ఆంధ్రుల కథ - 12

ఎం.వి.ఆర్ శాస్త్రి గారు ఆంధ్ర భూమి ఆదివారం అనుబంధం లో సీరియల్ గా ప్రచురిస్తున్న ఆంధ్రుల కథ యదాతథం గా..

‘ఆంధ్రా’పోయె, ‘కాంగ్రెసు’ వచ్చె...(July 11th, 2010)

‘‘ఆంధ్రులారంభించని ఉద్యమాలే లేవు. అయితే జయప్రదంగా కొనవరకూ సాగించబడినవి మాత్రం చాలా తక్కువ. ఏమూలైనా ఒక కొత్త పని ఆరంభించబడిందంటే ఆంధ్రుడికి ఉద్రేకం కలుగుతుంది. అంతటినుంచీ ఆ ఉద్యమమే జీవిత పరమావధి అనుకొని దానిమీద తన శక్తినంతా వినియోగిస్తాడు ఆంధ్రుడు. ఈలోగా మరొకటివస్తే దాల్లోకి దూకుతాడు తానిదివరకు చేస్తున్న పనిని వదిలిపెట్టి. ఈ చాంచల్యానికి ప్రతిఫలం ఒక పనీ పూర్తికాకపోవటమే.’’
అంటారు విఖ్యాత చరిత్రకారులు మారేమండ రామారావుగారు ‘ప్రబుద్ధాంధ్ర’ పత్రిక ఏప్రిల్ 1934 సంచిక (158 పేజి)లో రాసిన ‘ఆంధ్రుల కర్తవ్యం’ అనే వ్యాసంలో.
‘ఆంధ్రుడంటే ఎవరో, అతనికుండే గౌరవమేమిటో, ఇతర రాష్ట్రీయులతో సరిపోల్చి చూస్తే అతనికుండే స్థానమేమిటో తెలియని రోజుల్లో కొమర్రాజు లక్ష్మణరావుగారూ, చిలుకూరి వీరభద్రరావుగారూ ఆంధ్రుని చరిత్రను నిర్మించి, ఆంధ్రునికి ఆత్మజ్ఞానమూ, ఆత్మవిశ్వాసమూ కలుగచేశారు... ఇంతలో గ్రంథాలయోద్యమం, భాషా వివాదం, అసహాయోద్యమం బయల్దేరాయి. అంతవరకూ మేజాబల్లమీద వుండి నిత్య పారాయణార్హమైన ఆంధ్రుల చరిత్రని మూలకి విసిరేసి, నడుముకట్టి ఈ కొత్త వుద్యమాల్లోకి దూకేసినందుకు’ ఆంధ్రుల మీద అంత చికాకు కలిగింది రామారావుగారికి. స్వతహాగా తాను చరిత్రకారుడైనందువల్ల ‘ఆంధ్రుల చరిత్ర’కు ఆదరణ తగ్గడం చూసి మారేమండవారికి మనస్తాపం కలగడం సహజమే. కాని ఆయన అతిముఖ్యమైన ఇంకో విషయాన్ని ఈ సందర్భంలో పేర్కొనడం మరచిపోయారు. ఆ సమయాన ఆంధ్రుడు మూలకి విసిరేసింది ‘ఆంధ్రుల చరిత్ర’ను మాత్రమే కాదు. దాని ప్రేరణతో రూపుదిద్దుకున్న ఆంధ్రోద్యమాన్ని కూడా. అన్నిటికంటే పెద్ద నష్టం దానివల్ల.
ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్ర సంస్కృతి, ఆంధ్రుల ప్రయోజనాల పరిరక్షణ వంటి అంశాల్లో ముక్కోటి ఆంధ్రుల మనోభీష్టాన్ని ప్రతిబింబించే ఏకైక సంస్థ ‘ఆంధ్ర మహాసభ’. అది చేయవలసిన వాటిలో అనివార్యంగా రాజకీయ పోరాటం కూడా ఉన్నా రాజకీయాలతో దానికి పనిలేదు. ఏ ఒక రాజకీయ సంస్థతోనూ అది కొంగుముడివేసుకుని తిరగాల్సిన అవసరం అసలే లేదు. ఎంత గొప్పదైనా, దానిని నడిపించేవారు ఎంతటి మహనీయులైనా- అలా ఒక రాజకీయ శిబిరంతో మమేకమవడం విశాల ఉద్యమానికి హానికరం. కాని మహా మేధావులైన మన నేతలకు అలాంటి ఐహిక విషయాలేవీ పట్టలేదు. మోహన్‌దాసు గాంధీగారొచ్చి సత్యాగ్రహ వేణువు ఊదగానే అలనాటి వ్రేపల్లె గోపికల్లా మైమరచి ఎక్కడి ఉద్యమాలనక్కడ వదిలిపెట్టి కాంగ్రెసు బృందావనానికి బిలబిలలాడుతూ పరుగులు తీశారు.
1920 డిసెంబరు నాగపూర్ కాంగ్రెసులో ‘శాంతియుత, చట్టబద్ధ మార్గాల్లో స్వరాజ్య సాధన కాంగ్రెసు లక్ష్యం’గా ప్రకటించడం, ‘సహాయ నిరాకరణ’ ఆయుధంతో సంవత్సరంలో స్వరాజ్యాన్ని సాధించి తీరుతానని గాంధీ మహాత్ముడు శపథం చెయ్యటం ఆంధ్రులకు గొప్ప ఉత్తేజానిచ్చింది. అది మొదలు ‘అసహాయం’ వారికి ప్రాణం, ప్రణవం అయిపోయింది. తాము అసహాయవాదులం కనుక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు బ్రిటిషు సర్కారు సహాయాన్ని అర్ధించటం కూడా ‘అసహాయ’ స్ఫూర్తికి అపచారంగా ఆంధ్ర నేతాశ్రీల బుద్ధికి పొడగట్టింది. వారి ఆలోచనలో, కార్యాచరణలో ‘ఆంధ్రమాత’ అదృశ్యమై ఆ స్థానాన్ని కూడా భారతమాతే పూర్తిగా ఆక్రమించింది. స్వరాజ్యమే ఏకైక ధ్యేయమైంది. ఆంధ్ర రాష్ట్రంలాంటి పాత డిమాండ్లు పక్కకి తప్పుకున్నాయి.
ఈ సంగతి చెబితే ‘మంచిదేకదా? అందులో తప్పేముంది?’ అంటారు ఎవరైనా. నిజమే! ఎప్పుడైనా, ఎట్టి పరిస్థితుల్లోనైనా ప్రాంతంకంటే దేశం ముమ్మాటికీ గొప్పది. మనం మొదట భారతీయులం. ఆంధ్రులమైనా, మరొకరమైనా ఆ తరవాతే. మొత్తం దేశమే దాస్యశృంఖలాల్లో బంధించబడి ఉన్నప్పుడు పారతంత్య్రపు చెరనుంచి భరతమాతను ఎలా విముక్తి చెయ్యాలన్నదే ఈ గడ్డమీద పుట్టిన ప్రతి ఒక్కడూ మొట్టమొదట ఆలోచించవలసింది. 1857 స్వాతంత్య్ర పోరాటాన్ని తెల్ల రక్కసులు కర్కశంగా అణచివేసి, విడవకుండా సాగిన చిన్నాపెద్దా తిరుగుబాట్లూ విఫలమై దిక్కుతోచని స్థితిలో దేశవాసులు కొట్టుమిట్టాడుతున్న సమయాన దేవదూతలా ఒక మహాత్ముడు అరుదెంచి సత్యాగ్రహ మంత్రాన్ని ఉపదేశించి, సహాయ నిరాకరణ దివ్యాస్త్రాన్ని అందించి, వాటిని నిష్ఠగా నమ్మితే ఏడాదిలోనే స్వరాజ్యం తథ్యమని ప్రకటిస్తే... అంతకంటే ఏమికావాలి? మిగతా వ్యాపకాలూ, వ్యవహారాలూ అన్నీ వదిలి, ఇతర లక్ష్యాలన్నీ విడిచి జాతి విముక్తి మహాలక్ష్యసాధనకోసం స్వరాజ్యశ్రేణుల్లో కలిసి, అదృష్టంకొద్దీ దొరికిన మహానాయకుడు చెప్పినట్టు చెయ్యటాన్ని మించిన గొప్ప కర్తవ్యం ఏముంటుంది?
ఉండదు. ఉండదుగాక ఉండదు. అందరూ అలాగే అనుకున్నారు. స్వతహాగా ఆవేశపరులు కనుక ఆంధ్రులు ఇతరులకంటే ఎక్కువ అనుకున్నారు. ఎక్కడైనా ఒక కొత్త పని ఆరంభించబడిందంటే ఆంధ్రుడికి ఉద్రేకం కలుగుతుందనీ, అంతటినుంచీ ఆ ఉద్యమమే జీవిత పరమావధి అనుకుని దానిమీద తన శక్తినంతా వినియోగిస్తాడనీ మారేమండ రామారావుగారు అన్నారు కదా?! ఈ ఘట్టంలోనూ సరిగ్గా అదే జరిగింది. మేరలేని ఉత్సాహంతో, అతులిత కార్యదీక్షతో ఆంధ్రులు రంగంలోకి దూకి గాంధీ ఉపదేశాన్ని తు.చ. తప్పక అమలుజరిపారు. మహోద్యమాలను నిర్మించారు. మహోదాత్తంగా పోరాడారు.
ప్రతిసారీ- ఘోరంగా మోసపోయారు!
1920’ల్లో గాంధీగారు నడిపారనుకునే ‘సహాయ నిరాకరణ ఉద్యమం’లో ఉజ్వల ఘట్టాలనదగ్గవి ఇండియా మొత్తంమీద ముఖ్యంగా మూడు. మూడూ ఆంధ్ర దేశాన ఆంధ్రులు నడిపినవే. ఒకటి- చీరాల పేరాల పోరాటం. రెండు- పలనాడు పుల్లరి సత్యాగ్రహం. మూడోది- పెదనందిపాడు పన్నుల నిరాకరణ మహోద్యమం. మూడింటికీ ప్రేరణ గాంధీబోధే. మూడింటిని నడిపినవారూ నికార్సయిన గాంధీ భక్తులే. మూడూ నడిచినవి ముమ్మాటికీ గాంధీ పంధాలోనే.
ఏం లాభం? మూడిటినీ నట్టేట నిలువునా ముంచినవాడు మహాత్మాగాంధీగారే!
అది ఎలా జరిగింది అన్నది వెనకటి ‘మన మహాత్ముడు’ వ్యాస పరంపరలో వివరంగా చూశాం. వాటిని చదవనివారు, చదివినా మరపునపడ్డవారి ఎరుకకోసం వాటి ముఖ్య విశేషాలు చప్పున సింహావలోకన చేద్దాం.
గుంటూరు జిల్లాలోని చీరాల, పేరాల గ్రామాలను కలిపి ప్రత్యేక మున్సిపాలిటీ చేయాలని 1919లో మద్రాసు ప్రభుత్వం సంకల్పించింది. అది ఆ గ్రామాల ప్రజలకు ఇష్టంలేదు. మున్సిపాలిటీ అయినందువల్ల భరించలేని పన్నుల బాదుడే తప్ప ఊరికి ఉపయోగం సున్న. చీరాల వాస్తవ్యుడైన దుగ్గిరాల గోపాలకృష్ణయ్యగారు ఎన్ని విన్నపాలు చేసినా, ఊరి జనమంతా వద్దుమొర్రో అంటున్నా సర్కారువారు పట్టుబట్టి 1920 జనవరి 12న కొత్త మున్సిపాలిటీ ఏర్పాటుచేశారు. చిల్లర దుకాణాలవారి మీద, ఆఖరికి వీధుల్లో తిరిగే తోపుడుబండ్ల వ్యాపారులమీదా భారీ సుంకాలు మోపి, ఇళ్లపన్నులు విపరీతంగా పెంచి కడతారా చస్తారా అని నిర్బంధించసాగారు. గాంధీని దైవంగా తలిచే దుగ్గిరాల గాంధీ బోధనే ఆచరణలోపెట్టి పన్నులు చెల్లించవద్దని ప్రజలను కోరాడు. వారూ వల్లె అన్నారు. పన్నులు కట్టనివారి ఆస్తులు జప్తుచేశారు. ఎంతోమందిని జైలుకూ పంపారు.
ప్రజలు ఎంత శాంతంగా ఉన్నా ప్రభుత్వ దమనకాండ రోజురోజుకూ పెరగడంతో గోపాలకృష్ణయ్య ఏమి చేయాలో పాలుపోక గాంధీగారినే సలహా అడిగాడు. మున్సిపాలిటీ ఇష్టం లేకపోతే ఊళ్లో ఉండాలని ఏముంది? మున్సిపల్ సరిహద్దుల అవతలికి పోయి నిరసించవచ్చుగదా అని మహాత్ముడు ప్రశస్తమైన ఉపదేశం చేశాడు. బాగుంది అలాగే చేద్దాం అనుకున్నారు ఊరి జనం. ఊరు వదిలిపోయేందుకు సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్న సమయంలో ఆంధ్ర దేశ సంచారంలో భాగంగా స్వయానా మహాత్ముడే 1921 ఏప్రిల్ 6 రాత్రి చీరాలలో అడుగుపెట్టాడు. తనమీద అచంచల భక్తివిశ్వాసాలతో, తానిచ్చిన సలహామేరకు సొంత గడ్డమీద మమకారం చంపుకుని, కొంపాగోడూ వదిలి, ఊరిబయట పాకల్లో బతకడానికి సిద్ధమైన జనాన్ని చూసి సంతోషించి ‘మీకేమీ భయంలేదు, నేనుంటా మీ వెంట’అని భరోసా ఇచ్చాడా? లేదు.
‘‘మీరు చేయు కార్యము జయప్రదమైన యెడల కాంగ్రెసు మిమ్ము అభినందించును. కాని మీరు అపజయము పొందునెడల ఆ బాధ్యత తనపై పెట్టుకొనదని మహాత్మాజీ యుక్తిగా జవాబుచెప్పిరి.’’
స్వీయ చరిత్ర, కొండ వెంకటప్పయ్య, పే.264
‘‘గెలిస్తే మా గొప్ప- గెలవకుంటే మీ ఖర్మ’’ అని జాతీయోథ్యమ సర్వ సైన్యాధిపతే గిరీశం తరహాలో నమ్మశక్యంకాని మెలిక పెట్టినా చీరాల వాసులు శంకలేమీ పెట్టుకోలేదు. మహాత్ముడి మీద నిండైన భక్తితో, ఆయనగారి అంటీముట్టని ఆశీర్వచనమే మహాద్భాగ్యమని ఎంచి 1921 ఏప్రిల్ 25 అర్థరాత్రి మొత్తం ఊరు ఖాళీచేసి పోయారు. నాటినుంచి పదకొండు నెలలపాటు చీరాల- పేరాల వీధులు నిర్మానుష్యంగా స్మశాన వాటికలవలె కనిపించాయి. మొత్తం దేశంలోనే కనీవినీ ఎరుగని ఈ అద్భుత పోరాటంలో పర్ణశాలల్లోని జనం నరకయాతన పడ్డారు. ఉష్ణోగ్రత 120 డిగ్రీల ఫారన్‌హీటుకు చేరిన మండువేసవిలో మహా తీవ్రంగా వీచిన వడగాల్పులు! ఆ వెంటనే వచ్చిన వర్ష రుతువులో కుండపోత వానలు! ప్రకృతి బాధలకు మించిన సర్కారీ పీడ. ఊరు విడిచినా జనాన్ని వదలక కుళ్లుబోతు ప్రభుత్వం వెంటాడి కొత్త పన్నుల కొరడాతో బాదింది. అపరాధపు సుంకాలు మోదింది. వాటిని కట్టలేమంటే పాకలు ఖాళీచేసి పొమ్మంది. ఉద్యమ నాయకుడు దుగ్గిరాలపై తప్పుడు కేసుపెట్టి సంవత్సరం జైలుశిక్ష విధించింది. దిక్కుతోచని ప్రజలమీద గూండాలను ఉసికొలిపి, గుడిసెలు తగలబెట్టించి దారుణంగా వేధించింది. ఇలా అష్టకష్టాలు పడుతూ 1921 ఏప్రిల్ నుంచి 1922 ఫిబ్రవరి వరకూ పదకొండు నెలలు ధీరోదాత్తంగా పోరాడినా ఎవరూ ఆదుకోక, ఎటునుంచీ సహాయం అందక, శక్తులుడిగి, నిస్పృహచెంది చివరికి సామాన్లు సర్దుకుని పాత ఊరికే మళ్లీ తరలివెళ్లారు చీరాల-పేరాల ప్రజలు. ఉన్న ఒక్క నాయకుడూ చెరసాలపాలై జనం విలవిలలాడుతున్న సమయంలో రాష్ట్ర కాంగ్రెసు నాయకులుగాని, కాంగ్రెసు జాతీయ నాయకత్వం గాని, గాంధీ మహాత్ముడు కాని వారికి అండగా నిలబడి ఉంటే చరిత్రగతి ఇంకో విధంగా ఉండేది. తన సలహామీద ఊరు విడిచి చీరాలవాసులు నానా బాధల్లో అల్లాడుతుంటే కరుణామయుడు గాంధీ కనీసం ‘అయ్యో’ అనకపోగా- ‘‘చీరాల-పేరాల ప్రజలు అలా చేసి ఉండాల్సింది కాదు. స్వరాజ్యం వచ్చేవరకూ ఆగి ఉండాల్సింది’’ అని 1921 ఆగస్టు 25 తేదీ ‘యంగ్ ఇండియా’లో ఆక్షేపించడం కొసమెరుపు.
చరిత్రకెక్కిన పల్నాటి యుద్ధంలోనూ మహాత్ముల వారిది అదే తీరు. 1919 నుంచి వరసగా మూడేళ్లు తాండవించిన తీవ్ర దుర్భిక్షంలో తినడానికి తిండి లేక ఆకులు, అలాలు తిని పొట్టపోసుకున్న పలనాడు జనాన్ని, వారి పశువులను చుట్టుపట్ల అడవులు కొంతవరకు ఆదుకున్నాయి. అది కూడా సహించలేని బ్రిటిషు ప్రభుత్వం అడవుల్లో చాలా భాగాన్ని రిజర్వు ఫారెస్టుగా ప్రకటించి, వాటిలోకి పశువులను తోలుకోవటానికి పుల్లరి సుంకాన్ని విపరీతంగా పెంచింది. అది మోయలేని భారమని రైతులు ఎంతమొత్తుకున్నా సర్కారు దయతలచలేదు. పొట్టగడవక పస్తులుంటున్నాసరే రకరకాల పన్ను కడతారా చస్తారా అని గొంతుమీద కూచునేవారు. కట్టకపోతే ఇంట్లోని చెంబూ, తప్పాలా కూడా వదలకుండా గుంజుకుపోయేవారు. నోరెత్తితే తిట్టి, కొట్టి జైల్లోవేసేవారు.
ఇలా అడుగడుగునా అగచాట్లు పడుతూ సర్కారీ సతాయింపులకు విసిగి వేసారిన ప్రజలకు మహాత్ముడు పూరించిన సహాయ నిరాకరణ శంఖం వీనుల విందు చేసింది. 1921 ఆగస్టు 15, 16, 17 తేదీల్లో కారెంపూడిలో వేల మందితో జరిగిన పలనాడు రాజకీయ సదస్సు ప్రభుత్వాధికారుల సాంఘిక బహిష్కరణకు పిలుపు ఇచ్చింది. ఫలితంగా మాచర్లలోనూ చుట్టుపట్ల గ్రామాల్లోనూ సర్కారీ ఉద్యోగులకు క్షురకులు, రజకులు సేవచెయ్యలేదు. దుకాణాలవారు వెచ్చాలు ఇవ్వలేదు. ఊరంతా నౌకర్లను పరిగెత్తించినా కలెక్టరు దొరవారికి కప్పు కాఫీలోకి పాలు దొరకలేదు. కలెక్టరుకు, జిల్లా పోలీసు సూపర్నెంటుకు నిత్యావసర వస్తువుల సరఫరా జరగడం, బండ్లు దొరకడం అసాధ్యమైందని మద్రాసు గవర్నమెంటు చీఫ్ సెక్రటరీకి 1922 ఫిబ్రవరి 25 పంపిన రిపోర్టులో కలెక్టరు మొత్తుకున్నాడు. పల్లెల్లో జనం పుల్లరి కట్టడం పూర్తిగా మానేశారు. ‘పల్నాడులో చాలా గ్రామాలు స్వరాజ్యాన్ని ప్రకటించుకున్నాయని జిల్లా కలెక్టరే అంగీకరించారు. మహోద్ధృతంగా సాగుతున్న పుల్లరి సత్యాగ్రహాన్ని పరిశీలించడానికి రాష్ట్ర కాంగ్రెసు కమిటీ పనుపున పలనాడులో పర్యటించిన ఇద్దరు పెద్దలను బ్రిటిషు అక్రమంగా నిర్బంధించి, చెరి సంవత్సరం కారాగార శిక్ష నిర్బంధించింది. ఈ దుర్మార్గాన్ని ఖండిస్తూ గుంటూరు జిల్లా అంతటా కోర్టులు, స్కూళ్లు దుకాణాలు నిర్మానుష్యమయ్యాయి. గుంటూరు పట్టణంలో వరసగా ఆరు రోజులు పూర్తి హర్తాళ్ జరిగింది. ఆ సందర్భంలోనే గుంటూరులో డిప్యూటీ కలెక్టరుమీద దాడికి ఆయత్తమైన ఉద్రిక్త జనాన్ని అడ్డుకుని, రక్తం కారేలా రాళ్ల దెబ్బలుతిన్న కొండ వెంకటప్పయ్యగారిమీదే ఆయన కాపాడిన అధికారే దొమీ కేసుపెట్టి ఖైదులో వేయించాడు. దాంతో దేశమంతా అట్టుడికిపోయింది.
మరి అందరికీ గురువు, పోరాటానికి మూల స్ఫూర్తి అయిన గాంధీగారు ఈ పరిణామాలకు ఎలా స్పందించారు? అదీ వెంకటప్పయ్య మాటల్లోనే వినండి:
‘‘మహాత్ములు కార్యవర్గ సభలో కూర్చుండియుండగా నన్ను జయిలులో పెట్టిరనువార్త వినిరట. వెంటనే ఉత్సాహముతో ఇంచుక లేచి "I wish he were shot down'' అని పల్కెనట.’’
స్వీయ చరిత్ర, ‘కొండ వెంకటప్పయ్య, పే.245
తననే నమ్ముకున్న తన శిష్యుడు తాను బోథించిన పద్ధతిలో అహింసాత్మకంగా పోరాడి, జైలు వెళ్లాడంటే ఏ నాయకుడైనా బాధపడాలి. అతడి వెనుక నిలిచిన కార్యకర్తలకు ధైర్యంచెప్పి ప్రభుత్వ దమనకాండను నిశితంగా ఖండించాలి. అదేదీ చేయకపోగా ‘‘అతణ్ని కాల్చేసి ఉంటే ఇంకా బాగుండేది’’ అని మహాత్ముడు ముచ్చటపడటం విడ్డూరం. అరెస్టయిన అనుచరుడిని ‘‘నువ్వు కాల్చబడి ఉండాల్సింది’’ అని దీవించిన బాపూజీ అదే పుల్లరి సత్యాగ్రహంలో మించాలపాడు మీద విరుచుకుపడి, నానా ఆగం చేసిన ప్రభుత్వాధికారులను ధైర్యంగా ఎదిరించి, పోలీసు కాల్పుల్లో నేలకొరిగిన పల్నాడు నాయకుడు కనె్నగంటి హనుమంతు ఆత్మార్పణనైతే బొత్తిగా పట్టించుకోలేదు. అంతటి మహానేతకు ఓ మారుమూల తెలుగుపల్లెలో తూటాలకు నేలకొరిగిన ప్రజల మనిషి పేరు తెలిసి ఉండకపోతే విస్తుపోనక్కర్లేదు. కాని పుల్లరి సత్యాగ్రహం గురించీ హనుమంతు ఆత్మబలిదానం గురించీ ప్రత్యేక విచారణ జరిపించి మరీ తెలుసుకున్న ఆంధ్ర కాంగ్రెసువారు అమరవీరుడికి ఎటువంటి నివాళి అర్పించారు?
కనె్నగంటి హనుమంతు సమాధివద్ద వేసిన స్మారక శిలా శాసనాన్ని సర్కారీ భటులు ముక్కలుచేసి తుప్పల్లో వేశారు. ఆ దుశ్చర్యను ఆంధ్ర కాంగ్రెసు యధావిథిగా ఖండించి, కొత్త ఫలకాన్ని తిరిగి వేయించాలనీ, దాన్నీ అధికారులు అడ్డుకుంటే సత్యాగ్రహం చేసైనా ప్రజాహక్కులు కాపాడుకోవాలనీ 1923 డిసెంబరు 16న కాకినాడలో చక్కని తీర్మానమైతే చేశారు. దాన్ని అమలుచేయటం మాత్రం ఎంచక్కా మరిచిపోయారు. విదేశీ దొరతనపు కర్కశపాలనపై సంఘటితంగా, దృఢంగా పోరాడటం కాంగ్రెసు వారికి ఎలాగూ చేతకాదు. పలనాడు వాసులు తమంతతాము పోరుకు దిగిన తరవాతైనా కలిసివచ్చి తమవంతు సహాయం చేయటం వారి కనీస బాధ్యత. అలా చేయకపోగా, మహాత్ముడినుంచి అనుమతిరాలేదు; మానండి-మానండి అని వారించి, ఉద్యమాన్ని నీరుగార్చటానికి కాంగ్రెసు నాయకులు చాలా శ్రమపడ్డారు. బార్డోలీ ప్రహసనం దరిమిలా దేశమంతటా సహాయ నిరాకరణోద్యమాన్ని ఆపివేయమని మహాత్ముడు శాసించడంతో పుల్లరి సత్యాగ్రహం అర్ధాంతరంగా బలవన్మరణం చెందింది. *