ఆంధ్రుల కథ - 16

ఎం.వి.ఆర్ శాస్త్రి గారు ఆంధ్ర భూమి ఆదివారం అనుబంధం లో సీరియల్ గా ప్రచురిస్తున్న ఆంధ్రుల కథ యదాతథం గా..

దగాపడ్డ సీమ ... (August 8th, 2010)

రామలింగారెడ్డికి బెజవాడ ఇష్టం లేకపోవచ్చు. ఆంధ్రా యూనివర్సిటీని వాల్తేరుకు పట్టుకుపోవాలన్న కోరిక ఆయనకు బలంగానూ ఉండవచ్చు. అంతమాత్రాన యూనివర్సిటీ వాల్తేరుకు తరలడం ఆయనవల్లే జరిగిందని ఎలా చెప్పగలం? కేవలం ఒక వైస్ చాన్సలరు అంతపని చేయగలడా? చట్టాల జారీలూ, వాటికి సవరణలూ, వెనుకటి నిర్ణయాలను తిరగదోడటాలూ, ఏకపక్ష నిర్ణయాలూ అన్నీ మద్రాసు ప్రభుత్వ స్థాయిలో జరిగినప్పుడు వాటికి సి.ఆర్.రెడ్డి బాధ్యుడు ఎలా అవుతాడు?
సందేహం సబబే. కాని రామలింగారెడ్డి కేవలం వైస్ చాన్సలరే కాదు. 1925లో ఆంధ్రా యూనివర్సిటీ చట్టంచేసిన సమయంలో ఆయన మద్రాసు శాసనసభలో కాంగ్రెసు సభ్యుడు కూడా. గుత్తి కేశవపిళ్లె, చింతలపాటి నరసింహరాజులతోబాటు ఆయనా కాంగ్రెసు శాసనసభాపక్షంలో ముఖ్య నాయకుడు. ఆ చట్టానికి సంబంధించి శాసనసభలో చర్చలు జరుగుతున్న సమయంలో బెజవాడలో యూనివర్సిటీ సెంటరుకోసం ప్రయత్నం చేయటానికి అయ్యదేవర నాయకత్వంలో మద్రాసు వెళ్లిన ప్రతినిధి వర్గం కలుసుకున్న ప్రముఖుల్లో రామలింగారెడ్డి కూడా ఉన్నాడు.
1926 ఏప్రిల్ 26న బెజవాడలో రెడ్డిగారు కులపతిగా యూనివర్సిటీ ప్రారంభమయ్యాక మద్రాసులో రాజకీయ బలాబలాలు మారాయి. ఆ సంవత్సరం నవంబరు ఎన్నికల్లో జస్టిస్ పార్టీ ఓడిపోయింది. 46 మంది సభ్యులతో పెద్ద పార్టీ అయిన కాంగ్రెసు అప్పటి జాతీయ విధానం ప్రకారం మంత్రివర్గంలో చేరడానికి నిరాకరించింది. దాంతో మూడవ పార్టీ నాయకుడైన సుబ్బరాయను ముఖ్యమంత్రి అయ్యాడు. తన పార్టీకి సొంతంగా బలం లేదు కనుక అధికారం నిలబెట్టుకోవడానికి ఆయన కాంగ్రెసువారి ప్రసన్నత మీద ఆధారపడక తప్పలేదు. ప్రభుత్వం మీద అటువంటి పట్టు కాంగ్రెసుకున్నప్పుడు కాంగ్రెసు ప్రముఖుడైన మహామేధావి సి.ఆర్.రెడ్డికి తనకు అనుకూలంగా ప్రభుత్వ నిర్ణయాలను ప్రభావితం చేయగల సావకాశం చాలా ఉంది.
కాళేశ్వరరావు తనను కలసినప్పుడు ‘‘ఇంతకుముందే రామలింగారెడ్డిగారు నాతో వచ్చి మాట్లాడిపోయినారు. బెజవాడలో నాలుగవ కేంద్రమునకు వారు ఇష్టపడుటలేదు. ఒక్కటే కేంద్రము అదీ విశాఖపట్టణములోనే ఉండాలని వారి అభిప్రాయమయి ఉన్నది కనుక మీ బిల్లుకు నేనేమీ సహాయము చేయజాలనని’’ సుబ్బరాయనే స్వయంగా చెప్పాడు. దీన్నిబట్టి ఆనాటి రాజకీయ పరిస్థితుల్లో తన మాటను కాదని ముఖ్యమంత్రి కూడా స్వతంత్ర నిర్ణయానికి సాహసించజాలనంతటి రాజకీయ పట్టు ప్రభుత్వం మీద రామలింగారెడ్డికి ఉండేదని స్పష్టం. మొదటి చట్టం చట్టుబండలై, సిండికేటు మాటకూ విలువలేక, సెనెటు ఓటుకూ దిక్కులేక, ఎవరూ ఊహించని నిర్ణయాలు మద్రాసు ప్రభుత్వపరంగా చకచకా జరిగిపోవటం వెనక కొట్టొచ్చినట్టు కనిపించేది కట్టమంచి తంత్రమే.
తాను చిరకాలం అలవాటుపడిన కేంబ్రిడ్జి, బెంగుళూరుల చల్లదనానికి పూర్తి విరుద్ధంగా ఎండలుమండే ‘‘బ్లేజ్‌వాడ’’ తాపానికి తట్టుకోవటం రెడ్డిగారికి దుస్సహమే అయి ఉండొచ్చు. ‘ఇంటలెక్చువల్ సహారా’ (మేధాపరంగా ఎడారి) అని 1924లో తాను ఈసడించిన బెజవాడ మీద ఆయనకు ఏవగింపూ ఉండొచ్చు. కాని అక్కడే యూనివర్సిటీ కార్యస్థానం ఉండాలని చట్టపరంగా నిర్ణయం జరిగాక వైస్ చాన్సలర్ పదవిని అంత ఇష్టంలేకపోతే రామలింగారెడ్డి ఒప్పుకోవలసింది కాదు. ఆయనే ఉండి తీరాలని ఎవరూ బలవంతం చెయ్యలేదు. బాధ్యత స్వీకరించాక, తన వ్యక్తిగత ఇష్టానిష్టాలను, పక్కనపెట్టి యూనివర్సిటీని సజావుగా పనిచేయించటం సి.ఆర్.రెడ్డి కనీస విధి. ఆయన మాత్రం యూనివర్సిటీని ఎలా దారిన పెట్టాలా అనికాక ఎప్పుడెప్పుడు దాన్ని తనకు ప్రియమైన వాల్తేరుకు లేవదీసుకుపోవాలా అనే తంటాలుపడ్డాడు. కొత్త యూనివర్సిటీకి అవసరమైన భవనాలు, కార్యాలయాలు కట్టించటానికి చేతిలో కావలసినన్ని నిధులున్నా పనులు చకచకా జరిపించక, సాధ్యమైనంత తాత్సారం చేశాడు. రాజకీయ మంత్రాంగం నెరపి, నాయకులను కూడగట్టి, హెడ్ క్వార్టర్సును విశాఖకు ఎలా మార్పించాలా అన్నదాని మీదే శక్తియుక్తులు కేంద్రీకరించాడు.
రెడ్డిగారి తరహాకు చిన్న ఉదాహరణ. ఆ సమయాన నాగపూర్‌లో స్థిరపడిన డి.లక్ష్మీనారాయణ అనే తెలుగు వదాన్యుడు బెజవాడలో ఆంధ్రా యూనివర్సిటీ వచ్చిందని తెలుసుకుని సంతోషించి, తన ఆస్తులు కొన్నిటిని దానికి విరాళంగా ఇవ్వాలన్న సంకల్పంతో తనంతటతాను విజయవాడ వచ్చాడు. మూడురోజులు అక్కడ మకాంచేసి భూరి విరాళం ఇస్తాను మొర్రో అన్నా యూనివర్సిటీ నుంచి స్పందన లేదు. వేచి చూసి చూసి విసిగివేసారి ఆ దాత తిరిగి వెళ్లిపోయి అప్పట్లోనే ముప్ఫై నలభై లక్షల కిమ్మతు చేసే ఎస్టేటును నాగపూర్ యూనివర్సిటీకి రాసిచ్చాడని History of Andhra Movement, Vol.I,లో జి.వి.సుబ్బారావు తెలిపారు. బెజవాడలో ఆస్తుల బాదరబందీ పెట్టుకుంటే యూనివర్సిటీని వాల్తేరుకు మార్పించటం కష్టం కావచ్చని కట్టమంచివారు భావించి ఉండవచ్చు.
పైన పేర్కొన్న సుబ్బారావు గ్రంథంలోదే ఇంకో ముచ్చట. బెజవాడ కార్యస్థానంగా ఉండగా ఆంధ్రా యూనివర్సిటీ మొదటి (అదే చివరిది కూడా) స్నాతకోత్సవం 1929లో జరిగింది. విఖ్యాత శాస్తజ్ఞ్రుడు, నోబెల్ బహుమతి గ్రహీత డాక్టర్ సి.వి.రామన్ ముఖ్య అతిథి. పట్ట్భద్రులనుద్దేశించి ఆయన ప్రసంగించవలసి ఉంది. అప్పుడు-
C.R.Reddy had a word with Dr.Raman, just before the Convocation. And during the Convocation, Raman's performance, had very little to do with the graduates and their future, but the whole thing was a plea in favour of a transfer of the University H.Q. from Bezwada to Waltair, which incidentally, he revealed, was his own birth-place! It didnot even strike the distinguished Doctor perhaps that he was not only insulting the place where he was delivering his address, and working against the intentions of the main architects of the Act and University, of which he was an Honorary Professor himself, but even helping to disrupt the very unity of the Andhra People which the University was intended to promote and serve. Under the circumstances, the Upadesam of the Vice-Chancellor could be easily imagined.
[History of Andhra Movement, G.V.Subba Rao,
Vol.I, P.504-505]
(సి.ఆర్.రెడ్డి స్నాతకోత్సవానికి కొథ్దిసేపటి ముందు డాక్టర్ సి.వి.రామన్‌తో మంతనాలాడాడు. ఇక స్నాతకోత్సవంలో రామన్‌గారు పట్ట్భద్రులు, వారి భవిష్యత్తు గురించి ఏమి చెప్పలేదు. ఆయన ప్రసంగమంతా యూనివర్సిటీ హెడ్ క్వార్టర్సును బెజవాడనుంచి వాల్తేరుకు బదలాయించడం ఎంత అవసరమో నొక్కిచెప్పటానికే సరిపోయింది. అన్నట్టు వాల్తేరు తన జన్మస్థలమని కూడా ఆయన పనిలోపనిగా వెల్లడించాడు. తాను ఎక్కడికి వచ్చి ప్రసంగిస్తున్నాడో ఆ స్థలానే్న తన మాటల ద్వారా తాను అవమానిస్తున్న సంగతి మాన్యుడైన ఆ డాక్టరుగారికి స్ఫురించినట్టు లేదు. తాను ఆనరరీ ప్రొఫెసరుగా ఉన్న యూనివర్సిటీని, దాని చట్టాన్ని తయారుచేసినవారి ఉద్దేశాలకు వ్యతిరేకంగా తాను మాట్లాడుతున్నాననీ ఆయన గ్రహించలేదు. అన్నిటికీ మించి- ఏ ఆంధ్రుల ఐక్యతను పెంపొందించి, సేవించటానికి యూనివర్సిటీ ఉద్దేశించబడిందో ఆ ఐక్యతను దెబ్బతీసేందుకు తాను సాయపడుతున్న సంగతీ ఆయనకు తట్టలేదు. ఈ పరిస్థితుల్లో వైస్ చాన్సలర్ ఉపదేశమేమిటో సులభంగానే ఊహించవచ్చు.)
యూనివర్సిటీ తరలింపు కేవలం సి.ఆర్.రెడ్డి ఇష్టానికి, సౌకర్యానికి సంబంధించిన వ్యక్తిగత వ్యవహారమైతే... దానివల్ల నష్టపోయేది బెజవాడ, దాని పరిసర ప్రాంతాలు మాత్రమే అయితే దాని గురించి ఇప్పుడు పెద్దగా పట్టించుకోవలసిన పనిలేదు. యూనివర్సిటీ స్థావరం బెజవాడ అయినా, వాల్తేరు అయినా ఆంధ్రదేశానికి ఒకటే. కాని- సి.ఆర్.రెడ్డి నెరపిన కుటిల మంత్రాంగంవల్ల కోలుకోలేని దెబ్బతగిలింది ఆంధ్ర జాతి ఐక్యతకు. మరీ ముఖ్యంగా రాయలసీమ- సర్కారు ప్రాంతాల నడుమ కష్టపడి సాధించుకున్న సుహృద్భావానికి. జి.వి.సుబ్బారావు గ్రంథంలో ఉటంకించిన విష్ణ్భుట్ల సూర్యనారాయణ మాటల్లో చెప్పాలంటే-
This enraged the already unwilling Ceded Districts leaders, and the result was an unending quarrel between the Telugus of the Coastal districts and those of the Ceded Districts- This location of the University at one end of the Country was responsible for the secession of the ceded districts Telugus from the Andhra University and joining the Madras University. (P.501)
(అసలే అయిష్టంగా ఉన్న సీఢెడ్ జిల్లాల నాయకులకు ఇది తీవ్రాగ్రహం కలిగించింది. ఫలితంగా కోస్తా జిల్లాల ఆంధ్రులకూ, సీడెడ్ జిల్లాల వారికీ నడుమ అంతులేని తగవులు వచ్చాయి. దేశానికి ఒక కొసన ఉన్నచోటికి యూనివర్సిటీని మార్చినందువల్లే సీడెడ్ జిల్లాల ఆంధ్రులు ఆంధ్రా యూనివర్సిటీనుంచి విడివడి మద్రాసు యూనివర్సిటీలో తిరిగి చేరవలసి వచ్చింది.)
నిజంగా ఒక యూనివర్సిటీని సర్కారు జిల్లాల్లోనే ఒకచోటినుంచి ఇంకో చోటికి మార్చినంత మాత్రానే ప్రాంతీయ స్పర్థలొస్తాయా? సర్కార్లకు, సీడెడ్ జిల్లాలకు మధ్య అన్ని గొడవలు లేస్తాయా? ఇందులో రాయలసీమ వారికి మరీ అంత ఆగ్రహం కలగాల్సింది ఏముంది- అనుకుంటున్నారా? ఆ ఆగ్రహం ఎందువల్లో, మనస్తాపానికి దారితీసిన పరిస్థితులేమిటో సుప్రసిద్ధ రాయలసీమ ప్రముఖుడు పప్పూరి రామాచార్యులు చెబుతారు వినండి. 1937 అక్టోబరులో అదే విజయవాడలో జరిగిన
ఆంధ్ర మహాసభ 18వ మహాసభలో మాట్లాడుతూ రాయలసీమ అంతరంగాన్ని ఆయన ఇలా ఆవిష్కరించాడు:
‘యూనివర్సిటీ వ్యవహారంలో మా రాయలసీమ వారికి జరిగిన అన్యాయాన్ని మీకు గుర్తుచేయవలసిన పని లేదనుకుంటాను. దాని హెడ్ క్వార్టర్సు మా దగ్గర ఉండాలని మేము ఏనాడూ కోరలేదు. మీలోమీకు తగవులొచ్చాయి. వాటిని సర్దుబాటు చేసుకోవటం మీవల్లకాలేదు. అందుకని మీరు మమ్మల్ని లేపారు. లేనిపోని ఆశలు పెట్టారు. యూనివర్సిటీ కార్యస్థానం అనంతపురంలో ఉండదగునని సెనెటు తీర్మానించింది. ఆంధ్ర మహాసభ, ఆంధ్ర ప్రొవిన్షియల్ కాన్ఫరెన్సు దానిని బలపరిచాయి. మీ నాయకులందరూ ఆ ప్రతిపాదనను అంగీకరించారు. పెద్ద వాగ్దానాలు చేశారు. మద్రాసు శాసనసభ సెలక్టు కమిటీ కూడా అనంతపురానికి అనుకూలంగా సిఫారసు చేసింది. ఇదంతా చూసి- మీ ఆంధ్ర నాయకులు మాకు ఇచ్చిన హామీనుంచి వెనక్కిపోరని మేము ఆశించాం. కాని ఆ తీర్మానం శాసనసభ పరిశీలనకు వచ్చేసరికి అంతా తలకిందులైపోయింది. దీనికి తమిళులను నిందించి ఏమిలాభం? ఆంధ్ర మహాసభకు, ప్రొవిన్షియల్ కాన్ఫరెన్సుకు గతంలో అధ్యక్షత వహించిన పెద్దలే అనంతపురానికి వ్యతిరేకంగా ఓటుచేశారు. ఆంధ్రా యూనివర్సిటీ పరిధినుంచి అనంతపురం కాలేజిని విడగొట్టేందుకు వారే సహాయపడ్డారు. దాంతో మిమ్మల్ని, మమ్మల్ని కలిపి ఉంచిన మూలబంధం తెగిపోయింది. ఈ మొత్తం వ్యవహారంలో తాము దగాపడ్డామని రాయలసీమవాసులు అనుకుంటే తప్పా? అప్పటినుంచే రాయలసీమ యువకులు, విద్యార్థులు ఉత్తర ప్రాంతపు వారిని అపనమ్మకంతో చూడసాగారు. మీతో ఎటువంటి పొత్తు అయినా తమ ప్రయోజనాలకు హానికరమని వారు భావిస్తున్నారు. ఈ అగాథం రోజురోజుకూ పెరుగుతున్నది. నిజంగా మీరు ఆంధ్రుల ఐక్యతను కోరేవారే అయితే ఇంతకాలమూ ఈ విషయంలో ఎందుకు నిద్రపోతున్నారు?
[Quoted in History of Andhra Movement, G.V.Subba Rao, Vol.I, P.502]
ఔను మఠి. రాయలసీమవాళ్లకి ఒళ్లు మండింథంటే మండదా? యూనివర్సిటీ తమకే కావాలని వారు ఏనాడూ పట్టుబట్టలేదు. ఆంధ్ర జిల్లాలకు మధ్యస్థంగా బెజవాడలో కార్యస్థానం ఉండి, తమ అనంతపురంలో ఒక యూనివర్సిటీ సెంటరు మాత్రం పెడతామంటే వారు సరే అన్నారు. రాజమండ్రికీ, బెజవాడకూ మధ్య పేచీవచ్చాక అనంతపురానికే హెడ్ క్వార్టర్సు మార్చాలని ఆంధ్ర మహాసభ అనంతపురం సమావేశాల్లో తీర్మానిస్తే మంచిదే అనుకున్నారు. యూనివర్సిటీ సెనెటు, లెజిస్లేచరు సెలక్టు కమిటీ కూడా అనంతపురం వైపే మొగ్గేసరికి నిజంగా యూనివర్సిటీ తమ దగ్గరికి నడిచి వచ్చేస్తున్నదనే ఆశపడ్డారు. ఇంతా అయ్యాక మొండి చెయ్యి చూపి, ఎవరూ ఊహించని వాల్తేరుకు యూనివర్సిటీని ఎగరేసుకుపోతే తమను నమ్మించి మోసంచేశారని ‘సీమ’వాళ్లు కోపగించడం సహజం.
ముఖ్యమంత్రిగా ఉన్న అరవ సుబ్బరాయన్‌కి ఆంధ్రుల మీద ప్రేమ లేకపోవచ్చు. సి.ఆర్.రెడ్డి ఉద్బోధకు తోడు- 1927 ఆగస్టు బలపరీక్షలో తన ప్రభుత్వం పట్ల ఆంధ్రా సభ్యులు చాలామంది అవిశ్వాసం వ్యక్తపరిచారన్న అక్కసూ ఆయన మీద పనిచేసి ఉండవచ్చు. చట్టసభలో ఓటింగు జరిగినప్పుడు యూనివర్సిటీని వాల్తేరుకు తరలించే ప్రభుత్వ ప్రతిపాదనను తెలుగు జిల్లాలనుంచి ఎన్నికైన సభ్యుల్లో 12 మంది మాత్రమే బలపరిచి, 17 మంది వ్యతిరేకించినా, అధికార, అనధికార, నామినేటెడ్ సభ్యులూ, తమిళ మంత్రులూ, ఎగ్జిక్యూటివ్ కాన్సిలర్లూ కలిస్తే మొత్తంమీద ఆంధ్రేతరులదే మెజారిటీ అయి, తీర్మానం నెగ్గటం వెనుక అరవల కుటిల తంత్రమూ పనిచేసి ఉండవచ్చు. ఏమైనా మొత్తం రచ్చకు మూల కారణం ఆంధ్ర నాయకుల మధ్య పొరపొచ్చాలే. Emergence of Andhra Pradesh గ్రంథంలో కె.వి.నారాయణరావు అన్నట్టు...Making Anantapur the headquarters of the Andhra University would have led to much cordiality between the circars and the Rayalaseema and strengthend the movement for an Andhra Province. The government inflicted instead, what the Andhras considered a blow on the Unity of Andhradesa by cutting off the Ceded Districts from the operation of the University. This only increased the seething discontent in Ralalaseema against the Circars leaving it cold, if not hostile, to the Andhra Province Question. (P.156) (అనంతపుఠానే్న ఆంధ్రా యూనివర్శిటీ హెడ్ క్వాక్టర్సుగా ఖరారుచేసి ఉంటే రాయలసీమ, సర్కారు జిల్లాల మధ్య చక్కని సుహృద్భావం నెలకొనేది. దానివల్ల ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం బలపడేది. దానికి బదులుగా, సీడెడ్ జిల్లాలను యూనివర్సిటీ పరిధినుంచి కోసివేయడం ద్వారా ఆంధ్ర దేశ ఐక్యతకు ప్రభుత్వం విఘాతం కలిగించింది. దీనివల్ల రాయలసీమలో రగులుతున్న అసంతృప్తి ఇంకా ఎక్కువైంది. ఆంధ్ర రాష్ట్రం సమస్యపై రాయలసీమ వ్యతిరేకతకు, కనీసం నిర్లిప్తతకు అది దారితీసింది.)
మరి అసలైన ఆంధ్ర ఐక్యతకే ఇంత ముప్పువాటిల్లుతూంటే పేరు గొప్ప ఆంధ్ర మహాసభ ఏమిచేసింది? అనంతపురంలో యూనివర్సిటీ కార్యస్థానం ఉండాలని తాను చేసిన తీర్మానమే కృష్ణలో కలిసి, యూనివర్సిటీ బంగాళాఖాతానికి ఎగిరిపోతుంటే అడ్డుకోవటానికి ఏమి ప్రయత్నం చేసింది? ఏమీ లేదు. గుడ్లప్పగించి చేతులు ముడుచుకుని చూస్తూ కూర్చుంది. 1929లో రాయలసీమ నాయకుడు కడప కోటిరెడ్డి అధ్యక్షతన బెజవాడలో ఆంధ్ర మహాసభ కొలువుతీరి కూడా ఏమీచేయలేకపోయింది. కట్టమంచి పుణ్యం కట్టుకుని పెట్టిన చిచ్చు దుష్ఫలితాన్ని ఆంధ్ర జాతి ఇప్పటికీ ఏదో ఒక మోతాదులో అనుభవిస్తూనే ఉంది.
అప్పటి మనుషులూ, వాళ్ల వివరాలూ తెలియని ఈ తరంవాళ్లు ఇదంతా చదివితే సి.ఆర్.రెడ్డి అనే సర్కారు జిల్లాలవాడు రాయలసీమను మోసంచేసి బహుశా తన సొంత ఊరయిన విశాఖపట్నానికి ఆంధ్రా యూనివర్సిటీని ఎగరేసుకుపోయాడని అనుకోగలరు. కట్టమంచి రామలింగారెడ్డి అనే సి.ఆర్.రెడ్డిగారు అచ్చమైన రాయలసీమవాడు. ఆయన పుట్టింది చిత్తూరు పక్కనే ఉన్న కట్టమంచిలో. చదువుకున్నది చిత్తూరు బోర్డు హైస్కూల్లో. 1923లో జస్టిస్ పార్టీ తరఫున మద్రాసు శాసనసభకు ఎన్నికైంది చిత్తూరు నుంచి. 1935లో అధ్యక్షుడుగా పనిచేసింది చిత్తూరు జిల్లా బోర్డుకు. ఆయనకు పేరుతెచ్చిన ‘ముసలమ్మ మరణము’ కావ్యంలోని ముసలమ్మ కథ జరిగింది అనంతపురం జిల్లాలో. రాయలసీమతో ఇంతటి సంబంధం ఉన్న పెద్దమనిషే అనంతపురానికి రావలసిన విశ్వవిద్యాలయాన్ని తూర్పుకొసనున్న విశాఖపట్నానికి పథకం ప్రకారం హైజాక్ చేయటం వర్శిటీ వింతగాథకు కొసమెరుపు.
సీమవాడై ఉండీ రెడ్డిగారు ఇలా చేశారేమిటని విస్తుపోనక్కరలేదు. ఆయన ఒక్కడినే వేలెత్తి చూపాల్సిన పనీలేదు. పుట్టిన గడ్డ గోడు పట్టని ఇలాంటి రాయలసీమ రతనాలు ఇంకా ఎందరెందరో!