపోకుండా నిలిచింది.
ఆంధ్ర మహాసభతోబాటు ఆంధ్ర మహిళా మహాసభనూ అదే పందిట్లో జరిపే ఆనవాయితీ జోగిపేటనుంచే మొదలైంది. నడింపల్లి సుందరమ్మ తొలి సభకు అగ్రాసనాధిపత్యం వహించారు. ‘పూర్వపు స్ర్తిల ఔన్నత్యము, నేటి హీన స్థితి, వివాహ సమస్య, పాతివ్రత్యం, కళావంతులు, వితంతువుల స్థితి వంటి విషయాలను మహిళలు ఝమాయించి చర్చించారు.
ప్రథమాంధ్ర మహాసభతో తెలంగాణ ప్రజలకు ఆంధ్రోద్యమం పట్ల అభిమానం హెచ్చింది. అదే దామాషాలో నిజాం సర్కారుకు అనుమానాలూ పెరిగాయి. ఆ కాలాన ఆంధ్రోద్యమ ప్రచారం రాజకీయాలకు సంబంధించకపోయినా, ముఖ్య నాయకులు గ్రామాల్లోకి వెళ్లినప్పుడు పోలీసులు వారిని నీడలా వెంటాడేవారు. వారితో కలవొద్దని గ్రామ ప్రజలను ఉద్బోధించేవారు. రకరకాలుగా భయపెట్టేవారు. సరిగ్గా సంవత్సరం తరవాత 1931 మార్చి 3,4,5 తేదీల్లో రెండవ ఆంధ్ర మహాసభను నల్లగొండ జిల్లా దేవరకొండలో జరపదలచి, నల్లగొండ అవ్వల్ తాలూకుదారు(కలెక్టరు)కు అనుమతికోసం ఆహ్వాన సంఘ కార్యదర్శి అర్జీ పెడితే ఆయనగారు ఏమని బదులిచ్చారో చూడండి:
‘‘మహాసభకు సెలవిచ్చుటకు ముందు తెలుసుకొనవలసిన అంశమేమనగా, ఈ మహాసభ యొక్క కార్యక్రమము, కాబోవు ఉపన్యాసముల నకళ్లు, ఇతర సభా సమావేశకుల యొక్కయు, ఉపన్యాసకుల యొక్కయు పేళ్ల పట్టికలు నావద్దకు పంపవలయును.’’
‘దీనికి- మహాప్రభో! అది కుదరదు. సభకు ముందురోజు గాని ఉపన్యాసకుల పేర్లను విషయ నిర్ణాయక సంఘం ఖరారుచెయ్యదు. కనుక ఇంతముందుగా వారి పేర్లను, చెయ్యబోయే ఉపన్యాసాల నకళ్లను మీకు దాఖలు చెయ్యలేము.’ అని ఆహ్వాన సంఘం జవాబిచ్చింది. అలా అయితే. నాకు తెలియదు. పైనుంచి పర్మిషను తెచ్చుకోండి అని బిర్ర బిగిశాడు- కలెక్టరు. కేంద్ర సంఘ కార్యదర్శి మాడపాటి హనుమంతరావు పోయి పోలీసు మంత్రిని కలిసి సుదీర్ఘంగా విన్నవించిన తర్వాత అతికష్టంమీద అనుమతి పత్రం ఇచ్చారు. అదీ ఈ కింది బిగింపులతో:
‘‘అధ్యక్షుడు బయటివాడెవడును కాకూడదు. అతడు ముల్కీ (నిజాం రాష్టవ్రాసియే) అయి యుండవలెను... మహాసభలో జరుగు చర్యలన్నియు రాజకీయేతరములుగా నుండవలెను... మీకు, మీ మహాసభా సమావేశకులకును ఒక సంగతి స్పష్టముగా తెలుపబడుచున్నది. ఈ మహాసభలో జరిగిన ఏదైన సంగతి ప్రభుత్వమువారి విధానమునకు విరుద్ధముగానున్న పక్షమున, రాబోవు సంవత్సరమున ఇట్టి దరఖాస్తులు అసలే అంగీకరించబడవు.’’
తెలంగాణ ఆంధ్రోద్యమము, రెండవ భాగము,
మాడపాటి హనుమంతరావు పే.82-83
చచ్చీచెడీ ఎట్టకేలకు అనుమతి పొంథిన మీదట బూర్గుల రామకృష్ణారావు అధ్యక్షతన జరిగిన ద్వితీయాంధ్ర మహాసభలోనూ షరామామూలే. హైదరాబాదునుంచి మోటారు బస్సులలో తరలివెళ్లిన వారితో పురవీధుల్లో ఊరేగింపు, అధ్యక్షుడిని గుర్రమెక్కించటంనుంచి సంసార పక్షపు తీర్మానాల మొదలు సభలో గొడవల దాకా దేవరకొండదీ జోగిపేట బాటే.
‘‘మొదటి మహాసభలో మహారాష్ట్ర నాయకుడైన వామన్ నాయక్ ప్రధానపాత్ర వహించగా రెండో దానిలో ఆయన ప్రత్యర్థి అయిన మరో మరాఠా నేత కేశవరావు పోటీకి వచ్చారు. సాంఘిక సమస్యలపైన వీరిద్దరికీ మహాసభలో తీవ్ర వాగ్వాదాలు జరిగాయి. కేశవరావుగారు సంస్కరణవాది. యువకుల కృషితో ఈ మహాసభలో ఛాందసులు ఓడిపోయారు. ప్రముఖ మహారాష్ట్ర నాయకులు చర్చలలో ప్రధానపాత్ర వహించినప్పటికీ చర్చలన్నీ తెలుగులోనే జరిగాయి. తీర్మానాలు మాత్రం ప్రథమ మహాసభలాగే ఈ మహాసభలో కూడా ప్రభుత్వాన్ని, ప్రార్థించి, ప్రాధేయపడే రీతిగానే వున్నాయి.’’
వీర తెలంగాణా నా అనుభవాలు- జ్ఞాపకాలు,
రావి నారాయణరెడ్డి పే.25-26
తెలుగులో మాట్లాడటానే్న సహించలేక 1921 నవంబరులో హైథరాబాదు సభలో తెలుగు వక్తను అల్లరిపెట్టినవారే... 1931లో ఆంధ్ర మహాసభకు వచ్చి, తెలుగులో జరిగిన చర్చల్లో పాల్గొన్నారంటే పదేళ్లలో ఎంత మార్పు! ఆంధ్రోద్యమానికి అది ఎంత బలుపు!!
రావి నారాయణరెడ్డిగారి తీవ్రవాద నేత్రాలకు దేవరకొండ మహాసభ తీర్మానాలు ప్రభుత్వాన్ని ప్రార్థించి, ప్రాధేయపడేవిగా కానవచ్చినా, నైజాం సర్కారు మాత్రం అలా అనుకోలేదు. దేవరకొండ మలి సభ తరవాత దానికి గంగవెర్రులు ఇంకా ఎక్కువయ్యాయి. ఏటేటా మహాసభ జరపాలనుకున్న ప్రకారం మూడో ఆంధ్ర మహాసభ 1932లో జరగాల్సింది. జరగలేదు. ఆ సభను మహబూబ్‌నగర్ జిల్లా జటప్రోలు సంస్థాన ప్రధాన కేంద్రమైన కొల్లాపురంలో జరపాలని మొదటి అనుకున్నారు. సంస్థాన కార్యదర్శిని అందుకు అనుమతి అడిగితే ఆ అధికారం మాకు లేదు- నిజాం సర్కారునుంచే అనుమతి తెచ్చుకుని మాకు చూపించండి అన్నాడు. దానిపైన జిల్లా కలెక్టరుకు అర్జీ పెడితేనేమో ‘‘సంస్థాన వ్యవహారాల్లో జిల్లా అధికారులం జోక్యం చేసుకోము’’ అని బదులిచ్చాడు. దానిమీద ఇంతకుముందు సభల విషయంలో లాగే కేంద్ర సంఘ కార్యదర్శి అంచెలంచెలుగా విన్నపాలు చేసి, చిట్టచివరికి హోం సెక్రటరీకి పిటీషను పెట్టుకుని కచేరీల చుట్టూ తిరగగా తిరగగా ప్రధానమంత్రి మహారాజా సర్ కృష్ణప్రసాద్ బహాదర్‌నుంచి ఒకే ఒక వాక్యరత్నంతో ఆజ్ఞాపత్రం వచ్చింది. ఏమనంటే- ‘‘సంస్థానము లోపల నగుగాక, బయట నగుగాక, మహాసభ సమావేశపరచుటకు అనుమతి ఇయ్యవీలులేదు.’’
‘సంస్థానం లోపలా కూడదు. బయటా పనికిరాదు’ అంటే మహాసభను ఇక ఎక్కడ పెట్టుకోవాలి? ప్రజల వాక్స్వాతంత్య్రమన్నా, ఆంధ్రోద్యమన్నా తగని వైముఖ్యంతో హిరణ్యకశిపుడి వరాల్లా సర్కారు షరాలు పెడుతూ పోతే... ప్రత్యక్ష ఘర్షణకు సిద్ధంగా లేని సభా నిర్వాహకులు చేయగలిగిందేమిటి? కచేరీల చుట్టూ తిరిగి, వివరణల మీద వివరణలిచ్చి, సర్కారువారి ఘనతను గూర్చి మిక్కిలి ప్రార్థించి ఏదో ఒక విధంగా కార్యం సాధించడం ఒకటే కదా? ఆంధ్ర మహాసభ పెద్దలూ అదే పనిలో పడ్డారు. ఏకంగా రెండేళ్లకు పైగా ప్రయత్నాలు చేసినా వ్యవహారం ఒక కొలిక్కి రాలేదు. వారి పని నెరవేరటానికి ఇంకా చాలా వ్యవధి ఉంది. ఈలోపు సీమాంధ్రకు వెళ్లి, గాఢ నిద్రలోని ఆంధ్రోద్యమాన్ని మనం వదిలేసిన దగ్గరినుంచీ కాస్త సింహావలోకన చేసొద్దాం.*