ఆంధ్రుల కథ - 15

ఎం.వి.ఆర్ శాస్త్రి గారు ఆంధ్ర భూమి ఆదివారం అనుబంధం లో సీరియల్ గా ప్రచురిస్తున్న ఆంధ్రుల కథ యదాతథం గా..

ఎగిరిపోయిన యూనివర్సిటీ ....(August 1st, 2010)

విమానాల హైజాకింగు విన్నాం, రైళ్లను, బస్సుల్ని బలవంతంగా దారి మళ్లించుకుపోయిన ఉదంతాలూ మనకు తెలుసు. కాని ఏకంగా ఒక యూనివర్సిటీకి యూనివర్సిటీనే ఎత్తుకుపోవడం సాధ్యమేనా? అదీ ఒకచోట పెట్టాలని అనుకున్నదాన్ని అక్కడ పెట్టేలోపే మాయచేసో గోలచేసో వేరేచోటికి తరలించడం కాదు! ఫలానాచోటే పెట్టాలని ఆధికారికంగా నిర్ణయమయ్యాక... ఆ ప్రకారం చట్టం వచ్చి, అక్కడే యూనివర్సిటీ పనిచేయటం కూడా మొదలయ్యాక వేరేచోటికి హైజాక్ అవుతుందని కలనైనా ఊహించగలమా?
లేము. కాని అసంభవమనుకునేదే సంభవమైంది. అదీ డెబ్భై ఏళ్ల కిందటే! అది కూడా మన ఆంధ్రదేశంలోనే!
హైజాక్ అయింది ఆంధ్రా యూనివర్శిటీ. నమ్మశక్యంకాని రీతిలో దాన్ని బెజవాడనుంచి వైజాగ్‌కి ఎత్తుకుపోయిన ఘనుడు సి.ఆర్.రెడ్డి అనబడే కట్టమంచి రామలింగారెడ్డి.
ఆంధ్రులకో ప్రత్యేక విశ్వవిద్యాలయం కావాలన్న డిమాండు ప్రత్యేక రాష్ట్రం డిమాండు కంటే పాతది. ‘‘మాతృభాషలనుబట్టి యొక్కొక విశ్వవిద్యాలయము స్థాపించుట అత్యవశ్యమని...’’ ఆంధ్రులలో విద్యను వ్యాపింపచేయుటకు ఆంధ్ర విశ్వవిద్యాలయ నిర్మాణం’ జరగాలని 1913లో బాపట్ల ప్రథమాంధ్ర మహాసభ అధ్యక్షోపన్యాసంలో బి.ఎన్.శర్మ నొక్కి చెప్పారు. ‘‘తెలుగు జిల్లాలలో విద్య చక్కగా వ్యాపించుటకై ఆ జిల్లాలలో తగినచోట విశ్వవిద్యాలయమొకటి స్థాపించుటకు దొరతనము వారిని ప్రార్థిస్తూ’’ 1915లో విశాఖపట్నం తృతీయాంధ్ర మహాసభ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఆ మహాసభకు అధ్యక్షత వహించిన పానగల్ రాజా రామారాయణంగారు కాలం కలిసివచ్చి జస్టిస్ పార్టీ తరఫున మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. ఈ విషయంలో ఆయన విశేషించి చొరవ చూపి 1926లో ఆంధ్ర విశ్వవిద్యాలయం బిల్లును 1926లో తెచ్చి పట్టుబట్టి చట్టం చేయించారు. దాంతో సమస్య తీరిందా? లేదు. అసలు సమస్య అప్పుడే మొదలైంది.
ఆంధ్రులు కోరుకున్నది కేవలం యూనివర్శిటీనే కాదు. అరవలతో పొత్తులేకుండా తమకంటూ విశ్వవిద్యాలయం వస్తే తెలుగులో ఉన్నత విద్యాబోధన జరుగుతుందన్నదే వారి ఆశ, ఆకాంక్ష. ఆంధ్ర మహాసభ ప్రతి వార్షిక సమావేశంలోనూ, ఆంధ్రోద్యమం ప్రస్తావనకు వచ్చిన ప్రతి వేదిక మీదా ఈ సంగతి పెద్దలు నొక్కి చెప్పేవారు. చట్టం చేయడానికి ముందు దీనికి సంబంధించి పానగల్ ప్రభుత్వం నియమించిన ఉన్నతస్థాయి కమిటీ కూడా "It has long been the desire of the Andhra districts to give greater opportunities for the expansion of education through the medium of their own vernacular''. (తమ మాతృభాష మాధ్యమంగా విద్యావ్యాప్తికి ఇతోధిక అవకాశాలు కల్పించాలన్నది ఆంధ్ర జిల్లాల చిరకాల వాంఛ) అని స్పష్టీకరించింది.
ఏం లాభం? 1926లో ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని అనుమతిస్తూ చట్టమైతే వచ్చింది. కాని బోధన భాష ఏదన్నది ఎంచుకునే బాధ్యతను ‘ఎకడమిక్ కౌన్సిల్’కు వదిలేసింది. ఒక శుభోదయాన సదరు ఎకడమిక్ కౌన్సిల్ కొలువుతీరింది. కొంతమంది మెంబర్లు తెలుగులోనే చదువులన్నారు. ఇంకొంతమంది ఇంగ్లీషులోనే జరగాలన్నారు. తలలు కలవలేదు. ఓటింగు పెట్టారు. అయినా తేలలేదు. రెండు పక్షాలకీ చెరిసమానంగా ఓట్లు పడ్డాయి. మరి ఏమిటి దారి? అధ్యక్ష స్థానంలోని వైస్ ఛాన్సలర్‌గారు కాస్టింగ్ ఓటు వెయ్యాలి. ఆయన ఎటు మొగ్గితే ఆ వాదానికే విజయం.
అప్పుడు పెద్ద కుర్చీలో కూచున్న పెద్దమనిషెవరు? శ్రీమాన్ కట్టమంచి రామలింగారెడ్డిగారు. ఆయన అచ్చమైన ఆంధ్ర భాషాభిమాని. తెలుగులో ప్రసిద్ధ కావ్యాలు రాసిన సాహితీమూర్తి. ఇంకేం కావాలి? ఆయన గ్యారంటీగా ఆంధ్ర భాష వైపే మొగ్గుతాడు కదా- అనుకుంటున్నారా? పప్పులో కాలేశారు. ది గ్రేట్ సి.ఆర్.రెడ్డిగారు తెలుగు వద్దేవద్దు- ఇంగ్లిషే ముద్దు అని ప్రశస్తమైన కాస్టింగు వోటువేసి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఆంధ్ర భాషను బోధనమాధ్యమం కానీయకుండా గెంటేశారు. స్వభాషలో ఉన్నత విద్యలు నేర్వాలన్న ఆంధ్రుల తహతహ మీద చన్నీళ్లు కుమ్మరించారు. దీనికి ఒళ్లు మండే ‘ఆంధ్రరత్న’ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ప్రసిద్ధచాటువులో ఇలా వాపోయాడు:
సీ. రామలింగారెడ్డి సీమరాజుల షరీక్
చేరి నన్ బొందంగ గోరుచుండె
గంధి కోమటి నన్ను హిందిచే నెట్టించి
బందిలో బెట్టింప బంపుచుండె
....... ........ ........ .......
తే.గీ. అకట! దిక్కెవ్వరింక నాకవనియందు
అనుచు నేడ్చుచునున్నది యాంధ్రవాణి
నీదు కోడలి మానంబు నిలుపవయ్య
రామనగరీ నరేంద్ర శ్రీరామచంద్ర.
సి.ఆర్.రెడ్డిగారు పుణ్యం కట్టుకున్నది బోధన భాష కానీయకుండా తెలుగునోట మన్నుకొట్టటం ఒకటే కాదు. ఆయన లీల ఇంకా చాలా ఉంది.
1926 జనవరి 13న గవర్నర్ జనరలువారి ఆమోదముద్రపడి అమల్లోకి వచ్చిన ఆంధ్రా యూనివర్సిటీ యాక్టు పీఠికలోనే ఆంధ్ర జిల్లాలన్నీ యూనివర్సిటీ పరిధిలోకి వస్తాయని, యూనివర్సిటీ హెడ్ క్వార్టర్సు బెజవాడ అనీ స్పష్టంగా పేర్కొన్నారు. మద్రాసు ప్రెసిడెన్సీలో యూనివర్శిటీ పరిధిలోకి వచ్చే తెలుగు జిల్లాలేవన్న అనుమానం లేకుండా ""the present districts of Ganjam, Vizagapatam, West Govavari, East Godavari, Kistna, Guntur, Bellary, Anantapur, Cuddapah, Kurnool, Chittoor or Nellore'' (గంజాం, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణ, గుంటూరు, బళ్లారి, అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు) అని వివరించారు.
అదీ ఉత్తదే అయింది. యూనివర్సిటీ పరిధి నుంచి... యూనివర్శిటీ కాలేజీలు ఎక్కడ ఉండాలన్నది మొదలుకుని... హెడ్ క్వార్టర్సు ఏదన్నవరకూ ప్రతిదీ పెద్ద వివాదం అయింది.
చట్టంలో తొలుత నిర్దేశించిన ప్రకారం- తెలుగు మాట్లాడే 12 జిల్లాలకు యూనివర్సిటీ చట్టం వర్తిస్తుంది. వైజాగ్, రాజమండ్రి, అనంతపురాల్లో యూనివర్సిటీ సెంటర్లుంటాయి. కాలేజీలన్నీ ఆ మూడు కేంద్రాల్లోనే నెలకొల్పాలి. హెడ్ క్వార్టర్సు మాత్రం బెజవాడలో ఉంటుంది. ఆ ప్రకారమే యూనివర్సిటీ సెంటర్లు ఏర్పాటయ్యాయి. బెజవాడ కేంద్రంగా యూనివర్సిటీ మందీ మార్బలంతో పని కూడా మొదలెట్టింది.
అంతా సవ్యంగా సాగిందని ఆంధ్ర భాషాభిమానులు ఆనందిస్తూండగా తెర వెనక కథ నడిచింది. సి.ఆర్.రెడ్డికి బెజవాడలో పనిచేయటం మొదటినుంచీ ఇష్టంలేదు. ‘బ్లేజ్‌వాడ’అని తాను పేరుపెట్టిన ఎండలు మండే బెజవాడ నుంచి తనకు ఇష్టమైన చల్లటి వాల్తేరుకు యూనివర్సిటీని ఎలా తరలించాలా అని ఆయన పట్టుబట్టి పథకాలు వేశారు. కాంగ్రెసు ప్రముఖుడిగా మద్రాసు రాజకీయ వర్గాల్లో తనకున్న పలుకుబడిని తెలివిగా వాడుకుని, అధికార స్థానాల్లోని వారికి నూరిపోసి, ఎలాగైతేనేం తన చేతికి మట్టి అంటకుండా అనుకున్నది సాధించారు. ఆయన దౌత్య ప్రజ్ఞమూలంగా రహస్యంగా పావులు కదిలాయి. మూడేళ్లు తిరక్కుండా పెనుమార్పులు జరిగాయి. మూడుచోట్ల మూడు యూనివర్సిటీ సెంటర్లు అనుకున్నది కాస్తా చివరికి ఒకే ఒక్క సెంటరు (వైజాగ్) అయింది. బెజవాడ హెడ్ క్వార్టర్సులో పరిపాలన భవనాలే తప్ప కాలేజిలు లేకపోవటమేమిటని ఆక్షేపణ వచ్చినందున రాజమండ్రి సెంటరును తీసేసి బెజవాడ హెడ్ క్వార్టర్సులో పెడతారని అందరూ ఊహిస్తే అసలు హెడ్ క్వార్టర్సుకే మోసం వచ్చింది. బెజవాడ నుంచి తీసి అనంతపురంలో హెడ్ క్వార్టర్సును పెడతారని రాయలసీమ వాసులు ఆశపడితే... యూనివర్సిటీ కార్యస్థానంకోసం రాజమండ్రి, అనంతపురం పోటీపడితే... పిట్టలపోరు పిల్లి తీర్చినట్టు సి.ఆర్.రెడ్డి తాను కోరుకున్న వైజాగ్‌కి కాలేజీలతో సహా హెడ్ క్వార్టర్సునూ ఎగరేసుకుపోయాడు.
దాంతో రాయలసీమ వారికి మనసు విరిగి అక్కడ ఐదు జిల్లాలు మద్రాసు యూనివర్సిటీ కిందే ఉంటామనటంతో 12 జిల్లాల పరిధి అనుకున్నది కాస్తా 7 జిల్లాలకు కుదించుకుపోయింది. ఆంధ్రోద్యమానికి విజయంగా భావించిన ఆంధ్ర యూనివర్సిటీ కాస్తా ఆంధ్రుల అనైక్యతకు, ప్రతిరూపంగా అభాసుపాలైంది. అది ఎలా జరిగిందన్నది అప్పటి వ్యవహారాల్లో ప్రత్యక్ష ప్రమేయం ఉన్న అయ్యదేవర కాళేశ్వరరావుగారు చెబుతారు. వినండి.
‘‘ఆంధ్ర భాషలో సమస్త ఉత్తమ విద్యనిచ్చుటకు గాను ప్రత్యేకాంధ్ర విశ్వవిద్యాలయమేర్పడవలెనని ఆంధ్రులు వాంఛించుచు తీర్మానములు చేసియున్నారు... 1925లో మద్రాసు శాసనసభ చేసిన ఆంధ్ర విశ్వవిద్యాలయ చట్టప్రకారమే విశాఖపట్టణము, రాజమహేంద్రవరము, అనంతపురములలో విశ్వవిద్యాలయ కేంద్రములు నెలకొల్పబడెను. ఈ మూడు కేంద్రములలోను ఆనర్సు, ఎం.ఎస్.సి., రిసెర్చి, డాక్టరేటు మొదలగునవి నేర్పబడును. మామూలు బి.ఎ., బి.ఎస్.సి., బి.కాం. తరగతులు కూడా అక్కడే యుండవలెను. మరి ఎచ్చటను ఉండరాదు. ... ... శాసనసభలో ఈ చర్చలు జరుగుచుండగా మేము... మద్రాసు వెళ్ళి నాలుగవ కేంద్రమునైనను బెజవాడకి రప్పించవలెనని... అభ్యర్థించితిమి... అధికారములోనున్న జస్టిసు పార్టీవారు ఒప్పుకొనలేదు. కాని జస్టిసు పార్టీ నాయకులైన రాజారామరాయణంగారు... స్వయముగ బెజవాడలోనే ఆంధ్ర విశ్వవిద్యాలయమును కార్యస్థానమును నెలకొల్పునటుల సవరణ పెట్టి మంజూరు చేయించిరి... కట్టమంచి రామలింగారెడ్డిగారు ప్రథమ ఉపాధ్యక్షుడుగ విశ్వవిద్యాలయము బెజవాడలో స్థాపించబడినది... మూడు సంవత్సరములు విశ్వవిద్యాలయము బెజవాడలోనుండెను.
‘‘... 1926 నవంబరు నెలలో మరల శాసనసభ ఎన్నికలు జరిగినపుడు జస్టిసు పార్టీవారు ఓడిపోయిరి... డాక్టరు సుబ్బరాయనుగారిని ముఖ్యమంత్రి కావించిరి. ... నేను 1927లో బెజవాడను ఆంధ్ర విశ్వవిద్యాలయమునకు నాలుగవ కేంద్రముగ గావించవలెనని యొక సవరణ బిల్లుకు నోటీసునిచ్చితిని... డాక్టరు సుబ్బరాయనుగారిని నా బిల్లుకు మద్దతునిచ్చి మంజూరు చేయించవలెనని కోరితిని. ఆ బిల్లును నేను శాసనసభకు పంపకముందే ఉపాధ్యక్షులైన కట్టమంచి రామలింగారెడ్డిగారికి చూపించి వారి అంగీకారమును పొందియే యుంటిని. కాని నాతో సుబ్బరాయనుగారు ‘ఇప్పుడే ఒక పావుగంటకు ముందే రామలింగారెడ్డిగారు నాతో వచ్చి మాట్లాడిపోయినారు. బెజవాడలో నాలుగవ కేంద్రమునకు వారు ఇష్టపడుటలేదు. ఒక్కటే కేంద్రముండవలెనని, అది విశాఖపట్టణములోనే యుండవలెనని వారి అభిప్రాయమయ వున్నది. కనుక మీ బిల్లుకు నేనేమీ సహాయము చేయజాలనని వారు నాతో చెప్పిరి. అనధికార బిల్లు నెగ్గుటకు సావకాశము లేదని తలచి నేనా బిల్లునుపసంహరించుకొంటిని. రామలింగారెడ్డిగారికి నన్నాయన దగా చేసినట్టు వ్రాసితిని...
‘‘అటు పిమ్మట మరల 1928లో విశ్వవిద్యాలయపు మీమాంస బయలుదేరినది. ఆంధ్ర విశ్వవిద్యాలయపు కేంద్రములేని వట్టి కార్యస్థానమైన బెజవాడలో పనిచేయుటకు రామలింగారెడ్డిగారికిష్టములేదు. బెజవాడలో సెనేటు మందిరము, ఉపాధ్యక్షులకు, రిజిస్ట్రారుకు, ఆఫీసులకు సరియైన భవనములు వెంటనే కట్టవలసి యున్నది... కేంద్రములెన్ని యుండవలెననునది మరియొక సమస్య. ఈ విషయములో విశ్వవిద్యాలయపు సిండికేటు యొక్క అభిప్రాయమును కోరగ... బెజవాడలో నాలుగవ కేంద్రము స్థాపించవలెనను తీర్మానము సిండికేటులో నేకగ్రీవముగ నంగీకరించబడెను. దీనిని రామలింగారెడ్డిగారు కూడనంగీకరించి ఈ తీర్మానమును మద్రాసు ప్రభుత్వమునకు పంపిరి. కాని విద్యాశాఖ కార్యదర్శి దీనిని వ్యతిరేకించిరి. నాలుగవ కేంద్రము పెట్టుటకు ఖర్చు చాల ఎక్కువగుననియు, రాజమహేంద్రవరపు కేంద్రమును తీసి బెజవాడలో పెట్టిన ఎడల తమకభ్యంతరము లేదనియు, అటుల వీలుకానిచో బెజవాడలోని కార్యస్థానమును తీసుకొనిపోయి రాజమహేంద్రవరములోనే పెట్టుట యుక్తమనియు గట్టిగా వ్రాసిరి. గనుక బెజవాడకును, రాజమహేంద్రవరమునకు పోటీ, ఘర్షణలు కలిగెను.
‘‘ఇది రామలింగారెడ్డిగారికి యిష్టము లేని మాట వాస్తవమే. కాని గవర్నమెంటు నుంచి వచ్చిన తాకీదు కనుక దీనిని ఆంధ్ర విశ్వవిద్యాలయము సెనెటుముందు పెట్టవలసి వచ్చినది. రాజమహేంద్రవరమునుంచి న్యాపతి సుబ్బారావుగారు, మద్దూరి అన్నపూర్ణయ్యగారు బయలుదేరి రాయలసీమకుపోయి రాయలసీమలోనున్న సెనెటు సభ్యులను కూడగట్టుకొని, అనంతపురమునకు విశ్వవిద్యాలయపు కార్యస్థానమునిచ్చునట్లు వాగ్దత్తముచేసి, సెనెటు సభలో అధిక సంఖ్యాకులచేత రెండు కేంద్రములు మాత్రమే ఉండవలెననియు, అందులో నొకటి ఉత్తర సర్కారులలోని రాజమహేంద్రవరములోను, రెండవ కేంద్రము అనంతపురములోను ఉండవలెననియు, విశ్వవిద్యాలయపు కార్యస్థానము అనంతపురములో నెలకొల్పవలెననియు తీర్మానము చేయించిరి. మేము ఎంత ప్రయత్నము చేసినను ఓడిపోతిమి. ఈ తీర్మానము మద్రాసు ప్రభుత్వమునకు పంపబడెను. మద్రాసు విద్యాధికారులు దీనినంగీకరించక విశాఖపట్టణము, రాజమహేంద్రవరము, అనంతపురము ఈ మూడు కేంద్రములు మాత్రమే యుండవలెననియు, ఆంధ్ర విశ్వవిద్యాలయపు కార్యస్థానమును రాజమహేంద్రవరమునకు మార్చుట తమకిష్టమే గాని, విద్యా విషయములో వెనుకబడియున్న అనంతపురమునకు మార్చుటకు తాము సమ్మతించజాలమనియు తెలియపర్చిరి.
‘‘అందుమీద వివిధ రకములైన సవరణ బిల్లులు శాసనసభలో ప్రవేశపెట్టబడెను. అన్ని బిల్లులను పరిశీలించి రిపోర్టు వ్రాయుటకొక పెద్ద సెలక్టు కమిటీని శాసనసభవారు నియమించిరి. దానిలో మేమందరము ఉంటిమి... చివరకు సెలక్టు కమిటీ వారమందరము ఏకగ్రీవముగ యొక కేంద్రముండవలెనని, అది అనంతపురములోనే యుండవలెననియు, అక్కడనే విశ్వవిద్యాలయపు కార్యస్థానముండవలెననియు తీర్మానించి రిపోర్టు పంపితిమి.
‘‘మద్రాసు ప్రభుత్వము దీనికి అంగీకరించలేదు. అనంతపురము బదులుగ ఆ కేంద్రము, కార్యస్థానము రాజమహేంద్రవరములో నుండవలెనని ఒక సవరణను ప్రభుత్వమువారే శాసనసభ యెదుట పెట్టిరి. గవర్నమెంటు పెట్టిన సవరణ గెలుచుట నిశ్చయమని నేను భయపడి... వాయిదా ప్రయత్నము చేసితిని... సుబ్బరాయనుగారు వాయిదా వేయించుటకు ఒప్పుకొనిరి... కాని కొన్ని నెలలలోనే బెజవాడ దురదృష్టవశమున పానుగల్లు రాజారామారాయణంగారు స్వర్గస్థులైనారు. ఆయన జీవించియున్నన్నాళ్లు బెజవాడలోనే ఆంధ్ర విశ్వవిద్యాలయ స్థాపన జరుగవలెనని చాల పట్టుదలగ నుండిరి. పిమ్మట రాజమహేంద్రవరమను పదమును తీసివేసి విశాఖపట్టణమను పదమును చేర్చి సుబ్బరాయన్ ప్రభుత్వమువారు సెలక్టు కమిటీ రిపోర్టు యొక్క విచారణను శాసనసభ ఎదుటికి తెచ్చిరి. అనగ ఒకే కేంద్రము, కార్యస్థానము రెండును విశాఖపట్టణములో యుండవలెనని ఆ సవరణ యుద్దేశ్యము. దానికి వ్యతిరేకముగా విశాఖపట్టణము అనుటకు మారుగ బెజవాడ అని పెట్టవలెనని సవరణను ఇచ్చినాము... కాని ప్రభుత్వమువారే విజయమునొందిరి. యావత్తు ఆంధ్ర విశ్వవిద్యాలయము వాల్తేరులోనే (విశాఖపట్టణములోనే) స్థాపించబడవలెనని అధిక సంఖ్యాకులచే మంజూరు చేయబడెను. ఆ వెంటనే బొల్లిన మునిస్వామినాయుడు, రంగనాథ మొదల్యారుగారు మొదలైనవారు కలిసి రాయలసీమ జిల్లాలన్నిటిని ఆంధ్ర విశ్వవిద్యాలయమునుండి వేరుచేయవలెనని, బెజవాడనుండి కూడ చాల ఉత్తరమునకు తీసుకొని పోవుచున్నారు కనుక, వాల్తేరులోని విశ్వవిద్యాలయములో తమ జిల్లాలుండజాలవనియు నొక సవరణను ప్రతిపాదించిరి. ఈ సవరణకు డాక్టరు సుబ్బరాయనుగారు అంగీకరించిరి. ఆంధ్ర విశ్వవిద్యాలయము రెండు భాగముగ విభజింపబడుట శోచనీయమనియు, కార్యస్థానము ఎక్కడున్నను అన్ని ఆంధ్ర జిల్లాలు ఆంధ్ర విశ్వవిద్యాలయము క్రిందనే యుండవలెననియు, రాయలసీమ జిల్లాలు విడిపోయి మద్రాసు విశ్వవిద్యాలయములోనే యుండుట శోచనీయమని నేను గట్టిగ వాదించితిని. నా వాదన అరణ్యరోదనయ్యెను.
నా జీవిత కథ- నవ్యాంధ్రము, అయ్యదేవర కాళేశ్వరరావు, పే.270-275.